20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్


20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్

20

వరంగల్‌ పోలీసులు తమ ప్రత్యేకతను మరొకసారి చాటుకోవాలనుకున్నారు. మా వాళ్ళు ప్రజలతో ఫ్రెండ్లీగా మసులుకుంటారన్న అత్యున్నత పోలీసు బాసు మాటలు బేఖాతరు చేశారు. అక్టోబర్‌ 7, 2017న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు (ఆర్‌ఎఎఫ్‌) సిల్వర్‌జూబ్లీ (25వ) వార్షికోత్సవ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో పోలీసులు పాశవికంగా వుండొద్దని, ప్రజలతో సన్నిహితంగా, మర్యాద పూర్వకంగా మెలగాల్సిన అవసరం వుందని సూచించారు. సంయమనంతో వ్యవహరిస్తూ సవాళ్ళుగా మారిన పరిస్థితుల్లో కూడా సహనాన్ని కోల్పోకుండా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివేకం కోల్పోయి విచ్చలవిడిగా ప్రవర్తించొద్దని కోరారు. మరోవైపు రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి జనవరి 2, 2018న ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమల్లో వుందని పోలీసులు ప్రజలతో మరింత మర్యాదగా మెలగాలన్నారు. ప్రజలే పోలీసులకు అంతిమ బాసులని పేర్కొన్నారు. వారికి పోలీసులు సేవకులన్నారు. ప్రజల చెమట చుక్కలే పోలీసులకు జీతాలుగా మారుతున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను అవమానించడం, కించపర్చడం చేయరాదని తెల్పుతూ ఈ సంవత్సరాన్ని (2018) ʹʹఇయర్‌ ఆఫ్‌ సిటిజన్‌ ఫ్రెండ్లీ, టెక్నాలజీ పోలీస్‌ʹʹగా ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్ర పోలీసులు క్షేత్ర స్థాయిలో ప్రజల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నరో జనవరి 21, 2018న వరంగల్‌లో జరిగిన 20 ఏళ్ల వరంగల్‌ డిక్లరేషన్‌ సభ పట్ల ప్రయోగించిన నిర్బంధాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.

సరిగ్గా 20 ఏళ్ల కింద ʹʹప్రత్యేక తెలంగాణ- ప్రజాస్వామిక ఆకాంక్షలుʹʹ అనే అంశం మీద అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక (ఎఐపిఆర్‌ఎఫ్‌) వరంగల్‌లో 28, 29 డిశంబరు 1997 తేదీల్లో నిర్వహించిన సదస్సులో తెలంగాణ విజన్‌ డాక్యుమెంటును విడుదల చేసింది. ఏళ్ల తరబడి తెలంగాణ ఎన్ని విధాలుగా అన్యాయాలకు, అక్రమాలకు, దోపిడి, పీడన, రాజ్య హింసకు గురైందో వాటిని ఏ విధంగా సవరిస్త్తే తెలంగాణ బాగుపడుతుందో ఆ పత్రం చెబుతుంది. స్థానిక వనరులతో, స్వావలంబన విధానాలతో కింది నుండి జరిగే అభివృద్ధే నిజమైన అభివృద్ధని, తెలంగాణలో అన్ని జిల్లాల్లోని ప్రజల నిర్ధిష్టమైన సమస్యలకు నిర్ధిష్టమైన పరిష్కార మార్గాలను చూపే అభివృద్ధి విధానం కావాలని, అన్ని ప్రజా సముదాయాలకు ఈ అభివృద్ధి సమతూకంలో అందాలని, ప్రజల జీవించే హక్కు మీద పెరుగుతున్న దాడులను పూర్తిగా నిలువరించే, ప్రజలకు నిజమైన ప్రాతినిధ్యాన్ని వహించే, ప్రజా రాజకీయ వ్యవస్థ కలిగిన ప్రజాస్వామిక తెలంగాణ కావాలని 60 అంశాలతో కూడిన పత్రాన్ని ఆనాటి సదస్సులో విడుదల చేశారు. ఈ పత్రాన్ని ఏఐపీఆర్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జి.ఎన్‌.సాయిబాబా నాయకత్వంలో జరిగిన సభలో విడుదల చేశారు. భారత ప్రభుత్వం సాయిబాబాను అక్రమ కేసులు బనాయించి నాగపూర్‌ జైల్లో జీవిత ఖైదీగా నిర్బంధించింది. ఆనాటి వలస పాలకులు మొదలు నేటి సభకు అనుమతి నిరాకరించ ప్రయత్నించారు. కానీ సభ విజయవంతంగా జరిగింది. ఆనాడు ప్రజాస్వామ్య హక్కుల కోసం రెండువేల మందితో ములుగు రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించి పరిశ్రమల

ఉపాధి కేంద్రం ప్రాంగణంలో వేలాది మందితో బహిరంగ సభ జరిగింది.

