తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

తెలంగాణలో

(సీనియర్ జర్నలిస్టు, రచయిత, వీక్షణం సంపాదకుడు ఎన్. వేణు గోపాల్ రాసిన ఈ వ్యాసం ఆగస్ట్ 2017 వీక్షణం సంచికలో ప్రచురించబడినది)

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి. ఎన్నో వాస్తవాలు, ఊహలు, కల్పనలు, అర్ధసత్యాలు, అసత్యాలు, అతిశయోక్తులు కలిపి వండిన ఈ వార్తా కథనాలు సంచలనానికే తప్ప నిజమైన పరిశోధనకు, చర్యలకు, అక్రమాల సవరణకు దారి తీయలేదు. ఏదైనా కుంభకోణం, అక్రమం బైటపడిన వెంటనే ఎవరినీ వదలం, దోషులను శిక్షిస్తాం అని గర్జించిన ఆనవాయితీ తోనే ముఖ్యమంత్రి, అధికారపక్ష నాయకులు, అధికారులు ఈసారి కూడ గర్జించారు గాని ఆ తర్వాత దర్యాప్తు, విచారణ, తప్పించుకున్న నిందితుల కోసం అన్వేషణ, న్యాయస్థానంలో వ్యాజ్యాలు, అక్రమాలు జరిపినవారికి శిక్షలు వంటి ప్రక్రియలలో ఏ ఒక్కటీ అంగుళమైనా ముందుకు కదలలేదు. ఈ లోగా మరొక సంచలనంగా మాదకద్రవ్యాల కుంభకోణం వార్తలు బద్దలు కావడంతో భూకుంభకోణం వార్తలు విస్మృతిలో పడిపోయాయి. అసలు భూకుంభకోణం వార్తలను పక్కకు తప్పించేందుకే పథకం ప్రకారం మాదకద్రవ్యాల కుంభకోణం వార్తలు బైటపెట్టారని కూడ ఆరోపణలు వస్తున్నాయి. మాదకద్రవ్యాల కేసులో కూడ ఏ చర్యలూ తీసుకోకుండానే జనం కళ్లుకప్పడానికి మరొక సంచలనం ఏదో రానే వస్తుంది.

హైదరాబాద్‌లో భూమి క్రయ విక్రమాలలో అక్రమాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అక్రమాలకు అధికార వర్గపు మద్దతు, భూ కుంభకోణాలు కొత్తవి కావు గాని తాజాగా బైటపడిన మియాపూర్‌ కుంభకోణం తీగలాగితే డొంక కదిలినట్టు అనేక విషయాలు బైటికి తెచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ తన పరిధిలో లేని మియాపూర్‌లో దాదాపు 693 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థతో సహా కొందరి పేర్లమీదికి వ్యక్తిగతంగా బదలాయించాడని మే చివరి వారంలో బైటపడింది. ఆ భూమి హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హుడా)కి చెందినది కాగా, దానిలో అత్యధిక భాగాన్ని పొన్నపూల సంజీవ ప్రసాద్‌ అనే వ్యక్తికి చెందిన గోల్డ్‌స్టోన్‌ ఇన్ఫ్రాటెక్‌, ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్‌, సువిశాల్‌ పవర్‌ జనరేటర్స్‌ అనే వ్యాపార సంస్థల పేర్ల మీదికి ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాసరావు రిజిస్టర్‌ చేశాడని వార్తలు బైటికి వచ్చాయి. ఈ లావాదేవీలో భారీగా లాభపడిన ప్రసాద్‌ గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌గా సుప్రసిద్ధుడు. అమెరికాలో ముప్పై ఏళ్ల కిందనే ఒక పెద్ద ద్రవ్య కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్నవాడు. చంద్రబాబు నాయుడు పాలనా కాలం నుంచీ హైదరాబాదులో రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలకు ప్రధాన సూత్రధారులలో ఒకడుగా ఉన్నవాడు. ఇప్పుడు అక్రమాలు జరిగిన మూడు వ్యాపార సంస్థలు ఆయనకు చెందినవే కాగా, రెండు సంస్థలకు సంబంధించిన ఒక్కొక్క డైరెక్టర్‌ ను అరెస్టు చేసి, కొద్ది రోజుల్లోనే బెయిల్‌ పై విడుదల చేశారు గాని రెండు నెలలు గడిచినా అసలు గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ ఆచూకీ కనిపెట్టడానికి, అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కూడ జరగడం లేదు.

