జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)

జిగ్నేష్

రెండవ బాగం...

జిగ్నేష్ మేవానీ చమార్ కులంలో పుట్టి, ఇంగ్లిష్ సాహిత్యం, జర్నలిజం, న్యాయశాస్త్రం చదువుకుని, కొంతకాలం ఒక పత్రికా విలేఖరిగా కూడ పనిచేసి నాలుగు సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తున్న యువ దళిత నాయకుడు. ఆయన నాయకత్వంలో జరిగిన ఊనా దళిత పోరాటం కచ్చితంగా పాత దళిత రాజకీయాలనుంచి కనీసం మూడు విషయాల్లో తనను తాను వేరు చేసుకున్నది. ఒకటి, ఇది మనుస్మృతినీ, వర్ణాశ్రమ ధర్మాన్నీ, సమాజంలో నిర్బంధ పూరితంగా, కుల మత కట్టుబాట్లతో అమలవుతున్న శ్రమ విభజననూ ఆచరణాత్మకంగా ప్రతిఘటించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 చేసిన మనుస్మృతి దహనం మనుధర్మం మీద ఒక ప్రతీకాత్మక సవాల్ కాగా, పశు కళేబరాలు శుభ్రం చేయబోమని ఈ ఉద్యమం చేసిన ప్రకటన మనుస్మృతి దహనానికి కొనసాగింపూ, ఆచరణాత్మక అన్వయమూ కూడ. మనుస్మృతికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే మనుధర్మపు పాలకవర్గాలకు ఊడిగం చేస్తూ వచ్చిన పాత దళిత రాజకీయాల చరిత్రకు ఇది భిన్నమైనది. రెండు, పాత దళిత రాజకీయాలు దళిత సమస్య పరిష్కారాన్ని విద్యకు, ఉద్యోగాలకు, పార్లమెంటరీ స్థానాలకు, ఆత్మగౌరవ ప్రకటనకు కుదించగా, ఈ కొత్త దళిత రాజకీయాలు అవి సాధించాలన్నా, అంతకు మించినవి సాధించాలన్నా వీథుల్లో పోరాటానికి సిద్ధపడాలని ప్రకటించి, ఆచరణలో చూపాయి. మూడు, దళిత సమస్యకు అంతిమ పరిష్కారం మౌలిక భూసమస్య పరిష్కారంలో ఉన్నదని ఈ కొత్త దళిత రాజకీయాలు బలంగా ప్రకటించాయి.

ఇవి కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతే పాత దళిత రాజకీయాలే కొత్త రూపంలో వస్తున్నాయని అనుమానించే ఆస్కారం ఉండేది. కాని నాలుగు వారాలు తిరగకుండానే అహ్మదాబాద్ జిల్లా సరోదా గ్రామంలో భూమి పోరాటం సాగించి జిగ్నేష్ మేవాని ఇవి నిజంగా కొత్త దళిత రాజకీయాలేనని రుజువు చేశాడు. ఎప్పుడో 2006లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూమి, తొంబై రోజుల లోపల లబ్ధిదారులకు అప్పగించాలని చట్టం నిర్దేశిస్తున్నప్పటికీ, ఇప్పటి దాకా దళితులకు దక్కలేదు. కాగితం మీద దళితులకు దక్కిన ఆ భూమి ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉండిపోయింది. ఈ కాగితం మీది భూసంస్కరణలను సవాల్ చేయాలనీ, దున్నేవారికే భూమి ఆదర్శంతో ప్రతి దళిత కుటుంబానికీ ఐదు ఎకరాల భూమి ఇవ్వాలనీ, కార్పొరేట్ శక్తులకు భూమి కట్టబెట్టడాన్ని మానుకుని దున్నేవారికే భూమి ఇవ్వాలనీ జిగ్నేష్ మేవానీ డిమాండ్ చేశాడు. పది సంవత్సరాల కింద సరోదా లో 115 దళిత కుటుంబాలకు కాగితాల మీద అందిన 220 బీగాల భూమి ఈ ఉద్యమం వల్ల వాస్తవంగా అందింది.

