ఇది కోర్టు తీర్పుకాదు,రాజ్యం వేసిన శిక్ష - వరవరరావు


ఇది కోర్టు తీర్పుకాదు,రాజ్యం వేసిన శిక్ష - వరవరరావు

ఇది


ఎంత అసంబద్ధమైన, ఎంత అన్యాయమైన వ్యవస్థలో జీవిస్తున్నామో ఇవ్వాళ్టి నా ఒక్క అనుభవాన్ని వివరిస్తాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎకడమిక్ స్టాఫ్ కాలేజీలో మాడరన్ లిటరేచర్ గురించి ప్రసంగించడానికి వెళ్తున్నాను. వాస్తవానికి ఇటువంటి అంశం మీద నాకంటే మాట్లాడే అర్హత అన్ని విధాలా ఉన్నవాడు ప్రొ.జి.ఎన్.సాయిబాబా, ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ఇండియన్ ఇంగ్లిష్ నవలల మీద పీహెచ్డీ సిద్దాంత గ్రంథం రాసి మన సమాజంలో ఆధునికత ఎక్కడ వచ్చిందని, ఇది అర్ధవలస, అర్ధ భూస్వామ్య దళారీ వ్యవస్థ అని, పైగా మన దేశంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం అమలవుతున్నదని, ఆ అవగాహన నుంచి, ఆ దృక్పథం నుంచి ఆ ఇండియన్ ఇంగ్లిష్ నవలల గురించి పరిశోధన చేసినవాడు. మన సామాజిక వ్యవస్థలో కాని, సాహిత్యంలో కాని ఆ ఆధునికత రానేలేదు. గురజాడ తెచ్చిన ఆధునికత కూడా ఫ్రెంచి విప్లవం ప్రభావంతో వచ్చిందే తప్ప ఈ దేశంలో అటువంటి భావాలకు మూలాలు లేవని ఆయన సిద్దాంత గ్రంథం చెపుతుంది. ఆయన సిద్దాంత గ్రంథం రాసి 2014 మేలో అరెస్టు అయ్యే నాటికీ, ఇవ్వాల్టికీ ఫాసిజం ఇవాళ దేశంలోనూ, అమెరికా మొదలు ప్రపంచ వ్యాప్తంగానూ ఎట్లా అక్టోపస్లాగా విస్తరిస్తున్నదో చూస్తూనే ఉన్నాం.

ఈ ఆలోచనలతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు సిగ్నల్స్ దగ్గరకు వెళ్లే వరకు గడ్చిరోలిలో ఉన్న సాయిబాబా తమ్ముడు రాందేవ్ నుంచి మెసేజ్. కోర్టు చుట్టూ రెండు వందల మంది అర్థసైనిక బలగాలు ఉన్నారు. ఇవాళ కోర్టు తీర్పు ఇంకో పది నిమిషాల్లో సాయిబాబా రానున్నాడు అని. సరిగ్గా రెండు గంటలకు ఆధునిక సాహిత్యం మీద నా ప్రసంగం ముగిసింది. ఈసారి రవిచందర్ నుంచి మెసేజ్ సాయిబాబా అండ్ అదర్స్ ఫౌండ్ గిల్టీ. శిక్ష సాయంకాలం లోగా చెప్తారని. కేసు, చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం (అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంటివ్ యాక్ట్) కింద విచారింపబడింది.
ఇక అక్కడినుంచి నేరారోపణను కోర్టు విశ్వసించింది కాబట్టి యుఎపిఎ కింద ఎంత కాలం శిక్ష వేస్తారనే ఆందోళన మొదలైంది. ఆ మానసిక స్థితిలో అదే అకడమిక్ స్టాఫ్ కాలేజీలో మానవ హక్కుల శిక్షణా తరగతుల్లో కూడా మాట్లాడవల్సిందిగా నన్ను డైరెక్టర్ కోరాడు. నన్ను మానవ హక్కుల కార్యకర్తగానే పరిచయం చేశాడు. చేస్తూ ఆయన ఒక మాటన్నాడు. ఆయన నిజానికి ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడే స్థితిలో లేడు. ఆయన సన్నిహిత మిత్రునికి ఒకరికి శిక్ష పడింది. అది ఎంతకాలమో మాత్రం తేలాల్సి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు నేను, ఆ సన్నిహిత మిత్రుడు ప్రొ.జి.ఎన్.సాయిబాబా అని, ఆయనైనా నేనైనా మానవ హక్కుల కార్యకర్తలం కామని, ఇద్దరమూ సాహిత్య విద్యార్ధులమని, కాకపోతే కవి ఎన్నుకోబడని ప్రజాప్రతినిధి కనుక ప్రజల గురించి మాట్లాడుతున్నామని, దేశంలో, ఇవాల్టి స్థితిలోనైతే ప్రపంచంలో మానవ హక్కుల హననం ఎంత తీవ్రంగా జరుగుతుందో ఓ అరగంట మాట్లాడి బయటికి వచ్చాను.