నిజాం పాలనా కాలంలో జాగీరు గ్రామమైన మియాపూర్‌లోని ఈ భూమిని నవాబు ఖైరసుద్దీన్‌ ఖాన్‌కు నిజాం ప్రభుత్వం సనద్‌గా ఇచ్చిందని, ఆ భూమి 1917-18 నాటికే నవాబ్‌ అధీనంలో ఉందని ఆధారాలున్నాయి. కాని పోలీసు చర్య తర్వాత ఇటువంటి భూములన్నిటినీ స్వాధీనం చేసుకున్నట్టుగానే ఈ భూమిని కూడ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది ప్రభుత్వ భూమి కాదని, తమ భూమేనని నవాబ్‌ ఖైసరుద్దీన్‌ ఖాన్‌ వారసులమని చెప్పుకునే కొందరు గతంలోనే న్యాయ స్థానాలను ఆశ్రయించారు. అలా వివాదంలో చిక్కిన ఈ భూమి గురించి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా 2007లోనూ, 2010లోనూ సర్వే నంబర్లతో సహా ప్రకటిస్తూ, ఇక్కడ ఏ వివాదాలూ చెల్లవని, ఇది ప్రభుత్వానికి మాత్రమే చెందుతుందని, ఈ భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్‌ జరగడం నిషిద్ధమని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ చరిత్ర అంతా ఉండగా కూడ కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌. శ్రీనివాస రావు 2017 జనవరి 16న ఈ భూముల మీద ఖైరసుద్దీన్‌ ఖాన్‌ వారసులుగా చెప్పుకుంటున్న అమీరున్నిసా బేగమ్‌ తదితరుల పేరు మీద జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ రిజిస్టర్‌ చేశాడు. ఆ సాయంత్రమే వారు ఆ భూమిని గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకు అమ్మినట్టుగా కూడ రిజిస్టర్‌ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్‌ను మామూలుగా భూముల రిజిస్ట్రేషన్‌ జాబితాలో చేర్చకుండా, వివాహ రిజిస్ట్రేషన్‌లతో కలిపి పెట్టి, భూముల రిజిస్ట్రేషన్‌ లో పరిగణనలోకే రాకుండా చేశాడు. నిజానికి మియాపూర్‌ భూములు ఈ కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోకి రావు. కాని 2013లో అప్పటి ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌లో విప్లవాత్మక మార్పు అనే పేరుతో ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ (ఎక్కడి భూమినైనా ఎక్కడైనా రిజిస్టర్‌ చేసుకునే సౌకర్యం) ప్రవేశపెట్టింది. దానితో ఒక భూమి వివరాలు తెలిసి ఉండడానికి అవకాశం ఉన్న స్థానిక రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కాక అక్రమంగా, అవినీతితో సుదూరపు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేరుుంచడం అక్రమ భూ వ్యాపారులకు అలవాటయింది.

అతి విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి చట్టబద్ధమైన ఏర్పాటు చేయడం, నిషిద్ధ భూమిని రిజిస్టర్‌ చేయడం, అతి తక్కువ స్టాంప్‌ డ్యూటీ వసూలు చేయడం, ఈ అక్రమాలు చేసినందుకు లక్షల రూపాయలో, కోట్ల రూపాయలో లంచం తినడం వంటి అనేక కారణాల వల్ల కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ చేసిన చర్య చట్టవ్యతిరేకమైనది, అక్రమమైనది, అనైతికమైనది. ఆ చర్య ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయల నష్టం తేవడంతో పాటు, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి వీలు కల్పించింది. ఇలా చేతులు మారిన భూమి 693 ఎకరాలు అని తొలివార్తలు రాగా, 796 ఎకరాలని, 816 ఎకరాలని ఆ అంకె మారుతూ వచ్చింది. ఈ భూమి విలువ పదివేల కోట్ల రూపాయల దాకా ఉండవచ్చునని ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈ అక్రమాలన్నీ ఒక అంతర్గత పరిశీలనలో బైటపడి, ఉన్నతాధికారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రవేశించి మే 29న ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ ను, ఇన్ఫ్రా కంపెనీల డైరెక్టర్లు ఇద్దరిని అరెస్టు చేసి కేసు పెట్టారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా భారీగా ఉత్సవాలు జరుపుకోబోతున్న ప్రభుత్వానికి సరిగ్గా మూడు రోజుల ముందే ఈ భారీ కుంభకోణం బైటపడడంతో ఏవో కంటి తుడుపు చర్యలు తీసుకోక తప్పలేదు. ప్రభుత్వం హడావిడిగా రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా 142 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల మీద దాడి చేయమని పోలీసులను ఆదేశించింది. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ పద్ధతిని రద్దు చేసింది. డెబ్బై మందికి పైగా సబ్‌ రిజిస్ట్రార్లను, జాయింట్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేసింది. సబ్‌ రిజిస్ట్రార్లకు, రిజిస్ట్రార్లకు ఉన్న అధికారాలపై కోత విధించింది. మియాపూర్‌ భూకుంభకోణంపై సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. జిల్లాలలో కూడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల మీద అవినీతి నిరోధక శాఖ చేత దాడులు చేయించింది. ఇకనుంచి అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సిసిటివి కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు కొందరు సబ్‌ రిజిస్ట్రార్ల ఇళ్ల మీద కూడ దాడిచేసి వారి ఆదాయాలకు మించిన ఆస్తులు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని తేల్చారు.

