జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)


జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)

జిగ్నేష్

(వీక్షణం సంపాదకులు ఎన్. వేణు గోపాల్ రాసిన ఈ వ్యాసం ఏప్రెల్, 2018 వీక్షణం సంచికలో ప్రచురించబడినది)

భారత దళిత రాజకీయాలలో కొత్త తారగా ఆవిర్భవించిన జిగ్నేష్ మేవాని ప్రవేశపెట్టిన కొత్త ధోరణులను వాటి పూర్వరంగంలో చర్చించి ప్రగతిశీల శక్తులు గ్రహించవలసిన అంశాలను సూచిస్తున్నారు ఎన్ వేణుగోపాల్

సంఘ్ పరివార్ అధికారం చేపట్టిననాటి నుంచీ దాని విద్వేష రాజకీయాల అనివార్య ప్రతిఫలనంగా ముస్లింల మీద, దళితుల మీద దాడులు పెరిగాయి. మనుధర్మాన్ని, కుల వివక్షను, అంతరాల వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలలో భిన్నాభిప్రాయాల అణచివేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థాగత హత్య, గోరక్షణ పేరుతో దళితుల మీద, ముస్లింల మీద హంతక దాడులు, ప్రజల ఆహార అలవాట్ల మీద, వినోదాల మీద, పండుగల మీద దాడులు వంటి ఎన్నో ఘటనలు ఈ నాలుగు సంవత్సరాలలో పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఇలా పెచ్చరిల్లుతున్న దాడుల మధ్యనే దళితుల ప్రతిఘటన కూడ విస్తరించడం మొదలయింది. ఈ ప్రతిఘటనకు ఒక ప్రధాన చిహ్నంగా గుజరాత్ లో యువ న్యాయవాది జిగ్నేష్ మేవాని ముందుకు వచ్చాడు. గత రెండు సంవత్సరాలుగా జిగ్నేష్ మేవాని ఒక ముఖ్యమైన ప్రతీకగా కొత్త దళిత రాజకీయాల గురించి చర్చ జరుగుతున్నది.

ఈ నేపథ్యంలో ఈ కొత్త దళిత రాజకీయాల గురించి, అసలు మొత్తంగా దళిత రాజకీయాల గురించి, సమాజ పరివర్తనలో దళితుల పాత్ర ప్రాధాన్యత గురించి లోతుగా చర్చించవలసి ఉంది. ప్రత్యేకించి సమాజ పరివర్తన గురించి ఆలోచిస్తున్న, పరివర్తన కోసం వివిధ మార్గాలలో ఆలోచనలూ ఆచరణలూ చేస్తున్న విప్లవ, ప్రగతిశీల శక్తులు చర్చించవలసి ఉంది. ఈ దేశంలో వ్యవస్థ పరివర్తన వంటి దీర్ఘకాలిక మార్పుకు మాత్రమే కాదు, ఏ చిన్న స్థాయి, తాత్కాలిక ప్రగతిశీల మార్పుకైనా దళితుల భాగస్వామ్యం, నాయకత్వం అత్యవసరమైనవి గనుక దళిత రాజకీయాల గురించి, వాటిలో వస్తున్న ధోరణుల గురించి పట్టించుకోవడం విప్లవ, ప్రగతిశీల శక్తులకు అతి కీలకమైన అంశం. ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి అస్పృశ్యత, గ్రామానికి బైట వెలి జీవితం, నీచమైనవిగా భావించే వృత్తులకు పరిమితం చేసిన నిర్బంధం అనే దుర్మార్గమైన సామాజిక పీడనతో, కనీసం రెండు వేల సంవత్సరాలుగా వేదనకు గురవుతున్న ఒక విశాల ప్రజా సమూహంగా దళిత సమూహానికి ఈ వ్యవస్థ పరివర్తన అత్యవసరమైన అంశం. ఆ పరివర్తనా కృషిలో ఆ సమూహానికి కీలక భాగస్వామ్యం, నాయకత్వం ఉండాలి. ఆ సామాజిక పీడననుంచి తమను తాము విముక్తి చేసుకుంటూ మొత్తం సమాజాన్నే విముక్తి చేసే విప్లవ శక్తి ఉన్న సమూహం అది. అయితే అనేక చారిత్రక, సామాజిక, రాజకీయార్థిక కారణాలు ఆ సమూహానికి ఆ పరివర్తనా చైతన్యం కూడ అందకుండా చేశాయి, చేస్తున్నాయి. కార్మిక వర్గానికి కూడ తన సామాజిక చారిత్రక బాధ్యత గురించి సహజమైన విప్లవ చైతన్యం ఏమీ ఉండదని, అది మొదట తనలో తానైన వర్గంగానే ఉంటుందని, క్రమంగా తనకోసం తానైన వర్గంగా మారి విప్లవ కర్తవ్యాలను చేపడుతుందని, చివరికి తనను తాను మాత్రమే కాక తన ప్రత్యర్థి వర్గాన్ని కూడ రద్దు చేసి వర్గ రహిత సమాజాన్ని నిర్మిస్తుందని మార్క్స్ చేసిన విశ్లేషణ భారత దళిత సమూహానికి కూడ వర్తిస్తుంది. తాము అనుభవించిన, అనుభవిస్తున్న పీడన, వేదనల వల్ల అత్యంత విప్లవకరంగా మారి, వ్యవస్థను కూలదోసే బాధ్యత చేపట్టవలసిన భారత దళిత సమూహం కూడ తనలో తానైన కులం స్థాయి నుంచి తనకోసం తానైన కులం స్థాయికి ఎదిగి, అక్కడి నుంచి అసలు మొత్తంగా కుల నిర్మూలన సాధించవలసి ఉంది. ఈ చారిత్రక దృష్టితో చూసినప్పుడు దళిత సమూహాలలో వస్తున్న ప్రతి కదలికా, ప్రతి చైతన్యమూ, ప్రతి ఆచరణా మొత్తంగా భారత సమాజ పరివర్తనా ప్రయాణం మీద తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తాయని గుర్తించి ఆ పరివర్తన గురించి ఆలోచించేవారందరూ వాటిని పట్టించుకోవలసి ఉంది.