రాయపూర్కు వెళ్లివున్న రవిచంద్ర ప్రొ.జి.ఎన్.సాయిబాబాకు జీవితశిక్ష పడిందని ఫోన్ చేశాడు. అవాక్కయ్యాను. ఈ కేసులో ఉన్న ఆరుగురికి శిక్ష పడింది. ఐదుగురికీ యావజ్జీవ శిక్ష. వాళ్లు 1. ప్రొ.జి.ఎన్.సాయిబాబా (తెలుగు సమాజానికి ఆయన పరిచయం అక్కర్లేదు) 2. ప్రశాంత్ రాహి. నాసిక్ కు చెందిన ఇతడు గతంలో స్టేట్స్మెన్ పత్రికలో పనిచేసి ఆ తర్వాతి కాలంలో పూర్తికాలపు ప్రజా ఉద్యమ కార్యకర్త అయ్యాడు. హిందీలో, ఇంగ్లీష్లో చాలా రచనలు చేశాడు. చైనా విప్లవ కాలంలోని భూసంస్కరణలను చిత్రించే ʹహరికేన్" (ఉప్పెన) నవలను హిందీలోకి అనువదించాడు. చాలాకాలంగా ఉత్తరాఖండ్లో ఉంటున్నాడు. రాజకీయ ఖైదీల విడుదల గురించి దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. 3. హేమ్ మిశ్రా, ఉత్తరాఖండ్కు చెందిన సాంస్కృతిక కార్యకర్త, జేఎన్యూలో పరిశోధక విద్యార్థి. మంచి గాయకుడు. ఆజాద్తోపాటు బూటకపు ఎన్కౌంటర్లో అమరుడైన హేమచంద్రపాండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిన బబితతోపాటు మొదటిసారి వచ్చి ఆ తర్వాత చాలా సందర్భాల్లో హైదరాబాద్కు వచ్చిన సాంస్కృతిక కార్యకర్త ఇతడు. ఇతనికి చెయ్యికి గాయం, వైకల్యం ఉన్నాయి. 4. విజయ్ టిర్కి 5. పాండు నరోత్ 6. మహేశ్ టిర్కి ఈ ముగ్గురు గడ్చిరోలి జిల్లాకు చెందిన ఆదివాసులు. వీరిలో విజయ్ టిర్మికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. మిగిలిన ఐదుగురికి యావజ్జీవ శిక్ష పడింది. ఒక విజయ్ టిర్కి విషయంలో మాత్రం అతడు మావోయిస్టు పార్టీ సభ్యుడని కోర్టు విశ్వసించలేదు. ప్రశాంత్ రాహీని లోపలికి తీసుకుపోవడానికి ప్రయత్నించాడని మాత్రమే విశ్వసించి పదేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది.

