ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !

ఇప్పుడు

మార్చి 25వ తేదీన బీహారులో నవీన్ నిశ్చల్, విజయ్ సింగ్ ఇద్దరు విలేకరులు. ఊళ్ళో తనకు అనుకూలంగా వార్తలు రాయడం లేదని ఆగ్రహించిన గ్రామపెద్ద వాళ్ళిద్దరిని కారు ప్రమాదంలో చంపేశాడని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్చి 26వ తేదీన మధ్యప్రదేశ్ లో విలేకరి సందీప్ శర్మ ట్రక్కు ప్రమాదంలో మరణించాడు. అది ప్రమాదం కాదు, హత్య అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇసుకమాఫియాపై పరిశోధనాత్మక కథనాలు రాస్తున్న శర్మ అక్కడి పోలీసు అధికారులు తీసుకుంటున్న లంచాల వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేశాడు. బెదిరింపులు వచ్చినా లెక్క చేయలేదు. పోలీసులు కూడా అతనికి రక్షణ కల్పించలేదు.
కమిటీ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ ప్రకారం 1992 తర్వాతి నుంచి 27 మంది జర్నలిస్టులు హత్యచేయబడ్డారు. మరో పాతికమంది జర్నలిస్టుల మరణాలపై బలమైన అనుమానాలు, ఆరోపణలున్నాయి. ఈ నివేదిక వచ్చిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు మరో ఆరుగురు జర్నలిస్టులు చంపబడ్డారు.
మార్చి 26వ తేదీనే వచ్చిన మరో వార్త, కోబ్రాపోస్ట్ డాట్ కామ్ బట్టబయలు చేసిన మీడియా నిర్వాకం. డబ్బులిస్తే అనుకూలమైన వార్తలు రాస్తామని, మతపరంగా ఓటర్లను చీల్చడానికి సహకరిస్తామని, రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం వగైరా అన్నీ చేసిపెడతామని మీడియా సంస్థలు ఎంత నిస్సిగ్గుగా ముందుకు వస్తున్నాయో కోబ్రాపోస్ట్ డాట్ కామ్ స్టింగ్ ఆపరేషనులో ఆ సంస్థల పేర్లతో సహా బయటపెట్టింది. ఈ స్టింగ్ ఆపరేషనులో కొంతమంది మీడియా ప్రబుద్దులు చాలా గర్వంగా మతతత్వ సంస్థలతో తమ సంబంధాల గురించి చెప్పుకున్నారు. మరికొందరు అడ్వాన్సు చెల్లింపు ఇవ్వాలని డిమాండ్ చేశారని కూడా తెలుస్తోంది.
మార్చి 25, 26 తేదీల్లో వచ్చిన ఈ వార్తలు చదువుతున్నప్పుడు సహజంగానే మార్చి 25, 1931వ తేదీన అత్యంత దారుణంగా హత్యకు గురైన ప్రముఖ పాత్రికేయుడు, స్వతంత్ర సేనాని గణేష్ శంకర్ విద్యార్థి గుర్తుకు వస్తారు. అదే సంవత్సరం మార్చి 23వ తేదీన విప్లవకారులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లను బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసింది. రెండు రోజుల తర్వాత గణేష్ శంకర్ విద్యార్థి హత్యకు గురయ్యారు. కాన్పూరులో కాన్పూరు సింహం ఆయన. హిందూ ముస్లిం ప్రజానీకం అందరూ ఆయన్ను గౌరవించేవారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లపై విచారణ జరుగుతున్నప్పుడు గణేష్ శంకర్ విద్యార్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విప్లవకారులను విడుదల చేసేలా ఒత్తిడి తీసుకురావచ్చని, ఆయనకు హిందూ ముస్లిమ్ ప్రజానీకంలో ఉన్న ఆదరణ దృష్ట్యా పెద్ద ఉద్యమంగా మారవచ్చని భయపడిన బ్రిటీషు ప్రభుత్వం అంతకు ముందు ఆయన్ను మరో కేసులో అరెస్టు చేసి జైలుకు పంపింది. మరోవైపు కాన్పూరులో మతం చిచ్చుపెట్టి, మతఘర్షణల మారణకాండను రెచ్చగొట్టింది. ఆ మారణకాండలో విద్యార్థిని చంపేశారు.
మీడియా గురించి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు అమ్ముడైపోతున్న తీరును బట్టబయలు చేసిన వార్తలు, కొందరు విలేకరులు ధైర్యసాహసాలతో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వార్తల నేపథ్యంలో గణేష్ శంకర్ విద్యార్థి పేరు స్మరించుకోవడం ఎందుకు అవసరమంటే ఆయన భయమెరుగని, విలువలకు కట్టుబడిన పాత్రికేయుడు కాబట్టి.
