చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ


చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ

చందమామని


ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా. కొద్ది మంది నా సన్నిహిత మిత్రులు నిన్ను కలవాలనుకొంటున్నారు. ఎగ్గొట్టకు.ʹ
స్వాతి నుంచి వచ్చిన ఆహ్వానం చూసి చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. చివరికి తాను ఫోన్ చేసి నా అంగీకారంకోసం అడిగితే ఇంక సరే అన్నాను.
నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను చూసి నవ్వి ʹపద. నీకో చిన్న సర్ ప్రైజ్ʹ అంటూ టెర్రస్ మీదకి తీసుకువెళ్ళింది. పైన శుభ్రం చేయించి కింద చాపల మీద పరుపులు వేసి దుప్పట్లు పరిచింది. ఆనుకోడానికి వీలుగా కొన్ని దిండ్లు. దూరంగా ఒక వైపు ఒక బల్ల మీద తిండి ఏర్పాట్లు కాబోలు గిన్నెల మీద మూతలు వేసి ఉన్నాయి. కొన్ని ఖాళీ ప్లేట్లు గ్లాసులు అన్నీ పెట్టి ఉన్నాయి. ఒక మూలగా చిన్నగా వెలుగుతున్న లైట్. దానిని తాత్కాలికంగా ఇప్పుడే ఏర్పాటు చేసినట్టున్నారు. ఆ వెలుగు అంతగా రాని చోట పక్కలు వేసి ఉన్నాయి. చల్లగా కురుస్తున్న వెన్నెల. నాలుగైదు అంతస్తుల పైన కాబట్టి ట్రాఫిక్ గోల అంతగా వినబడడం లేదు.
ʹఎంత ప్రయత్నం చేసినా డాబా ఇల్లు, కొబ్బరి చెట్టు ఆకుల సందుల్లోనించి చందమామని చూసే ఏర్పాటు చెయ్యలేకపోయాను. దీనితోనే అడ్జస్ట్ అయిపోవాలిʹ అంది. ʹపట్టణాల్లో కరెంటు తీగల మధ్యనుండి తప్ప కొబ్బరాకులెక్కడివిలేʹ అన్నారెవరో. అందరం నవ్వుకొన్నాం.
పరిచయాలయ్యాయి. అందులో కొందరు నాకు పేర్లు విని ఉన్న పరిచయం. కొందరు అస్సలు తెలియదు. కొద్ది మందిమే ఉన్నాం కాబట్టి ఆ వాతావరణాన్ని ఆనందించడానికి వీలుగానే ఉంది.
ఆ రొమాంటిక్ వాతావరణం చూస్తుంటే వేరే ఏమీ మాట్లాడాలనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే స్వాతి మాట్లాడడం మొదలుపెట్టింది. మన పార్టీ లో మొదటి రౌండ్ అందరూ చందమామ మీద కానీ వెన్నెల మీద కానీ పాట పాడాలి.
ʹపాటలు రాని వాళ్ళు ఏం చెయ్యాలి?ʹ అంది పావని.
ʹచదవాలిʹ అంది పద్మ.
ʹఛ! ఎంత అన్ రొమాంటిక్ ఆలోచన?ʹ ఒకేసారి స్వాతి, మాధవి అన్నారు.
ʹఓకే! పాటలు రాని వాళ్ళు ఒక ప్రేమ కథ చెప్పాలి. నేనసలు దానిని సెకండ్ రౌండ్ కి అనుకొన్నాʹ. అని సమస్య పరిష్కారం చేసింది స్వాతి.
ʹమాధవితో షురూ చేద్దాం. అద్భుతంగా పాడుతుందిʹ అంది పావని. నిజంగానే మాధవి మొదలుపెట్టాక ఇక వంతుల విషయం మర్చిపోయి అది మీరు కోరిన పాటల రూపం తీసుకొంది. అడగడమే ఆలస్యంగా తాను అనేక పాటలు వెన్నెల మీద, చందమామ మీద పాడింది. తనకి తెలియకుండానే రాధిక తోడయ్యింది. కొన్ని పాటలు తను పాడాకా, కరుణ కొన్ని హిందీ పాటలు పాడింది. అందరం ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉన్నాం.
ఇప్పుడిక ప్రేమ కథల రౌండ్ అని స్వాతి ప్రకటించింది.
