తెలంగాణపై కాగ్ నివేదిక‌


తెలంగాణపై కాగ్ నివేదిక‌

తెలంగాణపై

(తెలంగాణ విశ్వవిద్యాలయం అర్దశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.పున్నయ్య రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక‌ మే, 2018 సంచికలో ప్రచురించబడినది)

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, నాలుగు దశాబ్దాలుగా అనేక రూపాలుగా సాగిన పోరాటాలు రగులుతూ ఆరుతూ రెండు దశాబ్దాలుగా మరింత చైతన్యవంతంగా సాగిన ప్రజా ఉద్యమం వందలాది మంది అమరుల త్యాగాల పునాదుల మీద ప్రత్యేక తెలంగా ఉదయించింది. ఉద్యమం ప్రకటించిన లక్ష్యాల ఆధారంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి కృషి చేస్తుందని నమ్మి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టినారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పాలనా రంగాలలో గుణాత్మక మార్పుకొరకు పారదర్శకంగా సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వసించారు.

తెలంగాణ ప్రజా ప్రయోజనాలే ప్రథమ ప్రాథామ్యాలుగా పాలకుల కుండాలని ప్రజలు కోరుకున్నారు. 2014 జూన్‌ 2న నాటికి ధనిక రాష్ట్రంగానే తెలంగాణ ఆవిర్భవించింది. నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితి ఏలుబడిలో రాష్ట్రం మిగులు రాష్ట్రాల జాబితాలోనే ఉన్నదంటూ ఆర్భాటంగా అంకెలతో రంకెలు వేయించారు.

మిగులు లేదా ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నాలుగు వసంతాలు పూర్తి చేసుకుంది. ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం కాదని లోటు రాష్ట్రాల జాబితాలోకి నెట్టి వేయబడిందని బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున కంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) మొత్తం ఆర్థిక వ్యవస్థను సూక్ష్మంగా పరిశీలించిన నివేదికను సభ ముందుంచింది. ఈ ప్రభుత్వం రెవెన్యూ మిగులును అధికంగా చూపారని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పరిధి దాటారన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికల నిధుల్లో భారీ మిగుళ్లను గుర్తించింది. ఏకంగా అప్పు తెచ్చిన నిధులను ఆదాయంగా చూపించారు.

జాతీయ పారిశ్రామిక దిగ్గజాల ముందు, అంతర్జాతీయ బహుళజాతి కంపెనీల ప్రతినిధుల మధ్య పారదర్శక విధానాలతో రాష్ట్ర ప్రగతి ఆర్థిక వనరులను ఆహ్వానించిన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రకటించిన పథకాలు దేశానికే ఆదర్శమని ప్రపంచదేశాలకు సైతం అనుసరణీయమైన పథకాలంటూ బడ్జెట్‌లో వాటి అమలుకోసం కేటాయించిన కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ఘనత గత ప్రభుత్వాల చరిత్రలో లేదని వాదించింది. రాష్ట్రం, కేంద్రం నిధులతో సంబంధం లేకుండానే స్వయం ప్రతిపత్తిని సాదించిందని, ధనిక రాష్ట్రంగా అవతరించామని చాటుకుంది. స్వీయ సంపాదిత నిధులే కాకుండా, కేంద్రం వాటాగా ఇచ్చిన నిధులు సంబంధిత రంగాలకు నిర్ధేశిత కాలంలో ఖర్చు చేయకుండా రాష్ట్రాన్ని నాలుగు సంవత్సరాలలో నాలుగు దశాబ్దాల ముందుకు నడిపినట్లు వల్లెవేశారు. వందిమాగదుల ప్రభుత్వాలతో అంటకాగిన మీడియా సహకారంతో పైకి కన్పించకుండా సబ్‌ట్రెజరి, ట్రెజరీ కార్యాలయాల్లో ప్రతిదినం విధించే ఫ్రీజింగ్‌, దఫాలుగా విడుదల చేసే బ్యాంకు నిధులను చూసిన ఉద్యోగ, వ్యాపార వర్గాలకు ప్రభుత్వం ప్రకటించే ʹధనిక రాష్ట్రంʹ లోని డొల్లతనం అర్థమైనా, సామాన్యులకు ఆకర్షిత ప్రకటనల జోరులో అవి కన్పించలేదు.

