సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?


సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?

సోవియట్

మిఖయిల్ వి.పోపోవ్ అనే రష్యన్ మేధావి రాసిన ఈ ఆర్టికల్ వీక్షణం మార్చ్, 2018 సంచికలో ప్రచురించబడినది. అనువాదం: తోలేటి జగన్మోహనరావు

(రంగనాయకమ్మ, ఇటీవల ʹసోవియట్‌ రష్యాలో ఏం జరిగింది?ʹ అన్న పుస్తకం ప్రచురించింది. ఇంతవరకూ ఏ పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకీ చెయ్యని విధంగా రంగనాయకమ్మ, సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థ మీద దుర్మార్గమైన దాడి చేసింది. ʹస్టాలినిజంʹ అనేది ఒక దోపిడీ సిద్ధాంతమనీ, ʹపాత బానిసత్వాన్నీ, అమలులో ఉన్న పెట్టుబడిదారీ విధానాన్నీ, రెంటినీ కలేసే, కొత్త దోపిడీ విధానంగా తలెత్తిందనీʹ అంటూ రంగనాయకమ్మ, స్టాలిన్‌ యుగం నాటి సోషలిస్టు వ్యవస్థను ఒక బానిస వ్యవస్థగా చిత్రించింది. స్టాలిన్‌, కిరోవ్‌ ను హత్య చేశాడనీ, తనను ప్రశ్నించినందుకు బుఖారిన్‌ ను హత్య చేశాడనీ, ట్రాట్స్కీని హత్య చేశాడనీ, స్టాలిన్‌ భార్య ఆత్మహత్య చేసుకుని ఉండకపోవచ్చునీ అది హత్యే కావచ్చుననీ, లెనిన్‌ జీవించి ఉండి స్టాలిన్‌ను వ్యతిరేకిస్తే, కిరోవ్‌కి పట్టినగతే లెనిన్‌కు కూడా పట్టేదనీ అంటూ రంగనాయకమ్మ, ఆనాటి ప్రపంచాన్ని ఉత్తేజపరచిన సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ చరిత్రను, రామ్‌గోపాల్‌వర్మ ʹరక్త చరిత్రʹ లా చిత్రించింది. రాబర్ట్‌ కాంక్వెస్ట్‌, సోల్జెన్‌త్సీన్‌ లాంటి పెట్టుబడి ఏజెంట్ల స్థాయికి దిగజారిపోయి, ఈ తరహా పుకార్లను చారిత్రక వాస్తవాలుగా చెప్పింది.

నిజానికి ఈ రకమైన ప్రచారం కొత్తదేమీ కాదు. గత తొమ్మిది దశాబ్దాలుగా పెట్టుబడిదారీ ప్రపంచం చేస్తున్నదే. ఇరినా మాలెంకో, యూరీ ఝుకోవ్‌, గ్రోవర్‌ ఫర్‌, ఆర్చ్‌. గెట్టీ లాంటి రచయితలూ, చారిత్రక పరిశోధకులూ, తమ అనుభావాల మీదా, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న చారిత్రక పత్రాల మీదా ఆధారపడి, వాస్తవంగా సోవియట్‌ యూనియన్‌ లో ఏం జరిగినదీ వివరిస్తూ ఈ విష ప్రచారాన్ని ఎదుర్కొంటుంటే, చారిత్రక వాస్తవాలకూ కట్టుకధలకూ తేడా గ్రహించలేని రంగనాయకమ్మ కలం, తొమ్మిది దశాబ్దాలుగా జరుగుతున్న ఆ ప్రచారాన్ని ఇక్కడ, ఇప్పుడు అందుకుని, సోషలిస్టు వ్యవస్థ మీద విషం కక్కుతోంది. స్టాలిన్‌ను ఒకప్పుడు విప్లవకారుడిగా గుర్తించిన రంగనాయకమ్మ, ʹఇప్పుడు నేను స్టాలినిస్టుగా చెప్పుకోవడానికి సిగ్గుపడతానుʹ అంటోంది. రంగనాయకమ్మ తనను మార్క్సిస్టుగా చెప్పుకుంటున్నందుకూ, కొంతమంది ఈ కుహనా మార్క్సిస్టును మార్క్సిస్టుగా ఇంకా గుర్తిస్తున్నందుకూ, మనమందరం సిగ్గుపడాలి.

సోవియట్‌ రష్యాలో ఏం జరిగింది? అన్న ప్రశ్నకు మైఖేల్‌ పోపోవ్‌ వ్యాసం సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తుంది.

సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిన తర్వాత వర్గ పోరాటం ఆగిపోలేదు. ఈ వర్గ పోరాటం అనేక రూపాలలో, అనేక స్థాయిలలో, మొదటినుంచి తుది దాకా జరుగుతూనే ఉంది. స్టాలిన్‌ మరణం వరకూ సోవియట్‌ యూనియన్‌లో రాజ్యం కార్మిక వర్గం చేతుల్లో ఉంది. ఈ కార్మిక రాజ్యం, ఉత్పత్తి సాధనాలను ప్రజలందరి ప్రయోజనం కోసం వినియోగించింది. స్టాలిన్‌ మరణానంతరం పరిస్థితిలో మార్పు వచ్చింది. 1961లో జరిగిన సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ 22వ కాంగ్రెస్‌ కార్మిక వర్గ నియంతృత్వాన్ని అంతం చెయ్యడంతో, రాజ్యం బూర్జువా చేతుల్లోకి పోయిందంటాడు పోపోవ్‌. 1961లో కార్మిక వర్గ నియంతృత్వం అంతమై, బూర్జువా నియంతృత్వం ప్రారంభమైంది. మొదట సోవియట్‌ యూనియన్‌లోని ఉత్పత్తి సాధనాలన్నీ ఈ నయా బూర్జువా ఉమ్మడి వ్యక్తిగత ఆస్థిగా ఉండేవి. 1991 తర్వాత ఈ ఉమ్మడి ఆస్థి, వ్యక్తిగత ఆస్థిగా మారి, మాఫియా కేపిటలిజం ఉనికిలోకి వచ్చింది. పోపోవ్‌ వ్యాసం ఈ పరిణామం గురించి వివరిస్తుంది.

1961లో ఈ మార్పు స్పష్టంగా కనుపించినా ఇంకా ముందే, 1956లోనే ప్రారంభమైందని, పోపోవ్‌ చెబుతారు. ఈ నయా బూర్జువా వర్గం ఎక్కడ నుంచి వచ్చింది? స్టాలిన్‌ యుగంలో కూడా, ఒక వర్గంగా కాక పోయినా, పార్టీలో, ప్రభుత్వంలో, సమాజంలో, అన్ని రంగాలలోనూ, సోషలిస్టు వ్యతిరేక శక్తులుంటూనే ఉన్నాయి. ఈ దిగజారుడు శక్తులనుంచి క్రమంగా ఈ నయా బూర్జువా వర్గం జన్మించింది. 1952లో సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభకు, పార్టీ కేంద్ర కమిటీ సమర్పించిన నివేదికలో, కొన్ని పార్టీ సంస్థలలో, అవినీతి, దిగజారుడుతనం కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ సంస్థల నాయకులు, సంస్థలను తమ మనుషులతో నింపివేసి, పార్టీ, రాజ్య ప్రయోజనాల కంటే, ముఠా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంది. ప్రభుత్వ పరిశ్రమల అధికారులు, తమ చేతుల్లో ఉన్నవి ప్రభుత్వ సంస్థలన్న విషయం మరచిపోయి, వాటిని తమ స్వంత సంస్థలుగా మార్చడానికి ప్రయత్నిస్తు న్నారని విమర్శించింది. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో సమిష్టి సంపదను కాపాడడానికి బదులు, కొంతమంది పార్టీ కార్యకర్తలూ, ప్రభుత్వ ఉద్యోగులూ, సమిష్టి వ్యవసాయ క్షేత్ర సంపదను పిండుకుంటున్నారని ఆరోపించింది. కళా, సాంస్కృతిక, శాస్త్ర రంగాలలో కూడా సోషలిస్టు వ్యవస్థ మీద దాడి చేసే, బురద జల్లే, ధోరణులు తలెత్తాయంది.

