ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు

ఇంద్రవెల్లి


(2013 ఏప్రెల్ 20 న వరవరరావు రాసిన వ్యాసం)
ʹఒక నిప్పురవ్వ దావానలమవుతుందిʹ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ) అడవుల్లో వర్గీస్ చిందిన రక్తంలో ఎగసిన నిప్పురవ్వ, తెలంగాణ రైతాంగ పోరాటం వేగుచుక్కగా ఏర్పడిన నక్సల్బరీ పాలపుంత ఆకాశమంతా విస్తరించి విప్లవాన్ని భూమార్గం పట్టించే వెలుగుదారి అయింది. ఆ పంథాయే ఈనాటికీ కొనసాగుతున్న విప్లవ మార్గం.
ఇవ్వాళ తెలంగాణ ఉద్యమానికి కూడా ఇంద్రవెల్లి ఒక పాఠం. తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం ఆర్టికల్ 3 కింద తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాల ని అంటున్నది. 1950 ఫజల్ అలీ కమిషన్ మొదలు 2009 డిసెంబర్ 9 ప్రకటన వరకు దాదాపు 60 ఏళ్లుగా.. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అనే ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామికమై డిమాండు. 1969 మొదలు నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా అన్ని చట్టబద్ధ పోరాటాలు, వెయ్యిమంది దాకా బలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్,సాగరహారం మొదలు సబ్బండరాశుల ఆకాంక్ష నుంచి సడక్‌బంద్ దాకా రకరకాల ఉద్యమాలు, ప్రయోగాలు జరిగాయి.

ఒక న్యాయమైన ప్రజాస్వామిక పోరాటం కోసం కశ్మీర్ మొదలు ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రజలు ఎటువంటి పోరాట రూపాలు తీసుకోవలసి వచ్చిందో కూడా మనం చూస్తున్నాం. ʹప్రతి న్యాయమైన పోరాటం ప్రజలు శాంతియుతంగా, చట్టబద్ధంగానే ప్రారంభిస్తారు. అది ఏ రూపాన్ని తీసుకుంటుందో చాలాసార్లు శత్రువు నిర్ణయిస్తాడంటాడుʹ రావిశాస్త్రి. అధికారంలో ఉన్నవాడు అడిగినంతనే దిగిపోతే మాకు ఆయుధాలు పట్టాల్సిన అవసరమేమిటి? అంటాడు లెనిన్. చరివూతంతా ఇటువంటి న్యాయ పోరాటాల చరిత్రే.

1981 ఏప్రిల్ 20న ఇంద్ర వెల్లిలో ఏం జరిగింది? ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 81 ఏప్రిల్ 20న తలపెట్టింది. జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావుకు సభ జరుపుకోవడానికి పోలీసులు మొదట అనుమతిచ్చారు. ఆ రోజు ఇంద్రవెల్లి సంత. జిల్లా అంతటా రాష్ట్రమంత టా ఈ సభ గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇంద్ర నాలుగువైపుల నుంచి అడవి నుంచి కొండలమీంచి, లోయల నుంచి జనం చీమలదండుగా రావడం ప్రారంభమైంది. ఆఖరి క్షణాన సభకు అనుమతి నిరాకరించినట్లు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రకటించి, వందలాదిమంది పోలీసులను దించి పోలీసు వాహనాలకు స్పీకర్లమర్చి సభకు ఎవరూ రావద్దని ప్రచారం మొదలుపెట్టారు.