ఒక్కసారి సంక్షిప్తంగా ఈ నేరారోపణను గుర్తు చేసుకుంటే 2013లో హేమ్ మిశ్రా తన చెయ్యికైన గాయానికి, అంగవైకల్యానికి
ఏ చికిత్స నుంచి ఉపశమనం లభించక గడ్చిరోలి జిల్లాలో ఉన్న ప్రకాశ్ ఆమ్టే చికిత్సాలయానికని బయల్దేరాడు. బలార్షాలో రైలు దిగిన ఆయనను ప్రకాశ్ ఆమ్టె ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వచ్చిన ఇద్దరు ఆదివాసులతోపాటు పోలీసులు అరెస్టు చేసి, ఒక నెలరోజులపాటు చిత్రహింసలు పెట్టి నాగ్పూర్ హై సెక్యూరిటీ జైలుకు పంపించారు. అదే సమయంలో రాయ్పూర్ జైల్లో రాజకీయ ఖైదీలను కలవడానికి వెళ్లిన ప్రశాంత్ రాహిని కూడా అరెస్టు చేసి కొన్నాళ్లు అక్రమ నిర్భందంలో చిత్రహింసలు పెట్టి ఇదే నాగ్పూర్ జైలుకు పంపించారు. ఈ ఇద్దరినీ, పైన పేర్కొన్న ముగ్గురు ఆదివాసులను కలిపి యుఎపిఎ కింద పెట్టిన కేసులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను కూడా ముద్దాయిగా చూపారు.
గడ్చిరోలి జిల్లా ఆహిరిలో ఏదో దొంగతనం జరిగిందనీ, ఆ దొంగిలింపబడిన ఆస్థి బరామతు కోసం అనే నెపంతో జనవరి 2014లో ఢిల్లీ యూనివర్శిటీ గ్వైర్ హాల్లో ఉన్న సాయిబాబా ఇంటిపై మహారాష్ట్ర ఢిల్లీ, కేంద్ర పోలీసులు దాడి చేశారు. ఆయన పుస్తకాలు, హార్డిస్క్లు మొదలైనవి ఎత్తుకెళ్లారు. 2014 మే 9వ తేదీన ఆయన యూనివర్శిటీ పరీక్ష నిర్వహించి వస్తుంటే మహారాష్ట్ర పోలీసులు వచ్చి తోవలోనే అపహరించి నాగ్పూర్ జైలుకు తరలించారు. రెండున్నరేళ్లు అండాసెల్లో తీవ్ర నిర్భందానికి గురై అనారోగ్య కారణంగా అసాధారణ స్థితిలో బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెయిల్ ఇవ్వగా విడుదలైన సాయిబాబాతోపాటు మిగిలినవారిపై గడ్డ్చిరోలి సెషన్స్ కోర్టులో ఇంతకాలం విచారణ జరిగి ఈ రోజు, మార్చి 7 న ఈ పిడుగుపాటులాంటి తీర్పు వెలువడింది.

గతంలో డా.వినాయక్ సేన్ కు నారాయణ్ సన్యాల్తో కలిపి ఛత్తీస్ఘడ్ సెషన్స్ కోర్టులో యావజ్జీవ శిక్ష పడడం, హైకోర్టులో కూడా బెయిలు రాకపోవడం, మూడు సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడం, ఆ కేసు ఇప్పటికి విచారణ జరుగుతుండడం నేపథ్యంలో ఇది ఆశ్చర్యం అనిపించకపోవచ్చు. డా.వినాయక్ సేన్ విషయంలో పదముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతల విజ్ఞప్తి మొదలుకొని వచ్చిన అంతర్జాతీయ స్పందన దృష్ట్యా కూడా ఇది ఆశ్చర్యం కలిగించకపోవచ్చు.

కానీ ప్రొ.జి.ఎన్.సాయిబాబా తొంభై శాతం అంగవైకల్యంతో చిరకాలంగా బాధపడుతున్నాడు. గుండె జబ్బు ఉంది. నరాల జబ్బు ఉంది. మధుమేహం, రక్తపోటు జబ్బులున్నాయి. 2016లో కేర్ ఆస్పత్రిలో నరాల జబ్బుతో, ఎడమ చేయి లేవలేని స్థితిలో ఆరు వారాలపాటు చికిత్స చేయించుకొని, ఇప్పుడే శస్త్ర చికిత్స సాధ్యం కాదని చెప్పిన తర్వాత ఢిల్లీ వెళ్లిపోయాడు. నిజానికి ఆయన విడుదల అయినప్పటి నుంచి ఎక్కువకాలం ఢిల్లీలోనూ, హైద్రాబాద్లోనూ ఆస్పత్రులలో చేరి చికిత్స చేయించుకునే స్థితిలోనే ఉన్నాడు. అటు కాలేజీలో ఈ కేసు కారణంగా సస్పెండ్ చేశారు. సగం జీతమే వస్తున్నది. కోర్టుల్లో జరుగుతున్న విచారణ కాకుండా విడిగా ఆయనపై విచారణ కొరకు ఏకసభ్య కమిషన్ వేశారు. ఈ ఏకసభ్య కమిషన్ ఒక వారం రోజుల క్రితమే ఆయన సస్పెన్షన్ను ఆరు నెలలపాటు పొడిగించింది. అంటే ఈ రోజు ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించినా ఇంకొక ఆర్నెల్లపాటు ఉద్యోగంలోకి తీసుకుని ఉండేవారుకాదు. ఢిల్లీ యూనివర్శిటీ కేంద్ర యూనివర్శిటీ. జైల్లో ఉన్న కాలం తప్ప ఉద్యోగం చేయడానికి నేరారోపణలు అడ్డురాకూడదు. ముఖ్యంగా రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన ఆరోపణలు.

