మనువాద శవపేటికకు దిగ్గొట్టిన నాలుగు మేకులు - ఎన్. నారాయణ రావు


మనువాద శవపేటికకు దిగ్గొట్టిన నాలుగు మేకులు - ఎన్. నారాయణ రావు

మనువాద

(తెలంగాణ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక ఆక్టోబర్ సంచికలో ప్రచురించబడినది)

2013 ఆగస్టు 20 నుండి నరేంద్ర దభోల్కర్‌ హత్యతో మొదలై, 2015లో గోవింద్‌ పన్సారే, ప్రొఫెసర్‌ కల్బుర్గి, 2017 సెప్టెంబరు గౌరీ లంకేశ్‌ (జర్నలిస్టు) హత్యతో హిందూ మనువాద ఫాసిస్టుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాలుగు హత్యలు.... హంతకుడు ఒక్కరే... అవే తుపాకీ గుళ్లు. ఈ దేశంలో మేధావులు తుపాకీ గుండ్లకు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు చీమకుట్టినట్లయినా లేదు. 2013 లోనే మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వం దభోల్కర్‌ హంతకులను పట్టుకుని ఉంటే ʹపన్సారేʹ ప్రాణాలు నిలిచేవి. కల్బుర్గి ప్రాణాలు నిలిచేవి. పోనీ 2015లో కల్బుర్గి హంతకులను కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టుకోగలిగితే ʹగౌరీ లంకేశ్‌ʹ మనకు దక్కేది.

ఈ నాలుగు హత్యలకు ఎంత సంబంధం ఉందో అదేవిధంగా హంతకులను అరెస్టు చేయకుండా మొసలికన్నీరు కారుస్తున్న కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాలకు అంతే సంబంధం ఉంది. హిందూ ఫాసిస్టు అరాచకాలకు అండదండలు వారిద్దరూ. హత్యగావించబడ్డ వాళ్లందరూ వయసు పైబడినవారే. సంఘ్‌పరివార్‌ సిద్ధాంతం ప్రపంచాన్ని కాల్చుకుతిన్న హిట్లర్‌, ముస్సోలినీల వారసత్వ ఫాసిస్టు హిందూ జాతీయవాదం. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రూపమాత్రంగానే మతోన్మాద సంస్థ - సారాంశంలో ఫాసిజం దానితత్వం. ʹజాతిʹ పేరిట ప్రజల అవసరాల్ని తన అవసరాలకు లోబరుచుకుంటే తప్ప తనకంటే ముందున్న పెట్టుబడిదారులతో తాను పోటీ పడలేనని గుర్తిస్తుంది. దానినే ఫాసిజం అంటారు. ఫాసిజం ఎప్పుడు కూడా జాతి పేరిట బూర్జువా వర్గం అవసరాల్ని సంరక్షిస్తుంది.

పరిపాలనా వ్యవస్థలు మారుతూ ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికి ఫాసిస్టు పాలన తరహాలో హత్యలు జరగడాన్ని ప్రజాస్వామిక వ్యవస్థనే ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. రాజ్యాంగంలో నిర్దేశించుకున్న సెక్యులర్‌ లౌకికరాజ్యం నియమాల పట్ల ప్రభుత్వాలు అవలంభిస్తున్న బాధ్యతారాహిత్యం నేడు ఆ పదాలనే రాజ్యాంగం నుండి తొలగించాలనే దాక సాగుతున్న హిందుత్వదాడి ప్రజాస్వామికవాదులను కలవరపెడ్తోంది. ఫెడరల్‌ విధానం, కులరహిత, మతరహిత ఆలోచనలు కలిగిన అభ్యుదయ సమాజం ఈ ప్రజాస్వామ్య దేశంపై సామ్రాజ్యవాద దేశాల వత్తిడిని ప్రశ్నిస్తున్నందుకే ప్రజాస్వామిక వాదులను హత్యకావిస్తున్నారు. రాజ్యాంగానికి ఉన్న ప్రామాణికతను గుర్తించే చైతన్యం రాజ్యాంగంపై ప్రమాణం చేస్తున్న రాజకీయ నాయకులకు లేకపోవడం విచారకరం. ఆధిపత్య వర్గాల ద్వారా కొనసాగుతున్న దాడిలో ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం అమలుకావడం లేదు. శాస్త్రీయత కోసం, జీవించే హక్కుపై జరుగుతున్న హిందుత్వ దాడిని ఎదిరించడం కోసం భావప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇలాంటి ప్రజాస్వామిక వాదులను రాజ్యమే హత్య చేసిందని ప్రజలు భావిస్తున్నారు. శివాజీని లౌకికవాదిగా నిరూపించి సామ్రాజ్యవాద అభివృద్ధిలో భాగమైన టోల్‌టాక్స్‌ వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపినందుకు హిందూ మతఛాందసవాదులే పన్సారేను హత్య చేశారు. మూఢనమ్మకాల అజ్ఞానబలంతో ఉనికిలో ఉన్న వర్గప్రయోజనాలు, సమాజంలో మనిషికన్నా మతానికే ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ పార్టీల మనుగడలే ప్రజాస్వామికవాదుల హత్యలకు ప్రధాన కారణంగా ప్రజలు భావిస్తున్నారు.

