జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ


జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

జైలు

ఆమెని మొదటి సారి చూసినప్పుడు చిన్న పిల్లలెవరో సరదాగా చీర కట్టుకొని తిరుగుతున్నారనుకొన్నాను. కానీ అలాంటి సరదాలు, పంజాబీ సూట్ ల మీద వేసుకొనే దుపట్టాలతోనో, టవల్ తోనో చేస్తుంటారు కాబట్టి అనుమానంతో, పరికించి చూశాను. సందేహంలేదు, ఆమె బందీనే. చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది. పలకరిస్తే సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. ఇంక ఆ రోజుకి ఏమీ అడగనే లేదు. తరవాత ఎవరో చెప్పారు మర్డర్ కేసులో వచ్చింది అని, నిర్ఘాంతపోయాను. అంత చిన్న పిల్ల ఎవర్ని మర్డర్ చేసివుంటుంది?
ఆమె పేరు శకున్ అని తెలుసుకొన్నాను. సాధారణంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు. సంభాషణ పెంచేది కాదు. ఆమెని నేను చాలా ఆలస్యంగా గమనించాను. అంటే దాదాపు నేను జైల్లో అడుగుపెట్టిన రెండేళ్ళ తరవాత. ఆమె వెనుకవైపు వార్డులో వుండేది. ఎప్పుడూ వున్నట్టే కనిపించేది కాదు. అదొక కారణం కావచ్చు. తరవాత కొత్త బిల్డింగ్ కట్టాక చిన్న చిన్న రూమ్ లని మూసివేసి సగం మందిని కొత్త బిల్డింగ్ లోకి మార్చారు. అప్పుడామె కొత్త బిల్డింగ్ లోకి మారింది. నేను ఆ తరవాత చాలా కాలానికి ఆ వార్డులోకి మారాను. బహుశా అందులోకి మారకపోతే నాకు ఆమె పరిచయం కాకపోయేదేనేమో. ఏమి అడిగినా ఒక పట్టాన జవాబు చెప్పేది కాదు. ఆమెని ఒక్కదాన్నే నేను ప్రత్యేకంగా పట్టుబట్టి స్నేహం చెయ్యడానికి ప్రయత్నించింది. ఆమెకి పెళ్లయ్యింది అంటే నమ్మ బుద్ధయ్యేది కాదు. ఒక ఫ్రాక్ వేస్తే స్కూల్ పిల్లలాగా వుండేది. ఆమెకి రెండు మూడు సార్లు చెప్పాక మెల్లగా స్కూలికి రావడం మొదలుపెట్టి పిల్లలతో పాటుగా అక్షరాలు దిద్దడం మొదలుపెట్టింది. మెల్లగా సాన్నిహిత్యం పెరగడం మొదలయ్యింది. పిల్లలతో ఆటలలో కిలాకిలా నవ్వడం చూస్తే పోన్లే ఈమె నవ్వడం మర్చిపోలేదు అనిపించేది.
ఒకరోజు నా దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుంది. ఏవో తెలియనివి పుస్తకంలో చూపించి చెప్పించుకొన్నది. ఆ తరవాత ʹదీదీ నువ్వు చాలా మంచిదానివి. తుమ్ కో దేఖే తో ముఝే బడీ మాయా లగ్తీహై.ʹ అన్నది. ఒక్క క్షణం నేను బిత్తరపోయాను. అప్పటికి నేను హింది కొంచెం పికప్ చేశాను. అంటే నిన్ను చూస్తే జాలివేస్తుంది, అని అన్నది. నేను నవ్వేసి, ఎందుకో అన్నాను. అందరూ వచ్చి నిన్నే అడుగుతారు. అందరికీ చెప్పాల్సివస్తది కదా. అందరికీ సాయం చెయ్యాల్సివస్తది. పాపం అనిపిస్తది అన్నది. పోన్లే నీకన్న నన్ను చూసి జాలి వేసింది అన్నాను. ఆమెకు ఎందుకో నాకళ్లలో నవ్వు కనిపించిందేమో, ʹహఠ్! నేనేదో తప్పు అన్నాను కదా! అని రెండు చేతుల్లో ముఖం దాచుకొని సిగ్గుపడిపోయింది.ʹ లేదు లేదు సరిగ్గానే అన్నావు అన్న.
