జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ


జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలు


అనగనగా ఒక రాజాభయ్యా వున్నాడు. ఆయన ఒక పెద్ద భూస్వామి అని, ఆయన కి నచ్చని వాళ్ళని లేదా ఆయనని వ్యతిరేకించేవాళ్లని ఆయన తన ఇంటి ఆవరణ లోనే ఉన్న కొలనులో ముద్దుగా పెంచుకొనే మొసళ్ళకి ʹబ్రేక్ ఫాస్ట్ʹ గా వేస్తుంటాడని, ʹగిట్టని వాళ్ళుʹ అంటుంటారు. ఒక విలేఖరి ఆయనని మొసళ్ళ గురించి ʹఇలా అట కదాʹ అని అడిగితే, ʹఇవన్నీ మీ లాంటి విలేఖరులే సృష్టించారోయ్ʹ అని కోప్పడేసి, సదరు విలేఖరిని కూడా ʹగిట్టని వాళ్ళʹ లిస్ట్ లోకి ఎక్కించేశారు. ఇంతకీ విలేఖరి ఆయనని ఇంటర్వ్యూ ఎందుకుచెయ్యాల్సి వచ్చింది? అంటే.. రాజా భయ్యా ఏదో ʹసరదాగాʹ చేసిన అనేక పనులు ʹగిట్టకʹ ఆయన మీద తప్పని పరిస్థితిలో కొన్ని కేసులు పెట్టాల్సి వచ్చింది. అలా ఆయన ప్రతి కేసు సందర్భంగాను ఒక్కో జైలు కి వెళ్ళాల్సి వచ్చింది. వెంటనే బెయిల్ వచ్చేస్తుండేదనుకోండి. అలా ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని 14 జైళ్ళని సందర్శించేరు. మహానుభావులు! ఆయన మీద పెట్టిన కేసులు విషయం లో సెంచరీ దాటారు. దీని గురించి ఆయనని అడిగితే ఇదంతా ప్రతిపక్ష ʹమాయʹ అంటారు. అందులో నిజం లేక పోలేదు. లేకపోతే ఆయన మీద కేసు పెట్టే సత్తా ఎవ్వరికుందీ? గతంలో కొద్దికాలమ్ ʹమెత్తనిʹ మనసు గల సీనియర్ యాదవ్ గారు కేసులన్నీ చూసి చికాకు పడి ఏమిటివి, ఇలాంటి చెత్త పనులెవరూ చేసేది అని వాటిని ʹకొట్టి పడేయ్యించారు.ʹ కేంద్రం నుండి వారికో సలహా వచ్చింది. అయ్యా! తమరు కొట్టేస్తే కొట్టేశారు కానీ ఆ ఒక్కటీయున్ దప్పʹ అని మచ్చ గా భావింపక పుట్టుమచ్చగా భావింపుము సుమ్మీ! అని ఒక టాడా కేసు ని వదిలిపెట్టారు. కనుక అది బ్యూటీ స్పాట్ గా భావించి వదిలిపెట్టేశారు. మళ్ళీ ʹమాయదారిʹ ప్రభుత్వం ఆయనపై కేసులు బనాయించింది. ఇంతలో ప్రభుత్వం మారింది. నవయువకులైన ముఖ్యమంత్రి జూనియర్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే నేర చరిత్ర వున్నవాళ్లనీ ముఖ్యంగా మర్డర్ కేసుల్లాంటివి వున్నవాళ్ళకి తన ప్రభుత్వంలో స్థానం లేదని ప్రకటించివున్నారు. కానీ ఆయన ప్రతిభకి పట్టం కట్టే మనిషి. రాజాభయ్యా గారి ప్రతిభని చూసి ఆయనని తగిన రీతిని సత్కరించాలనుకొన్నారు. అందుకే 43 క్రిమినల్ కేసులని కొత్తగా సంపాదించుకొన్న ఆయనని వెంటనే తన మంత్రివర్గం లోకి తీసుకొని జైళ్ళ శాఖ ఇచ్చారు. మనలో మన మాట. ఆయన కన్నా తగిన వారు ఎవరు చెప్పండి! జైళ్ళ గురించి జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకే కదా బాగా తెలిసేది.