అస్తవ్యస్తమైన ఆర్థిక క్రమశిక్షణ

పరిపాలనలో ఆర్థిక క్రమ శిక్షణ, ఆర్థిక నియంత్రణ అత్యంత కీలకం. ఈ రంగాన్ని ఎంతో పరిణతితో వ్యూహాత్మకంగా నిర్వహించాలి. రాష్ట్ర పురోభివృద్ధి ప్రజలందరి సర్వతోముఖాభివృద్ధికి ఈ రంగమే మూలస్తంభం లాంటిది. అయినప్పటికి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో రు. 5,392 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా ఆశ్చర్యంగా రు. 1,386 కోట్లు రెవెన్యూ మిగులుగా చూపి ప్రజలను భ్రమింపజేసింది. దీనిపై అధ్యయనం చేసిన కాగ్‌ బృందం ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా పద్దుల నమోదులో సరైన పద్ధతులు పాటించలేదని గుర్తించింది. అత్యంత విచారకరమేమంటే అప్పు తీసుకున్న నిధులను రెవెన్యూ రాబడిగా జమచేసి ద్రవ్యలోటు రు. 2,500 కోట్లు తక్కువ చూపింది. ఇది ఉద్ధేశపూర్వకంగానే జరిగిందని కాగ్‌ గుర్తించింది. ఎఫ్‌ఆర్‌బిఎం (ఫిస్కల్‌ రెస్పాన్సిబులిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) చట్టం ప్రకారం అప్పులు 3.5 శాతం లోపుగా ఉండాలని మార్గదర్శకాలున్నాయి. కాని ఈ చట్ట పరిధిని దాటి 4.3 శాతంగా అప్పులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాని నమోదు మాత్రం పరిధిలో ఉన్నట్లు 3.5 శాతంగా చూపినారు. ఉదయ్‌ (ఉజ్వల్‌ డిస్కం అష్యూరెన్స్‌ యోజన) పథకం కింద రు. 5,931 కోట్ల రుణాలు తీసుకున్న ప్రభుత్వం రు. 7,500 కోట్లలో రు. 3,750 కోట్లను 50 శాతాన్ని గ్రాంటుకు బదులుగా ఈక్విటి పద్దుల్లో చూపడంతో రెవెన్యూ మిగులు కన్పించింది. ఈ పద్దును తప్పుగా నమోదుచేసి ప్రజలందరి కళ్లకు గంతలుకట్టింది. వాస్తవానికి ఎలాంటి మిగులు లేదని కాగ్‌ తేల్చి చెప్పింది. ఉదయ్‌లో నిర్ధేశించినట్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలు కొత్త బాండ్లు జారీ చేయాలని నిబంధనలున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం జారీచేయలేదు. అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల రు. 5,784 కోట్ల భారం పడింది. విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చేసుకుంటున్న ప్రచారం కూడా వట్టిదేనని కాగ్‌ ఆక్షేపించింది. క్యాపిటల్‌ వ్యయం విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు. బడ్జెట్‌ అంచనాల ప్రకారం రు. 29,313 కోట్లు క్యాపిటల్‌ వ్యయంకాగా అంతకు మించి రు. 33,371 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్‌ పరిశీలనలో బయటపడింది. దీనిలో సాధారణంగా రాష్ట్రాల సగటు 19.70 శాతం కాగా తెలంగాణలో అత్యధికంగా 28.22 శాతంగా ఉంది. ఇది రాష్ట్రాల సగటు కంటే దాదాపు 10 శాతం అధికమే. సీవరేజ్‌ బోర్డు తీసుకున్న రు. 1,500 కోట్లు, గృహ నిర్మాణ సంస్థ హడ్కో నుంచి తెచ్చుకున్న రు. 1,000 కోట్లు అప్పుతో పాటు మెట్రో వాటర్‌ వర్క్స్‌ లాంటి వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులన్నింటిని ʹచాలా తెలివిగాʹ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా చూపింది. 2016-17లో బడ్జెట్‌ కేటాయింపులను మించిన అధిక ఖర్చులు రు. 21,161 కోట్లుగా గుర్తించింది. 16 గ్రాంట్లు 3 అప్రాప్రియేషన్స్‌ బిల్లులో చేసిన అధిక వ్యయాన్ని క్రమబద్దీకరించకుండా కనీస ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. ఆర్థిక నిర్వహణలో కనబరిచిన అత్యంత ఉదాసీనత, నిబంధనల ఉల్లంఘన ఆర్థిక వ్యవస్థపై రుణాత్మక ప్రభావం చూపాయి.