ʹఇంతకీ నీ వయసెంత?ʹ అన్నాను. ʹఏమో? నువ్వు అందాజ చెయ్యి!ʹ అన్నది.
ʹనీ పెళ్ళి అయ్యి ఎంత కాలం అయ్యింది చెప్పు?ʹ అన్నా. ఏవో లెక్కలు పెట్టి ʹయేడేళ్ళుʹ అంది. ʹఅప్పుడు ఎంత వున్నావు?ʹ అంటే ʹగింతే వున్నాʹఅంది. ʹఅట్లెట్ల వున్నావ్?ʹ అంటే కిలకిలా నవ్వింది.
ʹనిజ్జం దీదీ! మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. మా చాచా, చాచి నా పెళ్ళి చేసేశారు. ఎంత కాలం పోషిస్తారు? పెళ్ళయితే ఇంక ఆళ్ళే చూసుకొంటారు కదా!ʹ అంది పెద్ద ఆరిందా లాగా. తరవాత కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది. ʹఅప్పటికి నేను ఇంకా వయసుపిల్లని కాలే. అట్లే చేసేసిన్రు. చాలా కాలం అయినంక అప్పుడు వయసుపిల్లనయినా. అప్పుడు మళ్ళీ ససురాల్ కి పంపించేసిన్రు. నాకు మస్తు భయ్యమయ్యింది. ఆయన నాకన్నా చాలా పెద్దోడు. ఎంతనో తెలుసా? నాకన్నా పెద్ద పిలగాడుండు ఆయనకి. హా!ʹ అలా చెప్తుంటే నాకు ఐదేళ్ళ రోషినీతో మాట్లాడుతున్నట్టుంది తప్ప ఒక పెళ్ళయిన ఆమెతో మాట్లాడుతున్నట్టే లేదు. ʹమస్తు తాగుతాడు. నన్ను చానా కొట్టేది. ఆమె కళ్ళల్లో ఇంకా ఆ బెదురు పోలేదు. రోజూ తాగుతాడు. నాకు ఇద్దరు పిల్లలయ్యింరు.ʹ వింటున్న నాకు గుండె దఢాలున జారి పొట్టలో పడ్డట్టయ్యింది. ఈ చిన్న పి‌ల్లకి మరో ఇద్దరు చిన్న పిల్లలు కూడానూ! ʹఇద్దరు ఆడపిల్లలు. అందుకని ఆ వంకన కూడా బాగా కొట్టేవాడు. నా చేతిలా వుందా? నేను మగపిల్లాడు కావాలి అంటే అయిపోద్దా? పెద్ద పిల్లకి మూడో యేడు పడ్డది. చిన్నది పారాడుతుండే. ఒక రోజు తాగొచ్చి బాగా కొట్టిండు. మాయమ్మని యాది చేసుకొని బాగా ఏడ్చిన. నా వల్ల కాదనుకొన్న. చచ్చిపోవాలనిపించింది. కానీ ఇద్దరు ఆడపిల్లల్ని వదిలిపెట్టి పోతే ఎట్లా? ఆళ్ళేమయితారు.ʹ ఆమె చెప్తుంటే నా గుండె వేగం పెరగడం నాకు స్పష్టంగా వినపడుతోంది. ʹఇద్దరు పిల్లల్ని తీసుకొని పోయి బాయిల దుంకిన. కిందనుండి, నీళ్ళు నన్ను పైకి తన్నినయ్యి. నాకు తెలియకుండానే ఏదో దొరికితే పట్టుకొని యేలాడబడినా, కేకలుపెట్టినా. దారినపొయ్యేవాళ్ళు ఎవరో పైకి తీసిన్రు. నేను బతికిపోయ్యినా కానీ నా పిల్లలు చచ్చిపోయిన్రు.ʹ తల కిందికి దించుకొని మాట్లాడుతుంటే ఆమె ముఖంలో భావాలు నాకేమీ కనబడడం లేదు. నేలమీద గీతాలు గీస్తూ మాట్లాడుతోంది. ʹఅక్కడనే బెహోష్ అయి (స్పృహ తప్పి) పడిపోయినా. ఇంక ఆయన ఇంటికి పోలే. అక్కడనే కూచున్న. ఆ పక్క ఇంట్ల వున్నోళ్ళే రాత్రంతా తోడు కూర్చున్నారు. ఆళ్ళ ఇంట్లోకి రమ్మంటే కూడా పోలేనేను. ఆళ్ళెమేమో అడిగే కానీ నాకు ఏం చెప్పరాలేదు. ఆళ్ళు కూడా నీలెక్కనే చిన్న పిల్ల పాపం అంటుండే. మలత రోజు పోలీసులు తీసుకుపోయారు. ఆయన నామీద మర్డర్ కేసు పెట్టిండని చెప్పిన్రు.ʹ నిర్వికారంగా అలా చెప్పుకుపోతున్న ఆ పసిపిల్లని చూస్తే కడుపు తరుక్కుపోవడం అంటే ఏమిటో అర్థం అయ్యింది.
