నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు

నక్సల్బరీ

(వీక్షణం మాసపత్రిక మే 2017 సంచికలో ప్రచురించబడినది)

ఈ రోజు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) బీజం నక్సల్బరీలో మొలకెత్తి, ఓ చెట్టుగా విస్తరించడానికి 50 ఏళ్లు పట్టింది. నక్సల్బరీ వసంత మేఘగర్జన నాటి నుండి ఈ ఏభై ఏళ్ల భారత పాలకవర్గ చరిత్ర అంతా నక్సలబరీ ఉద్యమాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాల చరిత్రే! ప్రజా ఉద్యమాల ఊపిరి తీసేసే చరిత్రే! మరోవైపు నుండి చూస్తే ఈ ఏభై ఏళ్ల నక్సల్బరీ చరిత్ర పాలక వర్గ దమనకాండను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాయుద్ధ నిర్మాణాన్ని పట్టువిడవక కొనసాగిస్తున్న చరిత్రే!

నక్సల్బరీ ప్రేరణతో మొదలైన ఈ ప్రజాయుద్ధ నిర్మాణం రిక్తహస్తాల తోనే మొదలైంది. చైనా శ్రామికవర్గ విప్లవం, నక్సల్బరీ ఉద్యమాలు అందించిన చైతన్య-ఉత్తేజాలు, అవి చూపిన మార్గం విప్లవోద్యమ నిర్మాణానికి ఆనాటి యువతకు అందివచ్చిన ముడిసరుకు. ఈ ముడిసరుకుతో త్యాగాలను రంగరించి, విప్లవ ఆచరణను జోడించి ప్రజాయుద్ధ నిర్మాణానికి ఎందరు ఎన్నివిధాలుగా పనిచేసారో, తమ జీవితాలను అర్పణ చేశారో తెలుసుకుని, పరిశోధించి సంపూర్ణంగా, సమగ్రంగా గ్రంథస్తం చేస్తేగాని, ఓ సమ్యక్ రూపం ఇస్తేగాని నక్సల్బరీ ఉద్యమానికి న్యాయం జరగదు.

నక్సల్బరీ స్పిరిట్ వేగంగా విస్తరించాల్సి ఉన్న చారిత్రిక సందర్భం లోకి ఇప్పుడు ప్రజాయుద్ధం ప్రవేశించింది. ఈ యుద్ధం మరింత వేగవంతగా, విస్తృతంగా కొనసాగాల్సిన ఆవశ్యకత, బాధ్యత ఇప్పటి యువతరంపై ఉంది. నక్సల్బరీ నడిచివచ్చిన మార్గాన్ని, సృష్టించిన త్యాగపూరిత చరిత్రను వారు సొంతం చేసుకుని పలు రీతుల్లో ప్రజా యుద్ధాన్ని కొనసాగించాల్సిన సమయమిది.

పాత తరానికి చెందిన నేను, నక్సల్బరీ రాజకీయాలతో నాకు ఏర్పడ్డ చిరు అనుబంధం నుండి, నా అనుభవాల జ్ఞాపకాల నుండి కొన్ని నక్సల్బరీ ఉద్యమ నిర్మాణ సంఘటనలను ఇప్పటి యువతకు ఉపయోగ పడతాయనే ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

రిక్త హస్తాలతో ఇద్దరు యువకులు హైదరాబాద్ నగరంలో సనత్నగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో 1970-1973 మధ్య కాలంలో కార్మిక శ్రేణుల్లో విప్లవోద్యమాన్ని బీజరూపంలో ఎలా నిర్మాణం చేసారో మననం చేసుకోవడం ద్వారా నక్సల్బరీ స్పిరిట్ అప్పటి యువకులను ప్రేరేపించి నడిపించిన తీరు అర్థం చేసుకోవచ్చు.

ఈ యువకులిద్దరిలో ఒకరి పేరు రవి. ఇతను ఐటిఐ చేసి ఆల్విన్ ఫ్యాక్టరీలో ఎప్రంటీస్గా పనిచేసేవాడు. మరొకతని పేరు కుమార్. ఇతను ఇంజనీరింగ్ పాసై ఉద్యోగం కోసం హైద్రాబాద్ వచ్చి, రెండేళ్లు ట్రైనీ ఇంజనీర్గా ఒక ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసాడు. తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేసే అవకాశం వచ్చి తిరిగి విద్యార్థిగా మారాడు. వీరిద్దరికీ ఒక సాహిత్య సభలో పరిచయమైంది. ఆ పరిచయం భావ సారూప్యతతో చిక్కనైన స్నేహంగా మారింది. వీరిరువురూ తరచూ కలుస్తూ తమ ఆలోచనలను పంచుకునేవారు. వారి ఆలోచన, ధ్యాస అంతా నక్సల్బరీ సృష్టించిన ప్రజా ఉద్యమాలపైనే, వాటి గురించే!

కేవలం చర్చలతో కాలం గడిపే బదులు, తాము కూడా నక్సల్బరీ స్పిరిట్తో కార్మికుల్లో పని చేయాలని నిర్ణయించుకున్నారు. రవికి, తనలానే ఉద్యోగాల వెతుకులాటలో హైదరాబాద్ నగరం చేరుకుని కార్మికవాడల్లో నివసిస్తున్న యువకార్మికులతో స్నేహ పరిచయాలున్నాయి. అప్పటికే కార్మిక వర్గం కాంగ్రెస్, కమ్యునిస్టు, సోషలిస్టు పార్టీల ట్రేడ్ యూనియన్ల ప్రభావంలో ఉంది.

కార్మిక భావజాలమంతా బూర్జువావర్గ వాతావరణంతో కలుషితమై ఉందని రవి ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. ఈ వాతావరణ ప్రభావం కొత్తతరం యువకులపై పడకుండా ప్రచార కార్యక్రమం చేపట్టాలని తన మిత్రుడు కుమార్తో ఎప్పుడూ అంటుండేవాడు. అప్పటికి వాళ్లకి మార్క్సిస్టు స్పృహే గాని ఏమంత సైద్ధాంతిక జ్ఞానం, కార్మికోద్యమ నిర్మాణ అనుభవం లేదు. వాళ్లిద్దరూ తరచూ చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు.

