భావోద్వేగాల కూడ‌లి ఉస్మానియా యూనివ‌ర్సిటీ - నందిని సిధారెడ్డి

భావోద్వేగాల

తెలంగాణ సమాజం జాగృతమవుతున్న సందర్భంలో నెలకొల్పిన యూనివర్సిటీ గనుక కాలం తన మీద మోపిన బాధ్యతను నిరంతరం నిర్వర్తిస్తూ వచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. క్రమక్రమంగా ఉధృతమవుతున్న గ్రంథాలయ స్థాపనలు, చైతన్యాన్ని పంచే విద్యాభావనలు వికసిస్తున్న నేపథ్యంలో వెలసినందువల్ల తెలంగాణ చరిత్ర మలుపుల్లో క్రియాశీలక పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నదీ విద్యాలయం. సాధారణంగా చాలా విశ్వవిద్యాలయాలు విద్యా బోధనల వరకే పరిమితమవుతుంటాయి. కొన్ని ప్రత్యేక విశ్వవిద్యాలయాలు మాత్రమే జ్ఞాన విస్తరణతో పాటు జాతి సామాజిక రాజకీయ చరిత్రలకు అధ్యాయాలుగా నిలుస్తయి. తెలంగాణ విమోచనోద్యమంలో, భారత స్వాతంత్రోద్యమంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో, జాతీయవాద చైతన్యంలో, విప్లవ ఉద్యమ విస్తృతిలో, అస్తిత్వ ఉద్యమాల ఆరాటాల్లో, హక్కుల ఉద్యమాల్లో, వర్గీకరణ వంటి న్యాయ పోరాటాల్లో సైతం కీలకమైన బాధ్యతాయుత భాగస్వామ్యంతో విరాజిల్లిన విశిష్టత ఉస్మానియా విశ్వవిద్యాలయానిది. ప్రజా చైతన్యంతో పెనవేసుకపోయిన సజీవ సాహిత్య సృష్టిలో, జన కళావికాసంలో ఈ విశ్వవిద్యాలయానిది వినూత్న ఒరవడి.

నేను క్యాంపస్‌లో 1976లో ప్రవేశించిన. సాహిత్యం మీద తీవ్రమైన ఉద్వేగంతో ఎమ్మే తెలుగులో చేరిన. అప్పటికే సుమారు ఆరు దశాబ్దాల చరిత్ర, అనుభవం, చైతన్యంతో పండి ఉన్నది. తరచుగా జార్జిరెడ్డి పేరు వినబడుతుండేది. ఎమర్జెన్సీ చీకటి నిర్బంధం, వీసీ జగన్మోహన్‌రెడ్డి కఠిన పాలన క్యాంపస్‌ నిండా కనబడుతుండేది. అయినా జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో రాజకీయ ప్రజాతంత్ర చైతన్యాలు బాహాటంగానే గోచరించేవి. ʹజీవనాడిʹ పత్రిక క్యాంపస్‌ విద్యార్థుల గుండెల సవ్వడి బలంగా వినిపించి ఉన్నది. మెడికల్‌ కాలేజీలు, ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రజాస్వామిక భావనలను ఫ్యాషన్‌గా చెప్పేటంతగా ఆకర్షణ ఉన్న సమయం. కవిత్వ పంక్తులు ప్రసంగాల్లో వ్యక్తమవుతూ బ్యానర్ల మీద, గోడల మీద రాతలుగా విస్తరించుతున్న చైతన్యకాలం. నీలి నీడల నుంచి వెలుగు వెల్లువలోకి పురోగమిస్తున్న గొప్ప సందర్భంలో క్యాంపస్‌లో జీవించినందుకు గర్వంగా, హుషారుగా ఉంటది.