అయితే ఈ కుంభకోణం గురించి వార్తలు తమ ఉత్సవాల మధ్య ఇబ్బంది పెట్టారుు గనుక మాత్రమే పాలకులు ఈ మాత్రం తూతూ మంత్రం చర్యలు ప్రకటించారు గాని ఈ చర్యలు కొనసాగించాలని, అక్రమాలకు పాల్పడిన వారందరినీ విచారించాలనీ, శిక్షించాలనీ, హైదరాబాదు లోనూ తెలంగాణలోనూ భూక్రయ విక్రయాల అక్రమాలను అరికట్టడానికి ఇది ఒక సందర్భంగ తీసుకోవాలనీ అనుకోలేదు. ఇటువంటి భూముల అమ్మకం కొనుగోలు అక్రమాలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం, రిజిస్ట్రేషన్‌ అధికారుల అవినీతి ఒక్క మియాపూర్‌లో మాత్రమే జరగలేదు. అదే సమయంలో నగరంలోని గచ్చీబౌలి, ఎల్బీ నగర్‌, బాలానగర్‌, ఘాంసిమియా గూడ (శంషాబాద్‌), ఇబ్రహీంపట్నం వంటి చోట్ల జరిగిన భూకుంభకోణాల గురించి కూడ వార్తలు వెలువడ్డాయి. అంటే మియాపూర్‌లో బైటపడినది నీటిలో మునిగి ఉన్న మంచుకొండ శిఖరాగ్రం మాత్రమేననీ, తవ్వితే ప్రతి ఎకరంలోనూ అక్రమాలు బైటపడే అవకాశం ఉందని స్పష్టమయింది. అందువల్ల ఒక విశాలమైన, సమగ్రమైన విచారణ, పరిశోధన, కఠిన చర్యలకు నాంది పలకవలసిన సందర్భం వచ్చింది. కాని ఈ భూముల కుంభకోణాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రిజిస్ట్రేషన్‌ అధికారులు మాత్రమే కాక, అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక సీనియర్‌ మహిళా ఐఎఎస్‌ అధికారి, ఒక మంత్రి పేషీలోని ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ వంటివారికి సంబంధాలున్నాయని బైటపడింది. పాలకపార్టీ పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు కుటుంబ సభ్యుల పేరు మీద ఈ అక్రమ భూముల్లో కొంత భాగం రిజిస్టర్ అయిందని బైటపడింది. మియపూర్‌లో అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ అయిన ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్‌ అనే సంస్థకూ పాలకపార్టీకి సన్నిహితుడు, ముఖ్యమంత్రి బంధువు, పాలకపార్టీ పత్రిక యజమాని దీవకొండ దామోదర్‌ రావుకూ సన్నిహిత సంబంధం ఉందని బైటపడింది. అంటే నిజాయితీతో దర్యాప్తు, పరిశోధన జరిపితే చూపుడువేలు అధికారపక్షం వైపుకే తిరుగుతుందని స్పష్టంగా తేలింది. అందువల్లనే భూముల అక్రమ క్రయవిక్రయాల కేసులో సమగ్రంగా దర్యాప్తు, పరిశోధన జరపాలని, నేరస్తులందరినీ బోనెక్కించి విచారించాలని, నేరస్తులకు శిక్షలు విధించేలా చూడాలని పాలకులు అనుకోలేదు. ఈ వివాదం నుంచి బైటపడడం ఎట్లా, ప్రజలదృష్టిని మళ్లించడం ఎట్లా అనే అంశాలపైనే కేంద్రీకరించారు.

అసలు మియాపూర్‌ కుంభకోణంలో బైటపడిన భూ క్రయ విక్రయ ఆక్రమణ అక్రమాలు సముద్రంలో కాకిరెట్ట లాంటివి. తెలంగాణ భూమి చరిత్ర, హైదరాబాద్‌ నగర భూమి చరిత్ర ఇటువంటి ఎన్నో కుంభకోణా లకు, అక్రమాలకు వీలు కల్పించే చరిత్ర. ఇందుకు ప్రధాన కారణం అసఫ్‌ జాహీ పాలనలో నెలకొన్న భూయాజమాన్యపు అవకతవకలు, వాటిని యథాతథంగా కొనసాగించిన ఆంధ్రప్రదేశ్‌ పాలకుల అక్రమాలు.