నేడు గణేష్ శంకర్ విద్యార్థి పేరు ఎంతమందికి తెలుసు. విశ్వవిద్యాలయాల్లో అప్పుడప్పుడు సెమినార్లలో ఆయన పేరు వినబడవచ్చు. జర్నలిస్టుల అవార్డు ఉత్సవాల్లో ఆయన పేరు వినబడవచ్చు. కాని చాలా తక్కువ మందికి ఆయన పేరు తెలుసు. ఆయన పాటించిన విలువలు, ఆయన ధైర్యసాహసాలు నేడు ఎంతమందికి తెలుసు? మరేం పర్వాలేదు.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కాన్పూర్ ఎయిర్ పోర్టుకు గణేష్ శంకర్ విద్యార్థి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రేసు గౌరవించడం మరిచిపోయిన స్వతంత్ర సేనానికి బిజేపి గౌరవమిచ్చిందని మురిసిపోదాం. విచిత్రమేమంటే, 2006లో గణేష్ శంకర్ విద్యార్థి విగ్రహాన్న జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ ముంగవాలిలో ఆవిష్కరించాలని ప్రయత్నించినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం దానికి అనుమతి లేదని అభ్యంతరం చెప్పింది. పోలీసులు అడ్డుకున్నారు. ఇవి మన రాజకీయాలు.
హత్యకు గురైనప్పుడు ఆయన వయసు కేవలం 40 సంవత్సరాలు. మతఘర్షణల్లో కాన్పూరు అట్టుడుకుతున్నప్పుడు అల్లర్లలో అమాయకులను కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడు దుండగులు ఆయనపై దాడి చేసి చంపేశారు. మహాత్మా గాంధీ ʹʹవిద్యార్థిʹʹ మరణాన్ని ʹʹషాన్ దార్ʹʹ (గొప్ప) మరణంగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీని విద్యార్థి అనుసరించలేదు. నిజానికి విద్యార్థి యే మహాత్మాగాంధీకి దారి చూపించాడు.
ఆయన రచయిత, సంపాదకుడు, ప్రకాశకుడు, సామాజిక కార్యకర్త, ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవాడు, యువ విప్లవకారులకు మిత్రుడు, విలువలకు కట్టుబడి బతికిన మహోన్నతుడు. ప్రస్తుతం జర్నలిస్టులకు, ఒక డైలమాలో బతుకుతున్న వారికి, పెయిడ్ న్యూస్ తో డబ్బులు సంపాదించుకోవాలా? లేక విలువలకు కట్టుబడి రాయాలా? అనే మీమాంసలో ఉన్న వారికి విద్యార్థి ఒక ఆదర్శం.
అలహాబాద్ లో మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. స్కూలు చదువు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం ఆర్థిక ఇబ్బందుల వల్ల సాగలేదు. కాయస్థ పాఠశాల కాలేజీలో చేరినప్పటికి చదువు కొనసాగించడం సాధ్యం కాలేదు. పనిచేసి పొట్టపోసుకోక తప్పని పరిస్థితి. అయితే నిత్యం నేర్చుకోవడమే జీవితమని నమ్మిన గణేష్ శంకర్ తన పేరు చివర ʹʹవిద్యార్థిʹʹ అని పెట్టుకున్నారు. ఆయన నిత్య విద్యార్థి. ప్రారంభంలో ఆయన సాహిత్య పత్రిక ʹʹసరస్వతిʹʹలో పనిచేశారు. కాని సమకాలీన రాజకీయాలు, సామాజిక పరిస్థితుల పట్ల ప్రతిస్పందించే విద్యార్థి తర్వాత ʹʹకర్మయోగిʹʹ పత్రికకు రాయడం మొదలు పెట్టారు. ఈ పత్రిక పండిత్ సుందర్ లాల్ స్థాపించిన పత్రిక. సుందర్ లాల్ స్వయంగా విప్లవకారుడు. ఆ తర్వాత 23 సంవత్సరాల వయసులో విద్యార్థి కాన్పూరుకు వచ్చారు. తన స్వంత హిందీ పత్రిక ʹʹప్రతాప్ʹʹ ప్రారంభించారు.
బ్రిటీషు వలసప్రభుత్వంపై రాజీలేని పోరాటం ఆయనది. ఒక కాలు జైల్లో, మరో కాలు పత్రికా కార్యాలయంలో అన్నట్లు 18 సంవత్సరాలు పోరాడారు. బ్రిటీషు వారి విభజించు పాలించు విధానాన్ని అర్ధం చేసుకున్న విద్యార్థి ఆంగ్ల పాలకులు భారతీయుల్లో చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టారు. మతసామరస్యానికి తన పత్రిక ద్వారా విశేష కృషి చేశారు. హిందూస్తానీ బరాదరి పేరుతో ఒక సంస్థను స్థాపించి హిందూ ముస్లిం జనసముదాయల మధ్య సోదరభావం వికసించేలా ప్రయత్నించారు. అనేక పండగలు కలిసి చేసుకునే వాతావరణం సృష్టించారు. స్వతంత్రపోరాటాన్ని అడ్డుకోడానికి వలసపాలకులు మతం చిచ్చు పెడతారని ఆయన అనేకసార్లు హెచ్చరించారు.
