కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి


కోర్టు ముందు వరవరరావు వాజ్మూలం - భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలి

కోర్టు

గౌరవనీయ జుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌, సుల్తానాబాదు ముందు

సిఆర్‌పిసి 313 కింద స్వీయ వాజ్మూలం భావ ప్రకటనా స్వేచ్ఛ నేరం కాజాలదు

ఎన్‌కౌంటర్లన్నీ హత్యానేరాలుగా నమోదు కావాలనే

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును గౌరవిద్దాం

2007 జూన్‌ 24వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అవిభక్త కరీంనగర్‌ జిల్లా ఓదెల మండలం, పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామం గూడెంలో మావోయిస్టు పార్టీ నాయకుడు అమరుడు సందె రాజమౌళి (ప్రసాద్‌) అంత్యక్రియల్లో పాల్గొని నేను చేసిన ప్రసంగం ఆధారంగా నా మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భద్రతా చట్టం (153 (ఎ) 505 సెక్షన్‌ 8) కింద నేరారోపణ చేశారు.

నేను నక్సలైట్‌ సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌కు (అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాది (ఎఫ్‌ఐఆర్‌లో వాడిన మాట), సిపిఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు) జోహార్లు అర్పించానని, ఈ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని విస్తరించడానికి ఆయన చేసిన సేవలను ఎత్తిపట్టానని, అతని ఎన్‌కౌంటర్‌ క్రూరమైనదీ, బూటకమైనదీ అని ఆరోపించానని పేర్కొంటూ ప్రాథమిక దర్యాప్తు నివేదికను నమోదు చేసిన పొత్కపల్లి సి.ఐ. నా మాటలుగా ఇలా ప్రస్తావించారు.

ʹʹఇది ఎన్‌కౌంటర్‌ కాదు. పోలీసులు సందె రాజమౌళిని పట్టుకొని చంపేశారు. కనుక ఇది ముగింపు కాదు. మనం ఆయన అంత్యక్రియలు నిర్వహించవచ్చు. ఆయన పార్థివ శరీరం మట్టిలో కలిసిపోవచ్చు. కాని రాజమౌళి గాఢమైన ఆకాంక్షలు, లక్ష్యమూ ఎల్లకాలం కోసం మిగిలే ఉంటాయి. మనం ప్రభుత్వాన్ని దోషిగా ఆరోపించి బోనులో నిలబెడతాం. ప్రజలు విచారణ చేస్తారు. కామ్రేడ్‌ రాజమౌళి ఎన్‌కౌంటర్‌కు ప్రజలు తప్పక ప్రతీకారం తీర్చుకుంటారు. దాని అర్థం ప్రజలు ఎవరో ఒక వ్యక్తిని శిక్షిస్తారని కాదు. ప్రజలు ఈ వ్యవస్థను శిక్షిస్తారు. ఈ వ్యవస్థను తొలగించి దీని స్థానంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఆవిష్కరిస్తారు.ʹʹ

వాస్తవానికి ఇది రెచ్చగొట్టడం కాదు. ప్రతీకారేచ్ఛను సరియైన, శాస్త్రీయమైన మార్గంలో చైతన్యపరచడం. వ్యక్తులుగా ఎన్‌కౌంటర్‌ రూపంలో మనుషులను నిర్మూలిస్తున్న రాజ్యాన్ని రద్దు చేయాలని, నూతన ప్రజాస్వామిక వ్యవస్థను సాధించుకోవాలని విజ్ఞప్తి చేయడం.