అసఫ్‌ జాహీ పాలనలోని హైదరాబాద్‌ రాజ్యం ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల విస్తీర్ణంతో ఉండేది. మొత్తం రాజ్యంలో పదో వంతు భూమి, యాబై రెండు లక్షల ఎకరాలు, నిజాం ప్రభువుల సొంత ఆస్తి (సర్ఫ్‌ ఎ ఖాస్‌) గా ఉండేది. అది మొత్తం రాజ్యంలో 1961 గ్రామాల్లో విస్తరించి ఉండగా, అందులో తెలంగాణలో 789 గ్రామాలుండేవి. అది కాక, పాయెగాలు, ఉమ్రాలు, జాగీర్లు, సంస్థానాలు, ఎస్టేట్లు, ఇనాంలు, దేశముఖ్‌లు, దేశపాండేలు, మక్తేదార్లు వంటి ఏడెనిమిది అంతరాల భూస్వామ్య వర్గం చేతుల్లో మరొక రెండు కోట్ల ఎకరాలుండేది. అంటే వందల, వేల, లక్షల ఎకరాలు సొంతఆస్తిగా కలిగిన భూస్వాముల చేతుల్లోనే రాజ్యంలోని సగం భూమి ఉండేది. నాటి హైదరాబాద్‌ రాజ్యంలో మరాఠీ మాట్లాడే ఐదు జిల్లాలు, కన్నడం మాట్లాడే మూడు జిల్లాలు మినహాయిస్తే, అప్పటికి ఎనిమిది జిల్లాల తెలంగాణ విస్తీర్ణం రెండు కోట్ల ఎనబై లక్షల ఎకరాలు కాగా, అందులో ఉజ్జాయింపుగా సగం ఒక కోటీ నలబై లక్షల ఎకరాలు రాజుకూ, ప్రభువర్గానికీ, బడా భూస్వాములకూ చెందినదని అనుకోవచ్చు. హైదరాబాదుపై పోలీసు చర్య అనే సైనిక చర్య తర్వాత ఈ బడా భూస్వామ్య వర్గపు ఆస్తిలో, ముఖ్యంగా భూమిలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆస్తిగా మారింది.

భారత ప్రభుత్వ సైనిక చర్యతో 1948 సెప్టెంబర్‌ 17న నిజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత 1949 ఫిబ్రవరి 22న సర్ఫ్‌ ఎ ఖాస్‌ భూములను ప్రభుత్వానికి బదలాయిస్తూ ఒక ఫర్మాన్‌ విడుదల చేశారు. 1949 ఆగస్ట్‌లో జాగీర్ల రద్దు చట్టం ప్రకటించి, 967 జాగీర్ల అధీనంలోని 6,536 గ్రామాలలో ఒక కోటీ అరవై నాలుగు లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ అంకె మొత్తం హైదారాబాదు రాజ్యానికి సంబంధించినది గాని, అందులో సగం తెలంగాణలో ఉండి ఉండవచ్చు. ప్రభుత్వం ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు, జాగీర్దార్లకు నష్టపరిహారం చెల్లించి మరీ ఈ భూములను స్వాధీనం చేసుకున్నది. ఆ భూముల్లో కొంత భాగం మీద అప్పటికి కనీసం ఏడు సంవత్సరాలుగా కౌలుకు సాగు చేస్తున్న రైతులకు 1950 రక్షిత కౌల్దారీ చట్టం ప్రకారం అధికారం స్థిరపడింది గాని సాగులో లేని భూమి లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూమిగా మారింది. లేదా, అంగబలం, అర్ధబలం ఉండి ఆక్రమించుకున్న పెత్తందార్ల ఆస్తిగా మారింది. అలాగే సైనిక చర్య తర్వాత చాల మంది బడా భూస్వాములు, ముఖ్యంగా ముస్లిం భూస్వాములు పాకిస్తాన్‌కో, ఇతర దేశాలకో వెళ్లిపోవడంతో వారి భూములు, ఆస్తులు లావారిస్‌ (వారసులు లేని) ఆస్తులుగా మిగిలి, దురాక్రమించుకున్న వారి ఆస్తులుగా మారిపోయారుు.