ముందుగా కమ్యూనిస్టు ప్రణాళికను క్షుణ్ణంగా చదివి, అవగాహనను పెంచుకోవాలని, ఆ అవగాహనతో యువకార్మిక మిత్రులను కూడా కమ్యూనిస్టు ప్రణాళికను చదవమని ప్రోత్సహించాలని, దానిపై చర్చను ప్రోత్సహించాలని, ఆ క్రమంలో కార్మిక సమస్యలను, ఇతర సామాజిక అంశాలను చర్చించాలని, మార్క్సిస్టు-లెనినిస్ట్ అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని అనుకున్నారు. ప్రతి సాయంకాలం ఒక్కొక్క మిత్రుణ్ణి కలవడం, అతనితో కలిసి తిని, అతని రూములోనే అవకాశాన్ని బట్టి నిద్రపోవడం, ఈ క్రమంలో కమ్యూనిస్ట్ ప్రణాళికను పరిచయం చేయడం, చదవమని ప్రోత్సహించడం, ప్రణాళిక కాపీ ఇవ్వడం, దేశంలో జరుగుతున్న విప్లవోద్యమ రాజకీయాలను, చుట్టూ ఉన్న కార్మిక జీవన పరిస్థితులను చర్చించడం, ఇలా కొన్ని నెలల కాలంలో వారిరువురు ఓ కార్మిక మిత్రబృందాన్ని కూడగట్టారు. రమారమి ఒక 50 మంది యువకులు ఈ బృందంలో జమకూడారు. వీరిలో చాలా మంది తెలంగాణ జిల్లాల గ్రామాల నుండి వచ్చినవారే. కోస్తా నుండి వచ్చిన వారు చాల తక్కువే అని చెప్పాలి.

ఈ బృందంలోని వారంతా వారి వారి గ్రామాల రాజకీయ, సామాజిక స్థితిగతులనుబట్టి వివిధ చైతన్య స్థాయిల్లో ఉండేవారు. బూర్జువా లేక రివిజినిస్టు రాజకీయాల ప్రభావం ప్రబలంగానే ఉండేది. అయితే నక్సల్బరీ ఉద్యమం సృష్టించిన దోపిడీ వ్యతిరేక విప్లవ మార్పుల పట్ల మక్కువను ప్రదర్శించే వారు. ఆ విప్లవ మార్గంలో అమరులవుతున్న వారి పట్ల, వారి ఆచరణ పట్ల వారికి ప్రేమాభిమానాలుండేవి. వారి త్యాగాల పట్ల ఆరాధనా భావముండేది.

ఇటువంటి స్థితి నుండి కమ్యూనిస్ట్ అధ్యయన సెల్స్ నిర్మాణం చెయ్యాలనే ఆలోచన ఈ ఇరువురు మిత్రులకు వచ్చింది. దానితో, ఎక్కువ ఉత్సాహవంతులతో మొదలుపెట్టి, ఒక్కొక్క సెల్లో 5 నుండి 6 గురు సభ్యులను సమీకరించడం మొదలుపెట్టారు. అలా 6 నెలల కాలంలో 10 సెల్స్ వరకు నిర్మాణం చేశారు. ఇందులో కొన్ని ఉత్సాహవంతంగా నడిస్తే, కొన్ని కుంటుకుంటూ నడిచేవి. వారంలో ప్రతిరోజు సాయంకాలం ఒక సెల్ మీటింగ్ నడిపేవారు. ప్రతి మీటింగుకు రవి తప్పక హాజరైతే, రొటేషన్ పద్ధతిలో కుమార్ ప్రశ్నల-జవాబుల, చర్చల సమావేశాలకు హాజరయ్యేవాడు. ఫ్యాక్టరీ షిఫ్టుల్లో పనిచేసే వారిని, వారివారి సమయాను కూలతను బట్టి ఈ సెల్ సమావేశాల్లో పాల్గొనేటట్లు చూసేవారు.

ఈ సెల్ సమావేశాల్లో సభ్యులు తాము పనిచేస్తున్న ఫ్యాక్టరీల్లో, తమ తమ గ్రామాల్లో జరుగుతున్న దోపిడీ విధానాలను, దేశంలో పలు చోట్ల ఇటువంటి పెత్తందారీ శక్తులపై నక్సలైట్ ఉద్యమం చేస్తున్న పోరాట వివరాలను చర్చకు తెచ్చేవారు. ఈ చర్యలపై భిన్నాభిప్రాయాలుండేవి.

ఇటువంటి పురోగామి సెల్ అంతర్గత సమావేశానికి ఓమారు చెరబండరాజు, వరవరరావులను ఆహ్వానించారు. ఆ సమావేశంలో సెల్ సభ్యులు లేవనెత్తిన అనేక అంశాలను, ప్రశ్నలను విని వారు హర్షం వ్యక్తం చేశారు. సభ్యుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానమిస్తూ విప్లవ సాహిత్యాన్ని, మార్క్సిస్టు అధ్యయనాన్ని కొనసాగించమని; స్వయం కృషితో స్వతంత్ర కార్మికోద్యమ నిర్మాణానికి పూనుకోవడం, నక్సల్బరీ స్పిరిట్తో పనిచేయడం మంచి పనని, దానిని మరింత ఓరిమితో, నిష్ఠతో కొనసాగించమని వారు సెల్ సభ్యులను ప్రోత్సహించారు.

తదనంతరం ఈ సెల్ సభ్యుల నుండి ఒక కోర్ టీమును తయారు చేసుకుని వారి చొరవతో పారిశ్రామిక ప్రాంతాల్లో గోడ రాతలు, విప్లవ నినాదాలు, దగాకోరు యూనియన్లపై, కార్మికులను మోసాలు చేస్తున్న కార్మిక యూనియన్ నాయకులపై విమర్శనాత్మక నినాదాలు, హెచ్చరికలు రాసేవారు. ఇటువంటి వారి చర్యలను, వారు కార్మికులకు చేస్తున్న అన్యాయాలను, వారి వల్ల కార్మికులకు జరుగుతున్న నష్టాలను, కార్మికుల ఐక్యతను వారు ఎలా అడ్డుకుంటున్నారో వివరిస్తూ కార్మికుల సంఘటిత శక్తితో ఇటువంటి కార్మికవర్గ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాలని ఓ నాలుగు పేజీల కరపత్రాన్ని 2000 కాపీలు ముద్రించి సనత్నగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో పంచారు.

ఇటువంటి కరపత్రం ఒకటి రాయాలని, ముందుగా సెల్ సభ్యుడు కాని ఓ కార్మిక మిత్రుడు తరచూ కుమార్ను కలుస్తూ ఒత్తిడి పెట్టేవాడు. అప్పట్లో ఇతను శ్రీరామ్ రిఫ్రిజరేషన్ కంపెనీలో పనిచేసేవాడు. ఇతను ఆ ఫ్యాక్టరీ ఎ.ఐ.టి.యు.సి యూనియన్లో సభ్యుడిగా ఉండేవాడు. వాళ్ల యూనియన్ భాగోతం ఇతనికి నచ్చక యూనియన్ నాయకులపై విమర్శ పెట్టేవాడు. ఇతర కార్మికులతో నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాడు. ఇతను అనంతపూర్ జిల్లావాసినని, నక్సల్ నాయకుడు రవూఫ్కు చుట్టాన్నని చెప్పేవాడు. ఇతను ఇచ్చిన సమాచారంతోనూ, ప్రోద్బలం తోను, పలు సెల్ సమావేశాల్లో కార్మిక నాయకుల ఆగడాలపై, మేనేజ్మెంట్లతో వాళ్ల లాలూచీలపై చర్చకు వచ్చిన ఇతర సమాచారంతోను కుమార్ ఈ నాలుగు పేజీల కరపత్రం తయారుచేసాడు. దీన్ని సెల్ మీటింగుల్లో చదివి వినిపించిన తరువాత మెజారిటీ సభ్యుల ఆమోదంతో అచ్చువేసి పంచారు.