ముందస్తు అనుమతులు, జవాబుదారీతనం లోపించిన వ్యయాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పది లక్షలకు మించిన చెక్‌లను రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కౌంటర్‌ సంతకం లేకుండా డ్రా చేయరాదు. కాని కాగ్‌ పరిశీలించిన డి.టి.ఓ. హైదరాబాద్‌ డ్రా చేసిన చెక్‌లు రు. 10 లక్షల కంటే ఎక్కువ మొత్తాలను 464 చెక్‌ల ద్వారా రు. 4,022 కోట్లు డ్రా చేయడాన్ని కాగ్‌ బట్టబయలుచేసింది. రు. 10 లక్షల పరిమితిని బాధ్యతాయుతమైన ఆర్థిక కార్యదర్శి నిర్వహించాల్సి ఉండగా 464 చెక్‌లను ఏ అత్యవసర పరిస్థితుల్లో డ్రా చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోవడాన్ని కాగ్‌ తీవ్రంగా ఆక్షేపించింది. సమాజం లో అత్యంత వెనుకబడిన దళిత, గిరిజనులను శరవేగంగా అభివృద్ధిచేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించినారు. ఎస్‌సి ఉప ప్రణాళికకు రు. 8,487.21 కోట్లు కేటాయిస్తే కేవలం 43 శాతం నిధులను అంటే రు. 3,715 కోట్లు మాత్రమే వినియోగించినారు. ఎస్‌టి ఉప ప్రణాళిక కింద రు. 5,315.40 కోట్లు కేటాయిస్తే 45 శాతంగా రు. 2,403.85 కోట్లను వినియోగించినారు. ఈ రెండు ఉప ప్రణాళికల్లో 50 శాతం కన్నా తక్కువ ఖర్చు చేయడంతో ఈ చట్టం లక్ష్యాలను స్ఫూర్తిని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మరీ విచిత్రంగా వార్షిక పద్దుల సమర్పణలో 181 సంస్థలు జాప్యం చేశాయని, దీని వలన జవాబుదారీతనం నీరుకారి పోవడంతో పాటు పద్దుల తయారీ ప్రయోజనం కూడా నెరవేరకుండా పోయిందన్నారు. పథకాల అమలు కోసం డ్రా చేసిన నిధులకు ధృవపత్రాలను (యుసి) సమర్పించలేదని ఒక పథకంలోని నిధులను మరో పథకానికి వినియోగించి తప్పుడు (యుసిలు) ధృవపత్రాలను జతపరిచారని కాగ్‌ కమిటీ ముక్కున వేలేసుకుంది.

2016-17 ఆర్థిక సంవత్సరం మొత్తం వ్యయం రు. 73,783 కోట్లు (67 శాతం) రాబడుల్లో రు. 55,116 కోట్లు 77 శాతం మధ్య సయోధ్య చేయలేదు. ఫలితంగా రాబడుల్లో లీకేజీలనూ, సక్రమంగా జరగని ఖర్చులను కనుగొనడం కష్టసాధ్యమవుతుంది. బడ్జెట్‌లో పేర్కొన్నట్లు లెక్క ప్రకారంగా ఏ ఒక్క ప్రభుత్వ శాఖకు నిధుల విడుదల జరగలేదు. గ్రాంట్లకు మించి ఖర్చుచేయడం ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘనేనని ఇది శాసన సభ అభీష్టాన్ని ఉల్లంఘించడమేనని కాగ్‌ తేల్చి చెప్పింది. చేసిన ఖర్చులకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా పొంతన లేదని సర్కారు నిర్వాకాన్ని కాగ్‌ ఎండగట్టింది.

కమీషన్ల కాకతీయ మిషన్‌ - కానరాని పారదర్శకత

తెలంగాణ రాష్ట్రం ప్రాథమికంగా వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల పూడిక తీయడం ద్వారా చెరువులోని సారవంతమైన మట్టిని రైతుల పంట పొలాలకు తరలించడం వలన చౌడు భూములు సైతం సారవంతంగా మారుతాయనేది ఈ పథక లక్ష్యం. కాకతీయ పాలకుల దార్శనికతను ముందుకు తీసుకెల్లాలనే నినాదమే మిషన్‌ కాకతీయగా మారింది. ప్రభుత్వం గుర్తించిన 46,531 చెరువులను రాబోయే ఐదు సంవత్సరాలలో పూర్తి చేసుకునేందుకు ప్రతి సంవత్సరం 20 శాతం చొప్పున పూర్తి చేయాలని నిర్ణయించారు.

