జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ


జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

జైలుʹఈ రోజు బాలల దినోత్సవం. చాచా నెహ్రూ పుట్టిన రోజు. ఈ ఫొటోల్లో చాచా నెహ్రూ ఎవరో గుర్తు పట్టండి.ʹ టీచర్ నిర్మల అడిగింది. పిల్లలందరూ ఎగిరెగిరి గోడమీదున్న ఏడు ఫొటోల్లో ఒక ఫోటో ని చూపారు.
ʹవెరీ గుడ్ʹ! అందామే.
ʹచాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ
ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు. ʹదేశానికి మొదటి ప్రధాన మంత్రి చాచా నెహ్రూ. ఏదీ అందరూ కలిసి చెప్పండి.!ʹ పిల్లలంతా గోల గోలగా అరిచారు.
ʹఏయ్! దీదీ, ఇతను బాపూ కదా?ʹ గాంధీ ఫోటో ని చూపుతూ డాలో అడిగింది. ʹఆ...ఆ...ʹ అంటూ గోల చేస్తున్న పిల్లలను అదుపులో పెట్టాలని ప్రయత్నించింది నిర్మల.
జూలీ వెంటనే అందుకొని ʹనాకు తెలుసు ఇతను సంజయ్ దత్ వాళ్ళ అయ్య.ʹ అంది. నిర్మల తల పట్టుకొంది.
ఆ పిల్లలని తప్పు పట్టలేం. ప్రధానమంత్రి అంటే వదిలిపెట్టండి, వాళ్ళకి దేశం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు చూస్తున్న ప్రపంచం అంతా ఎత్తైన జైలు గోడల మధ్యనే వుంది. వాళ్ళు నేరం చెయ్యని ఖైదీలు. ఖైదీలుగా వున్న మహిళల పిల్లలు. తమ బాల్యాన్ని కోల్పోతున్నామని కూడా తెలీని బాలలు. ఈ మధ్యనే గాంధీ జయంతి సందర్భంగా ʹలగే రహో మున్నా భాయ్ʹ సినిమా చూశారు.
*** *** ***
జార్ఖండ్ లోని హజారీబాగ్ సెంట్రల్ జైల్లో కనీసం ఓ పాతికమంది పిల్లలున్నా నా దృష్టి మొట్టమొదలు రోషిణీ మీద పడటానికి కారణాలు లేకపోలేదు. నేను జైల్లో అడుగు పెట్టిన మరుసటి రోజే అక్కడ రాజకీయ ఖైదీలుగా వున్న నలుగురు (మహిళా సంఘం సభ్యులు), సంథాలీ ఆదివాసీ అమ్మాయిలు నన్ను చదువు నేర్పమని అడిగారు. అప్పటికి నాది వచ్చీరాని హిందీ. కొద్ది సేపట్లోనే నా కంటే వాళ్ళే బాగా మాట్లాడుతున్నారని అర్థం అయ్యింది. అయితే రాయడం అంతబాగా రాదు. నాకు చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకొన్న హిందీ వల్ల చదవడం రాయడం వచ్చు. కానీ మాట్లాడడం రాదు. కాబట్టి కలిసి నేర్చుకొందాం అనుకొని, చెట్టుకింద గోనె పట్టాలు వేసుకొని హిందీ పాఠాలు మొదలుపెట్టాం. అప్పుడు మా దగ్గరికి అయిదేళ్ళ రోషిణీ ని తీస్కుని వాళ్ళమ్మ జుబేదా బానో వచ్చింది. ʹనాకూ, మా పాపకీ చదవడం నేర్పిస్తారా?ʹ అని. పసితనం ఉట్టిపడే గుండ్రని ముఖం. చిన్నగా కత్తిరించిన మెత్తని జుట్టు టోపీలా వుంది. నన్ను చూసి సిగ్గుగా నవ్వింది. ʹఇలారా నా దగ్గరికిʹ అంటే ఒకసారి ఓరగా అమ్మవైపు చూసింది. అక్కడనుండి వెళ్లమన్న సంకేతం అందగానే నా పక్క కు వచ్చి కూర్చుంది. చేతిలో చిన్న సంచి. పాత పంజాబీ సూట్ చిరిగిపోతే దానిని స్కూల్ బేగ్ లాగా కుట్టినట్టుంది వాళ్ళమ్మ. అందులోంచి ఒక పలక, ఒక చిన్న పుస్తకం తీసింది. ABC నేర్చుకొందాం అని రాసున్న ఆ పుస్తకం లో హింది, ఇంగ్లీష్ లలో రాసి వున్న బొమ్మలు వున్నాయి.
