నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...


నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...

నక్సల్బరీ

(వీక్షణం మాసపత్రిక మే 2017 సంచికలో ప్రచురించబడినది)

సరిగ్గా నలభై ఏళ్ల కిందటి సంగతి.
హైదరాబాద్లోనైనా, వరంగల్లోనైనా విద్యార్థుల ప్రదర్శనలో మార్మోగే నినాదాలు:
ʹఅప్నాబరీ నక్సల్బరీ, సబ్కాబరీ నక్సల్బరీ, నక్సల్బరీ వర్ధిల్లాలి!ʹ
ʹదొంగనోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా! లంచగొండి వెధవలిచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా!ʹ
ʹయే ఆజాదీ జూటీహై, దేశ్కీ జనతా భూఖీహై!ʹ
ʹజీనాహైతో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో!ʹ

నక్సల్బరీ విప్లవ సందేశం దేశం నలుమూలలా వ్యాపించిన కాలం అది. దేశ దేశాలలో ʹతూర్పు పవనం వీచేనోయి! తూర్పు దిక్కెరుపెక్కె నోయి!ʹ అంటూ కార్మికులు పోరాటాలతో వెల్లువెత్తుతున్న కాలం. వియత్నాం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ఎదురొడ్డి పోరాడుతున్న కాలం. అందుకే ఆ నినాదాలు ఎందో విప్లవ స్ఫూర్తినిచ్చాయి. తరతరాల దోపిడీని ఎదిరించే ధైర్యాన్నిచ్చాయి.

మహత్తర నక్సల్బరీ ఆశయంతో ఉత్తేజితుడనై, ఉస్మానియా మెడికల్ కాలెజి ఎంబిబిఎస్ చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పి ఫిబ్రవరి 1976లో విశాఖ జిల్లా ఆర్గనైజర్ బాధ్యతలు చేపట్టాను. విశాఖకు వెళ్లాలనే రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని నాకు తెలియజేయడానికి వచ్చింది రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ మహదేవన్. అక్కడ ప్రసాద్ పేరుతో పరిచయం చేసుకోవాలంటూ ఆ పేరు పెట్టింది కూడా ఆయనే.

మొదటి అయిదుగురు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతోను, ఆరుగురు పట్టణ యువకులతోను, ముగ్గురు పోర్టు ఉద్యోగులతోను, కొద్దిమంది షిప్ యార్డు కార్మికులతోను సంబంధాలు ఉండేవి. వీరిలో ముఖ్యులను నాకు పరిచయం చేసింది ప్రముఖ రచయిత రావిశ్రాస్తి కొడుకు కామ్రేడ్ నారాయణమూర్తి. కృష్ణా జిల్లాలో కామ్రేడ్ కె.ఎస్. కుడి భుజంగా పేరొందిన కామ్రేడ్ తప్పెట సుబ్బారావు నాకు షెల్టర్ ఇచ్చారు. ఆయన స్వగ్రామం పెంజెండ్ర. ఉద్యోగ రీత్యా విశాఖకు వచ్చి సెటిలయ్యారు. ఈ సంబంధాలను పటిష్ట పరుచుకుంటూ కొత్త‌ సానుభూతిపరులను తయారు చేసుకోవాలని నా శాయశక్తులా కృషి చేశాను.

అవి ఎమర్జెన్సీ చీకటి రోజులు. రహస్య జీవితం గడుపుతున్న నేను ఎన్నో టెక్నికల్ జాగ్రత్తలు తీసుకుంటూ సానుభూతిపరులను కలవాల్సి వచ్చేది. పాలక వర్గాలు విద్యార్థులను అనేక విధాలుగా వేధిస్తుండేవారు. పరీక్ష కేంద్రాలలో ʹఫ్లయింగ్ స్క్వాడ్స్ʹని తిప్పుతూ నానా బీభత్సం సృష్టించారు. ఈ నిరంకుశ చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిస్తూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో కరపత్రాలు ప్రచురించాను. కామ్రేడ్ తిరుపతి పట్నాయక్ సిందియా హై స్కూల్లో కరపత్రాలు పంచుతూ పోలీసులు ప్రవేశించగానే గోడదూకి, పోలీసులు వెంబడించినా పట్టుబడక, సాహసోపేతంగా తప్పించుకున్నాడు. విశాఖలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఈ కరపత్రాలు పంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కరపత్రాలను విద్యార్థులు విస్తృతంగా పంచారు.

ఎమర్జెన్సీ నీడలో విచ్చలవిడిగా అమలైన పోలీసుల జులుంను యూనివర్సిటీ విద్యార్థులు బలంగా ప్రతిఘటించడంతో అప్పటికప్పుడు ఎస్.ఐ. భాస్కరరాజును సస్పెండ్ చేయక తప్పలేదు. షిప్ యార్డు కార్మికులు తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగి డిమాండ్లను సాధించుకున్నారు. ఎమర్జెన్సీ నిర్బంధాన్ని లెక్కచేయక సాగిన ఈ పోరాటాలన్నీ ప్రజల పోరాట పటిమకు ప్రత్యక్ష నిదర్శనాలు.

ఈ పోరాట వార్తలన్నీ ఎమర్జెన్సీలో రాష్ట్ర కమిటీ వెలువరించిన రహస్య పత్రిక ʹఎర్రజెండాʹలో ప్రచురితమయ్యాయి. ఈ పోరాటాల నేపథ్యంలో కామ్రేడ్ కె.ఎస్. నాకు రాసిన ఇరవై పేజీల సుదీర్ఘమైన లేఖ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. తీవ్రమైన ఫాసిస్టు నిర్బంధ కాలంలో బహిరంగ, రహస్య కార్యకలాపాలను మేళవిస్తూ ప్రజా సంఘాల నిర్మాణాన్ని, పార్టీ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలో వివరిస్తూ ఆయన చేసిన సూత్రీకరణలు పార్టీ కార్యకర్తలందరికీ గొప్ప గైడెన్సునుగా నిలుస్తాయి. ఆ లేఖలో ఆయన ఇలా రాశారు.