సందె రాజమౌళి సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా, సిపిఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడుగా పనిచేశాడు. కర్ణాటక, తమిళనాడు, కేరళ పార్టీ బాధ్యుడుగా కూడ పనిచేశాడు. ఆ బాధ్యతల్లోనే బెంగళూరు నుంచి కేరళకు వెళ్లినప్పుడు తమకున్న పక్కా సమాచారంతో ఆంధ్ర ఎస్‌ఐబి వాళ్లు ఆయనను అనుసరించారు. కొల్లాం పట్టణంలో పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ నుంచి ఆయన ఫోన్‌ చేయడానికి వెళ్లినప్పుడు అనుసరించిన ఎస్‌ఐబి వాళ్లు ఆయనను నిర్బంధించి అనంతపురం జిల్లా ధర్మవరం తీసుకవచ్చి రైల్వేస్టేషన్‌ వెనుక బస్‌స్టాండ్‌లో కాల్చివేసి ఎన్‌కౌంటర్‌ అని ప్రకటించారు. ఇది కేరళలోని కొల్లాం నుంచి అనంతపురం జిల్లాలోని ధర్మవరం దాకా ప్రత్యక్ష సాక్షుల ఆరోపణ. ప్రజలు అనుకున్నారు. అనుకుంటున్నారు. ఈ ప్రత్యక్ష పరోక్ష అరోపణల, మీడియా కథనాల ఆధారంగా నేను ఈ ఆరోపణలను విశ్వసించి ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వ్యాసం కూడ రాశాను. వాస్తవానికి పోలీసులు దానిని నా మీద నేరారోపణకు నమోదు చేసి ఉంటే నేను నిర్దిష్టంగా నా ఆరోపణలను వాదించే, సమర్థించుకునే అవకాశం కలిగి ఉండేది. అట్లా కాకుండా కొందరు పోలీసు అధికారులు, వాళ్లే తీసుకవచ్చిన పంచులు, వాళ్లే తీయించిన వీడియోను నేరారోపణకు సాక్ష్యం చేసుకున్నారు. నేను కాగితం మీద అక్షరానికి కమిట్‌ అయ్యే రచయితను కనుక నా అక్షరాలే నా అంతరంగానికి, విశ్వాసాలకు సాక్ష్యం.

ప్రజలయినా, నేనయినా పౌరులుగా మాకున్న అనుమానాలపైన ఒక అసహజ మరణంపై ఒక ఆరోపణ చేసాం. ఆ ఆరోపణ చేసే హక్కు, స్వేచ్ఛ పౌరునిగా నాకున్నది. విచారణ చేసి నిర్ధారణ చేయవలసింది న్యాయ వ్యవస్థ. ప్రతి అసహజ మరణాన్ని మెజిస్టీరియల్‌ అధికారం ఉన్నవాళ్లు విచారించాలి. ఎన్‌కౌంటర్లను-ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేశామని పోలీసులు చెప్తున్న కేసులను జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ హత్యానేరం (కల్పబుల్‌ హోమోసైడ్‌)గా నమోదు చేసి విచారించాలని చింతల వెంకటస్వామి (సూర్యం), సమ్మిరెడ్డి (రమాకాంత్‌), మధుసూదన్‌రాజ్‌ మొదలైన వారి ఎన్‌కౌంటర్ల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. ఇంకెన్నో ఎన్‌కౌంటర్ల సందర్భంగా రీపోస్ట్‌ మార్టమ్‌ కొరకు కూడ హైకోర్టు ఆదేశించింది. వీటన్నిటికీ ఒక అర్థవంతమైన, శిఖరాయమానమైన ముగింపుగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రతి ఎన్‌కౌంటర్‌ను హత్యా నేరంగా, ఐపిసి 302 కింద (కల్పబుల్‌ హోమోసైడ్‌గా) నమోదు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అది ఇప్పుడు సుప్రీం కోర్టులో అపీల్‌లో ఉన్నది.

కనుక ప్రాసిక్యూషన్‌, పోలీసులు, ప్రభుత్వం తమ విధులు సరిగా నిర్వహించకపోతే న్యాయ వ్యవస్థ అవి చట్టబద్ధంగానే కాదు, న్యాయ విహితంగా వ్యవహరించేలా నిర్దేశించాలి. ఒక ఎన్‌కౌంటర్‌ హత్య కేసులో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీవన్‌రెడ్డి-హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడానికి లేదా పౌరుల ప్రాథమిక హక్కులు ముఖ్యంగా జీవించే హక్కు విషయంలో బాధితులు హైకోర్టుకే రానక్కరలేదు. జీవించే హక్కును పరిరక్షించే బాధ్యత రాజ్యాంగం మెజిస్ట్రేట్‌ స్థాయి న్యాయస్థానానికి కూడా దఖలుపరిచింది - న్యాయస్థానాలు వాటిని సృజనాత్మకంగా క్రియాశీలంగా అన్వయించుకోవాలి. బాధ్యతగల పౌరులు న్యాయస్థానాలనందుకు పురికొల్పాలని అన్నారు.

