జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ


జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

జైలు


సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను. నా దగ్గర ఒక డబ్బా ఎమర్జెన్సీ కోసం ఇచ్చి పెట్టారు. తీసుకొని వస్తుండగా ఒక మూలగా ఎవరో కూర్చున్నట్టని పించి చూశాను. ఒకామె మోకాళ్ళ మీద తలపెట్టి ఏడుస్తోంది. ఆమె భుజాల కదలిక వల్ల మాత్రమే ఏడుస్తోందని అర్థం అయ్యింది. దగ్గరికి పోయి చూద్దును కదా ఆమె సోనమ్. అక్కడ టేబ్లెట్ కోసం ఎదురుచూస్తుంటారని ఆమెని పలకరించకుండానే బయటకు వెళ్ళిపోయాను. లాకప్ టైమ్ దగ్గరపడినందున అప్పటికి ఏమీ అడగలేకపోయాను.
సోనమ్ ఉత్తరప్రదేశ్ కి చెందిన అమ్మాయి. ఆమె మీద నా దృష్టి పడకపోయేదే. ఎందుకంటే ఆమె చాలా సౌమ్యంగానూ దిగులుగానూ ఒక మూలలో వుండేది. ములాకాతీ రాయించుకోడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె భాష చూసి ఝార్ఖండీ కాదని తేలికగా గుర్తుపట్టాను. ఆమెది గోరఖ్ పూర్. అయితే హజారిబాగ్ లో కేసెంటి అనే ఒక సాధారణ ఉత్సుకత కలిగినప్పటికీ బహుశా పని తొందరలో వుండి కావచ్చు ఆరోజు నేను ఆమెని వివరాలు అడగలేదు. అందుకని నాకు ఆమె ఏ కేసులో వచ్చిందో తెలియదు.
లాకప్ తరవాత మెల్లగా సంగతి కనుక్కొన్నాను. మొదలు ఏమీ లేదనే అంది. కొంచెం బుజ్జగించి అడిగాక, మీ బిస్తర్ దగ్గరికి వెళ్దాం అన్నది. సరేనని తనని తీసుకొని వచ్చాను. చాలా మంది చెవులు ఇటు పారేశారు కనక నేను ఆమెని మామూలు విషయాలు మాత్రమే అడుగుతూ వున్నాను.
ఏదో ఒకటి సంభాషణ ప్రారంభించడానికి అనుకొంటూ ములాకాతీకి ఎవరన్నా వచ్చారా అని అడిగాను. చాలా మందికి సాధారణంగా ఇంటినుండి ఎవరన్నా కలవడానికి వచ్చినప్పుడు మొదలు ఎంత సంతోషం కలుగుతుందో తరవాత అంతగానూ దిగులుగా కలుగుతుంటుంది. బహుశా అలాంటిదే కావచ్చు అనుకొన్నాను. ʹఅంత దూరం నుండి ఎవరు వస్తారు?ʹ దిగులుగా అన్నది. నిజమే ఖర్చుతో కూడుకొన్న పని. యథాలాపంగా కేసు విషయాలు అడిగాను.
ʹఇక్కడ ఎలా అయ్యింది కేసు?ʹ
ʹమా మరిది భార్య ఇటువైపు ఆమె. అందుకని ఇక్కడ కేసు పెట్టింది.ʹ అన్నది. ʹఏం కేసు?ʹ అడిగాను.
ʹఏం కేసో? డౌరీ కేసు అన్నారుʹ అన్నది.
ʹఆమె చనిపోయిందా?ʹ
ʹలేదు, లేదు, బతికే వుంది.ʹ ʹమరి డౌరీ కేసు నీ మీద ఎట్లా పెట్టారు?ʹ ఆశ్చర్యంగా అడిగాను. ʹనాకు తెలియదు దీదీ.ʹ
ʹఅసలు ఏం జరిగింది చెప్పు? నీకేసు ఏంటనేది నేను కనుక్కొంటాను కానీ, ఆమె ఆరోపణ ఏంటీ?ʹ ఆమె కొద్దిగా ఇబ్బంది పడింది. కనీసం నాకు అలా అనిపించింది.
ʹమళ్ళీ పెళ్ళిచేసుకొన్నాడని,.....ʹ అర్దోక్తిలో ఆగిపోయింది. ʹఎవరు?ʹ అన్నాను. నాకసలు ఏం అర్థం కావట్లేదు. ʹఅతనే ....మరిదిʹ అన్నది. ʹఅయితే? నువ్వేం చేశావు?ʹ అన్నా. ఆమె మౌనంగా తల దించుకొంది.