ఈ దిగజారుడు శక్తుల వలన సోషలిస్టు వ్యవస్థకు ఏర్పడుతున్న ప్రమాదాన్ని గుర్తించి, స్టాలిన్‌ మరో ప్రక్షాళన కార్యక్రమంలో ఈ ముఠాను పార్టీనుంచి తొలగించే ప్రయత్నంలో ఉన్నట్లూ. దానితో ఈ ముఠా భయభ్రాంతమై స్టాలిన్‌ ను హత్య చేసినట్లూ కనుపిస్తుంది. 18వ పార్టీ కాంగ్రెసు వరకూ కాంగ్రెస్‌ రికార్డులు బహిరంగమైనా, ఈ 19వ కాంగ్రెసు రికార్డులు ఇంతవరకూ బహిరంగం కాలేదు. స్టాలిన్‌ తదనంతర రివిజనిస్టు నాయకత్వం కాని, ప్రస్తుత కేపిటలిస్టు నాయకత్వం కాని, బహిరంగం చెయ్యడానికి ఇష్టపడని సంఘటనలు ఏవో ఆ కాంగ్రెస్‌ లో సంభవించి ఉండవచ్చు. స్టాలిన్‌ వ్యక్తిగత నియంతృత్వం అంటూ కృశ్చేవ్‌ చేసిన దాడి, ఈ దిగజారుడు శక్తుల ప్రయోజనాలను కాపాడడం కోసం, కార్మిక వర్గ నియంతృత్వం మీద చేసిన దాడి. కమ్యూనిస్టులు ఈ దాడిని సవ్యంగా ఎదుర్కోలేకపోయారు. సోవియట్‌ వ్యవస్థలోనే ఉన్న ఈ దిగజారుడు శక్తులకూ, నిబద్ధులైన కమ్యూనిస్టులకూ జరుగుతున్న వర్గ పోరాటంలో కమ్యూనిస్టులు ఓడిపోయారు. క్రమంగా దిగజారుడు శక్తులది పై చేయి అయి, ఈ శక్తులు ఒక నయా బూర్జువా వర్గంగా చైతన్యం పొంది, సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ను పెట్టుబడిదారీ విధానం వైపు మళ్ళించాయి. పోపోవ్‌ వ్యాసం, తన పరిధిలో, ఈ విషయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంది. - అనువాదకులు).

సోవియట్‌ యూనియన్‌లో ప్రతీఘాత విప్లవం - మైఖేల్‌ వి. పోపోవ్‌

సోవియట్‌ యూనియన్‌లో ఒక ప్రతీఘాత విప్లవం జరిగిందని ఇప్పుడు దాదాపు అందరికీ అర్థమైంది. ఇది అర్థం చేసుకోవడం చాలా తేలికే. ఎందుకంటే, అప్పటివరకూ సోవియట్‌ యూనియన్‌ లో. కమ్యూనిజంలో తొలి దశ అయిన సోషలిజం ఉంద్ష్మి ఇప్పుడు రష్యాలో పూర్తిగా పాతుకుపోయిన కేపిటలిజం ఉంది. సోవియట్‌ యూనియన్‌ లో కేవలం ఒక ప్రతీఘాత విప్లవం మాత్రమే జరుగలేదు, ఒక పునరుద్ధరణ కూడా జరిగింది - బూర్జువా సంస్థలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ఇప్పుడు, బూర్జువా నియంతృత్వం ఒక రూపంగా బూర్జువా ప్రజాస్వామ్యం నెలకొన్న పూర్తి స్థాయి బూర్జువా రాజ్యం ఒకటి ఉంది.

ఈ మార్పు ఎప్పుడు జరిగింది?

మొదట కొంతమంది, ఈ మార్పు 1990 చివరనా, 1991 ప్రారంభం లోనూ, జరిగిందని భావించారు. కాని లోతైన విశ్లేషణ అలా జరగలేదని మనకు వెల్లడిస్తుంది. మహత్తర సంఘటనలు అలా జరగవు. చరిత్రలో, ఒక వ్యవస్థ నుంచి మరొక వ్యవస్థకు పరివర్తనలు క్షణాల్లో జరగవు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. రష్యాలోనూ, సోవియట్‌ యూనియన్‌ లోనూ, కేపిటలిజం నుంచి సోషలిజానికి పరివర్తన 18 సంవత్సరాలు తీసుకుంది (1917 నుండి 1935 వరకూ). సోషలిజం నుంచి తిరిగి కేపిటలిజానికి పరివర్తనకు ఎంత కాలం పట్టింది? ఈ విషయాన్ని మనం చర్చించాలి.

ఒక రాజ్యం సోషలిస్టు రాజ్యం ఎప్పుడు అవుతుంది? రాజ్యంలో అధికారం కార్మిక వర్గం చేతుల్లో ఉంటే, ఆ రాజ్యం సోషలిస్టు రాజ్యం అవుతుంది. కార్మిక వర్గం చేతుల్లో అధికారం ఎప్పుడు ఉంటుంది? కార్మిక వర్గ నియంతృత్వం అమలు జరుగుతున్నప్పుడు మాత్రమే కార్మిక వర్గం చేతుల్లో అధికారం ఉంటుంది.

