చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (మొదటి భాగం) - ఎ.నర్సింహరెడ్డి

చారిత్రాత్మక

(రాజనీతిశాస్త్ర విద్యార్థి, ఉపాధ్యాయ నాయకులు ఎ.నర్సింహా రెడ్డి రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక మే, 2018 సంచికలో ప్రచురించబడినది)
మొదటి భాగం
మార్క్స్‌, ఎంగెల్స్‌ల కమ్యూనిస్టు ప్రణాళికను 1948 ఫిబ్రవరిలో ప్రపంచానికి అందజేశారు. ఇది ప్రపంచ చరిత్రలో మహత్తర రచన. కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళికయే శాస్త్రీయ కమ్యూనిజపు మొట్టమొదటి కార్యక్రమం. ప్రణాళిక వెలువడి 170 సంవత్సరాలు కావస్తున్నా అది ఒక మేరు పర్వతంలా నిలిచి ఉంది. మార్క్సిజంలోని మూడు అంతర్భాగాలైన ʹతత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రం, శాస్త్రీయ సోషలిజంʹ అందులో వివరించారు. ప్రపంచ చరిత్రలో సమాజ గమనానికి ఒక సజీవ రూపం. మానవ చరిత్ర గమనాన్ని దీనంతగా ప్రభావితం చేసిన మరో రచన లేదు. విప్లవ పురోగమనానికి బాటలు వేసింది. ఆలోచనలో స్పష్టత, స్ఫటిక స్వఛ్చమైన దాని భవిష్యద్ధర్శనం విముక్తిదాయకమూ, సృజనశీలమూ.

గత చరిత్రను ప్రకృతి, సమాజాల అభివృద్ధి నియమాలకు అనుగుణంగా విశ్లేషించింది. వివిధ సామాజిక వ్యవస్థలను, అంతర్జాతీయ వైరుధ్యాలను లోతుగా అధ్యయనం చేసి పెట్టుబడిదారీ సమాజంలో కార్మికవర్గాన్ని విప్లవకర వర్గంగా మార్క్స్‌ ఎంగెల్స్‌ గుర్తించారు. ప్రణాళిక వెలుబడిన నాటి నుండి పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాద దశలోకి ప్రవేశించి రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైంది. రష్యా, చైనా, వియత్నాంలో విప్లవాలు, ఇంకా ఎన్నో దేశాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు జరిగాయి. ఇవ్వాల్టికీ ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ప్రజాపోరాట రూపాలను ప్రణాళిక తీర్చిదిద్దింది. మనిషిని మనిషీ, జాతిని జాతీ దోచుకోని సామాజిక వ్యవస్థ కోసం పోరాడే శ్రామిక జనావళిని ఉత్తేజపరుస్తూనే ఉన్నది. 1971 నాటి పారిస్‌ కమ్యూన్‌తో మొదలిడి ఇవాల్టికి అనేక మహోజ్వల పోరాటాలకు ప్రణాళిక స్ఫూర్తినిస్తూనే ఉన్నది.

ప్రపంచ తత్వశాస్త్ర, విజ్ఞాన శాస్త్రాల చరిత్రల్లో గతితార్కిక చైతన్యాన్ని పొందడానికి మూడు వేల సంవత్సరాలు పట్టింది. మానవాళి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సుదీర్ఘకాలం ప్రయత్నించి ప్రపంచాన్ని మార్చడానికి చైతన్యవంతంగా పూనుకోవడంలో గతితర్కం ప్రభవించింది. ప్రపంచాన్ని వ్యాఖ్యానించడం ప్రపంచాన్ని మార్చడం వేరువేరుగా ఉన్నంతకాలం సమస్యల మీద ఇనుప తెరలు కప్పబడతాయి. ఈ రెండింటి కలయికే కమ్యూనిస్టు ప్రణాళిక. ప్రణాళిక అవిభాజ్యమైన అనేక అంశాలతో కూడిన సమగ్రరూపం. ఇది ఏదో ఒక సామాజిక జీవిత క్షేత్రానికి పరిమితమైంది కాదు. సమాజాన్ని దాని చలనంలో మార్పులో ప్రతి అంశాన్ని ప్రణాళిక ప్రతిబింబించింది. ప్రణాళిక వాక్యాల పొందికలో చరిత్ర జీవించింది. ప్రణాళిక సామాజిక ఘర్షణ చరిత్రని తవ్వుతుంది. సత్యాన్ని వెలికితీస్తుంది. గమనాన్ని నిర్దేశిస్తుంది. గందరగోళ సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తుంది. నవ ప్రపంచ కవాటాన్ని తెరుస్తుంది. ʹమేధోవంతమైన స్పష్టత, నిశిత దృష్టితో కూడిన ఈ రచన, నూతన ప్రాపంచిక దృక్పథాన్ని, నికరమైన భౌతికవాదాన్ని చిత్రీకరిస్తుంది. అభివృద్ధి క్రమానికి సంబంధించిన అత్యంత సమగ్రమైన, లోతైన సిద్ధాంతంగా గతితర్కాన్ని గూర్చి సాంఘిక జీవన సారాంశాన్ని గూర్చి పేర్కొంటుంది. వర్గ పోరాట సిద్ధాంతాన్ని గూర్చి, నూతన కమ్యూనిస్టు సమాజ సృష్టికర్తయగు కార్మిక వర్గం యొక్క ప్రపంచ-చారిత్రక విప్లవ కర్తవ్యాన్ని గూర్చి సృష్టీకరిస్తుందిʹ అని కమ్యూనిస్టు ప్రణాళికను గూర్చి లెనిన్‌ పేర్కొన్నాడు.