ఎలాగో గొంతు పెగుల్చుకొని ʹమరి ఇంటి నుండి ఎప్పుడైనా ఎవరన్నా వచ్చార?ʹ అన్నాను.
ʹ ఒక్కసారి చాచ, చాచి వచ్చింరు. బట్టలిచ్చి పోయారు. వకీల్ని పెట్టనీకి ఆళ్ళ దగ్గర పైసలు లేవు. దీదీ! నేను ఇంక బయటకు పోలేను కదా?ʹ మామూలు విషయం అడుగుతున్నట్టే అంది. ʹఅదేం లేదు. కేసు కొట్లాడి పూర్తయితనుదుకో అప్పుడు పోవచ్చు అన్నాను. ʹసజా అయితే?ʹ అంది.
ʹఏం కాదు.ʹ అన్నాను.
ఆ పిల్ల నా మనుసులో ఎంత కల్లోలం రేపిందో నేను మాటల్లో వర్ణించలేను. నేను మామూలుగా వుండలేకపోయాను. ʹదీదీ! నేను నిన్ను మస్తు పరేశాన్ చేసిన కదా! నీ ముఖం అంత ఎట్లనో అయ్యింది.ʹ అన్నది. నేను బలవంతంగా నవ్వి, ʹఏం కాదు.ʹ అన్నాను. నాకసలు ఏమనాలో ఎలా ప్రవర్తించాలో అర్థం కాలేదు. తానే మెల్లగా లేచి, ʹనీ పని చూసుకో దీదీ మళ్ళీ వస్తాʹ అని వెళ్లిపోయింది.
*** *** ***
ఇక నేను ఆరోజు నిర్ణయించుకొన్నా. ఈ పిల్లని ఎలాగైనా బయటకు తీయాలి అని. చట్టం బాగా తెలిసిన నా స్నేహితులకి ఉత్తరం రాశాను. వాళ్ళూ జైల్లోనే వున్నారు. జైలు బయట వుండేవాళ్ళకి జైల్లో వాళ్ళకి ఉత్తరాలు రాసే తీరిక కానీ అలవాటుకాని ఉండవనేది నాకు అనుభవం అయిపోయింది. కాబట్టి నాకు అనేక మంది లాయర్ మిత్రులున్నా, నేను వాళ్ళెవరికి రాసి టైమ్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేను అనుకొన్నట్టే తన నుండి వెంటనే జవాబు వచ్చింది. ʹనువ్వు చెప్పిన దాన్ని బట్టి కేసు పెట్టే టైంకి ఆమె మైనర్ అయివుండవచ్చు. దానిని మనం నిరూపించగలగాలి. ఆమె ఒక్క యేడాది అయిన ఏదైనా స్కూలికి పోయి వుంటే అక్కడనుండి సర్టిఫికేట్ తీసుకోడం. లేదా డాక్టర్ తో టెస్ట్ చెయ్యించాలని డిమాండ్ చెయ్యడం. అయితే కొంచెం రిస్కీ. ఆమె కనక పొరపాటున 18 అయివుంటే మనకి సమస్య. కాబట్టి మొదటిదే బెటర్. జువనైల్ జస్టిస్ యాక్ట్ కూడా పంపుతున్నా, చూడగలవు.ʹ అని రాశాడు. నేను దానిని చదివాను. శకున్ ని అడిగితే చిన్నప్పుడు ఒక యేడాది స్కూల్‌కి వెళ్ళానన్నది. కానీ, స్కూల్ పేరు కానీ, ఊరుకాని గుర్తులేవు. అది యే యేడాదో కూడా గుర్తులేదు. గుర్తుంటే మటుకు తెచ్చిపెట్టేవాళ్ళెవరు? నేను సంకటంలో పడ్డాను. మొదలు జైలు కార్యాలయంలోనుండి తన కేసు వివరాలు తీసుకొన్నాను. తరవాత ఆమెకు ఒక సర్కారీ వకీలు కావాలని పిటీషన్ రాశాను. చివరకు వకీల్ని ఇచ్చారు. తన కేసు చార్జ్ అయ్యిందా లేదా కనుక్కోవాలి. కానీ ఎలా? మళ్ళీ శకున్ ని కూర్చోబెట్టి అడిగాను. దేనికైనా సింపుల్ గా ʹనాకేం తెల్సు?