D....O...G డాగ్ అని పక్కనే హిందీలో ʹకుత్తాʹ అని రాసున్న బొమ్మ చూపించి, ʹయే క్యా హైʹ అని అడిగాను. దానికి కుత్తా అని తప్ప మరొక జవాబు రాగలదని ఏమాత్రం వూహించకుండానే మరో బొమ్మ కేసి వేలు జరిపాక ....ʹఊ... అని ఆలోచించి .....బాగ్ (పులి) అంది. నిర్ఘాంతపోయాను నేను. వెనక్కి వెళ్ళి పిల్లి బొమ్మ చూపించి అడిగాను. దానిని చూపుతూనే ఠక్కున పిల్లి అని చెప్పింది. ఇంకా ముందుకెళ్ళి పులి బొమ్మ చూపించి ఇదీ అడిగాను......కుక్క అంది. నేను జూబేదా కేసి చూశాను. రోషిణీకి తానేదో తప్పు చేసానేమో అని అనుమానం వచ్చినట్టుంది మొహంలో రంగులు మారాయి. జూబేదా నాకేసి చూసి నవ్వింది. ఆ నవ్వులో వొలికిన విషాదం ఈనాటికీ నన్ను వెంటాడుతుంది.
ʹరోషిణీకి నెలల వయసప్పుడు నేను ధన్ బాద్ జైల్లోకి వచ్చాను. మా తోటి కోడలు వొళ్ళు కాల్చుకొని చనిపోయింది. ఆమె భర్త, నా చిన్న తోటి కోడలు, నేను జైలుకి వచ్చాం. రెండేళ్ళ తరవాత యావజ్జీవ శిక్ష పడింది. సెంట్రల్ జైలుకి మార్చారు. అప్పటినుండి రోషిణీ బయట ప్రపంచాన్ని చూడలేదు. పిల్లి ఒకటే దానికి తెలిసిన పెద్ద జంతువు.ʹ నా కళ్ళలో ఆశ్చర్యం చిన్నారి రోషిణి మనసు నొప్పించిందేమో అనిపించి చప్పున మామూలుగా అయిపోయి ఇక వివరాలు అడగలేదు.
**** **** ****
ఉదయం 8.30 అవుతోంది. గేటు గంట మోగింది. పిల్లలంతా ʹదూధ్... రోటీʹ అని అరుచుకొంటూ గిన్నెలు తీసుకొని పరిగెత్తారు. ఆ సమయానికి పిల్లలందరికీ రెండు రొట్టెలు అరకిలో పాలు ఇస్తారు. కాసేపటికి రోషిణీ పరిగెత్తుకొచ్చింది. చేతిలో రొట్టెలు తీస్కుపోయి పళ్ళెంలో పెట్టి ʹ మా! ఈ రోజు మాకు పాలు ఇవ్వలేదుʹ అన్నది.
ʹఎందుకు ఇవ్వలేదు?ʹ
ʹఏమో! దూధ్ వాలా వాళ్ళమ్మ పాలు ఇవ్వనట్టుంది ఈరోజు.ʹ జూబేదా నవ్వుతూ తల పట్టుకొంది. చుట్టుపక్కలందరూ పగలబడి నవ్వారు. ʹదూధ్ వాలా వాళ్ళమ్మ ఇస్తుందా పాలు అన్నా?ʹ నేను. ʹమరి యే అమ్మ ఇస్తుంది?ʹ అంది రోషిణీ. ఆమెకు అందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థమే కాలేదు పాపం. తన పుస్తకంలో వెతికి ʹగాయ్ʹ (ఆవు) బొమ్మ ని చూపించి చెప్పాను. తన ఆశ్చర్యానికి అంతులేదు. ఆ తర్వాత నన్ను సాయంత్రం వరకూ సవాలక్ష ప్రశ్నలు వేస్తూనే వుంది.