1947 ప్రారంభంలో లీగ్‌ ఆప్‌ జస్ట్‌ నాయకత్వం మార్క్స్‌, ఎంగెల్స్‌లను తమ సంస్థలో చేరాలని ఆహ్వానించింది. మార్క్స్‌, ఏంగెల్సు తమకు దొరికిన చారిత్రక అవకాశంగా భావించి అందులో సభ్యులుగా ఉంటూ1847లో లండన్‌ లీగ్‌ ఆఫ్‌ ది జస్ట్‌ని కమ్యూనిస్టు లీగ్‌గా మార్చగలిగారు. లీగ్‌ ఆఫ్‌ జస్ట్‌కి ʹమానవులందరూ సోదరులుʹ అనేది లక్ష్యంగా ఉండేది. ఇది పెటీ బూర్జువా నినాదం, వర్గదృక్పథం లేని అదిభౌతిక పాత నినాదాన్ని మార్క్స్‌, ఏంగెల్స్‌లు ʹʹఅన్ని దేశాల కార్మికులారా ఏకం కండిʹʹ గా మార్చారు. ఈ చారిత్రక లక్ష్య నిర్దేశంలోనే మార్క్స్‌, ఏంగెల్సుల కృషి ప్రతిబింబిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లోని కార్మికవర్గ సంస్థల్ని ఈ వేదికలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ అంతర్జాతీయ సంస్థకి ఎంగెల్స్‌ ʹʹకమ్యూనిస్టు కన్ఫెషన్‌ ఆఫ్‌ ఫేత్‌ʹʹ అనే ముసాయిదా రాసాడు. ఇది ప్రశ్నలూ సమాధానాల రూపంలో ఉంది. ఈ ముసాయిదా 1847 జూన్‌ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ లండన్‌లో జరిగిన కమ్యూనిస్టు లీగ్‌ మొదటి సమావేశంలో చర్చించిన కార్యక్రమ పత్రం. ఇలాంటి ముసాయిదాని ఎంగెల్స్‌ రాసాడనీ దానిమీద చర్చ జరిగిందనీ 1971 వరకూ తెలియదు.

1847 నవంబరు 29 నుంచి డిశంబర్‌ 6 వరకు లీగ్‌ రెండో మహాసభ లండన్‌లో జరిగింది. దీనికి మార్క్స్‌ హాజరయ్యాడు. ట్రూ సోషలిస్టు ఎమ్‌.ఎస్‌. ప్రవేశపెట్టిన ముసాయిదా మీద చర్చలు జరిగాయి. దీనిపై ఎంగెల్స్‌ విమర్శ పెట్టాడు. చివరికి ముసాయిదా రాసే బాధ్యతని లీగ్‌ నాయకులు మార్క్స్‌కి అప్ప చెప్పారు. ఎంగెల్స్‌ రాసిన రెండు ముసాయిదాల్నీ, ఇతర డాక్యుమెంట్లనీ ప్రణాళికను రాసేటప్పుడు మార్క్స్‌ పరిశీలించాడనేది స్పష్టం. ఎంగెల్స్‌ రాసిన ʹప్రిన్స్‌పుల్స్‌ ఆఫ్‌ కమ్యూనిజంʹలోని అభిప్రాయాలకీ ప్రణాళికలోని అభిప్రాయాలకీ పోలికలున్నాయి. కానీ రచనలోకానీ, ప్రతిపాదనా పద్ధతిలో కానీ, విషయ విశ్లేషణలో కానీ ప్రణాళిక నూతనత్వం సంతరించుకుంది. ప్రపంచ మానవాళి మీద ఈ ప్రణాళిక చేసినంత ప్రభావం మరేదీ చెయ్యలేదు. ఎంతో విపులమైన విషయాన్ని, ఎన్నో పార్శ్వాలు గల విషయాన్ని ఒకమాటలో, ఒక వాక్యంతో చెప్పగలగడం ప్రపంచ సాహిత్యంలో ఒక్క ప్రణాళికలోనే చూడగలం.

మార్క్స్‌, ఎంగెల్స్‌ రెండు నెలల్లో 23 పేజీల కమ్యూనిస్టు మానిఫెస్టో ముసాయిదాను తయారుచేశారు. 1948 ఫిబ్రవరిలో లండన్‌లో ప్రచురించబడింది. అది వారి బుర్రల నుంచి ఆకస్మాత్తుగా ఊడిపడింది కాదు. అది విభిన్న సామాజిక మూలాల నుంచి ప్రవహించిన అనేకభావ, భౌతిక వాస్తవికతల సంగమం. పెట్టుబడిదారీ వ్యవస్థలోని అమానుషత్వం, కార్మిక వర్గ పోరాటాలూ, సామాజిక సమస్యల పరిష్కారానికి అనేకమంది మేధావుల సిద్ధాంతాలు కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భవించడానికి హేతువులు. కమ్యూనిస్టు ప్రణాళిక కేవలం శుష్క సిద్ధాంత పత్రం కాదు. విప్లవ సిద్ధాంత విప్లవ ఆచరణల సామాజిక కార్యక్రమం. ఆర్థిక రాజకీయ సామాజిక తాత్విక నైతిక సాంస్కృతిక అంశాల అన్యోన్య సంబంధాల మొత్తం. కార్మికవర్గాన్ని పీడించే బూర్జువా వర్గంపై పోరాడడానికి కావల్సిన వ్యూహాన్ని, ఎత్తుగడల్ని సమకూర్చడానికే ప్రణాళిక ఉద్దేశించబడింది. శతృత్వంతో కూడిన వర్గాల మధ్య సామరస్యం ఏర్పడడం అసాధ్యమని నిరూపించారు. విప్లవం అనివార్యమని, కార్మికవర్గ విజయం అనివార్యమని తేల్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థను రూపుమాపి, నవ సమాజాన్ని నిర్మించడం చారిత్రక కర్తవ్యంగా గలిగిన అగ్రగామి వర్గమైన కార్మిక వర్గపోరాటానికి మార్గదర్శిగా ఉపకరించగలదనీ మార్క్స్‌, ఎంగెల్స్‌ భావించారు.