ఈ కరపత్రం పంచడంలో అనంతపూర్ కార్మిక మిత్రుడు, రవి ఎక్కువ చొరవతో పనిచేసారు. ఈ కరపత్రం పంచడంలో కూడా కార్మిక మిత్రులు కొత్త పద్ధతులు అవలంభించారు. పెద్ద, మధ్య తరహా పరిశ్రమల గేట్ల ముందు రాత్రి వేళల్లో చిన్న చిన్న దొంతర్లు పెట్టి ఎగిరిపోకుండా బరువులు పెట్టేవారు. కొన్ని కరపత్రాలు వెదజల్లేవారు. అప్పట్లో కార్మికులు సైకిళ్లు, బస్సుల్లోనే ప్రయాణించే వారు కాబట్టి రద్దీ చౌరాస్తాల్లో, బస్సు స్టాపుల్లో, బస్స్టాండ్లలో పంచేవారు. విప్లవ అభిమానులకు స్వయంగా అంద చేసేవారు. కార్మికుల నివాస ప్రాంతాల్లో చీకట్లో పంచడం, వెదజల్లడం చేసేవారు. కార్మిక నాయకుల ఇళ్ల ముందు విసిరి వచ్చేవారు. పగటిపూట కొంతమంది కార్మికుల ఇళ్లకు వెళ్లి మహిళలకు కరపత్రాలు ఇచ్చే వారు.

మొత్తానికి ఈ కరపత్రం సనత్నగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో అలజడి సృష్టించింది. చర్చనీయాంశమైంది. ఇంతవరకు వచ్చేక కార్మిక నాయకులు, పోలీసులు ఊరుకుంటారా? వాళ్లకు అర్థమైంది ఈ కరపత్రం వెనుక ఏదో నిర్మాణం ఉందని, అది నక్సల్బరీ భావజాలంతో పనిచేస్తోందని, బహుశా నక్సలైట్లే దీన్ని నడిపిస్తూ ఉండొచ్చని వాళ్లు ఊహించి అటువంటి నిర్వాహకులు, వారి ప్రోత్సాహికులపై కన్నువేసారు. వాతావరణం వేడెక్క సాగింది. అప్పటి వరకు నక్సలైట్ పార్టీతో ఏ ప్రత్యక్ష సంబంధం లేని సెల్ల నిర్వాహకులు అటువంటి సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేయసాగేరు.

ఈ ఘటనల క్రమంలో ఓ సంవత్సరం మేడేను ఓ సాంప్రదాయక సంబరాల హిందూ పండుగగా మార్చివేసి బూర్జువా, రివిజనిస్టు ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న పద్ధతికి భిన్నంగా నిర్వహించాలని ఈ కార్మిక మిత్రబృందం ఆలోచించింది. మేడేను ఎలా నిర్వహించాలి? ఎక్కడ నిర్వహించాలి? నిర్వహిస్తే కార్మికులు నివసించే ప్రాంతంలోనే, బహిరంగం గానే నిర్వహించాలి. అలా నిర్వహించాలంటే అక్కడి చోటా-బడా కార్మిక నాయకుల అండదండలుండాలి. లేకపోతే సభను జరగనివ్వరు. చివరకు కార్మిక నాయకుల ఇళ్లు ఎక్కువగా ఉన్నచోట, అదీ పోలీసు స్టేషన్ వెనుక పక్కనున్న ఆవరణే సభ జరపడానికి అనువుగా ఉంటుందని తేలింది. సభ భగ్నమైనాసరే ఫరవాలేదు గాని ఈ ప్రాంగణంలోనే సభ జరపాలని, ఆఖరుకు మిత్రబృందమంతా ఓ నిర్ణయానికి వచ్చారు.

ఈ సభ నిర్వహణకు వారు ఎన్నుకున్న ప్రచార పధ్ధతి, అనుసరించిన ప్రజావిధానం ఒక మంచి ఉదాహరణ. ఎంచుకున్న సభా ఆవరణకు చుట్టూ ఎక్కువగా చోటా కార్మిక నాయకుల, సీనియర్ కార్మికుల కుటుంబాలు నివాసముంటున్నాయి. వీళ్లకు ముందుగానే తెలిస్తే, చెబితే సభ జరగనివ్వరు. ఆ కుటుంబాల మద్దతు లేనిదే సభ నిర్వహించడం కష్టం. అందుచేత ఆవరణ చుట్టుపక్క కుటుంబాల మహిళల్లో మేడే సభ గురించి, ఆ రోజు ఉండబోయే సాంస్కృతిక కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేసి వారి మద్దతు కూడగట్టారు. నిజానికి ఆ మహిళల హార్దిక సహాయ సహకారాలతోనే సభ నిర్వహించగల్గారు. కొన్ని కుటుంబాలు బల్లలు కుర్చీలు ఇస్తే, కొన్ని కుటుంబాల వారు మంచినీళ్లు, కరెంటు సమకూర్చారు. తోచిన కాడికి 5, 10 రూపాయల చందాలిచ్చారు. ఇదంతా రెండు కారణాల వల్ల సాధ్యమైంది.

కార్మిక యువకులు ఆ కుటుంబాల మహిళా యజమానులతో, ఇతర మహిళా సభ్యులతో మేడే ప్రాధాన్యతను, కార్మికులకు దాని పట్ల ఉండాల్సిన స్ఫూర్తిని, దాని వెనుక ఉన్న కార్మికుల త్యాగాలను వివరించడం, ఆ స్పూర్తితోకాక, యాజమాన్యాలను మెప్పించే రీతిలో ప్రతి సంవత్సరం ఇప్పుడు జరుపుకుంటున్న మేడేకు భిన్నంగా తాము అసలు సిసలు మేడేను నిర్వహించ తలపెట్టామని, ఇటువంటి సభను నిర్వహించడానికి లీడర్లు, పోలీసులు అనుమతించరు కాబట్టి మీరంతా మాకు పూర్తి సపోర్టు, సహకారం అందించాలని ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల మహిళల అభిమానం, సహకారం కార్మిక మిత్రులు పొందగలిగారు. ఈ సహకారమే సభ దిగ్విజయంగా నడవడానికి దోహదపడింది.