నిర్బంధం విషయంలో వరుస ప్రభుత్వాలు పోటీ పడుతూనే ఉన్నాయి. చివరికి తెలంగాణ ప్రభుత్వం ధర్నా కేంద్రాలను ఎత్తి వేసి ధర్నాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను ఎత్తివేయడంతో ఉద్యమకారులు తమ ఆఫీసుల్లో దీక్షలకు దిగితే అక్కడ కూడా సాగనివ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఈ నెల 2న మందకృష్ణ మాదిగ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండుతో తన కార్యాలయంలో దీక్షబూనితే అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపారు. చట్టాలను నమ్మరు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం లేనటువంటి నక్సలైట్లను కాల్చి చంపితే తప్పేంటని కొంత మంది పోలీసు అధికారులు భావిస్తున్నారు. కనుకనే ఎన్‌కౌంటర్లు అప్రతిహతంగా జరుగుతున్నాయి. నిరసన సభలకు అనుమతి నిరాకరించే ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయా లేదా? ఈ పోలీసు అధికారులే వెల్లడించాలి.

రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19 ప్రకారం దేశంలో అందరికీ వాక్‌, సభా స్వాతంత్య్రాలున్నాయి. అభిప్రాయాలు ప్రకటించే స్వేచ్ఛ వుంది. సంఘాలు పెట్టుకునే హక్కు వుంది. రాజకీయ భావాలను ప్రచారం చేసుకునే హక్కు వుంది. మరి తెలంగాణ ప్రభుత్వం బహిరంగ సభ, ర్యాలీలు ఎందుకు నిరాకరించినట్లు? ఇది రాజ్యాంగం మీద పాలకులకు విశ్వాసం లేకపోవడం కాదా? ఎలక్షన్ల వరకు రాజ్యాంగాన్ని వుపయోగించుకొని అధికారానికి వచ్చాక అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే రాజకీయ వ్యవస్థలో ప్రస్తుతం మనముండడం విషాదకరం. అసలీ సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు, ధర్నాలకు పోలీసుల అనుమతి కావాలనే నిబంధనను ఎత్తివేయాలి. అది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.

తెలంగాణ ప్రజాఫ్రంట్‌ డిశంబరు 27, 2017న వరంగల్‌లో వరంగల్‌ డిక్లరేషన్‌కు 20 ఏళ్లు నిండిన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. ఇందుకు గాను కాకతీయ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాతపూర్వక అనుమతి జారీ చేశారు. దీంతో నిర్వాహకులు పోస్టర్లు, కరపత్రాలు వెలువరించారు. ఈ అనుమతి పత్రాన్ని జతపరిచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే మౌఖికంగానే అనుమతి ఇవ్వనన్నారు. కనీసం దరఖాస్తులు కూడా తీసుకోలేదు. అంతటితో ఆగక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ రావు కాకతీయ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ డా||విజయలక్ష్మికి ఫోన్‌ చేసి తీవ్ర పదజాలంతో ఆమెను బెదిరించారు. భయపడిపోయిన ప్రిన్సిపల్‌ నిర్వాహకులకు ఇచ్చిన అనుమతి పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. నిర్వాహకులు తరువాత ఇస్లామియా కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించి జనవరి 7కు మార్చుకుని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో తీసిన పోస్టర్లు, కరపత్రాలు వృథా అయ్యాయి. ఇస్లామియా కాలేజీ ప్రిన్సిపల్‌ జనవరి 7, 2018 బహిరంగ సభ నిర్వహించుకోవడానికి గ్రౌండ్‌ స్థలాన్ని మంజూరు చేస్తూ అనుమతిని రాతపూర్వకంగా ఇచ్చారు. ఈ అనుమతి పత్రంతో అదే సీఐ దగ్గరికి వెళితే అదే అనుభవం ఎదురైంది. ఇస్లామియా కాలేజీ ప్రిన్సిపల్‌ను కూడా ఫోన్‌ చేసి బెదిరించాడు. ఈ ప్రిన్సిపల్‌ గారు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి నిర్వాహకులను కల్సి రెండు చేతులెత్తి దండం పెడుతూ పోలీసుల వేధింపులతో నాకు గుండెపోటు వచ్చేలా వుంది దయచేసి మీ డబ్బులు మీరు తీసుకోండి. సభ అనుమతిని నిరాకరిస్తున్నాను అర్థం చేసుకోండని బతిమాలాడు. ఈ రకంగా ఇది రద్దయింది. కరపత్రాలు పోస్టర్లు మళ్లీ వృథా అయ్యాయి.