ʹ అనే ఆమె దగ్గరనుండి నాక్కావాల్సిన సమాచారం పట్టుకోవడం కష్టమే అయ్యింది. చివరకి ఇలా అడిగాను. నిన్ను ఎప్పుడైనా జడ్జి బోనులో నిలబెట్టి, ʹనువ్వు ఈ హత్య చేశావా? అని అడిగాడా?ʹ అన్నాను. ఆమె చాలా సేపు ఆలోచించి ʹఆ..ఆ.. అడిగాడు. ఇప్పుడు కాదు, రెండేళ్లయ్యిందేమోʹ అన్నది. అంటే ఆమె జైల్లోకి అడుగుపెట్టిన యేడాదికి ఆమె కేసులో ఛార్జీలు ఫ్రేమ్ చేస్తే మరో రెండేళ్ళు గడిచినా ఆమె కేసు ముందుకు పోలేదు. ʹఇంతకీ నువ్వేం చెప్పావ్?ʹ ఆందోళనగా అడిగాను. ʹనాకేం తెల్వది అన్నాను.ʹ ఒక్కసారి హాయిగా ఊపిరి పీల్చుకొన్నాను. సొ కేసు ట్రయల్ కి వెళ్తుంది. ఆమెని సర్కారీ వకీల్ వచ్చి కలుస్తాడని చెప్పాను. సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడుండే క్లర్క్ ని అడగమని చెప్పాను కానీ, అంత ధైర్యం చెయ్యలేకపోయింది. మరో ఏడాది గడిచిపోయింది ఇలాగే. ఏమి జరగలేదు. నాకు చేతనైన సాయం చెయ్యడానికి ప్రయత్నించాను కానీ ఏమీ జరగలేదు. ఇదివరకూ ఇచ్చిన లాయర్ ఏమీ చెయ్యడం లేదని ఫిర్యాదు చేద్దామా అనుకొన్నాను. కానీ అతనిని జడ్జి కొప్పడితే కేసు పాడుచేస్తాడేమో అని ఎవరో అన్నారు. దాంతో ఇలా కాదని ఊరికే మళ్ళీ లాయర్ కావాలని మళ్ళీ ఒక పిటీషన్ వేశాను. మరో లాయర్ ని ఒక నెల తరవాత ఇచ్చారు. ఒక నెల ఆగి, మళ్ళీ శకున్ తరపున ఒక పీటీషన్ రాశాను. నా కేసులో ఇప్పటివరకూ ఏమీ జరగలేదనీ నాలుగేళ్ళనుండి కేసు వాయిదాలు పడుతోందని ఇప్పటివరకూ కేసులో విచారణ ప్రారంభం కాకపోవడం, విచారణ వేగంగా జరపాలనే నా హక్కుని కాదనడమే ననీ (రైట్ టు స్పీడీ ట్రయల్) ఒక పిటీషన్ ఇంగ్లీష్ లో రాసి కింద ʹఇంగ్లీష్ లో రాసి, హింది లో అనువాదం చేసి చెప్పినది ఫలానాʹ అని నా పేరు రాసి సంతకం చేశాను. జిల్లా జడ్జీ కి కాపీ పెట్టాను. తరవాత జరిగిన జైల్ అదాలత్ కి జిల్లా జడ్జి వచ్చినప్పుడు మహిళా వార్డుకి రౌండ్స్ కి వచ్చాడు. అప్పుడు కాపీ తీసి పట్టుకొని శకున్ ని తీసుకొని ముందు వరసలో నిలబడ్డాను. జడ్జి దృష్టి ఆమె మీద పడితే చాలు అనుకొన్నాను. అయితే ఇదెంత సున్నితమైన కేసు అంటే ఏం జరిగిందో చెప్పకుండా కేసు వేగంగా జరిగేలా చూడాలి. ఏం జరిగిందో చెప్తే కమిట్ అయిపోయినట్టవుతుందేమో అని భయం. ఇవన్నీ ఏమీ అర్థం కానీ శకున్ మాత్రం అవకాశం వస్తే వెనక్కి పారిపోదామని ప్రయత్నం చేస్తోంది. చివరకి ఎలాగైతేనేం ఆమెని జడ్జికి చూపించి చెప్పాను. ఆయన చాలా ఆశ్చర్యపోయి, ʹచాలా చిన్నపిల్ల, సరే ఒక పిటిషన్ రాసి పంపండి.