పక్కన కొంచెం దూరంలో కూర్చుని అంతా వింటున్న లలిత, ʹఅయ్యో నీ కార్థం కాలేదా? ఈమెనే మరిది వుంచుకొన్నాడు, అనేసింది. సోనమ్ కళ్ళ నుండి టప్పున జారిపడ్డాయ్ కన్నీళ్ళు. ఏమనాలో అర్థం కాలేదు. లలిత మళ్ళీ కల్పించుకొంటూ ʹసోనమ్ భర్త చనిపోయాడు కదా!ʹ అన్నది. ʹకదా అంటే నాకేం తెలుసుʹ అన్నా కొంచెం చిరాగ్గా! ʹసోనమ్ మోసమత్ అని రాశారుగా రిజిస్టర్లో!ʹ అంది. ʹఅయితేʹ అన్నాను? ఈసారి లలిత కి అర్థం కాలేదు. ʹమరి అదేʹ అన్నది. ʹఅదే అంటే?ʹ అన్నా?
ʹసోనమ్ దేవి అని చెప్పుకొంటది కానీ, మోసమత్ʹ అని మళ్ళీ అన్నది. అప్పటి వరకూ మోసమత్ అనేది ఒక కులాన్ని సూచించే ఇంటిపేరు అనుకొన్నా. లలిత వోపికగా చెప్పింది. ʹసోనమ్ కుమారి అనుకో పెళ్ళికాలేదని అర్థం. సోనమ్ దేవి అనుకో పెళ్ళయ్యింది అని అర్థం. సోనమ్ మోసమత్ అంటే భర్త చనిపోయాడు అని అర్థం. ఇక్కడ పేర్లు అలాగే వుంటాయి. మీకర్థం కాలేదా?ʹ అన్నది.
పేరులోనే మగవాళ్ళయితే కులం, ఆడవాళ్ళయితే వాళ్ళ వైవాహిక హోదా, తెలిసిపోయేలా వుండడం! ఎందుకు తెలియాలి?
ʹనీ మరిదికి పెళ్లయ్యాకే నువ్వు అతన్ని చేసుకొన్నవా?ʹ అని సోనమ్ ని అడిగాను. ఆమె మౌనంగా తలవూపింది. ʹమరి ఆమె కేసు పెట్టదా?ʹ అన్నా.
ʹఆమె ఎప్పుడూ పుట్టింట్లోనే వుంటుంది. ఎప్పుడూ రాదు.ʹ అంది. ʹఅయితే ఆమెకి విడాకులు కాలేదు కదా?ʹ అన్నాను. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. నాకు ఆమె మీద సానుభూతి పోయింది. ʹమరి తెలిసీ చేసుకొన్నాక ఎవరేం చెయ్యగలరు?ʹ అన్నాను. నా గొంతులో అంతకు ముందు పలికిన సానుభూతి ఇప్పుడు లేదన్నది ఆమెకి కూడా అర్థం అవుతోంది. అయినా నేను దాచుకొనే ప్రయత్నం ఏమీ చేయలేదు. ʹఆమె గాయపడ్డట్టు చూసింది, ʹకానీ నా చేతిలో ఏముంది దీదీ, నేనేం చేయగలను అంది?ʹ ఆమె గొంతులో పలికిన దైన్యం చూసి నాకు ఈ సారి చిరాకు వేసింది. చేతిలో లేకపోవడానికి ఏమున్నది ఇందులో? విసురుగా ఏదో అనబోయి, అతి కష్టం మీద అణుచుకొని ʹసరేలే బెయిల్ అయితే వస్తదిʹ అని ఇంకేం మాట్లాడేది లేదన్నట్టు మెల్లగా పుస్తకం తీసుకొన్నా. ఆమె అర్థం చేసుకొంది. నిరాశగా వెళ్లిపోయింది. నాకు ఎక్కడో కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ, ఆ భావనని డిస్మిస్ చేసేశాను వెంటనే. తరవాత పుస్తకం చదువుతూ అంతా మర్చిపోయాను.