ఇక లాభం లేదని పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొ||లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. కేడీసీలోనే సభ జరుపుతామని స్పష్టంగా చెప్పారు. సానుకూలంగా స్పందించిన ¬ంమంత్రి వెంటనే వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. మీరు వెళ్లి వరంగల్‌ కమిషనర్‌ను కలిస్తే అనుమతి ఇస్తారని పేర్కొన్నాడు. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు నేరుగా కమిషనర్‌కు ఫోన్‌ చేస్తే మీరు రండి యిస్తానన్నాడు. తీరా ఆయన దగ్గరికి వెళితే మీరు కేడీసీకి వెళ్లి మళ్లీ పర్మిషన్‌ తీసుకోండి పోలీస్‌ పర్మిషన్‌ ఇస్తామన్నారు. మీరు ప్రిన్సిపల్‌ను బెదిరిస్తున్నారు కదా మళ్లీ ఎట్ల్లా పర్మిషన్‌ ఇస్తారని నిర్వాహకులు అడిగితే ఏసీపీ అందుకొని ʹʹఅది గత చరిత్రʹʹ. మీరు ఇప్పుడు ఫ్రెష్‌గా వెళ్లి అనుమతి తెచ్చుకోండి.. పోలీస్‌ పర్మిషన్‌ ఇస్తామన్నారు. దీంతో మళ్లీ ప్రిన్సిపల్‌ విజయలక్ష్మీ దగ్గరికెళితే ʹనాకు మినిస్టరు, కమిషనర్‌ ఆదేశాలు కాదు, స్థానిక సి.ఐ. సంపత్‌రావు చెబితే యిస్తాʹనన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యమంటే ఇదే మరి! అక్కడి నుండి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిస్తే సీపీతో మాట్లాడి పర్మిషన్‌ యివ్వండని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్తే ఆయన మొదటి పాటే పాడారు. పోలీసులు హాల్‌ పర్మిషన్‌ అంటారు. హాలు యజమానులు పోలీసు పర్మిషన్‌ అంటారు. అక్కడి నుంచి కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ బన్న అయిలయ్యను కలిసి గ్రౌండ్‌ కోసం దరఖాస్తు పెట్టారు నిర్వాహకులు. ఆయన కూడా పోలీస్‌ పర్మిషన్‌ కావాలన్నారు. అక్కడ నుంచి కాకతీయ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ని కలిస్తే ఆయన కూడా ʹనన్ను అర్థం చేసుకోండి ఇక్కడి పరిస్థితులు భిన్నంగా వుంటాయి. పోలీసుల పర్మిషన్‌ తెచ్చుకుంటే ఇస్తాʹనన్నాడు. వరంగల్‌లో వున్న అన్ని గ్రౌండ్స్‌, హాల్‌ యజమానులకు ఫోన్‌చేసి టీపీఎఫ్‌ సభలకు అనుమతివ్వొద్దని హుకుం జారీ చేశారు. చివరికి విష్ణుప్రియ గార్డెన్స్‌ వాళ్లు ఇవ్వడానికి ఒప్పుకుంటే వారిని కూడా బెదిరించారు. ఎట్టకేలకు చివరి క్షణంలో అభిరామ్‌ గార్డెన్స్‌లో 21న సభ జరిగింది. కానీ ర్యాలీని నిరాకరించారు.

అయితే ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాళోజీ సెంటర్‌లోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి 50 మంది నాయకులతో చేరుకున్నారు. నివాళులర్పించి వెళ్లిపోతుండగా పోలీసులు మీరు ర్యాలీగా వెళుతున్నారు, ఆలా వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకుని నిర్బంధించారు. రోడ్డు పక్కగా నిలబెట్టారు.