మొదటి విడత కేవలం మూడు నెలల్లోనే పునరుద్ధరణ లక్ష్యం నెరవేరలేదు. రెండవ దశలో కేవలం 25 శాతం పనులను కూడ పూర్తి చేయలేదని, మూడవ దశ పూడిక తీసే పనుల్లో ʹసున్నా శాతంʹ పని జరిగింది. ప్రచార ఆర్బాటాలు పత్రికా ప్రకటనల ఖర్చులు కోట్లు దాటినాయి. చివరగా మిషన్‌ కాకతీయ పథకం కింద 56 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాని దీనిని బలపరిచే ఆధార గణాంకాలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం విచారకరం. పూర్తిచేసిన పనుల్లో కూడా శాస్త్రీయత లేదు.

పూడిక పరిమాణాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన క్షేత్రస్థాయి అధికారులే లేరని, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు తమ అనుభవంతో మాత్రమే పూడిక పరిమాణాన్ని అంచనా వేసినట్లు ప్రభుత్వం ఒప్పుకోవడం చూస్తే నిధుల వినియోగంపట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని అంచనా వేయవచ్చు.

కాగ్‌ పరిశీలకులు సాంపిల్‌గా 27 పనులను తనిఖీ చేస్తే అందులో 12.7 లక్షల ఘనపు మీటర్లు పూడిక తీయాలని అంచనా వేస్తే కేవలం 8.08 లక్షల ఘనపు మీటర్లు మాత్రమే తీసినట్లు ఆధారాలున్నాయి. ప్రభుత్వం 12.7 లక్షల ఘనపు మీటర్ల పూడికకు డబ్బులు చెల్లించినట్లు కాగ్‌ నివేదిక తేల్చింది. ఈ సాంపిల్స్‌ ఆధారంగా కాకతీయ మిషన్‌లో కమీషన్‌లు ఏ స్థాయిలో ఉన్నాయోనని కాగ్‌ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇక హైదరాబాద్‌లో ఈ ప్రభుత్వం ఏకంగా 17 చెరువులనే మాయం చేసిందని ప్రభుత్వ మాయాజాలాన్ని కాగ్‌ ప్రజల కళ్లకు కట్టింది.

నిరాశ పరిచిన పారిశ్రామిక ఉపాధి అవకాశాలు

అభివృద్ధిలో భాగంగా ప్రజలను వ్యవసాయ రంగం నుంచి ప్రాథమిక రంగానికి పరుగులు పెట్టించే లక్ష్యంతో ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దఎత్తున భూములు కేటాయించింది. హైదరాబాద్‌ నగరంలో అత్యంత విలువయిన 1075 ఎకరాల భూమిని ఫ్యాబ్‌ సిటి నిర్మాణానికి అనుమతించింది. ఇందులో సెమికండక్టర్‌ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి అవసరమైన పెట్టుబడులను తీసుకురావడానికి ఒప్పందం కుదుర్చుకొని విఫలమైంది. పెట్టుబడి తీసుకొచ్చే విషయంలో ఇంటలెక్ట్‌ ఇంక్‌, సెమి ఇండియా ఇంక్‌ లాంటి సంస్థల సామార్థ్యాన్నిగాని నిబద్ధతనుగాని ధృవీకరించుకోలేదు. ఇవి రెండు విఫలమైన తర్వాత ప్రత్యామ్నాయ సంస్థల కోసం కనీసంగా కూడ ప్రయత్నించినట్లు ఆధారాలు లేవు. దీని కారణంగా నైపుణ్య కార్మికులుగా మార్చుకునేందుకు మరో అవకాశం కోల్పోయింది. పారిశ్రామిక రంగం నుంచి పెద్ద ఎత్తున అర్ధ నైపుణ్య ఉద్యోగాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే విద్యావంతులైన 5.17 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యం కేవలం 3016 మందితో అంటే 0.6 శాతంతో సరిపెట్టుకుంది. ప్రభుత్వ ప్రయత్నలోపం వల్ల దూరదృష్టి లేకపోవడం వల్ల నిధుల లేమితో కోట్ల విలువైన 1075 ఎకరాల భూమిలో 70 శాతం స్థలం నిరుపయోగంగా ఉందని, లక్షలాది మంది ఉపాధిని జారవిడిచినట్లైందని కాగ్‌ దృవీకరించింది.