కొద్దిరోజులకి నాకు, జూబేదాకి మధ్యన వున్న ఇద్దరు ఖైదీలు విడుదలకావడం తో మా పక్కలు పక్క పక్కనయ్యాయి. దానితో రోషిణీకి, నాకు దొస్తానా పెరిగింది. నేనుంటున్నవార్డు ఒక పెద్ద డార్మీటరీ లాంటిది. దాన్లో, డెభ్భై మంది ఖైదీలం వున్నాం. మాతో పాటు కనీసం పదిహేను మంది పిల్లలున్నారు. అప్పటికి ఈ ఒక్క వార్డులోనే టీవి వుంది. చాలా మందికి టీవీ ఒక టైమ్ పాస్ మాత్రమే కాదు. ఒక వ్యసనం కూడా. కాబట్టి అది అలా నిరంతరం నడుస్తూనే వుంటుంది. దానిని భరించడం చాలానే కష్టంగా వుండేది నాకు. కానీ రోషిణి లాంటి పిల్లలకి బయటి ప్రపంచాన్ని అనుభూతి చెందడానికి అదొక మాధ్యమం అని అర్థం అయ్యాక మెల్లగా ఆ గోలని భరించడంలో వున్న బరువు కొంత తగ్గింది.
ఒక రోజు కోళ్ళ పెంపకం గురించి ఒక ప్రోగ్రామ్ వస్తోంది. పక్కనే ఆడుకొంటున్న రోషిణీ ని పిలిచి అవేంటీ అని అడిగాను. ʹముర్గీʹ (కోడి) అంది. ఇది వరకెప్పుడైనా చూశావా? అని అడిగితే ʹఓ చూసా...ʹ మిలా మిలా మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. తను చూసే అవకాశం ఏమాత్రం లేదు కనక ʹఎక్కడ చూశావ్?ʹ అని సందేహంగా అడిగాను. తన సంచి లోనుండి పుస్తకం తీసి కోడి బొమ్మ తీసి చూపింది.......ఇక్కడ అంటూ. నాకు రోజు రోజుకి ఈ పిల్లలని చూస్తే దిగులేసేది. జూలీ ఊహ తెలిసిన కాలం లో ఎక్కువకాలమే బయట వుండడం వల్ల ఆమెకి మిగతా వాళ్లకన్న ఎక్కువ తెలుసు. దాంతో ఆమెకు పి‌ల్లల్లో పెద్ద ʹహీరో వర్షిప్ʹ వుంది. సినిమాలు చూసేటప్పుడు ʹఇదిగో వీడు హీరో, వాడు విలన్, ఆమె హీరోయిన్ʹ అంటూ ఆమె చేసే వ్యాఖ్యానాలతోనె వాళ్ళు సినిమాలు చూస్తారు. ఆమెకున్న అపారమైన ఈ బయటి జ్ఞానంపట్ల మిగతా వాళ్ళకో ఆరాధనా భావం వుంది. ఈ పిల్లల కోసం ఏం చెయ్యలేమా అని దిగులు. కానీ ఏంచెయ్యాలో తెలియదు.
నేరం చేసో, నేరం లో ఇరికించబడో వచ్చే తల్లులకి పడే శిక్ష పిల్లలెందుకు అనుభవించాలి? అనిపిస్తుంది. కానీ అందరికీ పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర వదిలిపెట్టి రాగాల అవకాశాలుండ వద్దూ? మరొక వైపు పిల్లలకి తమ తల్లులతో వుండే హక్కు కాదనలేం కదా? ʹరోషిణీ ని బయట, వాళ్ళ నాన్న దగ్గర వుంచే అవకాశం లేదా?ʹ అని ఒకరోజు జూబేదాని అడిగాను.