ఈలోగా ప్రజాకళామండలి అధ్యక్షుడు జాన్‌, ఉపాధ్యక్షుడు రాజనర్సింహ, ప్రధాన కార్యదర్శి కోటి, మరికొంతమంది కళాబృందం ఆశన్న, వెంకటేశ్‌, రాంచందర్‌, రాజు, శ్రీను, పరమేష్‌, బాలస్వామి, రవి, మహేందర్‌, మల్లేష్‌, దాసు తదితరులు చేరుకున్నారు. మహిళా సంఘం కార్యకర్తలు, విద్యార్థి సంఘం నాయకులు కూడా చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగానే రెండు వందల మందిని నిర్బంధించారు. వ్యాన్లు, జీపులు, వజ్రలు, బంధించే తాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. కళాకారులు డ్రస్సుల్లో వుండటం,

వాళ్లు పాటందుకుంటే జనం గుమిగూడుతారనే భయంతో కళా బృందాన్ని టార్గెట్‌ చేశారు. నివాళులు అర్పించడానికి వెళ్లబోతుండగా ఏసీపీ శోభన్‌కుమార్‌, మరో ఏసీపీి రాజేంద్ర ప్రసాద్‌, సీిఐ సదయ్య, ఎస్సై నవీన్‌ కుమార్‌లు అడ్డుకున్నారు. నివాళులు అర్పించే పర్మిషన్‌ లేదు కనుక దగ్గరికి వెళ్లడానికి వీల్లేదన్నారు. ఎవరి త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డదో వాళ్లకు నివాళులర్పించడానికి కూడా తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఒక్క పాటపాడుతాం, స్థూపం దగ్గరికెళ్ళనివ్వండని కళాకారులు బతిమాలుకున్నారు. ఇంతలో సాధారణ జనం పోగయ్యారు. అది చూసి రెచ్చిపోయిన పోలీసులు ʹఅడుగు ముందుకేస్తే మిమ్మల్ని వేసేస్తాంʹ అన్నారు. వాతావరణం వేడెక్కుతుందని కళాకారులకు అర్థమయింది. గాడి తప్పనీయొద్దని నిర్ణయించుకున్నారు. వెనక్కి వెళ్లబోతుంటే మీరు నడిచి వెళ్లడానికి వీలు లేదు, మీ వాహనాల్లో వెళ్లండని హుకుం చేశారు. మాదగ్గర వాహనాలు లేవు మీరు ఏర్పాటు చేస్తే వెళతామన్నారు. ఇంతలో ఎవరో ʹʹప్రజాస్వామిక తెలంగాణ వర్థిల్లాలిʹʹ అని నినాదం ఇచ్చారు. దీంతో యాంటీ నక్సలైట్‌ స్వ్వాడ్‌ (ఎఎన్‌ఎఫ్‌) పెట్రేగిపోయారు. ʹనా బొ... ల తెలంగాణʹ అంటూ కళాకారుల మీద దాడికి దిగారు.