లక్ష్యం నెరవేరని టిఎస్‌ఐ పాస్‌ పథకం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి స్వయం దృవీకరణ వ్యవస్థ, టి.ఎస్‌.ఐ.పాస్‌ 2014 చట్టం రూపొందించింది. పారిశ్రామిక వ్యాపారవేత్తలు తమ గురించి తాము సమర్పించిన దృవీకరణ పత్రాల ప్రాతిపదికన పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల, దరఖాస్తుల పరిశీలన ఏకగవాక్షం నుంచి వేగంగా పూర్తిచేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.పారదర్శకంగా ధృవీకరణ పత్రాలు అందించాలి. ఎలాంటి పక్షపాతం ఉండకుండా ఉండాలని ఈ విధానాన్ని రూపొందించింది. దాదాపుగా 2550 పరిశ్రమలకు దీని ఆధారంగా ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. లోప భూయిష్టమైన ఈ ప్రక్రియలో పారిశ్రామిక వేత్తలు అన్ని రకాల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలనే నిర్దిష్ట నిబంధనలు లేకపోవడం వల్ల ఇంజనీరింగ్‌, వ్యవసాయాధారిత, ఫార్మా, రసాయనాలు, గ్రానైట్‌, స్టోన్‌ క్రషింగ్‌, ప్లాస్టిక్‌, రబ్బర్‌ తదితర ప్రమాదకర పరిశ్రమల్లో సైతం అత్యంత ప్రధానమైన కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక అనుమతులను కూడ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని కాగ్‌ నివేదికలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ప్రక్రియ వేగంగా ఉండాలనే, పారదర్శకంగా వ్యవస్థ పనిచేయాలనే లక్ష్యాలు మంచివైనప్పటికి ప్రమాదకర పరిస్థితులను నివారించే విధానాన్ని ప్రభుత్వం తప్పక అనుసరించాలి.

కనుమరుగవుతున్న ప్రభుత్వ విద్యారంగం

జీవితాలను మెరుగుపరిచే నైపుణ్యాల సాధనకు అక్షరాస్యత పునాదిరాయి. విద్యుత్‌ శక్తి ఎవరి జీవితాన్నైనా మార్చి వేయగలదనేది ఒక నిరూపిత వాస్తవం. అది సమాజాభివృద్ధి క్రమాన్ని పెంచడంలో కీలక పాత్ర నిర్వహిస్తుంది. ఆర్థిక వ్యవస్థను సంపద్వంతం చేస్తుంది. మానవ జీవిత ప్రమాణాన్ని మరింత విస్తరింపచేసే విధంగా విద్యా విధానం ఉండాలి. లాభాపేక్ష లేని ప్రభుత్వమే ఆ విద్యను అందించాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానంలో సమూలంగా మార్పులు తెస్తామన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలుండే విద్యా వ్యవస్థను తెలంగాణలో అభివృద్ధి పరుస్తామన్నారు. ప్రైవేట్‌ విద్య ద్వారానే అంతరాలు మరింతగా పెరిగినాయని, అందరికి ఆమోదయోగ్యమైన, కుల, మత రహిత కామన్‌ స్కూల్‌ విద్యా విధానమే నా కల అని ప్రకటించినారు. ప్రైవేట్‌ విద్యా విధానమంటే కొనుక్కునే విద్యా విధానమని దానిని కూకటివేళ్లతో ఈ ప్రభుత్వం పెకిలిస్తుందని హామీలిచ్చినారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలను జాతీయం చేస్తామన్నారు. కాని ఆచరణలో అమల్లో ఉన్న ప్రభుత్వ విద్యా విధానాన్ని కనీసంగా సమీక్షించలేదు.