మార్క్స్‌, ఎంగెల్స్‌లు సమాజ క్రమాన్ని అవగాహన చేసుకొని, సిద్ధాంతీకరించే అపారమైన కృషి ప్రణాళికలో పరిపక్వమయింది. పశ్చిమ యూరప్‌ దేశాల్లోని వర్గపోరాటాల నుంచే కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భవించింది. మార్క్స్‌, ఎంగెల్స్‌లు ఒక రోజులోనే మార్కిస్టులు కాలేదు. 19వ శతాబ్దంలోని శ్రామికవర్గ పోరాటాల్నీ సిద్ధాంతాల్నీ అధ్యయనం చేస్తూ తత్వశాస్త్రం, రాజకీయార్ధశాస్త్రం, వర్గ పోరాట సిద్ధాంతాలను ఒక క్రమంలో ఐక్యంచేసి నూతన ప్రాపంచిక దృక్పథానికి రూపకల్పన చేశారు. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లోని తాత్విక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మార్క్సిజానికి మూడు మూలాధారాలు మూడు అవిభాజ్య భాగాలు. వలస దేశాలు సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా పోరాడు తున్నాయి. భూస్వామ్య వ్యవస్థ మీద బూర్జువా వర్గం పోరాడుతున్నది. బూర్జువావర్గం మీద కార్మికవర్గం పోరాడుతోంది. చరిత్ర పూర్వదశని అంతం చేసే కార్మికవర్గ పోరాటం పశ్చిమ దేశాల్లో జరుగుతోంది.

చార్టిస్టు ఉద్యమం, సైలీషియన్‌ కార్మికుల పోరాటం వంటివి పాలక వర్గాన్ని వణుకు పుట్టిస్తున్నాయి. పాత ప్రపంచానికి సంబంధించిన పాత భావాలకి వ్యతిరేకంగా అనేక కొత్తభావాలు పుడుతున్నాయి. తరతరాలుగా వస్తున్న సకల సామాజిక సంస్థల్నీ, భావవ్యవస్థల్నీ ప్రశ్నించడం ప్రారంభమైంది. దోపిడి వర్గాలకి వ్యతిరేకంగా అనేక రహస్య సంఘాలు పనిచేస్తున్నాయి. మార్క్స్‌, ఏంగెల్సులు భౌతిక గతితర్క ప్రాపంచిక దృక్పథం నుంచి కార్మికవర్గం విప్లవకర వర్గమనీ, భౌతికశక్తిని భౌతికశక్తే కూలతోయగలదనీ ఆవిష్కరించిన తర్వాత ప్రపంచ కార్మికుల్ని ఐక్యం చేయడానికి కృషి ప్రారంభించారు. సోషలిస్టుల పేరుతో, కమ్యూనిస్టుల పేరుతో ఉన్న అనేక మందిని కలిసి చర్చించారు. అనేక సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఒక పక్క వర్గపోరాటాలు, మరొకపక్క సిద్ధాంత ఘర్షణలనుంచి ప్రణాళిక రూపుదిద్దుకుంది. అందుకనే ఇందులో ప్రతి వాక్యం సంఘర్షణ నుంచి ప్రసవించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

కమ్యూనిస్టు ప్రణాళిక తనని తాను పరిచయం చేసుకోవడంతో ప్రారంభం అవుతుంది. యూరప్‌ ఖండంలోని మతగురువులూ, మహారాజులూ, మహాసంపన్నులూ గజగజ వణికి పోతున్నారు. ఎందుకు? ఖండం అంతటా వ్యాపించిన మ్యూనిస్టు భూతం గురించి, అందుకని కమ్యూనిస్టులు తమ ఆశయాల్ని స్పష్టంగా ప్రజలకి చాటిచెప్పవలసిన సమయం పరిపక్వం అయింది. అందుకే కమ్యూనిస్టు ప్రణాళిక వర్గ పోరాటాల, దోపిడీ పీడనల చరిత్రను ప్రకటించింది. ʹʹకమ్యూనిస్టులు తమ అభిప్రాయాలనూ, తమ లక్ష్యాలనూ, తమ ధోరణులనూ, బాహాటంగా, యావత్‌ ప్రపంచం ఎదుటా ప్రకటించి, కమ్యూనిస్టు భూతమనే ఈ కట్టు కథను తమ పార్టీ ప్రణాళికతోనే ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైందిʹʹ. ఇదీ ప్రణాళికా రచనకి భౌతిక గతితర్క కారణం. చరిత్రలో ఒక సమయం ఆసన్నమైనప్పుడు దాన్ని తక్షణం ఎదుర్కోవడం కమ్యూనిస్టుల కర్తవ్యం. లేకపోతే చరిత్ర గమనానికి అగ్రగామి దళంగా పనిచేయలేరు. ఈ ఎదుర్కునే లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రణాళికారచన చేయబడింది. ఈ లక్ష్యమే ప్రణాళికలోని ప్రతి వాక్యానికీ ఉత్తేజం.
కమ్యూనిస్టు ప్రణాళికలో 1. బూర్జువాలూ - కార్మికులూ
2. కార్మికులూ - కమ్యూనిస్టులూ 3. సోషలిస్టు-కమ్యూనిస్టు సాహిత్యం 4. ఈనాటి వివిధ ప్రతిపక్ష పార్టీల మీద కమ్యూనిస్టుల వైఖరి, అనే నాలుగు భాగాలు ఉన్నాయి. వీటికి అంతర గతితర్కం ఉంది.