కార్మిక వర్గ నియంతృత్వం అంటే ఏమిటి? లెనిన్‌, తన వ్యాసం ʹమహత్తర ప్రారంభంʹలో, కార్మిక వర్గ నియంతృత్వానికి ఒక శాస్త్రీయ నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ నిర్వచనం ప్రకారం, ఒక నిర్దిష్ట సామాజిక వర్గం మాత్రమే - అంటే పట్టణాలలో ఫాక్టరీలలో ఉండే పారిశ్రామిక కార్మిక వర్గం మాత్రమే - వర్గాలను పూర్తిగా నిర్మూలించే పోరాటంలో, మొత్తం శ్రమ జీవులకూ దోపిడీకి గురవుతున్న ప్రజలకూ నాయకత్వం వహించగలదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ʹవర్గాల రద్దుʹ అంటే దోపిడీ వర్గాలను నిర్మూలించడం మాత్రమే కాదు; గ్రామానికీ పట్టణానికీ మధ్యా, శారీరక మానసిక శ్రమల మధ్యా ఉండే అంతరాలను నిర్మూలించడం. సోవియట్‌ యూనియన్‌ లో ప్రతీఘాత విప్లవం గురించి చర్చించేటప్పుడు కార్మిక వర్గ నియంతృత్వం గురించి మరొక నిర్వచనం మనకు చాలా ఉపయోగకరం గా ఉంటుంది. ఈ రెండో నిర్వచనం, లెనిన్‌ పుస్తకం, ʹఅతివాద కమ్యూనిజం - ఒక బాలారిష్టంʹలో ఇవ్వబడింది: ʹకార్మిక వర్గ నియంతృత్వం అంటే, రక్తపాతంతోనూ, రక్తపాత రహితంగాన్ష్మూ హింసాత్మకంగానూ, శాంతియుతంగాన్ష్మూ సైనికంగానూ, ఆర్థికంగానూ, బోధనాత్మకంగానూ, పరిపాలనాపరంగాన్ష్మూ పాత సమాజ సంప్రదాయా లకూ, శక్తులకూ వ్యతిరేకంగా ఒక నిరంతర పోరాటంʹ.

ఇప్పుడు మనం ఈ ప్రశ్నలు వేసుకుందాం.

సోషలిజంలో పాత సమాజపు సంప్రదాయాలూ, శక్తులూ, అదృశ్యమైపోతున్నాయా?

సోషలిజంలో, పెట్టీ బూర్జువా మనస్తత్వానికీ, ధోరణులకూ వ్యతిరేకంగా వర్గ పోరాటం జరగడం లేదా?

సోషలిజంలో కార్మిక వర్గం తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహించిందా? పెట్టీ బూర్జువా మనస్తత్వానికీ, ధోరణలకూ వ్యతిరేకంగా వర్గ పోరాటం ముగిసింది అని చెప్పగలిగే విధంగా, అన్ని సామాజిక వర్గాలూ పూర్తిగా నిర్మూలించబడ్డాయా?

దీనికి సమాధానం ఇలా ఉంటుంది:

సోషలిస్టు సమాజంలో, కార్మిక వర్గ ప్రయోజనాలతో సంఘర్షించే పెట్టీ బూర్జువా మనస్తత్వం, ధోరణులూ ఉంటాయి. సోషలిజంలో, పెట్టీ బూర్జువా మనస్తత్వానికీ, ధోరణులకూ వ్యతిరేకంగా వర్గ పోరాటం జరుగుతోందే కాని ముగియలేదు. మనం ఈ శక్తులతో, ధోరణులతో పోరాడకపోతే, ఈ శక్తులూ, ధోరణులూ మనతో పోరాడుతాయి.

మనం ప్రశ్నలు ఆ విధంగా వేసుకున్నట్లయితే, సోవియట్‌ యూనియన్‌లో ఎప్పుడు ప్రతీఘాత విప్లవం జరిగిందో మనకు స్పష్టమవుతుంది. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిజానికి ప్రాణ ప్రదమైన కార్మిక వర్గ నియంతృత్వాన్ని తన కార్యక్రమం నుంచి తొలగిస్తూ పార్టీ కాంగ్రెస్‌ లో ఓటు చేసినప్పుడు, ఈ ప్రతీఘాత విప్లవం జరిగింది. ఇది 1961లో, 22వ కాంగ్రెస్‌లో, జరిగింది. దీనర్థం ఏమిటంటే, సమాజానికి నాయకత్వం వహిస్తున్న ఒక శక్తిగా కాని, ఒక పార్టీ గా కాని - అంటే తన చేతుల్లో రాజ్యాధికారాన్ని ఉంచుకున్న ఒక రాజకీయ పార్టీగా- సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ, పాత సమాజపు సంప్రదాయాలూ, శక్తులకూ వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగించాలని ఇంకెంత మాత్రం భావించడం లేదు. పర్యవసానం ఏమిటంటే, 22వ కాంగ్రెసు నిర్ణయంతో, రాజ్య స్వభావం వెంటనే మారింది. ఒకప్పుడు కార్మిక వర్గ నియంతృత్వంగా ఉన్న రాజ్యం, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మారింది.