ఇటీవలనే సుప్రీంకోర్డు అస్సాంకు చెందిన అరూప్ భూయాన్ కేసు విచారణలో నిషేధిత పార్టీ సభ్యత్యం కలిగివుండడమే దానికదిగా శిక్ష వేయదగిన నేరారోపణ కాజాలదన్నది. నిషేధిత పార్టీతో సంబంధాలుగానీ, ఆ పార్టీ రాజకీయాల్లో విశ్వాసాలు కలిగి ఉండడంగానీ, చివరకు ఆ పార్టీ సభ్యత్వంగానీ శిక్షార్హం కావని తీర్పు చెప్పింది. భారత శిక్షాస్మృతి ప్రకారం భౌతిక హింసా దౌర్జన్యాల్లో పాల్గొన్నట్లుగానీ, అటువంటి కుట్రలో పాల్గొన్నట్లుగానీ రుజువైతే తప్ప అవి శిక్షార్హమైన నేరారోపణలు కాజాలవు. భావాలు కలిగి ఉన్నందుకు, ప్రకటించినందుకు, అటువంటి భావాలు కలిగినవారితో, ప్రకటించినవారితో సంఘం పెట్టినందుకు విశ్వాసాల విషయంలోనే శిక్షించడానికి వీల్లేదు. అటువంటి భావాలు ఒక రాజకీయ పార్టీకి ఉన్నప్పటికీ, ఆ రాజకీయ పార్టీ సభ్యత్వం కూడా శిక్షార్హమైనది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో జస్టిస్ చిన్నపరెడ్డి ముగ్గురు విప్లవ కవుల విషయంలో తీర్పు ఇచ్చినట్లుగా భావాలు కలిగిఉండడమే శిక్షారం కాదు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సంబంధాలు కలిగి ఉండడం, సభ్యత్వం కలిగి ఉండడం కూడా శిక్షారం కాదు.

ప్రొ. జి.ఎన్.సాయిబాబా పారదర్శకంగా ప్రజాసంఘాల్లో ప్రజా ఉద్యమాల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు. ఆయన యూనివర్శిటీ ప్రొఫెసర్. ఆయనకొక చిరునామా ఉన్నది. ఆయన ఎల్లవేళలా ఏ విచారణకైనా లభించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, ఆ విధంగానే మొత్తం కోర్టు విచారణకు సహకరిస్తున్నాడు.

నిజానికి అందులో భాగంగానే ఈ రోజు మార్చి 7న ఆయన ఢిల్లీ నుంచి గడ్చిరోలి కోర్టుకు వందల మైళ్లు ప్రయాణం చేసి వచ్చాడు. ఇటీవల గుండెపోటు వచ్చి ఆయన నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆ సందర్భంలో ఆయనకు పిత్తాశయం (గాల్బ్లాడర్) లో పాంక్రియాస్ దెబ్బతిన్నదని, సమస్య ఉందని, శస్త్ర చికిత్స అవసరం ఉందని, కానీ మధుమేహం వల్ల, రక్తపోటు వల్ల ఇప్పుడే అది సాధ్యం కాదని, అందువల్ల ప్రయాణాలు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.

ఈ స్థితిలో కూడా తీర్పు రోజు కోర్టుకు రావడానికి ఆయన దుస్సాహసం చేశాడు. కోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చింది. కనుక ఇది కోర్టు తీర్పు కాజాలదు. గతంలో డా. వినాయక్ సేన్, నారాయణ్ సన్యాల్ల విషయంలో ఛత్తీస్ఘడ్ కోర్టు సీమా ఆజాద్, విజయ్ విషయంలో ఉత్తరప్రదేశ్ కోర్టు ఇచ్చిన యావజ్జీవ శిక్షల వంటిదే ఈ తీర్పు కూడా.