ʹరోషిణీ వాళ్ళ నాన్న నేను జైల్లో పడ్డాక ఒక్క సారి మాత్రమే వచ్చాడు. తనను కూడా అరెస్టు చేస్తారేమో అని ఆయన భయం. పోలీసులని చూస్తేనే వణికిపోతాడు. నీ పేరు లేదు కదా అంటే అతనికి అర్థమే కాదు. ఇక శిక్ష పడిందని తెలిశాక మనిషి పతా లేడు. పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఇప్పటి వరకు ఒక కబురుకానీ, ఉత్తరం గాని లేదు. మావూరి నుండి వేరే వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళ ద్వారా తెలిసిన విషయం, మరో ʹనిఖాʹ కూడా చేసుకొన్నాడని. ఎవరి దగ్గరికి పంపను? ఎలా పంపను? కలవడానికి ఎవరన్నా వస్తే కదా?
ʹ మరి ఇలా ఎంతకాలం?ʹ
అయిదేళ్ళ వరకూ వుంచుకోవచ్చు. ఇప్పుడు అయిదు నడుస్తోంది. ఆ తరవాత ఎంత కాలం నడిస్తే అంతకాలం. బాద్ మే ఖుదాకా మర్జీ.ʹ (ఆ తరవాత భగవంతుని ఇచ్ఛ.)!
**** *** ***
ఒక రోజు రోషిణీ, మిగతా పిల్లలతో ఆడుతూ ʹమాకూ ఇల్లుంది తెలుసా?ʹ అంటోంది.
ʹఎక్కడ మీ ఇల్లు?ʹ మరొక పాప అడిగింది.
ʹధన్ బాద్ లో వుంది. మాయింట్లో మూడు పెద్ద వార్డులుంటాయి తెలుసా?ʹ గొప్పలు పోయింది రోషిణి. నిజానికి ఆమెకి ధన్ బాద్ జైలు గుర్తుండే అవకాశం లేదు. ఇక్కడి వార్డులను బట్టే అంటోంది అని అర్థం అయ్యింది. ఆమెకీ ఊహలున్నాయి. కలలున్నాయ్. కానీ అవన్నిటికీ ఆధారం ఈ చిన్ని ప్రపంచమే. హృదయం మెలిపెట్టినట్టయింది. నాకే ఇలా వుంటే వాళ్ళమ్మ మన స్థితి ఎలా వుండేదో ఊహించవచ్చు.
ʹధన్ బాద్ జైల్లో పిల్లలని వారానికోసారి బయటికి తీసుకుపోయి తిప్పుకొని వచ్చేవారు. ఇక్కడెందుకో తీసుకుపోవడం లేదు.ʹ మాటల సందర్భంలో ఒక సారి జూబేదా అన్నది నాతో. అలాంటి ఒక నియమం వుందని మొదటి సారి తెలిసింది నాకు. అయితే ఇంకేం ఇక్కడా తీసుకుపోవాలని అడుగుదాం అనుకొన్నాం. పాత పాత ఖైదీలని దీని గురించి అడిగితే ఇక్కడ కూడా మొదట్లో తీసుకు వెళ్ళేవారని ఏదో కారణం వల్ల మానేశారని, ఎందుకనేది సరిగ్గా గుర్తు లేదని అన్నారు.
ఏదైనా సరే అడగాలనే నిర్ణయించుకొన్నాము. ఒక రోజు జైలర్ రౌండ్స్ కి వచ్చినప్పుడు అక్కడి సమస్యలతో పాటు పిల్లల విషయం చెప్పాం. ఆయన కొత్తగా బదిలీ అయ్యి వచ్చాడు. ఈ సమస్య చెప్పగానే, తాను గతంలో ఇదే జైల్లో డిప్యూటీ జైలర్ గా పని చేసిన కాలం లో ఆ నియమం వుండేదని, కాబట్టి తాను పునరిధ్ధరిస్తానని మాటిచ్చాడు. ప్రతి ఆదివారం తీసుకుపోవాలని, నడవగలిగే పిల్లలందరినీ ఉదయం ఎనిమిది గంటలకి తయారుగా వుంచమని చెప్పి పోయాడు.