ఇదంతా జరిగి చాలా కాలం అయిపోయింది. బహుశా ఒక ఆరు నెలల తరవాత, దూరదర్శన్లో సినిమా వస్తోంది. ఏక్ చాదర్ మైలీసీ అట. అబ్బా కనీసం పేరు కూడా వినలేదురా నాయన అనుకొంటూ ఉసూరుమనుకొంటూ పక్క మీద వెనక్కి వాలాను. దీదీ! హేమమాలిని కదా ఆమె? ఎవరో అడిగారు. అప్రయత్నంగా పుస్తకం పక్కన పెట్టి, చూస్తే రిషీకపూర్ హీరో. అరె వీళ్ళీద్దరూ జంటగా నటించారనే తెలియదు నాకు. నా హింది సినిమా పరిజ్ఞానం చాలా తక్కువ. సరే చూడ్డం మొదలుపెట్టాను. రిషీకపూర్ హేమమాలినికి మరిది. ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకొంటారు. ఇంతలో హేమమాలిని భర్త చనిపోతాడు. ఎవరైనా స్త్రీ కి భర్త చనిపోతే ఆమె మరిది ఆమెని పెళ్లి చేసుకోవాలి. ఇద్దరినీ కూర్చుపెట్టి ఒక చాదర్ (దుప్పటి) కప్పుతారు. అంతే ఇక ఆమెని అతను ఏలుకోవాలి. ఇద్దరి ఇష్టా ఇష్టాలతోనూ సంబంధం లేదు. ఆమె ఇక్కడిలా పుట్టింటికి వెళ్ళదు. అత్తగారి ఇంట్లోనే ఇలా చేస్తారు. అటు వేరే అమ్మాయిని ప్రేమించిన రిషీ కపూర్ కి కానీ అప్పటివరకూ మరిదిగా చూసిన హేమ మాలినికి కానీ ఈ సంబంధం ఇష్టం లేనిదే. కానీ ఎలా బతకాలి అనేది ఆమె ముందున్న సమస్య. వాళ్ళ ఇంటివాళ్లముందున్నది ఈ పరిష్కారం. అంతే! తరతరాలుగా వస్తున్న ఆచారం. కొడుక్కి సంబందించిన ఆస్తి అదే కుటుంబంలో వుండిపోవడానికి చేసిన ఏర్పాటు. ......అది ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామం.....!
నాకు మనసంతా ఎలాగో అయిపోయింది. భారంగా లేచి కాసేపు బయట చల్లగాలికన్న తిరుగుదామని లేచి నిలబడ్డాక అప్పుడు పడ్డది నా దృష్టి సోనమ్ మీద. ఎర్రబడ్డ కళ్ళతో, కారికారీ ఆగిపోయిన గాజుకళ్ళతో శూన్యంలోకి చూస్తోంది. నా తలలో ఏదో విస్ఫోటన చెందినట్టుగా అనిపించి ఒక్క క్షణం కూలబడ్డాను. ʹనా చేతిలో ఏముంది దీదీ!ʹ అని ఆరోజు ఆమె దీనంగా అన్న మాటలే గుర్తుకొచ్చాయి. ఇప్పుడు అర్ఠమయ్యింది నాకు. వెళ్ళి మౌనంగా పక్కన కూర్చున్నాను. ఆమెని పలకరించడానికి సిగ్గుగా అనిపించింది, ఏ తప్పునైనా కడిగేసేవి కన్నీళ్లేగా, ఆమె భుజం మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొన్నా! చాలా కాలం తరవాత దొరికిన ఆత్మీయ స్పర్శకో నా కళ్ళలో కనిపించిన భావమో కానీ ఆమెకి నేను ఏమీ చెప్పకుండానే నన్ను కావలించుకొని తనివితీరా ఏడ్చింది. నాకు బిగ్గరగా కిందపడి దొర్లి ఏడవాలనిపించింది. అలా ఇద్దరం ఒకరినొకరం పట్టుకొని ఏడుస్తుంటే విషయం తెలియకపోయినా అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. అదొక సామూహిక దుఖం. ఇంకా ఎన్నిరకాల హింసలున్నాయి ఆడవాళ్ళ పైన? నాకు తెలిసింది ఎంత చిన్న ప్రపంచం? నన్ను క్షమించగలవా సోనమ్ అని అడగడానికి నా నోరుపెగల్లేదు.