ప్రజాస్వామిక వాదుల హత్యల కొనసాగింపులో భాగంగా 2017 సెప్టెంబర్‌ 5న బెంగుళూర్‌లోని రాజరాజేశ్వరినగర్‌లో రాత్రి జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను తుపాకీ గుళ్లతో మతోన్మాదశక్తులే హత్యగావించాయి. గౌరీ లంకేశ్‌ను హిందూ మతం ఒక మతం కాదని అది ఒక ఆధిపత్య వ్యవస్థను కాపాడుతున్న విధానమని ఇది మహిళలను ద్వితీయశ్రేణి పౌరురాలుగా గుర్తిస్తుందని పేర్కొంటూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. గౌరీ లంకేశ్‌ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉద్యమించడంలో ముందు వరుసలో నిలబడింది. ప్రజాస్వామ్యంపై విశ్వాసంలేని హిందూ మతోన్మాద శక్తులు గౌరీ లంకేశ్‌ను హత్య చేశాయని భావిస్తున్నారు. ఈ హత్యను దేశంలోని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. కర్ణాటకలో ఎం.ఎం. కల్బుర్గి హత్య తర్వాత మరొక హిందూ మతోన్మాదహత్యగా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యను ప్రపంచం గుర్తిస్తున్నది. ఉత్తర భారతంలో దళితులపై హిందూ మతోన్మాదదాడులు కొనసాగుతూనే ఉన్నాయి, మైనార్టీలను హత్యచేస్తునే ఉన్నారు. జెఎన్‌యులో విద్యార్థి నజీబ్‌ ఇంకా అదృశ్యంగానే ఉన్నాడు. నజీబ్‌ను హత్య చేసి శవాన్ని ఎక్కడో దొరకకుండా దాచేశారనే అనుమానం అందరిని వెంటాడుతున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 42 మిస్సింగ్‌ కేసులు ఇప్పటికే నమోదు కాబడి ఉన్నాయి. ప్రభుత్వాలకు మాత్రం అవి మిస్సింగ్‌ కేసులు కావు కాబట్టి వాటిపై సరియైన దర్యాప్తును కొనసాగించటం లేదు. మిస్సింగ్‌లు అన్ని కూడా పోలీసులే హత్య చేశారని అరోపణ ఉన్నా కూడా ప్రభుత్వాలు ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి. నేటికి మిస్సింగ్‌ కేసులు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు నజీబ్‌ కూడా మిస్సింగ్‌లో చూడాల్సిందే తప్ప అతని ఆచూకి దొరకదు. ప్రభుత్వం చేసిన హత్యల్లో నిందింతులు ఎలాగైతే దొరకరో మిస్సింగ్‌ కేసులకు కూడా పరిష్కారాలు దొరకవు. నేడు హిందూ మతోన్మాద శక్తులు రాజ్యాధికార బలాన్ని దుర్వినియోగపరుస్తూ అదృశ్యం, హత్యలు చేసే స్థితిలోకి ప్రవేశించాయి. వారే మైనార్టీ మతస్థులపై దాడులు, హత్యలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. గౌరీ లంకేశ్‌ హంతకులను పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గుజరాత్‌ నమూనానే దేశవ్యాప్తంగా కొనసాగించాలని కలలు కంటున్న హిందూ మతోన్మాద ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా బలమైన ప్రజాస్వామిక ఉద్యమాన్ని కొనసాగించినప్పుడే గౌరీ లంకేశ్‌ లాంటి వారి హత్యలను నిరోధించగలం, అదే ప్రజాస్వామిక వ్యవస్థకు బలంగా ఉంటుంది.