వారి మీద అమలయ్యే దోపిడీ పీడనల రీత్యా మాత్రమే కాక వారి జనసంఖ్య రీత్యా కూడ దళితుల రాజకీయాలు మిగతా సమాజమంతా, ప్రత్యేకించి ప్రగతిశీల శక్తులు లోతుగా పట్టించుకోవలసినవి. భారత సమాజపు నిచ్చెనమెట్ల వ్యవస్థలో అట్టడుగున్న ఉన్న దళితులు పదిహేడు శాతం. వారి ప్రయోజనాలకు ఈ వ్యవస్థ ఉనికి, కొనసాగింపు హానికరం. అలాగే వారి కన్న కూడ కింద, లేదా సమాంతరంగా, అసలు సమాజానికే బైట, అడవుల్లో ఉన్న ఆదివాసులు తొమ్మిది శాతం. ఈ రెండు వర్గాలూ కలిస్తే పావు వంతు జనాభా. ఈ పావు వంతు జనాభా ప్రయోజనాలకు ఈ వ్యవస్థ యథాతథ కొనసాగింపు అభ్యంతరకరంగా, హానికరంగా ఉంది. అందువల్ల వ్యవస్థ పరివర్తన గురించి తీవ్రంగా ఆలోచించేవారెవరైనా ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఈ సువిశాల వ్యవస్థా వ్యతిరేక, యథాతథ స్థితి వ్యతిరేక సైన్యం గురించి ఆలోచించక తప్పదు. నిజానికి ఏ సమాజంలోనైనా అత్యంత దుర్భరమైన దోపిడీ పీడనలు అనుభవిస్తున్న సమూహాలకే ఆ దోపిడీ పీడనలు రద్దయ్యే విప్లవం అవసరం ఎక్కువగా ఉంటుంది. అంటే భారత సమాజంలో విప్లవ అవసరం, వ్యవస్థా పరివర్తన అవసరం అన్ని వర్గాల కన్న ఎక్కువ దళిత, ఆదివాసి సమూహాలదే. (భారత సమాజంలోని కుల అంతరాల నిచ్చెన మెట్ల వ్యవస్థ వల్ల మధ్యంతర కులాలుగా, ఉత్పత్తి కులాలుగా, చేతివృత్తుల కులాలుగా పిలవబడుతున్న యాబై-అరవై శాతంలో అత్యధిక భాగం ఈ రెండు సమూహాలతో కలవవలసిన స్థితిలోనే ఉన్నాయి).

దళిత, ఆదివాసి సమూహాలు రెండూ కూడ తరతరాలుగా సమాజానికి బైట ఉంటున్నందువల్ల వారిలో సమరశీలత, తెగింపు, ఆంక్షలను లెక్కచేయని సాహసం కూడ ఎక్కువే. అందువల్ల వీరు ʹతమలో తాముʹ గా ఉన్న స్థితి నుంచి ʹతమ కోసం తాముʹ గా మారినా, మొత్తంగా అంతరాలనే రద్దు చేసే దిశగా మారినా సమాజం తలకిందులైపోతుంది. యథాస్థితి దెబ్బతింటుంది.

దళిత, ఆదివాసి సమూహాలలోని ఈ మహత్తర శక్తిని ప్రగతిశీల శక్తుల కన్న ముందే పాలకవర్గ శక్తులు గుర్తించాయి. అందువల్లనే ఆ సమూహాలను వ్యవస్థను కూలదోసే పోరాటాల వైపు, విప్లవం వైపు వెళ్లకుండా నిరోధించడానికి, తమకోసం తాముగా మారే పరిణామాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. వలసవాద పాలకవర్గాలు రెండు, రెండున్నర శతాబ్దాల కింద ప్రారంభించిన ఆ ప్రయత్నాలు ఇవాళ్టికి కూడ వేరు వేరు రూపాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్రయత్నాలలో భిన్నమైన పాలకవర్గ ప్రయోజనాలకు, ప్రాంతాలకు, పెరుగుతున్న దళిత చైతన్యానికి అనుగుణంగా భిన్నమైన ధోరణులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ స్థూలంగా పాత దళిత రాజకీయాలు అని నిర్వచించవచ్చు. జిగ్నేష్ మేవాని ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్త దళిత రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఆ పాత దళిత రాజకీయాల నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి.

పాత దళిత రాజకీయాలు కనీసం పద్దెనిమిదో శతాబ్ది నుంచీ సాగుతున్నాయి. 1947 అధికార మార్పిడి తర్వాత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలతో అవి మరింతగా విస్తరించాయి. తొలిదశలో విదేశీయులు, దేశంలోని ఇతర సమూహాల వారు ప్రోత్సహించగా, వారి మద్దతుతో అప్పుడప్పుడే తలెత్తుతున్న దళిత చైతన్యం ఈ రాజకీయాలను నిర్వహించింది. అలా ఏడెనిమిది తరాలుగా పాలకవర్గ భావజాలాన్ని ఎంతో కొంత స్వీకరించిన దళిత నాయకత్వమే ఇవాళ్టికీ ఈ పాత దళిత రాజకీయాలను నిర్వహిస్తున్నది. మొత్తం రెండు మూడు శతాబ్దాల చరిత్రను చూసినా, గత ఏడు దశాబ్దాల చరిత్రను చూసినా పాత దళిత రాజకీయాలు పాలకవర్గ రాజకీయాల ప్రభావంలోనే సాగాయి. అంటే దళిత సమస్యను మౌలికంగా అర్థం చేసుకుని పరిష్కార ప్రయత్నాలు చేయడం కాకుండా అపసవ్యంగా చూసి పైపై అతుకులు, మాట్లు వేయడం, వ్యవస్థ పరివర్తన గురించి ఆలోచించకుండా పక్కదారి పట్టించడం, విప్లవం స్థానంలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ రాజకీయాల ప్రధాన లక్ష్యంగా ఉంది.