వలసాంధ్ర పాలనలో అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌ యనమల రామకృష్ణుడు ʹʹతెలంగాణ పదం అసెంబ్లీలో ఉచ్చరించొద్దన్నాడుʹʹ. ఇపుడు స్వతంత్ర తెలంగాణలో పోలీసులు ʹʹప్రజాస్వామ్య తెలంగాణʹʹ అనడానికి వీలు లేదని మీద పడి లాఠీలతో బాదుతున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగిన రాజనర్సింహ్మను, జాన్‌ను ఈడ్చి వ్యానులో పడేశారు. మిగిలిన కోటి యితర కార్యకర్తలను విపరీతంగా కొట్టారు. కళాకారుడు బాలయ్య ʹపొమ్మన్నరు, పోతున్నం. పోయేవాళ్లను ఇంకెందుకు కొడుతున్నరన్నందుకుʹ ఆయన వీపుపై లాఠీలతో బలంగా కొడితే అక్కడే పడిపోయాడు. మిగిలిన కార్యకర్తలకు కోటి అండగా నిలిచాడు. వారు ఎక్కడికి కదిలితే అక్కడ రక్షణగా నిలిచాడు. డోలక్‌ రవి తన డోలక్‌ను వీపుమీద వేసుకొని నడుస్తుండగా గుంజుకొని నేలకేసి దాన్ని ముక్కలుగా పగులగొట్టారు పోలీసులు. ʹమీరు మనుషులా? పశువులా? నన్ను కొట్టండి. కానీ నా డోలక్‌ ఏమన్నది? అని రవి ప్రశ్నిస్తే కడుపులో బలంగా తన్ని లాఠీలతో తీవ్రంగా కొట్టారు. మహేందర్‌ను, వెంకటేశ్‌ను అమాంతంగా ఎత్తి వ్యాన్‌లో పడేసారు. శ్రీను, మల్లేష్‌లను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యానులో పడేసారు. వెళ్లిపోతున్న వాళ్ల మీద ఇంతటి బీభత్సం ఎందుకు సృష్టిస్తున్నారని కోటి ఏసీపీతో మాట్లాడుతుండగా వెనక నుంచి ఓ పోలీసు అధికారి బలంగా బూటు కాలుతో తొంటిపై తన్నాడు. కిందపడ్డ కోటిపై నలుగురు పోలీసులు మీదపడి లాఠీలతో బాదారు. గుండెల మీద గుద్ది, గళ్లా పట్టుకొని వ్యానులో పడేసారు.

మరోవైపు విద్యార్థులను, మహిళా సంఘ కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. చైతన్య మహిళా సంఘం కార్యకర్త మమత కాళ్లమీద కొట్టారు. కడుపులో గట్టిగా గుద్దితే స్పృహ కోల్పోయింది. బూతులు తిట్టారు. భాగ్యను మెడ, గొంతు, వీపుపైన కొడితే రక్తం గడ్డకట్టింది. రాధిక చేతులు ఒడిపెట్టి తిప్పితే నల్లగా కమిలిపోయాయి. శిల్పను భుజాలపై పదునైన పెన్నుతో కోస్తే రక్తం చిమ్మింది. భవానిని కూడా చేతులపై, మెడలపై పిన్నులతో కోశారు. కడుపులో తన్నితే నొప్పితో మెలికలు తిరిగి పడిపోయింది. అనూషా రెండు చేతులు పట్టుకొని బట్టను వడిపట్టినట్టు వడిపెట్టి వదిలితే భరించలేని నొప్పితో తల్లడిల్లింది. కుమార్‌ని పిన్నీసులతో వీపుపై అడ్డదిడ్డంగా గీరారు. వీపంతా రక్తసిక్తమయింది. లక్ష్మీ పెనుగులాటలో చీర జారిపోయినా వదల్లేదు. అమానుషంగా ప్రవర్తించి నడుంపై పదునైన పిన్నులతో గాయపరిచారు. కడుపులో తన్నితే కొద్ది సేపు లేవలేకపోయింది. సంస్కృతి, బాలమణి, నర్సమ్మ, మహాలక్ష్మీ, గాలమ్మలను వెంట్రుకలు పట్టి రోడ్డుపై ఈడ్చి లాగి వ్యానులో పడేసారు. మగ పోలీసులు మహిళా కార్యకర్తలను విచక్షణా రహితంగా పట్టుకున్నారు.

మరోవైపు యువకులను, విద్యార్థులను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. మంద మహేందర్‌ కడుపులో తన్ని వీపులో బలంగా కొట్టారు. దీంతో అతడు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. జనగామ కుమార స్వామిని తీవ్రంగా గాయపర్చారు. ఆరెపల్లి సమ్మయ్య, చంద్రమౌళి, ప్రభాకర్‌, శ్రీనివాస్‌లను తీవ్రంగా హింసించారు. చంద్రమౌళి కోలుకోలేని స్థితిలో ఉన్నాడు. కాంపెల్లి రాజయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్‌, తాళ్ల్లపల్లి సమ్మయ్యల పక్కటెముకలను టార్గెట్‌ చేసి కొట్టారు. తూముల కొంరయ్య, తాళ్లపల్లి రవీందర్‌, పారసందుల క్రాంతికుమార్‌లను తీవ్రంగా గాయపరిచారు. క్రాంతి యిప్పటికీ లేవలేని స్థితిలో ఉన్నాడు. సమీర్‌ను, స్వామిలను తీవ్రంగా కొట్టారు. సమీర్‌ కిడ్నీ నొప్పులతో బాధపడుతున్నాడు. స్వామి మెడలు విరిచేశారు. సివిల్‌ డ్రెస్సులో ఉన్న పోలీసులు అడ్డూ అదుపు లేకుండా బాదారు. మీరెవరని అడిగినందుకు గన్ను తీసి బెదిరించి ʹఎవరని అడుగుతార్రా? ఎన్‌కౌంటర్‌ చేసేస్తాంʹ అని బెదిరించారు. రమేష్‌, ఏసోబు, సదయ్య, లక్ష్మీ నారాయణలను కొట్టి వదిలేశారు.