ʹమీరు మీ రిపోర్టులో కరపత్రాలు పంచడం ఒక ఎత్తు. తరువాత మన ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం ఇంకొక ఎత్తు అని రాశారు. అది చాలా కరెక్టు... ఒక ఆందోళన లేదా సమ్మె ముగించడంతో ఒక రివిజనిస్టు పని పూర్తవుతుంది. అందుకు విరుద్ధంగా ఒక రివల్యూషనరీ కృషి ద్విగుణీకృతమవుతుంది. అందులో నుండి కొత్తగా వచ్చిన మిలిటెంట్స్ ను ఎడ్యుకేట్ చేయడం, వారిని ఆయా ఆర్గనైజేషన్లలో సంఘటిత పరచడం, తద్వారా పోరాటాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకొనిపోవడానికి పునాదులు వేయడం వగైరా వగైరా పనుల ద్వారా నిజంగా అతని కృషి ద్విగుణీకృతం కావాలి. దీన్నంతా కలిపి మనం కన్సాలిడేషన్ అంటాం.

ʹఅలాంటి కన్సాలిడేషన్లో పార్టీ నిర్మాణానికి, ఆర్ఎస్ యూ తదితర ప్రజా సంఘాల నిర్మాణానికి మధ్య వైరుధ్యం లేదు. పైపెచ్చు ఆ రెండు ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ ముందుకు పోయేవే. పార్టీ కరపత్రాలు పంచుతారు. ʹఎర్రజెండాʹ పత్రికలు చదువుతారు. చదివిస్తారు. కానీ అందులో చాలా మంది ఆర్ఎస్యు నిర్మించడానికి చైతన్య యుతంగా కృషి చేయరు (మీ రిపోర్టును బట్టి). అది ఈ రోజు చాలా చోట్ల జరుగుతున్న విషయమే. దానికి కారణం ప్రజల్ని ఆర్గనైజ్ చేయాల్సిన ఆవశ్యకత, ప్రజా సంఘాల పాత్ర, మొదలైన వాటి గురించి ఈనాటికీ పార్టీలో స్పష్టమైన అవగాహన లోపించడమే. ʹప్రజలే నిజమైన ఉక్కుకోటʹ అనే మావో సూక్తిని రోజూ వల్లిస్తూనే ఉన్నా ఆచరణలో విప్లవంలో ప్రజల పాత్రను గుర్తించకపోవడమే. కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే చాలదు. ప్రజలు కూడా ఆర్గనైజు అయితేనే తప్ప మన దేశంలోని అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని నిర్మూలించలేమనే సత్యాన్ని గుర్తించలేకపోవడమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజలు కూడా సంఘటితమైతేనే తప్ప ప్రజాసైన్యాన్ని సైతం మనం నిర్మించజాలమనే యధార్థన్ని అర్థం చేసుకొనకపోవడమే. మనలో ఇంకా కొనసాగుతున్న లెఫ్ సెక్టేరియనిజం అవశేషం తాలూకు ఆచరణ రూపమే అది. ఈ విషయంపై పార్టీని ఇంకా చాలా ఎడ్యుకేట్ చేయాలి. దీనిని గట్టిగా ప్రయత్నిస్తే గాని సాధించలేం.ʹ

ఈ లేఖ ʹʹవిభిన్న అంతరంగిక పోరాటాల ద్వారా పీపుల్స్వార్ పార్టీ అభివృద్ధి క్రమంʹʹ పేరుతో వెలువడింది. రెక్టిఫికేషన్ కేంపెయిన్ డాక్యుమెంట్స్ నాలుగో సంపుటంలో అచ్చయింది. ఎమర్జెన్సీలో పనిచేయడానికి, ఆత్మవిమర్శ రిపోర్ట్, అత్యావసర పరిస్థితి - మన కర్తవ్యం డాక్యుమెంట్స్తో పాటు ఈ లేఖ నాకు మార్గదర్శకంగా నిలిచింది.

విప్లవ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న కామ్రేడ్ గంటి రమేష్, తిరుపతి పట్నాయక్, యూనివర్సిటీ నుంచి ఎఆర్డి ప్రసాద్, మరొక కామ్రేడ్ ఎమర్జెన్సీలోనే ప్రొఫెషనల్ రివల్యూషనరీస్గా పని చేయడానికి ముందుకు వచ్చారు. నళిని ఫుల్ టైమర్గా పని చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినా పార్టీ ఆదేశాల మేరకు తన వైద్య విద్యను కొనసాగిస్తూ వచ్చింది. అనకాపల్లి, చోడవరం తాలూకాల్లో రైతాంగం తోను, ఎపిటిఎఫ్ ఉపాధ్యాయులతోను సంబంధాలు పెంపొందించు కోవడానికి నేను, రమేష్ గట్టి ప్రయత్నాలు ప్రారంభించాం.

విశాఖ నగరంలోని ʹసౌత్ ఈస్ట్రన్ యూత్ అసోసియేషన్ʹ కళాకారులతో పరిచయాలు ఏర్పరచుకుని వారిని విప్లవ రాజకీయాలతో చైతన్యవంతం చేయడం కోసం ప్రత్యేక కృషి జరిపాను. ఫలితంగా ఆ అసోసియేషన్ కళాకారులందరూ విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ కామ్రేడ్ అప్పారావు సిపిఎం రాజకీయాలకు స్వస్తి చెప్పి ʹజననాట్య మండలిʹ బృందాన్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చారు. విప్లవ రచయిత వంగపండు ప్రసాదరావుతో పరిచయం ఏర్పడింది. ఎమర్జెన్సీ లీగల్ పరిమితులకు లోబడి ఆయన రాసినర ʹవెట్టిచాకిరిʹ బుర్రకథ ప్రదర్శనలను పలు కార్మిక వాడలలో ఏర్పరిచాం. కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ప్రదర్శనలను విజయవంతం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మామిడి అప్పలసూరి నాయకత్వాన గంటి ప్రసాద్, అట్టాడ అప్పలనాయుడు ఫుల్ టైమర్స్గా పనిచేసేవారు. ఎమర్జెన్సీ మధ్యలో గంటి ప్రసాద్ అరెస్టయ్యారు. ఆ తరువాత అప్పలసూరి విశాఖ వచ్చి నన్ను కలుసుకున్నారు. ఆయనను చూడడం అదే మొదటిసారి. ఆయన శ్రీకాకుళ పోరాట చరిత్ర గురించి, అనేక మంది సభ్యులతో కూడిన గెరిల్లా దళాలు ఎదుర్కొన్న సమస్యల గురించి, పోరాటం ఎదుర్కొన ఆటుపోట్ల గురించి వివరంగా చెప్పారు. ఆయన శ్రీకాకుళ పోరాట కాలంలో పనిచేసిన లీడింగ్ కామ్రేడ్ కావడం చేత ప్రత్యక్ష అనుభవాన్ని ఎంతో ఆసక్తిగా విన్నాను. అనేక విషయాలు తెలుసుకోగలిగాను. కానీ మా మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల మూలంగా ఎడతెగని చర్చలు మాత్రం కొససాగేవి.