తొలిదశలో ఈ పాత దళిత రాజకీయాలు వలసవాదం ప్రోత్సహించిన మతాంతరీకరణ చుట్టూ తిరిగాయి. వలసవాదమూ, సంఘ సంస్కరణ ఉద్యమమూ, జాతీయోద్యమమూ ప్రోత్సహించిన సంస్కరణవాదం చుట్టూ తిరిగాయి. తమలో భాగంగా గుర్తించని, వివక్షనూ అస్పృశ్యతనూ పాటించే హిందూ మతాన్ని వదిలి క్రైస్తవంలో చేరితే దళితుల స్థితి మెరుగు పడుతుందని, వారు సమానత్వం సాధించగలరని మతాంతరీకరణ వాదం భావించింది. పేర్లు మార్చుకుంటే, శుభ్రత పాటిస్తే, భోజన, వివాహాలలో కుల ఆంక్షలను మారిస్తే, సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు జరిగితే దళితుల స్థితి ఇతరులతో సమానం అవుతుందని సంస్కరణవాదం భావించింది. నిజానికి ఈ రెండు ఆలోచనల వెనుకా దళితులకు మేలు చేయాలనే కోరిక కూడ ఉండవచ్చు గాని పరిష్కారాలు మాత్రం అమాయకమైనవి. అసమగ్రమైనవి. అవి దళితులలో కొందరి ఆర్థిక, సామాజిక స్థితిని మార్చగలవేమో గాని మొత్తంగా దళితుల మౌలిక స్థితిని, వ్యవస్థను మార్చగల శక్తి ఉన్నవి కావు. ఈ పరిష్కారాలలో కొన్ని రెండు వందల ఏళ్లుగా సాగుతున్నప్పటికీ సమాజ పరివర్తన గాని, దళితుల పట్ల సమానత్వం గాని, దళితుల ప్రధాన సమస్యల పరిష్కారం గాని జరగలేదంటే సమస్య మూలాలు, పరిష్కారాలు మరెక్కడో ఉన్నాయని, ఈ పరిష్కారాలు పూర్తి పరిష్కారాలు కావని గుర్తించక తప్పదు. కాని మొత్తంగా దళిత సమూహంలో మౌలిక, సంపూర్ణ పరిష్కారాల ఆలోచన రాకుండా చూడడంలో పాత దళిత రాజకీయాలు ప్రధాన పాత్ర వహించాయి, వహిస్తున్నాయి.

ఈ ధోరణులకు సమాంతరంగా మొదలై, తర్వాత కాలంలో విస్తరించిన మరో రెండు ప్రయత్నాలు విద్యలో, ఉద్యోగాలలో దళితులకు అంతకంతకూ ఎక్కువ స్థానం కల్పిస్తే దళితులమీద పీడన తగ్గిపోతుందని భావించాయి. అంతకు ముందరి హిందూ బ్రాహ్మణీయ సమాజం శూద్రులకూ దళితులకూ విద్య నిరాకరించిన నేపథ్యంలో ఇది చాల అవసరమైన, ప్రగతిశీల చర్యే. భూస్వామ్య, రాచరిక యుగంలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఎట్లాగూ లేవు, అవి ప్రభువర్గానికీ, ప్రభువు నమ్మిన బంట్లకూ మాత్రమే పరిమితమయ్యేవి గనుక అప్పుడు ఉద్యోగాల గురించి ఆలోచించే అవకాశమే లేదు. వలసవాద ప్రభుత్వంలో, సైన్యంలో, విద్యా రంగంలో, అప్పుడప్పుడే విస్తరిస్తున్న పరిశ్రమల్లో ఉద్యోగ కల్పన పెరిగింది. ఆ ఉద్యోగాలలోకి తక్కువ వేతనాల పనివారు కావాలంటే తప్పనిసరిగా దళితులవైపు చూడవలసిందే. వారికి అందుకు తగిన విద్య బోధించవలసిందే. అలా దళితులకు విద్యా, ఉద్యోగాలు కల్పించడమనే ఉదాత్తమైన పని చేస్తూనే తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే అవకాశం వలసవాద, సంస్కరణ వాద పాలకవర్గాలకు కలిగింది. దానికి ఒక భావజాల సమర్థనగా విద్య, ఉద్యోగాలలో దళితుల ప్రవేశం వారి స్థితిని మెరుగు పరుస్తుందనీ, వారి మీద పీడన నుంచి విముక్తి ఇస్తుందనీ చెప్పుకునే అవకాశం ఎలాగూ ఉండింది. ఈ విద్యా ఉద్యోగాలలో ప్రవేశం ఒక శతాబ్ది పైగానే అమలు జరుగుతున్నప్పటికీ ఇది సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న పీడనను మౌలికంగా మార్చలేకపోయింది. ఎంత ఉన్నత విద్య చదివినా, ఎంత ఉన్నతోద్యోగం సాధించినా అవమానాన్ని, వివక్షను, పీడనను, అస్పృశ్యతను భరిస్తూ ఉండవలసిన స్థితి పెద్దగా మారలేదు.