తుడుందెబ్బ సమాచారం, నోటిమాట ప్రచారం తప్ప 144 సెక్షన్, నిషేధాజ్ఞలు అంటే తెలియని ఆదివాసులు ఈ పోలీసు ప్రకటనలు అర్థంకాక కొంత, పోలీసులు ఆఖరిక్షణలో అనుమతించడం లేదని తెలియక కొంత దాన్ని ఖాతరు చేయకుండా ఇంద్రవెల్లి వైపుకు సాగివచ్చారు. పోలీసులు రోడ్లకు అన్నివైపులా మోహరించి, బస్సులు వాహనాలు నిలిపివేసి, చెట్లమీద తుపాకులు పెట్టుకొని కూర్చున్నారు. బస్సులో వచ్చేవాళ్లను ఇంద్రవెల్లిలో దిగకుండా వెళ్లిపొమ్మన్నారు. దిగినవారిని అరెస్టు చేసారు. ఆ విధంగా ఇంద్రవెల్లి చేరుకున్న ఆర్‌ఎస్‌యు ఉపాధ్యక్షుడు లింగమూర్తి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు బి.జనార్దనరావు, కె.సీతారామరావు, ఎన్.వేణుగోపాల్‌ను అరెస్టుచేసి లాకప్‌లో పెట్టారు. లింగమూర్తి అప్పటికే ఎం.ఎ గోల్డ్‌మెడలిస్ట్. రీసెర్చ్ స్కాలర్. అయితే పోలీసులు అతన్ని ఆర్‌ఎస్‌యు ఉపాధ్యక్షుడంటే నమ్మలేదు. జనార్దనరావు, సీతారామరావు అప్పుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. వేణుగోపాల్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. లాకప్‌లో ఉన్న వీళ్ల కళ్లముందే పోలీసులు జనంపై నిర్విచక్షణగా కాల్పులు ప్రారంభించారు. ఆ కాల్పుల్లో ఎంతమంది ఆదివాసులు హతమయ్యారో, ఎంతమంది గాయపడినారో ఇప్పటికీ ఇదమిద్థంగా లెక్కలు లేవు. దేశం నలుమూలల నుంచి వచ్చిన నిజనిర్థారణ కమిటీలు, ఏపీసీఎల్‌సీ కనీసం 60 మందైనా ఈ కాల్పుల్లో మరణించి ఉంటారని భావించాయి. ప్రతి ఒక్కరు దీనిని జలియన్ వాలాబాగ్ మారణకాండతో పోల్చారు. అయితే ఈ మారణకాండ ప్రభుత్వానికి ఒక మాయనిమచ్చలా మిగిలిందే తప్ప ప్రజల నైతిక పోరాటశక్తిని ఏమాత్రం హరించలేకపోయింది.

ఇంద్రవెల్లి ఘటనతో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఆదివాసుల సమస్యలు, హక్కులు, పోరాటాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఒకప్పుడు గోండ్వానా ప్రజల కు ఉన్న స్వతంవూత రాజ్యం గురించి, చంద్రవంక గుర్తు ఉన్న రగల్‌జెండా గురించి, రాంజీగోండు, కొమురంభీంల పోరాటం గురించి, త్యాగం గురించి చర్చకు వచ్చిం ది. దేశంలోని మైదానవూపాంతమంతా మహానగరాలతో సహా అడవివైపు తలతిప్పి చూసే ఒక కుదుపువలె ఇంద్రవెల్లి ఒక దర్శనీయ స్థలమైంది. పోరాట సంకేత మయ్యింది. ఇందుకు కారణం యాదృచ్ఛిక ఘటన కాదు. ఇంద్రవెల్లి ఒక నిర్మాణ క్ర‌మం, ఒక పోరాట క్రమం, ఒక ప్రాసెస్ ఉన్నాయి.అందుకే శత్రువు ఈ సభను అంత సీరియస్‌గా తీసుకున్నాడు. చట్టబద్ధమైన డిమాండ్ల కోసం కదలివచ్చిన వేలాది ఆదివాసుల చైతన్యం వెనుక విప్లవోద్యమం కృషి ఉన్నది.

విప్లవోద్యమ కృషిలో భాగమైన రాడికల్ విద్యార్థులు ప్రజల్లో మమేకమై చేసిన ప్రచారం ఉన్నది. అప్పటికే సాయిని ప్రభాకర్, నల్లా ఆదిడ్డి, మల్లోజుల కోటేశ్వరరావు, ముప్పాళ్ల లక్ష్మణరావు మొదలైనవాళ్లు, జగిత్యాల, సిరిసిల్లా, పెద్దపెలి, కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లో పూర్తికాలపు విప్లవకారులుగా విప్లవోద్యమ నిర్మాణంలో ఉన్నారు.1976లో నాగపూర్‌లో తెలంగాణ రీజినల్ కమిటీ రూపొందించిన ʹరోడ్ టు రెవల్యూషన్ʹ (విప్లవానికి దారి) ప్రజాపంథా కార్యవూకమానికి 81 ఏప్రిల్ ఇంద్రవెల్లి మధ్యన ఐదు సంవత్సరాల కృషి ఇది.