ʹనేను మా చానల్ కి స్టోరీ కోసం ఒక సారి చాలా దూరం నడవాల్సి వచ్చింది. అప్పుడు ఇలాగే వెన్నెల. ఆ వెన్నెల చూస్తే ప్రేమ కథలు వినాలని మహా సరదా పుట్టింది. నాతో పాటు వచ్చిన కొలీగ్ ని తన ప్రేమ కథ చెప్పమని మస్తు సతాయించాను. ఎంతయినా పక్కన వాళ్ళ ప్రేమ కథలు చెప్పడం సులువుʹ అని తను విన్న ఆ ప్రేమ కథ చెప్పింది పావని.
తరవాత నా వంతు వచ్చింది. మరో సందర్భంలోనయితే నేను పాటలు పాడడాన్నేఎంచుకొని ఉండేదాన్ని. కానీ అప్పుడు మాత్రం నాకు కథ చెప్పాలనిపించింది.
ʹనేను ఒక కథ చెప్పాలనుకొంటున్నాʹ అన్నాను.
ʹమరొక జైలు కథా?ʹ అంది చప్పున రాధిక.
నేను నవ్వి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. ʹనేను థీమ్ ని మార్చడం లేదు. నేను చెప్పే కథ కూడా వెన్నెల గురించే. ʹచందమామని చూడని వెన్నెల గురించి.ʹ
*** *** ***
ʹచందమామ రావే..
జాబిల్లి రావే....ʹ
ఏదో ఒక భాషలో ఈ పాట తెలియని మనుషులు, బహుశా ఉండరు. బహుశా అని ఎందుకన్నానంటే చందమామ మీద పాట లేని భాష ఏదన్నా ఉందేమో మనకేం తెలుసు? కానీ చందమామని చూడని పిల్లలెవరన్నా వుంటారా? క్షణం కూడా ఆలోచించకుండా జవాబు చెప్పగల ప్రశ్న.
ʹఉండరుʹ
నేను రాజకీయ ఖైదీగా జైలు కి వెళ్ళక పోతే బహుశా నేను అదే జవాబుని తడుముకోకుండా చెప్పేదాన్ని. మనకి తెలిసిందే సర్వం కాదు. ఇప్పటి వరకూ... మనకు తెలిసిందే ʹపరమ సత్యంʹ. విశ్వంలోని ప్రతీదీ సాపేక్షికమే అనే విషయం తెలియదా, అంటే తెలుసు. కానీ, దానిని ప్రతి ఒక్కదానికి అన్వయించుకోలేని చేతకానితనం నాదని సవినయంగా వొప్పుకొంటున్నాను. కాబట్టి, ఏమో ఉండచ్చు అని ఊహించలేకపోయాను. ʹఉంటారుʹ అనేది ఈమధ్యనే తెలిసిన కరకు వాస్తవం.
ఆ పాప పేరు చాందినీ (వెన్నెల). ఝార్ఖండ్ లోని ఒక ఆదివాసీ అమ్మకి ముసల్మాన్ నాన్నకి ప్రేమ గుర్తుగా పుట్టిన ఒక ముద్దులు మూటకట్టే పాప. వాళ్ళిద్దరూ విచారణలో వున్న ఖైదీలు.
వాళ్ళమ్మ చాందినీకి చాలా ఇష్టంగా ఆ పేరు పెట్టింది. ఆదివాసీ జీవితాల్లో ప్రకృతి ఒక భాగం. వాళ్ళ పేర్లయినా, పండగలయినా రోజువారీ జీవితమయినా అంతా ప్రకృతి తోనే ముడిపడి ఉంటుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి పాటల పోటీల్లో ఒకబ్బాయి వెన్నెల మీద పాడిన పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అతను చాలా అద్భుతంగా పాడాడు. కానీ ఆ పాట ఏమిటో తెలుసా? ʹకాని చోట కాసావే వెన్నెలా? కారడవుల కాసావే వెన్నెలా!ʹ దానిభావంలోని అసంబద్దత గురించి అర్థం అయ్యే వయసు కాదది. అది అర్థం కావడానికి మరో దశాబ్దం పట్టింది నాకు. అడవుల్లోనూ మనుషులుంటారు. అడివిలోనే పుట్టి పెరిగి అడవినే ఇళ్లుగా చేసుకొన్నవాళ్ళు. వాళ్ళకి మనలాగా ఎలక్ట్రిక్ దీపాలు అవసరం లేదు. ఏదైనా చల్లని ఆ మసక మసక వెన్నెల లోనే. మనుషులు లేని అడవి లోనయినా ఎన్నో జీవాలు, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు? సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే స్వాంతన కలగ చేసే చందమామ మీద హక్కు ఏ ఒక్కరిదో ఎలా అవుతుంది? బహుశా ప్రతి ఒక్కరూ తమదే అనుకొంటారు. ఎంత అన్యాయమైన పాట కదా అది. ఆ పాట రచయిత ఒక వెన్నెల రాత్రి కారడవిలో గానీ గడిపితే, ఆ పాట రాసినందుకు గుండెలు బాదుకొంటాడు. అడవి కాచిన వెన్నెల అని ఎవరన్నా సామెత వాడితే ఇప్పుడు కేవలం జాలి పడగలం అంతే.