మనిషిమనిషిగా జీవించడం కోసం ఒక వ్యవస్థ అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. మనిషిగానే జీవించనీయకపోతే అ వ్యవస్థ పై తిరుగుబాటు చేసి మరొక వ్యవస్థ కోసం పోరాడి సాధించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నేటి సామాజిక వ్యవస్థ బలమైన రాజ్యంగా ఉండి ప్రభుత్వం ముసుగులో అనాగరిక వ్యవస్థలో లాగా మనుషులను వేటాడుతున్నది. ఆధునాతన ఆయుధాలు కలిగిన అర్థ సైన్య బలగాలతో మధ్యభారతంలో ఆదివాసుిలను వేటాడుతున్నది. ఆధిపత్య కులాలు హిందూ మతోన్మాద బలంతో దేశవ్యాప్తంగా ఉన్న దళితులను, మైనారిటీ మత ప్రజలను వేటాడి చంపుతున్నది. వేటాడి, వెంటాడి సాగిస్తున్న దమనకాండలను ప్రశ్నిస్తున్న గాంధేయవాది హిమాంశు కుమార్‌, స్వామి అగ్నివేశ్‌, సోనిసోరి, బేలాభాటియా, మాలిని సుభ్రమణ్యం, శాలీని గెరా, ఇషాకాందల్‌ వాల్‌పై దాడులు చేసి వారి కార్యచరణలను నియంత్రించే విధంగా నిర్బంధం అమలు చేస్తున్నది. డా.దభోల్కర్‌, గోవింద్‌ పన్సారే, ఎం.ఎం. కల్బుర్గిలతో పాటు నేడు జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను హత్య చేసింది హిందూ ఫాసిస్టు ప్రభుత్వాలే. జీవించే హక్కును రక్షించలేని పాలక వర్గాలు చట్టపరమైన చర్యలు చేపట్టాలి.

ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమే. ప్రశ్నించడమే నేరమైతే ఇది ప్రజాస్వామ్యమే కాదు. ప్రభుత్వాలు స్పష్టంచేయాల్సింది దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? ప్రజాస్వామ్యం ఒక ముసుగుగా ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయా? రాజ్యాంగాన్ని అమలు చేయకుండా చట్ట ఉల్లంఘనను ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని ప్రజాస్వామిక వాదులు భావిస్తున్నారు. కానీ నిజమైన ప్రజాస్వామిక విలువల కోసం ప్రజలు పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్న ప్రభుత్వం మేధావులను, ప్రజాస్వామిక వాదుదలను హత్యచేస్తున్నది. అందులో భాగంగానే సఫ్దర్‌హష్మీ నుండి నేటి గౌరీ లంకేశ్‌ వరకు, హత్యగావించబడ్డారు. ప్రభుత్వాల దళారి, అప్రజాస్వామిక విధానాలే ప్రజాస్వామిక వాదుల హత్యలకు దారితీస్తున్నాయి. మేధావుల విజ్ఞాన, లౌకిక ప్రశ్నలకు ప్రభుత్వాలు తూటాలతో సమాధానం చెప్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వాలే హంతకులు అవుతున్నప్పుడు ప్రజలేం చేయాలి అన్నదే మౌలిక ప్రశ్న. ప్రభుత్వ హత్యలు కొనసాగుతున్న ప్రజా ఉద్యమాల అనైక్యత ఒక బలహీనతగా ఉండడం వల్లనే ఫాసిస్టు రాజ్యం దాడి రోజు రోజుకు పెరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యం హత్యగావించబడడమే. దభోల్కర్‌, పన్సారే హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామ చేయాలి. కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామ చేయాలి. అన్ని రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు సంఘ్‌పరివార్‌ చేసిన ఈ హత్య కాండను ఖండిచాలి. ఈ హత్య ఖండించకపోతే ప్రజాస్వామ్యం హత్యలో వాళ్లు భాగస్తులు అవ్వడమే తప్ప మరొకటి కాదు.