బూర్జువాలు - కార్మికులు
ప్రణాళికలో మొదటి భాగం బూర్జువాలూ-కార్మికులూ అనే దాంట్లో ఇంతవరకు మానవ సమాజ చరిత్ర అంతా (ఆదిమ సమాజం తప్ప) వర్గపోరాటాల చరిత్రే అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది. మార్క్స్‌ సమాజ వర్గ స్వభావమూ, వర్గాల పూర్వచరిత్ర సూచించి ఆధునిక బూర్జువా వర్గం పుట్టుకనీ, అభివృద్ధినీ గత తార్కికంగా ప్రతిపాదించి బూర్జువా వర్గంతో పాటు అవిభాజ్యంగా ఆవిర్భవించే కార్మిక వర్గాన్ని గురించి వివరించి ʹʹబూర్జువావర్గ పతనమూ అనివార్యమని, కార్మికవర్గ విజయమూ తథ్యమనిʹʹ నిరూపించాడు. ఇది మొత్తం మానవజాతి చరిత్రని గతతార్కిక సిద్ధాంతంతో సాధించిన విజయం. ఇక్కడ చరిత్ర అంటే మానవ ఆస్తిత్వాన్ని సామాజిక అభివృద్ధికి సంబంధించిన క్రమంగా అవగాహన చేసుకోవాలి. ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో వర్గపోరాటం ప్రకృతికి సమాజానికి మధ్య వైరుధ్య రూపంలో ఉంటుంది. ప్రకృతి నుంచీ ఉత్పత్తి సాధనాల్ని ఉత్పత్తిచేసే క్రమంలోనూ, సమిష్టి సమాజ నిర్మాణ శ్రమ విభజనలోనూ క్రమంగా ఆదిమ కమ్యూనిస్టు సమాజం విచ్ఛిన్నమై పోయింది.
మార్క్స్‌ సమాజ ప్రధాన స్వరూపాన్ని సామాజిక-ఆర్థిక నిర్మాణపరంగా నిర్వచించి పూర్వవ్యవస్థల్ని ప్రస్తావనా పూర్వకంగా నిరూపించి బూర్జువా వ్యవస్థని గూర్చి విపులంగా చర్చించాడు. ఆర్థికంగా రాజకీయంగా భావజాలపరంగా బూర్జువా వ్యవస్థ చరిత్రని పరిమాణం నుండి గుణాత్మక మార్పు, ఐక్యత-ఘర్షణ, అభావం అభావం చెందడాలు అనే మూడు మౌలిక సూత్రాల్ని ఒక మొత్తంగా గ్రహించి చిత్రించాడు. మధ్యయుగాల్లో స్వతంత్ర పౌరులుగా ప్రారంభమై వృత్తి సంఘాలనుంచి కార్ఖానా పరిశ్రమలకీ, పారిశ్రామిక మధ్యతరగతి నుంచి పారిశ్రామిక అధిపతులు గా ఎదిగారు. అంటే, ఆధునిక బూర్జువాలుగా అవతరించారు. ఆనాటి ఐరోపా రాజకీయ పరిస్థితి పరిశీలిస్తే పలు దేశాలలో బూర్జువావర్గం తన స్థానాన్ని పటిష్ట పరచుకొంటోంది. అప్పటికి ఆధిక్యత సంపాదించు కోని ఇంకా అనేక దేశాలలో అందుకోసం పెనుగులాడు తోంది. ఫ్యూడలిజం ప్రతినిధులతో పోరాడటంలో అప్పటివరకు మెరుపు దళాలుగా పనిచేసిన కార్మికవర్గం తోటి ఘర్షణలు కూడా అప్పుడే జరిగాయి.

ఇంగ్లండ్‌లో కార్మిక వర్గపు అండదండలతో బూర్జువా వర్గం 1832లో అధికారం సాధించింది. ఫ్రాన్స్‌లో కూడా కార్మికుల తోడ్పాటుతో పదవ చార్లెస్‌ రాజు ఓడించబడ్డాడు.జారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న పోలెండ్‌కు సహకరిస్తూ జాతీయ స్వాతంత్య్రం కొరకు సాగుతున్న పోరాటాలకు సహకరించింది. 19వ శతాబ్దం మధ్య నాటికి వస్తువుల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధ్యమయింది. పరిశ్రమలు వాణిజ్యం బాగా పెంపొందాయి. ఈ క్రమంతో పాటు అమెరికా ఖండాన్ని ఆవిష్కరించడం, సముద్రమార్గాల్ని కనిపెట్టడం, మార్కెట్లు ఏర్పడడం, వలసదేశాల్లో వర్తకం, సరుకుల ఉత్పత్తి పెరగడంతో, వాణిజ్యానికీ, సముద్ర యానానికీ పరిశ్రమలకీ మంచి ఊపువచ్చింది. ఆవిరి ఇంజన్లూ, యంత్రాలూ అభివృద్ధి పొందడంతో పరిశ్రమలు ఇంకా అభివృద్ధి అయ్యాయి.