బహుశా ఈ అవగాహనతోనే ఇప్పుడు ప్రతి జిల్లా కోర్టులో ఒక మానవ హక్కుల న్యాయమూర్తిని నియమించారు. అసహజ మరణాలకు గురైన వ్యక్తుల పోస్టుమార్టం సందర్భంగా ఆ న్యాయమూర్తి ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. నేను స్వయంగా వరంగల్‌ కోర్టులో సోమన్న ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ఆయన ముందు పిటిషన్‌ వేసి పోస్టుమార్టంకు ఆదేశం పొందాను.

మన నేర శిక్షాస్మృతిలో ఉన్న సంక్లిష్ట సమస్య ఏమిటంటే ప్రతి అసహజ మరణాన్ని పోలీసులే విచారిస్తారు. విచారించాలని చట్టం చెపుతుంది. న్యాయస్థానం ప్రాథమిక దర్యాప్తు నివేదిక మొదలు-విచారణ దశ అంతా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పేరుతో పోలీస్‌ ప్రాసిక్యూటరే నిర్వహిస్తాడు. మెజిస్ట్రేట్‌ కోర్టు స్థాయిలోనైతే ప్రాసిక్యూటర్‌ పోలీసు ఉద్యోగియే. రూల్‌ ఆఫ్‌ లా ఉన్నచోట, చట్టబద్ధ పాలన ఉన్నచోట ఏమోకాని కంచెయే చేను మేసేచోట ఇంక ఏ న్యాయాన్ని ఆశించగలం? ఏ అసహజ మరణాన్ని రుజువు చేయగలం? ముఖ్యంగా పోలీసులే లాకప్‌ హత్యలకు, మిస్సింగ్‌ కేసులకు, ఎన్‌కౌంటర్‌లకు బాధ్యులైనచోట. ʹఎన్‌కౌంటర్‌ చేస్తామని, పోలీసులు బెదిరించడం, హెచ్చరించడం, ఎన్‌కౌంటర్‌ అంటే ఎదురుకాల్పులు కాదు, పోలీసుల ఏకపక్ష కాల్పులు, హత్యలనేవి ప్రజావాక్కు అయిపోయింది. అలిఖిత రాజ్యాంగ సూత్రమైపోయింది.

అయినా ప్రభుత్వాలు వద్దనుకున్నప్పుడు అది ప్రభుత్వ విధానంగా లేని కాలంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత దుర్మార్గులైన పోలీసు అధికారులైనా ప్రమోషన్ల కోసమో, రివార్డుల కోసమో ఎన్‌కౌంటర్‌లు చేయాలనుకున్నా చేయలేరు. అందుకే ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే, రాజ్యహింసలో భాగమే అని ప్రజలు తేల్చుకున్నారు.

అందుకే ప్రాసిక్యూటర్లను ప్రాసిక్యూట్‌ చేయాలన్నాడు మార్క్స్‌. అక్కడ నాయస్థానాల న్యాయబద్ధమైన జోక్యం అవసరమవుతుంది. హైకోర్టు ధర్మాసనం అట్లా జోక్యం చేసుకున్నది.

మావోయిస్టు పార్టీ ఏర్పడక ముందు 2002లో నిషేధిత పీపుల్స్‌వార్‌తో చర్చలు జరపడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంగీకరించి ఆహ్వానం పంపింది. పార్టీ ప్రతినిధులుగా విధివిధానాలు నిర్ణయించడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఇద్దరిలో నేనున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిషేధిత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయకుండానే సందె రాజమౌళి, ఆయన సహచరి వంటి నాయకుల తలలపై ప్రకటించిన వెలలను తొలగించకుండానే చర్చలకు సిద్ధపడింది. చర్చల కోసమే వస్తున్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజితను ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్యచేయడం వల్ల ఆ చర్చలు ఆగిపోయాయి. పీపుల్స్‌వార్‌ నాయకత్వం చర్చల నుంచి వైదొలగింది.