ఆర్ట్స్‌ కళాశాల మెట్లెక్కి కారిడార్‌లో ప్రవేశించటమే గొప్ప ఉత్సాహం. తరగతి గదిలో పరిచయమైంది గుడిహాళం రఘునాథం. డిగ్రీలో మాథ్స్‌ ఫిజిక్స్‌ చదువుకున్నప్పటికీ నాలాగే సాహిత్యం మీద వల్లమాలిన మమకారంతో తెలుగు సాహిత్యంలో చేరిండు. రామ్మోహనశర్మ మొదట పరిచయమైనా హృదయానికి దగ్గరగా వచ్చింది రఘునాథమే. గల గల మాట్లాడుతూ ముసిముసి నవ్వులతో మృణాళిని మా క్లాసే. మా సీనియర్స్‌లో చిమనగుంట జగదీశ్వర్‌ అనే ఒక కవి, హనుమయాచారి అనే చిత్రకారుడు, నాగుల రాజేశంగౌడ్‌ అనే గాయకుడు, శివరామశర్మ పండితుడు సాహిత్యం పట్ల మక్కువ కలిగి ఉండి నాకు దగ్గరయిండ్రు. వీళ్లందరి బలంతో మొదటి సంవత్సరం మొదటినెలలోనే రూం నెం.57లో సి.నారాయణరెడ్డి అతిథిగా కవి సమ్మేళనం ఏర్పాటు చేసిన. చాలా బాగా జరిగింది. బీఈడీ విద్యార్థిగా పాల్గొన్న నలిమెల భాస్కర్‌ తొలి పరిచయం ఆ సభలోనే. నిర్బంధపు చివరి దశలో ఎలుగెత్తిన కవిత్వ చైతన్యం గమనించి సినారె ప్రశంసించటం విద్యార్థులమైన మాకెంతో స్ఫూర్తి. రఘునాథం తొలుత పద్యాలు రాసేవాడు. వచన కవిత్వ విశేషాలు, అవసరాలు, నైపుణ్యాలు చెప్పి చర్చిస్తుంటే ఇటువైపు వచ్చిండు. ఇద్దరం కలిసి కె.శివారెడ్డి నగ్నముని, గుంటూరు నాగేంద్రశర్మ, అరిపిరాల విశ్వం, కుందుర్తి ఆంజనేయులు, దేవిప్రియ వంటి ప్రసిద్ధ కవుల దగ్గరి వాళ్ల అనుభవాలు, భావాలు తెలుసుకునేవాళ్లం. నగరంలో జరిగే సాహిత్య సభలకు తరచుగా హాజరయ్యేవాళ్లం. కవిత్వం రాయటం, పత్రికలకు పంపటం మాకు నిత్యకృత్యం. పత్రికల్లో ప్రతివారం పేరుండాలని పోటీపడేవాళ్లం.

నేను ఓల్డ్‌ పీజీ హాస్టల్‌లో రూం.నెం.72లో ఉండేవాడిని. ప్రతి ఆదివారం ఉదయం హాస్టల్‌లో సాహిత్య కార్యక్రమాలు చేసేవాళ్లం. ప్రముఖ రచయితలను వక్తలుగా ఆహ్వానించి చర్చలు నిర్వహించేది. అక్కడ జరిగిన చర్చలు స్పందనలు సాహిత్య సృష్టికి అన్వయించుకొని దిద్దుకునేవాళ్లు. సెమినార్‌ లైబ్రరీ, యూనివర్సిటీి లైబ్రరీలో సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యటంలో ఎక్కువ కాలం గడిచేది. మా పక్కన ʹబీʹ హాస్టల్‌లో దేవరాజు మహారాజు జువాలజీలో పరిశోధకుడుగా ఉండేది. ఎదురు రూం కె.బి.గోపాలం. ఇద్దరితో సాహిత్య చర్చలు. మహారాజు అప్పటికే ʹగుడిసె-గుండెʹ తెలంగాణ భాషలో కవితా సంపుటి ప్రచురించి ఉన్నడు. మహారాజుతో స్నేహం గాఢమై సాహిత్యంలో అవాంఛనీయ ధోరణులను ఎండగట్టాలనుకున్నం. రఘు, నేను మహారాజు కలిసి అప్పటి సాహిత్య స్థితి అవకతవకలు నిరసిస్తూ ʹʹదాడిʹʹ కరపత్రిక తెచ్చినవి. కవి కాకుండా కవిగా చెలామణీ ʹఎల్లోరాʹ మీద, వైరుధ్యాలెన్నో ఉన్నా తానే అసలైన కవినని విర్రవీగే ʹశేషేంద్రʹ మీద, జీవితానికి దూరమైన వ్యాపార సాహిత్యంతో వెలిగే ʹఆనందరామంʹ మీద, అకాడమీల మీద పరుషమైన వ్యంగ్య దూషణ ఛలోక్తులతో ʹదాడిʹ వ్యాసాలు సంచలనం కలిగించినయి. కొందరు రచయితలు తడుము కున్నరు. కొందరు రచయితలు సర్దుకున్నరు.