ఆ సందర్భంగానే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జిగ్నేష్ మేవానీ కొత్త దళిత రాజకీయాల విశిష్టతను స్పష్టం చేశాడు. జరగవలసిన పని కుల వ్యతిరేక నినాదాలు మాత్రం ఇస్తూ, అస్తిత్వవాదంలో కూరుకుపోవడం కాదని ఆయన అన్నాడు. అస్తిత్వ వాదంలో అనుకూల అంశాలు ఉన్నట్టే ప్రతికూల అంశాలు కూడ ఉన్నాయని గుర్తు చేశాడు. అస్తిత్వ పోరాటాన్నీ భౌతిక పునాదినీ సమ్మేళనం చేయకుండా ఏమీ సాధించలేమని, అప్పటిదాకా సాగుతున్న అస్తిత్వవాదం భౌతిక పునాదితో సంబంధం లేని శుష్కచర్చ చేస్తున్నదని అన్నాడు. భౌతిక సమస్యలు దళిత రాజకీయాలకు హృదయ స్థానంలో ఉండాలన్నాడు. ఇంతకాలం దళితులూ వామపక్షాలూ కూడ తప్పులు చేశారని, కాని దళితులు వామపక్షాలను మిత్రులుగా గుర్తించాలని అన్నాడు. ఈ మాటకు దళితులు వామపక్షాల వైపు వెళ్లడమో, వామపక్షాలు దళితుల వైపు వెళ్లడమో అనే అర్థం చెప్పగూడదని, దళితులే వామపక్షాలు, వామపక్షాలే దళితులు అనే స్థితి రావాలని అన్నాడు. ప్రస్తుత స్థితిలో కాషాయ రాజకీయాల ప్రతిఘటన ప్రధాన లక్ష్యం కావాలన్నాడు. కాషాయీకరణను వ్యతిరేకించడం దళితులకు ప్రధానమైన కర్తవ్యం కావాలన్నాడు. విశాల పీడిత ఐక్యత కావాలన్నాడు. పేదల, భూమిహీనుల పోరాటం ఎప్పుడూ వ్యక్తిగతం కాదని, అందువల్ల అటువంటి పోరాటాలు ఎప్పుడూ ఒకే వ్యక్తి చుట్టూ తిరగగూడదని, సమష్టి రాజకీయాలు కావాలని అన్నాడు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కోసమే ఈ పోరాటం అన్నాడు.

ఒక సంవత్సరం గడిచేసరికి ఈ ఆలోచనల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ 2017 ఇంటర్వ్యూలో కూడ ఫాసిజాన్ని ఓడించడం తక్షణ కర్తవ్యమనీ, అది ఎన్నికల ద్వారా జరగదనీ, అది దీర్ఘకాలిక పోరాటమనీ అన్నాడు. అదే సమయంలో ఒక మధ్యంతర పరిష్కారంగా, ఉపశమనంగా భారతీయ జనతా పార్టీని ఓడించడం మొదటి లక్ష్యంగా గ్రహించాలన్నాడు. 2017 డిసెంబర్ వచ్చే నాటికి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడ పాల్గొని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మద్దతుతో శాసన సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అప్పటికి రెండు సంవత్సరాలుగా ప్రకటిస్తున్న కొత్త దళిత రాజకీయాలను కూడ మళ్లీ పార్లమెంటరీ భ్రమల్లో ముంచివేస్తాడా అనే అనుమానం కలిగించాడు. ఈ సందర్భంలోనే ఇటు పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ఇస్తున్న లాల్ నీల్ ఐక్యత అనే నినాదంతో కూడ ఏకమయ్యాడు. నిజానికి ఈ లాల్ నీల్ ఐక్యత అనేది పార్లమెంటరీ పార్టీల అవకాశవాద నినాదమే తప్ప నిజమైన దళితుల విముక్తి మార్గమేమీ కాదు. ఈ నినాదంలోని లాల్ ఇంకెంతమాత్రమూ శ్రామికవర్గాల ఆశాజ్యోతి అయిన ఎరుపు కాదు. అది ఎప్పుడో పార్లమెంటరీ రాజకీయాలలో వెలిసిపోయింది. ఈ దేశంలో దోపిడీ పాలకవర్గాలతో కలిసిపోయింది. నీల్ దళిత బహుజనుల పక్షాన ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంటరీ పార్టీల జెండా రంగే తప్ప అది మొత్తంగా దళిట సమూహాలకు ప్రతీక ఏమీ కాదు. ప్రజాశక్తులకు ప్రతీక కాని లాల్, దళితులకు ప్రతీక కాని నీల్, కేవలం తమను తాము లాల్ అనీ నీల్ అనీ పిలుచుకుంటున్న పార్లమెంటరీ అవకాశవాద రాజకీయ శక్తుల అధికార వెంపరలాట నినాదమే తప్ప లాల్ నీల్ అనే మాటకూ ఈ దేశంలో జరగవలసిన సమాజ పరివర్తనకూ ఏమీ సంబంధం లేదు. జరగవలసింది సకల పీడితశక్తుల ఐక్యత. అందులో తప్పనిసరిగా విప్లవశక్తులు ఉండాలి, దళిత ప్రజానీకం ఉండాలి. ఆ సంఘటిత శక్తి మౌలిక సమస్యల మీద పోరాటాన్నీ, తక్షణ సమస్యల మీద పోరాటాన్నీ కలగలపాలి.