అలా మతాంతరీకరణ, సంస్కరణ వాద చర్యలు, విద్య, ఉద్యోగం వంటి అన్ని ప్రయత్నాలు కూడ దళితుల స్థితిని గణనీయంగా మార్చలేదని, వారి పట్ల వివక్షను, అస్పృశ్యతను, అసమానతను తొలగించలేదని, ఆ వైఫల్యమే దళితులను మౌలిక సమస్య వైపు చూసేలా చేస్తుందని గుర్తించిన పాలకవర్గాలు కొత్త ఎత్తుగడగా దళితుల విముక్తి మార్గంగా పార్లమెంటరీ రాజకీయాలను ముందుకు తెచ్చాయి. దళితులు సమాజంలో ఒక గణనీయమైన భాగం గనుక ప్రాతినిధ్య రాజకీయాలలో వారికి తప్పనిసరిగా పాత్ర ఉండవలసిందే. కాని ఆ సహజమైన, అనివార్యమైన పని చేస్తూ, అదేదో వారికి చేసిన మెహర్బానీగా అందుకు వారు తమకు కృతజ్ఞులై ఉండాలన్నట్టుగా భారత పాలకవర్గాల పార్లమెంటరీ రాజకీయాలు ఒక వల పన్నాయి. ఈ పార్లమెంటరీ రాజకీయాలలో భాగంగా పుట్టి పెరిగిన పాత దళిత రాజకీయాలు వాస్తవంగా దళిత విముక్తికి చేసిన కృషి ఎంతమాత్రమూ లేకపోగా పీడితులలోనుంచే ఒక చిన్న దళారీ వర్గం సృష్టి అయి పీడకులకు మద్దతుగా నిలిచే స్థితి మొదలయింది. తమకు ఎప్పటికో ఏదో ఒరగబోతుందని అత్యధిక సంఖ్యాక పీడిత దళిత సమూహాలకు భ్రమలు కలిగించడానికి ఈ పాత దళిత రాజకీయాలు వీలు కల్పించాయి. ఒక పీడిత సమూహానికి మొత్తంగా మేలు కల్పించవలసిన చోట ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, పిడికెడు మంది ఆశ్రితులకో మేలు కల్పించి, వారిని పీడక, పాలక వర్గాలలో భాగం చేసుకుని, మధ్యవర్తులుగా, దళారీలుగా, ప్రదర్శన వస్తువులుగా, ఉదాహరణప్రాయంగా మార్చి వేశాయి. పార్లమెంటరీ రాజకీయాలలో వాటానే రాజ్యాధికారంలో, సమాజంలో వాటాగా సంకుచిత నిర్వచనం ఇస్తూ అసలు రాజ్యాధికారం గురించిన, సమానత్వం గురించిన, కుల నిర్మూలన గురించిన అవగాహన నుంచి దళితులను దూరం చేయడానికి పాత దళిత రాజకీయాలు ప్రయత్నించాయి.

అలా పాత దళిత రాజకీయాలలో జరిగిన ప్రయత్నాలూ ప్రయోగాలూ అన్నీ కూడ వ్యవస్థను యథాతథంగా ఉంచడానికే, బలోపేతం చేయడానికే, వ్యవస్థను సమర్థించడానికే తోడ్పడ్డాయి. ఏ ఒక్క ప్రయత్నమూ వ్యవస్థను మార్చవలసిన అవసరాన్ని ప్రచారం చేయలేదు సరిగదా, వ్యవస్థ మార్పు వైపు సాగే ఆలోచనలను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. అసలు భారత సమాజంలో దళితుల సమస్యకు మూలాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, భావజాల స్థాయిలన్నిటిలోనూ ఉన్నాయి. ఆ అన్ని స్థాయిలలోను మౌలికంగా ఆ సమస్యను చేపట్టి పరిష్కార మార్గాలు అన్వేషించడం, ఆ దిశలో నిరంతర ఆలోచన, ఆచరణ అవసరం. అయితే వాటా అనే రాజకీయ పరిష్కారం, ఆత్మగౌరవం అనే సామాజిక సాంస్కృతిక పరిష్కారం, భావజాలంలో పరివర్తన అనే సాంస్కృతిక, చారిత్రక పరిష్కారం విజయం సాధించాలంటే అవన్నీ జమిలిగా జరగడం మాత్రమే కాదు, వాటన్నిటికీ పునాదిని కల్పించే ఆర్థిక పరిష్కారం కూడ జరగాలి. అది కేవలం ఈ తరంలో, ఒకటి రెండు తరాలలో ఆదాయ వనరు కల్పించడంతో కూడ నెరవేరదు. మొత్తంగా దళిత సమూహాలకు ఉత్పత్తి సాధనాల మీద అధికారం రావడం అనే దీర్ఘకాలిక, సుస్థిర పరిష్కారంగా ఉండాలి. భారత సమాజంలో ఇవాళ్టికీ ప్రధాన ఉత్పత్తి సాధనం భూమే గనుక భూమి మీద దళితుల అధికారాన్ని స్థిరపరచాలి. వారే దున్నేవారు గనుక, వారు భూమిలేని నిరుపేదలు గనుక వారికి భూమి పంపిణీ అనేది వారి ఉపాధికీ, జీవికకూ, ఆత్మగౌరవానికీ హామీ ఇస్తుంది. భూమితో, ఇతర ఉత్పత్తి సాధనాలతో సంబంధం లేకుండా దళిత సమస్య పరిష్కారానికి ఎన్ని సూచనలు, ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా అంతిమ ఫలితం గుణాత్మకమైనదిగా, సముచితమైనదిగా ఉండదు.