ఈ సభ జరగనివ్వమని స్థానిక, యూనియన్ నాయకులూ బెదిరింపులు జారీచేస్తే, మీరు తాగి తందానాలాడే మేడే కన్నా మంచి ఆటపాటల మేడే పిల్లలు జరిపితే మీకేమి అభ్యంతరమని వాళ్ల కుటుంబాల మహిళలే నిలదీశారు. పిల్లలూ మీరు సభ పెట్టండి, పాటలు, పద్యాలూ పాడండి.. మేం బల్లలిస్తాం, కుర్చీలిస్తాం, నీళ్లిస్తాం, కరెంటిస్తామని గొప్ప ప్రోత్సాహాన్నిచ్చారు.

ఈ రకంగా ప్రజల సహాయ సహకారాలతో మేడేను విప్లవ స్పూర్తితో దిగ్విజయంగా నిర్వహించారు. సభా ప్రాంగణం నిండి వక్తల ప్రసంగాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో మార్మోగింది.

సభకు అనుమతి లేదని అడపా తడపా పోలీసులు, సభ నడిపే దెవుళ్లురా అంటూ స్థానిక రౌడీలు ఆటంకాలు సృష్టించినా, సభా భగ్నానికి ప్రయత్నించినా మహిళలు ముందుకొచ్చి మేడే మంచిగా పాటలు పడుతూ జరుపుకుంటుంటే అనుమతేంది? సక్కగా కూసుని ఇనుండి, లేదంటే పొండి, మేమింటం. సభ మాగ్గావాలె, ఆపకుండా నడపండి పిల్లలూ అని సభ ముగించే వరకు నడుంకట్టి నిలబడ్డారు. సభకు వచ్చిన చాలా మంది కార్మికులు కూడా సభకు మద్దతు పలికి కార్యక్రమాలను ఆస్వాదించారు.

ఈ సభ, సనత్నగర్-బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక యువకులు చేపట్టిన కార్యక్రమాల పట్ల రెండు కొత్త కోణాలను తెరపైకి తెచ్చింది. ఒకటి - కార్మిక యువకుల ఉత్సాహాన్ని పెంచి వారిని కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ప్రోత్సహించడం; రెండు - యువ కార్మికులపై స్థానిక యూనియన్ నాయకుల కన్నుపడి వాళ్లు పోలీసులను అప్రమత్తం చేయడం. పోలీసుల, బస్తీల నాయకుల బెదిరింపుల జోరు పెరిగింది. కొంతమంది యువకులను పోలీసు స్టేషన్కు పిలిపించి మీ వెనుక ఎవరున్నారో చెప్పండని ఒత్తిడి చేయడం, కొట్టి లాకప్పుల్లో వేయడం మొదలైంది.

వీళ్లను విడిపించడానికి కొంతమంది వీళ్లపట్ల కొంత అభిమానం గల యూనియన్ నాయకుల, వాళ్ల ఊళ్లల్లోని నాయకులతో చెప్పించి విడుదల చేయించారు. పోలీసుల దెబ్బలకు బెదిరి కొంతమంది దూరమైనా కొంతమంది గట్టిగా నిలబడ్డారు. దూరమైనా వారు కూడా సంబంధాలతో ఉండే వారు.

యువ కార్మికబృందం తలపెట్టిన కార్యక్రమాలు ఇలా కొత్త స్థితిలోనికి ప్రవేశించిన తరుణంలోనే ఒక దుర్ఘటన జరిగింది. ఈ మిత్ర బృందంతో సంబంధాల్లో ఉన్న ఒక మహిళా అభిమాని ఇంటికి వెళ్లి ఈ బృంద కార్మికుడు ఒకడు ఆమెపై బలాత్కార ప్రయత్నం చేసాడు. ఆమె బృంద నాయకులకు అతనిపై కంప్లైంట్ ఇచ్చి అతనిపై గట్టి ఏక్షన్ తీసుకోవాలని పట్టుపట్టింది. ఈ కార్మికుడు 35 ఏళ్ల వయసు వాడు. వివాహితుడు, ఓ చంటి బిడ్డకు తండ్రి కూడా!

ఇతని గురించి ఎంక్వయిరీ చేయగా తేలిందేమంటే, ఇతను సమాంతరంగా బస్తీ యూనియన్ రౌడీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని, వాళ్లతో సాయంకాలాల్లో మందు తాగుతున్నాడని, బృంద వ్యవహారాలు లీక్ చేస్తున్నాడని బయటపడింది. ఇతనికి కాంగ్రెస్ పార్టీ వాళ్లతో సంబంధాలు ఉన్నాయని, వాళ్ల దగ్గరకు వెళుతూ వస్తూఉంటాడని తెలిసింది. యువ కార్మిక బృందంతో ఇప్పటివరకు మంచిగా ఉండే ఇతనికి బ్యాక్గ్రౌండ్ అప్పటివరకు ఎవ్వరూ పట్టించుకోలేదు.

దీంతో బృంద నాయకులు కూర్చుని ఇతని నడత మీద, మిత్ర మహిళపై అత్యాచారం పట్ల, అతనిపై తీసుకోవాల్సిన చర్య పట్ల చర్చించారు. అప్పటికి ఇంకా ఏక్టివ్గా అన్ని సెల్ మీటింగుల్లో కూడా ఈ చర్చ చేపట్టారు. అతనితో రవి మాట్లాడాలని, నడత సరిచేసుకోమని హెచ్చరించాలని, అతన్ని మహిళానేస్థం ఇంటికి తీసుకువెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పించాలని, దీనికి అతను ఒప్పుకోని పక్షంలో ఇతనిపై అతని భార్యకు ఫిర్యాదు చెయ్యాలని, ఈ విషయం ముందుగానే అతనికి చెప్పాలని నిర్ణయించారు.

ఐతే, దారితప్పిన ఈ కార్మిక మిత్రుడు మొరాయించి ఎదురుతిరిగి మీ అందరి సంగతి తెలుస్తానని ఎదురు బెదిరింపులకు దిగాడు. వ్యవహారం గంభీరంగా మారుతోందని రవి గుర్తించి, తదుపరి అడుగు ఎలా వెయ్యాలో తన సహచరుడు రవి డైరెక్షన్కై సంప్రదించాడు. అంతా విని అతనేమన్నాడంటే.. మనం 15 రోజుల్లో ఒక ప్రజా కోర్టును నిర్వహిద్దాం. అతన్ని ఆ ప్రజా కోర్టుకు హాజరు కమ్మని చెప్పు. అతనికి మనమొక ఉత్తరం రాద్దాం! అందులో అతనికి సన్మార్గంలో నడుచుకోమని మంచిగా చెబుతూనే, వక్రమార్గం అనుసరిస్తే తగిన శిక్ష అనుభవిస్తావని గట్టిగా హెచ్చరిద్దాం అని కుమార్ ఒక ఉత్తరం తయారుచేసి రవికి వినిపించాడు.