ఇందులో ఒక గుణాత్మక పరిణామం 1980 ఏప్రిల్‌లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ ఏర్పడడం. ఈ విప్లవపార్టీకి జగిత్యాల జైత్రయాత్ర కేవలం ఒక ఆర్థిక విజయమే. దీని నుంచి ఒక రాజకీయ భవిష్యత్ కార్యవూకమాన్ని రూపొందించుకోవాలని రచించుకున్న దండకారణ్య పర్‌స్పెక్టివ్‌ను అమలు చేయడానికి మహారాష్ర్ట సిరొంచ అడవులకు అమరుడు పెద్దిశంకర్ నాయకత్వంలో ఒక దళం, మరో ఏడు దళాలు బస్తర్‌కు వెళ్లాయి, పెద్దిశంకర్ 80 నవంబర్ 2న సిరొంచ అడవుల్లో ʹఎన్‌కౌంటర్ʹలో అమరుడయి ఈనాటి దండకారణ్య ఉద్యమానికి తన నవ యవ్వన కవోష్ణ రక్తధారలతో చాలుపెట్టాడు. ఇదే కాలంలో సింగరేణి కార్మిక సమాఖ్య అమరులు శ్యాం, కట్ల మల్లేశ్, రమాకాంత్‌ల నాయకత్వంలో ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా అమరుడు గంజి రామారావు నాయకత్వంలో రైతుకూలీ సంఘం ఏర్పడింది. ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో ఏర్పాటుచేసిన సభానంతర, విషాదానంతర పోరాటానికి బహిరంగంగా రైతుకూలీ సంఘం నాయకత్వం, విప్లవోద్యమ మార్గదర్శకత్వం లభించాయి. అందుకే ఇంద్రవెల్లి మారణకాండ నిప్పురవ్వ దావానలమయ్యే ఒక చారిత్ర‌క సంఘటన అయింది.

రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి రామారావు ఇంద్రవెల్లిని తన నివాసంగా మార్చుకొని ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల జ్ఞాపకార్థం దేశంలోనే అపూర్వమైన స్థూపనిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం చైనాకు వెళ్లి అక్కడ తీన్‌మీన్‌స్క్వేర్‌లో ఉన్న స్థూపాన్ని చూసి, అధ్యయనం చేసి తాను స్వయంగా నిలబడి 83 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నిర్మాణం చేయించాడు.

ఇవన్నీ ఒక ఎత్తు. కొమురంభీం పునరావిష్కరణ మరో ఎత్తు. అప్పటికే ఆదిలాబా దు జిల్లా కమిటీ శ్యాం, గజ్జెల గంగారామ్ ల నాయకత్వంలో ఆదివాసీ జీవిత, పోరాటాల అధ్యయనానికి పూనుకున్నది. గజ్జెల గంగారామ్, సాహులు అప్పుడు దండకారణ్యంలో భాగమైన ఆదిలాబాదు అడవు ల్లో గోండుల మధ్య వాళ్ల భాష కూడ నేర్చుకొని వాళ్ల మధ్యన నిర్మాణాన్ని చేపట్టారు. గజ్జెల గంగారామ్ బెల్లంపల్లి బొగ్గుగని కార్మికుని కొడుకు. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి. నల్లా ఆదిడ్డి జమ్మికుంట కాలేజీ విద్యార్థి. సాహు పేరుతో ప్రసిద్ధుడైన శనిగరం వెంకటేశ్వర్లు కూడా జమ్మికుంట కాలేజీ విద్యార్థి. సాహు, అల్లం రాజయ్యలు కొమురం భీం 1940లలో చేసిన పోరాట అధ్యయనానికి పూనుకొని కేవలం నైజాం కాలపు దస్తావేజులు, చారిత్ర‌క ఆధారాల అధ్యయనమే కాకుండా కొమురం భీం సమకాలీనులను ఇంటర్వ్యూలు చేసి, ఆదిలాబాదు అడవుల్లో ఆదివాసుల్లో ఉన్న పురాణగాథలు, పాటలు సేకరించి చెంఘీజ్‌ఖాన్‌ను తలపించేదే కాదు, మరిపించేదయిన ఒక ప్రామాణిక చారిత్ర‌క నవలను రాసారు. అదే ʹకొమురంభీముʹ. 1983 ఏప్రిల్‌లో ఇంద్ర స్థూపావిష్కరణతో పాటు అదే వేదిక మీద కొమురంభీము నవల కూడా ఆవిష్కరింపబడింది.
ఇప్పుడు ఇంద్రవెల్లి అమరులైన ఆదివాసులు విడిగా సంస్మరించుకోబడరు. అంటే జోడేఘాట్ నుంచి ఇంద్రవెల్లి దాకా అది ఒక పోరాట సంప్రదాయం.