దీనర్థం ఏమిటి? వ్యతిరేక స్వభావం గల రాజ్యం అంటే ఏమిటి? అంటే, బూర్జువా రాజ్యం. సోషలిజంలో బూర్జువా ఉండడని భావిస్తూ, కొంతమంది అడుగుతారు: ʹకాని బూర్జువా ఎక్కడున్నాడు?ʹ ఇది నిజమే. ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో, ఆ క్షణం వరకూ, బూర్జువా లేడు. కాని నిర్ణయం తీసుకున్న వెంటనే, మొత్తం ఆర్థిక, రాజకీయ జీవితాన్ని నిర్వహిస్తున్న రాజ్య యంత్రాంగానికి ఏం జరిగింది? వాస్తవంలో, ఉత్పత్తి సాధనాలను తమ గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తులతో కూడిన రాజ్య యంత్రాంగమైంది. ఇంతకు ముందు ఈ వ్యక్తులు, మొత్తం సమాజ అవసరాలను తీర్చడం కోసమూ, శ్రమ జీవులందరి ప్రయోజనాలను వ్యక్తం చేసే కార్మిక వర్గ ప్రయోజనాల కోసమూ, ఈ ఉత్పత్తి సాధనాలను నిర్వహించవలసి వచ్చేది. ఈ మార్పు తర్వాత ఈ వ్యక్తులు, ఉత్పత్తి సాధనాలను తమ స్వప్రయోజనాల కోసం వినియోగించ సాగారు. నిజానికి ఇది వారి కర్తవ్యమైంది. ఆ విధంగా, ఉత్పత్తి సాధనాలను స్వప్రయోజనాలకోసం వినియోగించే ఒక ʹకులంʹ ఏర్పడింది.

ప్రభుత్వ యాజమాన్యం, సమాజ యాజమాన్యం - రెండూ ఒకటి కావు. రాజ్యం కార్మిక వర్గ రాజ్యమైనప్పుడు మాత్రమే, రాజ్యం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పని చేస్తున్నప్పుడు మాత్రమే, ప్రభుత్వ యాజమాన్యం, సమాజ యాజమాన్యం ఒక రూపమవుతుంది. అందువలన, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం రాజ్యం పని చెయ్యడం ఆగిపోయిన తక్షణమే ప్రభుత్వ ఆస్థి, సమాజంలో ఒక భాగం ఆస్థి అవుతుంది. సమాజంలో ఒక భాగం ఆస్థి, వ్యక్తిగత ఆస్థి అవుతుంది. ఆ విధంగా, 1961తో ప్రారంభమై, సోవియట్‌ యూనియన్‌ లో, ప్రభుత్వంలో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వ్యక్తిగత ఆస్థి ప్రత్యక్షమైంది. ఈ వ్యక్తిగత ఆస్థి, మరే ఇతర జాయింటు స్టాక్‌ కంపెనీలో ఉంటున్నట్లుగానే, ఉమ్మడి ఆస్థిగా ఉంది. ఏ కార్పోరేషన్‌ లో నైనా వ్యక్తిగత ఆస్థి వ్యక్తుల చేతుల్లో ఉండదు, వాటా దారులందరి ఆస్థిగా ఉంటుంది. రష్యాలో, తొలి దశలో, స్వతంత్ర వాటాదారుల చేతుల్లో ఈ ఆస్థి ముక్క చెక్కలై లేదు. ఉన్నత స్థానాలలో ఉన్న వారందరూ ఒక ముఠాగా, ఉమ్మడిగా, ఆస్థిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అధికారంలో ఈ స్థాయిలో, కార్మిక వర్గంలో ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉండేవారు. మిగిలిన వారంతా, ఇంకే మాత్రం సమాజ ఆస్థి కాని ఈ ఉమ్మడి, ప్రభుత్వ ఆస్థిని దోచుకునే అవకాశం కనుపించగానే, ఆ అవకాశం అందుకోడానికి చేతులు చాచేవారు.