ఆయన పదవిలోకి రాగానే వారి పెంపుడు మొసలికి సదరు టాడా కేసులో అనవసరంగా విచారణ చేస్తున్న డి‌ఎస్‌పి గారిని వేసి ఫీస్టు చేద్దామనుకొన్నారు కానీ. వారి మొసలికి మైనారిటీ మాంసం ఇష్టం లేదని తెల్సి మరో మార్గంలో వారిని పరలోకానికి బదిలీ చేశారు. ʹగిట్టని వాళ్ళతో పాటు వెధవది ఆయన భార్య, ఆమెతో పాటు ʹఅలగా జనంʹ కూడా బాగా లొల్లి పెట్టారు. దాంతోవారు అలిగి ఇంటికి వెళ్ళిపోయారు. అయితేనేం సి.బి.ఐ వారు ఉండే దెందుకు? ఇలాంటప్పుడేకదా వారి అసలు పని. ʹమా రాజ భయ్యా అంతటి మంచివాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ లోకం లో? అని క్లీన్ చిట్ ఇచ్చారు. కథ కాశీకి. మనం జైలు కి.
*** *** ***
వచ్చినప్పటినుండీ ఆమె ఏడుస్తూనే వుంది. జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు. మాసిన చీర. చంకలో పిల్లోడు. ఆమె కూర్చున్న చోటంతా ఝుమ్మని ఈగలు. కొందరు చీదరింపుగా వైదొలుగుతుంటే, కొందరు జాలిగా చూస్తున్నారు. కొత్త బందీలు జైలుకి వచ్చే టైమ్ అంటే సాధారణంగా సాయంత్రమే. కాబట్టి ఆమె వచ్చిన కాసేపటికే లాకప్ టైమ్ అయ్యింది.
జమ్మెదార్ వచ్చేలోపు కాళ్ళు చేతులు కడుక్కోమని వార్డ్ పహరా (కాపలా కాసే ఆమే. శిక్ష పడిన ఖైదీలనే నియమిస్తారు ఆ పనిలో) గదమాయించి చెప్పింది. కానీ ఆమె జవాబు చెప్పలేదు. కనీసం మాట్లాడుతున్న వాళ్ళ వైపు తల తిప్పి కూడా చూడలేదు. ఆమె లోకంలో ఆమె ఏడుస్తోంది. లాకప్ అయ్యాక తనకి కేటాయించిన జాగా లో మోహమ్మీద కొంగు కప్పుకొని పడుకొన్నది. పహరా రొట్టెలు తీసుకుపోయి ఇచ్చింది. తీసుకోలేదు. పిల్లాడి చేతిలో ఒక రొట్టె పెట్టి ఆమె వెనక్కి వచ్చింది. ఇక ఆమెని ఎవ్వరూ పలకరించలేదు.
*** *** ***
ఉదయం లాకప్ తెరిచాక బయట వరండాలో కూర్చున్నది. చిన్నగా బెక్కుతోంది. కళ్ళు కారీ కారీ ఎండిపోయినాయి. నేను నా ఉదయం పనులు ముగించుకొని వచ్చేసరికి, కోర్టుకు వెళ్ళాలని పిలుపోచ్చింది. స్నానానికి పోబోతూ ఆమె వైపు చూశాను. ఆమె మీద ముసురుతున్న ఈగలు వల్ల అందరూ దూరంగా నిలబడి ఏదో జంతువును చూసినట్టు చూస్తున్నారు. నేను లోపలికి పోయి ఒక స్నానం సబ్బు, బట్టలుతికే సబ్బు ఒక పాత దుపట్టా తీసుకొని వచ్చాను.
