నాకు అమ్మా నాన్న లేరు - సి. కాశీం

నాకు

( సి. కాశీం రాసిన ఈ వ్యాసం ʹనడుస్తున్న తెలంగాణ మాసపత్రికʹ ఆగస్ట్, 2017 సంచికలో ప్రచురించబడినది)

ప్రిన్సిపాల్‌ ఒక పాట పాడుతున్నాడు, ఆరేళ్ల బాలుడు చాలా ఆసక్తిగా పాటను వింటున్నాడు. ప్రిన్సిపాల్‌ పాడటం ముగించాక ఆ బాలుడు అదే పాటను అద్భుతంగా పాడి విన్పించాడు. రాగయుక్తంగా పాడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కోకిల కంఠం అనే పోలిక అతనికి అతికినట్లు ఉంటుంది. ఒకసారి వినగానే తిరిగి పాడగలిగే ప్రతిభ అతనికెలా అబ్బిందనే ప్రశ్న నన్ను తొలుస్తూ ఉండింది. ఆ బాలుడి ప్రతిభా పాటవానికి ముచ్చటేసి ʹʹమీ అమ్మా నాన్నా ఏం చేస్తారనిʹʹ అడిగాను. వెంటనే ఆ బాలుడు ʹనాకు అమ్మా నాన్నా లేరనిʹ ఆర్థ్రతగా చెప్పాడు. నేను ప్రిన్సిపాల్‌ వైపు చూసాను. ʹʹవాళ్ల అమ్మా నాన్నది ప్రేమ వివాహం. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అతడు తాగుడుకు అలవాటు పడ్డాడు. వద్దని వారించినందుకు భార్యను కొట్టి చంపాడు. పిల్లవాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఒకరోజు ఈ పిల్లవాడు పక్క వూరికి ఆటోలో వెళ్తుంటే ఆటోకు యాక్సిడెంట్‌ అయింది. ఆటోలో ఉన్న చాలామంది గాయపడ్డారు. ఆ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి గాయపడిన వాళ్లకు వైద్యం అందేలా చేసాడు. ఆ పిల్లవాడు చేసిన మంచి పనికి వాళ్లలో ఒకాయన మెచ్చుకొని మా స్కూల్‌ పేరు చెప్పాడట. వాళ్ల అమ్మమ్మ వీన్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్పించిందిʹ ప్రిన్సిపాల్‌ చెప్పడం ఆపేసాడు.

10 జూలై 2017న హైదరాబాద్‌ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ స్కూల్‌కు ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డి ఆహ్వానం మేరకు విద్యార్థులకు మోటివేషన్‌ క్లాస్‌ చెప్పడానికి వెళ్లాను. నేను మొదటిసారి ఆ స్కూల్‌లోపలికి వెళ్లాను. ఇరవై ఏళ్లుగా కొత్తపేట సిగ్నల్‌(చౌరస్తా) దగ్గర బస్సు ఆగినప్పుడల్లా కొన్ని వేలసార్లు ఆ స్కూల్‌ బోర్డు చూసి ఉంటాను. విశాలంగా చెట్లతో ఉండే మైదానం రోడ్డు మీదికి కొంత మేరకు కన్పించేది. కాని ఇవ్వాళ మొదటిసారి లోపలికి ప్రవేశించాను. 73 ఎకరాల స్థలం. హైదరాబాద్‌ నడిబొడ్డున. అందమైన బిల్డింగులు. విశాలమైన గదులు. తెలంగాణ అసెంబ్లి లాంటి నిర్మాణం. విశాలమైన ఆటస్థలం. లోపలికి ప్రవేశించగానే ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు గౌరవంగా తీసుకెళ్లి వేదిక మీద కూర్చోపెట్టారు. నాలుగు వైపుల భవనాలు మధ్యలో ఖాళీస్థలం. వరుస క్రమంలో కూర్చున్న విద్యార్థులు. నీరెండ పొలుపు. ఆ దృశ్యం నాకు ఎంతో అపురూపం అన్పించింది. కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో కూడా విద్యార్థులకు ఎన్నికలు లేవు. కాని ఈ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ విద్యార్థులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి విద్యార్థి ప్రతినిధులను ఎంపిక చేశాడు. 650 మంది విద్యార్థుల నుంచి దాదాపు 40 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రతీక్లాస్‌ నుంచి ప్రాతినిధ్యాన్ని పాటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదు, కాని ఈ విద్యార్థి ప్రతినిధులలో అత్యధికం బాలికలే ఉన్నారు. ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బాలబాలికలు చదువుకుంటున్నారు. 650 మంది విద్యార్థులలో ఈ బాలుడు ఒకడు.