1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం పతనమయింది. ఎమర్జెన్సీ రద్దయింది. ఆ కాలంలో నిర్బంధించబడిన కామ్రేడ్సందరూ విడుదలయ్యారు. విప్లవ రాజకీయాల ప్రచారానికి లీగల్ అవకాశాలు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ పరిస్థితులన్నింటినీ వినియోగించుకుని గ్రామ సీమలకు విస్తరించడానికి వీలుగా అక్కడ బలమైన ప్రజా పునాదిని ఏర్పరచుకోవాలనే లక్ష్యంతో ఆగస్టులో రాష్ట్ర కమిటీ తీర్మానం, ʹప్రస్తుత పరిస్థితి - మన కర్తవ్యాలుʹ వెలువడింది. అందులో సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. యావత్తు పార్టీ కేడర్ దీనిని ఆమోదించింది.

ఎమర్జెన్సీ కాలంలో విశాఖ విద్యార్థులతోను, కార్మికులతోను ఏర్పడిన సంబంధాలు ఆ తర్వాత కాలంలో వారిని విస్తృతంగా కదిలించడానికి దోహదపడ్డాయి. ʹసౌత్ ఈస్ట్రన్ యూత్ కల్చరల్ అసోసియేషన్ʹ కళాకారులతో జననాట్య మండలి ట్రూప్ను ఆర్గనైజ్ చేశాను. గురజాడ కళామందిర్లో అమర వీరుల స్మారక సభగా ఒక పెద్ద బహిరంగ సభ జరపాలని ప్లాను వేసుకుని, అందులో ప్రదర్శించడానికి వంగపండు రాసిన ʹభూమి భాగోతంʹ నృత్యనాటిక రిహార్సల్స్ ప్రారంభించాం.

రైల్వే క్వార్టర్స్ మేడ మీద ఆ రిహార్సల్స్ నెల రోజుల పాటు కొనసాగాయి. భూస్వాములు, కరణ మునసబులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయి కొనసాగిస్తున్న దోపిడీని రైతాంగం ప్రతిఘటించాలనే సందేశంతో ఆ నృత్యనాటిక రూపొందింది. దుడ్డుకర్ర చేబూని రైతు మునసబు, కరణాలను పారదోలిన సన్నివేశాన్ని చేర్చాలని వంగపండుని నేను కోరినప్పుడు అందుకు ఆయన వెంటనే అంగీకరించి ʹఅరెఅరెఅరెఅరే మునసబూ సరి నీ రోజులు శరభ శరభ శరభా హశ్శరభ శరభʹ పాటను చేర్చారు.

గురజాడ కళామందిర్ సభలో 1977 జూలై 31న జరిగిన మొదటి ప్రదర్శన ప్రజల్ని ఉర్రూతలూగించింది. ప్రదర్శనను రక్తి కట్టించి జనరంజకం చేసినవారు రైతుగా అప్పారావు, కరణంగా శంకర్, మునసబుగా నాగేశ్వర్రావు, రాజకీయ నాయకుడిగా రమణారావు, రైతు భార్యగా నవత, హరిజన రైతుకూలీగా పరదేశినాయుడు, రైతు కూలీలుగా సుబ్బారావు, హరి, ఎస్ఐగా నరసింహ మొదలైనవారు, తెర వెనుక వంగపండు, పి.వి. రమణ, నళిని, పద్మిని పాఠలు పాడేవారు. తెర ముందు ఈ పాత్రలన్నీ తమతమ స్టయిల్లో స్టెప్పులేస్తూ, అభినయిస్తూ కథని నడుపుతుంటే రెండు కళ్లు చాలేవి కావు. ఆ తరువాత ఇదే జననాట్య మండలి ట్రూప్ విశాఖ జిల్లాలో అనేక ప్రదర్శనలిచ్చింది.

ప్రతి సమావేశంలో తొలుత విప్లవ గీతాలు ఆలపించేవారు. మొదట్లో శ్రీశ్రీ ʹకొంత మంది కుర్రవాళ్లుʹ, ʹఏటికేతం బట్టిʹ, వంగపండు రాసిన ʹఉందర్రా మాలపేటʹ, సుత్తీ కొడవలి గురుతుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నదిʹ మొదలైన పాటలు పాడితే, మేడేకి కొన్ని కార్మిక గీతాలు పాడేవాళ్లు.

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రూప్ తరలివెళ్తుంటే, ప్రదర్శనను మళ్లీ మళ్లీ చూడడం కోసం ప్రజలు అక్కడికి కూడా వచ్చేవాళ్లు. ఒకటిన్నర గంటల భూమి భాగోతానికి ముందు వెనుక డప్పు డాన్సు, ʹకొండలు పగలేసినంʹ, ʹజీతాల తమాషాʹ, పట్నవాసంʹ కూడా ఉండేది. ప్రదర్శనకి ముందు స్థానిక కార్యకర్తల ఉపన్యాసాలు, పాటలకి డాన్సులకి చిన్న వివరణలు ప్రజల్లో ఆసక్తిని నిలిపి ఉంచేది. ఈ ట్రూప్ విశాఖలోనే కాక, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించి ప్రదర్శనలు ఇచ్చింది. విరసం నాయకుడు చలసాని ప్రసాద్ ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు.