ఈ ఉత్తరం చదివి అతను లొంగి వచ్చాడు. కార్మిక మిత్రులను కలిసి చెప్పాడు.. తాను ప్రజాకోర్టుకు హాజరౌతానని, తాను పొరబాటు చేశానని, ఆ యువతికి నలుగురి ముందు క్షమాపణ చెబుతానని మాట్లాడేడు. ఈ విషయం ఎక్కడా బయటపడనివ్వొద్దని, తన భార్యకు, చుట్టుపక్కల వాళ్లకు తెలియనియ్యొద్దని వాళ్లను ప్రాధేయ పడ్డాడు.

అనుకున్న ప్రకారం సనత్నగర్ పారిశ్రామిక ఎస్టేట్ ఆఫీసు ముందున్న పార్కులో, పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో ప్రజాకోర్టు కూర్చుంది. 25 మంది సభ్యులు హాజరయ్యారు. బలాత్కారానికి ఒడంబడిన కార్మిక మిత్రుడు, బాధిత యువతీ హాజరయ్యారు.

ప్రజాకోర్టు నిర్వహన బాధ్యత సమీకరించిన పెద్ద అందరికి ప్రజాకోర్టు నిర్వహణకు దారితీసిన పూర్వరంగాన్ని, బలాత్కార అభియోగాన్ని సభ్యులకు వివరించాడు. బాధిత యువతిని ముందుగా మాట్లాడమన్నాడు.

ఆమె మొత్తం సంఘటనను పూస గుచ్చినట్లు చెప్పింది. విప్లవ రాజకీయాలంటే తనకు అభిమానమని, అందుకే నా అన్నకు మిత్రులైన కార్మికదోస్తులు మా ఇంటికి వస్తే గౌరవాదరణతో చూసేవారమని, మా అన్న కూడా మిత్రులకు చేతనైన సహాయం చేసేవాడని, ఇది అనువుగా తీసుకుని, ఈ మిత్రులతో పాటు వచ్చే ఇతను మా అన్న షిఫ్టులో ఉండే టైం తెలుసుకుని తాగి దుర్మార్గపు ఆలోచనతో వచ్చి తనను బలాత్కరించ బోతే, తాను మందలించి గట్టిగా అరుస్తానని, పిచ్చి పిచ్చి వేషాలు వేయక వదిలిపెట్టమని తోసివేయడంతో భయపడి వెళ్లి పోయాడని, ఇతనికి భార్యా బిడ్డ ఉన్నారని తెలిసి విస్తుపోయానని చెప్పింది.

విప్లవ భావాలుగల మిత్రులు ఇటువంటి చెడు స్వాభావిని ఎందుకు గుర్తించ లేకపోయారని ప్రశ్నించింది. అతనికి ఈ కోర్టు తగిన గుణపాఠం చెప్పాలని, ఇటువంటి పనులు చేయకుండా శిక్షించాలని కోర్టుకు నివేదించింది. అయితే బలాత్కారానికి ఒడంబడిన కార్మిక మిత్రుడు తాను వెంబడి తెచ్చుకున్న కొంతమంది మిత్రుల సలహాతో, నేను బలాత్కరించ ప్రయత్నిచలేదని, స్నేహితునిగానే వెళ్లానని, తనపై తప్పుడు అభియోగం మోపుతున్నారని అన్నాడు. అతనితో వచ్చిన కొందరు అతనికి వత్తాసు పలికారు. చర్చ జరిగింది.

మెజారిటీ సభ్యులు దిగజారిన మిత్రుడు యువతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, కోర్టు ముందు అటువంటి చేష్టలకు ఇక పాలుపడనని హామీ ఇవ్వాలని ప్రతిపాదించారు. దిగజారిన మిత్రుడి సమర్ధకులు గొడవకు దిగారు.

ఈ ఘటనల అనంతరం అప్పటి సిపిఐ(ఎం-ఎల్) నాయకుడు కె.ఎస్ (కొండపల్లి సీతారామయ్య) ఈ మిత్ర బృంద సెల్ నిర్వాహకులను కలిశారు. వారితో సుదీర్ఘంగా చర్చించి నిర్మాణాన్ని పార్టీ ఆధ్వర్యంలో నడిపించాల్సిన అవసరాన్ని వివరించాడు.

దానికి ఈ నిర్వాహకులు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. తదనంతరం పార్టీ తన ఉద్యమ నిర్మాణ అవసరాల రీత్యా, ఈ కార్మిక ప్రాంత నిర్మాణాన్ని, భాద్యులను రీఆర్గనైజ్ చేసింది. అదంతా వేరేకథ.

ఈ క్రమంలోనే కె.ఎస్.తో నా పరిచయాలు పటిష్ట పడ్డాయి. వీటి గురించి, కె.ఎస్ గురించి చెప్పడానికి చాలా ఉన్నా, చెప్పే అవసరం కూడా ఎంతో ఉన్నపటికీ, ఒక ప్రధాన సంఘటన ఇక్కడ వివరించి ముగిస్తాను.

ఈ కాలంలో ఆయన మా దగ్గరకు తరచూ వస్తూపోతూ ఉండేవారు. మా దగ్గర ఉండే ఎన్నో వ్యాసాలు, పార్టీ పత్రాలు రాస్తూ ఉండేవారు. మాకు కొత్త కొత్త బాధ్యతలు అప్పచెప్పే వారు. అప్పటికే కకావికలైన, ఎన్నో నష్టాల పాలైన, ఎంతో మంది అమూల్యమైన నాయకులను, కార్యకర్తలను, యోధులను కోల్పోయిన నక్సల్బరీ ఉద్యమ సందర్భం.. ఏర్పడిన చీలికలు, ముఠాలు సిద్ధాంత-ఆచరణల్లో ఏర్పడ్డ గందరగోళం, గ్రూపుల మధ్య కొట్లాటలు, రాద్ధాంతాలు; ఇటువంటి పరిస్థిలో ఎందరో ఉత్సాహవంతులైన యువకుల నిరాశమయ విప్లవ రాజకీయ నిష్క్రమణ.. వీటన్నిటినీ తట్టుకుని, ఓపిగ్గా విప్లవ పురోగమనానికి ఉపక్రమించిన మేటైన విప్లవకారుడు, కార్యశూరుడు కె.ఎస్.

ఈ కాలంలో ఆయన మావద్దకు వచ్చిన ఓ రోజు తన అంగీ పక్కజేబు నుండి మడత పెట్టి ఉన్న ఓ కాగితాన్ని బయటకు తీసి మడతవిప్పి ఇది చూడండని నా చేతికిచ్చాడు. చూస్తే అది కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక రేఖా చిత్రం. ఎవరో గజిబిజిగా చేత్తో గీసి ఇచ్చిన ఓ బొమ్మ. అలోచించి పోల్చుకుంటే అది ఓ చేతిబాంబు బొమ్మని అర్థమైంది. అంతకు మించి ఇంకే వివరాలు అందులో లేవు.