ఇంకొక విశేషమేమంటే నిషేధిత పీపుల్స్‌వార్‌తో చర్చలు జరపడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున పాల్గొన్న మంత్రులిద్దరిలో ఒకరైన విజయరామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ చీఫ్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన 1975-77 ఎమర్జెన్సీ మొదలు రాష్ట్రంలో కూడ వివిధ స్థాయిల్లో డిఐజి (ఎస్‌ఐబి) మొదలు డిజిపి వరకు చేశారు. ఈ అన్ని సందర్భాల్లోనూ విప్లవ పార్టీపై నిషేధం ఉన్నది. ప్రతినిధులతో చర్చల సందర్భంగా సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పంపించిన విధి విధానాల పత్రాన్ని చూసి ఆయన అది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలవలె ఉన్నదని, రాజకీయ పరిభాష తప్ప దానితో తనకు ఏకీభావమేనన్నాడు.

పీపుల్స్‌వార్‌, ఎంసిసిఐ ఐక్యమై సిపిఐ మావోయిస్టు ఏర్పడినాకనే 2004 అక్టోబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పార్టీ నాయకత్వంతో నాలుగు రోజుల పాటు చర్చలు జరిపింది. ఆ చర్చలలో హోం మంత్రితో సహా నలుగురు మంత్రులు, నలుగురు క్యాబినెట్‌ స్థాయి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునితో సహా.

2004 ఎన్నికల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తాము అధికారానికి వస్తే పీపుల్స్‌వార్‌ అజెండా అమలు చేస్తానన్నాడు. 2014లోనూ అదే అన్నాడు. ఇప్పుడు తాను మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేస్తూ కూడా మావోయిస్టు ఎజెండానే అమలు చేస్తానంటున్నాడు.

ఎన్నికల ప్రచార కాలంలోనూ, ఎన్నికలయి అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక సందర్భంలో నిషేధిత మావోయిస్టు పార్టీతో తాము చర్చలకు సిద్ధమేనని అనని రాజకీయ పార్టీ లేదు. ఇది రాష్ట్రానికే పరిమితమైన విషయం కాదు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ ఒకవైపు మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు అత్యంత ప్రమాదకర అంతర్గత సమస్య అంటూనే మరోకవైపు చర్చలకు ఆహ్వానించాడు. హోం మంత్రి చిదంబరం అగ్నివేశ్‌ ద్వారా చర్చలకు ఆహ్వానమే పలికి పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్‌ను పత్రికా రచయిత హేమచంద్ర పాండేతో పాటు ʹఎన్‌కౌంటర్‌ʹ చేయించాడు. సుప్రీంకోర్టు ఈ రిపబ్లిక్‌ తన పిల్లల్ని తానే చంపుకుంటుందా అని ప్రశ్నిస్తూ ఇది నిజమైన ఎన్‌కౌంటరో కాదో తేల్చాల్సింది జిల్లా సెషన్స్‌ కోర్టు అని చెప్తుంది. ఆ తీర్పు ఇంకా రావాల్సే ఉంది.

బిజెపి ప్రధాని నోట వెలువడకపోయినా హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆల్‌ అవుట్‌ యుద్ధమే ʹసమాధాన్‌ʹ అని ప్రజల మీద గ్రీన్‌హంట్‌ యుద్ధాన్ని ప్రకటిస్తూనే చర్చల ప్రస్తావన తెస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మావోయిస్టు పార్టీని గుర్తించకతప్పని రాజకీయ, సామాజిక వాతావరణం నేడు దేశంలో నెలకొని ఉన్నది.

