నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)

నక్సల్బరీ

PART 1
(వీక్షణం మాసపత్రిక మే 2017 సంచికలో ప్రచురించబడినది)

మే 23-25కు నక్సల్బరీ వసంత మేఘం గర్జించి యాభై ఏళ్లు అవుతుంది. నక్సల్బరీకి అది అర్థవంతమైన విశేషణం. వసంతం రానున్న ఆకురాలు కాలాన్ని కూడా సూచిస్తుంది. మళ్లీ వసంతం రావడాన్ని కూడా సూచిస్తుంది. అట్లని అది వర్తులాకారం కాదు. మేఘానికి, నేలకు, సముద్రానికి ఉండే గతితార్కిక సంబంధంలో అది ఆటుపోట్లను కూడా సూచిస్తుంది. అది విచిత్రంగా బంగాళాఖాతంలో తూర్పు సముద్రం దగ్గర ప్రారంభమై తూర్పు తీరం వెంబడి శ్రీకాకుళం మీదుగా, పడమటి సముద్రం అరేబియా తీరంలోని వైనాడు మీదుగా మైదాన ప్రాంతపు పంజాబ్ దాకా పయనించింది. ఈశాన్య గాడ్పుగా ఇది బెంగాల్, బీహార్ల మీదుగా ఢిల్లీ కోటను కూడా చుట్టుముట్టింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఒక ప్రభంజనం అయి వీచింది.

నక్సల్బరీ ఒక ఊరు కాదనుకున్నాం. నక్సల్బరీ అందరి ఊరను కున్నాం. అవి సామెతలు, నుడికారాలు అయినవి. పునాది ఉత్పత్తి సంబంధాల్లో మాత్రమే కాదు ఇవన్నీ భావజాలంలో భాగమైనవి. భాషలో, సంస్కృతిలో భాగమైనవి. నక్సల్బరీ అనే నాలుగు అక్షరాల కోసం పిల్లలు తమ పుస్తకాల్లో వెతుక్కున్నారు. ప్రపంచ వ్యాప్త శబ్దకోశాల్లో నక్సలైట్ అనే మాట కొత్తగా చేరింది.

ఇంచుమించు నలభై ఏళ్లు పోయాక ఇప్పుడు వీస్తున్న గాలి వలె ఆ స్థానంలో మావోయిస్టు అనే మాట వచ్చి చేరింది.

ఒక నిప్పు రవ్వ దావానలం అయినట్లుగానే నక్సల్బరీ, ఖరీబరీ అనే రెండు గ్రామాల్లో సంతాల్ ఆదివాసులు తమ నేల మీద తాము నిలబడి ప్రకటించిన అధికారం దేశవ్యాప్తంగా భూమిపుత్రులు తాము భూమి మీదనే కాదు, రాజ్యం మీద ప్రకటించిన స్వామ్యంగా రాజకీయ సంస్కృతిలో భాగమైంది. ప్రత్యామ్నాయ రాజకీయ ఆచరణలో, ఆలోచనలో భాగమైంది.

ఇది సంతాల్ ఆదివాసులు ప్రారంభించింది గనుక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్నే కాకుండా, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో మొట్టమొదటిసారి ఆదివాసులు ఎక్కుపెట్టిన వింటినారి నాయకత్వాన్ని కూడా స్వీకరించింది.

పూర్తిగా కాలి బూడిదయిన ఒక జ్వాల నుంచి మళ్లీ ఒక ఫీనిక్స్ పక్షి లేచినట్లుగా నక్సల్బరీ తిరిగి తిరిగి వచ్చింది. తాను బయలుదేరిన చోటికి వచ్చింది. తనకు ఇదివరకెన్నడూ పరిచయం లేని చోటికి వచ్చింది. కావల్సిన వాళ్ల అనుభవంలోకి మాత్రమే కాదు, కలలో కూడా ఊహించని వాళ్ల అనుభవంలోకి కూడా వచ్చింది. ఎందుకంటే ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకునే తత్వవేత్తల కృషిగా కాకుండా, ప్రపంచాన్ని మార్చే కమ్యూనిస్టుల విప్లవాచరణగా ముందుకు వచ్చింది. ఈ కమ్యూనిస్టులు, ఈ ఆదివాసి రైతాంగం విప్లవం నుంచి విప్లవ నిర్మాణానికి పయనించారు.

ప్యారిస్ కమ్యూన్ విజయవంతం చేసిన కమ్యూనార్డులు కూడా లెనిన్ కాలపు విప్లవ నిర్మాణానికి దోహదం చేసిన వాళ్లు కావచ్చు గాని ఈ కమ్యూనిస్టులు తమ ఆచరణ నుంచి ఒక నిర్మాణాన్ని చేపట్టారు. అది ప్రపంచ వ్యాప్తమైన నిర్మాణాలకు సమ ఉజ్జీగా ప్రారంభమై ఇవాళ్టికీ సజీవంగా ఉన్నది. కొసఊపిరి స్థితికి, కోమాలోకి వెళ్లిన స్థితికి వెళ్లి మళ్లీ నవయవ్వనాన్ని పుంజుకున్నది.

నక్సల్బరీకి ఒక బాహిర అంతర్జాతీయ దోహదం ఉన్నది. ఒక తక్షణ అంతర్గత ప్రేరణ ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగానే 1966 తరువాత పెల్లుబుకిన విప్లవాలకూ, ఎనభై దేశాల్లో ఏర్పడిన మార్క్సిస్ట్ - లెనినిస్ట్ పార్టీలకూ చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం చూపిన దిక్సూచినే నక్సల్బరీ కూడా అందుకున్నది. అంటే అది రివిజనిజానికి వ్యతిరేకంగా పది సంవత్సరాల మహత్తర చర్చ ఫలితం.