ఈ రణరంగం ముగిసి ఉద్యమకారులను వ్యానులో ఎక్కిస్తుండగా హైదరాబాద్‌ నుంచి వరవరరావు అటుగా వచ్చి ఈ దృశ్యాన్ని చూసి ఎందుకు కొడుతూ వ్యానులో పడేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే మరో మాటలేకుండా ఆయన సెల్‌ఫోన్‌ లాక్కుని ఆయనను కూడా వారితో పాటు అరెస్టు చేసి కాకతీయ యూనివర్సిటీి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి, అక్రమ కేసులు మోపి సంతకాలు, ఫొటోలు తీసుకుని పంపించారు. రక్తాలతో, గాయాలతో, దెబ్బలతో కళాకారులు వేదిక మీదికి కుంటుకుంటూ, ఆయాసపడుతూ వచ్చిన దృశ్యం అందరి మనసులను కలిచివేసింది. కళాకారులు ఎప్పటిలాగే స్టేజీ మీద కార్యక్రమాలను నిర్వహించారు. అమరులకు నివాళులర్పించడానికి వెళ్లిన మొదటి నాయకత్వాన్ని అక్కడే కొద్దిసేపు నిలబెట్టి పంపించడం వలన సభ విజయవంతంగా నడిచింది.

ఉద్యమకారులను శాంతియుతంగా కూడా అరెస్టు చేయొచ్చు కాని పోలీసులు ఇంత రభస ఎందుకు చేసినట్లు? వాళ్లు వరంగల్‌ పోలీసులు కదా. ఆధిక్యతను ప్రదర్శించాలి కదా! గతంలో పీపుల్స్‌ వార్‌ పార్టీ కార్యకర్త మేఘ్యా నాయక్‌ను చంపేసి మేఘాల్లో వెతుక్కొమని చెప్పిన వాళ్లు వీళ్లు. పౌరహక్కుల సంఘ నాయకుడు, పిల్లల డాక్టరు ఎ.రామనాథంను 1985 సెప్టెంబర్‌ 3న ఆయన క్లినిక్‌లోనే కాల్చి చంపేశారు. పౌర హక్కుల సంఘం నాయకుడు, జిల్లా బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నర్రా ప్రభాకర్‌ రెడ్డిని 1991 డిశంబరు 7న ఆయన యింట్లోనే కాల్చి చంపిన చరిత్ర వరంగల్‌ పోలీసులది. గుండెలో పోటు వస్తున్నదని చెబితే పరీక్షిస్తుండగా తుపాకీి తీసి డాక్టర్‌ ఆమడ నారాయణను కాల్చి చంపిన చరిత్ర వరంగల్‌ పోలీసులది.

పోలీసులు ఏం చేసినా చెల్లుతుందనే ధీమా పోవాలంటే 21న దురుసుగా ప్రవర్తించిన పోలీసులను చట్టబద్దంగా శిక్షించాలి. ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.

తెలంగాణ ప్రభుత్వ పరిపాలన గాడి తప్పుతున్నది. పౌర ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంది. పోలీసులతో రాజ్యమేలుతుంది. ఈ విధానానికి స్వస్తి పలికి జనరంజక పరిపాలన అందించాలి. పవన్‌ కళ్యాణ్‌ సభలకు, ర్యాలీలకు అనుమతి ఎట్లుంటుందో ప్రజా సంఘాలకు ఎందుకు యివ్వరో ప్రజలు ఆలోచించాలి.

- రచయిత: అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం

(న‌డుస్తున్న తెలంగాణ - ఫిబ్ర‌వ‌రి 2018 సంచిక‌లో ప్ర‌చురితం)

Keywords : telangana, warangal, democratic telangana
(2019-01-21 13:09:57)No. of visitors : 721

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
more..


20