ప్రజలు దేశాన్ని స్వతంత్రించుకోవడం ద్వారా అభివృద్ధిని, హక్కులను సాధించవచ్చని ఆకాంక్షించారు. భారతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేస్తున్న విదేశీ వాణిజ్య విధానాలను ఎదరించకుండా అంతర్గత వైరుధ్యాలయిన కుల, మత, జాతి, ఆధ్యాత్మిక వైరుధ్యాలను పరిష్కరించుకోలేమనే వాస్తవాన్ని గుర్తించారు. దేశం వలసపాలనలో ఉన్నప్పుడు బ్రిటీష్‌ వాళ్లు మనలో అంతర్లీనంగా ఉన్న అన్ని వైషమ్యాలను వాడుకుని వందలాది సంవత్సరాలు దోపిడీ చేశారు. భగత్‌సింగ్‌ లాంటి దేశభక్తులు దేశంపై బ్రిటీష్‌వాళ్ల ప్రత్యక్ష పట్టు లేకుండా చేయగలిగారు.

భూమి గుండ్రంగా ఉందని చెప్పిన గెలిలీయోను సజీవదహనం చేసిన విధానాన్ని వ్యతిరేకించిన మనం, శాస్త్రీయంగా ఆలోచించే విధానాన్ని నేర్పుతున్న మేధావులపై అమలయిన నిర్బంధాన్ని ప్రశ్నించడం కోసం మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ కోసం ప్రజలు ఉద్యమాల్లోకి సమీకరించబడడమనే ఒక అనివార్య పరిస్థితిని మనం చూస్తున్నాం. అధికార వర్గాలు, ఆధిపత్య కులాలు చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొనసాగిస్తున్న నిర్బంధం హత్యలు ఉద్యమాలకు తాత్కాలిక అవరోధం కల్గవచ్చు. కాని ప్రజాస్వామిక ప్రజా ఉద్యమాలు బలంగా ప్రజల్లోకి వెళ్లి చైతన్యవంతుల్ని చేస్తుంది. మత విభేదాలను నేటికీ కొనసాగింపచేస్తూ తద్వారా ప్రజలు ఐక్యమవకుండా చేస్తూ, దేశీయ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు కలిసి తమ ప్రతినిధిగా మోడీద్వారా ఈ హత్యాకాండను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామికవాదులు ఈ దాడులను నిరోధించగలిగి, ప్రజాస్వామ్యం నిర్దేశించిన హక్కులైన అమలయ్యేట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. కశ్మీర్‌ నుండి కేరళ వరకు ఎంతోమంది హక్కుల ఉద్యమకారులను, ప్రజా ఉద్యమకారులను ప్రభుత్వాలు కాల్చి చంపాయి. జార్ఖండ్‌లో కార్మిక నాయకుడు శంకర్‌గుహయోగిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డా. రామనాథం లాంటి హక్కుల నేతలను, పాటతో ప్రజలకు బలాన్నిచ్చిన బెల్లిలలితను కిరాతకంగా చంపిన ఘనత ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలదే. దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదుల హంతకులను ప్రభుత్వాలు గుర్తించలేకపోయాయి. కమిషన్‌లనకు ఏర్పాటు చేశాయి కాని ఇంతవరకు ఒక హంతకుడిని భారత న్యాయవ్యవస్థ శిక్షించలేకపోయింది. ఇంతటి చారిత్రక హత్యలను చూస్తున్న ప్రజానీకం న్యాయవ్యవస్థ పనితీరును అనుమానాస్పదమైన దృషితో చూస్తున్నారనేది వాస్తవం. దేశ పార్లమెంట్‌, అసెంబ్లీలో ఎన్నికైన రాజకీయ నాయకులందరూ సుమారుగా 90 శాతం పైగా నేరస్వభావం కల్గిన వారేనని ప్రభుత్వ నివేదికలే ప్రజల ముందుకు పెట్టాయి. ప్రజాపరిపాలనలో స్వార్థపర ప్రయోజనాలను ప్రశ్నిస్తూ సమాజాభివృద్ధికి నడుంగట్టిన దభోల్కర్‌ పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్‌ల పట్ల రాజకీయ నాయకుల కక్షపూరిత వైఖరే వారిపై దాడులకు కారణంగా భావించాలి. రాజకీయాలు దేశాభివృద్ధిని కాంక్షించడం లేదు. కేవలం వారి ఉన్నతి కోసమే తాపత్రయపడ్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ప్రజాస్వామిక విలువలు ఉండేలా ప్రజల వత్తిడి పెరిగే విధంగా మేధావుల ప్రయత్నం కొనసాగాలి. శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి రంగం, శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రజలకందించడానికి కృషిచేసిన మేధావుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హిందూ మతోన్మాద భావజాలన్ని ప్రశ్నించిన కల్బుర్గి గౌరీ లంకేశ్‌ల భావ ప్రకటన హక్కు కోసం మనందరం కదలాల్సి ఉంది.