నిజానికి తెలంగాణ భూయాజమాన్యంలోని ఇటువంటి చారిత్రక అవకతవకల గురించి ఇంకా పరిశోధించవలసినదీ, విశ్లేషించవలసినదీ ఎంతో ఉంది గాని ప్రత్యేకించి హైదరాబాద్‌ గురించి కూడ కొంత తెలుసుకోవాలి. తెలంగాణలో సర్ఫ్‌ ఎ ఖాస్‌ మొత్తం 789 గ్రామాల్లో విస్తరించి ఉండగా, అందులో అత్యధికంగా 573 గ్రామాలు అత్రాఫ్‌ బల్దా జిల్లాలోనే ఉండేవి. నాటి అత్రాఫ్‌ బల్దా జిల్లా అంటే ప్రస్తుత గ్రేటర్‌ హైదరాబాద్‌. లేదా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు. అంటే ప్రస్తుత గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని కొన్ని లక్షల ఎకరాలు 1948 సెప్టెంబర్‌ తర్వాత ప్రభుత్వ భూమిగా మారిపోయారుు. దేశవ్యాప్తంగా సంస్థానాలు, రాజకుటుంబాలు, వారి రాజ్యాల రాజధాని నగరాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఆ నగరాల్లో ఏ ఒక్కదానికీ లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు దక్కింది. నగరంలోనూ, చుట్టుపట్లా లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ఏకైక నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. దానితో పాటే తెలంగాణ అంతటా, ముఖ్యంగా జాగీరు గ్రామాలలో, ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరంలో చాల చోట్ల భూయాజమాన్యం గురించి స్పష్టమైన, నిస్సందేహమైన, నిర్ద్వంద్వమైన పత్రాలు లేని స్థితి ఉండింది. అసంఖ్యాకంగా భూ యాజమాన్య వివాదాలు, న్యాయస్థానపు వ్యాజ్యాలు చెలరేగారుు. ఈ కారణం వల్లనే తెలంగాణలో భూముల క్రయ విక్రయాలు ఇష్టారాజ్యంగా జరగగూడదని, తెలంగాణ ప్రాంతీయ మండలి ఆమోదం మేరకే క్రయ విక్రయాలు జరగాలని ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం (1956) లో ఒక నిబంధన చేర్చారు.

అయినప్పటికీ 1950 నుంచే రాజకీయ, అధికార వర్గాలు భూములను ఆక్రమించడం, లావారిస్‌ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తమకు అంతకు ముందు ఎప్పుడో అమ్మినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించడం, వారసులు కాని వారెందరో తామే వారసులమని, తమకు ఆస్తులు ఇప్పించాలని న్యాయస్థానాలలో వ్యాజ్యాలు వేయడం మొదలయ్యారుు. ఇవి వ్యక్తిగత స్థాయి వివాదాలు కాగా, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనకు వారసత్వంగా వచ్చిన విస్తారమైన భూమిని తన ఇష్టారాజ్యంగా ఆశ్రితులకు పంపిణీ చేయడం ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సైనిక బలగాలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు వంటి ప్రభుత్వ, ప్రజోపయోగ కార్యక్రమాలకు వేలాది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ఇక 1980లు వచ్చి, ప్రపంచీకరణ కార్యక్రమాలు, బహుళజాతి సంస్థల భూముల వేట, దేశదేశాల సంపన్నులు, ముఖ్యంగా కోస్తాప్రాంతం నుంచి విదేశాలకు, అమెరికాకు వెళ్లి విపరీతంగా డబ్బు సంపాదించి దాన్ని తిరిగి స్వరాష్ట్రంలో మదుపు పెట్టదలచుకున్న శక్తులు అందరికీ ఏదో ఒక సరైనదో, కానిదో కారణం చూపి వందల ఎకరాలు భూమి అడగడానికీ, ప్రభుత్వాధికారం నెరపుతున్న పెద్దలు చేతికి ఎముక లేకుండా దానం చేయడానికీ మార్గం సుగమమైంది. మొదట భూమిని ప్రభుత్వ భూమిగానే ఉంచుతూ కారు చౌకగా 49 సంవత్సరాల, 99 సంవత్సరాల లీజుకు ఆయా వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టే అలవాటు, క్రమంగా చంద్రబాబు నాయుడు వచ్చేనాటికి కారుచౌక ధరలకు పూర్తి అమ్మకంగా, చివరికి ఉచితంగా కూడ ఇవ్వడంగా మారింది. భూమి మీద ప్రభుత్వ యాజమాన్యం స్థానంలో పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారస్తులుగా చెప్పుకుని భూమి సంపాదించినవారి యాజమాన్యం మొదలయింది. సినిమా పరిశ్రమ తరలిరావడానికనే పేరుతో, పారిశ్రామికీకరణ పేరుతో, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బిజినెస్‌ సర్వీసెస్‌ పేరుతో ప్రజా ప్రయోజనం ఉన్నా లేకపోరుునా భూమి పందారం మొదలయింది. ఇలా దురాక్రమించిన, అక్రమంగా కబ్జా పెట్టిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఫార్మ్‌ హౌజులు, రిసార్టులు, గెస్ట్‌ హౌజులు, క్లబ్బులు, తోటలు, సినిమా స్టుడియోలు, ఐటి కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