మన దేశంలో చర్చగా అది 1951 నుంచి ఉన్నది. బహుశా 1948 నుంచి కూడా ఉన్నది. దేశంలో అధికార మార్పిడితో ఈ చర్చ మొదలై 1951లో తెలంగాణ సాయుధ పోరాట విరమణతో కమ్యూనిస్టు శిబిరంలో పదహారు సంవత్సరాలు సాగిన చర్చ. తిరిగి 1964లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, సిపిఎంగా చీలినప్పుడు ప్రజల్లో, శ్రేణుల్లో వర్గపోరాట ఆకాంక్ష వల్ల కలిగిన చర్చ. ఆ చర్చకు ఒక రూపం ఇచ్చి, ఒక కెటాలిస్ట్ పాత్ర నిర్వహించి ఎనిమిది దస్తావేజులు (తెరాయ్ డాక్యుమెంట్లు) 1965 నుంచి 1967 వరకు రాసి నక్సల్బరీని సాకారం చేసిన నాయకత్వం చారు మజుందార్ అందించాడు. జంగల్ సంతాల్ వంటి ఆదివాసులు, నక్సల్బరీ గ్రామానికి చెందిన కానూ సన్యాల్ వంటి విద్యావంతులు అందుకున్నారు.

నక్సల్బరీ ప్రత్యేకత చెప్పాలంటే అది ఆరంభమైనప్పుడే కాదు, ఇప్పటికీ రివిజనిజం మీద రాజీలేని పోరు. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం వలెనే అది ఎప్పుడూ తన ఇల్లు ఊడ్చుకొని, తుడుచుకొని, తలుపులు, కిటికీలు తెరిచి పెట్టుకొని కల్మషమైన గాలిని బయటికి పంపి, స్వచ్ఛమైన వాయువును ఆహ్వానించిన ఒక నిరంతర పునాది, ఉపరితల పోరాటం. అది ఆనాడు పార్లమెంటరీ రాజకీయాలను బూర్జువా నియంతృత్వంగా నిర్వచించి, నిరాకరించి ప్రజల రాజకీయాలను ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన పోరాటంగా ప్రారంభం అయింది.

నక్సల్బరీ ఇరవై ఏళ్ల భారతీయ సమాజాన్ని, వ్యవస్థను స్పష్టంగా విశ్లేషించి, నిర్వచించింది. వ్యవస్థను, రాజ్యాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య దళారీ స్వభావం కలవిగా తేల్చి చెప్పింది. అధికార మార్పిడి జరిగి అప్పటికి ఇరవై ఏళ్లు గడిచినా ఒక బ్రిటిష్ సామ్రాజ్యవాదం స్థానంలో ప్రపంచ సామ్రాజ్యవాద దేశాలన్నిటి పట్టు కొనసాగడం వల్ల, అన్నిటికీ దేశం ఒక తాకట్టుగా మారడం వల్ల ఈ వ్యవస్థనూ అర్ధ వలస అన్నది. చట్టాలలోనే తప్ప ఆచరణలో భూసంస్కరణలు అమలు కాకపోవడం వల్ల, ఇరవై ఏళ్లు గడిచినా అంటరానితనం కొనసాగు తుండడం వల్ల ఇది అర్ధ భూస్వామ్యం అని కూడా నిర్వచించింది.

సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు, దేశంలోని బడా కంపెనీలకు, దేశంలోని భూస్వాములకు దళారీలుగా వ్యవహరించే రాజ్యాంగ యంత్రమే ఈ ఇరవై ఏళ్లు కొనసాగిందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో జరిగే ఎన్నికలైనా, సంస్కరణలైనా కేవలం శవాలంకారాలేనని, ఈ వ్యవస్థను సాయుధంగా కూలదోసి దీనిస్థానంలో నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా నక్సల్బరీ రైతాంగ పోరాటం ప్రారంభమైంది.

ఈ విప్లవానికి భూమిక భూమిని స్వాధీనం చేసుకునే ఆర్థిక పోరాటం. స్వాధీనం చేసుకున్న భూమిని భూస్వాముల గుండాల నుంచి, వాళ్లకు మద్దతుగా వచ్చే పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి, రాజ్యం నుంచి కాపాడుకోవడానికి చేసే గెరిల్లా పోరాటమే సైనిక రూపం. లక్ష్యం ప్రజల చేతికి అధికారం. సోవియట్ రష్యాలో సోవియట్లకు, చైనాలో కమ్యూన్ లకు వచ్చిన అధికారం వంటిది. ఉత్పత్తిలో పాల్గొంటున్న ప్రజలకు, దోపిడీకి, పీడనకు గురవుతున్న ప్రజలకు, గడ్డివేళ్ల స్థాయిలో ఉన్న ప్రజలకు. అట్టడుగున ఉన్న ప్రజలకు, పోరాడుతున్న ప్రజలకు అగ్రగామి కార్మికవర్గం నాయకత్వంలో అధికారాన్ని సాధించే విప్లవం అది.

అత్యధిక సంఖ్యలో గ్రామాలు, రైతాంగం, వ్యవసాయ సంబంధిత వృత్తులు ఉన్న దేశం భారతదేశం. భూమిలేని నిరుపేద, వ్యవసాయ కూలి మొదలు ధనిక రైతు వరకు ఇక్కడ ఫ్యూడల్ భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీకి గురవుతున్నారు. ఈ అన్నివర్గాల విముక్తి అగ్రగామి కార్మికవర్గం నాయకత్వంలో జరిగే వర్గపోరాటం నక్సల్బరీ.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇటువంటి పోరాటానికి నాయకత్వం వహించే అవకాశం మైదాన ప్రాంతంలో ఉన్న వెట్టి బానిసలుగా పిలువబడిన మాల, మాదిగలకు, ఈనాటి అర్థంలో దళితులకు వచ్చింది. నక్సల్బరీ, శ్రీకాకుళం, వైనాడు, గోపివల్లభ్పూర్ వంటి విప్లవ వెల్లువలు ఆదివాసి ప్రాంతాల నుంచి ప్రారంభమైనవి.