1977 నవంబర్లో ప్రళయ భీకరమైన తుఫాను, ఉప్పెన వచ్చి దివిసీమకు, కోస్తా జిల్లాలకు అపారమైన నష్టాన్ని కలిగించింది. విశాఖ జిల్లాలో శారద, వరాహ, తాండవ నదులు పొంగిపొర్లి వరదలు ముంచెత్తడంతో రైతాంగం, పల్లెకారుల జీవితాలు అతలాకుతల మయ్యాయి. విశాఖ నగరంలో వందలాది విద్యార్థులు ఆర్ఎస్యు, పిడబ్ల్యుఒ కింజ సమీకృతుమై ఇంటింటికీ, కొట్టుకొట్టుకూ తిరిగి చందాలు, బట్టలు సేకరించి ఎలమంచలి, అనకాపల్లి తాలూకాల్లోని అనేక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు నేరుగా సహకారాన్ని అందజేశారు. కలరా వాక్సిన్ అనేకమంది బాధితులకు ఇచ్చి ప్రాణాంతకమైన కలరా నుంచి వాళ్లని రక్షించారు.

ప్రభుత్వం సరఫరా చేసిన దుప్పట్లు, నష్టపరిహారం, ధాన్యం వారికి సక్రమంగా అందేలా చూశారు. వివిధ టీమ్స్ గా ఏర్పడిన విద్యార్థులు నడుంలోతు నీళ్లలో దిగి ఏడెనిమిది కిలోమీటర్లు కాలినడకన పయనించి సముద్ర తీర గ్రామాలకు చేరుకోవడం ప్రత్యేకించి పేర్కొనదగింది.

ఈ సహాయ కార్యక్రమాలను ఆరంభించేనాటికి ఆర్ఎస్యు నాయకులు రాజ్కుమార్ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. ఆయనతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు, నళిని, వసుంధర, కడలి, ఎడివి లక్ష్మి మొదలైన మెడికల్ స్టూడెంట్స్, ఇంకా అనేకమంది కలిసి టీమ్స్గా ఏర్పడి గ్రామాలకు తరలి వెళ్లారు.

కామ్రేడ్ వై. కోటేశ్వర్రావు జైలు నుంచి విడుదలై లా చదవడానికి వచ్చాడు. ఆయన, రాజ్ కుమార్, సుబ్బారాజు, రామకృష్ణ ప్రసాద్, నాగేశ్వర్రావు తదితరులు యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులను కూడగట్టారు. విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి వీరు ఎంతగానో దోహదం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన సాంఘిక సంక్షేమ హాస్టల్ పోరాటంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం పెద్ద ఎత్తున కదిలి రాస్తారోకో, ఘెరావ్, ధర్నాలకు దిగి విజయం సాధించారు.

విశాఖలో ప్రైవేట్ సిటీ బస్సులు విపరీతమైన స్పీడుతో వీర విహారం చేస్తూ ప్రజల ప్రాణాల్ని బలిగొనడం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. 1978 జూలై నెలలో ఒక ప్రమాదంలో అక్కడికక్కడే ఎనమండుగురు చనిపోయారు. విశాఖ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. ఎప్పటిలాగే బస్సు యజమానులు, అధికారులు శవ పంచాయితీ తతంగం పూర్తి చేసి, తర్వాత నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రమాద స్థలం నుంచి తప్పుకోవాలని చూశారు. కానీ రాడికల్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో సమీకృతులై, అక్కడిక్కకడే తగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలని పట్టుబట్టి విజయం సాధించారు.

అధికారులు, స్థానిక ఎంఎల్ఎలు సర్దిచెప్పి జనాన్ని పంపివేయాలని ఎంత ఆరాట పడినా ఫలితం లేకపోయింది. సంఘటనా స్థలానికి దగ్గర్లోనే ఉండి, పోరాటాన్ని నడుపుతున్న యువజన నాయకుల్ని గైడ్ చేయడం నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. ఆ తరువాత ʹసిటీ బస్సు సర్వీసులను జాతీయం చేయాలʹనే డిమాండ్తో వరుసగా నెల రోజుల పాటు సమ్మెలు, ప్రదర్శనలు, చివరకు మిలిటెంట్ పోరాటాలు జరిపాం. దీంతో ప్రభుత్వం దిగివచ్చి, ఆర్టిసి బస్సులను ప్రవేశపెట్టింది. ఇది విశాఖ ప్రజానీకం, రాడికల్స్ సాధించిన గొప్ప విజయం. ఈ పోరాటం సందర్భంగా విద్యార్థి యువజన నాయకులపై పోలీసులు అనేక అక్రమ కేసులు బనాయించారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. గ్లోబలైజేషన్లో భాగంగా విస్తరిస్తున్న ప్రైవేటీకరణ సమస్య ఈనాటికీ మనల్సి అనేక రూపాల్లో వేధిస్తూనే ఉంది.

ప్రతి కాలేజీలో వారం వారం ʹరాడికల్ వాయిస్ʹ గోడ పత్రికని క్రమం తప్పకుండా ప్రదర్శించేవాళ్లం. సమకాలీన సామాజిక రాజకీయ సమస్యలపై స్పందిస్తూ, ఒక్క పేజీలో ఆకట్లుకునే విధంగా విశ్లేషిస్తూ, రాబోయే సంచికలకోసం ఎదురుచూసే విధంగా వాటిని రూపొందించాం. నగర శివార్లలో డైరీఫారం కోసం చుట్టు పక్కల గ్రామాల రైతుల భూములను స్వాధీనం చేసుకుంటే, వారికి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ విద్యార్థులు అక్కడి రైతాంగాన్ని సమీకరించారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రూపొందించిన ʹగ్రామాలకు తరలండి క్యాంపెయిన్ʹలో మొదటి దశ విద్యార్థులకు రాజకీయ శిక్షణా తరగతులు 1978 మే నెలలో పరి రోజుల పాటు వెంకుపాలెం గ్రామంలో జరిగాయి.

రాజకీయ తరగతులు ముగించుకుని విద్యార్థులు చిన్న చిన్న దళాలుగా గ్రామాలకు తరలివెళ్లారు. ప్రతి గ్రామంలో వర్గ విశ్లేషణ చేసి, భూ యాజమాన్య వివరాలు సేకరించారు. ముఖ్యంగా పేద రైతు, వ్యవసాయ కూలీలపై కేంద్రీకరించి, యువజనులకు రాజకీయాలు బోధించడం, విప్లవ గీతాలు నేర్పడం, గ్రామ గ్రామాన యువజన సంఘాలు ఏర్పరచడం కార్యక్రమంగా స్వీకరించారు. ప్రజలతో మమేకం కావడంలో విద్యార్థుల చొరవ ఈ క్యాంపెయిన్ ద్వారా ఎలా పెంపొం దిందో, చారిత్రాత్మక కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలకు అది ఎలా నాందిపలికిందో, నేను రాసిన ʹఎపి ఆర్ఎస్యు - ఎ గ్లోరియస్ సాగా ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రగుల్ʹ అనే ఆంగ్ల పుస్తకంలో వివరంగా ఉంది.