అది బాబేఝరీ.ʹమావూళ్లో మా రాజ్యంʹ సాధించుకోవడానికి ఆదివాసులు తలపెట్టిన స్వీయగౌరవ పోరాటం. కొమురం భీము కాలంలో పన్నెండూళ్లపై అధికారం కోసం ʹమావూళ్లో మారాజ్యంʹ కోసం ప్రారంభమైన పోరాటం. ఇంద్రవెల్లి నుంచి ఈనాటి వరకు సామ్రాజ్యవాద భూస్వామ్య దళారీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జల్‌జంగిల్ జమీన్‌లపై అధికారం కోసమే కాదు, దండకారణ్యంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికార ʹజనతన సర్కార్లʹ నిర్మాణం వరకు పురోగమించాయి. ఈ క్రమంలో ఒకప్పటి స్వతంత్ర గోండ్వానా రాజ్యాలు, రాంజీగోండు వంటి నేటి విప్లవకారులు,రగల్ జెండాలు పూర్తి విప్లవ సంప్రదాయంతో స్మరించుకోబడుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉరికంబం ఎక్కించిన రాంజీ పేరును దండకారణ్యంలో విప్లవోద్యమ నిర్మాణంలో కీలకభూమిక నిర్వహించిన మల్లోజుల కోటేశ్వరరావు స్వీకరించాడు. ఇప్పుడు దండకారణ్యంలో వందేళ్ల క్రితం గూండాదర్ నాయకత్వంలో జరిగిన బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భూంకాల్ పోరాటాన్ని స్మరించుకోవడమే కాదు భూంకాల్ మిలీషియాను నిర్మించుకొని శత్రు శిబిరాలపై మెరుపుదాడులు చేసి చింతల్నార్‌లను సృష్టిస్తున్నారు.

చంద్రవంక గుర్తు గల రగల్ జెండా ఇపుడు దండకారణ్యంలో దళిత ఆదివాసీ విప్లవకర వర్గాల రెండు నక్షత్రాల ఎర్రజెండాయై ఎగురుతున్నది. ఇంద్రవెల్లి ఈ విధంగా గత వర్తమానాల సంభాషణగా చరిత్ర నిర్మాణంలో ఒక భవిష్యత్ దార్శనికతకు వెలుగుజాడ అయింది.

ఇంద్రవెల్లి మారణకాండ జరిగి ఇప్పటికి ముఫ్పైరెండేళ్లు. ఇప్పటికీ ఇంద్రవెల్లి శత్రువుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రతి ఏప్రిల్ 20న ఆప్రాంతాల్లో 144సెక్షన్ విధించి గుడిహత్నూర్ నుంచి లక్షెట్టిపేట దాకా రోడ్డు పోలీసు పహారా పెడతాడు. ఏప్రిల్ 20 కన్న ముందు ఉట్నూరు పరిసర ప్రాంతాలన్నీ గాలింపు చేస్తాడు. అయినా సరే ఇంద్రవెల్లి మాత్రమే కాదు ఆరోజు జోడేఘాట్, ఉట్నూరు మొదలైన అన్ని అటవీ ప్రాంతాల్లో గూడాల్లో ఇంద్రవెల్లి అమరులను జోడేఘాట్ అమరులతో సహా స్మరించుకుంటారు. ఇవ్వాళ కొమురం భీము ఆదివాసీ ఆత్మగౌరవానికే కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, విప్లవస్ఫూర్తికి సంకేతమయ్యాడు. మావూళ్లో మారాజ్యానికి, మా తెలంగాణలో మా స్వపరిపాలనకు, మా విప్లవ ప్రాంతాల్లో మా జనతన సర్కార్లకు సంకేతమయ్యాడు. ఈ పునరావిష్కరణ చేసింది ఇంద్రవెల్లి విప్లవోద్యమం. ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం, ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాలు.

కనుక ఇంద్రవెల్లి గతం కాదు. ఇవ్వాళ ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసుల పోరాటాలకు, పులుల అభయారణ్యం వ్యతిరేక పోరాటాలకు, ఓపెన్‌కాస్ట్ వ్యతిరేక పోరాటాలకు, ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక పోరాటానికి ఈ పోరాటాన్నీ అంతర్లీనం కావల్సిన విప్లవోద్యమానికి ఇంద్రవెల్లిని స్మరించుకోవడమంటే ఏప్రిల్20న ఆదిలాబాదు అడవుల్లో చెట్లపైనుంచి ఎగిరే పాలపిట్టలను పలకరించడం. చెట్ల తోపుల్లో దాచిన ఆయుధాలను అందుకోవడం. ఇంద్రవెల్లి మీదుగా పయనమైపోయిన దండును దండకారణ్యం నుంచి ఆవాహన చేసుకోవడం. అక్కడి క్రాంతికారీ జనతన సర్కార్ ఆదేశాలను, ఆదర్శాలను, ఆకాంక్షలను ఇక్కడి ప్రజాపోరాటాల్లోకి అనువదించుకోవడం. ముఖ్యంగా గోదావరీ, ప్రాణహిత, శబరి, ఇంద్రావతీ నదుల పొడుగునా మోహరించిన పారామిలిటరీ బలగాలు, పోలీసుక్యాంపులు, దాడులు, గృహదహనాలు, ఎన్‌కౌంటర్ల నుంచి ఆదివాసుల హననాన్ని, విధ్వంసాన్ని అడ్డుకునే విశాల ఐక్య ప్ర‌జా సంఘటనను నిర్మాణం చేయడం. ఇంద్రవెల్లి నుంచి సాత్నాల వరకు ఆదివాసుల పోరాటాలకు బాసటగా నిలిచిన విశాల ప్రజారాశుల ప్రజాస్వామిక పోరాటాలను ఒక జ్వాజ్వలమైన‌ కాగడాగా ఎత్తి ʹలే మషాలా లే చలేంగేʹ అని పాడుతూ వెలుగుల వైపుగా ప్రస్థానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం. ఇంద్రవెల్లి ఇవ్వాల్టి ప్రాసంగికత ఇదే.
-వరవరరావు