మీరు ఇంజనీర్లు కదా! దీన్ని బట్టి మనం ఇటువంటి చేతి బాంబులు తయారు చెయ్యాలి. ఇవి లేక మన దళాలు చాలా నష్టపోతున్నాయి. పార్టీకి ఇప్పుడు వీటిని తయారు చేయడం ప్రధాన బాధ్యత. మనం వీటిని ఎలా చెయ్యొచ్చో, చెయ్యాలో ఆలోచించి చెప్పండి. దీనిపై సీరియస్గా దృష్టి పెట్టండి అని అన్నాడు.

ఇందులో ఏ వివరాలు లేవు, ఉత్త వంకర బొమ్మ, ఇంత మాత్రంతోనే బాంబులు ఎలా తయారు చెయ్యగలం? అని నేనన్నాను.

మరి ఇంజనీర్ల పని ఏమిటి? అని ఆయన నవ్వి చెయ్యాలి, చెయ్యక తప్పదు. సాధించాలి అని ప్రోత్సహించాడు. మేమప్పుడు ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోనప్పటికీ మాలో మేము చర్చించించుకోసాగాం! ఎలా? ఎలా? పెద్దాయన పెద్దపనే పెట్టాడని అని బుర్రగీక్కో సాగాం!

ఆయన వచ్చినప్పుడల్లా, వస్తూనే కామ్రేడ్ ఏమైంది మన బాంబు వ్యవహారం? దారి దొరికిందా అని నవ్వుతూ ప్రశ్నించేవాడు. మేం తెల్ల మొఖం వేసేవాళ్లం. ఇలా కొన్ని నెలలు గడిచింది.

ఒక ట్రిప్పులో నన్ను కూర్చోబెట్టి కొన్నాళ్ల పాటు కార్మికోద్యమ నిర్మాణ బాధ్యతను పక్కకుపెట్టి మీరు వేరే బాధ్యతలోనికి వెళ్లాలని, దానికి తయారుగా ఉండమని, ఇంకొక కామ్రేడ్ వచ్చి ఆ పనికోసమై మిమ్ములను తీసుకు వెడతాడని చెప్పాడు. సరే అన్నాను.

ఆ రోజు రానే వచ్చింది. ఓ కామ్రేడ్ వచ్చి నన్ను నగరంలో ఇంకో ప్రదేశానికి, తీసుకు వెళ్లాడు. అదొక శ్రామికుల బస్తీ. చిన్న చిన్న ఒంటి గది, రెండుగదుల రేకుల నివాసాలు. తలుపు బార్లా తెరిచి ఉన్న ఒక ఒంటి గది ఇంటిలోనికి ప్రవేశ పెట్టాడు. ఆ గదిలో ఓ మూలన కూర్చున్న ఒక వ్యక్తి పరపర హేక్సా ఇనుప బ్లేడు రంపంతో పరపరా ఏదో ఇనుప ముక్కను ఏకాగ్రతతో కోస్తున్నాడు. ఇనప రజను కిందికి జారి నేలపై పడుతోంది. నన్ను తీసుకు వెళ్లిన కామ్రేడ్ అక్కడున్న వ్యక్తిని, కామ్రేడ్ అని సంబోదించి అతని ఏకాగ్రతకు భంగం కలిగించాడు. అతను కొంత చికాకుతో మొఖం పైకెత్తి, ఆ ఆ రండి అని తిరిగి పనిలో పడ్డాడు.

ఇదిగో ఈయన మన కామ్రేడ్. పెద్దాయన నీకు సహాయంగా ఈయన్ను పంపించాడు. ఈయన ఇంజనీరు. నీకు బాగా ఉపయోగ పడతారు. జాగ్రత్తగా చూసుకో, నీతో తర్వాత మాట్లాడుతా, పనుంది, వెళాతా అని నన్ను తీసుకొచ్చిన కామ్రేడ్ వెళ్లిపోయాడు. అప్పుడుగాని నాకు అక్కడ జరుగుతున్న పని ఏమిటో తెలియ రాలేదు. రిక్కించి చూస్తే అక్కడ పనిచేస్తున్న మనిషికి ఓ పక్కన కోడిగుడ్డు ఆకారంలో కొన్ని ఇనుప వస్తువులు కనిపించాయి. నా గుండె దడదడ కొట్టుకుంది. పెద్దాయన చూపించిన కాగితం ముక్కలో బొమ్మ ఆకారంలోనే అవి ఉన్నాయి. అంటే పరపర కోస్తున్న మహానుభావుడు బాంబుల తయారీలో తల మునకలై ఉన్నాడన్నమాట. నన్నతను కూర్చోమని అనలేదు. నాతో మాట్లాడనూ లేదు. తన పనిలో మునిగిపోయి ఉన్నాడు, చెమటలు కారుకుంటూ. కాస్సేపు ఆలోచించి, తటపటాయిస్తూ అతని పక్కన కాళ్లు మడిచి కూర్చున్నాను. ఆయన చేసే పని చూస్తున్నాను.

మెల్లగా చెయ్యిచాపి ఇనుప చేతి బాంబు షెల్స్ను పరిశీలించ సాగేను. ఒకటి చేతిలోకి తీసుకుని పరీక్షగా చూడ సాగేను. అప్పుడు ఆ వ్యక్తి నోరు తెరిచి ఏమిటి చూస్తున్నావ్? అవేంటో తెలుసా? అన్నాడు. నేను కొంచెం స్థిమితపడి, ఇవి హ్యాండ్ గ్రెనేడ్ బాంబ్ షెల్స్ అన్నాను. నీకెలా తెల్సన్నాడు. పెద్దాయన ఓ బొమ్మ చూపించాడని, మమ్ములను ఎలా తయారు చెయ్యాలో ఆలోచించమన్నాడని చెప్పాను.

దానితో అతను వెటకారంగా మూతి విరిచి, మరి చేశారా? అంటే, లేదు మాకు అసలు అటువంటి ఐడియానే రాలేదు అన్నాను. దానికి అతను, పెద్దాయన అనుకునుంటాడు, ఇంజనీర్లు ఏదో పొడిచేస్తారని.. అని మళ్లీ వెటకరించాడు.

నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సు లేదు అని అంటే, పని చేస్తే కదా, చేతులు కాయలు కాస్తే కదా అనుభవం వచ్చేది అని, సరే చూడు నేను ఎలా చేస్త్తున్నానో, ఏమి చేస్తున్నానో అని తిరిగి పనిలో పడిపోయాడు. ఈ కథనం వివరంగా చెబితే చాలానే ఉంటుంది.

ఇక్కడకు ఆపి ముగింపు వైపు వెడతాను.

ఒక నెల గడిచింది. మందుగుండు దట్టించిన ఐదు ఇనుప చేతి బాంబుల (మొదటి ట్రయిల్ సెట్ హేండ్ గ్రెనైడ్లు) తయారైనాయి. ఇంకొక 25 వరకు తయారు చేయడానికి విడి భాగాలు సమకూరి ఉన్నాయి. వీటిని క్షేత్రంలో విసిరి పేల్తాయో, లేదో పరీక్షించాలి. పేలినట్లైతే మిగతావి తయారు చెయ్యాలి.