సమాజంలో విజ్ఞానంతో పాటు అదేస్థాయిలో భౌతికవాద దార్శనికత పెరగపోవడంతో అతీత శక్తులపై నమ్మకం, మూఢ విశ్వాసాలు వికృతరూపం దాల్చుతున్నాయి. మతం దానితాత్విక పునాదిపై ఉండే కులనిర్మూలనకై పోరాటం కొనసాగాలి. మతాతీత లౌకిక రాజ్యం, రాజకీయాలు నిజమైన అర్థంలో ఉనికిలోకి రావాలి. భౌతికవాద దృక్పథం గల మేధావులు ఉన్నతమైన ఆశయాలను ముందుతరంలోకి తీసుకెళ్లడానికి బాధ్యత పడాలి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల బలిదానాలే ʹరాజ్యహత్యʹ లుగా పేర్కొన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు రాజ్యం చేస్తున్న ఈ హత్యలను ప్రశ్నించడంలో మీమాంసలో ఉన్నారు. అదే రాజ్యబలంగా మారి మన నడింట్లోకి వచ్చి మృత్యువు కిటికీని తెరిచి ఉంచుతుంది. ప్రజల్ని భయపెట్టి, బెదిరించి పాలించడం ద్వారా కొద్దిగా అణచివేయవచ్చేమో కాని ఎన్నటికైన ప్రజాస్వామిక పాలనే ప్రజల ఆకాంక్షలను గుర్తించగలుగుతుంది. రాజ్యాంగం దృష్టిలో అన్నిమతాలు సమానహోదాతో, సమాన స్థాయిలో కొనసాగాలని ఉంది. ప్రభుత్వంలో హిందూ మతోన్మాదులు రాజ్యాంగాన్ని సవరించి ʹహిందూరాజ్‌ʹ గామార్చాలని బలమైన కుట్రను ప్రజలందరూ గమనిస్తున్నారు. మూఢనమ్మకాలపై పోరాటం ప్రజాస్వామ్యానికే అవసరం. మూఢనమ్మకాలను బలపరచడం, బలోపేతం చేయడం ఫాసిస్టు ధోరణికి అవసరం. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించి అంతరిక్షంపై అడుగులేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, గ్రామాలలో చేతబడి నెపంతో మనుషులను సజీవదహనం చేస్తున్న దుర్మార్గ పరిస్థితి మరోవైపు మనకళ్లముందర ఉన్నది. అభివృద్ధి చెందుతున్న శాస్త్రాన్ని బాహ్య ప్రపంచానికి ఉపయోగపడని వస్తువుగా మార్చి దాచిపెడుతున్నారు. శాస్త్రవేత్తలు కనుగొన్న సాంకేతికతను వెలుగులో చూడడానికి బదులు, అశాస్త్రీయతపై, భావవాదంపై ఆధారపడే విధంగా ప్రజలను నెట్టి ప్రజలకు అయోమయ పరిస్థితిని కల్పిస్తున్నారు. శాస్త్రీయత ఉన్నత స్థాయిలో కూడా అశాస్త్రీయ భూమికను చొప్పిస్తున్నారు. భూమి పూజ పేరుతో హిందూయిజాన్ని రాజ్యమే ప్రోత్సహించి అశాస్త్రీయతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తూనే ఉంది. మూఢవిశ్వాసాల వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో పోటీపడుతున్నాయి.