పాలకవర్గ ప్రోత్సాహంతో ప్రారంభమై, విస్తరిస్తున్న పాత దళిత రాజకీయాల పరిణామాలను, పర్యవసానాలను బైటి నుంచీ లోపలి నుంచీ చూసిన దళితులు, దళితేతర ప్రగతిశీలవాదులు కూడ ఆ రాజకీయాలు సరిపోవని గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం ప్రారంభించారు. మౌలికంగా దళిత సమస్యను పరిష్కరించడం ఎలా అనీ, ఆ అంతిమ పరిష్కారం సాధించే లోపు, పాత దళిత రాజకీయాలలోకి దిగజారిపోకుండా దళిత ఆత్మగౌరవ ఆకాంక్షలు సాధించడం ఎలా అనీ అన్వేషించారు. ఈ ప్రత్యామ్నాయాల అన్వేషణ చరిత్ర కూడ సుదీర్ఘమైనదే. చెప్పాలంటే వలస పాలనా కాలంలోనే, వలసవాదులతో పాటు కలిసి వచ్చిన మిషనరీల ద్వారానే ఈ చరిత్ర మొదలయిందనాలి. మద్రాస్ ప్రెసిడెన్సీలో 1890లలో పనిచేస్తుండిన వెస్లియన్ క్రైస్తవ మిషనరీలు, ప్రత్యేకంగా రెవరెండ్ ఫాదర్ విలియం గౌడీ పంచముల జీవనం మీద ఒక నివేదిక తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించాడు. అప్పటికి అమలులో ఉన్న ప్రభుత్వ విధానాలు దళితుల జీవితాలలో ఏ మార్పూ తేలేదని, వారు అత్యంత దుర్భరమైన పీడనకు గురవుతూ అమానుషమైన పరిస్థితులలో బతుకునీడుస్తున్నారని, వారి స్థితి మెరుగుపడాలంటే వారికి భూమి పంపిణీ చేయడం ఒక్కటే మార్గమని ఆయన సిఫారసు చేశాడు. ఆ నివేదిక కొనసాగింపుగా వచ్చిన పత్రికావార్తలను చూసి అప్పటి చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ జె ఎచ్ ఎ ట్రెమెన్ హీర్ దళితులకు భూపంపిణీ గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు. ఆ ప్రతిపాదన బ్రిటిష్ పార్లమెంటులో చట్టమై, మద్రాసు ప్రభుత్వం 1892 సెప్టెంబర్ లో దళితులకు భూపంపిణీ చేపట్టింది. అయితే దళితులు దేశవ్యాప్తంగా దుర్భర ఆర్థిక దోపిడీనీ సామాజిక పీడననూ అనుభవిస్తుండగా ఏదో ఒకటి రెండు జిల్లాలలో ప్రభుత్వం వైపు నుంచి జరిగిన ఈ ప్రయత్నం నిజమైన ఫలితాన్ని సాధించలేకపోయింది. వలసవాద ప్రభుత్వం కూడ ఆ ప్రయత్నాన్ని విస్తరించడానికి, కొనసాగించడానికి ప్రయత్నించలేదు.

ఆ తర్వాత విభిన్న రాజకీయ పక్షాలూ, దళిత ప్రజా సంఘాలూ ఈ ఆకాంక్షను ఎత్తిపట్టాయి గాని జాతీయోద్యమంలో ఇది ప్రధాన నినాదం కాలేకపోయింది. ఘదర్ పార్టీ నాయకుడు బాబా మంగూరామ్ పంజాబ్ లో దళితులకు భూమి ఇవ్వాలనే ఉద్యమాన్ని నడిపారు. డా. బి ఆర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో మరాఠ్వాడలో, కొంకణ్ లో 1950లలో భూపోరాటాలు జరిగాయి. రిపబ్లికన్ పార్టీ నాయకత్వంలో దళితులకు భూమి నినాదంపై 1964 డిసెంబర్ నుంచి 1965 ఫిబ్రవరి వరకు జరిగిన ఆందోళనలో ముప్పై లక్షల మంది దళితులు జైళ్లకు వెళ్లారు. దళితుల సమస్యల ప్రత్యేకతను ఈ దేశంలో కమ్యూనిస్టులు గుర్తించలేదని ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ, వాస్తవంగా దళితుల, పీడితుల దోపిడీ పీడనల పరిష్కారానికి మూలం భూమి సమస్యలో ఉన్నదనే మౌలిక అవగాహనతోనే కమ్యూనిస్టులు పనిచేశారు. ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి నుంచీ ఈ దేశ పీడితుల సమస్య వారికి ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం లేకపోవడంలోనే ఉన్నదని కమ్యూనిస్టులు భావించారు. దానితోపాటు సామాజిక పీడన అంశానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించవచ్చు గాని మౌలికంగా దున్నేవారికే భూమి నినాదం దళితుల మనుగడ సమస్యనూ ఆత్మగౌరవ సమస్యనూ తన పరిధిలోకి తీసుకుంది. ఆ అవగాహనను నక్సల్బరీ మరింత పదునెక్కించడం మాత్రమే కాక, తీవ్రతరమవుతున్న వర్గపోరాట సందర్భంలో సామాజిక పీడన అంశం మీద కూడ కేంద్రీకరణను పెంచుతూ వచ్చింది.

ఈ నేపథ్యంలో దళిత చైతన్యాన్ని భూమి సమస్య నుంచి, మౌలిక సమస్య నుంచి పక్కకు తప్పించడానికి, దళితులు పార్లమెంటరీ భ్రమల్లో కూరుకుపోయి, వ్యవస్థ పరివర్తన కర్తవ్యం నుంచి విముఖులు కావడానికి పాత దళిత రాజకీయాలు తమ ప్రయత్నాలను ఇనుమడింపజేశాయి. పార్లమెంటరీ భ్రమలను, విద్యా, ఉద్యోగ భ్రమలను ఎంతగా పెంచాయంటే అవి డా బి ఆర్ అంబేద్కర్ చెప్పిన బోధన-సమీకరణ-పోరాటం సాగించినప్పుడు కూడ మౌలిక సమస్యల ప్రస్తావన లేకుండానే, కులనిర్మూలన ఆశయం లేకుండానే సంస్కరణలనే పరిష్కారాలుగా చూపించాయి. నిజానికి డా. బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగపు పరిమితుల గురించీ, రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందినవారు తమ సమూహానికి చేయవలసిన దోహదం గురించీ చెప్పిన మాటలను కూడ ఈ పాత దళిత రాజకీయాలు పెడచెవిన పెట్టాయి. అన్ని పాలకవర్గ పార్టీలలో దళిత నాయకులు ఆ పాలకవర్గ పార్టీలకు ప్రజల్లో, దళితుల్లో మద్దతు సంపాదించి పెట్టడానికి, వ్యవస్థ యథాతథంగా నిలవడానికీ ఉపయోగపడడం ప్రారంభమయింది.