ఒక రోజు తెల్లారి 4 గంటలకు నన్ను తీసుకొచ్చిన కామ్రేడ్, బాంబుల స్పెషలిస్టు, నేను మూసీ నది ఒడ్డున దూరంగా ఒక మైదానంలోకి వెళ్లాం. స్పెషలిస్టు బాంబు లివర్ చేతితో ఎలా లాగి నొక్కి పట్టి ఉంచి, విసరాలో వివరించాడు. బాంబు లీవర్ నొక్కడం నావల్ల కాలేదు.

వాళ్లిద్దరూ చెరో బాంబు దూరంగా విసిరారు. ఎగిరి నేల మీద పడ్డాయి. నేను భయంతో చెవులు మూసుకున్నాను. అవి ఎంతకీ పెల్లేదు. నాచేత కూడా ఒకటి విసిరించారు. అదీ పేల్లేదు. ఇంకా రెండున్నాయి. ఏం చెయ్యాలో అయోమయంలో పడ్డాం. స్పెషలిస్టు మిగతా రెండూ వేద్దామన్నాడు. వద్దు వేస్ట్ అన్నాను నేను. స్పెషలిస్టుకు కోపమొచ్చింది. ఇంకో కామ్రేడ్ కారణమడిగేడు.

అనుభవం లేకపోయినా, తయారైన తీరు చూసి, కొంత ఇంజనీరింగ్ చదివిన జ్ఞానంతో నాకు తోచిన లోపాలు చెప్పాను. వేసినా ఇవికూడా పేలవని మిగలిన రెండూ అలానే ఉంచుదామని, విసిరిన వాటిని వదిలి నిష్క్రమిద్దామని నేను నా అభిప్రాయం చెప్పాను. దీనితో స్పెషలిస్టుకు చాల కోపం వచ్చింది, ఈ బచ్చాగాడికి ఏమి తెలుసునన్నట్లు మాట్లాడేడు.

ఆచరణ ద్వారా అనుభవజ్ఞులైన పనివారికి, అంతగా ఆచరణాత్మక అనుభవం లేని చదువరులైన ఇంజనీర్లకు ఉండే వైరుధ్యమే ఇది. ఈ రెండు శాస్త్రీయ పద్ధతిలో మేళవింపైతే గాని సరైన ఆవిష్కరణ జరగదు. ఇదీ అంతే.

అయితే కాలం గడిచిపోతోంది, మనుష సంచారం మొదలయ్యే సమయం దగ్గర పడుతోంది. ఏదో నిర్ణయం తీసుకోవాలి. పేలని వాటిని వదిలేయడానికి స్పెషలిస్టు సుముఖంగా లేడు. మిగిలిన వాటిని విసురుదామని కూడా అంటున్నాడు. అందులో నుండైనా ఏదో ఒకటి పేలక పోతుందా అని ఆయన ఆశ.

మేమిద్దరం అతని నిర్ణయాన్నే ఆమోదించాం. ఆయనే మిగతా బాంబులు విసిరేడు. అవీ పేలలేదు. ఇప్పుడేం చేయాలి? పేలని బాంబులు వదిలి వెళ్లిపోవాలా? లేక వాటిని సేకరించి వెనక్కు తీసుకువెళ్లాలా? వదిలి పెడితే, ఆ వదిలిన బాంబులు జనం కంట బడితే పోలీసులకు రిపోర్ట్ చేస్తారు. అది మరింత ప్రమాదం కాబట్టి అవి వెనక్కు తీసుకు పోవాల్సిందేనని, ఒక అర్ధ గంట చూసి ఇక పేలుడు సంభవించే ఆస్కారం లేదు కాబట్టి, వాపసు తీసుకుని నిష్క్రమిద్దామని స్పెషలిస్టు సూచించాడు. అతనే ఈ పనికి బాధ్యుడు కాబట్టి ఆ నిర్ణయాన్ని అమలు చేసాం.

ఐదు పేలని బాంబులను వెనక్కి తీసుకు వెళ్లిపోయాం. షెల్టర్కు వెళ్లాక వంట చేసుకు తిని ఎందుకు ఇలా జరిగిందో చర్చిద్దామని మూడో కామ్రేడ్ అన్నాడు. ఈయన కూడా ఇంజనీరింగ్ చదువుకున్నది, చాల బాధ్యత గల సీనియర్ కామ్రేడ్ అని నాకు తరువాత తెలిసింది.

ఈ కామ్రేడ్, ముందుగా స్పెషలిస్ట్ అభిప్రాయం చెప్పమన్నాడు. ఆయన మందుగుండు సరైనది కాదని, ఇంకా ఏవో కొన్ని లోపాలు చెప్పాడు. నా వంతు వచ్చినప్పుడు నేను నిష్కర్షగా చెప్పాను. ఇవి ఒక డిజైన్ ప్రకారం చేసినవి కాదు కాబట్టి ఇలా తయారు చేసినవి పనిచేస్తాయనే నమ్మకం నాకు లేదని, ప్రతి విడి భాగము ఒక లెక్క ప్రకారం రూపొందించ బడాలనీ అప్పుడే పని చేస్తాయని నా థియరీ నేను చెప్పాను.

మిగతా ఇద్దరు కామ్రేడ్లు కూడా సరే! కరక్ట్. అయితే ఈ డిజైన్ మనకు ఆకాశం నుండి ఊడి పడుతుందా? అని ప్రశ్నించారు. నువ్వు డిజైన్ చేయగలవా అని ప్రశ్నించారు. ఎలాగైనా ఒక ఒరిజినల్ సంపాదిస్తే, అది కాపీ కొట్టడం చేయొచ్చని, అలా చేయడం శ్రేయస్కరమని, అలా చేయడం ద్వారా చాల మట్టుకు, ట్రయిల్ ఎండ్ ఎర్రర్ పద్ధతి నుండి బయట పడవచ్చని నా అభిప్రాయాన్ని చెప్పాను.

చర్చ తెగ లేదు. ముందు జాగ్రత్తగా అక్కడ నుండి బిఛానా మార్చి వేయాలని నిర్ణయించి, ఇంకొక చోటుకు మకాం మార్చాం. ఇక ముందు ఏమి చెయ్యాలో స్పెషలిస్టు నిర్ణయానికి వదిలి పెట్టారు. నన్ను ఆయనకు సహాయకుడిగా ఉండమన్నారు. మొత్తానికి ఆ పని నాకు సహించలేదు, స్పెషలిస్టు మనస్తత్వం, పని తీరు కూడా నాకు మింగుడు పడలేదు. ఒక రోజు మూడో కామ్రేడ్ నన్ను వేరే రూంకు తీసుకు వెళ్లి కె.ఎస్తో సమావేశంలో కూర్చోబెట్టాడు. బాంబుల విషయమై ఈ సమావేశం ఏర్పాటైంది.