ప్రభుత్వానికి, విప్లవపార్టీలకు మధ్య జరిగిన చర్చలలో 2004 అక్టోబర్‌ 15న విప్లవ పార్టీలు ప్రభుత్వం ముందు ఉంచిన ʹభూమి పంపిణీ - వ్యవసాయ రంగ అభివృద్ధి - మా అవగాహనʹ అనే పత్రంలో ʹమా నిర్దిష్ట ప్రతిపాదనలుʹ అనే శీర్షిక కింద చేసిన 17 ప్రతిపాదనలలో ఒకటిగా ʹʹవ్యవసాయంతో సంబంధం లేని ఫార్మ్‌ హౌజెస్‌, స్టుడియోలు, పరిశ్రమలు, పత్రికలు, విద్య, వైద్యం, వినోదం, రియల్‌ ఎస్టేట్‌ పేరు మీద కొనసాగుతున్న వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి. పట్టణాల్లో వివిధ సంస్థలకు అవసరానికి మించి ప్రభుత్వం ఇచ్చిన భూమి, రియల్‌ ఎస్టేట్‌గా మారే అవకాశం ఉన్న వ్యవసాయ భూమిని కూడ వెనక్కి తీసుకుని పేదలకు పంచాలిʹʹ అని ప్రతిపాదించారు. ఈ పత్రానికి అనుబందంగా ʹహైదరాబాద్‌ పరిసరాల్లో అన్యాక్రాంతమైన వ్యవసాయ భూముల వివరాలుʹ అంటూ దాదాపు 50 సంస్థలకు ఇచ్చిన 25,000 ఎకరాలకు పైగా భూమి వివరాలు ఇచ్చారు. ఈ వివరాల మీద భూఆక్రమణల మీద, పందారాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌ భూముల విషయంలో జరిగిన అక్రమాల గురించి ఇంతగా చర్చ జరిగినప్పటికీ, ఆ తర్వాత కూడ భూపందారాలు ఆగలేదు. మణికొండ జాగీర్‌ భూములను ఎమార్‌ ప్రాపర్టీస్‌ అనే దుబారుుకి చెందిన దొంగ కంపెనీకి ఇచ్చిన కేసులో ఒక ఐఎఎస్‌ అధికారితో సహా ఎందరో జైలు పాలయ్యారు. మణికొండలోనే వక్ఫ్‌ భూములను లాంకో గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన కేసు వివాదాస్పదమై, అప్పటి ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు మీద ఒత్తిడి తెచ్చి, అది తమ భూమి కాదని న్యాయస్థానం ముందర వక్ఫ్‌ బోర్డ్‌ తోనే చెప్పించింది.