చాందినీని కనక ముందు వాళ్ళమ్మ కూడా అలా వెన్నెల్లో ఆడుకొన్న అడవి పిల్లే. బతుకు తెరువు ఆమెని ఇళ్ళల్లో పని చేసుకొని బతకడానికి ఢిల్లీ చేర్చితే ఆమె మొదటి సారిగా వెన్నెల్లో తాజ్ మహల్ ని చూసింది. షాజహాన్ ప్రేమకథ గురించి మొదటిసారి విన్నది. తాను పని చేసే ఇంటివాళ్ళు ముంబయ్ కి బదిలీ అయితే అక్కడ అదే ఇంట్లో డ్రైవర్ గా పని చేసే జమాలుద్దీన్ ని ప్రేమించింది. నేనిప్పుడు చెప్పబోయేది వాళ్ళ ప్రేమ కథ కాదు. కానీ వాళ్ళ ప్రేమ కథ కి సాక్ష్యం మాత్రం వెన్నెలనే. అలా అడివిలో వెన్నెల దగ్గర మొదలయిన జీవితం వెన్నెల్లో తాజ్ మహల్ సమక్షంలో కొత్త జీవితానికి బాసలు చేసుకొనేవరకూ వెళ్లింది. అమాయకంగా ఒకరికి సాయపడబోయి వాళ్ళిద్దరూ జైలు పాలయ్యారు. జైలులోకి ప్రవేశించాక కానీ తాను తల్లిని కాబోతున్నానని ఆమెకు తెలీలేదు. వెన్నెలతో అల్లుకు పోయిన తన జీవితానికి కొత్త వెలుగు లాంటి ఆ పసిదానికి ప్రేమగా చాందిని అని పేరుపెట్టుకొంది. జైలులో కళ్ళు తెరిచిన ఆ చిన్నారికి చాలా అసహజమైన వాతావరణంలో జీవితం మొదలయ్యింది.
జైలులో సాయంత్రం చీకటి ఇంకా పడుతూ ఉండగానే లాకప్ చేసేస్తారు. సరిగ్గా పక్షులు గూటికి చేరేవేళ. ఆ సుందర దృశ్యాలేవీ కళ్ల నిండుగా చూడకుండానే అందరం ఎత్తైన గోడల వెనుక రాతి కట్టడంలో ఏ వైపునుండీ పొరపాటున కూడా చందమామ కనపడే అవకాశం లేని చోటులో లాకప్ అయిపోతాం. కిటికీలు వుంటాయి. కానీ దానిలోనుండి ఎప్పుడూ కనపడేది కాదు. ʹచందమామ దూర్ కీ.... పువ్వే పకాయే గూడ్ కీʹ అని వాళ్ళమ్మ హిందీలో చాందినీకి పాటలు నేర్పుతోంది. చాందినీ ముద్దుముద్దుగా పాడుతోంది కూడా.
మేమున్న హజారీబాగ్ సెంట్రల్ జైల్లో టీవి వుంది. అయితే చాలా రాష్ట్రాల్లో జైల్లో కేవలం దూరదర్శన్ మాత్రమే వస్తుంది. ఆదివారంపూట వచ్చే హిందీ పాటల కార్యక్రమం రంగోలిని సాధారణంగా మిస్ అయ్యేవాళ్ళం కాదు. పిల్లలైతే చెప్పనక్కర్లేదు. వాళ్ళు ముందు వరసలో కూర్చుని కళ్ళు ఆర్పకుండా చూసేస్తుంటారు. ఖైదీల పిల్లలు 5 యేళ్ళ వయసు వచ్చేవరకు తల్లులతో పాటు ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడూ జైల్లో 20-25 మంది పిల్లలు ఉంటూనే వుంటారు. వాళ్ళందరికీ రింగ్ లీడర్ డాలో. చాందినీ వాళ్ళమ్మ, డాలో వాళ్ళమ్మ స్నేహితులు. కాబట్టి డాలో ఎప్పుడూ చాందినీ ని ఎత్తుకొని తిరుగుతూ వుండేది. చాందినీని ఎత్తుకోవడానికీ అందరూ పోటీలు పడేవారు. ఆమె ఎప్పుడు ఎవర్ని కరుణిస్తే వాళ్ళు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. అలా డాలో చాందినీని వొళ్ళో కూర్చుపెట్టుకొని టీవి చూస్తుండగా ఒక చందమామ పాట వచ్చింది. చూడు చూడమని పిల్లలందరూ పోటీలుపడి మరీ చందమామని చూపించారు. అప్పటికి తనకి వివిధ వస్తువులు చూపించి మాటలు నేర్పిస్తావున్నారు. ఫేనేది? బల్బేది? పిల్లేది? అంటే కిలకిలా నవ్వుతూ చూపించేది. చందమామేది? అంటే టీవి కేసి చూపేది. అందరూ నవ్వేవాళ్ళం. వాళ్ళమ్మ కూడా నవ్వేది. కానీ అప్పుడప్పుడు నవ్వుతో పాటు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేవి.