మాకంటే ముందు యూనివర్సిటీలో చదివే విద్యార్థి రచయితలకు సంఘం ఉండేదట. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రచయితల సంఘం. వాళ్లూ కొన్ని సాహిత్య కార్యక్రమాలు చేసేదట. పాలకోడేటి సత్యనారాయణరావు, దేవరాజు మహారాజు, రఘుశ్రీ తదితరులు. వీళ్లు రాసిన కథలను ఎమెస్కో ʹఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రచయితల కథలుʹ పేరుతో ప్రచురించారు. ఆ ప్రస్తావన వచ్చిన్పుడల్లా ఇట్లాంటి ప్రయత్నం మరొకసారి చేస్తే బాగుండుననిపించేది. మా తర్వాత ఎమ్మే జూనియర్స్‌ బ్యాచ్‌ కూడా మంచి బ్యాచ్‌. చాలా మంది చాలా మంది రచయితలు చేరిండ్రు. నాళేశ్వరం శంకరం, వసంతరావు దేశపాండే, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మర్రి విజయరావు, ఎస్వీ సత్యనారాయణ తదితరులు. తర్వాత కందుకూరి శ్రీరాములు బ్యాచ్‌. రోజూ కలుసుకునేది. ఎడ్యుకేషన్‌లో జీన, అరుణ్‌(సమ్మయ్య)లు ఉండేది. సీ హాస్టల్‌లో సలంద్ర, అల్లం నారాయణ ఉండేది. ఎటు వెళ్లినా మా కవి బృందం ముచ్చట్లతో, చర్చలతో నిండుగా, చూడ ఆకర్షణగా ఉండేది. విశాలమైన క్రీడా ప్రాంగణంలో వెన్నెల్లో, కొన్నిసార్లు క్యాంపస్‌ లోపలి రోడ్ల మీదే చెట్ల క్రీనీడల్లో, సన్నని వెలుతురు దాగుడు మూతల్లో నగ్నముని కొయ్యగుర్రం, శివారెడ్డి ʹఆసుపత్రి గీతంʹ శివసాగర్‌ కవిత్వాలు చదువుకునే వాళ్లం. బయటకు ఒకరు చదివితే అందరూ వినేది. మాలో ఎవరైనా రాసిన కవితలు కూడా చదివేవాళ్లు. హాస్టల్‌లో ఉండకపోయినా మాతో ఉండే గుడిహాళం పాటలు, నకులుడు పద్యాలు పెద్ద సందడిగా ఉండేది. క్యాంటీన్‌లో మల్లయ్య, బషీర్‌ హోటళ్లలో మా చర్చలు ఆసక్తిగా వినేవాళ్లు. మా గుంపు చూసి ʹసలంద్రʹ(వేడిగాలి రచయిత, విరసం కార్యకర్త) సంఘం పెట్టమని సలహా ఇచ్చిండు. దాని ఫలితమే ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌. నియమావళి, కార్యక్రమాలు పక్కాగా రూపొందించుకున్నాం. సన్నాహక సమావేశాలు హాస్టల్‌ పై భాగంలో సభలు ఆర్ట్స్‌ కళాశాలలో చిన్న కారణాలతో నేను మౌనంగా ఉండిపోయినా రైటర్స్‌ సర్కిల్‌ కార్యక్రమాలు చురుగ్గా జరిగేవి. ఆర్ట్స్‌ కాలేజీ ఎంట్రెన్స్‌లో రోజూ ʹకవితʹ పోస్టర్‌ పెట్టేవారు. సుంకిరెడ్డి, లక్నారెడ్డి ముఖ్యులు. పెరుగుతున్న ఆదరణ క్యాంపస్‌ బయట నగరంలో కూడా సాహిత్య సభలు పెట్టే దాకా విస్తరించింది. ఆ మధ్యలోనే విరసం దశాబ్ది ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగినయి. ఆ ఊపులోనే రైటర్స్‌ సర్కిల్‌ ʹఈ తరం యుద్ధకవితʹ ప్రచురించింది. విద్యార్థి విప్లవోత్సాహాలకు పొంగిన కవిత్వ కెరటమది.