ఈ నేపథ్యంలో వెల్లువెత్తిన తెలంగాణ ఉద్యమక్రమంలో, 1956 నుంచి జరిగిన భూ క్రయవిక్రయ అక్రమాలను, భూ బదలారుుంపులను అన్నిటినీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక సమీక్షించాలని, అక్రమాలను సవరించాలని డిమాండ్‌ను కొందరైనా ముందుకు తెచ్చారు. మరీ ముఖ్యంగా లాంకో రాజగోపాల్‌ తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిగా దూకుడుగా ముందుకు వచ్చినందువల్ల, ఆయనకు అక్రమంగా ప్రభుత్వం ఇచ్చిన భూమి గురించి, ఇతర ఆంధ్ర, రాయలసీమ ప్రాంత భూ బకాసురుల గురించి చాల వేదికల మీద చర్చ జరిగింది. పెద్దమనుషుల ఒప్పందంలో భూ క్రయ విక్రయాల నిబంధనను గుర్తు చేస్తూ, 1956 నుంచి జరిగిన భూబదలారుుంపులన్నిటి పైన సమీక్ష జరపాలని డిమాండ్‌ వచ్చింది. జరిగిన చరిత్రలోని అక్రమాల వల్ల, తలెత్తిన డిమాండ్‌ వల్ల భూమి విషయంలో సంస్కరణలు జరపడానికి, అక్రమాలను సవరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది. కాని తెలంగాణ ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా ఆ అవకాశాన్ని ప్రభుత్వం వాడుకోలేదు. లేదా, ఆ వివరాలు తెలుసుకుని తన స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వాడుకోవడం ప్రారంభించింది. భూబదలారుుంపుల అక్రమాల వివరాలు తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందో, ఆ వివరాల మీద ఆధారపడి చర్యలు తీసుకోవడంలో మాత్రం ఎందుకు వెనుకడుగు వేసిందో తెలుసుకుంటే గాని మియాపూర్‌ కుంభకోణం విషయంలో ప్రభుత్వ నిర్లిప్తతకు, సాచివేత ధోరణికి, చివరికి నిష్క్రియకు కారణాలు, మూలాలు అర్థం కావు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటరుునాక ఆరు నెలలు తిరగకుండానే డిసెంబర్‌ 5న హైదరాబాద్‌ భూసంబంధిత అక్రమాలను పరిశోధించి నివేదిక ఇవ్వడానికి ఒక టాస్క్‌ ఫోర్స్‌ ను నియమించారు. లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌గా పదవీ విరమణ పొందిన, నిజారుుతీపరుడని పేరు ఉన్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎస్‌.కె. సిన్హా నేతృత్వంలో ఈ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరాబాద్‌ పరిసరాల్లో భూ యాజమాన్యం, ప్రభుత్వ భూములు, అక్రమ ఆక్రమణలు, రిజిస్ట్రేషన్లలో అక్రమాలు, భూబదలారుుంపులు వంటి వ్యవహారాలు పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించడం, అక్రమాలు సరిదిద్దడానికి సిఫారసులు చేయడం ఈ టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతలు. పద్దెనిమిది నెలల పాటు పనిచేసి ఈ టాస్క్‌ఫోర్స్‌ ఒక వివరమైన నివేదికను 2016 జూన్‌లో సమర్పించింది. ఆ నివేదికను శాసనసభలో సమర్పించి, తగిన చర్యలు తీసుకుంటారని అప్పట్లో వార్తలు వెలువడ్డారుు గాని ఏడాది గడిచినా ఇప్పటికీ ఆ నివేదికను బైటపెట్టలేదు. టాస్క్‌ ఫోర్స్‌ పదవీకాలం డిసెంబర్‌ 2016తో పూర్తి అరుునా, టాస్క్‌ఫోర్స్‌ పని పూర్తి కాకపోరుునా దాని పదవీ కాలాన్ని పొడిగించలేదు.

ఎస్‌.కె. సిన్హా కమిటీ ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం అధికారికంగా బైట పెట్టనప్పటికీ, ఆ నివేదికలో ఏముందో చెదురుమదురుగా వార్తలు వచ్చారుు. చట్టబద్ధంగా ప్రభుత్వానికి చెంది, ప్రస్తుతం ప్రభుత్వ స్వాధీనంలో లేని, ఇతరుల స్వాధీనంలో ఉన్న భూములను ఈ కమిటీ లెక్కించింది. భూదాన్‌, దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్‌, ఇనాం, సనద్‌, అసైన్డ్‌ భూములలో ప్రభుత్వం దగ్గరనో, అవి పొందినవారి దగ్గరనో ఉండవలసిన భూములు ఇతరుల దగ్గర ఎలా ఉన్నాయో కమిటీ నిర్ధారించింది. ఇలా అన్యాక్రాంతమైన భూమిని వెనక్కి తీసుకోవాలని, ఆక్రమణదారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కీలకమైన ఫైళ్లను ధ్వంసం చేసిన, మాయం చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ఈ భూకుంభకోణాలతో సంబంధం ఉన్న శాసనసభ్యుల, మాజీ శాసన సభ్యుల, అధికారుల, డిప్యూటీ కలెక్టర్ల, ఆర్‌డిఒల పేర్లు స్పష్టంగా చెప్పి మరీ ఎవరెవరి మీద ఏ చర్య తీసుకోవచ్చునో సూచించింది.