నేడు పెట్టుబడి, హిందూమతోన్మాదం కలిసి బలమైన బంధంగా మారి ప్రజాస్వామిక విలువలపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తున్నారు. ఫ్యూడల్‌ సమాజపు భావజాలం గ్రామీణ ప్రాంతాల్లో ʹఖైర్లాంజిʹలనకు సృష్టిస్తుంటే, మూఢవిశ్వాసాల మాటు జరుగుతున్న అమానుష దోపిడీని నిలదీస్తూ ప్రజల మధ్య కార్మికవర్గ శ్రేణుల్లో చైతన్యం నింపుతున్నందుకు మేధావులను హత్యచేయడానికి కూడా సిద్ధమయ్యారు. హంతకులను గుర్తించడంలో ఉన్న వెనుకబాటుతనమే నిజంగా వాస్తవమైతే న్యాయవ్యవస్థ, ప్రజారక్షణ వ్యవస్థ ప్రజల పౌర ప్రజాస్వామిక హక్కులను కాపాడడంలో విఫలం అవుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంది. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడలేని ప్రభుత్వాలకు ప్రజలను పరిపాలించే నైతికహక్కు లేదనేది రాజ్యాంగబద్ధమైన సూత్రం.

గౌరీ లంకేశ్‌ హత్య వెనుక సంఘ్‌పరివార్‌ శక్తులు బిజెపి ప్రభుత్వాలు, అమిత్‌షా, మోడీలు ఉన్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. జర్నలిస్టులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గులామ్‌రసూల్‌తో మొదలైన రాజ్య నిర్బంధం, ఇప్పటికి ప్రజా ఉద్యమాలు కొనసాగుతున్న చోట పాత్రికేయులు అక్రమ కేసుల్లో నిర్బంధించబడుతున్నారు. ఉద్యమ ప్రాంతాల నుంచి తరిమి వేయ పడ్తున్నారు. కొన్ని చోట్ల హత్యకు గురి కాబడ్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వాల్లో ప్రజాస్వామికత లోపించడమే. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం, హత్యలు లేని సమాజాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలందరు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, వ్యక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. గౌరీ లంకేశ్‌ హంతకులను శిక్షించేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియచేస్తున్నాం.
- ఎన్. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, పౌరహక్కులసంఘం

Keywords : kalburgi, gauri lankesh, bengaluru, hindutva, bjp, apclc
(2018-04-18 10:17:44)No. of visitors : 265

Suggested Posts


ʹఅబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌...ʹ- గౌరీ లంకేశ్‌ చివరి సంపాదకీయం

ఈ వారం సంచికలో భారత్‌లోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌ దారిలో వెళ్తున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

గౌరీ ‍లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేద్దాం-మావోయిస్టు పార్టీ కేంధ్ర కమిటీ పిలుపు

సీనియర్ జర్నలిస్టు, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన గౌరీ లంకేష్ ను మావోయిస్టులు హత్య చేశారని కుట్రపూరితంగా జరుగుతున్న ప్రచారాన్ని సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్ ప్రజల పక్షాన హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు విప్పడాన్ని సహించలేని సంఘ్ పరివార్ శక్తులే ఆమెను హత్య చేశాయని....

సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కాల్చి చంపిన మతోన్మాదులు !

గౌరీ లంకేష్ ʹలంకేష్ పత్రికʹకు ఎడిటర్. ఆమె పత్రిక ద్వారా రాజకీయ నాయకుల అనేక అక్రమాలను బహిర్గతపర్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాశారు. గౌరీ లంకేష్ మతోన్మాదానికి వ్యతిరేకంగా రచనలు చేయడమే కాక అనేక ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో ఓ బీజేపీ నేత అక్రమాలపై ఈమె పత్రికలో వ్యాసాలు రాశారు.....