ఈ పరిస్థితికి ఉత్తమమైన పరిష్కారాన్ని బెలారస్‌లో మనం చూడవచ్చు. ఈ ఉమ్మడి వ్యక్తిగత ఆస్థిని అక్కడ ముక్కలు చెక్కలు చెయ్యలేదు. అందువలన అక్కడ ప్రభుత్వ ఆస్తి, భారీ స్థాయి వ్యక్తిగత ఆస్తిగా, కొనసాగింది. కాని మిగిలిన సోవియట్‌ యూనియన్‌లో, చుబైస్‌, గెడార్‌ తదితర సిద్ధాంత వేత్తలూ; నెమ్‌ త్సోవ్‌, లావ్లిన్స్కీ, బోల్దిరేవ్‌ తదితర (సామ్రాజ్యవాద దశకూ, ప్రభుత్వ గుత్త కేపిటలిజం దశకూ కూడా చేరని) ఉదారవాద కేపిటలిజం గురువులూ, ఈ ప్రభుత్వ ఆస్థిని ముక్క చెక్కలు చెయ్యడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ ప్రభుత్వ ఆస్తిని ఇలా పంచుకోవడం ఒక్క రోజులో జరగలేదు. మొట్టమొదట శత్రువు, అంటే కార్మిక వర్గం, మెడలు వంచాల్సిన అవసరం ఉంది - 1962లో, నోవోఛెర్కాస్క్‌ లో కృశ్చేవ్‌, కార్మికులనూ, వారి బిడ్డలనూ కాల్చి చంపుతూ పరిష్కరించడానికి ప్రయత్నించిన సమస్యను, పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాధినేత ఆదేశాలతో కార్మికుల మీద కాల్పులు జరుగుతున్నప్పుడు, ఈ చారిత్రక వాస్తవాన్ని గమనించిన ఏ వ్యక్తి అయినా, ఆ రాజ్యం కార్మిక వర్గ రాజ్యం కాదు, అని ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది. ఆ కార్మికుల కోరికలు ఏమిటి? ధరలు పెరగకూడదని మాత్రమే వాళ్ళు కోరారు. ప్రపంచ వ్యాపితంగా కార్మికులు ఇదే డిమాండు చేస్తుంటారు. ఈ డిమాండు చేసినందుకు ప్రపంచంలో ఎవరూ, బూర్జువా ప్రపంచంలో కూడా, కార్మికుల మీద కాల్పులు జరుపరు. ఈ విషయంలో కృశ్చేవ్‌, ఇతర దేశాలలో బూర్జువా నియంతృత్వాన్ని అమలు జరుపుతున్న వారిని తలదన్నాడు. ఆ కారణం వలన, 1961తో ప్రారంభించి, సోషలిజం నుండి కేపిటలిజానికి పరివర్తన ప్రారంభమైందనీ, 1961లో 22వ కాంగ్రెస్‌ లో ఒక రాజకీయ విప్లవం జరిగిందనీ చెప్పవచ్చు.

ఆ విధంగా, ʹవిప్లవంʹ అన్న పదాన్ని మనం ఒక ఆర్థిక వ్యవస్థనుంచి మరొక ఆర్థిక వ్యవస్థకు పరివర్తన అన్న అర్థంలో ప్రయోగిస్తే, అప్పుడు ఆ ప్రక్రియ చాలా కాలం తీసుకునే ప్రక్రియ అవుతుంది. ఈ ప్రక్రియ 1961 నుంచి 1991 వరకూ - 30 సంవత్సరాలు - తీసుకుంది. (మొట్ట మొదట రష్యాలోనూ, తరువాత మొత్తం సోవియట్‌ యూనియన్‌ లోనూ, పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజానికి పరివర్తనకు పట్టిన 18 సంవత్సరాల కంటే ఇది చాలా ఎక్కువ).

సోవియట్‌ యూనియన్‌ (తనంతట తాను) ముక్కలైపోయింది అనే భావనకు విరుద్ధమైన భావన ఇది. లేదు, సోవియట్‌ యూనియన్‌ ముక్కలైపోలేదు. వెలుపల నుంచీ, లోపలనుంచీ, సోవియట్‌ యూనియన్‌ కు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అగ్ర నాయకత్వంలో ఉన్న సోషలిస్టు ద్రోహులూ, కమ్యూనిస్టు పార్టీ ద్రోహులూ, కార్మిక వర్గ ద్రోహులూ ఒక వైపు నుండ్ష్మీ ఎల్సిన్‌ సంవత్సరాలలో, ప్రతీ దాన్నీ పెట్టుబడిదారీ విధాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికీ, ఈ ఆర్థిక వ్యవస్థను (రష్యన్‌ బూర్జువాకి కూడా కాదు) విదేశీ బూర్జువా ప్రయోజనాలకు, ముఖ్యంగా అమెరికన్‌ బూర్జువా ప్రయోజనాలకు, అనుగుణంగా మార్చడానికీ, అన్ని మంత్రాలయాలలోకి ఆహ్వానించబడ్డ విదేశీ సలహాదారులు మరొక వైపునుండీ, సోషలిజంతో పోరాడారు. ఇదంతా సుదీర్ఘ కాలం జరిగింది. సోవియట్‌ యూనియన్‌ ఒక్క రోజులో ముక్క చెక్కలైపోలేదు.