అరెస్టయినప్పుడు చాలా చిత్రంగా కనీసపు వస్తువులుకూడా తీసుకోనివ్వరు. కట్టుబట్టలతో వస్తారు జైలు కి ఎవరైనా సరే. ఇళ్ళలో అరెస్టు చేసేవాళ్ళని కనీసపు వస్తువులు ఎందుకు తీసుకొనివ్వరో అర్థం కాని విషయం. జైలు కి వచ్చిన 15 దినాల వరకు సబ్బులు, నూనె వంటివి కూడా ఇవ్వరు. నిజానికి అవసరమయ్యేదే అప్పుడు. ఇదేమి న్యాయమో, ఎక్కడి నియమమో అర్థమే కాదు.
పైగా అరెస్టయ్యాక ఒక దినమో రెండుదినాలో స్నానపానాలు లేకుండా పోలీసు స్టేషన్లలో గడుపుతారు. ఇక జైలుకి వచ్చేవరకు ఘోరమైన పరిస్థితిలో వుంటుంటారు.
ʹచూడమ్మా నీ పేరెంటీ?ʹ
..................... ఆమె నాకేసి కనీసం తలతిప్పి కూడా చూడలేదు.
మూగదేమో? గుంపులోంచి ఎవరో అన్నారు.
లాభంలేదని ఆమె పక్కనే కూర్చున్నా. ఒక్కసారి ఝుమ్మని చుట్టుముట్టాయి ఈగలు.
ʹఇలా ఎంత సేపు ఏడుస్తావు చెప్పు? లే, లేచి ముఖం కడుక్కొని స్నానం చెయ్యి.ʹ పహరా వేపపుల్ల తెచ్చి ఇచ్చింది. ʹపిల్లోడు చూడు భయపడి పోయాడు.ʹ అప్పటికీ కదలిక లేదు.
ʹఏయ్ దీదీ.. అంతా మంచిగయిపోతుందిలే. మేమంతా లేమా!ʹ మెల్లగా ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకొని భుజమ్మీద చెయ్యెశాను. మానవ స్పర్శకి అప్పటి వరకు ఆమెలో ఘనీభవించినదేదో ఫెటిల్లున విస్ఫోటించినట్టు నా మీద పడి ఏడ్చింది.
అప్పటి వరకూ నిలబడి చూస్తున్న శకున్ మెల్లగా వచ్చి ఆ పసివాడిని చేతుల్లోకి తీసుకొన్నది. అప్పుడిక ఒక్కొక్కరూ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఆమెని రెక్కపట్టి లేపి బలవంతంగా సబ్బులు చేతిలో పెట్టి బావి దగ్గరికి పంపుతుంటే లలిత వచ్చి, దీదీ మేము చూసుకొంటాములే కోర్టుకి టైమ్ అవుతోంది అన్నది. నిజానికి ఇప్పుడు నా అవసరం లేదు. మొదటి అడుగు ఎవరో ఒకరు వెయ్యాలంతే. తరవాత ఇక అందరూ వస్తారు. నేను తయారయ్యి వచ్చేసరికి ఆమె పిల్లాడికి స్నానం చేయించి గట్టు మీద కూర్చోపెట్టింది. శకున్ ఆ పిల్లాడికి తన టవల్ తో వొళ్ళు తుడిచి పౌడర్ వేసి బొట్టు కాటుక పెట్టింది. నేను నిశ్చింతగా కోర్టుకు వెళ్ళాను. కస్టడీ లోకి వెళ్ళి కూర్చున్నాక. హిందీ పేపర్ లు తీసి చూశాను. ఎక్కడా ఆమె గురించిన వార్త రాలేదు. కాబట్టి ఏం కేసో తెలియదు.
నాకెందుకో ఆమె కళ్లలోని దైన్యం వెంటాడుతోంది. చాలా పేద మనిషిలా వుంది. ఆదివాసీ లాగే వుంది. ఇప్పటికీ ఆమె నోరు విప్పి మాట్లాడలేదు కాబట్టి మూగమనిషా కాదా తెలియలేదు. బహుశా ఆమెని దుఖమే మాట్లాడనివ్వడం లేదు కావచ్చు. ఎప్పుడూ జీవితంలో వూహించని ఒక కష్టాన్ని ఎదుర్కొనేటప్పుడు అల్లకల్లోలయిమయిపోతాం మనుషులం. ఇక వాళ్ళు ఏ అడవిలోనో కట్టెలు కొట్టుకొని బతికే వాళ్లయితే చెప్పనే అక్కర్లేదు.