పత్రిక నడపడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఆయన మొక్కువోని దీక్షతో ముందుకు సాగారు. ప్రతాప్ పత్రికలో పాలకులను విమర్శించడానికి ఆయన ఏమాత్రం సంకోచించేవాడు కాదు. గ్వాలియర్, మేవార్, జైపూర్, ఉదయ్ పూర్, ఇండోర్, తెహ్రీ తదితర సంస్థానాల్లో వ్యవహారాలను తీవ్రంగా విమర్శిస్తూ రాశాడు. రాజస్థాన్ లో 1915లోనే విద్యార్థి రాజకీయ చైతన్యానికి ప్రాణాలు తెగించి తన పత్రిక ద్వారా కృషి చేశారు. గ్వాలియర్ సంస్థానంలో ఆయన తండ్రి టీచరుగా పనిచేసేవారు. అయినా గ్వాలియర్ విషయంలోను విమర్శించడానికి వెనుకాడలేదు. గ్వాలియర్ విషయంలో రాసిన విమర్శలను ఉపసంహరించుకునేది లేదని స్పష్టంగా చెప్పడమే కాదు, తన తండ్రిని కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి గ్వాలియర్ నుంచి కాన్పూర్ వచ్చేయమని కోరాడట. మరో సందర్భంలో గ్వాలియర్ గురించి రాసింది తప్పయితే సవరణ వేస్తామని, అయితే తప్పో కాదో విచారించి తేల్చుకుంటామని గ్వాలియర్ పాలకుడికి ముఖం మీదే చెప్పారు. గ్వాలియర్ వచ్చి విచారించడానికి సంస్థానం ప్రయాణ ఖర్చులు ఇస్తానన్నప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. గ్వాలియర్ సంస్థానం పేదది కాదని అక్కడి పాలకుడు చెబితే ప్రతాప్ పత్రిక కూడా పేదది కాదని జవాబిచ్చారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు. ఒక సంస్థానం పాలకుడు ఆర్ధిక సహాయం అందజేస్తానంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వాడు విద్యార్థి. ప్రారంభం నుంచి రైతుల అణిచివేత, శ్రామికుల అణిచివేతలకు వ్యతిరేకంగా ఆయన రాజీలేని వైఖరితో కొనసాగాడు. అప్పటికి కాన్పూర్ పారిశ్రామిక కేంద్రంగా మారిన పట్టణం.
గణేష్ శంకర్ విద్యార్థి 1916లో గాంధీజీని కలిసారు. ఆ తర్వాత భారత స్వతంత్ర సంగ్రామలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. తన రాతలకు, ప్రసంగాలకు గాను కనీసం ఐదు సార్లు జైలు శిక్షకు గురయ్యారు. తాను రాసిన దానిని మార్చడానికి లేదా క్షమాపణలు చెప్పడానికి ఆయన ఎన్నడూ సిద్ధపడలేదు. ప్రజాసమస్యల విషయంలో తటస్థ వైఖరి అనేదే ఉండదు. తప్పును తప్పుగా నిర్మొహమాటంగానే చెప్పవలసి ఉంటుంది. విద్యార్థి కేవలం సమస్యలను తన పత్రికలో రాయడమే కాదు, రైతు సమావేశాలకు హాజరయ్యేవాడు, లాఠీచార్జిలో దెబ్బలు తినేవాడు, స్ట్రయికులకు నాయకత్వం వహించేవాడు, వాటన్నంటి గురించి తన పత్రికలో రాసేవాడు. కాన్పూర్ మజ్దూర్ సభకు నాయకత్వం వహించాడు. కాంగ్రేసు నాయకుడిగా ఎన్నికల్లో గెలిచాడు. భగత్ సింగ్ కు విప్లవకార్యకలాపాల్లో సహాయం అందించాడు, భగత్ సింగ్ కు తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. తన పత్రికలో భగత్ సింగ్ ద్వారా రాయించాడు. జవహర్ లాల్ నెహ్రూ, చంద్రశేఖర్ ఆజాద్ మధ్య సమావేశానికి సంధానకర్తగా వ్యవహరించాడు.
మతతత్వం అనేది వలసవాద పాలకులు సృష్టించిన భూతంగా విద్యార్థి భావించాడు. భారత చరిత్రలో విభజన బీజాలు నాటింది బ్రిటీషువారే. విద్యార్థి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాన్పూరులో 1931 మత మారణకాండలను ఆపలేకపోయాడు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల ఉరిశిక్ష తర్వాత కాంగ్రేసు హర్తాళ్ పిలుపు ఇచ్చింది. శాంతియుతంగా జరగవలసిన ఈ కార్యక్రమాన్ని మతఘర్షణగా కొన్ని శక్తులు మార్చేశాయి. దాదాపు 400 మంది మరణించారు. అలా మరణించిన వారిలో విద్యార్థి కూడా ఉన్నారు.