Keywords : indravelli, struggle, police firing, adivasi, adilabad
(2024-04-18 13:17:42)



No. of visitors : 4752

Suggested Posts


దేశంలో జడ్జ్ లు జస్టిస్ ను వదిలేశారు - హరగోపాల్

దేశంలో జడ్జీలు జస్టిస్ ను వదిలేశారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్థిని కాపాడవల్సిన న్యాయమూర్తులు తమ స్వం విశ్వాసాల ఆధారంగా తీర్పులివ్వడం అన్యాయమని ఆయన అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా....

సాయిబాబా కేసుః జడ్జిమెంట్ లా లేదు,పోలీసాఫీసర్ రాసిన చార్జ్ షీట్ లా ఉంది- వరవరరావు

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా బెయిల్ రద్దు చేస్తూ నాగ్ పూర్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పై విప్లవ రచయిత వరవరరావు మండి పడ్డారు. అది జడ్జిమెంట్ లాగా లేదని ఓ పోలీసు ఆఫీసర్ రాసిన చార్జ్ షీట్ లాగా

వెన్నెముకలేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? - వరవర రావు

మనకు వెన్నెముకలేని దేశం కావాలా? సార్వభౌమత్వం లేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? ప్రొ. కంచె ఐలయ్య మీద హిందుత్వ వాదులు కేసు పెట్టినపుడు స్పందించిన రచయితలందరూ పాతబస్తీలో పేద ముస్లిం యువకుల కోసం, కశ్మీరులో ఎన్‌కౌంటరవుతున్న యువకుల కోసం స్పందిస్తారని....

ఇది కోర్టు తీర్పుకాదు,రాజ్యం వేసిన శిక్ష - వరవరరావు

ఎంత అసంబద్ధమైన, ఎంత అన్యాయమైన వ్యవస్థలో జీవిస్తున్నామో ఇవ్వాళ్టి నా ఒక్క అనుభవాన్ని వివరిస్తాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎకడమిక్ స్టాఫ్ కాలేజీలో మాడరన్ లిటరేచర్ గురించి ప్రసంగించడానికి వెళ్తున్నాను.....

రైలు ప్రమాదం – కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, మీడియా ʹవిద్రోహʹ ప్రచారాలు

ఛత్తీస్ గడ్ లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు వెళ్లే హీరాఖంండ్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ దగ్గర జనవరి 21 శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మందికి పైగా మరణించారు....

Boycott (World) Social Forum, a Safety Valve for Imperialism !- RDF

Revolutionary Democratic Front calls upon the people and genuine democrats to boycott the (world) Social Forum, being held in Canada in August 2016 and all the related forums and preparatory meetings etc. being conducted in different parts of the country including Hyderabad....

కవితామయ జీవితం - శిల్ప ప్రయోగ విప్లవం

విప్లవ కవులకు, విప్లవ కవిత్వానికి ఈ ఒరవడి అందివ్వడంలో వివి పాత్ర గణనీయం. ఇంకోలా చెప్పాలంటే ఆయన అభేద సంబంధంలో ఉండే విప్లవోద్యమం పాత్ర ఇక్కడే ఉన్నది. వివి కవిత్వ వస్తు విస్తృతి, శిల్ప ప్రయోగాలు వగైరా ఏది చర్చించాలన్నా పైన చెప్పిన వాటిపట్ల ఎరుక ఉండాలి. కవి నుంచి కవిత్వాన్ని వేరు చేసి విశ్లేషించలేమని అన్నది ఈ దృష్టితోనే.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇంద్రవెల్లి