ఈ క్యాంపెయిన్లో భాగంగానే సీతానగరం భూస్వామి సూర్యనారాయణ రాజు పెత్తందారీ చర్యలను మొండిపాలెం రైతు కూలీలు ప్రతిఘటించారు. ఈ క్యాంపెయిన్ మూలంగా అనేక గ్రామాల యువకులతో సంబంధాలు ఏర్పడ్డాయి. నీలకంఠపురం హరిజనుల భూమిని అక్రమంగా కాజేసిన పెత్తందార్లు పండించిన పంటలను రైతు కూలీలు స్వాధీనం చేసుకున్నారు. వెంకుపాలెం రైతాంగం పంచదార మిల్లు ఆస్తులను స్వాహా చేయాలనుకున్న మేనేజింగ్ డైరెక్టరు జివికె రాజు కుతంత్రాన్ని వమ్ము చేశారు. ప్రభుత్వ భూములనే కాక, దొంగ అప్పు పత్రాల పేరుతో పేద రైతు భూముల్ని కూడా కాజేసిన రాజాం భూస్వామి అక్రమాలకు వ్యతిరేకంగా రైతు కూలీలు సంఘటితపడ్డారు. ఇలా క్యాంపెయిన్ క్రమంలోనే కాక ఇంకా ముందు కూడా ఏర్పడిన పరిచయాలని సంఘటితపరుచుకోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజల పక్షాన నిలిచే కార్యకర్తలు తయారయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలను ఆకళింపు చేసుకుంటూఏ, వాటి పరిష్కారం కోసం యువజనులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రథమ జిల్లా మహాసభలు 1978లో విశాఖలో జయప్రదంగా జరిగాయి. వందలాది మంది విద్యార్థులు వరంగల్లో జరిగిన ఆర్ఎస్యు రెండవ రాష్ట్ర మహా సభలకు హాజరయ్యారు. రాజ్కుమార్ ప్రెసిడెంట్గా, రవి వైస్ ప్రెసిడెంట్గా, వసుంధర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లా రైతుకూలీ సంఘం ప్రథమ సహా సభలు 1979 ఏప్రిల్ 8న చోడవరం పట్టణంలో అత్యంత ఉత్సాహ పూరితంగా జరిగాయి. వివిధ తాలూకాల నుండి వచ్చిన సుమారు పన్నెండు వందల మంది రైతుకూలీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ వ్యవసాయ సమస్యలపై చిర్చంచి, రైతుకూలీ సంఘాన్ని అన్ని తాలూకాలకూ విస్తరింపచేసి, గ్రామ స్థాయిలో పటిష్టం చేయడానికి కార్యక్రమం రూపొందించారు. రైతు కూలీల దైనందిన పాక్షిక సమస్యలపై పోరాటాలు నిర్మిస్తూ, తద్వారా భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని సమరశీలంగా నిర్వహించి, ʹదున్నేవానికే భూమిʹ దక్కే విధంగా వ్యవసాయ విప్లవాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ఒక్కటే రైతు కూలీల సమస్యలకు నిజమైన పరిష్కారమని, అందుకోసం రైతాంగాన్ని చైతన్యవంతం చేసి సంఘటితపరచడం ప్రథమ కర్తవ్యంగా స్వీకరించాలని మహాసభ తీర్మానించింది. జిల్లా ఆర్వైఎల్ మహా సభలు మే 31న ఎలమంచలి పట్టణంలో జరిగాయి.

ఇదే కాలంలో, కామ్రేడ్ అప్పల సూరి కేంద్ర ఆర్గనైజింగ్ కమిటీకి ఆగస్టు తీర్మానాన్ని పంపలేదనే కారణం జూపి పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ సభ్యులు రాష్ట్ర కమిటీకి ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. రాజకీయ నిర్మాణ సమస్యలపై అప్పల సూరితో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కామ్రేడ్ కె.ఎస్. విశాఖకు వచ్చి, పార్టీ కార్యకర్తలను, పార్టీ సానుభూతి పరులను విడివిడిగా సమావేశపరిచి, పార్టీలో ఏర్పడిన సంక్షోభం గురించి వివరించారు. గంటి ప్రసాదు, దాలినాయుడు, షిప్యార్డు సత్యం, ఎర్నెస్ట్ తదితరులు తప్ప మరెవ్వరూ అప్పల సూరి రాజకీయాలను సమర్థించలేదు. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోని పార్టీ సభ్యులందరూ రాష్ట్ర కమిటీ నిర్ణయాలని ఆమోదించారు. చాలా తక్కువ నష్టంతోనే ఈ సంక్షోభం నుంచి బయటపడగలిగాం.

జనతా హయంలో ఏర్పడిన లీగల్ అవకాశాలను విశాఖ కామ్రేడ్స్ శక్తివంతంగా ఉపయోగించుకోగలిగారు. విప్లవ ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగించగలిగారు. వేలాది పీడిత రైతు కూలీలతో సంబంధాలు ఏర్పడ్డాయి. రాడికల్స్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఏ సమస్యని పరిష్కరించాలన్నా వారికి తెలియజేయాలని, వారే సమర్థవంతంగా సాధిస్తారని నమ్మకం ఏర్పడింది. విప్లవమే వృత్తిగా స్వీకరించిన పది మందికి పైగా ఆర్గనైజర్లు తయారయ్యారు. రాజ్కుమార్ పూర్తికాలం కార్యకర్తగా పనిచేయడానికి సంసిద్ధమయ్యాడు. నాస్తిక సంఘం నుంచి వచ్చిన లా విద్యార్థి కామ్రేడ్ విమల్ రాడికల్ యువజన సంఘం కార్యక్రమాలపై కేంద్రీకరించారు. మహిళా రంగంలో పనిచేయడం కోసం కామ్రేడ్ పద్మ రాష్ట్ర కమిటీ పంపగా విశాఖ వచ్చింది. కృష్ణ, అజయ్లు జెఎన్ఎంపై కేంద్రీకరించారు. ఐదు తాలూకాల్లో ప్రజా సంఘాల యూనిట్లు ఏర్పడ్డాయి. కాని రాష్ట్ర కమిటీ చేపట్టిన ʹతప్పులు సరిదిద్దుకుని సంఘటితపడి పురోగమిద్దాంʹ అనే మూడవ క్యాంపెయిన్ను పరిపూర్తి చేయడం మిగిలే ఉంది.

