జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ


జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైలు


జైలు ఆవరణంతా శుభ్రంగా ఊడ్చి వుంది. ఎక్కడా ఒక్క ఎండిన ఆకు సైతం లేదు. ఇదెలా సంభవమబ్బా అనుకున్నా! నాలుగురైదుగురు వుండే ఇళ్ళే శుభ్రంగా పెట్టుకోవడం కష్టమే? ఇంక వంద మంది పెద్దలు పాతిక మంది పిల్లలు వుండే జైలు ఆవరణ ఇలా ఎలా ఉండగలిగింది అని ఆశ్చర్యపోయాను.
ʹదీదీ! నాస్తా గంట కొట్టారు. నువ్విక్కడే కూర్చో నేను తెస్తాను.ʹ అంటూ దులా ఒక స్టీలు గిన్నె తీసుకొని గబగబా వెళ్ళింది. నాకు నేనే స్వయంగా వెళ్ళి తీసుకోవాలనిపించింది. అలా లైనులో నిలబడి తీసుకొనే అనుభవం సరదాగా వుండేది కదా అని. కానీ మొదటి రోజు కదా వద్దంటే వినేలా లేదు చూద్దాం అనుకున్నా. నాస్తా చూడగానే దిగులేసింది. అంతకుముందే ఛాయ్ అనుభవం ఒకటయిపోయింది. ఇంతకాలం అత్యంత చెత్త చాయ్ అవార్డ్ కి కేవలం రైల్వే వాళ్ళకే అర్హత వుందనుకొనే దాన్ని. ఆ అభిప్రాయం వెంటనే మార్చేసుకొని జైలువాళ్ళకా అవార్డ్ ఇచ్చేశా. అమ్మో వాళ్ళని ఎవరూ బీట్ చేయలేరు.
రచయిత త్రిపుర, ʹభగవంతం కోసంʹ కథలో అనుకుంటా ʹ కాఫీ! అదొక వేడి గోధుమరంగు ఊహ.ʹ అనీ అది వుత్త గోధుమరంగు ఊహ అని, చివరకు అది ఒక వేడి ఊహ అని రకరకలుగా వర్ణిస్తాడు. ఇలాంటి కేటగిరీల్లోకి వేటికీ చెందని ఒక వింత ద్రవ పథార్థం ఇది. చివరికి మంచి చాయ్ అనేది విడుదల్లయ్యే వరకూ ఒక వేడి గోధుమరంగు ఊహ గానే మిగిలిపోయింది.
ఇప్పుడిక నాస్తా అంటే నాన పెట్టిన శనగలు. నాకు శనగలు ఏరూపం లోనూ పడవు. దిగులుగా చూస్తుంటే ʹదీదీ నా దగ్గర పల్లీలున్నాయి తింటావాʹ అంటూ వేయించిన పల్లీలు బయటకు తీసింది లలిత. వాటిని వలుచుకొంటూ కబుర్లలో పడ్డాం. నేను తొక్కలు అన్ని జాగ్రత్తగా తీసుకొని బయట పడేద్దాం అని లేవబోతుంటే ʹఇలా ఇవ్వుʹ అంది.
ఫరవాలేదు అని లేచేసరికి ఏదో ఘోరం జరిగిపోయినట్టు కెవ్వున అరిచి ʹఅమ్మో అవి చాలా ప్రియమైనవి (ఖరీదైనవి). ఇలాంటివేమీ పడెయ్యకూడదు.ʹ అంది.
బిత్తరపోయాను నేను. ఆమెకి నా మొహం చూస్తుంటే ఏదో సస్పెన్సు త్రిల్లర్ చూపిస్తున్న ఫీలింగ్ కలిగిందేమో అనిపించింది.