సిపిఐ (మార్క్సిస్ట్ - లెనినిస్ట్) పార్టీ ఏర్పడి దాని అధికార పత్రికగా ʹలిబరేషన్ʹ ప్రారంభమై కొనసాగిన కాలపు సంచికలన్నీ కలిపి సునీత్ ఘోష్ రెండు సంపుటాలుగా వేసినప్పుడు వాటికి ʹటర్నింగ్ పాయింట్ʹ అని పేరు పెట్టాడు. అంటే భారత రాజకీయాల్లో అది ఒక గుణాత్మకమైన మార్పు అనే అర్థంలో. నక్సల్బరీ ప్రాసంగికత గురించి మాట్లాడు కోవాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది అది బూర్జువా రాజకీయాల స్థానంలో ప్రజా ప్రత్యామ్నాయంగా వర్గపోరాట రాజకీయాలను ప్రవేశపెట్టింది. వర్గపోరాటానికి ప్రధాన పోరాట రూపంగా సాయుధ పోరాటాన్ని ప్రవేశపెట్టింది. మిగిలిన ప్రజా పోరాటాలన్నీ దీనికి దోహదంగా, అనుసంధానంగా ఉండే పోరాటాలే. ఇందుకొరకే అంటే విప్లవ ప్రచారం కోసమే ప్రజాసంఘాలు ఏర్పడతాయి.

మావో సె టుంగ్ చెప్పిన ʹవిప్లవంలో రెండు సైన్యాల పని - భూమి సేన, ప్రచార సేన (ఆయన సాంస్కృతిక సేన అన్నాడు). విప్లవానికి రెండు కళ్లు, చెవులు, చేతులు, కాళ్ల వంటివి. దీనికి మొదటి దశ లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవం. భూమి ఇరుసుగా కొనసాగే వ్యవసాయ విప్లవం. రైతు వ్యవసాయం చేయడం వంటిదే రైతాంగ విప్లవ పోరాటం.ʹ

1967 నాటికే పార్లమెంటరీ రాజకీయాలు భ్రష్టుపట్టి పోయాయి. మన దేశంలో పార్లమెంటరీ రాజకీయాలు అనేవి అంటుమొక్క వంటివే. ఆమాటకొస్తే ఇంగ్లండ్లో పారిశ్రామిక విప్లవం, ప్యారిస్లో ఫ్రెంచ్ విప్లవం తరువాత పార్లమెంటరీ రాజకీయాలకు కాలం చెల్లింది. ఆ రెండు దేశాలు మాత్రమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చి కొంతకాలం మనగలిగింది. ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా రెండు చోట్లా సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమైందనే విషయం మనం మర్చిపోకూడదు. పెట్టుబడిదారీ విధానం ఇంగ్లండ్కో, ఫ్రాన్స్కో పరిమితమైన ఉత్పత్తి విధానంగా కాకుండా అది అత్యున్నత దశకు చేరుకొని సామ్రాజ్యవాదంగా మారిన తరువాత ఇంక పార్లమెంటరీ రాజకీయాలకు స్థానం లేకుండా పోయింది. పార్లమెంటరీ రాజకీయాల పేరుతో ప్రపంచవ్యాప్తంగా కొసాగుతున్న దంతా బూర్జువా నియంతృత్వమే. దాని స్థానంలో శ్రామికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పాలనేదే బోల్షివిక్ విప్లవం నాటికి లెనిన్ ఒక ఉక్కు పార్టీ నిర్మాణం వంటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం ద్వారా కార్మికవర్గ విప్లవం ద్వారా రుజువు చేశాడు.

వలస దేశంగా ఇండియా స్వీకరించిన వలస రాజకీయాలలో భాగమే పార్లమెంట్. అశేష ప్రజానీకానికి, వ్యవసాయం మీద ఆధారపడిన పీడిత ప్రజలకు ప్రధాన వైరుధ్యం ఉన్న చోట పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో వచ్చిన పార్లమెంటరీ రాజకీయాలకు చోటు లేదు. సామ్రాజ్యవాద స్వభావమే అసమానతను కొనసాగించడం. సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని మూడు ప్రపంచాలుగా విభజించింది. అమెరికా, యూరప్ వంటి పెట్టుబడిదారీ దేశాలకు ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాలలోని దేశాలన్నీ అర్ధవలసలుగా మారిపోయాయి. కొన్ని దేశాలైతే చాలా కాలం వరకు నయా వలసలుగా కూడా మిగిలిపోయాయి.

చైనా విప్లవం నాటికే రానున్న ప్రపంచ విప్లవాలన్నీ నూతన ప్రజాస్వామిక విప్లవ దశలుగానే సాధ్యమవుతాయని రుజువైంది. చైనా తరువాత వియత్నాం, కంపూచియా మొదలైన చాలా దేశాల్లో ఆ రూపంలోనే విప్లవం విజయవంతమైంది. చాలా విషయాలలో చైనాతో పోలిక ఉన్న భారతదేశం నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గాన్ని ఎంచుకున్నది.

అటువైపు బూర్జువా రాజకీయాల్లో పార్లమెంట్ అనేది ఒక గుదిబండగా మారింది. నిలువ నీరైపోయింది. భూస్వామ్య పెట్టుబడిదారీ దళారీ పాలకుల బాతాఖానీ క్లబ్బుగా మారింది. స్వార్థ (వెస్టెడ్) ప్రయోజన వేదికగా మారింది. మిశ్రమ ఆర్థిక విధానం, పంచవర్ష ప్రణాళికలు, సహకార వ్యవసాయం, భూసంస్కరణలు వంటివన్నీ కాగితాలకే పరిమితమైపోయినవి. 1967 నాటికే రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు కాగితాలకే పరిమితమైనవి. దేశం అమెరికన్ సామ్రాజ్యవాదం (ప్రైవేట్ రంగం)తో పాటు సోవియట్ సోషల్ సామ్రాజ్యవాద (పబ్లిక్ రంగం) ఏజెంట్గా మారిపోయింది. 1971 రష్యాతో చేసుకున్న సైనిక ఒడంబడికతోనైతే ఈ దేశం రష్యాకు ఒక ఉపగ్రహంగా మారిపోయింది.