ఆయా రాజకీయ పార్టీలు ఎంచుకున్న అభివృద్ధి నమూనా మొదలు ఎజెండా వరకు ప్రతి ఒక్క అంశం - మావోయిస్టు పార్టీ ప్రజా ప్రత్యామ్నాయ కార్యాచరణ సవాల్‌ను ఎదుర్కొంటున్నది. అది ప్రభుత్వాల విషయంలో, రాజ్యాంగం విషయంలో చేదు నిజం. అందుకే మావోయిస్టు పార్టీని సిద్ధాంత రీత్యా, భావజాలం రీత్యా ఎదుర్కోలేక భావజాలంపై నిషేధాన్ని విధించడానికి నిర్మాణంపై నిషేధాన్ని విధిస్తున్నది రాజ్యం. భావాలను నిషేధించినా అది ఆచరణలో సాధ్యమయ్యే విషయం కాదు కదా.

ముగ్గురు విప్లవ రచయితలను 1971 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిడి యాక్టు కింద నిర్బంధించినప్పుడు, ఆ డిటెన్షనే కాదు, ఆ చట్టాన్నే కొట్టివేసిన జస్టిస్‌ చిన్నపరెడ్డి ʹభావాలపై నిషేధం చెల్లదʹన్నాడు.

నలబై ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఒక వ్యక్తి మావోయిస్టు పార్టీ సభ్యుడు కావడం కూడా నేరార్హమైన చర్య కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

రాజకీయ విశ్వాసాలు నేరాలు కాజాలవు. నేర స్వభావం కల భౌతిక హింసాత్మక చర్యలు మాత్రమే నేరారోపణ కింద న్యాయస్థానాల్లో విచారించదగినవి. అందుకొక శిక్షాస్మృతి ఉంది. ఆ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల వెలుగులో, ముఖ్యంగా వాక్‌సభా విశ్వాస హక్కులు, జీవించే హక్కు వెలుగులో అన్వయించి తీర్పునివ్వవలసిందిగా కోరుతున్నాను.

ఇది న్యాయస్థానాల పరిధి.

ఇంక ప్రజలకు సంబంధించి, అందులో భాగమైన నాకు సంబంధించి ఆ పరిధికి పరిమితి లేదు. ఎందుకంటే రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలన్నీ శతాబ్దాల ప్రజా పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో వచ్చి చేరినవి. ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు అటువంటివే. ప్రతికూల అంశాలన్నీ అది ప్రజల భద్రత పేరుతో పాలకుల భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న ప్రజా భద్రతా చట్టం కావచ్చు, యుఎపిఎ కావచ్చు, ఆఫ్సా కావచ్చు - మరే అప్రజాస్వామిక చట్టమైనా కావచ్చు - అవన్నీ పాలకులు తమ భద్రత కోసం రచించుకున్నవే.

వలస పాలన పోయినా బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు చేసిన అప్రజాస్వామిక చట్టాలు అమలవుతున్నట్లుగానే ఆంధ్ర వలస పాలకుల పాలన పోయి మూడున్నరేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది. ఈ చట్టాన్ని, ఈ చట్టం కింద ఉన్న నిషేధాన్ని, ముఖ్యంగా నేను రెవల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షునిగా ఆర్‌డిఎఫ్‌పై నిషేధాన్ని హైకోర్టులో సవాల్‌ చేసి ఉన్నాను. ఇది ఇంకా విచారణకు రావాల్సి ఉంది.

ఐపిసిలోని రాజద్రోహ నేరమే చెల్లదని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఉద్యమిస్తున్న కాలంలో యుఎపిఎ, పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ వంటి కేంద్ర, రాష్ట్ర అప్రజాస్వామిక చట్టాలు, నిషేధాలు చెల్లవని వేరే చెప్పనక్కర్లేదు.

విప్లవకారులే కాదు, విప్లవ రచయితలే కాదు గాంధీ, జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి వాళ్లు కూడా శాసనోల్లంఘనను, సహాయ నిరాకరణను ప్రబోధించారు.