ఆయన నా అభిప్రాయం క్షుణ్ణంగా తెలుసుకోవాలని పిలిపించాడు. నాకు తెలుసున్నది, నేను అర్థం చేసుకున్నది, నాకు ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి హితవులేనిది, నా రంగానికి నేను వెడతానని వివరించాను.

ఆయన ఓపిగ్గా అన్నీ విన్నాడు. భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, నవ్వు మొఖంతో అన్నాడు - మీరు ఇంజనీర్, మీ అవసరం ఈ ప్రాజెక్టుకు చాల ఉంది. మనకు ప్రత్యామ్నాయ మార్గం దొరికేవరకు, మన జ్ఞానం పెరిగే వరకు ఉన్న దాన్నే మరింత మెరుగ్గా చేయగలిగే మార్గం పట్టుకుని ప్రయత్నం కొనసాగించాలని, అలాగే ప్రత్యామ్నాయాలకై పార్టీ తప్పక పట్టుదలతో పనిచేస్తుందని బోధించాడు. ఐనా నేను గట్టిగా పట్టుబట్టిన మీదట నాకు వేరే బాధ్యతలు అప్పచెప్పారు. అదంతా వేరే ఘట్టం.

ʹఅతనెవరో గుర్తున్నాడా?ʹ అని నేను ఆయన జ్ఞాపకాల మననంతో రాసుకున్న కవితలో - ఒక రోజు బుర్రలో బాంబులు మోసుకొచ్చాడు అని రాసేను.

ఆయన విప్లవోద్యమ నిర్మాణానికి ఎన్నో ఆలోచనలను మోశాడు. అందులో ఇదొకటి. ఈ రోజు ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి సమకూరిన ఆయుధ సంపత్తికి శత్రువు నుండి తుపాకులు గుంజు కోవడం ఒక వీరోచిత ఆలోచన అయితే, కె.ఎస్ బుర్రలో బాంబుల తయారీ ఆలోచనల మోత, దాని సాధనకై పట్టువిడవని దీక్ష మరొక విప్లవాత్మక ముందంజ.
(ఇంకా ఉంది)

- బీఎస్ రాజు
(రచయిత జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, విస్తాపన్‌ విరోధి జన వికాస్‌ ఆందోళన్‌)
(వీక్షణం మాసపత్రిక మే 2017 సంచికలో ప్రచురించబడినది)

Keywords : naxalbari, telangana, maoists, revolution, hyderabad
(2024-04-24 19:51:53)



No. of visitors : 2451

Suggested Posts


నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...

మొదటి అయిదుగురు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతోను, ఆరుగురు పట్టణ యువకులతోను, ముగ్గురు పోర్టు ఉద్యోగులతోను, కొద్దిమంది షిప్ యార్డు కార్మికులతోను సంబంధాలు ఉండేవి. వీరిలో ముఖ్యులను నాకు పరిచయం చేసింది ప్రముఖ రచయిత రావిశ్రాస్తి కొడుకు కామ్రేడ్ నారాయణమూర్తి. కృష్ణా జిల్లాలో కామ్రేడ్ కె.ఎస్. కుడి భుజంగా పేరొందిన కామ్రేడ్ తప్పెట సుబ్బారావు నాకు షెల్టర్...

Maoists are the Real Communists - Jaison C Cooper

Itʹs 50 years and the spirit continues. Itʹs a movement that has been loved and hated by many alike. Itʹs also a movement nobody can never ignore. But has it been understood properly? Lots of blood, violence, sacrifice, nostalgia, romance and adventurism have been attached to it. There is no limit to the misunderstanding on the Naxal movement....

Germany, Berlin: Long live Peopleʹs War! Long live Naxalbari !

On 20 May, an international action day took place on the occasion of the 50th anniversary of the Naxalbari insurrection....

 నక్సల్బరీ ప్రజ్వలానికి 50 ఏళ్ళు.... కొన్ని ఙాపకాలు (2)

నక్సల్బరీ ఉద్యమ ఆశయాల పట్ల, విలువలపట్ల ఎంతో గౌరవం ఉంది. అందుచేతనే నక్సల్బరీ రాజకీయంతో నేను అనుబంధం ఏర్పర్చుకుని కొనసాగిస్తున్నాను. అంతేగాక ఒక్క నక్సల్బరీ రాజకీయ పంథా మినహా, భారత దేశంలో ఇప్పటికి ఉనికిలో ఉన్న మరే ఇతర రాజకీయ పంథా భారత దేశ విప్లవాన్ని ముందుకు నడిపించలేదని రుజువైంది....

ప్రపంచవ్యాప్తంగా ఉత్తేజపూరితంగా సాగుతున్న నక్సల్బరీ వారోత్సవాలు

కెనడా, లండన్, ఇటలీ, బాంగ్లాదేశ్ తో సహా అనేక దేశాల్లో మావోయిస్టు, కమ్యూనిస్టు పార్టీలు, సంఘాలు భారత విప్లవానికి వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రతినపూనాయి. ఇటు దేశంలో బీహార్ మొదలుకొని కేరళ వరకు పట్టణాల్లొ, పల్లెల్లో, అడవుల్లో వేలాది సభలు జరిగాయి...

Naxalbari: its relevance for today… and for tomorrow

The stormy period of the nineteen sixties gave birth in several countries to uprisings, movements and organisations that continue to have a lasting impact to this day...

50 ఏండ్ల నక్సల్బరీ... పులకించిన బొడ్డపాడు

శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ బొడ్డపాడు. ఆ పోరాటానికి ఎంతోమంది వీరులను అందించిన గడ్డ బొడ్డపాడు. శ్రీకాకుళ సాయుధ పోరాట చరిత్రలో ఆ ఊరిది ఓ పేజీ అలాంటి గ్రామం...

Bangladesh: 50th Anniversary of Naxalbari celebrated in Dhaka

Procession and discussion meeting held at 50th anniversary of Naxalbari was held in Dhaka on 25th May. At around 3:30 pm a procession started from the Press Club to Progoti conference room, Mukti Bhawan, 2 Purana Paltan in Dhaka. The meeting and Discussion was led by Jafar Hossain, assisted by Atif Anik...

Bangladesh: Celebration of 50 years of Naxalbari..

The importance and dignity of the peasant uprising of Naxalbari is immense in the communist movement of South Asia . With the influence of Chinaʹs cultural revolution in 1967, the peasantʹs movement in West Bengalʹs rural areas was the voices of the struggles...

50 Years of Naxalbari in Canada

The villages, towns, soils, furrows of fields, woods and mountains, rivulets and rivers of vast India turned red with the warm blood of these thousands of immortal martyrs which included hundreds of women comrades. In the thorny and tortuous...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నక్సల్బరీ