*** *** ***
పిల్లల ఆనందానికి అంతులేదు. ప్రతి గంటకీ ఒక కొత్త సందేహంతో వచ్చి, ఎప్పుడు తీసుకెళ్తారు? ఎన్ని గంటలకి, ఎలా, నడిచా? వ్యానులోనా? వెంట ఎవరు వస్తారు? అమ్మలను కూడా తీసుకుపోతారా?గిన్తీ చేస్తారా? ఇలా అంతులేని ప్రశ్నలతో, నన్ను, వాళ్ళ అమ్మలని కూడా నిలవనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. శనివారం వచ్చేసరికి రాయబారాలు కూడా మొదలయ్యాయి. ఒక వేళ జైలరు మర్చిపోతే? కాబట్టి ఆరోజు సాయంత్రం నేను హెడ్ వార్డర్ కి గుర్తుచెయ్యాలని పిల్లలంతా రోషిణి ద్వారా నాకు డిమాండ్లు పంపారు. చివరికి నేను చెప్తానో చెప్పనో అని నాలిగింటినుండే నా వెంట పడ్డారు. నేనెటు పోతే అటు. చివరికి లాకప్ చేయడానికి వచ్చిన హెడ్ వార్డర్ ని గేట్ దగ్గరే కలుద్దామని ముందు ఆవరణ వైపుకి వాళ్ళను. నా వెంటే పిల్లల గ్యాంగు.
ʹరేపుదయం వీళ్ళని బయటికి తీసుకుపోతానని మాటిచ్చారు. జైలర్ సాబ్ కి గుర్తు చేయండి.ʹ అన్నాను. ʹఅలాగా? ఇప్పటివరకైతే నాకు ఆదేశాలు రాలేదింకా!ʹ అన్నాడు. ʹఅందుకే గుర్తు చేస్తున్నా, వెళ్ళేటప్పుడు చెప్పండి పిల్లలు డిసప్పాయింట్ అవుతారుʹ అన్నా. ఆ ఇంతకే పిల్లలకి సందేహం వచ్చినట్టుంది, అందరిలోకి పెద్దదైన డాలో ఒకడుగు ముందుకేసి- ʹమమ్మల్ని కానీ తీసుకుపోకపోతే చాయ్ కూడా ముట్టుకోం. దూధ్ రోటీ, ఖానా కూడా తీస్కోమ్!ʹ అంది. పిల్లలంతా ఆ..హా..నహీ లెంగే...నహీ లేంగే...ʹ అని ఖోరస్ లా అరిచారు. ఆయన నవ్వి, ʹచూడండి, మీ నాయకత్వంలో పిల్లలు కూడా హార్డ్ కోర్ అయిపోయారుʹ అన్నాడు.
జూలీ ముందుకొచ్చి, ʹమా అమ్మా వాళ్లనికూడా తీసుకొనివ్వంʹ అంది. నేను కూడా నవ్వి, ʹవాళ్ళు మాకే నాయకత్వం వహిస్తున్నారు, జాగ్రత్త మరి!ʹ అన్నాను.
*** *** ***
ఆదివారం తెల్లవారుఝామున ఏదో శబ్దానికి మెలకువ వచ్చి చూస్తే రోషిణి పక్క మీద కూర్చుని నా వంకే చూస్తోంది. ఏంటి? అన్నట్టు సైగ చేశాను. ఎవ్వరూ ఇంకా నిద్ర లేవలేదు. ʹశుభా హోగయీ నా ? ఇంకా తెరవరెంటీ? జమ్మెదార్ రాడా?ʹ గుసగుసగా అడిగింది. ʹఇంకా టైమ్ నాలుగే పడుకోʹ అన్నా. ʹఈ రోజు ఆదివారమే కదా?ʹ అంది. ʹహుష్ʹ అని ముసుగు తన్నెసా....పాపం రోషిణి! రోజూ ఏడుగంటలవరకూ అమ్మ కేకలేస్తే తప్ప లేవని రోషిణి!
లాకప్ తెరిచిన మరుక్షణం పిల్లలంతా బాణాల్లా బయటకు దూసుకుపోయారు. ఆరుగంటలకి నేను మొహం కడుక్కొని వాకింగ్ కి వచ్చేసరికే వాళ్ళు స్నానాలు చేసి తయారయిపోయి గేటు దగ్గర గుమికూడారు. ఏడున్నరకి సిపాయి వచ్చి ʹఅందరూ తయారుగా వుండండి.ʹ అని చెప్పాక గాని వాళ్ళ మనసులు కుదుట పడలేదు.