తెలంగాణ ఉద్యమ కాలమంతా సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనలను తెలంగాణవాద రాజకీయాలు సమర్థించాయి. సమ్మక్క, సారలక్కలు మొదలు కొమురం భీముల వరకు ఎంచుకున్న సాయుధ పోరాట మార్గాన్ని సమర్థించాయి. తుపాకి పట్టిన కొమురం భీము విగ్రహాన్ని తెలంగాణలోని తెరాస ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పింది.

చరిత్ర గతం మాత్రమే కాదు. భవిష్యత్తుతో వర్తమానం చేసే సంభాషణ.

1857లో ఈ దేశ రైతాంగం ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంతో ప్రారంభించిన ప్రజాస్వామిక విప్లవాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా మాత్రమే పరిపూర్తి చేయగలమని 1967లో ఏభై ఏళ్ల క్రితం రూపొందించిన నక్సల్బరీ పంథా ఎంచుకున్నది. 1969 ఏప్రిల్‌ 22న సిపిఐ ఎంఎల్‌ ప్రకటించింది. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎనబై దేశాలలో మార్క్సిస్టు - లెనినిస్టు పార్టీలు ఏర్పడినాయి. ఆ విప్లవ తాత్విక, సైద్ధాంతిక, రాజకీయ సంప్రదాయ కొనసాగింపే సిపిఐ (మావోయిస్టు). అది ఒక రాజకీయ పార్టీ.

దేశ వ్యాప్తంగా లేదా ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఒక సైద్ధాంతిక పునాదిపై ఏర్పడిన రాజకీయ పార్టీని, అంతర్జాతీయ కార్మికవర్గ దృక్పథం గల పార్టీని ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా నిషేధించడం హాస్యాస్పదం. అది చెల్లదు. అది ప్రభుత్వాలకే వర్తిస్తుంది కాని ప్రజలకు కాదు.

2005 ఆగస్టు 17న సిపిఐ మావోయిస్టుతో పాటు కొన్ని ప్రజా సంఘాలను, నేను సభ్యుడిగా ఉన్న విప్లవ రచయితల సంఘాన్ని కూడా ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం కింద నిషేధించినపుడు విప్లవ రచయితల సంఘం అడ్వయిజరీ బోర్డు ముందు హాజరయింది. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఆ అడ్వయిజరీ బోర్డులో ముగ్గురు పదవీ విరమణ చేసిన న్యాయ మూర్తులున్నారు. వాళ్లు ఆ నిషేధం చెల్లదన్నారు.

నామీద నేరారోపణ రూపంలో ఇప్పుడు మీ ముందుకు ఎన్‌కౌంటర్‌ మీద, నిషేధం మీద విచారించే అవకాశం వచ్చింది. ఈ నేరారోపణలో భౌతిక హింసాత్మక చర్య ఆరోపణ లేదు. ఎన్‌కౌంటర్‌ను హత్య అన్నాననేదే ఆరోపణ. ʹమావోయిస్టు పార్టీ జిందాబాద్‌ʹ అన్నానన్నది నా మీద ప్రాసిక్యూషన్‌ సాక్ష్యం చేసిన ఆరోపణ. జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని, విడిపోయే హక్కును కూడ గుర్తిస్తున్న మావోయిస్టు పార్టీ 1950లో రాజ్యాంగ రచన తర్వాత దేశంలో ఏర్పడిన భౌగోళిక రాజకీయ పరిపాలన పరిధిలోనే సిపిఐ (మావోయిస్టు)గానే తన వర్గపోరాట కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నది. ఏమైనా రెచ్చగొట్టే ప్రసంగం చేశానన్నదే ఆరోపణ. కనుక ఇది చాల అనిర్దిష్టమైన ఆరోపణ.