చాందినీకి రెండేళ్ల వయసు వచ్చేసింది. అనేకసార్లు చందమామని టీవీ లో చూడగానే గుర్తు పట్టి చప్పట్లు కొట్టి నవ్వి మరీ చెప్తోంది. కానీ ఆకాశంలో మాత్రం చూడనే లేదు. అలాంటి సందర్భంలో హోలీ పండగ వచ్చింది. జార్ఖండ్ లో హోలీ ని చాలా ధూంధాం గా జరుపుకొంటారు. జైల్లో కూడా! ఆ సందర్భంగా ఖైదీలకు ఒక రోజు మీట్ కూడా ఇస్తారు. ఆసారి ఏదో కారణం వల్ల కూర వండడం ఆలస్యం అయ్యింది. పైగా ప్రతి ఒక్కరికీ 100గ్రాముల చొప్పున తూచి ఇస్తారు. కాబట్టి లాకప్ చేసి ఇవ్వడం కుదరదు కనక మహిళా వార్డు లోని మూడు బ్యారక్ లు తెరిచే వున్నాయి. వార్డు ఎప్పుడూ మూసే వుంటుంది. లోపల బ్యారక్లు మాత్రమే తెరిచి వుంచుతారు. ఆరోజు ఎప్పటిలా 5.30 కి కాకుండా 7 గంటల వరకూ పంపకాలు పూర్తికాక కిందా మీదా అవుతున్నారు. అలాంటి సమయంలో అంత అరుదుగా దొరికిన అవకాశంలో కూర కోసం లైన్లో నిలబడడం ఏంటని! చాలా మందిమి ఖుషీగా వెన్నెల్లో చేతులు పట్టుకొని ఒకటే ఎగిరాం. అదిగో అప్పుడు చూసింది చాందినీ. అదీ ʹపున్నమిʹ చంద్రుడిని. ఆ రోజు సాయంత్రం ʹస్వేచ్ఛʹ గా ఆవరణలో తిరుగుతుంటే లేత నారింజరంగులోంచి మెల్లగా లేత పసుపులోకి....మారుతూ పైకి ఎగుస్తూ ఆకాశంలోకి ఎగబాకుతున్న చందమామని అందరికన్నా ముందు గుర్తుపట్టింది చాందినీనే! అప్పటినుండి ఎప్పుడడిగినా ఆకాశం వైపు చూపించి విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి, చిట్టి చిట్టి చేతులు అందంగా తిప్పుతూ ʹగాయెబ్ʹ (మాయమయిపోయాడు) అనేది. అదొక్కటే సారి తను చందమామని చూడడం. కానీ ఆ తరవాత ఎప్పుడూ మళ్ళీ తను చందమామ ఏదని అడిగితే టీవీ కేసి చూపలేదు.
చాలా తొందరగా చాందినీకి మాటలు వచ్చాయి. ఏదంటే అది తిప్పి అనేసేది. తనని ఒకటే వాగించి మేము నవ్వినవ్వి వినోదించేవాళ్ళం. ఒక రోజు నేను కమానీ ఘర్ లో కూర్చుని కాగితాలు వెలిగించి ఆ మంట మీద మేగీ చేస్తున్నా. చాందినీ నేను కమాని ఘర్లోకి వెళ్ళడం చూసి నా వెనకాలే వచ్చింది. మూడు రాళ్ళ పొయ్యి వెలిగించగానే పరిగెత్తి గిన్నె తెచ్చుకొంది. ʹదేనాʹ...(ఇవ్వా?)అంటూ ముద్దుగా అడుగుతుంటే ఏడిపించబుద్దయ్యి...ʹనేను ఇవ్వను ఫో!ʹ అన్నాను.
అప్పుడు చాందినీ... ʹఉఠాకే ఫేక్ దెంగే తో చందమామా కె పాస్ చల్ జాయెగీʹ (ఎత్తి విసిరేశానంటేనా చందమామ దగ్గరికెళ్లి పడతావ్!) అంది.
ఇంత అందంగా ఇప్పటివరకూ నన్నెవ్వరూ తిట్టలేదు. చందమామ అలా అంత బుజ్జి బుజ్జి మనసులని కూడా ఎలా దోచేస్తాడో అని నివ్వెరపోతూ చాందినీని ముద్దుల్లో ముంచెత్తాను.
పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో మౌనంగా కథ విన్న అందరి మనసుల్లోనూ ఇప్పుడు వెన్నెల స్థానంలో ʹచాందినీʹ
నిండిపోయిందని వేరే చెప్పనక్కర్లేదు కదా.