రాష్ట్రంలో మొత్తంగా కనీసం 35.67 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దానిలో 13.80 లక్షల ఎకరాలు సాగుకు లాయకైన భూమి కాదని ఈ కమిటీ నిర్ధారించింది. అంటే కనీసం 22 లక్షల ఎకరాల వ్యవసాయయోగ్యమైన ప్రభుత్వ భూమి ఉందని కమిటీ తేల్చిందన్నమాట. వేరువేరు సామాజిక వర్గాలకు అసైన్‌ మెంట్‌ ద్వారా ప్రభుత్వం ఇచ్చే భూమి చాల అన్యాక్రాంతమైందని, అసైన్డ్‌ భూమిని ఇతరులకు అమ్మడం చట్టబద్ధంగా నిషేధం అరుునప్పటికీ అలా భూమి పొందినవారిలో దాదాపు ఒక లక్ష మంది మొత్తంగా 98,169 ఎకరాల అసైన్డ్‌ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేశారని కమిటీ తేల్చింది. నిస్సందేహంగా ప్రభుత్వానికి చెందిన దాదాపు పది వేల ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిందని కమిటీ చెప్పింది. భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం మిగులు భూమిగా తేల్చిన భూమిలో పది వేల ఎకరాలు ప్రభుత్వ స్వాధీనంలో ఉండవలసి ఉండగా అన్యాక్రాంతమయ్యాయని చెప్పింది. భూదాన్‌ భూముల్లో 49,000 ఎకరాల పైన చేతులు మారాయని, దేవాదాయ, ధర్మాదాయ భూములు దాదాపు 14,500 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఈ నివేదిక చెప్పింది.

మొత్తంగా అన్యాక్రాంతమైన భూములలో 5.90 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి చట్టపరమైన అడ్డంకులేమీ లేవని కమిటీ చెప్పింది. అలాగే గతంలో అసైన్‌ చేసిన భూములు ఏ కారణం కోసం ఇచ్చారో ఆ కారణానికి వాడకంలో లేనందువల్ల 16,288 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చునని కమిటీ చెప్పింది. ప్రత్యేకించి పదకొండు భూకుంభకోణాల గురించి ప్రత్యేక నివేదికలు ఇచ్చిన ఈ కమిటీ కొల్లూరు, ఉస్మాన్‌సాగర్‌, తెల్లాపూర్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురం, బాట సింగారం, తుర్క యాంజాల్‌లలో మాజీ సైనికులకు, రాజకీయ బాధితులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, దళితులకు అసైన్‌ చేసిన భూముల బదలారుుంపులలో జరిగిన అక్రమాలను పేర్కొంది. హైదరాబాద్‌-వరంగల్‌ రహదారికి ఇరువైపులా 800 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి చుట్టూ సొంతభూమి లాగ గోడలు కట్టుకున్న ఉదంతాన్ని ప్రస్తావించింది.

తెలంగాణ సమాజానికి, ప్రజలకు చెందిన ఈ భూమి ఆరు దశాబ్దాలుగా గురైన అక్రమ ఆక్రమణల నుంచి తప్పించి, మళ్లీ తెలంగాణ సామాజిక వనరుగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎస్‌.కె. సిన్హా కమిటీ నివేదిక ఒక అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ భూమి ఎంత ఉందో, అన్యాక్రాంతమైన భూమి ఎంత వెనక్కి తీసుకోవచ్చునో సూచించి భూమిలేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, అభివృద్ధి పథకాల కోసం భూమి, అభివృద్ధి పథకాలలో నిర్వాసితులవుతున్నవారికి భూమి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఈ నివేదిక అవకాశం ఇచ్చింది. కాని ప్రభుత్వం ఆ అవకాశాన్ని వాడుకోదలచుకోలేదు. అక్రమ ఆక్రమణ దారుల గురించి తెలుసుకుని వారిని బెదిరించి తనకు అనుకూలం చేసుకోవడానికి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి లభ్యమవు తున్నదో తెలుసుకుని తన ఆశ్రితులకు పందారం చేయడానికి లేదా అధికార పార్టీకి చెందినవారు ఆక్రమించడానికి ఒక అవకాశంగా మాత్రమే తెలంగాణ ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఉపయోగపడింది. అందువల్లనే మియాపూర్‌ భూకుంభకోణం ఎంత గగ్గోలును సృష్టించినా, ప్రచార సాధనాలలో ఎంత హోరెత్తినా, పైపైన కొన్ని తూతూమంత్రపు చర్యలు తప్ప లోతైన, నిర్మాణాత్మకమైన చర్యలు లేవు. తెలంగాణ భూమిని తెలంగాణ ప్రజలనుంచి వేరుచేసి అన్యాక్రాంతం చేసిన ఆరు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను పునరావృతం చేయడమే తన పని అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. కాకపోతే ఈ సారి అక్రమ ఆక్రమణల నాటకంలో కొన్ని పాత్రలు, పాత్రధారులు మారారు. కాని ఎడతెగకుండా సాగుతున్న నాటకం మాత్రం అదే.

‍ - ఎన్.వేణుగోపాల్

(రచయిత వీక్షణం సంపాదకుడు)

Keywords : land scam, hyderabad, telangana, kcr, trs,
(2024-04-24 16:52:13)



No. of visitors : 2718

Suggested Posts


ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


తెలంగాణలో