క్యాంపస్‌ బయట ఉన్న అనేకమంది ప్రముఖులతో సాహిత్య సంబంధాలుండేవి. రంగనాథాచార్యులు, చేరా, శివారెడ్డి, చెరబండరాజు, శ్రీకంఠమూర్తి, డి.వెంకట్రామయ్య వంటి ముఖ్యులతో పాటు అసురా, కె.శ్రీనివాస్‌, కేశవరెడ్డి, స్వయంప్రభ, జయప్రభ యువ ఉత్సాహ సాహిత్యకారుల దాకా సన్నిహిత సంబంధాలుండేటివి. ఎంతో గొప్ప సాహిత్య వాతావరణంతో సజీవంగా ఉండే ʹకవి సమయాన్నిʹ కల్పించి ఇచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయం.

రాజకీయ వాతావరణం మహత్తరం. మాటల్లో ఇముడ్చలేనంత గొప్ప అనుభవం. చర్చలకు, చైతన్యాలకు, ఉద్యమ హోరుకు క్యాంపసే పెట్టింది పేరు. నూరు భావాలు వికసించిన స్థలం.. వేయి ఆలోచనలు సంఘర్షించిన బలం. ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశ భావజాలాలన్నింటిని ప్రపంచ ఉద్యమ స్ఫూర్తి భావోద్వేగాలన్నింటిని పుక్కిట, పిడికిట పట్టిన చైతన్య కేంద్రం. పుస్తకాల నుంచి వచ్చిన జ్ఞానం, ఊర్ల నుంచి వచ్చిన ఉద్వేగం స్పష్టమైన రాజకీయ మలుపు తీసుకునేదిక్కడే. జీవన గమనాలకు దిశా నిర్దేశం చేసి గమ్యాలు స్థిరపర్చేదిక్కడే. పోటీలు, పరీక్షలు, స్వప్నాలు, విజయాలు రూపుదిద్దుకునే కీలక ప్రదేశం ఇదే.

జాతీయవాద, దేశక్తి భావనల ప్రతినిధిగా అఖిల భారత విద్యార్థి పరిషత్తు(ఏబీవీపీ), కాంగ్రెస్‌ పక్ష విద్యార్థి విభాగం భారత జాతీయ విద్యార్థి సంఘం(ఎన్‌ఎస్‌యుఐ), వామపక్ష చైతన్యాలను విస్తరింపజేసే విద్యార్థి సంఘాలు, అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌), భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ), విప్లవ పక్ష భావజాల స్ఫూర్తి విస్తరించే ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం(పీడీఎస్‌యు), రాడికల్‌ విద్యార్థి సంఘం(ఆర్‌ఎస్‌యు), రాడికల్‌ విద్యార్థి సంస్థ(ఆర్‌ఎస్‌ఓ) ప్రజాతంత్ర విద్యార్థి సంఘం(డీఎస్‌ఓ) మొదలైన విద్యార్థి సంఘాలు క్యాంపస్‌లో అప్పట్లో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించేటివి.

విప్లవ విద్యార్థి సంఘాల గురించి విని ఉన్నప్పటికీ నేను ప్రవేశించేటప్పటికి ఎమర్జెన్సీ వల్ల ఎన్‌ఎస్‌యుఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాత్రమే కనిపించేవి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అన్ని విద్యార్థి సంఘాలు వినూత్న చైతన్యంతో విస్తరించినయి. ఒకపక్క ఏబీవీపీ, మరోపక్క పీడీఎస్‌యు ప్రధానంగా వెల్లువెత్తినాయి. కొద్ది కాలంలోనే ఆర్‌ఎస్‌యు కూడా క్యాంపస్‌ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నది. కొంతమందితోనే ఉన్న డీఎస్‌ఓ రెగ్యులర్‌ కార్యక్రమాలు నిర్వహించేది. ఎన్ని కళాశాలలు క్యాంపస్‌లో ఉన్న ʹఆర్ట్స్‌ కాలేజీʹ ప్రత్యేకం. ఉన్న సంఘాలన్నీ అక్కడే సందడి చేసేవి. 1977 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పీడీఎస్‌యు ఘనవిజయం సాధించింది. ఒక్క ప్రధాన కార్యదర్శి పదవికి ఏఐఎస్‌ఎఫ్‌కు అవకాశం దక్కింది. అరుణోదయ రామారావు, అంబిక పాటలు, కాశీపతి ఉపన్యాసం అప్పట్లో పెద్ద ఆకర్షణ. ఇంజనీరింగ్‌ కాలేజీ భావోద్వేగాలకు కూడలిగా ఉండేది. ʹకాలేజీ డేʹలు, ʹహాస్టల్‌ డేʹలు విద్యార్థి రాజకీయాల ప్రకటనలు సాగేటివి. అతిథులను వక్తలుగా పిలిచే దగ్గర నుంచి సంఘర్షణలు ప్రారంభమయ్యేవి. అత్యుత్సాహంగా, ఉద్రిక్తంగా జరిగిన సందర్భాలెన్నో మెదులుతుంటాయి.