చివరికి ఎనిమిది గంటలకి అందరు పిల్లల్ని లైన్ లో నిలబెట్టి గిన్తీ చేసి (లెక్క బెట్టి) ఒక మహిళా జమ్మెదారిణీ, నలుగురు సిపాయిలు ఎస్కార్ట్ తో బయటి ప్రపంచంలోకి వాళ్ళ షికారు మొదలయ్యింది.
*** *** ***
పేపరు చదవడంలో ములిగిపోయి వుండగా ʹ...దీ..............దీ.....ʹఅని అరుచుకొంటూ సుడిగాలిలా దూసుకొచ్చింది రోషిణి. ఆమె చేతిలోని గులాబీలు నా ముందుకు చాచి ʹలీజియే!ʹ (తీస్కోండి) అన్నది. మొహం అంతా ఎక్సయిట్మెంట్ తో ఎర్రబడిబోయింది. పెదవులు కంపిస్తున్నాయి. తళతళలాడిపోతున్న కళ్ళతో ఏదో చెప్పాలని తెగ ఆరాటపడిపోతున్నది. కానీ... ఆమెకి గొంతు పెగలడం లేదు. పైగా పరిగెత్తుకొచ్చిందేమో రొప్పుతోంది. ఆమె వెనుకనే మిగతా పిల్లలు కూడా వచ్చి అందరూ ఒకేసారి గోలగోలగా చెప్తూ తాము తెచ్చిన పూలన్నీ నా పేపరు మీద పోసేసి దాన్ని తడిపేశారు. అన్నం తినడానికిచ్చే అల్యూమినియం ప్లేట్ లో నీళ్ళు పోసి ఆ పూలన్నీ దానిలో సర్దాను.
కాస్త స్థిమిత పడ్డాక మెల్లగా రోషిణిని కుదురుగా కూర్చొబెట్టుకొని అప్పుడు అడిగాను ఆమె విహార విశేషాలు. ఒక అద్భుత లోకాన్ని దర్శించినంత ఆశ్చర్యాన్ని కళ్ళనిండుగా నింపుకొన్న రోషిణిని చూస్తే Alice in wonderland గుర్తుకొచ్చింది.
ʹఏమేం చూశావ్?ʹ
ʹతలాబ్ (చెరువు)దగ్గరికి పోయాం తెల్సా? అందులో నీళ్ళున్నాయి. చా....లా వుంటాయన్నమాట. అవి ఎక్కడికీపోవు తెల్సా. అట్లే వుంటాయి. ఆ....! మేకను చూశాను. అది తెల్సా మే...మే.. అంటూ వుంటుంది. ఇంకా కుక్క ని చూశాను. అది పిచ్చిది తెల్సా?ʹ
ʹనీకేలాతెలుసు? పిచ్చిదని?ʹ
ʹఅది నన్ను చూసి వూరికె మొరుగుతుంది. వూరుకో అంటే వూరుకోవట్లేదు. ఇంకా కళ్ళకి కాజల్ (కాటుక) పెట్టుకొంది.ʹ
ʹదానికి చేతుల్లేవుగా ఎలా పెట్టుకొంది?ʹ
ʹకాలితోనే పెట్టుకొనేసిందేమో? పందిని కూడా చూసాము. అది తెలుసా గుర్ గుర్ అంటోంది.ʹ చెప్తూనే తల్చుకొని పడీపడీ నవ్వింది.