నలభై ఏళ్లు గడిచే వరకు వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడిది అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఒక ఉపగ్రహంగా మారిపోయింది. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న కాలానికే అమెరికా యుద్ధ విమానాలు మన దేశంలో చమురు పోసుకొని అఫ్ఘనిస్తాన్ మీదికి యుద్ధానికి పోయే స్థితి వచ్చింది. అమెరికా, భారత సైన్యాలు కలిసే స్థావరాలు, విన్యాసాలు చేసుకోవడానికి అమెరికాతో ఎన్నో రకాల సైనిక ఒప్పందాలు, ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు మన కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్నది. ఒకప్పుడు ఇజ్రాయెల్ను గుర్తించని దేశం, పాలస్తీనాకు అండగా నిలబడిన దేశం దేశభక్తియుత సంఘ్ పరివార్ కేంద్ర ప్రభుత్వ పుణ్యమా అని సైనిక ఒప్పందాలకు, ఆయుధాల కొనుగోలుకు అన్నిటికంటే విశ్వసనీయతను పొందిన దేశంగా మారింది. ఒక్కమాటలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాద ఫాసిస్ట్ విధానాలనకు అమలు చేసే రెండు చేతులుగా ఇండియా, ఇజ్రాయెల్లు మారినవి.

మోడీ పరిపాలన కాలానికి ప్రజాస్వామ్యం నిర్వచనమే మెజారిటేరియనిజంగా మారింది. దేశ భావన జాతి భావనగా, జాతి భావన మత భావనగా, అంటే అధిక సంఖ్యాక మత భావనగా, అంటే బ్రాహ్మణీయ హిందుత్వ భావనగా మారిపోయింది. దీన్నే ఇవాళ బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంగా నక్సల్బరీ పంథాను అనుసరిస్తున్న మావోయిజం నిర్వచిస్తున్నది.

జర్మనీలో 1930ల్లో జాతీయ సామ్యవాదాన్ని తెస్తానని ఎన్నికల్లో గెలిచిన హిట్లర్ బహుళజాతి కంపెనీల ప్రయోజనం కోసం పార్లమెంట్ను తగులబెట్టి నాజీజాన్ని అమలు చేసిన కాలాన్ని చూసాం మనం. చాలా విషయాల్లో అటు అమెరికాలో గాని, ఇజ్రాయెల్లో గాని, ఇరడియాలో గాని మతం, జాతిగా ఒక రేఖ చెరిగిన స్థితి మనం ఇవాళ చూస్తున్నాం. ముస్లిం వ్యతిరేకత ఒక రేసిజంగా అమెరికా, ఇజ్రాయెల్లో మాత్రమే కాదు, ఇంగ్లండ్, ఫ్రాన్స్ల దాకా విస్తరించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ఇటువంటి ఉన్మాదం ముఖ్యంగా జర్మనీలో ఆర్య జాతి పేరుతో, స్వస్తిక్ గుర్తుతో అమలైన తీరు ఇవాళ మన దేశంలో చూస్తున్నాం.

1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం తరువాత క్రమంగా దేశాన్ని మత ప్రాతిపదిక మీద విభజించిన వలసవాదం సాధించిన దానికన్నా ఇవాళ మన దేశంలో ఎన్నికలు దేశ ప్రజలను మత ప్రాతిపదికతో విభజించడం ఎంతో సులభతరం అయిపోయింది. గుజరాత్లో ఐదు ఎన్నికల్లో చేసిన ఈ ప్రయోగం 2014లో అఖిల భారత స్థాయిలో జరిగి, ఇప్పుడు యుపి ఎన్నికలతో రానున్న రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఒక నమూనాగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ వంటి యూరప్లోని అన్ని దేశాల కంటే ఎంతో పెద్దదైన రాష్ట్రంలో ఒక్క ముస్లిం అభ్యర్థికి సీటు ఇవ్వకుండా బిజెపి ఎన్నికలు గెలుచుకోగలిగింది.

కనుక ఎన్నికల చట్రంలోనే ప్రజల ప్రజాస్వామ్యం సాధన అనే మాట ఎంత ఎండమావియో రుజువు అయిన క్రమంలో నక్సల్బరీ ప్రాసంగికత ఇదివరకెప్పటికన్నా ఎక్కువగా ఉన్నది.

ఎన్నికలు సంస్కరణవాదం మాత్రమే కాకుండా కుహనా సంస్కరణవాదం అని 1991 సామ్రాజ్యవాద ప్రపంచీకరణ తరువాత రోజురోజుకూ రుజువు అవుతున్న ఒక చేదు నిజం. సంక్షేమ రాజ్యం, సామ్యవాదం, గరీబీ హఠావో వంటివి ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో ఒక ఆదర్శభావంగా కూడా చెప్పబడడం లేదు. సమానత్వం అనే మాట ఇవాళ ఎన్నికల రాజకీయాల్లో వినిపించదు. ఎన్నికల రాజకీయాల్లో వినిపిస్తున్నదంతా ʹఅభివృద్ధిʹ అనే మాట. ఈ అభివృద్ధి కూడా నూతన ఆర్థిక విధానం పేరుతో పైనుంచి అమలయ్యే అభివృద్ధి నమూనాగా అమలవుతున్నది. ఇది కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమే అనేది ఈ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంలో స్పష్టమైంది. ముఖ్యంగా పీడిత ప్రజలైన ఆదివాసులు, దళితులు, ముస్లింలు, రైతాంగం, కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, ఈ అన్ని సమాజాల్లో, సమూహాల్లో ఉన్న మహిళలు ఈ అభివృద్ధి నమూనా బాధితులే.