మౌలిక వసతుల లోపం, సిబ్బంది నియామకం లేక ప్రభుత్వ పాఠశాలలు బలహీనంగా మారిపోయినాయి. ఈ ప్రభావంతో ప్రైవేట్‌ విద్యా సంస్థలు మరింతగా పెరిగినాయి. ప్రైవేట్‌ విద్యా సంస్థల సమాఖ్య గౌరవాధ్యక్షులుగా ప్రభుత్వ పెద్దలుండడం అత్యంత విచారకరం. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య ప్రాసకోసమే గాని అమల్లోలేదని ఈ ప్రభుత్వం తేల్చింది. ఈ క్రమంలో ప్రైవేట్‌ విద్యా సంస్థలు ప్రభుత్వ అండతో ఇష్టా రాజ్యంగా అపరిమితంగా ఫీజులు వసూలు చేస్తూ కోట్లు గడిస్తూ విద్యా వ్యాపారం చేస్తున్నారు.

పాఠశాల స్థాయిలో సంవత్సరానికి ఏక మొత్తంగా క్యాపిటేషన్‌ రుసుములు రు. 30 వేల నుంచి లక్షల రూపాయల వరకు బోధనా రుసుములు రు. 16,500 నుంచి 5.42 లక్షల మరకు వసూలు చేస్తున్నాయి. ఇది విద్యా హక్కు చట్టాన్ని అధిగమించడమే. నేటికి 75 శాతం స్కూల్స్‌లో మరుగుదొడ్ల సౌకర్యం, రక్షిత మంచినీటి వసతి కల్పించడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీర్ఘకాలంగా సిబ్బంది నియామకాలు లేవని ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరిచే పటిష్టమైన ప్రణాళికలు ఈ ప్రభుత్వం దగ్గర లేవని కాగ్‌ నివేదించింది.

కాంట్రిబ్యుటరీ ఫించన్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ను క్రమబద్ధీకరించని ప్రభుత్వం

2004 సెప్టెంబర్‌ 1 తరువాత నియామకం అయిన ఉద్యోగులందరు పాత పెన్షన్‌ విధానం కాకుండా కొత్త పెన్షన్‌ విధానంలోకి వస్తారు. కొత్త పెన్షన్‌ విధానమే కాంట్రిబ్యుటరీ పెన్షన్‌ విధానం. ఇందులో మూల వేతనంలో 10 శాతం ఉద్యోగి జీతం నుండి తీసుకొని ప్రభుత్వం అదనంగా 10 శాతం మ్యాచింగ్‌ గ్రాంటుగా కలిపి ఏదో ఒక బ్యాంకులో గాని బీమా సంస్థలోగాని పెట్టుబడి పెడుతున్నారు. పదవి విరమణ అనంతరం అసలు వడ్డీ కలిపి ఏక మొత్తంగా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లిస్తుంది. దీనిని క్రమంగా చెల్లించుకుంటుండాలి. కాగ్‌ పరిశీలించిన ఈ కాంట్రిబ్యుటరీ ఫించన్‌ అకౌంట్‌లో ఉద్యోగుల నుండి వచ్చే మొత్తాలను మాత్రం జమచేసింది కాని ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్‌లో గండికొట్టింది. రు. 420.14 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా కేవలం రు. 348.23 కోట్లు చెల్లించింది. ఇంకా రు. 71.91 కోట్లు చెల్లించలేదని కాగ్‌ గుర్తించింది. సిపిఎస్‌ పట్ల అసహనంతో ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులకు ఇది మరింత అనుమానాలను పెంచుతుంది. ప్రభుత్వం అవసరమైన పథకాలను పక్కకు పెట్టి అనవసరమైన వాటికి అధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొంది. అర్థంలేని ఖర్చులు ప్రణాళికలు లేని పనులే అధికంగా ఉన్నాయని కాగ్‌ తప్పుబట్టడాన్ని చూస్తే ప్రభుత్వాల డొల్లతనం అర్థం అవుతుంది.