ఇక్కడ చదువుతున్న పిల్లలది ఒక్కొక్కరిది ఒక విషాదగాథ. తల్లి ఉంటే తండ్రి ఉండడు, తండ్రి ఉంటే తల్లి ఉండదు. కొందరికి ఇద్దరూ ఉండరు. మరికొద్ది మంది అన్యం పుణ్యం తెలియని వయసులో శారీరక గాయాలై వచ్చినవాళ్లు. కొందరికి తల్లిదండ్రి ఎవరో కూడా తెలియదు. నా అనేవాళ్లు కూడా ఎవరూ లేరు. వారిలో ఏ ఒక్కరి గురించి రాయాలన్నా కాగితాలు తడుస్తాయి.

ఈ విశాలమైన స్థలంలో ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ తన కోసం 1901లో ఒక ప్యాలెస్‌ను నిర్మాణం చేసుకున్నాడు. తన భార్యకు కానుకగా ఇచ్చాడు. అయితే ఇదే సంవత్సరం బ్రిటీష్‌ మహారాణి క్వీన్‌ విక్టోరియా(1819) టైఫాయిడ్‌ జ్వరంతో మరణించింది. అప్పుడు బ్రిటీష్‌ రెసిడెంట్‌గా ఉన్న సర్‌ డేవిడ్‌ చార్‌ విక్టోరియా స్మారకార్థం ఒక భవనాన్ని హైదరాబాద్‌లో నిర్మించాలని మహబూబ్‌ అలీఖాన్‌ను కోరాడు. 1903 జనవరి 1న ఈ భవనానికి విక్టోరియా పేరు పెడుతూ అనాథ పిల్లలకు విద్యాలయంగా మార్చాడు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఇప్పటి దిల్‌షుక్‌నగర్‌ నుంచి మొత్తం అడవి విస్తరించి ఉండేది. దట్టమైన అడవిలో మహబూబ్‌ అలీఖాన్‌ ఈ భవనాన్ని నిర్మించుకున్నాడు. ఒకరోజు అతను కారులో ప్యాలెస్‌కు వస్తుండగా ఉడుం అడ్డుపడిందట. పక్కనే ఉన్న ఒక మతపెద్దను ఏమిటీ అపశకునం అని అడిగాడట. ఆ మత పెద్ద దీనికి పరిహారంగా ఈ ప్యాలెస్‌ను అనాథ పిల్లలకు ఆశ్రమంగా మార్చాలని చెప్పాడట. ఏదేమైన 114 సంవత్సరాల క్రితం ఒక ఫ్యూడల్‌ ప్రభువు అనాథల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఒక పాఠశాలను నెలకొల్పడం సాధారణ విషయమేమీ కాదు.

ఆ రోజుల్లో ఈ స్కూల్‌ నిర్వహణ కోసం ఒక ట్రస్టు ఏర్పడింది. ఈ ట్రస్టు ఆధీనంలోనే దీని కార్యకలాపాలు నడిచాయి. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసింది. ఎయిడెడ్‌ పాఠశాలగా మార్చింది. ప్రభుత్వాలు మారేకొద్ది విధానాల మార్పులో భాగంగా ఈ స్కూలుకు నిధులు తగ్గుతూ వచ్చాయి. కేవలం ఉద్యోగుల జీతాల మేరకు మాత్రమే ఎయిడ్‌ను విడుదల చేయడానికే ప్రభుత్వం పరిమితమయింది. ఈ పాఠశాలకు అనుబంధంగా ఎనిమిది ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఎన్‌టిఆర్‌ నగర్‌లో ఉంది. ఈ పాఠశాల విద్యార్థులకు కావల్సిన కూరగాయలను ఇక్కడి నుంచే సప్లయ్‌ చేస్తారు. దీని సాగు కోసం ఎద్దులు, రైలుకూలీలు ఉన్నారు.

అయితే 90వ దశకంలో వచ్చిన నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పథకాలు పూర్తిగా మారిపోయాయి. ప్రజల సంక్షేమం కేంద్రంగా కాకుండా బహుళజాతి సంస్థల ప్రయోజనాల కేంద్రంగా విధానాల రూపకల్పన జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే పాలన సాగింది. ఈ క్రమంలోనే ఈ పాఠశాల భూముల ఆక్రమణ మొదలయింది. ఇపుడున్న కొత్తపేట రైతుబజార్‌, రిలయన్స్‌ పెట్రోల్‌బంక్‌, బాబు జగ్జీవన్‌రాం భవన్‌లు ఈ పాఠశాల భూములలోనే నిర్మించారు. లీజ్‌ పేరుతో ఆక్రమణ జరిగింది. అనాథ పిల్లలకు కేటాయించిన భూమిని ఆక్రమించటానికి పాలకులకు, అధికారులకు ఏవీ అడ్డం రాలేదు. విజయవాడ జాతీయ రహదారి అసాంతం ఈ పాఠశాల భూమిలో నుంచే పోయింది. ఏ రకమైన పరిహారం లేదు.