ʹʹఈ విధంగా పరిశ్రమలూ, వాణిజ్యమూ, సముద్రయానమూ, రైల్వేలూ విస్తరించేకొద్దీ, అదే దామాషాలో బూర్జువా వర్గమూ అభివృద్ధి చెందింది. దాని పెట్టుబడి పెరిగింది. మధ్యయుగాల నుండి వచ్చిన ప్రతివర్గమూ వెనక్కి నెట్టివేయబడిందిʹʹ. కాబట్టి ఆధునిక బూర్జువా వర్గమనేదే దీర్ఘకాలిక ఫలితంగా ఏర్పడిందనీ, ఉత్పత్తి విధానాల్లోనూ మారకపు విధానాల్లోనూ జరిగిన అనేక విప్లవాల పర్యవసానమనీ మనకి అర్థమవుతున్నది. బూర్జువా వర్గానికి ఆర్థికవ్యవస్థ మీద అధికారం రాగానే ʹతదనుగుణంగా అది అడుగడుగునా రాజకీయంగా కూడా పురోగమిం చిందిʹ. కాబట్టి ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బూర్జువా వర్గపు సమిష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమేʹʹ. ఇలా బూర్జువా వర్గం ఆర్థిక, రాజకీయాధిపత్యాన్ని సంపాదించుకుంది. సమాజం అంటే ఆర్థిక రాజకీయమే కాదు. మత నైతిక కళాసాహిత్య న్యాయశాస్త్రం వంటి ఉపరితల అంశాలు చాలా ముఖ్యమైనవి.

బూర్జువా వర్గం మొత్తంగా ఫ్యూడల్‌ సంకెళ్లను బద్దలుకొట్టి వాటి స్థానే స్వేచ్ఛాయుత పోటీ పద్ధతిని ప్రవేశపెట్టింది. దాని కనుగుణంగానే సామాజిక వ్యవస్థ, రాజ్యాంగ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంది. మానవ సంబంధాలన్నిటినీ ఆర్థిక సంబంధాలుగా మార్చి వేసింది. పూర్వ సామాజిక రూపాల్లో ఉండిన అన్ని ముసుగుల్నీ చించిపారవేసింది. జీవితంలో మార్పుల్ని వేగవంతం చేసింది. ʹʹభౌతిక వస్తువుల ఉత్పత్తిలో ఉన్న పరిస్థితే బౌద్ధిక ఉత్పత్తికి కూడా వర్తిస్తుందిʹʹ. కాబట్టి బూర్జువాలు సమాజ పునాదిని, ఉపరితలాంశాల్ని మార్చి వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ʹʹబూర్జువావర్గం తన్నుపోలిన ప్రపంచాన్ని సృష్టిస్తుందిʹʹ. అందుకనే వర్గం అంటే ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక అంగాలతో కూడిన వర్గం. బూర్జువా ఉత్పత్తి విధానంలో ఆర్థిక పునాదిని ఉపరితల అంశం నుంచి విభజించడానికి వీల్లేదు. ఒక నిర్దిష్ట కాలంలో, ప్రజలు సాధించిన ఆర్థికాభివృద్ధి పునాదిగా ఉంటుంది. అయితే రాజకీయ సంస్థలు, న్యాయపరమైన భావాలు, కళలు, మతం వంటి భావాలు ఉపరితలంలో నెలకొంటాయి.
పెట్టుబడిదారీ సమాజంలో బూర్జువావర్గం ఒకపక్కా కార్మిక వర్గం మరొక పక్కా శత్రు శిబిరాలుగా నిలుస్తాయి. అంటే పెట్టుబడిదారీ సాంఘిక-ఆర్థిక నిర్మాణంలో కార్మికవర్గం లేకుండా బూర్జువావర్గం, బూర్జువా వర్గం లేకుండా కార్మికవర్గం సాధ్యం కాదు. ఈ రెండు వర్గాలకీ మధ్య వైరుధ్యమే బూర్జువా వ్యవస్థ ప్రధాన వైరుధ్యం. కార్మిక బూర్జువా వర్గాలు కలిసి ఒక వ్యవస్థగా ఉండటమే ఐక్యత. రెండు వర్గాలకీ నిరంతర పోరాటమే సంఘర్షణ. ఫ్యూడల్‌ వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికవర్గం బూర్జువా వర్గాన్ని సమర్థించింది. బూర్జువాలు అధికారంలోకి రాగానే బూర్జువా, కార్మికవర్గ పోరాటం ఉధృతం అవుతుంది. బూర్జువావర్గం తననే నాశనం చేయగల మనుషులను కూడా అది సృష్టించింది. ఆ మనుషులే కార్మికవర్గం. పెట్టుబడిదారీవర్గం ఏ ఆయుధాలతో ప్యూడల్‌ శక్తుల్ని నాశనం చేసిందో, అదే ఆయుధాలు పెట్టుబడిదారీ వర్గానికి ఎదురు తిరుగుతాయి. అంటే బూర్జువావర్గం తననే అభావం చేసే కార్మికవర్గాన్ని సృష్టించుకుంది.
బూర్జువావర్గ దోపిడీ విధానం వల్ల, ఉత్పత్తి శక్తుల నిరంతర విప్లవీకరణం వల్ల శ్రమశక్తిని మాత్రమే అమ్ముకొని జీవించే కార్మికవర్గం పరిస్థితి హృదయ విదారకంగా మారిపోతుంది. శ్రమశక్తి సరుకుగా మారి శ్రామికుడు పరాయీకరణం పొందుతాడు. మధ్యవర్గాలు అనేకం బూర్జువావర్గంతో పోటీకి నిలవలేక కార్మికవర్గంలోకి చేరిపోతుంటారు. కార్మికుడు బహుముఖ దోపిడీకి గురవుతాడు. ఆధునిక సమాజంలో శ్రామిక వర్గమే అందరికంటే అట్టడుగు వర్గం. ఇప్పటి వరకు సమాజ చరిత్రలో జరిగిన ఉద్యమాలన్నీ అల్ప సంఖ్యాకుల ఉద్యమాలు, కార్మికుల ఉద్యమం అలాంటిదికాదు. అది స్వచైతన్యంతో స్వతంత్రంగా కొనసాగే అధిక సంఖ్యాకుల ఉద్యమం. ʹప్రతి వర్గపోరాటమూ ఒక రాజకీయ పోరాటమేʹ. ʹపెట్టుబడిదారీ వర్గం నాశనం కావడం, కార్మికవర్గం జయించడం తప్పదుʹ అన్న హెచ్చరికతో మొదటిభాగం ముగుస్తుంది.