నేను కూడ గౌరీ.. మేము కూడా గౌరీ... గౌరీ నీకు లాల్ సలామ్‍.. నినధించిన బెంగళూరు

సీనియర్‌ జర్నలిస్టు, హిందుత్వ వ్యతిరేక పోరాట కార్యకర్త‌ గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు నిరసనగా మంగళవారం చేపట్టిన ర్యాలీతో బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి. నేను కూడ గౌరీ, మేము కూడ గౌరీ అనే నినాదాలతో బెంగళూరు దద్దరిల్లింది. గౌరి హత్య విరోధి వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన ....

హిందుత్వ శక్తులనుండి ప్రాణహాని ఉన్నగిరీష్ కర్నాడ్ సహా 25 మందికి ప్రభుత్వ భద్రత‌

హిందుత్వ శక్తుల నుంచి హాని కలిగే అవకాశం ఉన్న గిరీష్ కర్నాడ్‌, బార్గుర్‌ రమాచంద్రప్ప, కేఎస్‌ భగవాన్‌, యోగేష్‌ మాస్టర్, బెనర్జీ జయప్రకాష్‌, చెన్నవీర కన్నావి, నటరాజ్‌ హులియార్‌, చంద్రశేఖర్‌ తదితరులకు పోలసుల రక్షణ కల్పిం‍చారు. ప్రత్యేక లింగాయత్‌ కమ్యూనిటీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ఐఏఎస్‌ ఎస్‌ఎమ్‌ జమ్దార్‌కు ప్రత్యేక రక్షణ కల్పించాలని....

జీనాహైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో...గౌరీ లంకేష్ స్పూర్తిని కొనసాగిస్తాం...

ఢిల్లీ నుండి కన్యాకుమారి దాకా మతోన్మాద హత్యారాజకీయాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులో నిన్న మొదలైన ప్రదర్శనలు ఇవ్వాళ్ళ కూడా కొనసాగాయి. ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోయంబత్తూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్‌ ,గుజరాత్‌, చండీగడ్, హైదరాబాద్ తో సహా అనేక చోట్ల ప్రదర్శకులు....

Maoists condemn Gauri Lankesh murder, ask people to hit streets for ʹdetermined fightʹ

The Communist Party of India (Maoist) has rejected the ʹpropaganda by Hindu fascist forcesʹ that Kannada journalist Gauri Lankesh was killed by Maoists. It said that the ʹSangh Parivarʹ killed Lankesh to muzzle the voice of pro-people forces. In a release issued by Abhay, spokesman for Central Committee of CPI (Maoist)....

గ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసి... హైదరాబాద్ లో భారీ ర్యాలీ

బెంగుళూరు లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో ʹగ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసిʹ పేరుతో భారీ ర్యాలీ జరిగింది. టాంక్ బండ్ పైనున్న ముఖ్దుం మొయినుద్దీన్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వందలాదిమంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు....

బీజేపీవి సిగ్గులేని రాజకీయాలు - హిందుత్వ , జాతీయత ఒక్కటేనన్న మాటల‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం!

నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా?

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !

అసలు మహిళలకు రాత్రి పూట పనేంటని ఎదురు ప్రశ్న వేశాడు కర్నాటక హోంమంత్రి రామలింగా రెడ్డి. కర్నాటక మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేశాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ మహిళ ఆఫీసుకు వెళుతున్న....

Search Engine

క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations
ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు
“It’s The State That’s Violating the Constitution, Not Us”
Women in People’s War: Past, Present and Future
Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !
బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !
ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !
యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్
ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !
SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్
పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)
పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ‌
ఇంట‌ర్మీడియెట్ బోర్డును ముట్ట‌డించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల‌ అరెస్టు
Ban Sri Chaitanya & Narayana Corporate Colleges
ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులు
అమరుడు రాజన్నకు జోహార్లు - తెలంగాణ ప్రజా ఫ్రంట్
more..


మనువాద