సోవియట్‌ యూనియన్‌ ఈ శక్తులను చాలాకాలం ప్రతిఘటించింది. అలా ప్రతిఘటించిన శక్తులున్నాయని మనకు తెలుసు. 1989లో శ్రమ జీవుల ఐక్య సంఘటన ఒకటి ఏర్పడింది. అందులో, కామ్రేడ్స్‌ పిఝోవ్‌, క్రసావిన్‌ లతో పాటు, నేనూ, సోవియట్‌ యూనియన్‌ ప్రజా ప్రతినిధుల స్థానాలకు కేండిడేట్లుగా లెనిన్‌ గ్రాడ్‌ ప్రాంతం నుంచి పాల్గొన్నాం. శ్రమ జీవుల ఐక్య సంఘటన లెనిన్‌ గ్రాడ్‌ విభాగంగా మేము ఉన్నాం. మాస్కోలో కూడా అటువంటి విభాగం ఒకటి ఏర్పడింది. చివరకు, మా ట్రేడ్‌ యూనియన్ల, కొన్ని పార్టీ సంస్థల, కొంతమంది పార్టీ కార్యకర్తల మద్దతుతో, రష్యన్‌ శ్రమ జీవుల ఐక్య సంఘటన ఒకటి ఏర్పడింది.

ఈ శ్రమ జీవుల ఐక్య సంఘటన, జనరల్‌ మకషోవ్‌ ను అధ్యక్ష పదవికీ, డా. సెర్గూయేవ్‌ (ఎకనమిక్స్‌)ను ఉపాధ్యక్ష పదవికీ నామినేట్‌ చేసింది. నేను జనరల్‌ మకషోవ్‌ సలహాదారుడిగా ఉన్నాను. ఆ కారణంగా ఎవ్వరూ ప్రతిఘటించలేదని చెప్పడం సరి కాదు. నిజానికి మేము చాలా ప్రతిఘటించాం. రష్యన్‌ కమ్యూనిస్టుల కాంగ్రెసులను నిర్వహించాం. ఐక్య సంఘటనలో ఉన్న పార్టీ సభ్యులంతా గోర్బచేవ్‌ కు వ్యతిరేకంగా నిలిచారు, ఒక కార్యక్రమాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఇలా రాశాము: ʹప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న గోర్బచేవ్‌ కమ్యూనిస్టు వ్యతిరేక ముఠాను పార్టీ నుంచి వెళ్ళగొట్టండి.ʹ

లెనిన్‌ గ్రాడ్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడి హోదాలో నేను, ఈ ప్రతిపాదన పై లెనిన్‌ గ్రాడ్‌ ప్రాంతీయ కమిటీ ప్లీనరీ సమావేశంలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టాను. కాని 17 మంది సభ్యులు మాత్రమే ఈ తీర్మానికి అనుకూలంగా ఓటు చేశారు. కమ్యూనిజం గురించి చాలా మాట్లాడే బిలోవ్‌ లాంటి వారు నా తీర్మానానికి మద్దతునివ్వలేదు. వాళ్ళు గోర్బచేవ్‌ కు వ్యతిరేకంగా ఓటు చెయ్యడానికి ఇష్టపడ లేదు. మేము - దోల్గోవ్‌, జెల్మీవ్‌, నేనూ -ఈ డిమాండు తరఫున గట్టిగా మాట్లాడాం. మేము పార్టీ సంస్థల నిర్ణయాలు సేకరించాం. ఆర్‌.యస్‌.యఫ్‌.యస్‌.ఆర్‌ కమ్యూనిస్టు పార్టీని స్థాపించాం, ఆ పార్టీ కార్యక్రమం తయారు చెయ్యడంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో రివిజనిజం లేదు. అందుకని, చేతిలో ఎర్ర జెండాతో కేపిటలిజం నిర్మించే వారితో మేము కూడా చేతులు కలవాలని ఆశించిన వారు, సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీని, ఆర్‌.ఎస్‌.ఎఫ్‌.ఎస్‌.ఆర్‌ కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. ఇది ఎల్సిన్‌ అధికార ముఠా బాహాటంగా తీసుకున్న విప్లవ ప్రతీఘాత చర్య. ఈ పోరాటం ఎప్పుడూ ఆగలేదు. రష్యన్‌ కమ్యూనిస్టు కార్మికుల పార్టీ, దాని తర్వాత రష్యా కార్మికుల పార్టీ, ఏర్పడ్డాయి. దీనర్థం ఏమిటంటే, ప్రతీఘాత విప్లవాన్ని వ్యతిరేకించే శక్తులు పని చేస్తున్నాయి, పని చేస్తూనే ఉంటాయి.