ప్రభావంలో జిగ్నేష్ మేవాని అంత శక్తిమంతంగా లేకపోయినా, జిగ్నేష్ మేవాని లాగ భూమి సమస్యను ప్రధానాంశంగా తీసుకురాకపోయినా, కొత్త దళిత రాజకీయాలకు మరొక వ్యక్తీకరణ ఉత్తరప్రదేశ్ లో చంద్రశేఖర్ ఆజాద్ రావణ్. జాతవ్ కులంలో పుట్టిన చంద్రశేఖర్ ఆజాద్ దళిత రాజకీయాలకు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో అలవాటైన అధికార లాలసనూ, అవకాశవాదాన్నీ, వ్యవస్థ లోపలి పరిష్కారాలనూ, పార్లమెంటరీ వ్యవస్థల పట్ల భ్రమలనూ ప్రశ్నిస్తున్నాడు. భీం సేన ఏర్పాటు చేసి దళితులలో సమరశీల చైతన్యానికీ, వీథుల్లో పోరాటానికీ దారి తీస్తున్నాడు. ఈ సమరశీలత పాత సంస్కరణవాద, రాజీవాద దళిత రాజకీయాలకు సవాల్ గనుకనే ఆయన మీద, ఆయన ఉద్యమం మీద తీవ్రమైన నిర్బంధం కూడ అమలవుతున్నది.

వ్యక్తులుగా జిగ్నేష్ మేవాని, చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, సామాజిక సంచలనాలుగా ఊనా అనంతర దళిత చైతన్యం, భీం సేన తీసుకువచ్చిన కొత్త దళిత రాజకీయాలు ముందుకు సాగుతాయా, నడుమ తడబడి మునిగిపోతాయా కాలమే తేలుస్తుంది. అయితే ఈ కొత్త దళిత రాజకీయాలు తడబడి పడిపోకుండా కాపాడవలసిన, వాటికి బలం ఇవ్వవలసిన బాధ్యత విప్లవ ప్రగతిశీల ప్రజా శక్తులపైనే ఉంది. కొత్త దళిత రాజకీయాలు ఏ మార్పులు తీసుకువచ్చాయో, ఏ మార్పులను ముందుకు తీసుకుపోవాలో గుర్తించి బలపరచవలసింది విప్లవ ప్రగతిశీల శక్తులే. కొత్త దళిత రాజకీయాలు ఎక్కడ తడబడుతున్నాయో గుర్తించి స్నేహపూర్వక సవరణలతో ఆ ధోరణిని బలోపేతం చేయవలసింది విప్లవ ప్రగతిశీల శక్తులే. ఆ పని చేయాలంటే కొత్త దళిత రాజకీయాల ప్రత్యేకతలేమిటో అర్థం చేసుకోవాలి.

పైన చూసిన పాత దళిత రాజకీయాల సారాంశమైన ఐదు అంశాలలోను కొత్త దళిత రాజకీయాలు మార్పు తీసుకు వచ్చాయి. ఈ మార్పు కొన్ని అంశాల్లో గుణాత్మకంగా మౌలికమైనది, కొన్ని అంశాలలో కేవలం పరిమాణాత్మకంగా భిన్నమైనది. కొన్ని అంశాల్లో పాతనే కొనసాగించినది.