నేను సాయంత్రం కోర్టు నుండి వచ్చేసరికి ఆమె ఒక గుంపు మధ్యలో కనబడింది. ఫరవాలేదే అనుకొన్నాను. స్నానం చేసి శుబ్రంగా వుంది. లలిత ని అడిగాను ఏమన్నా తెలుసా? చెప్పిందా అని.
ʹమూగమనిషి అయితే కాదు. ఎందుకు తీసుకొచ్చింరో తెలవదుʹ అన్నది.
*** *** ***
అసలు విషయం ఏమిటంటే ఆమెను ఎందుకు తీసుకొచ్చారో ఆమెకూ తెలియదు. మాకూ తెలియదు. కొంత కాలం తరవాత మేము తెలుసుకొన్న విషయం, ఆమెను జైలుకి తీసుకురావడానికి ముందు అసలు ఏం జరిగిందనేది మాత్రమే.
ఒక రోజు ఆమె నూకలతో గంజి కాసి, గుడిసెకి తడికే అడ్డుపెట్టి, ఏమన్నా ఆకు కూర దొరికితే కోసుకు రావడానికి అడవిలోకి పోయింది. ఈలోపు ఒక మేక వచ్చి దానిలో మూతి పెట్టింది. గిన్నెలో దాని కొమ్ములు ఇరుక్కొని బయటకు రాలేదు. దాని తల మొత్తం గిన్నెలో వుండి పోయింది. తల బయటకు తీయడానికి మేక ప్రయత్నించినా, చూసిన వాళ్ళు ప్రయత్నించినా కానీ, అది బయటకు రాలేదు. గంజిలోపలికి పోవడం వల్లనో ఊపిరాడకనో కానీ మేక చచ్చిపోయింది. మేక యజమానులు ఈమెని పరిహారం అడిగారు. ఆమె దగ్గర డబ్బులు లేవు. మామూలుగా అయితే పంచాయితీ అయ్యేది. కానీ ఇప్పుడు అడవిలోకి మరేమీ రాకపోయినా పోలీసు స్టేషన్ వచ్చింది. వాళ్ళు వెళ్ళి స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. పరిహారం కట్టలేకపోయింది కనక ఆమె మీద ఏదో ఒక కేసు పెట్టి జైలుకి పంపారు. తన ఇంటికి మేకలూ, కుక్కలూ రాకుండా పకడ్బందీగా ఆమె ఇల్లు కట్టుకోకపోవడమే ఆమె నేరమయిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు ఏమేమి కష్టాలు పడ్డారో తెలియదు కానీ, మూడు నెలలకి కానీ ఆమెకు బెయిలు దొరకలేదు.
*** *** ***
నీతి: మనుషులను జంతువులకు ఆహారంగా వెయ్యగలిగిన వాళ్ళు జైళ్ళ మంత్రులవుతారు. జంతువులనుండి తమ ఆహారాన్ని కాపాడుకోలేని వాళ్ళు జైళ్ళపాలవుతారు.
-బి.అనూరాధ

Keywords : jharkhand jail, maoists, adivasi,
(2019-11-12 13:46:35)No. of visitors : 876

Suggested Posts


జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు.

జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా.

జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి....

Search Engine

Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
more..


జైలు