ఈ విధంగా ʹబూర్జువాలూ-కార్మికులూʹ అనే ప్రణాళిక మొదటి భాగంలో మొత్తం వర్గ సమాజ చరిత్ర, బూర్జువా కార్మికవర్గాల ఆవిర్భావం, వాటి మధ్య వైరుధ్యం తీవ్రతరం కావడం, అంతిమంగా బూర్జువావర్గం పరాజయాన్ని పొందడాన్ని, కార్మికవర్గం విజయాన్ని పొందడాన్ని మార్క్స్‌, ఎంగెల్స్‌లు గతితర్క వస్తుగత సూత్రాలతో నిరూపించారు. పునాదినీ ఉపరితల అంశాల్ని ఒక వ్యవస్థగా ఒక మహత్తర చారిత్రక సందర్భాన్ని ప్రపంచ ప్రజల ముందు నిలిపారు.
కార్మికులు - కమ్యూనిస్టులు
కార్మికోద్యమం పట్ల కమ్యూనిస్టులు అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడలను గూర్చి ప్రణాళిక రెండవ భాగం వివరిస్తుంది. కార్మిక ఉద్యమాన్ని జయప్రదం చేసే, బూర్జువా వర్గాన్ని కూలదోసే, కార్మికవర్గ రాజ్యాన్ని నెలకొల్పే ప్రతిపాదనల నుంచి జనించే ప్రశ్నలకి సమాధానాలు కనిపిస్తాయి. కార్మికులకీ కమ్యూనిస్టులకీ గాఢానుబంధం లేకపోతే బూర్జువావర్గం పతనంకాదు. సిద్ధాంతరీత్యా కార్మికులు కమ్యూనిస్టులు కాకపోతే బూర్జువావర్గం మీద విజయాన్ని సాధించలేరు. కమ్యూనిస్టులు అంటే కార్మికవర్గాన్ని చైతన్యవంతం చేసే అగ్రగామి దళం. కమ్యూనిస్టులకు కార్మికవర్గ ప్రయోజనాలకి భిన్నమైన, విడిగా ఉండే ప్రయోజనాలు ఏమీ ఉండవు. కార్మికులు ఒకవర్గంగా రూపొందడం, బూర్జువాల ఆధిపత్యాన్ని కూలదోయడం, కార్మికవర్గం రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవడం కమ్యూనిస్టుల కర్తవ్యంగా చెప్పబడింది.
కమ్యూనిస్టుల మీద బూర్జువావర్గం చేసే తప్పుడు ఆరోపణల్ని మార్క్స్‌ ఎంగెల్స్‌ ఈ భాగంలో ఖండించారు. కమ్యూనిస్టుల వైఖరిని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల ఆశయాల్ని చెపుతూనే బూర్జువాలూ ఇతర పాలక వర్గాలూ చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. సొంత ఆస్తిని రద్దు చేయడం కమ్యూనిస్టుల కేంద్ర లక్ష్యం. మానవులు స్వయంకృషితో సొంతానికి ఆస్తి సంపాదించుకునే హక్కుని కమ్యూనిస్టులు రద్దు చేస్తారనీ దాంతో మానవుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అన్నీ పోతాయని బూర్జువాలు ఆరోపిస్తారు. నిజానికి బూర్జువా వ్యవస్థలో అనేక మందికి సొంత ఆస్తి లేదు. బూర్జువాల పెట్టుబడి పెరగడానికి కారణం అవుతున్న అసంఖ్యాక కార్మికవర్గానికి సొంత ఆస్తి లేదు. బూర్జువాలకున్న సొంత ఆస్తి వాళ్లు శ్రమపడి సంపాదించింది కాదు. శ్రామికుల అదనపు శ్రమనే పెట్టుబడిగా, బూర్జువా ఆస్తిగా మారుతోంది.
బూర్జువా సమాజం దృష్టిలో తన సంస్కృతి అంతరించడమంటే యావత్తు సంస్కృతి అంతరించి పోతుందని వాపోతారు. బూర్జువా సొంత ఆస్తిని రద్దు చేయడం అంటే బూర్జువా వ్యక్తిత్వాన్ని, బూర్జువా స్వాతంత్య్రాన్ని, బూర్జువా స్వేచ్ఛని రద్దు చేయడమే. బూర్జువా వ్యవస్థలో స్వేచ్ఛ అంటే వ్యాపార స్వేచ్ఛ. క్రయవిక్రయాల స్వేచ్ఛ. దీన్ని కమ్యూనిస్టులు రద్దు చేస్తారు. సామాజిక స్వభావం గల ఉత్పత్తి కొద్ది మంది పెట్టుబడిదారు ల అధికారంలో ఉండే విధానాన్ని తొలగిస్తుంది తప్ప కమ్యూనిజం అసలు ఆస్తినే రద్దు చేయదు. సొంత ఆస్తిని రద్దు చేస్తే కష్టపడి పనిచేయడం ఆగిపోతుందనీ, ప్రపంచం అంతా సోమరితనం అలముకుంటుందనీ బూర్జువావర్గం ఆరోపిస్తుంది. ʹʹఈ వాదం నిజమే అయితే సోమరితనంతో బూర్జువా సమాజం, ఎప్పుడో నాశనం అయిపోయేది. ఈ సమాజంలో పనిచేసేవాళ్ళు ఏమీ సంపాదించుకో లేకపోవడమూ, పని చేయనివాళ్లు సంపాదించుకోవడం మనకి తెలిసిన విషయమేʹʹ.