కుంటుపడిన ప్రజారోగ్యరంగం

సంపూర్ణంగా విద్యతోపాటు వైద్యం కూడ ప్రభుత్వాధీనంలో పనిచేస్తూ, ఉచితంగానే ప్రజలందరికి ఆరోగ్యాన్నిస్తే సమగ్ర సమాజాభివృద్ధికి బాటలు వేస్తుంది. నేడు వైద్య రంగం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కునారిల్లిపోతోంది. మన రాష్ట్రంలో కేటాయింపులే తక్కువ. కేటాయించిన దాంట్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనితో ప్రజారోగ్యం మరింతగా కుంటుపడింది. నిధుల లేమితో అభివృద్ధి సంక్షేమ శాఖల పనులు మధ్యలో నిలిచిపోతుంటే బహుఘనత వహించిన వైద్య శాఖలో అందుకు విరుద్ధంగా జరిగింది. గడిచిన రెండున్నర ఏండ్లలో ఏకంగా రు. 1,574.19 కోట్లు ఖర్చుకు నోచుకోలేదు. అత్యవసర మందుల కొనుగోళ్లలోను ఇదే పరిస్థితి. జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేంద్రం రు. 83.99 కోట్లు మంజూరు చేస్తే కేవలం రు. 10.11 కోట్లు అంటే 12 శాతం మాత్రమే ఖర్చు చేశారు. సంతాన సాఫల్యత, శిశు సంక్షేమం, కుటుంబ నియంత్రణ (ఆర్‌సిఎచ్‌) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, సిజేరియన్లు నివారించడం, చిన్నారులకు, వ్యాధి నిరోధక టీకాలు, అత్యవసర మందులు ఐరన్‌ ఫోలిక్‌ ఆసిడ్‌ పంపిణీ, మాతా శిశు సంక్షేమం, భ్రూణ హత్యలు రూపుమాపడం, పుట్టిన శిశువుల్లో తక్కువ బరువు, ఎదుగుదల లోపాన్ని గుర్తించి చికిత్స అందించడానికి కేంద్రం రాష్ట్రాల వాటా 75:25 నిష్పత్తిలో ఉండేవి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రు. 673.13 కోట్లు జమచేస్తే 54 శాతం అంటే 364.97 కోట్లు ఖర్చు చేసినారు. నిజంగా పేదలకు రోగులకు, ఆరోగ్యన్నందించడానికి ఈ ప్రభుత్వాలు ఎంతమేరకు కృషి చేస్తున్నాయో ఈ నివేదిక వ్యక్తపరిచింది. దీనిని అత్యంత తీవ్రంగా కాగ్‌ ఆక్షేపించింది.

జనని సురక్ష యోజన కింద సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో రిఫరల్‌ - డ్రాప్‌ బ్యాంక్‌ సేవలను అందించేందుకు 2015లో కార్పెడ్‌ అనే సంస్థతో ఒప్పందం కుదిరింది. రోగులను ఆస్పత్రికి తరలించేందుకు రు. 80 తిరిగి ఇంటికి చేర్చేందుకు రు. 250 చొప్పున చెల్లిస్తారు. విచిత్రంగా ఒప్పందం చేసుకున్న సంస్థకు అసలు వాహనాలే లేవని ఒప్పందం తర్వాత తెలిసింది. వాహనాలు సేవలందించినందుకు గాను మరో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. రు. 10.85 కోట్లు వాహనాలకు చెల్లించాలని అధికారులు లెక్కలు తేల్చినారు. కాని ఆ నిధులను సాయిరంగ్‌ అనే ఫిల్లింగ్‌ (పెట్రోల్‌ బంక్‌) ఖాతాలో వేయడాన్ని కాగ్‌ తప్పుపట్టింది. అనారోగ్యకరమైన పనులతో ఆరోగ్య తెలంగాణ సాధ్యమేనా అని కాగ్‌ అడుగుతుంది.

అస్తవ్యస్తంగా భూపంపిణీ

దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఎన్నికల హామీ. కాని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది. 2014 నుంచి 2017 మరకు భూపంపిణీ కోసం సబ్సిడీ రూపంలో రు. 1,887.98 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 412.72 కోట్లు మాత్రమే ఎస్‌సి కార్పొరేషన్‌కు విడుదల చేసింది. 2014 నుండి 2017 వరకు రు. 12,587 మందికి భూ పంపిణీ చేస్తే అందులో కేవలం 2,866 మందికి మాత్రమే ప్రయోజనాలు కల్పించింది. ఈ 2,866 మంది లబ్ధిదారులకు మొత్తం 7,486 ఎకరాల భూపంపిణీ చేశారు. కాని వాటికి సాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఇందులో 3,210 ఎకరాల భూమి వర్షాధారమైనదిగా పరిగణించారు. 2,866 మందిలో కేవలం 578 మందికి మాత్రమే పట్టదారు పాసు పుస్తకాలు అందించారు. దళితులకు మూడెకరాల భూమి అనేది ఆచరణ సాధ్యం కాని హామీ అని కాగ్‌ గుర్తించింది.