బీ హాస్టల్‌ డేకు దాశరథి రంగాచార్య వక్తగా వచ్చిండు. సంచలన విషయాలు ప్రస్తావించినా సాఫీగానే ఉత్సాహంగా సాగిపోయింది. కానీ ʹఏʹ హాస్టల్‌ డేకు శివారెడ్డి వక్త. ఉద్వేగంగా నడిచిన ప్రసంగంలో దేవుడినీ, బొట్టును తక్కువ చేసి మాట్లాడిండు. వెంటనే అక్కడే ఘర్షణ మొదలైంది. పీడీఎస్‌యు విద్యార్థులు సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల దేశభక్తి కార్యకర్తను కంట్రోలు చేసిండ్రు. కానీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో అకస్మాత్తుగా హాస్టళ్లన్నీ కకావికలమైనాయి. క్యాంపస్‌ బయటి కార్యకర్తలతో సీ హాస్టల్‌, ఏ హాస్టల్‌ మీద దాడి జరిగింది. భయానకం. చీకటి చిమ్మింది. లైట్లు పగిలినయి. కొందరి తలలు పగిలిన గుర్తు. దృశ్యం ఘోరంగా ఉంది. వాళ్లు వెళ్లేంత వరకు అరుపులు, కేకలు, ఏడుపులు తప్ప మరేమీ వినబడని స్థితి. మాట్లాడిన వక్త శివారెడ్డి నా రూంలో ఉన్నాడు.

క్యాంపస్‌లో ప్రతి సందర్భంలోనూ బ్యానర్లు బారులు తీరేవి. నడువటానికి వీలులేనంతగా కార్యకర్తల కలకలం. గోడల మీద నినాదాలు పూసేవి. ʹʹలాల్‌గులామీ చోడో బోలో వందేమాతరంʹʹ అని దేశభక్తులు రాస్తే ʹʹజీనాహైతో మర్‌నా సీఖో, కదం కదం పర్‌ లడ్‌నా సీఖోʹʹ అని విప్లవ కార్యకర్తలు రాసేవాళ్లు. ʹఈ వ్యవస్థ ప్లాస్టిక్‌ పువ్వు. వేడి చేస్తే కరిగిపోతుందిʹ అనే నినాదం నన్నాకర్షించేది. ఆర్ట్స్‌ కాలేజీలో ʹఫోకస్‌ʹ రాతపత్రిక ప్రతి రోజు పెట్టేవారు. స్థానిక, ప్రపంచ విషయాలెన్నింటి మీదనో విశ్లేషణలుండేటివి. అక్కడ నిలబడి చదవటం నిజంగా గొప్ప జ్ఞానం. నా రైటింగ్‌ అందంగా ఉండటం వల్ల పోస్టర్స్‌ రాయించేవాళ్లు. బీడీలతో రాయటం అప్పుడే నేర్చుకున్న. ఒక్కోరోజు పోస్టర్‌ అతికించటానికి, వాల్‌రైటింగ్‌కు వెళ్లేది. రోజువారీ సమస్యల మీద పోస్టర్లు వేస్తే పోలీసులు వెంబడించేవారు. ఒకరోజు వాల్‌రైటింగ్‌ చేస్తున్న మమ్మల్ని అరెస్ట్‌ చేసి క్యాంపస్‌ పోలీస్‌స్టేషన్లో బంధించిండ్రు. క్షణాల్లో హాస్టళ్ల నుంచి వందల మంది విద్యార్థులు వచ్చి ధర్నా చేసి మమ్ముల విడిపించిండ్రు.