1. ఊనా ఘటన తర్వాత ఉధృతమైన కొత్త దళిత రాజకీయాలలో దళిత ఆత్మగౌరవం, వివక్ష పట్ల వ్యతిరేకతతో పాటుగా, ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూమి మీద దళితులకు అధికారం అనే మౌలిక అంశం చర్చలోకి వచ్చింది. ఇది తప్పనిసరిగా ముందుకు తీసుకుపోవలసినది. ఇది దళితుల సమస్యకు, మొత్తంగా భారత సమాజ సమస్యలకు అంతిమ పరిష్కారం అనే అంశాన్ని ప్రచారం చేయవలసి ఉంది.

2. కనీసం ఏడాది, ఏడాదిన్నర పాటు కొత్త దళిత రాజకీయాలు కొనసాగుతున్న పార్లమెంటరీ వ్యవస్థలో తమ వాటా అనే కుదింపువాదానికి పరిమితం కాలేదు. ఆ తర్వాత స్వయంగా జిగ్నేష్ మేవానియే ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యుడు కూడ అయ్యాడు. మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే పేరుమీద నడుస్తున్న అవకాశవాద పొత్తులు, కలయికలు అన్నీ కూడ ఆయన ఎన్నికలోనూ పనిచేశాయి. శాసనసభ్యుడు అయిన తర్వాత కూడ బైట వేదికల మీద మౌలిక ఆలోచనలు ప్రకటిస్తున్నాడు గాని శాసనసభ కేవలం బాతాఖానీ క్లబ్బు అనీ, అక్కడ నిజమైన ప్రజల విషయాలు చర్చించడానికి కనీస అవకాశం కూడ దొరకదని గుర్తించినట్టు కనబడడం లేదు. ఈ అంశంలో కొత్త దళిత రాజకీయాలలో అనుకూల, ప్రతికూల అంశాలు రెండూ ఉన్నాయి.

3. బోధించు, సమీకరించు, పోరాడు అనేది భారత సమాజంలో అత్యవసరమైన నినాదం. ఇక్కడ ఒక బూర్జువా ప్రజాస్వామిక విప్లవం కూడ జరగలేదు గనుక, వ్యక్తి రూపొందడమే జరగలేదు గనుక ఇక్కడ సమాజానికి బోధించవలసిన అవసరం చాల ఉంది. ఆ బోధన మౌలిక విషయాల మీద జరగకపోయినా, బోధన పేరుతో తప్పుడు చైతన్యం అందించడం జరిగినా, బోధకుల వ్యక్తి ఆరాధన పెరిగినా ఉన్న భూస్వామిక విలువల వల్ల సమీకరణ జరగవచ్చు గాని అది భజన బృందం వంటి సమీకరణే అవుతుంది. అటువంటి సమీకరణ తప్పుడు పోరాటాలు చేయడానికి పనికి వస్తుంది గాని కులనిర్మూలన కోసం, వ్యవస్థ పరివర్తన కోసం పోరాటానికి దారి తీయదు. కనుక బోధన (చైతన్యీకరణ), సమీకరణ, పోరాటం అనే మూడు అత్యంత కీలకమైన కర్తవ్యాలను చాల జాగ్రత్తగా, విశాలంగా, లోతుగా, నిశితంగా అర్థం చేసుకొని ఆచరించవలసి ఉంది. కొత్త దళిత రాజకీయాలలో చాల అవసరమైన, సముచితమైన బోధన, చైతన్యీకరణ, పోరాటం జరిగాయని ఇప్పటివరకూ సూచనలు ఉన్నాయి. ఈ అంశాలను మరింత బలోపేతం చేయాలి.