ఈ వ్యాసాన్ని ముగించే ముందు, ʹసోవియట్‌ యూనియన్‌లో ప్రతీఘాత విప్లవం ప్రారంభమైనప్పుడు అది ఏ మార్గంలో నడిచింది? ఈ ప్రతీఘాత విప్లవంలో ఏ శక్తులున్నాయి?ʹ వంటి ప్రశ్నలకు మొదటి నుంచీ సమాధానం ఇవ్వాలి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇది:

సోవియట్‌ యూనియన్‌లో ప్రతీఘాత విప్లవం 1961లో జరిగింది. కాని దీనికి సన్నాహాలు మాత్రం 1956లోనూ, అంతకు ముందూ, ప్రారంభమయ్యాయి. సోషలిజం కోసం పోరాడిన మహనీయుడు కామ్రేడ్‌ స్టాలిన్‌ పట్ల అతని సహచరుల వైఖరి, కేంద్ర కమిటీలో కూడా ఒక విప్లవ ప్రతీఘాత, కమ్యూనిస్టు వ్యతిరేక ముఠా ఏర్పడిందని సూచిస్తుంది. కాంగ్రెస్‌లో వారు ఓటు చేసిన విధానాన్ని గమనిస్తే, కార్మిక వర్గ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఏకగ్రీవంగా వారు ఎలా ఓటు చేశారో గమనిస్తే, కాంగ్రెస్‌ ప్రతినిధులను ఎలా ఎన్నుకున్నారో స్పష్టమవుతుంది. అంటే కృశ్చేవ్‌ ముఠా యాదృచ్ఛికంగా ఏర్పడినది కాదు. ఈ ముఠా బెరియాను హత్య చెయ్యడం ద్వారా పార్టీ అధికారులను బెదిరించింది. ఇది ఒక చీకటి కోణం. అప్పుడు బెరియా ఇంగ్లీషు గూఢచారి అని చెప్పడం జరిగింది. ఈ ఆరోపణ హాస్యాస్పదమైనది. ఎందుకంటే, బెరియా సోవియట్‌ యూనియన్‌ అణు కార్యక్రమాన్నీ, మిస్సైలు కార్యక్రమాన్నీ పర్యవేక్షించాడు. అదే సమయంలో మాస్కో స్టేట్‌ యూనివర్సిటీని నిర్మించాడు. నిన్న మొన్నటి వరకు స్టాలిన్‌ను ఆకాశానికెత్తిన వ్యక్తులు, స్టాలిన్‌ మీద దాడి జరుగుతుంటే, స్టాలిన్‌ను సమర్థిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడని విషయాన్ని గమనించినప్పుడు, స్టాలిన్‌ గురించి సరియైన అవగాహన చాలా కాలం తర్వాత మాత్రమే ఎందుకు ప్రారంభమైందో స్పష్టమవుతుంది. ఇప్పుడు స్టాలిన్‌ గురించి ఈ సరియైన అవగాహన చాలా బలంగా వ్యాపిస్తోంది. సోవియట్‌ యూనియన్‌ లో ప్రతీఘాత విప్లవం గురించి క్లుప్తంగా మనం చెప్పగలిగేది ఇది.

(ఇన్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ మ్యూనిజం, 2017 ఏప్రిల్‌ 10న అచ్చయిన వ్యాసానికి అనువాదం: తోలేటి జగన్మోహనరావు)

(మిఖయిల్‌ వి. పోపోవ్‌ రష్యాలోని సేంట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ లా ప్రొఫెసర్‌)

Keywords : soviet russia, Mikhail V. Popov, stalin, lenin
(2019-01-20 01:13:54)No. of visitors : 1384

Suggested Posts


0 results

Search Engine

నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
more..


సోవియట్