కాలేజీ ఫీజుల, మెస్‌ చార్జీల విషయంగా ఒకరోజు సెక్రటేరియట్‌ ముందు రాస్తారోకో జరిపారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయినాయి. పోలీస్‌లొచ్చి లాఠీచార్జి చేసిండ్రు. అప్పటి ఆర్ట్స్‌ కళాశాల అధ్యక్షుడు మల్లారెడ్డి లాఠీ దెబ్బలకు స్పృహతప్పి పడిపోయాడు. అందరం చెల్లా చెదురుగా పరుగో పరుగు. ఎదురుగా ఇరానీ హోటల్‌లో దాక్కుని చూస్తున్న. ఎవరూ రోడ్డు మీదికి వెళ్లలేని స్థితిలో మల్లారెడ్డి పీడీఎస్‌యు విద్యార్థి అయినప్పటికీ డీఎస్‌ఓ విద్యార్థిని ʹజయలక్ష్మిʹ వచ్చి నీళ్లు తీసుకెళ్లి తాగించి సపర్యలు చేసింది. అట్లా విద్యార్థుల మధ్య ఒక స్ఫూర్తి ఉండేది. ఆమె చొరవ, ధైర్యం నన్ను అబ్బుర పరిచింది.

ఆ తర్వాత కొద్ది రోజులకే రమీజాబీ సంఘటన జరిగింది. అడిక్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు రమీజాబీ, ఆమె భర్త న్యాయం కోసం వచ్చిండ్రు. భర్త ముందే పోలీస్‌స్టేషన్‌లో రమీజాబీపై అత్యాచారం జరిగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. ఆ సంఘటన మీద పెద్ద నిరసన. విద్యార్థులు, విప్లవ కారులు రోడ్డు మీదికొచ్చిండ్రు. అటు పోలీసులు, ఇటు విద్యార్థులు విద్యానగర్‌లో ఒక యుద్ధంలాగా జరిగింది. బాష్పవాయు గోళాలు విసురుతుంటే ప్రతిఘటించి పోరుతున్నరు. కొందరు అవి అందుకొని తిరిగి విసిరిన దృశ్యం అపుడే చూసిన. కళ్లు పొగలు, మంటలు. మేం అప్పటికే ఉల్లిపాయలు వెంట ఉంచుకున్నం గనుక వాటి ద్వారా ఇబ్బంది పడకుండా నిల్చున్నం. కాల్పుల దాకా వచ్చేసరికి పరిగెత్తినం. తెల్లవారి పోలీస్‌స్టేషన్‌ ముందు నడుచుకుంటూ వెళ్లి కరపత్రాలు పంచి, నినాదాలు చేసి తప్పించుకొచ్చినం. ఒక పక్క భయం వేస్తున్నా మరొక పక్క ఉత్సాహం ఉరకలు వేసే అనుభవం.

అట్లాంటి ఉత్సాహంతోనే సత్తుపల్లిలో వెంగళరావుపై పోటీకి నిలబడి కాళోజీ ఎన్నికల ప్రచారానికి గుంపుగా వెళ్లినం. మేం సాయంత్రాలు తార్నాక హోటల్‌లో చాయ్‌తాగి నడుచుకుంటూ తిరిగి హాస్టల్‌కొచ్చేది. ఒకరోజు అట్లా వస్తున్నప్పుడు కొందరు పోలీసులు, కొందరు బాటసారులు గుమిగూడి ఉన్నరు. కొద్ది నిమిషాల కిందే సంఘటన జరిగిన కదలికలు. కొంచెం ముందు నడిస్తే నెత్తుటి పచ్చిచుక్కల గుర్తులు. విద్యార్థి మీద దాడి, కత్తి పోట్లు జరిగినట్లు భయం భయంగా చెప్పుకుంటున్నరు. తెలుసుకుంటే అతను రామకృష్ణ. సైన్సు కళాశాల కార్యదర్శి. రాడికల్‌ విద్యార్థి సంఘ నాయకుడు. క్యాంపస్‌ అంతా భయంతో వణికింది. తెల్లారి లేచేసరికి ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌ ఎంట్రెన్స్‌ గోడకు పోస్టర్‌. నిలబడి చూస్తున్నారు కొందరు. ʹʹమా మౌనం మూగతనం కాదు. నీకు తెలుసో లేదో గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగా ఉంటుందిʹʹ అని ఎర్రటి అక్షరాలు. ఆ కవిత నాదే. అట్లా ఉపయోగపడినంతుకు కవిగా ఉత్సాహం. ఉద్యమ విద్యార్థులు కవిత్వం చదివి అన్వయిస్తున్నందుకు సంతోషం కలిగింది.