***

Keywords : anuradha, story, jail
(2018-08-13 09:12:13)No. of visitors : 326

Suggested Posts


మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు

ʹమిలియన్ మార్చ్..ʹ ʹఅది ముగిసిన ముచ్చట..ʹ ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను,

జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ

జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు.

జైలు కథలు...బలి -బి.అనూరాధ

పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి. ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు....

జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ‌

జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్....

జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధ

చిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది.

జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ

ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని.

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ

సాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను.

జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ

చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు.

జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ

సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు.

జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ

జైల్లో మంట, వంట నిషేధం. అయినా ఏదో స్థాయిలో వంట నడుస్తది. మంట లేకుండా వంట కుదరదు కనక కాదేదీ మంట పెట్టడానికి అనర్హం అని అన్నీ చివరికి చేరేది పొయ్యిలోకే. అయితే అందరూ చేసుకొంటారని కాదు. కొంత మందికి మగవాళ్ళ వార్డుల నుండి కూరలు వస్తూ వుంటాయి....

Search Engine

News from the revolutionary movement in Manipur
మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్
Maoist leader Shyna released on bail
జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ లోహత్యా యత్నం...ఇది సంఘ్ పరివార్ పనేనన్న ప్రజా సంఘాలు
ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !
IIT Bombay Students Question Decision to Invite Modi to Convocation Ceremony
అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!
అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు
మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు
రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ
మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !
people organise rally in national capital in protest against the state high handedness on rights activists
Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri
తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్
అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు
Historic Eight Documents of Charu Majumdar (8th Document)
Historic Eight Documents of Charu Majumdar (7th Document)
Historic Eight Documents of Charu Majumdar (6th Document)
Historic Eight Documents of Charu Majumdar (5th Document)
Historic Eight Documents of Charu Majumdar (4thDocument)
Historic Eight Documents of Charu Majumdar (3rd Document)
Historic Eight Documents of Charu Majumdar(2nd Document)
Historic Eight Documents of Charu Majumdar (1st Document)
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !
more..


చందమామని