తరవాత మెల్లగా మూడు చిన్న చిన్న డబ్బాలు తీసింది. వాటిని త్రిభుజాకారంగా పేర్చింది. దాని మీద ఒక చిన్న స్టీలు గిన్నె పెట్టింది. దాని కింద ఒక ప్రమిద పెట్టింది. ఆవనూనె కొంచెం తీసి పోసింది. ఒక చిన్న గుడ్డపీలిక వత్తిలా చేసి దానిలో వేసి ʹలాల్ చాయ్ʹ (డికాక్షన్ ను ఝార్ఖండ్ లో లాల్ చాయ్ అంటారు.) చెయ్యడం మొదలుపెట్టింది.
ʹఅరె ఈ ప్రమిద ఎక్కడిది?
ʹదీపావళికి ఇక్కడ అందరికీ ఒక్కో ప్రమిద చొప్పున ఇస్తారు. ఎక్కడో అక్కడ వెలగడమే కదా కావాల్సింది, మనకి చాయ్ గిన్నె కింద వెలుగుతుంది అంతే. చాయ్ వరకూ ఈ నూనె సరిపోతుంది కానీ ఇంకొంచెం ఎక్కువేమయినా చెయ్యాలంటే పల్లీతొక్కలు, అరటిపండుతొక్కలు, పాతచెప్పులు, పాతగుడ్డలు, ప్లాస్టిక్ సంచులు, వేపపుల్లలు, ఎండుటాకులూ .......ʹతన లిస్టు ఇంకా కొనసాగుతుండగానే.... నా మెదడులో మెరుపు మెరిసినట్టు అర్థం అయ్యింది. అదే, ఆవరణ అంత శుభ్రంగా ఎందుకున్నదో ఇప్పుడు తెలిసింది. ఎండుటాకులకోసం ఎన్ని యుద్ధాలు జరగగలవో తరవాత కాలంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక్క గదితో వున్న ఆసుపత్రిలో అప్పుడప్పుడు దొరికే సెలైన్ బాటిల్స్ కోసం అయితే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ఇవి బాగానూ ఎక్కువ సేపూ మండుతాయి. కాబట్టీ చాలా డిమాండు.
జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి. వాళ్ళు కొంత మంది కలిసి సామూహికంగా రేషన్ తీసుకొని కూరలు వండు కొంటారు. అవి మహిళా వార్డులో వుండే తమ కుటుంబ సభ్యులైన ఆడవాళ్ళకి పంపుతూ వుంటారు. వారానికి ఒకసారి 15మీ.లీ ఆవనూనె ఇస్తారు. అది కూడపెట్టి వంటలకి వాడుతుంటారు. ఝార్ఖండ్ లో నాకొచ్చిన మరొక కష్టం ఆవ నూనె వంటలు తినడం. కానీ అదే వాడతారు. అది అక్కడ ముఖ్యమైన పంట. అంతే కాకుండా వంటికి ఆవనూనె పూసుకోవడం చాలా అలవాటు ఇక్కడి వాళ్ళకి. కాబట్టి జైలులో దానికోసమే నూనె ఇస్తారు. తలకి రాసుకోడానికి వేరుగా కొబ్బరినూనే ఒక పేకెట్ ఇస్తారు. అది 15రోజులకి ఒకసారి.
*** *** ***
జైలులో యేడాది మొత్తం మీద నాలుగు నెలలపాటు వారానికోసారి మాంసం ఇవ్వాలనే నియమం వుంది. అలాగే పండగల సందర్భంగా విశేష భోజనం కావాలంటే ఆ పండగ కి రెండు వారాలు ముందు వేరే ఏదైనా కట్ చేసి మిగలబెట్టిన డబ్బుతో ఆ పండగ ఏర్పాట్లు చేయవచ్చు అనే నియమం కూడా వుంది. దీనిని ఉపయోగించుకొని ఖైదీల తిండిలో కోతలు మొదలవుతాయి. మాంసం ఇవ్వడం రెండు దఫాలుగా వుంటుంది. అందులో రెండు నెలల మాంసం హోలీ పండగ జరపడానికి, మరొక రెండు నెలల మాంసం దసరా పండగ జరపడానికి అనే పేరుతో కోత పెడతారు. వెరసి ఖైదీలకి పేరుకి ఒక దఫాలో ఒక సారి, రెండో దఫాలో ఒకసారి ఇస్తారు. దానితో నామ మాత్రంగా అయిపోయింది. ఇక ఖైదీలు పావురాల వెంట పడుతుంటారు.