భౌతిక ఉత్పత్తిని గురించిన కమ్యూనిస్టుల ఆశయాల మీద చేస్తున్న ఆరోపణలే బూర్జువాలు బౌద్ధిక ఉత్పాదితాల మీద కూడా చేస్తున్నారు. వర్గ ఆస్తి అదృశ్యం కావడాన్ని అసలు ఉత్పత్తే అదృశ్యం కావడంగా బూర్జువాలు ఎలా భావిస్తున్నారో, వర్గ సంస్కృతి అదృశ్యం కావడాన్ని మొత్తం సంస్కృతి అంతా అదృశ్యం కావడంగా భావిస్తారు. ʹʹఏ సంస్కృతి పోతుందని బూర్జువా విలపిస్తున్నాడో ఆ సంస్కృతి సమాజంలో అధికాధిక సంఖ్యాకులకు యంత్రం లాగా పనిచేసే గుదిబండ మాత్రమేʹʹ. బూర్జువా సమాజంలో సంస్కృతి అంతా అధిక సంఖ్యాకులైన కార్మికవర్గాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా బూర్జువావర్గ ప్రయోజనాలకి విధేయం చేస్తూ యంత్రాల్లాగా పని చేయించడానికి ఉద్దేశింపబడిందే. స్వేచ్ఛ, సంస్కృతి, న్యాయశాస్త్రం వంటివి బూర్జువా ఉత్పత్తి విధానం నుంచి పుట్టినవే. బూర్జువావర్గ ఆర్థిక పునాది పోతే బూర్జువా వ్యవస్థ ఉపరితల అంశాలూ అంతరిస్తాయి.
కమ్యూనిస్టులు కుటుంబాన్ని రద్దుచేస్తారనీ, విద్యని సమాజపరం చేస్తారనీ, తల్లిదండ్రులకీ పిల్లలకీ అనుబంధాల్ని తెంచివేస్తారనీ బూర్జువాల ఆరోపణ. బూర్జువా కుటుంబం పెట్టుబడి మీద, వ్యక్తిగత లాభం మీద ఆధారపడి ఉంది. తండ్రులు తమ పిల్లల మీద సాగించే దోపిడీని కమ్యూనిస్టులు అంతం చేయాలనుకుంటున్నది నిజమే. విద్యలో సామాజిక జోక్యం యొక్క స్వభావం మార్చాలనీ పాలకవర్గ ప్రభావంలో చిక్కుకున్న విద్యను రక్షించాలన్నది కమ్యూనిస్టుల ఆశయం. ఇక స్త్రీలను గురించిన కమ్యూనిస్టుల వైఖరిని బూర్జువాలు అసహ్యంగా వక్రీకరిస్తారు. ఉత్పత్తి సాధనాలను సమిష్టిగా ఉపయోగించుకుంటారని అనగానే స్త్రీలకు కూడా అదే గతి సంభవిస్తుందని బూర్జువాలు ఆరోపిస్తారు. అది వాళ్ళ వర్గ కుటిలత్వం. తాను సృష్టించిన కుటుంబ వ్యవస్థ మినహా మరెలాంటి కుటుంబ వ్యవస్థ ఉనికిని బూర్జువా వర్గం ఊహించజాలదు. అందువల్ల బూర్జువా కుటుంబ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించడంతో, కమ్యూనిజం ఏ తరహా కుటుంబమూ లేకుండా చేస్తానంటున్నదని గగ్గోలు చేస్తారు. కమ్యూనిస్టు పునాదికి అనుగుణ్యంగా కుటుంబం కూడా మారిపోతుంది. నిజానికి స్త్రీలను సమిష్టి ఆస్తిగా చేయడానికో మరొకటి చేయడానికో వాళ్ళు ఏమీ వస్తువులు కాదు. బూర్జువా వ్యవస్థని శ్రామిక స్త్రీ పురుషులు కలిసే సమాధి చేస్తారు. మత నైతిక తాత్త్విక రంగాలకి సంబంధించిన ʹʹశాశ్వత విలువల్నిʹʹ కమ్యూనిస్టులు నాశనం చేస్తారని బూర్జువా వర్గం భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. ʹʹఒక విషయం మాత్రం గతించిన యుగాలన్నిటికీ సమాన లక్షణంగా ఉంది. అది ఏమిటంటే సమాజంలో పురుషులు, స్త్రీలపై ఆధిపత్యం చలాయిస్తారు. కాబట్టి గత చరిత్రలో సామాజిక చైతన్య రూపాల్లో ఎంత వైవిధ్యం కనిపించినా సారాంశంలో పోలికలే ఎక్కువ ఉంటాయి. ʹʹకమ్యూనిస్టు విప్లవం అనేది సాంప్రదాయిక ఆస్తి సంబంధాలతో అత్యంత మౌలికంగా తెగతెంపులు చేసుకోవడం కనుక కమ్యూనిస్టు విప్లవం యొక్క అభివృద్ధిలో సాంప్రదాయిక భావాలతో అత్యంత మౌలికంగా తెగతెంపులు చేసుకోవడం ఇమిడి ఉందిʹʹ.