4. పాత దళిత రాజకీయాలు కుల అస్తిత్వాన్ని, ఉప కుల అస్తిత్వాన్ని ప్రధానం చేసి దళిత ఐక్యతకు, పీడిత ఐక్యతకు అవరోధాలు కల్పించాయి. తప్పనిసరిగా అంతరాల వ్యవస్థలో ప్రతి కులమూ ఏ వివక్షకు, అసమానతకు, నిరాదరణకు గురయిందో, ఏమి కోల్పోయిందో, సమానహక్కులను ఎలా సాధించుకోవాలో ఆలోచించవలసిందే. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సంఘటితం కావలసిందే, ప్రత్యేక కార్యక్రమాలతో, ప్రత్యేక నినాదాలతో పోరాడవలసిందే. భారతదేశంలో కుల సమస్య పరిష్కారానికి అనివార్యమైన నిర్దిష్ట కర్తవ్యం ఇది. మరీ ముఖ్యంగా దోపిడీ పీడనలకు గురైన కులాలన్నిటికీ ఈ కర్తవ్యం ఉంటుంది. కాని అదే సమయంలో ఏ ఒక్క పీడిత కులమైనా సంఖ్య రీత్యా బలమైనది కాదు గనుక, ఈ సమాజంలో తరతమ భేదాలతో మరెన్నో కులాలు అటువంటి పీడననే అనుభవిస్తున్నాయి గనుక ఇతర పీడిత కులాల సంఘీభావాన్ని కూడగట్టడం అత్యవసరం. ఈ క్రమంలో అంతిమ లక్ష్యమైన కులనిర్మూలనను మరచిపోకుండా ఉండడం అత్యవసరం. కమ్యూనిస్టులు కులాన్ని విస్మరించి వర్గ ఐక్యత కోరారని విమర్శించిన పాత దళిత రాజకీయాలు కూడ పార్లమెంటరీ ఎన్నికల ఎత్తుగడగా ఆదివాసి దళిత బహుజన మైనారిటీ ఐక్యత అనే నినాదాన్ని ఎన్నోసార్లు ఇచ్చాయి. అంటే మళ్లీ వర్గ ఐక్యతనే ప్రతిపాదించాయి. ఆ అవకాశవాదాన్ని, పార్లమెంటరీ ఎత్తుగడలను అధిగమించి, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కోసం, ఫాసిజాన్ని ఓడించడం కోసం విశాల పీడిత ఐక్యత కావాలని నినదించడం కొత్త దళిత రాజకీయాలు ముందుకు తెచ్చిన ఆహ్వానించదగిన నినాదం. దీన్ని బలోపేతం చేయవలసి ఉంది.

5. కొత్త దళిత రాజకీయాలు గత రెండు సంవత్సరాలలో జరిపిన పోరాటాలు, ప్రదర్శించిన సమరశీలత పరిమాణంలో తక్కువే కావచ్చు గాని అవి భిన్నమైనవి, కొత్త రకమైనవి, దళిత రాజకీయాలలో ఇంతవరకూ లేనివి. పాత దళిత రాజకీయ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించినవి. ఆ నేపథ్యంలో కొత్త దళిత రాజకీయాలు దేశవ్యాప్తంగా విప్లవ ప్రగతిశీల శక్తులలో కొత్త ఆశలు నింపాయి. దళిత శక్తులలో, మొత్తంగా పోరాటశక్తులలో భవిష్యత్తు పట్ల ఆశను రేకెత్తించాయి. మౌలిక పరిష్కారాన్నీ, తక్షణ, తాత్కాలిక పరిష్కారాలనూ మేళవించడం ద్వారా అవి కొత్త వ్యూహాలకూ, ఎత్తుగడలకూ, పోరాటాలకూ వాగ్దానం చేస్తున్నాయి. ఈ అంశాన్ని బలపరచడం, సంఘటిత పరచడం విప్లవ ప్రగతిశీల శక్తుల కర్తవ్యం.

Keywords : jignesh mewani,modi,rahul,india,daliths,politics,cast,new war,up,unity,
(2024-03-16 10:16:42)



No. of visitors : 1782

Suggested Posts


జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)

భారత దళిత రాజకీయాలలో కొత్త తారగా ఆవిర్భవించిన జిగ్నేష్ మేవాని ప్రవేశపెట్టిన కొత్త ధోరణులను వాటి పూర్వరంగంలో చర్చించి ప్రగతిశీల శక్తులు గ్రహించవలసిన అంశాలను సూచిస్తున్నారు ఎన్ వేణుగోపాల్

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జిగ్నేష్