మరొకవైపు దళితుల్లో ఆ మాత్రం పెరుగుతున్న చైతన్యాన్ని, విద్యను, ఉద్యోగావకాశాలను కూడ సహించలేని ఆధిపత్య కులాలు, వర్గాలు దళితులను అణచి ఉంచడానికి పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించాయి. 1968 కీలవేన్మణి నుంచి ప్రారంభించి బెల్చీ, పదిరికుప్పం, కారంచేడు, చుండూరు, బథానీ టోలా, మేళవలవు, లక్ష్మణ్ పూర్ బాథే, వేంపెంట, ఖైర్లాంజి, లక్షింపేట, గరగపర్రు దాకా దళితుల మీద జరిగిన వేలాది దాడుల్లో ప్రధానమైన అంశం దళితుల్లో వ్యక్తమవుతున్న ఆత్మగౌరవాన్ని, తమ వాటా తమకు దక్కాలనే ఆకాంక్షను ఉక్కుపాదంతో కాలరాయడమే. ఈ దాడుల నేపథ్యంలో దళితులను మరింత చైతన్యీకరించి, సమీకరించి, పోరాటానికి సిద్ధం చేసి, సమరశీల పోరాటాలకూ, వ్యవస్థ పరివర్తనకూ నాయకత్వం వహించాలనే కర్తవ్యం తమ తలుపు తడుతున్నప్పుడు పాత దళిత రాజకీయ నాయకత్వం మళ్లీ మళ్లీ పార్లమెంటరీ, చట్టబద్ధ, వ్యవస్థాంతర్గత భ్రమలు పెంచి పోషించడానికీ, తమ వెనుక ఉన్న దళిత సమూహాలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించింది. పాలకవర్గ ముఠా తగాదాలలో ఒక్కో సమయంలో ఒక ముఠాకు మద్దతు ఇస్తూ, మొత్తంగా పాలకవర్గ దోపిడీ పీడనలను యథాతథంగా కాపాడుతూ, తమ స్థానాలు పదిలంగా కాపాడుకుంటూ వచ్చింది.

ఈ పరిణామాలకు వ్యక్తుల స్థాయిలో, పార్టీల స్థాయిలో, వేరువేరు రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు గాని మొత్తం మీద గత ఒకటిన్నర శతాబ్దాల, ముఖ్యంగా గత ఏడు దశాబ్దాల పాత దళిత రాజకీయాల సారాంశాన్ని చెప్పాలంటే, అవి ప్రధానంగా ఐదు అంశాలుగా గుర్తించవచ్చు:

1. దళితుల విద్య, ఉద్యోగాలు, ఆత్మగౌరవం వంటి దళితుల నిజమైన సమస్యల మీద పోరాడినప్పటికీ, ఎంతో కొంత విజయం సాధించినప్పటికీ ఆ సమస్యలకు మూలమైన మౌలిక పరిష్కారం వైపు, ఉత్పత్తి సాధనాల యాజమాన్యం వైపు వెళ్లలేదు. ఉద్దేశపూర్వకంగా చేసినా, అమాయకంగా చేసినా పార్లమెంటరీ భ్రమలు, విద్యా, ఉద్యోగ భ్రమలు కల్పించడం ద్వారా దళితులను మౌలిక పరిష్కారం వైపు వెళ్లకుండా ఆపిన అంతిమ ఫలితమే మిగిలింది.

2. దళితులకు, పీడితులకు దక్కవలసిన రాజ్యాధికారాన్ని, సమాజంలో సమాన అధికారాన్ని పాత దళిత రాజకీయాలు కేవలం ప్రభుత్వాధికారంలో వాటాగా కుదించి చూశాయి, చూపాయి. తద్వారా పాలకవర్గాల కనుసన్నలలో పనిచేసే ఒక చిన్న దళారీ వర్గాన్ని తయారు చేయడానికీ, అంటే మౌలికంగా అసంఖ్యాక దళిత ప్రజానీకాన్ని యథాస్థితిలో ఉంచడానికీ ఈ పాత దళిత రాజకీయాలు ఉపయోగపడ్డాయి.

3. బోధించు, సమీకరించు, పోరాడు అని డా. బి ఆర్ అంబేద్కర్ ఇచ్చిన అద్భుతమైన, శక్తిమంతమైన నినాదానికి పాత దళిత రాజకీయాలు తప్పుడు, సంకుచిత అర్థం ఇచ్చి ఆ నినాదపు శక్తిని పోగొట్టాయి. దళితులకు అవసరమైన బోధనను, చైతన్యాన్ని ఇవ్వలేదు. దళితులను సమీకరించాయి గాని ఎక్కువసార్లు దళిత ప్రయోజనాలకు భిన్నమైన పాలకవర్గ, ఆధిపత్య కుల రాజకీయాల అవసరాల కోసమే ఆ సమీకరణలు సాగాయి. దళితులు నిజంగా సాగించవలసిన కులనిర్మూలన, వ్యవస్థ పరివర్తన మౌలిక పోరాటాల వైపు కాకుండా తాత్కాలిక, సంస్కరణవాద ప్రయోజనాల పరిమితుల్లోనే పోరాటాలు సాగించాయి.