బ్రిటీష్ సిఐడి అంటే కమిటీ ఆఫ్ ఇంపీరియల్ డిఫెన్స్ ఈ మతకలహాల చిచ్చు పెట్టిందని తెలుస్తోంది. కాన్పూరు లో బ్రిటీషు వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకోవడం, బడా వ్యాపారసంస్థలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ఊపందుకోవడం, విద్యార్థి ఈ ఉద్యమాలన్నింటా ముందుండడం వల్ల బ్రిటీషువారికి లక్ష్యమయ్యాడు. కాన్పూర్ అల్లర్ల కమీషన్ నివేదిక ప్రకారం మార్చి 25వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థి అల్లర్లకు పాల్పడుతున్న గుంపులను అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అంతకు ముందు రోజు ఆయన ఒక మిత్రుడికి లేఖ రాస్తూ, నాకు సహాయం కోసం కాన్పూర్ రావద్దు, ఇక్కడ పోలీసులు అల్లర్లను తమాషా చూస్తున్నారు. మందిరాలు, మస్జిదులు దహనమవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. ప్రజల్ని చావగొడుతున్నారని రాశాడు. విద్యార్థి తన మిత్రులతో కలిసి అనేక మొహల్లాల్లో వెళ్ళి శాంతిని కాపాడ్డానికి ప్రయత్నించాడు. ఆయనకున్న ప్రజాదరణ వల్ల ఆయనెక్కడికైనా నిర్భయంగా వెళ్ళే పరిస్థితి ఉండేది. అల్లర్లలో చిక్కుకున్న అనేకమంది హిందువులను, ముస్లిములను కాపాడాడు. రెచ్చిపోయిన జనాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. కాలికి చెప్పులు కూడా లేకుండా ఆయన తిరిగాడు. ఈ ప్రయత్నంలోనే ఆయన్ను ఎవరో చంపేశారు.
ఆయన కుమార్తె విమల విద్యార్థి తన తండ్రి మరణం తర్వాత అప్పట్లో తాను విన్న విషయాలను ఇక ఇంటర్వ్యులో చెప్పారు. ఒక ముహల్లాలో కొందరు ముస్లిం మహిళలను ఆయన కాపాడి, ఆ తర్వాత మరో మొహల్లాలో చిక్కుకున్న హిందువులను కాపాడే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆయనపై దాడి జరిగింది. తన తండ్రిపై దాడి చేసిన వారు రెచ్చిపోయిన ప్రజలు కాదని, బ్రిటీషు పాలకుల ఆదేశాలను అమలు చేస్తున్న ప్రొఫెషనల్స్ అని ఆమె చెప్పారు. తన మేనత్త అప్పట్లో విన్న మాటలను ఆమె తెలియజేస్తూ, వివిధ మొహల్లాల్లో ఆయుధాలను పంచడం జరిగిందని, ʹʹఈ రోజు కాన్పూర్ సింహం చస్తుందిʹʹ అనే మాటలు తాను విన్నానని చెప్పిందావిడ. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లను హడావిడిగా ఉరితీసిన కుట్రలోని భాగమే విద్యార్థి హత్యకూడా అని అభిప్రాయపడ్డారు విమల విద్యార్థి.
కాన్పూర్ అల్లర్ల కమీషన్ నివేదికను కాంగ్రేసు సభ్యులు తయారు చేశారు. అందులో కొన్ని వాస్తవాలను కాంగ్రేసు సభ్యులు తొలగించారని జఫరుల్ ముల్క్ తన అసమ్మతి లేఖలో రాశారు. హిందూ ముస్లిమ్ పక్షపాతాలకు అతీతంగా పనిచేసేవారు కాంగ్రేసులో చాలా తక్కువ మంది ఉన్నారని ఒక సాక్షి చెప్పిన మాటను జఫరుల్ ముల్క్ ప్రస్తావించారు. కాంగ్రేసులో కూడా అప్పట్లో ఎంత మతతత్వ విషం ప్రవేశించిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ముంబయి ప్రెస్ క్లబ్బులో ముంబయి సర్వోదయా మండల్ ఒక సమావేశం ఇటీవల నిర్వహించింది. విద్యార్థి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హిందీ రిటైర్డ్ జర్నలిస్టులు సరోజ్ త్రిపాఠి, నిరంజన్ తాక్లేలను ఆహ్వానించారు.
త్రిపాఠి మాట్లాడుతూ గణేష్ శంకర్ విద్యార్థిని మరిచిపోయేలా చేశారని అన్నారు. ఆయన పాటించిన విలువలు నేటి జర్నలిస్టుల్లో ఉన్నాయా? నేడు మతతత్వ విషబీజాలను నాటడానికి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు, అవసరమైతే ఆ ప్రయత్నాలకు డబ్బు తీసుకుని సహాయమందించడానికి మీడియా సంస్థలు సంసిద్ధత తెలియజేస్తున్న వాతావరణంలో, దేశంలేని సంపదలో 73 శాతం సంపద కేవలం ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో, రైతులు ఆకలి చావులకు గురవుతున్న నేపథ్యంలో గణేష్ శంకర్ విద్యార్థిని మరిచిపోయేలా చేయడమే మంచిదని చాలా మంది భావించడం సహజమే.
ఈ రోజుల్లో గణేష్ శంకర్ విద్యార్థి బతికి ఉన్నట్లయితే అని నిరంజన్ తాక్లే ప్రశ్నిస్తూ, బహుశా ఆయన జైల్లో ఉండేవాడు అని ఆయనే జవాబిచ్చారు.
- వాహెద్