దళిత, బహుజన రాజకీయాలు చెప్పే వాళ్లతో సహా మౌలికంగా ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నమూనాను వ్యతిరేకిస్తున్నారా అనేది ఇప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న. యుపిలో మాయావతి పాలన గాని, బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ పాలన గాని, ఇవాళ్టికివ్వాళ కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ పాలన గాని, ఒకప్పటి రైతుల రాజకీయ పార్టీ అయిన అకాలీదళ్ మొదలు కేంద్రానికి వ్యతిరేకంగా వచ్చిన అస్సాం గణపరిషత్ వరకు ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా ఈ అభివృద్ధి నమూనాను వ్యతిరేకించ లేదు. పైగా అదే విధానాలు అమలు చేశాయి. అన్నాదురై కాలపు అన్నా డిఎంకె కూడా ఎంత మారిందో తాజా తమిళ రాజకీయాల్లోని పరిణామాలను బట్టి ఊహించవచ్చు.

ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత వ్యక్తులుగానూ, పార్టీలుగానూ దళారీ పాత్ర నిర్వహించకుండా స్వతంత్రమైన పాత్రను నిర్వహించే స్థితి సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో అసాధ్యమైన స్థితి.

కేంద్రం విషయం అలా ఉంచి ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా ఇవాళ స్వావలంబన రాజకీయాలు మాట్లాడడం లేదు. స్వయం పోషక విషయం మాట్లాడడం లేదు. స్వపరిపాలన విషయం మాట్లాడడం లేదు. అవి ఎన్నికల రాజకీయాల ద్వారా, పార్లమెంటరీ వ్యవస్థ వల్ల సాధ్యమయ్యేవి కాదు.

నక్సల్బరీ రాజకీయాలు కార్మిక వర్గ నాయకత్వంలోకి ఆదివాసులను, దళితులను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చాయి. నక్సల్బరీ రాజకీయాలను చెపుతూ గ్రామాలకు వెళ్లడానికి చారుమజుందార్ ఇచ్చిన కార్యక్రమంలో విప్లవకారులను అంటే కమ్యూనిస్టు కార్యకర్తలను గ్రామాలకు వెళ్లినప్పుడు షెడ్యూల్డ్ కాస్ట్ ప్రజలు ఉండే వాడల్లోకి వెళ్లమని పిలుపు ఇచ్చాడు. వాళ్ల దగ్గరే ఆశ్రయం తీసుకోమన్నాడు. అంటరానివాళ్ల వాడలు తిరిగి అందరి దగ్గర అన్నం అడుక్కుని ఒక చోట చేరి వాళ్లతో పాటు తింటూ, వాళ్ల నుంచి ఆహారం పంచుకున్నట్టుగానే వాళ్లకు విప్లవ రాజకీయాలు ప్రచారం చేయమన్నాడు.

1969 నాటికే చారు మజుందార్ ఇచ్చిన పిలుపు. 1978 తరువాత 85 దాకా ఆంధ్రప్రదేశ్లో రాడికల్ విద్యార్థి యువజనులు ʹగ్రామాలకు తరలండిʹ పిలుపులో లక్షలాది మంది ప్రజల మధ్యన జననాట్య మండలి, విప్లవ రచయితల సంఘం సహకారంతో గ్రామాల్లో అమలు చేసిన విధానం. రైతు కూలీ సంఘాలు ఏర్పడి భూస్వాధీనం చేసుకోవడానికి, విప్లవ పోరాటాల నిర్మాణం చేయడానికి జగిత్యాల జైత్రయాత్ర మొదలు, ఆదిలాబాద్, కరీంనగర్ పోరాటాల నిర్మాణానికి దోహదం చేసింది.

అంత మాత్రమే అయితే అది ఒక ప్రగతిశీలమైన ఆర్థికవాదమే అవుతుంది. 1980లో సిపిఐ (ఎంఎల్) పీపుల్స్వార్ ఏర్పడి ప్రజా యుద్ధానికి పిలుపు ఇచ్చింది. విముక్తి ప్రాంతాల నిర్మాణానికి గడ్చిరోలి, బస్తర్ అడవుల్లోకి ప్రవేశించింది. 1999 నుంచి 2004 నాటికి దేశంలో ప్రధానమైన రెండు విప్లవ పార్టీలతో కలిసి ఒక ఐక్య విప్లవ పార్టీ నిర్మాణంగా మారింది. దానితో తూర్పు, మధ్య భారతాల్లో ఇటు దండకారణ్యం, అటు సరండా, బెంగాల్లో జంగల్మహల్ల దాకా బేస్ ఏరియాలు ఏర్పాటు చేసుకునే స్థితికి ఎదిగింది. పడమటి కనుమల్లో కూడా ఒక బేస్ ఏరియా ఏర్పాటు చేసుకునే ప్రయోగాన్ని ప్రారంభించింది.

1995లో ప్రత్యామ్నాయ రాజకీయాల అమలు కోసం గ్రామ రాజ్య కమిటీలు ఏర్పాటు చేసి బస్తర్, ఉత్తర తెలంగాణలో వందలాది గ్రామాల్లో అమలు చేసే క్రమం తెలంగాణలో దెబ్బతిన్నప్పటికీ గత పన్నెండు సంవత్సరాలుగా అది బస్తర్లో జనతన సర్కార్గా ప్రత్యామ్నాయ రాజకీయాలను అమలు చేస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచ బ్యాంక్ సహకారం లేకుండా బహుళజాతి కంపెనీలను, బడా కంపెనీలను నిలువరించి, ప్రజాయుద్ధాన్ని కొనసాగిస్తూ, ప్రజల ప్రత్యామ్నాయ రాజ్యాన్ని నిర్వహిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం దండకారణ్యంలో అమలవుతున్నది.