రింకూ పావురాలు పట్టడం లో మహా దిట్ట. జైలు బిల్డింగ్ పాత కాలం నాటి బ్రిటిష్ కట్టడం. దానికి ఎత్తైన గోడలతో పాటు పైన కప్పుకి కొంచెం కింద పిజెన్ హోల్స్ వుంటాయి. వాటిల్లోనుండి పావురాలు బయటకూ లోపలికీ తిరుగుతుంటాయి. కొన్నిటిలో గూళ్ళు కట్టుకొని పిల్లలను పెడుతుంటాయి. ఉదయం పూట ఖైదీలు ఎండపెట్టే శనగల కోసం ఒకటే వచ్చి వాలుతుంటాయి. నా స్నేహితుడొకరు ʹగే నెక్ʹ అని ఒక పుస్తకం పంపాడు. అది చదివాక నాకు పావురాల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగింది. అసలు జైలుకి పావురాలకి ఒక అవినాభావ సంబంధం ఏదో వుందనిపిస్తుంటుంది. గుంపులుగా పావురాలు అలా వచ్చి వాలుతూ వుంటాయి. బయట వున్నప్పుడు అవి స్వేచ్చ కి ప్రతీకలుగా అనిపిస్తే జైల్లో మాత్రం స్వేచ్చ కోల్పోవడానికి ప్రతీకలుగా అనిపిస్తాయి. వాటిని గమనించడం అలవాటుగా మొదలయ్యాక వాటిలో ఎన్ని రంగులుంటాయో వాటి మెడ నిజంగానే ఎంత అందంగా వుందో జీవితంలో మొదటిసారిగా గుర్తించాను నేను. అంతకు ముందు కాకులన్నీ ఒకటే లాగా వున్నట్టు పావురాలు కూడా ఒక్కలాగే అనిపించేవి. మహా అయితే తెల్ల పావురాలు, బూడిదరంగు పావురాలు అంతే. ఆ కాలంలో చలం రాసిన బుజ్జిగాడు తెగ గుర్తుకొచ్చేది. (అది గోరింకల గురించి అయినప్పటికి) అప్పట్లో గోపాలకృష్ణగాంధీ గవర్నర్ పదవినుండి రిటైర్ అయ్యి, బహుశా హిందూస్థాన్ టైమ్స్ లో అనుకొంట కాలమ్ రాస్తున్నారు. ఒకసారి ఆయన తన బాల్కనీకి రెగ్యులర్ గా వచ్చే గోరింకల గురించి రాశారు. అందులో ఒక ఆడ గోరింక కుటుంబ హింసకి గురయ్యినట్టు అనుమానించారు కూడా. ఇలా పక్షుల గురించి ఎవరేం రాసినా తెగ చదివేయడం వాటిని జీవితంలో భాగం చేసేసుకోవడం అలవాటయ్యింది. జైలు నాకు పక్షులని, పువ్వులని దగ్గర చేసింది. జైలులో నా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని తెచ్చిపెట్టాయివి. అలాంటి టైంలో నాకొక క్లిష్టపరిస్థితి ఎదురయ్యింది. నేను ఒక పావురం తగువు తీర్చాల్సి వచ్చింది. ఆహారపు అలవాట్ల రీత్యా నేను మాంసాహారినే. అనేక రకాల మాంసాలు తిన్న దానినే. అయితే కొత్తగా పావురాల పట్ల పెరిగిన ఈ ప్రేమ నన్ను సంకటంలో పడేసింది. పావురాలు గుంపుగా వాలినప్పుడు హటాత్తుగా వాటి మీద టవల్ విసిరి వాటిని వొడుపుగా పట్టుకొనేది రింకూ.