1994లో ఈ స్కూల్‌ను జీవో నెం.124 ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి మార్చారు. అంత మాత్రమే కాకుండా అప్పటివరకు డే స్కాలర్‌గా ఉండే విధానాన్ని రెడిడెన్షియల్‌గా మార్చారు. ఈ నిర్ణయం వలన అనాథలకు ఎంతో మేలు జరిగింది. ఒకప్పుడు 900 మంది విద్యార్థులకు పైగా చదువుకునేవాళ్లు. 34 మంది టీచర్లు పనిచేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వాళ్లను నియమించక పోవటం వలన విద్యార్థులకు నాణ్యమైన విద్య కరువయ్యింది. ప్రస్తుతం ప్రిన్సిపాల్‌, మరో టీచర్‌(ఎయిడెడ్‌) మాత్రమే పర్మినెంట్‌ ఉద్యోగులు మరో 20 మంది టీచర్లు నెలకు 17 వేల రూపాయల జీతానికి పార్ట్‌టైం పద్ధతిలో పనిచేస్తున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా వీళ్లు పర్మినెంట్‌కు నోచుకోలేదు. బోధనేతర సిబ్బందిలో ఒక సూపరిండెంట్‌, ఒక ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ముగ్గురు అడెండర్స్‌ మాత్రమే పర్మినెంట్‌ వాళ్లు ఉన్నారు. అనాథ పిల్లల విద్య పట్ల మన పాలకుల తీరు ఇంత గొప్పగా ఉంది!? ఇంత మాత్రమే కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రోడ్‌ వైపు ఉన్న 10 ఎకరాల స్థలంలో రాచకొండ పోలీస్‌ కమీషనరేట్‌ను నిర్మించడానికి ఇదే స్థలం కావాలని కోరుచున్నారు. కొందరు ప్రభుత్వ పెద్దల కన్నుపడి స్వయంగా ముఖ్యమంత్రే ఈ స్థలం కోసం నోట్‌ ఫైల్‌ తయారు చేయించినట్లుగా పత్రికలు ఇది వరకే రాసి ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిరోజుల్లో రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లల బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించినట్లుగా మా చిన్న మెదడుకు గుర్తుంది. కేజీ టు పీజీ ఉచిత విద్య మారుమోగుతూనే ఉంది. కనుక ప్రభుత్వానికి, పెద్దలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అనాథ విద్యార్థులకు ఉన్న ఏకైక ఈ విద్యాసంస్థను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి చేయాలి. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించవచ్చు. ఇపుడున్న భవనాలను రిపెయిర్‌లు చేసి, మరి కొన్ని కొత్త భవనాలు నిర్మించి వివిధ సామాజిక వర్గాల కోసం ప్రారంభిస్తున్నట్లుగానే అనాథ విద్యార్థుల కోసం జూనియర్‌, డిగ్రీ కళాశాలలను ప్రారంభించి నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంది. 5 వేల మంది విద్యార్థులకు విద్యను అందించే స్థాయికి దీనిని పెంచవచ్చు. తగినంత మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను కేటాయించి అనాథ పిల్లల పట్ల మన సామాజిక బాధ్యతను నెరవేర్చుకోవల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్‌ నగరంలోని ఒక సర్వే ప్రకారం 30000 మంది అనాథ పిల్లలు ఉన్నట్లుగా తేలింది. ఇక రాష్ట్ర వ్యాపితంగా ఎంత మంది ఉన్నారనే నివేదిక రాలేదు, ప్రభుత్వం కూడా ఎక్కడ ప్రస్థావించినట్లుగా లేదు, కనుక ఏ ఆధారం లేని వారికి మంచి జీవితాన్ని ఇవ్వడంలోనే సమాజ పరిణతి కన్పిస్తుంది. ఇపుడున్న 650 మంది విద్యార్థుల భోజనం కోసం, ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం సంవత్సరానికి కోటి యాభై లక్షలు మాత్రమే కేటాయిస్తుంది. ఈ డబ్బు అక్కడి అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. పాలకులకు నగరం మధ్యలో ఉన్న ఆ స్కూల్‌ భూమి మీద తప్ప మరే దాని మీద దృష్టి ఉన్నట్లుగా కన్పిస్తలేదు. ఈ పాఠశాలలో 114 సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్థులు వివిధ హోదాలలో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15కు వారందరు కలుస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత వారికొక జ్ఞాపకంగా మిగలకూడదంటే పౌర సమాజం దీని గురించి ఆలోచించాలి. అంతమాత్రమే కాదు, ఆచరణాత్మకతకు పూనుకోవాలి. లేత మనసులకు తగిలిన గాయాలను మాన్పవల్సిన బాధ్యత మనందరిది.
- సి. కాశీం

(న‌డుస్తున్న తెలంగాణ ఆగ‌స్టు 2017 సంచిక‌లో ప్ర‌చురితం)

Keywords : hyderabad, kasim, virasam, students, telangana
(2024-03-14 16:39:43)



No. of visitors : 1376

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నాకు