నక్సల్బరీ కాలం నుంచి ఏ ప్రత్యామ్నాయ రాజకీయాలనైతే నక్సల్బరీ పంథా చెబుతున్నదో ఇవాళ ఆ ప్రత్యామ్నాయ రాజకీయాలు దండకారణ్యంలో అమలవుతున్నవి. తెలంగాణలో 1948-51 మధ్యన మూడు వేల గ్రామాలలో పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ఎర్రరాజ్యాన్ని ప్రజలు చవిచూసినట్టుగా ఇవాళ పన్నెండేళ్లుగా దండకారణ్యంలో అటువంటి రాజకీయ నిర్మాణాన్ని ప్రజాకీయ రాజకీయాలుగా ఐక్య సంఘటన ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ ఐక్య సంఘటనలో భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, ధనిక రైతులు దాకా ఉన్నారు. నాయకత్వం కార్మిక వర్గానిదే. వీళ్లంతా ఆదివాసులు, దళితులు, బడుగు వర్గాలు. ఎన్నికలను బహిష్కరించి, బూర్జువా ప్రభుత్వాలకు పన్నులు నిరాకరించి, సహకారం, దాని ఉన్నత స్థితి అయిన సమష్టి రాజకీయ ఆర్థిక విధానాలతో స్వావలంబన విధానాలు అక్కడ అమలవుతున్నాయి. స్వపరిపాలన అక్కడ కొనసాగుతున్నది. ఇది ప్రధానంగా రెండు రాజకీయ పంథాల మధ్య ఘర్షణ. రెండు అభివృద్ధి నమూనాల మధ్య ఘర్షణ. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి ప్రజలపై గ్రీన్హంట్ ఆపరేషన్ పేరుతో యుద్ధానికే దిగాయి.

ఈ యుద్ధం శ్రీశ్రీ చెప్పినట్లుగా ʹవిప్లవ కుగ్రామంలో సాగుతున్న గ్లోబల్ సంగ్రామంʹగా ఉన్నది. ఊర్లు తగలబెట్టబడుతున్నాయి. స్త్రీలు సామూహికంగా లైంగిక అత్యాచారాలకు గురవుతున్నారు. వేలాది మంది ఆదివాసులు బూటకపు ఎన్కౌంటర్లలో అమరులవుతున్నారు.

నక్సల్బరీ కాలంలోనే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన మాట ʹసబ్ కా నామ్ వియత్నాంʹ అనేది. ఆనాడు వియత్నాం ప్రజల మీద అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రత్యక్ష యుద్ధానికి దిగితే మొత్తంగా జపాన్, ఫ్రెంచ్, అమెరికన్ సామ్రాజ్యవాద కబళింపుకు వియత్నాం దేశంగా, ప్రజలుగా గురవుతూ ప్రజా యుద్ధాన్ని నిర్మాణం చేసి 1974కు విముక్తమై ఒక్కటైతే ఇవాళ ఈ సామ్రాజ్యవాద దళారీల యుద్ధాన్ని దండకారణ్యం ప్రజాయుద్ధంతో ప్రతిఘటిస్తున్నది.

రాజకీయ పంథా ప్రజా జీవితంలో చాలా ప్రధానమైనటువంటి, కీలకమైనటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైనది. అది ఉత్పత్తి సంబంధాల ఆధారంగా రూపొందుతుంది. వర్గపోరాటం ద్వారా రూపొందుతుంది. ఉత్పత్తి మీద, ఉత్పత్తి సాధనాల మీద ఉత్పత్తి శక్తులు పూర్తి అధికారాన్ని పొందకుండా వాటిని స్వాధీన పరుచుకోకుండా ప్రజల మౌలిక ప్రయోజనాలు నెరవేరవు. శ్రామిక వర్గానికి మాత్రమే కాదు దోపిడీకి గురవుతున్న అన్ని వర్గాలకు కూడా విముక్తి ఇవ్వగలిగినటువంటిది కార్మిక వర్గ అధికారమే. ఇది ఎన్నికల రాజకీయాల వల్ల వచ్చేది కాదు.

ఎన్నికల రాజకీయాలు మనను నెహ్రూ నుంచి మోడీ దాకా నడిపించిన తీరు చూశాం. ఇటీవలనే వెలువడిన రెండు పుస్తకాలు అయూబ్ రానా ʹగుజరాత్ ఫైల్స్ʹ గాని, తీస్తా సెతల్వాద్ ʹఫుట్ సోల్జర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ʹ చదివితే 2002 నుంచి ఇప్పటి దాకా గుజరాత్ మారణకాండ గురించి దేశంలో లౌకిక ప్రజాస్వామ్యవాదులు, విప్లవోద్యమం చెప్తున్న విషయాలకు ఎంత ప్రామాణికమైన ఆధారాలు ఉన్నాయో తెలుస్తుంది. అంతటి గుజరాత్ మారణకాండకు బాధ్యులైన హంతకులు ఇవాళ దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తిగా కేవలం ఈ ఎన్నికల ద్వారానే కాగలిగారు. అక్కడితో ఆగకుండా ముజఫర్నగర్ మారణకాండ దాకా అట్లాగే దాదాపు ఈ మూడు సంవత్సరాలలో గోవధ ఎజెండాగా దళితులపై జరిగిన మారణకాండకు బాధ్యులైన వాళ్లు ఇవాళ ఉత్తరప్రదేశ్లో అధికారానికి రాగలిగారు.

రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్యంగా ఉంటూనే ఎన్నికల రాజకీయాల ద్వారా మత రాజ్యంగా మారిన తీరును 70 ఏళ్ల భారత స్వాతంత్య్రం ఒక విషాద చరిత్రగా మన ముందుంచింది. అమెరికాలో రేసిజం, మన దేశంలో హిందూ మతోన్మాదం ప్రజలను ఏకం చేసే ఒక సాధనగా ఈ ఎన్నికల మాయాజాలం ద్వారా సాధ్యం కావడంలోనే మరో ప్రత్యామ్నాయం గురించి చాలా రాడికల్గా ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడే రాజ్యాంగ చట్రానికి బయట ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించిన నక్సల్బరీకి ప్రాసంగికత వస్తుంది.