ఆ సినిమా 1986 నాటిది. రాజిందర్ సింగ్ బేడీ ఉర్దూలో రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా. ఆ నవలకు 1965 లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చిందని విడుదలయ్యాక తెలుసుకొన్నాను. అంటే ఎన్నేళ్ళ నుండో వున్న దురాచారం. ఇది ఉత్తరభారతంలో చాలా చోట్ల వున్న దురాచారం అని తరవాత కాలంలో తెలుసుకొన్నాను. సోనంకి చాదర్ కప్పకపోయినా ఆ ఆచారం వల్లే ఆమెకి మరిదితో పెళ్లయింది. మరిది భార్య తన హక్కుకోసం తాను కోర్టుకి పోయింది. ఈ ఆచారం గురించి అంతగా తెలియని చోట ఆమె జైల్లో పడి అందరి మధ్య నవ్వులపాలయ్యింది.
మరిది భార్య కేసు పెట్టినప్పుడు సోనమ్ మోసమత్ అని, భర్త పేరుగా చనిపోయిన అతని పేరునే రాసింది కాబట్టి రికార్డుల్లో అలాగే వుంది. ఇప్పుడు మరిదితో పెళ్లయినా ఇక్కడ అతనిని భర్తగా చెప్పుకోలేదు. భర్త వున్నాడు కాబట్టి మోసమత్ అనీ అనలేదు. తనిది కాని తప్పుకి ఈ శిక్ష. ఈ ఆచారం గురించి ఏమీ తెలియని రాష్ట్రంలో కేసు విచారణ జరుగుతుంది. ఒక వేళ తెలిసినా ఏం చేస్తారు? చట్టానికి వాటితో సంబంధం ఏముందీ? ఎవరిది తప్పు? ఒక అసమాన సమాజంలో చట్టం ముందు అందరూ సమానమే అనే లాజిక్కు వల్ల న్యాయం జరుగుతుందా? ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు. కానీ ఈ అనుభవం నాకు ఒక కనువిప్పు. ఏ విషయమూ అంత సింపుల్ గా వుండదు. అనేక సంక్లిష్టతలు వుంటాయి. తొందరపడి ఒక అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు. ముఖ్యంగా ఈ సమాజం మారాలని కోరుకొనేవాళ్ళు. సోనమ్ విషయంలో అలా తొందరపడినందుకు ఇప్పటికీ గిల్టీగా వుంటుంది నాకు. మరికొంత కాలం తరవాత వాళ్ళిద్దరూ బెయిల్ మీద విడుదలయ్యి వెళ్ళారు.

- బి. అనూరాధ

Keywords : jharkhand, maoist, jailu kathalu
(2018-03-22 23:52:23)No. of visitors : 230

Suggested Posts


మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని.

జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి....

చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా.

Search Engine

నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !
Atrocities against Dalits at 17-year high in Gujarat
Baiga Adivasis March Against Displacement Due to Tiger Corridor, Demand Forest Rights
సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?
Hindu Mahasabhaʹs calendar refers to Mecca as Macceshwar Mahadev temple
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం
Why it is important to support the Spring Thunder Tour?- International Committee to Support the Peopleʹs War in India
చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ
సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
more..


జైలు