టాగోర్‌ ఆడిటోరియం నిత్య నినాదాల్తో పులకించేది. బహిరంగసభలు, విద్యార్థి సంఘాల ఉత్తేజ భావోద్వేగాలకది కూడలి. ఎన్ని కదలికలకో అది పునాది. ఎందరి రక్తమో ఉడుకెత్తి బిగుసుకున్న పిడికిలి. నడుమ ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ కూడా లావా చిమ్ముతున్నట్లుండేది. చిన్న బ్రిడ్జి మీద వరుసగా నడుస్తుంటే సైన్యం నడిచినట్టే. ప్లెకార్డులు రాసి, పట్టుకొని ఎన్నిరోడ్లు, ఎన్ని గల్లీఉ, ఎన్ని కార్యాలయాలు నడిచామో. గుర్తొచ్చినప్పుడల్లా గుండె బరువెక్కుతుంది. నాకు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలతో సంబంధాలుండేవి. అప్పుడప్పుడయినా అవన్నీ కలవాలనీ కోరిక ఉండేది. చంద్ర టీసిన అట్లాంటి ఒక బొమ్మ నా గదిలో అంటించుకున్న. చైతన్యాలకు, సంఘటనలకు సంకేతంగా భాసించే ఉస్మానియా క్యాంపసే సంఘటిత స్ఫూర్తికి శక్తినిచ్చింది. విజయాలకు, విఫలాలకు ఇప్పటి చిహ్నంగా ఇబ్బంది పడుతున్న క్యాంపస్‌ శతవసంతాల తేజస్సు వినూత్న ఉద్యమాలకు పతాకమెత్తాలి. జాతిని, సమాజాన్ని ముందుకు నడిపే సరికొత్త నాయకత్వాన్ని ఇవ్వగలగాలి.
- నందిని సిధారెడ్డి
(న‌డుస్తున్న తెలంగాణ ఏప్రిల్ 2017 సంచిక‌లో ప్ర‌చురితం)

Keywords : Osmania University, Nandini Sidharaddy, VIRASAM, Revolution
(2024-04-24 19:51:00)



No. of visitors : 2094

Suggested Posts


ఉద్య‌మాల ఉస్మానియా - అమ‌రుల త్యాగాల మార్గం - వ‌ర‌వ‌ర‌రావు

కామ్రేడ్స్‌ అసోసియేషన్‌తో ప్రారంభమై ప్రత్యామ్నాయ రాజకీయాల నూతన ప్రజాస్వామిక స్వప్నం ఆచరణగా రుజువవుతున్న వర్తమానంలో ఎందరో జ్ఞాత, అజ్ఞాత ఉస్మానియా విద్యార్థుల పోరాట భూమిక ఉన్నది. అసంఖ్యాక విద్యార్థులు నిర్వహించిన ఆ పోరాటాలలో నాకు తెలిసిన, నాకు తెలియని ఇంకెందరో విద్యార్థుల ప్రాణత్యాగాల ఫలితాలు ఉన్నాయి.

ఓయూ లేకుంటే నా జీవితం లేదు : అల్లం నారాయ‌ణ‌

నేనెప్పుడూ చెప్తుంటా.. నా జీవితంలో రెండు కోణాలున్నాయని. ఒకటి ఉద్యమం. ఇంకోటి సంతోష్‌. అతని నైజం నాకు నచ్చేది. యూనివర్సిటీ మొత్తాన్ని ఆయన ప్రభావితం చేసేవాడు. ఆయన గురించి ప్రతిరోజూ వర్సిటీ చర్చించేది. మాట్లాడుకునేది. ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీని అంతలా ప్రభావితం చేసిండంటే.. అది చిన్న విషయం కాదు. కరెంట్‌ ఇష్యూస్‌ మీద ఆయన స్పందించే తీరు ప్రత్యేకం. అదే ..