ఈ పదేళ్లలోనూ నా ప్రసంగం ఏ భౌతిక హింసాత్మక చర్యను ప్రేరేపించినట్లు కూడ ప్రాసిక్యూషన్‌ ఆరోపించలేకపోయింది. కనుక నేను భౌతిక హింసాత్మక చర్యకు రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని భావించి నన్ను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతున్నాను. ఈ రూపంలో మీ ముందుకు ప్రజా భద్రత చట్టం కింద ఒక నేరారోపణ వచ్చింది గనుక ఇది అవకాశంగా ఈ ʹఎన్‌కౌంటర్‌ʹపై విచారణను చేపట్టాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతున్నాను. అట్లాగే ఈ చట్టం కింద మావోయిస్టు పార్టీపై నిషేధంపై విధించడంపై కూడ విచారించాలని కోరుతున్నాను. ఒక్కొక్కసారి సుమోటోగా కూడా తీసుకోవల్సిన భావ ప్రకటనకు సంబంధించిన ఇంత ప్రాథమికమైన హక్కును పరిరక్షించే అరుదైన అవకాశం మీకు వచ్చిందని నేను భావిస్తున్నాను.

(వరవరరావు)

Keywords : varavararao, maoist, court, revolution, martyrs
(2017-11-23 19:13:03)



No. of visitors : 93

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తెలంగాణను ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియా పరిపాలిస్తోంది ‍- వరవరరావు

తెలంగాణ ను ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా పరిపాలిస్తోందని విప్లవ రచయిత వరవరరావు మండిపడ్డారు. నేరెళ్ళ లో భూమయ్య మరణానికి, 8 మంది అరెస్టుకు కారణమైన ఇసుక మాఫియాను అరెస్టు చేయాలని, వాళ్ళ ఆస్తులు జప్తు చేసి , భూమయ్య కుటుంభానికి, నేరెళ్ళ దళితులకు పంచిపెట్టాలని వీవీ డిమాండ్ చేశారు. ....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

ʹనాగేశ్వర్ రావు అలియాస్ చిన్నబ్బాయ్ ని పట్టుకొని కాల్చి చంపారుʹ

మల్కన్ గిరి చిత్రకొండ సమితి దగ్గర కప్పాతుట్టా అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని ఆ ఎన్ కౌంటర్ లో ఒక నక్సలైటు చనిపోయాడని పోలీసులు చెబుతున్న కథనం బూటకం. ఇక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు జరగలేదని స్థానికులు అంటున్నారు....

ఇసుక మాఫియా ఆస్తులను జప్తు చేసి నేరెళ్ళ దళితులకు పంచాలి.. వీవీ డిమాండ్

సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్ళలో అనేక మంది మరణాలకు కారణమైన , పోలీసులతో ప్రజలపై దాడులు చేయించిన , యువకులను చిత్రహింసలపాజేసిన ఇసుక మాఫియాను అరెస్టు చేయాలని, వారి ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంభాలకు పంచాలని విప్లవ రచయిత వరవరరావు డిమాండ్ చేశారు...

Search Engine

మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేద‌ట !
కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్ల‌
COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA
రైతు సమన్వయసమితుల్లో కూడా బీటీ బ్యాచేనా?
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks
ఇంద్రవెల్లి మట్టి మీద చంద్రుడైతడో... శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో...
ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు
పూణే యూనివర్సిటీలో శాఖాహారులకే గోల్డ్ మెడల్ ఇస్తారట !
Oh shed! In Kannur, RSS worker blows up roof while making bomb
నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్
అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్
నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాట
Maoist posters on Russian Revolution in Narayanpatna
శంభూకుడి గొంతు..మనువాదంపై ఎక్కుపెట్టిన బాణం...సివీకీ జోహార్లు - విరసం
HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల స‌స్పెండ్‌
జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ‌
Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab
మమ్మల్ని ఉగ్రవాదులన్న కమల్ ను కాల్చి చంపాలి ‍- హిందూ మహాసభ‌
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
SFI activists in Nattakom assault Dalit female students, call them Maoists
హోంమంత్రి నాయిని పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి ...వరవరరావు
శ్రీకాకుళములోన చిందింది రక్తము..కొండలెరుపెక్కినాయి..పోరాడ బండలే కదిలినాయి - వరవరరావు
Saudi Arabia to Behead 6 School Girls for Being With Their Male Friends Without Parents or a Guardian
more..


కోర్టు