ʹఅక్కడ పార్కు లో వుయ్యాల వూగాము. మళ్ళీ దీదీ గుడికి తీసుకెళ్ళింది. అందరినీ మొక్కమన్నది.ʹ
ʹనేను కూడా మొక్కాను. శివ్ జీ! పసిపాపను. నిన్ను వేడుకొంటున్నాను. మా అమ్మ నాన్నకు బెయిల్ ఇవ్వండి. బందీలందరిని విడుదలజెయ్యండి. అని అడిగాను. సంతోషంగా వుండు బిడ్డా! నీకు బెయిల్ వస్తాది ఫో! అన్నాడు. గుడి పైన చెమ్కీలతో కుచ్చులు కట్టారు. అవి భలే మెరుస్తున్నాయి. నాకవి చాలా నచ్చాయి తెలుసా?ʹ
ʹనీకస్సలు నచ్చనిది ఏమిటి?ʹ
ʹసైకిల్. ఠక్కున చెప్పింది. అది వేగంగా వెళ్లిపోతుంది. నాకు చాలా భయం వేసింది. మీదకు వచ్చేస్తుంది తెలుసా? దానిమీద అబ్బాయి వున్నాడు. పడిపోలేదు. అలాగే వెళ్లిపోతున్నాడు. అదేం బాలేదు. మాకు చాక్లెట్లు కూడా ఇచ్చారు.ʹ గబుక్కున జేబులోనుండి తీసి చూపించింది. తింటావా? తీసుకో అని ఒకటి ఇచ్చింది.
ʹవద్దులే బెటా నువ్వు తిను.ʹ అన్నా. ʹనా దగ్గర ఇంకా వున్నాయ్. ఇవిగో, తిను! చాలా బాగున్నాయ్ తెలుసా?ʹ బలవంతంగా నా చేతిలో పెట్టింది. ఇంక చెప్పాల్సినవన్నీ అయిపోయాయా?అంటే...
ʹచెత్తకుప్ప చూసా...!ʹఅన్నది సంబరపడిపోతూ!
ʹఛీ! చెత్తకుప్పనా? మన జైల్లో కూడా ఉందిగాʹ ముఖం వికారంగా పెట్టి అన్నా!
ʹఛీ! అదికాదు. ఇది ఎంత బాగుందో. రంగురంగుల పెట్టెలు, డబ్బాలు, కాగితాలు, అలా ఎన్ని వున్నాయో? వుత్తిగే అలా పడివున్నాయి తెలుసా? తరవాత అటూ ఇటూ చూసి, మరి, ʹఅమ్మకి చెప్పనంటే నీకొకటి చెప్తాʹ గొంతు తగ్గించి గుసగుసగా అన్నది. నేను కూడా అంతే తగ్గు స్వరంలో ʹసరేʹ అన్నాను.
ʹకసమ్ సే?ʹ (వొట్టు?) ʹసరే వొట్టు.ʹ అన్నాను.
ʹనేను, డాలో వెళ్ళి ఏరుకొచ్చుకొందాం అనుకొన్నం. ప్లాస్టిక్ కవర్లు కూడా వున్నాయ్ తెల్సా? జమ్మెదారిణి కోప్పడుతుందేమో! అని జూలీ అంది. గౌనులో పెట్టేసుకొందాం అని వెళ్ళి తియ్యబోయామా? అప్పుడే దీదీ చూసేసి ఉండండి గేట్ దగ్గర మీకు తలాషి (సోదా)చేస్తాను. అప్పుడు మిమ్మల్ని సెల్ లోపడేస్తారు అంది. చిన్న పిల్లల్ని ఎక్కడైనా సెల్ లో వేస్తారెంటి అని జూలీ అంటే...ఉండండి మీ మమ్మీ కి చెప్తాను ఇలా చేశారంటే ఇంక బయటకు తీసుకురావద్దు అని చెప్తా అంది. అందుకని అక్కడే పడేసాం.ʹ దిగులుగా అంది.
అలా టోటోచాన్ లాగా ఇంకా ఇంకా, అనేకొద్దీ రోషిణికి వింతలూ విశేషాలు పుట్టుకొస్తూనే వున్నాయ్!
నేను ఇంక మాటలాపి లేవబోతుంటే, దీదీ రేపు ఆదివారం కాదు కదా? నిరాశగా అంది రోషిణి. *
- - బి. అనూరాధ

Keywords : jail storys, anuradha, jarkhand, adivasi
(2019-11-17 22:09:40)No. of visitors : 932

Suggested Posts


జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా.

జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి....

Search Engine

ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
more..


జైలు