నక్సల్బరీ నాడు గాని, 1991 కంటే ముందు గాని విప్లవోద్యమం బయట ఉన్న వాళ్లకు అర్థం కాని సామ్రాజ్యవాద శక్తుల దోపిడీ ఇప్పుడు తూర్పు, మధ్య భారతాల్లో కార్పొరేట్ శక్తుల దోపిడీ వల్ల స్పష్టంగా అర్థమవుతున్నది. కార్పొరేట్ శక్తుల కొరకే ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేస్తున్నాయనీ, రాజ్యాంగాన్ని సవరిస్తున్నాయనీ, రాజ్యాంగేతరం గా కూడా వ్యవహరిస్తున్నాయనీ ప్రజల సార్వభౌమాధికారం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ప్రకృతి సంపదను, ప్రజల శ్రమశక్తిని దోచుకుంటున్న ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా తూర్పు, మధ్య భారతాల్లో పోరాడుతున్న ఆదివాసుల మధ్యన మావోయిస్టులు ఉన్న చోట మాత్రమే ప్రతిఘటన సాధ్యమవుతున్నదని కూడా వీళ్లందరూ అంగీకరిస్తున్నారు.

తాజాగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నియాంగిరి ఆదివాసుల పోరాటాన్ని, వేదాంత కంపెనీని నిలువరించగలిగిన శక్తిని పార్లమెంట్లో హోంమంత్రిత్వ శాఖ మావోయిస్టు ప్రతిఘటనగా చూపి నిషేధించే ప్రయత్నం చేసింది. జార్ఖండ్లో కూడా అదే పని చేసింది. ప్రొ. జి.ఎన్. సాయిబాబా భావజాల రీత్యా ఇటువంటి పోరాటాలను బలపరచడాన్ని కూడా చాల ప్రమాదకరమైన చర్యగా న్యాయవ్యవస్థ కూడా భావిస్తున్నది. ఆదివాసులపై జరుగుతున్న అణచివేతను జల్, జంగల్, జమీన్ల దోపిడీని పరిశీలించి, సత్యశోధన చేయాలనుకునే వాళ్లు కూడా ఈ వ్యవస్థ దృష్టిలో నేరస్తులుగా కనిపిస్తున్నారు. ప్రజల స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి కూడా, అంటే ప్రజలదైన శ్రమ, ప్రకృతి సంపద పైన ప్రజల స్వాధీనతను ప్రకటించుకోవడానికి కూడా విప్లవ ప్రతిఘటన తప్ప మార్గాంతరం లేని దగ్గరికి వచ్చి చేరాం.

గెలుపు ఓటముల దృష్టితో కాకుండా న్యాయాన్యాయాల దృష్టితో చూసినప్పుడు ఇవాళ ఉన్న ఎన్నికల రాజకీయాల దోపిడీ, పీడనల స్వభావానికి నక్సల్బరీ పంథా ప్రతిఘటన స్వభావానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రజాన్యాయం కోసం నక్సల్బరీ పంథా తప్ప మరో మార్గం లేదనే అవగాహనకు వర్గపోరాట దృక్పథం ఉన్నవాళ్లు మాత్రమే కాక స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో పాటు సమానత్వం కోరుకునే వాళ్లు కూడా రాకతప్పనిస్థితి ఇవాళ ఉంది.

ఫ్రెంచ్ విప్లవం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో పాటు సమానత్వం కూడా సాధించబడాలంటే అది ప్యారిస్ కమ్యూన్లో మొదటిసారి సాధ్యమైన కార్మికవర్గ విప్లవం ద్వారానే సాధ్యం అనేది ఇవాళ నిర్వివాద అంశంగా దండకారణ్యంలోని జనతన సర్కార్ ద్వారా నక్సల్బరీ పంథా రుజువు చేస్తున్నది.

ఒక ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ స్వాధీన స్వామ్యం ఏర్పడడానికి అంతే స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయ నిర్మాణం కూడా అవసరం అవుతుంది. మానవ శరీరంలో మానవ చర్యలన్నిటినీ నియంత్రించే మెదడు గాని, గుండె గాని మానవశరీరాకృతి లోపలనే ఉంటాయి. ఆ రెండింటి ఆరోగ్యమే బాహిరంగా కనిపించే కార్యాచరణలో నిమగ్నమయ్యే అంగాలన్నిటినీ నియంత్రిస్తుంది, నిర్దేశిస్తుంది. కార్మికవర్గ పార్టీ నిర్మాణం కూడా అటువంటిదే.

నక్సల్బరీ విస్ఫోటనం తరువాత అటువంటి కార్మిక వర్గ పార్టీ నిర్మాణం అవసరమై సిపిఐ (ఎంఎల్) 1969 ఏప్రిల్ 22న ఏర్పడింది. ఆనాడు అది ఏ బహిరంగ కార్యకలాపాలు లేకుండా మొత్తం రహస్యంగానే పనిచేయాలని అనుకున్నప్పటికీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్లోని విప్లవోద్యమం విరసం ఏర్పాటుతో మొదలై క్రమంగా 1974 నాటికి అన్ని ప్రజాసంఘాలను ఏర్పాటు చేసుకున్నది. 1980లలో, 90లలో అటువంటి ఏర్పాటులో మినహాయింపులు, లోటుపాట్లు ఉన్నా సవరించుకున్నది. సహస్ర బాహువులతో నూతన ప్రజాస్వామిక విప్లవ నిర్మాణంలో భాగమయింది.

కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం ఒక్కటే రాజ్యానికి రహస్యం తప్ప ప్రపంచాన్ని సమూలంగా మార్చే కమ్యూనిస్టు పార్టీ ప్రాపంచిక దృక్పథం ఎవరికీ రహస్యం కాదనే మార్క్సిస్ట్ అవగాహనకు అనుగుణంగా విప్లవోద్యమ నిర్మాణం, ప్రచారం జరుగుతున్నది. ఇది సరళరేఖగా సాగుతున్నదని గాని, సజావుగా సాగుతున్నదని గాని చెప్పడం కాదు. ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ కూడా ప్రపంచ చరిత్రలోనే ఇంత సుదీర్ఘకాలం సాయుధ పోరాటం ప్రధాన రూపంగా వర్గపోరాటం నిర్వహించిన సందర్భం మరొకటి లేదు. రష్యా ఎదుర్కొన్న జాతుల సమస్య, చైనాకు లేని కుల సమస్య, పార్లమెంటరీ రాజకీయాల సమస్య ముప్పేటగా భారత విప్లవం ఎదుర్కొంటున్నది. నక్సల్బరీ కాలానికి చాపకింద నీటిలాగా ఉన్న మెజారిటీ మత భావన ఇప్పుడు రాజ్య స్వభావం అయింది. ఎన్నికల ఎజెండా అయింది. ప్రజాస్వామ్యం అంటే మెజారిటేరియనిజంగా మారింది. ఆసియా ఖండంలో ఇంత కేంద్రీకృతమైన, సాంకేతికంగా బలపడిన, విస్తృత నిర్మాణం ఉన్న పార్లమెంటరీ రాజకీయాలు కూడా మరెక్కడా లేవు. ఇన్ని ప్రతికూల భావాలను ఎదుర్కొంటూ నక్సల్బరీ పంథా పురోగమిస్తున్నది.

ఈ రాజకీయ ఎజెండాను ఆచరించడానికి ఏర్పడిన పార్టీ నిర్మాణం అజ్ఞాతంగా ఉండాలనేది సిపిఐ (ఎంఎల్) ఏర్పడినప్పటి నుంచి ఉన్న అవగాహన. ఎన్నికల బహిష్కరణ, బూర్జువా నియంతృత్వ పాలన విధించే పన్నుల ఎగవేత అది ప్రతిపాదించే కనీస కార్యక్రమం. విప్లవ నిర్మాణం బలమైన చోటల్లా అమలవుతున్నది. ఇప్పుడు అది దండకారణ్యంలోని జనతన సర్కార్లో అమలవుతున్నది. వాటి స్థానంలో సహకార, సమష్టి స్థాయిలో స్వచ్ఛందంగా శ్రమలో పాల్గొంటూ, ఉత్పత్తి సాధనాలను, భూమిని తమ స్వాధీనంలో ఉంచుకొని ప్రజలు ఫలాలు అనుభవించే ప్రజాస్వామ్యం అక్కడ అమలవుతున్నది. మావో చెప్పినటువంటి మూడు మంత్రదండాలు - ఉక్కు శిక్షణ గల పార్టీ; ఐక్య సంఘటన; ప్రజాసైన్య నిర్మాణం - అక్కడ బీజరూపంలోనైనా ఉన్నాయి.

పునాది రాజకీయాల్లో ఎంత ప్రత్యామ్నాయం అయినటువంటి మౌలిక మార్పులను నక్సల్బరీ ప్రతిపాదించి ఈనాటికీ కొనసాగిస్తున్నదో, ఉపరితల రాజకీయాలలో కూడా అన్ని ప్రత్యామ్నాయ మార్పులను తీసుకొని వచ్చింది. పునాది ఉపరితల సంబంధాలను సృజనాత్మకంగా నిర్వచించింది. ఒక రైతు భాషలో మావో సె టుంగ్ చెప్పినట్టు చూరు నుంచి కారే నీరు ఇంటి పునాదిలో పడి పునాది లుకలుకలయ్యే ప్రమాదం ఉందని చెప్పినట్టుగా ఉత్పత్తి సంబంధాల చర్చల వలెనే భావజాల చర్చ కూడా అంత తీవ్రంగా నక్సల్బరీ కాలంలో జరుగుతున్నది. నక్సల్బరీ ప్రతిపాదించిన విగ్రహ విధ్వంసనను యాంత్రిక రూపంలో తీసుకున్న వాళ్లు అది విలువల సంస్కృతి చర్చ అని గ్రహించలేరు. మనకివ్వబడిన ఏ విలువనూ దానికదిగా ప్రశ్నించకుండా స్వీకరించకూడదు. అది కన్ఫ్యూషియస్ చెప్పిందైనా సరే, రాజారాం మోహన్ రాయ్ చెప్పిందైనా, గాంధీ చెప్పిందైనా. జాతీయోద్యమం, రెనైజాన్స్ వంటి మాటలను కూడా విమర్శించకుండా నక్సల్బరీ ఉండలేదు.

నక్సల్బరీ 1857 భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఈ దేశంలో ప్రజాస్వామ్య విప్లవానికి ఆరంభంగా తీసుకున్నది. అది అసంపూర్ణంగా మిగిలిపోయిందని, దాని పరిపూర్తి మాత్రం నూతన ప్రజాస్వామిక విప్లవంలోనే ఉన్నదని ప్రతిపాదించింది.

వ్యవసాయ విప్లవం భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు రైతాంగంగా, కర్మాగారంలో పనిచేసే కార్మికులు కార్మికవర్గంగా, రైతాంగ, కార్మిక వర్గాలు ప్రధాన విప్లవకర వర్గాలుగా నిర్వహింపబడేది గనుక, వ్యవసాయ దేశాల్లో ఇటువంటి వాళ్లందరు ఎక్కువగా నిరక్షరాస్యులే గనుక వీళ్ల దగ్గరికి విప్లవ సందేశం మౌఖిక కళారూపాల్లో వెళ్లాలనే స్పష్టమైన మార్క్సిస్ట్ అవగాహన కూడా నక్సల్బరీ ముందుకు తెచ్చింది.
- వరవరరావు
(ఇంకా ఉంది)

Keywords : virasam, varavararao, maoists, naxalbari
(2024-03-21 01:36:45)



No. of visitors : 2369

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నక్సల్బరీ