4. కుల అస్తిత్వాన్ని ప్రధానం చేయడం ద్వారా ఈ పాత దళిత రాజకీయాలు అంబేద్కర్ ఆకాంక్షించిన కుల నిర్మూలన ఆశయానికే తూట్లు పొడిచాయి. అంతకన్న ముఖ్యంగా దళితులను మిగిలిన పీడితులతో కలవకుండా ఒంటరులను చేశాయి. పుట్టుకే అవకాశాలనూ పరిమితులనూ నిర్ణయిస్తుందన్న మనుస్మృతిని కూలదోయవలసిన దళితులను ఈ పాత దళిత రాజకీయాలు పుట్టుకను ఏకైకంగా చూసే తప్పుడు భావజాలంలో ముంచివేశాయి. పుట్టుక ప్రాధాన్యతను గుర్తిస్తూనే ఒక మనిషి ప్రవర్తనలో, సమాజీకరణ, అధ్యయనం, ఆచరణ, విలువలు, భావజాలం కూడ ప్రధాన పాత్ర వహిస్తాయనే అంశాన్ని దళితుల అవగాహన నుంచి దూరం చేయడానికి ప్రయత్నించాయి. తద్వారా తాము ఎంతగా పాలకవర్గ, అగ్రవర్ణ బానిసత్వం, దళారీతనం చేస్తున్నా, తమ పుట్టుక వల్ల దళిత నాయకులుగా ఉండే అవకాశాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం చేశాయి.

5. ఎప్పటికప్పుడు దళితుల మీద దాడులు పెరుగుతుంటే, తత్ఫలితంగా దళితులలో చైతన్యం, సమరశీలత, ప్రతిఘటనా వాంఛ పెరుగుతుంటే, పాత దళిత రాజకీయాలు ఆ చైతన్యాన్ని, సమరశీలతను పక్కదారి పట్టించడానికి, ఆ ప్రతిఘటనా వాంఛను మొద్దుబార్చడానికి ప్రయత్నించాయి. తద్వారా సమాజ పరివర్తనకు ఉపయోగపడవలసిన దళిత చైతన్యాన్ని పక్కదారి పట్టించి యథాస్థితి కొనసాగడానికి, వ్యవస్థ మార్పు లేకుండా పదిలంగా ఉండడానికి తమవంతు కృషి చేశాయి.

పాత దళిత రాజకీయాలు వ్యవస్థను పరిరక్షించడానికి వేరువేరు రూపాల్లో, వేరు వేరు ఆకర్షణీయ, తప్పుడు నినాదాలతో ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, నానాటికీ మారుతున్న భౌతిక పరిస్థితులే, పెరిగిపోతున్న ఆధిపత్య కుల, మత ఉన్మాదమే, మనుస్మృతిని మనసా వాచా కర్మణా నమ్మే సంఘ్ పరివార్ పాలనే, దళితుల మీద పెచ్చరిల్లుతున్న దాడులే కొత్త దళిత రాజకీయాలు పుట్టుకురావడానికి కారణమయ్యాయి. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు కారణమవుతాయనే గతితార్కిక సూత్రానికి నిదర్శనంగా కొత్త దళిత రాజకీయ ధోరణులు పెల్లుబికాయి. అయితే ఎటువంటి గుణాత్మక మార్పుకైనా ప్రోద్బలమైన ఘటనో పరిణామమో ఉంటుంది. కొత్త దళిత రాజకీయాల పుట్టుకకు ఊనా ఘటన అటువంటి ప్రోద్బలం చేసింది.

గుజరాత్ లోని సౌరాష్ట్రలో గిర్ సోమనాథ్ జిల్లాలో చిన్న పట్టణమైన ఊనాలో 2016 జూలై 11న గోరక్షకులమని చెప్పుకునే సంఘ్ పరివార్ గూండాలు దళిత యువకులను నలుగురిని కారుకు కట్టేసి కొరడాలతో కొడుతూ హింసించారు. చచ్చిన పశు కళేబరాలను శుభ్రం చేసే ʹనీచమైనʹ పని దళితులది మాత్రమేనని నిర్దేశించిన హిందూ ధర్మ పరిరక్షకులే, ఆ పనే చేస్తున్న దళితుల మీద బతికి ఉన్న ʹగోమాతʹను చంపి తోలు ఒలుస్తున్నారనే అబద్ధపు ఆరోపణతో ఈ హింసకు ఒడిగట్టారు. అసమానత మీద, అణచివేత మీద, అబద్ధాల మీద ఆధారపడిన ఇటువంటి అవమానాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు తరతరాలుగా దళితులు అనుభవిస్తున్నవే. ఈసారి మాత్రం ఈ ఘటనను చిత్రించిన వీడియో విపరీతంగా ప్రచారం కావడంతో దళితుల్లో, దళితులపై అణచివేతను వ్యతిరేకించేవారిలో పేరుకున్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతో కాలపు పరిమాణాత్మక మార్పులే ఒక చిన్న కారణంతో గుణాత్మక మార్పులుగా మారుతాయి. ఎప్పటినుంచో పొందుతున్న అనుభవమే అయినా, ఈ సారి అనుభవం విస్ఫోటనానికి కారణమయింది. చచ్చిపోయిన ఆవు తోలు ఒలిచే వృత్తిని తమకు అంటగట్టినవారే, ఆ పని చేస్తున్నందుకే వేధించినప్పుడు, ఆ వేధింపుల వెనుక ఉన్న హిందుత్వ భావజాలం మీద కసి ఉవ్వెత్తున ఎగసిపడింది.