జైలు జీవితంవల్లా, యావజ్జీవ శిక్ష తీర్పు వల్లా డా. వినాయక్ సేన్ ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది. ఆయన సహచరి ఎలీనా సేన్ ఆరోగ్యం అయితే ఆందోళనకరంగా మారింది. వీళ్లందరితో పోల్చినప్పుడు తొంభై శాతం అంగవైకల్యం దృష్ట్యా, వ్యాధుల దృష్ట్యా సాయిబాబాకు యావజ్జీవ శిక్ష అనేది చాలా అన్యాయమే కాకుండా అమానవీయమైంది. ఇంత అన్యాయమైన, అమానవీయమైన వైఖరిని తీసుకునే స్థితికి మన న్యాయస్థానాలు దిగజారగలవని ఊహించలేము కాబట్టి ఇది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, రాజ్యం వేసిన శిక్ష అనీ, చెప్పిన తీర్పు అనీ భావించాల్సి వస్తున్నది.
అమెరికన్ సామ్రాజ్యవాద ట్రంప్ ప్రభుత్వానికీ, బ్రాహ్మణీయ హిందూత్వ మోడీ తదితర సంఘ్ పరివార్ ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యమైన అమానవీయ అన్యాయ ఫాసిస్టు తీర్పు ఇది.
ఈ తీర్పును రద్దుచేయించి జి.ఎన్.సాయిబాబాను, అతని సహ ముద్దాయిలను వెంటనే విడుదల చేయించగల శక్తి, విలువలు మన ప్రజలకు, ప్రజాస్వామిక శక్తులకు ఉన్నవనే విశ్వాసంతో, భరోసాతో.
- వరవరరావు

Keywords : gn saibaba, varavararao. hindutva, court, modi, police, maoists
(2019-01-16 01:24:00)No. of visitors : 1561

Suggested Posts


దేశంలో జడ్జ్ లు జస్టిస్ ను వదిలేశారు - హరగోపాల్

దేశంలో జడ్జీలు జస్టిస్ ను వదిలేశారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్థిని కాపాడవల్సిన న్యాయమూర్తులు తమ స్వం విశ్వాసాల ఆధారంగా తీర్పులివ్వడం అన్యాయమని ఆయన అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా....

ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు

1981 ఏప్రిల్ 20న ఇంద్ర వెల్లిలో ఏం జరిగింది? ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 81 ఏప్రిల్ 20న తలపెట్టింది. జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావుకు సభ జరుపుకోవడానికి పోలీసులు మొదట అనుమతిచ్చారు....

సాయిబాబా కేసుః జడ్జిమెంట్ లా లేదు,పోలీసాఫీసర్ రాసిన చార్జ్ షీట్ లా ఉంది- వరవరరావు

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా బెయిల్ రద్దు చేస్తూ నాగ్ పూర్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పై విప్లవ రచయిత వరవరరావు మండి పడ్డారు. అది జడ్జిమెంట్ లాగా లేదని ఓ పోలీసు ఆఫీసర్ రాసిన చార్జ్ షీట్ లాగా

వెన్నెముకలేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? - వరవర రావు

మనకు వెన్నెముకలేని దేశం కావాలా? సార్వభౌమత్వం లేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? ప్రొ. కంచె ఐలయ్య మీద హిందుత్వ వాదులు కేసు పెట్టినపుడు స్పందించిన రచయితలందరూ పాతబస్తీలో పేద ముస్లిం యువకుల కోసం, కశ్మీరులో ఎన్‌కౌంటరవుతున్న యువకుల కోసం స్పందిస్తారని....

Boycott (World) Social Forum, a Safety Valve for Imperialism !- RDF

Revolutionary Democratic Front calls upon the people and genuine democrats to boycott the (world) Social Forum, being held in Canada in August 2016 and all the related forums and preparatory meetings etc. being conducted in different parts of the country including Hyderabad....

రైలు ప్రమాదం – కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, మీడియా ʹవిద్రోహʹ ప్రచారాలు

ఛత్తీస్ గడ్ లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు వెళ్లే హీరాఖంండ్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ దగ్గర జనవరి 21 శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మందికి పైగా మరణించారు....

కవితామయ జీవితం - శిల్ప ప్రయోగ విప్లవం

విప్లవ కవులకు, విప్లవ కవిత్వానికి ఈ ఒరవడి అందివ్వడంలో వివి పాత్ర గణనీయం. ఇంకోలా చెప్పాలంటే ఆయన అభేద సంబంధంలో ఉండే విప్లవోద్యమం పాత్ర ఇక్కడే ఉన్నది. వివి కవిత్వ వస్తు విస్తృతి, శిల్ప ప్రయోగాలు వగైరా ఏది చర్చించాలన్నా పైన చెప్పిన వాటిపట్ల ఎరుక ఉండాలి. కవి నుంచి కవిత్వాన్ని వేరు చేసి విశ్లేషించలేమని అన్నది ఈ దృష్టితోనే.

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
more..


ఇది