1980 ఏప్రిల్ 22న సిద్ధాంత రాజకీయ సమైక్యత ప్రాతిపదికపై భారత కమ్మూనిస్టు పార్టీ (మా-లె) పీపుల్స్వార్ కేంద్ర కమిటీ ఏర్పడింది. కామ్రేడ్ కె.ఎస్. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. గత ఐదేళ్ల ఆత్మ విమర్శ, ఎత్తుగడల పంథా, పార్టీ కార్యక్రమం, నిబంధనావళి - వీటిపై ఏర్పడిన సమైక్యత ఆధారంగానే వివిధ రాష్ట్రాల మార్క్సిస్టు - లెనినిస్టు గ్రూపులతో కలిసి పార్టీ కేంద్ర కమిటీ ఏర్పడింది. భారత విప్లవ చరిత్రలో, ముఖ్యంగా భారత విప్లవకారులను సమైక్యపరిచే ప్రయత్నంలో ఇది ఒక ముఖ్యమైన మలుపు.

విశాఖ జిల్లాలో సుమారు ఒకే రాజకీయ నిర్మాణం స్థాయి కలిగిన నాయకత్వ టీం ఏర్పడడంతో జిల్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడానికి వీలుగా 1980 ఆరంభంలో భా.క.పా (మా-లె) ప్రథమ జిల్లా మహాసభ జరిగింది. సుమారు ఇరవైమంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర కమిటీ ప్రతినిధులుగా సత్యమూర్తి మహాసభలో పాల్గొన్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా నేను, రాజ్కుమార్, గంటి రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం. జిల్లా కమిటీ సెక్రటరీగా నేను ఎన్నికయ్యాను. జిల్లా కమిటీ సమావేశాలు రెండు మాత్రమే జరిగాయి.

సెప్టెంబర్ నెలలో జరిగిన భా.క.పా (మా-లె) 12వ ఆంధ్ర రాష్ట్ర కాన్ఫరెన్స్లో నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఆ కాన్ఫరెన్స్ తరువాత రాజ్కుమార్ వివిధ రాష్ట్రాల విద్యార్థి ఉద్యమాన్ని సమన్వయ పరచడం కోసం జిల్లాను వదిలి వెళ్లవలసి వచ్చింది. గంటి రమేష్ అటవీ ప్రాంతానికి వెళ్లడంతో ఆచరణలో జిల్లా కమిటీ బాధ్యతలన్నీ నేనే నిర్వహించాను.

ఇదే కాలంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థి యువజనులపై, రైతాంగంపై తీవ్రమైన నిర్బంధం అమలయింది. అరెస్టులు, అక్రమ కేసులు, లాఠీ చార్జీలు, ఇళ్లపై దాడులు సర్వసాధారణమయ్యాయి. రాజాం భూస్వామి ప్రజల ఆగ్రహానికి గురైన తరువాత అరెస్టు చేసిన వారందరినీ చిత్రహింసల పాల్జేయడం నిత్యకృత్యమై పోయింది. తీవ్ర చిత్రహింసలకు గురై అనారోగ్యంతో కామ్రేడ్ రాజారావు అమరులయ్యారు. పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నారాయణరెడ్డి, శంకర్రెడ్డిలు కెజిఎచ్ నుంచి తప్పించుకోవడంతో విద్యార్థులపై తప్పుడు కేసులు బనాయించారు.

ఈ నిర్బంధాలని అధిగమించడం కోసం అటవీ ప్రాంతానికి విస్తరించాలని ప్రయత్నించాం. ఆ ప్రయత్నంలో భాగంగానే కామ్రేడ్ తిరుపతిని చింతపల్లి అడవిలోని గ్రామాలకు, కామ్రేడ్ సురేష్ని అరకులోయ ప్రాంతానికి, కామ్రేడ్ పాపినాయుడిని పాడేరు గ్రామాలకు కేంద్ర ఆర్గనైజర్లుగా పంపించాం. కామ్రేడ్ జగన్, నర్సీపట్నం యువకులు కలిసి, వెదురు కూపీ అటవీ కూలీలను సంఘటితపరచడానికి వెళ్లారు.

దీర్ఘకాలిక సాయుధ పోరాటంలో అటవీ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత గురించి కె.ఎస్. పలుమార్లు చెప్పి ఉండడం చేత ఈ నిర్ణయాలు వెంటవెంటనే తీసుకోగలిగాను. వెదురుకూపీ కూలీలు సంఘా లలో చేరి ఆరంభించిన సమ్మె మిలిటెంట్ రూపం తీసుకుంది. పేపరు మిల్లు లారీల నిలిపివేత, వెదురుకూపీల దగ్ధం, రస్తారోకో కార్యక్రమాలతో యాజమాన్యం దిగివచ్చింది. అరకు ఏరియాలో గిరిజనులు విస్తృతంగా కదిలారు. చింతపల్లిలో గిరిజనుల ప్రదర్శనలు జరిగాయి.

అటు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతాంగ పోరాటాలు పెద్ద ఎత్తున పెల్లుబికాయి. భూస్వాములు ఊళ్లు విడిచి పారిపోయారు. ప్రభుత్వం జగిత్యాల, సిరిసిల్లా తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. భూస్వాములపై రైతాంగ పోరాటం ఉధృతంగా పాకి అనేక విజయాలు సాధించింది. ఆ పోరాటాన్ని మరింత ఉన్నత దశకు తీసుకెళ్లాల్సిన తక్షణ అవసరం ఏర్పడింది. ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు గోదావరికీ, రైలు రోడ్డుకూ మధ్యగల ప్రాంతాన్ని ʹగెరిల్లా జోన్ʹగా అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో అందుకు సన్నాహాలు ప్రారంభించిన కామ్రేడ్ కె.ఎస్. జిల్లా కమిటీ సమావేశాలలో నిమగ్న మయ్యారు. కరీంనగర్-ఆదిలాబాద్ కామ్రేడ్స్ ఆదిలాబాద్, మహారాష్ట్ర అడవిలోకి, వరంగల్-ఖమ్మం కామ్రేడ్స్ బస్తర్ అడవిలోకి తరలి వెళ్లాలని నిశ్చయించుకుని దళాలుగా ఏర్పడ్డారు. ఇదంతా ఒక పథకం ప్రకారం, ʹగెరిల్లా జోన్ స్థావర ప్రాంతాల ఏర్పాటుʹ అనే ఒక సమగ్ర వ్యూహంలో భాగంగానే కొనసాగింది.