అప్పులతో పై వాళ్లకు పప్పుకూడు, కింది వాళ్లకు అప్పుకూడు

తెలంగాణ రాష్ట్రం ఓట్ల కోసం రోజుకో వాగ్దానం చేస్తుంది. నెరవేర్చడానికి లక్షల కోట్లు అవుతాయి. అంత ఆదాయవనరు ఇప్పటికిప్పుడు తెలంగాణకు లేదు. అంటే అప్పులు తెస్తామంటారు. అప్పుతో పైవాళ్లు పప్పు కూడు తింటుంటే కింది వారికి మాత్రం అప్పు కూడు వడ్డిస్తున్నారు. మన పాలకులు ఆలోచనా రహితంగా అప్పులు చేయడం మొదలయింది. మొదటి ఆర్థిక సంవత్సరంలో మిగులు బడ్జెట్‌ ఉన్న కొత్త రాష్ట్రం ఇప్పటికే అప్పుల కుప్పగా మారింది. స్థాయికి మించిన అప్పు ఎప్పుడైనా ముప్పే. ఇది చారిత్రక సత్యం. కాని పాలకులు అప్పు లేనిదే అభివృద్ధి సాద్యం కాదంటూ తెచ్చిన అప్పులను సహితం సక్రమంగా వినియోగించకపోవడాన్ని కాగ్‌ తప్పుపట్టింది. చేసే అప్పు అభివృద్ధి కోసం కాదు. 35 శాతం పాత అప్పులను తీర్చడానికేనని లెక్కలతో సహా కాగ్‌ ముందుంచింది.

2017 మార్చ్‌ 31 నాటికి అప్పులను లోతుగా పరిశీలిస్తే వచ్చే ఏడాదిలో 49 శాతం రుణాలు అంటే రు. 56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2015-16లో పన్నుల రాబడిలో 7.12 శాతం రుణాలు తిరిగి చెల్లించగా 2016-17లో ఇది 32.18 శాతానికి భారీగా పెరిగింది. 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు గరిష్టంగా 8.22 శాతంగా మాత్రమే ఉండాలి కాని నేటికీ ఇది 11 శాతం వరకు పెరిగింది. దీనిని నియంత్రణ చేయక పోతే ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది.

ముగింపు

ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమం కూడా సజావుగా సాగుతున్న దాఖలాలు లేవని కాగ్‌ తేల్చిచెప్పింది. ఆయా ప్రభుత్వ శాఖలు చేసుకుంటున్న ప్రచారానికి క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి పొంతనే లేదని కాగ్‌ తేల్చింది. భారీ అంకెలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రం అని ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మించడం కోసం భారీ కటౌట్లు, ఖరీదైన హోర్డింగ్‌లు కోట్ల రూపాయలతో మీడియాను ముందుంచుతుంది. చేయకూడని అనేక పనుల్ని సర్కారు చేస్తుందని కాగ్‌ గుర్తించింది.

ప్రభుత్వ పెద్దలు ఏమి చెప్పినా ఎంత గంభీరంగా చమత్కరించినా ఎంచుకున్న అభివృద్ధి నమూనా ప్రజా ప్రయోజనాలను, ఆకాంక్షలను తీర్చడంలేదనేదే యధార్థం. నిజానికి తెలియకుండానే మనం కళ్లు మూసుకోవచ్చు. చూడనట్లు నటించవచ్చు గాని ఇవాళ కాకపోతే మరో రోజైనా నిజం మన కళ్లు తెరిపిస్తుంది. ఈ విషయం కాగ్‌ రూపంలో ప్రజల కళ్లు తెరిపించింది. కాగ్‌ తీవ్రంగా పాలనా విధానాలను విమర్శించింది. సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమ ఆకాంక్షకు వ్యతిరేక దిశలో ఉన్నాయని గుర్తించింది.

(రచరుుత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అర్థశాస్త్ర విభాగం,

తెలంగాణ విశ్వవిద్యాలయం)

Keywords : telangana, cag, trs, kcr
(2019-02-18 16:44:42)No. of visitors : 496

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


తెలంగాణపై