Keywords : ganesh shankar vidyarthi, journalist, britsh, bjp, congress
(2024-03-29 20:27:33)



No. of visitors : 1751

Suggested Posts


జర్నలిస్టులకు ఆత్మహత్యలే గతా?

ఇక్కడ ఫంక్షన్ అవడం లేదు.. వీళ్ళంతా వారంరోజులుగా నిద్రాహారాలు మాని తమ బతుకు కోసం కొట్లాడుతున్నారు. ఇంట్లో ఆకలితో పడుకున్న భార్యాపిల్లలు.... ఆరునెలలుగా జీతాలు లేక ఇంటి కిరాయీలు కట్టక సామాన్లు బైటపడేస్తామంటూ ఓనర్ల బెధిరింపులు భరిస్తూ....

అరుణ్ సాగర్ అమర్ రహే !

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో వినూత్న ఒరవడులకు కారకుల్లో అగ్రగామిగా నిలిచిన అరుణ్ సాగర్ మృతి మీడియా రంగానికి తీరని లోటు. ప్రజా ఉద్యమాల పట్ల అరుణ్ సాగర్ సునిశిత పరిశీలనా వైఖరి, ప్రజా పక్షపాత దృక్పథం, అణగారిన వర్గాలపట్ల ఆయన కమిట్ మెంట్ అనిర్వచనీయమైంది....

పత్రికా స్వేచ్ఛపై దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

పత్రికా స్వేచ్ఛపై, అసాంఘిక, సంఘ విద్రోహ చర్యలను వ్యతిరేకిస్తూ రచనలు చేసిన పాత్రికేయులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ దేశరాజధానిలో బుధవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు

మధ్యాహ్నం 2 గంటలకు ఈ దాడి ప్రారంభమైంది, స్థానికులైన పురుషులు,మహిళలు జర్నలిస్టులను చుట్టుముట్టారు, దాడి సమయంలో, మహిళా జర్నలిస్ట్ ఒక గేట్ ద్వారా పక్క సందులోకి పారిపోగానే ఆ ముఠా గేటును లాక్ చేసి, మిగతా ఇద్దరు జర్నలిస్టులను లోపల బంధించింది. ఆ మహిళా జర్నలిస్ట్ తన సహచరులను విడిచిపెట్టమని వేడుకొంటే ఒక వ్యక్తి ఆమె దుస్తులు పట్టుకొని మళ్ళీ గేటు లోపలికి లాగడానికి

ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు

ప్రముఖ జర్నలిస్టు, రచయిత రానా అయూబ్ ను హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలోబెదిరింపులకు దిగారు కొందరు దుర్మార్గులు. ఈ విషయంపై ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇప్పుడు