ఆ సమయంలోనే కె.ఎస్.ను కలుసుకున్న నేను చింతపల్లి, అరకు ఫారెస్టులో గిరిజనుల్ని సమీకరించడం కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించాను. కేంద్ర ఆర్గనైజర్లు బాధ్యతలు చేపట్టి విడివిడిగా వ్యక్తులుగా పనిచేస్తున్న క్రమం గురించి తెలిపాను. అక్కడి దారుణమైన దోపిడీ పరిస్థితులను, ప్రజలు పార్టీ కార్యకర్తలను ఉత్సాహంగా ఆహ్వానిస్తున్న తీరు గురించి వివరించాను. కె.ఎస్. ఎంతో శ్రద్ధతో విని, చింతపల్లి మన్యం ఫారెస్టులో ప్రవేశించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. తూర్పు గోదావరి రంపచోడవరం ఫారెస్టులో విమోచన గ్రూపు దళాలు చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి కనుక అక్కడికి వెళ్లకుండా, మిగిలిన ప్రాంతాలలో ప్రవేశించాలని సలహానిచ్చారు.

దళ సభ్యులందరినీ సెంటరు నుంచి పంపలేం, ముగ్గిరిని మాత్రమే పంపగలం. కనుక వారికి తోడు మరో ముగ్గురు విశాఖ కామ్రేడ్స్ని కలుపుకుంటే దళం తక్షణమే ఏర్పరచ వచ్చని సూచించి, ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కామ్రేడ్ విశ్వేశ్వర్రావు, గంగన్న (నంబల్ల కేశవరావు), రంగన్నలను రాష్ట్ర కమిటీ సెంటర్ పంపగా, విశాఖ జిల్లా కామ్రేడ్ తిరుపతి పట్నాయక్, సురేష్, చిన్న నారాయణలు వారితో కలిశారు. ఫలితంగా 1981 ఆరంభంలో చింతపల్లి మొదటి గెరిల్లా రైతాంగ దళం ఏర్పడింది. దానికి కమాండర్ విశ్వేశ్వర్రావు.

దళ కార్యకలాపాలు ఆరంభమైన కొద్ది రోజులకే గంగన్న, రంగన్నలు అరెస్టయ్యారు. వెంటనే మరో ముగ్గురు విశాఖ కామ్రేడ్స్ గంటి రమేష్, మౌలా, నాగులపల్లి సత్యంలను ఫారెస్టుకి పంపి దళాన్ని పునర్నిర్మించాం. చింతపల్లి తాలూకా గ్రామాలతో పాటు సరిహద్దులో ఉన్న తూర్పు గోదావరి అటవీ గ్రామాలను కూడా దళం కవర్ చేసింది. ప్రారంభంలో దళ సభ్యుల వద్ద కొద్దిపాటి ఆయుధాలే ఉండేవి. ఆ దళం 1981 సెప్టెంబర్ వరకు కొనసాగింది.

ఈ కాలంలో మన్యం గిరిజన ప్రజానీకం విస్తృతంగా కదిలారు. అనేక పోరాటాలు చేపట్టారు. దళ కమాండర్ విశ్వేశ్వర్రావు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో చేరడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత గంటి రమేష్ దళ కమాండర్ బాధ్యతలు నిర్వహించారు. అనతి కాలంలోనే చింతపల్లి ప్రాంతం గిరిజనోద్యమానికి బలమైన కేంద్రంగా పెంపొందింది. ప్రారంభంలో చింతపల్లి దళం విశాఖ జిల్లా కమిటీ కింద పనిచేసినా, అటు తరువాత రాష్ట్ర కమిటీ, ఫారెస్టు కమిటీల గైడెన్సు కింద తన విప్లవ కృషి కొనసాగించింది.

రైతాంగదళం మన్యంలో అడుగుపెట్టిన తొలిరోజుల్లో అనేక ఒడిదుడు కులు ఎదురైనా, విశాఖ ఉద్యమం గమనించదగిన స్థాయిలో పెంపొంద డం వల్ల విప్లవ శక్తులు దళాన్ని కాపాడుకోగలిగాయి. అక్కడ దళ కార్యకలాపాలు గత ముప్పది ఏళ్లుగా క్రమం తప్పకుండా కొనసాగూతూనే ఉన్నాయి. మైదాన ప్రాంత కేడర్తో మొదటి దళం ఏర్పడినా, ఆ తరువాత గిరిజన యువతీ యువకులు దళాల్లోకి చేరడం ఆరంభమయింది. దళాల సంఖ్య పెరిగింది. యావత్తు మన్యం ప్రాంత గ్రామాలన్నింటికీ గిరిజన సంఘ కార్యకలాపాలు విస్తరించాయి. సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకు ఉద్యమం విస్తరించింది. అనేక మంది కామ్రేడ్స్ ఉద్యమ పురోగమన క్రమంలో నేలకొరిగారు. కామ్రేడ్స్ రాజారావు, తిరుపతి పట్నాయక్, గంటి రమేష్, రాజ్కుమార్లు అమరులయ్యారు. విప్లవ శక్తులు అపారమైన పోరాట అనుభవాన్ని గడించాయి.