అయితే ఇప్పుడు తగవు ఎక్కడొచ్చిందంటే, రింకూ కూర వండుతున్నప్పుడు, రుదన్ గాడు ఆమె వెనకాలే తిరుగుతున్నాడు. ఆమె తనకి వాటా ఇవ్వబోవడంలేదని అర్థం అయ్యాక తన ఇద్దరన్నదమ్ములైన బుధన్, సుదన్ లని కూడా తీసుకొచ్చాడు. దాంతో కూడా పని అయ్యేటట్టు లేదని వాళ్ళమ్మ పారోదేవిని కూడా లాక్కొచ్చారు. అసలు పావురాన్ని పట్టుకొని మెడకొరికి చంపింది రుదన్ గాడేనని పిల్లలంతా పారోకి సాక్ష్యం చెప్పారు. నోరులేని మూగజీవాలని అన్యాయం చేస్తే పుట్టగతులుండవని, ʹబీస్ సాల్ సజాʹ (ఇరవై యేళ్ళ శిక్ష) పడుతుందని పారో నోరుచేసుకోంది. పావురాన్ని శుభ్రం చేసి మాషాలాలు దట్టించి వండింది ఆఫ్టరాల్ ఒక పిల్లి వెధవకి ఇవ్వడానికి కాదని రింకూ వాదన. కానీ పారోదేవికి అవి ఆఫ్టరాల్ వెధవ పిల్లులు కానే కాదు. తన బిడ్డల్లాగా చూసుకొంటుంది. కాబట్టి, వాటికి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నేలేదు. ఇక ఇద్దరూ ఒకరినొకరు ఆపకుండా తిట్టుకొంటున్నారు. జైల్లో ఎవరైనా ఇద్దరు ఖైదీలు తిట్టుకొంటున్నప్పుడు తీర్పు చెప్పడానికి పోవడంకన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. కానీ ఒక పక్షం పిల్లులు కావడం వాటికి పిల్లల మద్ధతు పూర్తిగా వుండడం, పైగా ఆ పిల్లులు కూడా రింకూ మీదకు గాండ్రు మని దూకడానికి సిద్ధంగా వున్న పులుల్లా కొట్లాడుతుంటే అందరం వార్డుల్లోనుండి బయటకు వచ్చి వినోదం చూసే మూడ్ లోకి వచ్చేశాము. లేకపోతే అది పెద్ద గొడవగానే పరిణమించేది. చివరికి నన్ను కూడా అందులోకి లాగాక, రెండొంతులు రింకూ తీసుకొని ఒక వంతుని పి‌ల్లులకి ఇవ్వాలని, దానిని వాళ్ళమ్మ మూడు భాగాలు చేసి మూడు పిల్లులకీ ఇవ్వాలని ఫైసలా చేశాను. నిజానికి ఇది కొంచెం సరదా వ్యవహారంగా పరిణమించినందువల్ల కానీ లేకపోతే నేనసలు ఎంత మంది వచ్చి అడిగినా తగాదాలు తీర్చే పనికి అస్సలు పోను. ఎందుకంటే దానివల్ల ఏదో ఒక పక్షానికి శత్రువులుగా మిగలడం తప్ప మనం సాధించేది ఏమీ వుండదు.
రింకూ రుదన్ గాడికేసి చూసి, ʹ అరె రుదనవా, సాలా నిన్ను కూడా వండుకొని తింటానొక రోజు చూస్తావుండుʹ అని బెదిరించింది.
ʹమ్యావ్!ʹ అన్నాడు రుదన్. అంటే ʹఏడిసావులేʹ అని అర్థం. పారో చెప్పింది. ***

Keywords : jharkhand, jail, maoist
(2018-02-22 22:21:21)No. of visitors : 92

Suggested Posts


జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !
more..


జైలు