ʹ అన్నాడు. దానికోసమే ఎదురుచూస్తున్న కాబట్టి ఇంతకుముందే పంపానని, మరొక కాపీ ఇస్తున్న అని ఆయన చేతిలో పెట్టాను. మరికొంతమంది కేసుల గురించి చెప్పాక తప్పక స్పీడ్ అప్ చెయ్యిస్తానని వాగ్ధానం చేసి వెళ్ళిపోయాడు. అన్నట్టుగానే తరవాత వాయిదాకి సాక్షులను పిలవడం మొదలుపెట్టారు. లాయర్ కూడా వచ్చి శకున్ కి నువ్వు త్వరలో ఇంటికి వెళ్లిపోతావులే. అని చెప్పాడట. ఆరోజు శకున్ ఉత్సాహంగా వచ్చి చెప్పింది. చివరకి మరో మూడు నెలల తరవాత, ఆమెకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పలేదనీ, ప్రత్యక్ష సాక్షులు లేరని ఆమెని నిర్దోషిగా విడుదల చేశారు. అప్పటికి ఆమె ఐదున్నర యేళ్ళు జైలులో గడిపింది. సాక్షులను పిలవడం మొదలయ్యాక చాచా, చాచి కూడా కోర్టుకి రావడం మొదలుపెట్టారు. వెళ్ళేరోజు శకున్ సంతోషం అంతా ఇంతా కాదు. కోర్టు నుండి వచ్చి దీదీ! ʹరిహా హోగయేʹ అంటూనే ʹసర్కారీ వకీలు నాకు పతా రాసి ఇచ్చిండు. పైసలు అడిగిండు. నా దగ్గరేడున్నాయ్ అని గట్టిగా అన్నా. అమ్మ తల్లీ గట్టిగా అరవకు. జడ్జి ఇంటే కోప్పడతాడు.ʹ అన్నాడు అని కిలాకిలా నవ్వింది.
ʹఇంటికాడ నుండి తెచ్చి ఇవ్వాలా? చాచా అప్పు తీసుకొంటానన్నాడు.ʹ అన్నది. నాకు ఆ వకీలు మీద ఎంత కోపం వచ్చిందంటే చెప్పలేను. అతనికి సర్కారు జీతం ఇస్తది. నువ్వు మళ్ళీ కోర్టుకి రానక్కర్లేదు. అనిచెప్పాను. కళ్ళు విప్పార్చి, ʹఎప్పటికీ రానక్కర్లేదా? ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చా?ʹ నమ్మలేనట్టు అడిగింది. ʹఅవును రానక్కర్లేదుʹ అని ʹమరి నువ్వెక్కడికి వెళ్తావు?ʹ అన్న. అప్పుడు మెల్లగా చెప్పింది. ʹఆయన కూడా వచ్చాడు. నేను మొహం చూడలేదు. కాళ్ళు కూడా మొక్కలేదు తెలుసా? చాచా నన్ను ఇంటికి తీసుకు పోతావా? అంటే అందుకేగా వచ్చినం అన్నాడు. మీ ఇంటిపక్కనే నాకూ గుడిసేపిస్తావా? నేను పని చేసుకొని బతకుతా అన్న. సరే అన్నాడు. దీదీ! నిన్నెప్పుడూ యాది మరవనుʹ అంది. నేను శకున్ ని దగ్గరకి తీసుకొని ʹఖుష్ రహోʹ అన్నాను.
-బి.అనూరాధ


Keywords : jharkhand, maoist, jail, police
(2018-02-23 09:55:02)No. of visitors : 235

Suggested Posts


జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి....

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
more..


జైలు