నక్సల్చరీలో సంతాల్ తెగ గిరిజనుడు ఎగరేసిన ఎర్రజెండా నేడు మన్యం అంతటా రెపరెపలాడుతోంది. సంతాల్ గిరిజనుడి తెగువనీ, అల్లూరి పోరాట వారసత్వాన్నీ, సిక్కోలు సవర సాహసాన్నీ పుణికి పుచ్చుకుని గిరిజన రైతాంగ విప్లవోద్యమం నక్సల్బరీ పంథా వెలుగులో మున్ముందుకే సాగుతోంది. నాతో పనిచేసిన అనేక మంది కామ్రేడ్స్ ఈనాడు లేరు. వారంతా అమరులయ్యారు. కానీ వారందరి విప్లవ స్ఫూర్తి పీడిత ప్రజల హృదయాల్లో సదా నిలిచే ఉంటుంది.

యాభై వసంతాల నక్సల్బరీ పోరాటానికి విప్లవ జేజేలు!

- డాక్టర్ శ్రీనివాస్

(రచయిత ʹకె.ఎస్. స్మారక కమిటీʹ సభ్యులు, ఫ్యామిలీ ఫిజీషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నారు)

Keywords : naxalbari, maoists, naxalites, visakhapatnam, revolutionery
(2021-07-29 06:55:46)No. of visitors : 3278

Suggested Posts


Maoists are the Real Communists - Jaison C Cooper

Itʹs 50 years and the spirit continues. Itʹs a movement that has been loved and hated by many alike. Itʹs also a movement nobody can never ignore. But has it been understood properly? Lots of blood, violence, sacrifice, nostalgia, romance and adventurism have been attached to it. There is no limit to the misunderstanding on the Naxal movement....

నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు

ఈ కాలంలో ఆయన మావద్దకు వచ్చిన ఓ రోజు తన అంగీ పక్కజేబు నుండి మడత పెట్టి ఉన్న ఓ కాగితాన్ని బయటకు తీసి మడతవిప్పి ఇది చూడండని నా చేతికిచ్చాడు. చూస్తే అది కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక రేఖా చిత్రం. ఎవరో గజిబిజిగా చేత్తో గీసి ఇచ్చిన ఓ బొమ్మ. ఆలోచించి పోల్చుకుంటే అది ఓ చేతిబాంబు బొమ్మని అర్థమైంది. అంతకు మించి ఇంకే వివరాలు అందులో లేవు.

 నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు (2)

నక్సల్బరీ ఉద్యమ ఆశయాల పట్ల, విలువలపట్ల ఎంతో గౌరవం ఉంది. అందుచేతనే నక్సల్బరీ రాజకీయంతో నేను అనుబంధం ఏర్పర్చుకుని కొనసాగిస్తున్నాను. అంతేగాక ఒక్క నక్సల్బరీ రాజకీయ పంథా మినహా, భారత దేశంలో ఇప్పటికి ఉనికిలో ఉన్న మరే ఇతర రాజకీయ పంథా భారత దేశ విప్లవాన్ని ముందుకు నడిపించలేదని రుజువైంది....

Germany, Berlin: Long live Peopleʹs War! Long live Naxalbari !

On 20 May, an international action day took place on the occasion of the 50th anniversary of the Naxalbari insurrection....

ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజపూరితంగా సాగుతున్న నక్సల్బరీ వారోత్సవాలు

కెనడా, లండన్, ఇటలీ, బాంగ్లాదేశ్ తో సహా అనేక దేశాల్లో మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలు, సంఘాలు భారత విప్లవానికి వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రతినపూనాయి. ఇటు దేశంలో బీహార్ మొదలుకొని కేరళ వరకు పట్టణాల్లొ, పల్లెల్లో, అడవుల్లో వేలాది సభలు జరిగాయి...

Naxalbari: its relevance for today… and for tomorrow

The stormy period of the nineteen sixties gave birth in several countries to uprisings, movements and organisations that continue to have a lasting impact to this day...

50 ఏండ్ల నక్సల్బరీ... పులకించిన బొడ్డపాడు

శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ బొడ్డపాడు. ఆ పోరాటానికి ఎంతోమంది వీరులను అందించిన గడ్డ బొడ్డపాడు. శ్రీకాకుళ సాయుధ పోరాట చరిత్రలో ఆ ఊరిది ఓ పేజీ అలాంటి గ్రామం...

Bangladesh: Celebration of 50 years of Naxalbari..

The importance and dignity of the peasant uprising of Naxalbari is immense in the communist movement of South Asia . With the influence of Chinaʹs cultural revolution in 1967, the peasantʹs movement in West Bengalʹs rural areas was the voices of the struggles...

50 Years of Naxalbari in Canada

The villages, towns, soils, furrows of fields, woods and mountains, rivulets and rivers of vast India turned red with the warm blood of these thousands of immortal martyrs which included hundreds of women comrades. In the thorny and tortuous...

Bangladesh: 50th Anniversary of Naxalbari celebrated in Dhaka

Procession and discussion meeting held at 50th anniversary of Naxalbari was held in Dhaka on 25th May. At around 3:30 pm a procession started from the Press Club to Progoti conference room, Mukti Bhawan, 2 Purana Paltan in Dhaka. The meeting and Discussion was led by Jafar Hossain, assisted by Atif Anik...

Search Engine

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ
ప్రతి మనిషి జేబులో పోలీసు!
బాలికలపై సామూహిక అత్యాచారం - బాధితులదే తప్పన్న గోవా ముఖ్యమంత్రి
kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI
పెగసస్ వ్యవహారం: పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరగకుండా అడ్డుకున్న‌ బీజేపీ
చరిత్రాకాశంలో ధ్రువనక్షత్రం
Learn From Charu Mazumdar! -Communist Workers Front, Canada
ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI
Naxalbari: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
పోలీసుల దుర్మార్గం - యువకుడి ఆత్మహత్య‌
సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !
ఢిల్లీలో సోమవారం మహిళా రైతుల ప్రదర్శన‌
UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు
పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు సహాయం చేయండి -మావోయిస్టు పార్టీ పిలుపు
భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు
దేశ రాజధానిలో రేపు రైతు పార్లమెంటు - అనుమతి ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం
మోడీని విమర్షించినందుకు జర్నలిస్టును ఉద్యోగం నుండి తీసేసిన టీవీ ఛానల్
రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!
అమ్రాబాద్ చెంచులపై ఫారెస్టు అధికారుల దాడులు - పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ‌
UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి
ఒక వైపు ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు... మరో వైపు 100 మంది రైతులపై దేశద్రోహం కేసులు
more..


నక్సల్బరీ