తర్వాత మూడు వారాలు గుజరాత్ దళితవాడలన్నీ అట్టుడికిపోయాయి. పశువుల కళేబరాలను శుభ్రం చేయడం, పారిశుధ్యం పేరుతో సాగే నీచమైన, అమానుషమైన పనులు, వేల ఏళ్లుగా హిందూ బ్రాహ్మణీయ సమాజం దళితులకు మాత్రమే ʹరిజర్వ్ʹ చేసిన పనులు ఇంకెంత మాత్రమూ తాము చేయబోమని దళితులు ప్రకటించడం మొదలుపెట్టారు. మృత పశువులను తీసుకువెళ్లి ప్రభుత్వ కార్యాలయాల్లో పడేశారు. మనువాద ఆదేశాలను తిరస్కరించడం ఆచరణాత్మకంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దళిత, ప్రగతిశీల శిబిరాల నుంచీ, బుద్ధిజీవుల నుంచీ గుజరాత్ దళితులకు మద్దతు అందింది. గుజరాతీ దళిత కథారచయిత అమృత్ లాల్ మక్వానా తనకు అంతకు ముందు అందిన దాసీ జీవన్ ఉత్తమ రచయిత అవార్డును ఊనా దురంతానికి నిరసనగా వెనక్కి ఇచ్చేశారు. ఊనా దళిత్ అత్యాచార్ లడాయి సమితి అనే రాజకీయేతర సామాజిక ఉద్యమ సంస్థ పుట్టుకొచ్చింది.

ఊనా దురంతానికి నిరసనగా న్యాయవాది, సామాజిక కార్యకర్త జిగ్నేష్ మేవానీ నాయకత్వాన ఆగస్ట్ 5న అహ్మదాబాద్ నుంచి ʹచలో ఊనాʹ అంటూ దళిత అస్మితా యాత్ర ప్రారంభమయింది. దారి పొడవునా ప్రతి గ్రామం నుంచీ దళితులు, ముస్లింలు ఆ యాత్రలో భాగమయ్యారు. దేశం నలుమూలల నుంచీ వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు, దళిత్ పాంథర్లు, కబీర్ కళా మంచ్ కళాకారులు, గాంధేయవాదులు, ప్రగతిశీల శక్తులు పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రవేశించిన ప్రతి గ్రామంలోను దళితులు ఇక ముందు తాము చచ్చిన పశువుల కళేబరాలను ముట్టుకోబోమని ప్రతిజ్ఞ చేశారు. ఆగస్ట్ 15న పాలకవర్గాలు ʹస్వాతంత్ర్య దినంʹ జరుపుకుంటున్నప్పుడు, ఊనా లో బహిరంగ సభ జరిగింది. అహ్మదాబాద్ లో 70 మందితో ప్రారంభమైన యాత్ర ఊనా బహిరంగ సభ నాటికి పదిహేను వేల మందికి చేరింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వ్యవస్థీకృత హత్యకు బలి అయిన రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ʹగోమాత మీ తల్లి అంటున్నారు గదా, ఆమె చచ్చిపోయినప్పుడు మీరే చివరి పనులు చేయండిʹ అంటూ ఇకముందు మృత పశు కళేబరాలు తాము ముట్టుకోబోమని, వాటి తోలు ఒలవడం, చర్మం శుభ్రం చేయడం, పాదరక్షలు కుట్టడం వంటి పనులేవీ చేయబోమని ప్రదర్శకులు ప్రకటించారు. మనుషుల మలమూత్రాలు ఎత్తిపోసే పని, మురికి కాలువలు శుభ్రం చేసే పని కూడ ఇకముందు చేయబోమని ప్రకటించారు. ʹగాయ్ ని పుచ్దూ తామీ రఖో, అమ్నె అమారీ జమీన్ ఆపోʹ (గోమాత తోక మీరే ఉంచుకోండి, మా భూమి మాకివ్వండి) అని మౌలిక భూసమస్యను ఎత్తిపట్టారు.

ఈ ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి దిగిపోవలసి వచ్చింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గోరక్షకులు చేస్తున్న దౌర్జన్యాలను ఖండించి, దళితుల మీద దాడి చేసేవారు మొట్టమొదట తన మీద దాడి చేయాలని అబద్ధపు హెచ్చరికలు వినిపించవలసి వచ్చింది. ఈ పోరాటం నష్ట పరిహారం కోసం కాదనీ, రాజకీయ పార్టీల చేతుల్లో పెట్టడానికి కాదనీ, దళితులకు సామాజిక న్యాయం కోసమేననీ మేవానీ అన్నాడు. సామాజిక న్యాయం చిట్టచివరికి వీథుల్లో పోరాటంతోనే సాధ్యమవుతుందనీ, అంతిమంగా దళితులకు భూమి దక్కడమే పరిష్కారమనీ అన్నాడు. ఆ రకంగా ఈ ఉద్యమం మనువాదం నిర్దేశించిన వర్ణధర్మాన్ని ధిక్కరించింది. వీథుల్లో పోరాట అవసరాన్ని ఎత్తిపట్టింది. మౌలికమైన భూసమస్యను గుర్తించింది.

ఇంకా వుంది..

Keywords : jignesh mewani,modi,rahul,india,daliths,politics,cast,new war,up,unity,
(2018-12-14 08:42:07)No. of visitors : 933

Suggested Posts


జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)

భారత దళిత రాజకీయాలలో కొత్త తారగా ఆవిర్భవించిన జిగ్నేష్ మేవాని ప్రవేశపెట్టిన కొత్త ధోరణులను వాటి పూర్వరంగంలో చర్చించి ప్రగతిశీల శక్తులు గ్రహించవలసిన అంశాలను సూచిస్తున్నారు ఎన్ వేణుగోపాల్

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


జిగ్నేష్