ఓయూలో విద్యార్థి చ‌ల‌నాలు - సి. కాశీం

ఓయూ కేంద్రంగా 2009 నవంబర్‌ 29న ఏర్పడిన విద్యార్థి జాక్‌కు ఆర్ట్స్‌కాలేజీ జీవం పోసింది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు వెలసిన టెంట్‌ తెలంగాణ ఉద్యమాన్ని శాసించింది. తెలంగాణ ప్రజలందరు ఓయు వైపు చూసారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 2010 జనవరిలో 5 లక్షల మంది విద్యార్థులతో ఆర్ట్స్‌ కాలేజీ ముందు స్టూడెంట్‌ జాక్‌ సభ నిర్వహించింది....

ఉస్మానియా నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ

ఆర్ట్స్‌ కాలేజీకి ముగ్గువోసినపుడు నాకు పదేండ్లుంటయ్‌. మా అయ్యతోటి గల్సి కంకర గొట్టిన. రాళ్లు మోసిన. ఆర్ట్స్‌ కాలేజీకెదురుంగ కోంటోని బిల్లింగుండె(బీ హాస్టల్‌ భవనం). ఇప్పుడున్న ఠాగూర్‌ ఆడిటోరియం అడుగున అప్పట్ల సిల్మా ఆలుండె. దాని కట్టనీకి ఇటికెల్ని మూసిల్నించి తెచ్చేది....

యూనివర్సిటీలో పోలీసు జోక్యంపై పోరాడి విజయం సాధించిన ఉస్మానియా విద్యార్థులకు శెల్యూట్స్ !

దాదాపు 20 గంటలకు పైగా తిండి , నిద్ర మానేసి విద్యార్థులు వీసీ కార్యాలయంలోనే బైటాయించి పోలీసులకు, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిట్టచివరకు దిగి వచ్చిన వీసీ విద్యార్థుల డిమాడ్లను అంగీకరించాడు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్ జారీ చేశాడు, అందులో... యూనివర్సిటీ అధికారుల అనుమతితో విద్యార్థులు

రండి "వసంత కుమారి"తో మాట కలుపుదాం....!!

"పుట్టింది ఒక చోట...తిరిగింది మరో చోట...విప్లవ ప్రభుత్వాన్ని నిర్మించిందీ ఇంకో చోట" అని ʹచే గువేరాʹగురించి తరచూ అనుకునే మాటలు ఇవి. ఈ మాటలు సరిగ్గ సరిపోతాయి ఢిల్లీ ప్రొఫెసర్ డా.జి.ఎన్. సాయిబాబాకు...

ʹఓయూ విద్యార్థి వొగ్గె భరత్ ను తెలంగాణ, NIA పోలీసులు కిడ్నాప్ చేశారుʹ

15 జూలై సోమవారం రోజున తన హాస్టల్ రూమ్ లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత‌ భరత్ మిత్రుడిని కలిసి వస్తా అని ఓయూ హాస్టల్ నుండి బయటకు వెళ్ళాడు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో హిమయత్ నగర్ కేఫ్ లో టీ తాగుతుండగా కరీంనగర్ పోలీసులము అని చెప్పి భరత్ ను బలవంతంగా వ్యాన్లో పడేసి కిడ్నాప్ చేసారు. ఆరోజు రాత్రి హైదరాబాద్ లోనే ఒక గుర్తు తెలియని ఆఫీసులో తీవ్రంగా కొడుతూ త

Open Letter To President of India - OU Students

However the university has become a subject of negligence in the hands of the successive governments including the present Telangana government. The students while struggling for separate statehood have raised many issues that have been impeding the progress of the university in fulfilling its responsibility towards the people of the country...

కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఓయూ విద్యార్థులు

రాష్ట్రంలో ప్రైవేట్‌ వర్సిటీల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో విద్యార్థులు మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహ నం చేశారు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భావోద్వేగాల