కాబట్టి కమ్యూనిస్టు విప్లవం పెట్టుబడిదారీ ఆర్థిక పునాదినీ ఆ పునాదితో బాటు దాని ఉపరితల అంశాలనూ కూడా నిర్మూలిస్తుంది. ఇదే కార్మికుల కమ్యూనిస్టుల మహత్తర ఆశయం. ఈ ఆశయాన్ని కార్మికవర్గం రాజ్యాధికారాన్ని పొందడం ద్వారానే క్రమగతిలో సాధించగలుగుతారు. ʹʹవర్గాలూ, వర్గ విభేధాలూ గల పాత బూర్జువా సమాజానికి బదులు మనకొక నూతన సమాజం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా అభివృద్ధి చెందినప్పుడే అందరూ స్వేచ్ఛగా అభివృద్ధి చెందగల సమాజం ఏర్పడుతుందిʹʹ. కార్మికులూ-కమ్యూనిస్టులూ అనే రెండవ భాగం వర్గరహిత సమాజ స్థాపన లక్ష్య ప్రకటనతో ముగిసింది. సిద్ధాంత ఆచరణ కార్యక్రమాలు గతితార్కికంగా కలిసిపోయిన సమాజ ప్రస్థాన గీతంలా ప్రణాళిక కార్మికవర్గాన్నీ, కమ్యూనిస్టుల్నీ పోరాటంలో ఉత్తేజ పరిచింది.
సోషలిస్టు కమ్యూనిస్టు సాహిత్యం
ప్రణాళిక మూడవభాగం ʹసోషలిస్టు కమ్యూనిస్టు సాహిత్యంʹ లో మార్క్స్‌, ఎంగెల్స్‌లు తమ కాలం నాటి తమకు పూర్వకాలం నాటి సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని శాస్త్రీయంగా విమర్శించి ఖండించారు. వాటికీ తమ సిద్ధాంతానికీ విబేధాల్ని స్పష్టంగా విశ్లేషించారు. కార్మికుల సంఖ్య పెరిగేకొద్దీ వారికి ఉత్పత్తిలోనున్న కీలక స్థానాన్ని గుర్తించేకొద్దీ, తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కార్మికులు సంఘటితమై పోరాడే కొద్దీ, సామాజిక న్యాయం జరగాలనే శక్తులు, కొంత మంది వారి స్వప్రయోజనాల దృష్ట్యానూ, మరికొంత మంది ఉదారబుద్దితోనూ కార్మికుల్ని బలపరుస్తూ, తామూ సోషలిస్టులమని చెప్పుకొంటూ ముందుకు వస్తారు. అలాంటి వివిధ రకాల సోషలిస్టు అభిప్రాయాలు గలవారినీ, వారి అభిప్రాయాలనూ శాస్త్రీయ దృష్టితో విమర్శిస్తూ ప్రణాళికలోని మూడవ భాగంలో మార్క్సు-ఎంగెల్స్‌ తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.
బాబేఫ్‌, సెయింట్‌ సైమన్‌, ఓవెన్‌, ఫోరియర్‌, ప్రూడన్‌ వంటి సోషలిస్టుల సిద్ధాంతాల్నీ ఇంకా అనేక ఇతర సిద్ధాంతాల్నీ వర్గ పోరాట సిద్ధాంతం నుంచి విశ్లేషించారు. ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ దేశాలలో ప్యూడల్‌ జమీందారీ వర్గాలు ఆధునిక పెట్టుబడిదారీ వర్గాన్ని ఖండిస్తూ అనేక రచనలు చేశారు. వారు పెట్టుబడిదారీ వర్గాన్ని విమర్శించడానికి కారణం శ్రామికవర్గం విప్లవకరవర్గం అన్న భయం. క్రైస్తవ మతం బానిస విధానాన్ని, భూస్వామ్యాన్ని సమర్థించింది. ప్రణాళిక పెటీ బూర్జువా సోషలిజం, బూర్జువా సోషలిజం, ఉహజనిత సోషలిజం వంటి సిద్ధాంతాలను విమర్శ ద్వారా పూర్వపక్షం చేసింది. ఈ సిద్ధాంతాలు చాలావరకూ అభావం అయిపోయినప్పటికీ ఇప్పటికీ సోషలిజం పేరుతో అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అశాస్త్రీయ సిద్ధాంతాల్ని వర్గదృష్టి నుంచి పరిశీలించి నిరాకరించే పద్ధతిని ఈనాటికీ ప్రమాణంగా స్వీకరించాలి.
ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి
ప్రణాళికలో నాలుగవభాగం ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి అనేది కార్మికవర్గ విప్లవ ఎత్తుగడలకి సంబంధించింది. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, కమ్యూనిస్టులు పార్టీ పెట్టరు. కమ్యూనిస్టు పార్టీయేకాక ఇంకా ఇతర పార్టీలు ఉన్నప్పుడు వాటి పట్ల ఎలాంటి వైఖరి ఉండాలి. కార్మికవర్గ అంతిమ లక్ష్యం వెలుగులో కార్మికుల తక్షణ ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు ఇతర పార్టీలతో కలిసి పని చేస్తారు. ఆనాటి సాంఘిక, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే ప్రతి విప్లవోద్యమాన్ని కమ్యూనిస్టులు బలపరుస్తారు. సకల దేశాల ప్రజాతంత్ర పార్టీల మధ్య ఐక్యతని సాధించడానికి కమ్యూనిస్టులు కృషి చేస్తారు. ప్రతి దేశంలోని విప్లవోద్యమానికీ తోడ్పడుతారు.
బూర్జువా సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏ దేశంలో విప్లవోద్యమం కొనసాగినా దానిని కమ్యూనిస్టులు బలపరుస్తారు. అన్ని దేశాల్లో కమ్యూనిస్టులు ప్రజాతంత్ర పార్టీలతో కలసి పనిచేస్తారు. వాటితో ఒడంబడికలు చేసుకుంటారు. పెట్టుబడిదారీ విధానం గుత్తపెట్టుబడిగా మారి ద్రవ్య పెట్టుబడిగా దోపిడి చేస్తున్న క్రమంలో దేశ, విదేశ పార్టీలతో సంబంధం పెట్టుకున్నప్పుడు, ఉద్యమాల్ని బలపరుస్తున్నప్పుడు కమ్యూనిస్టులు తమ అభిప్రాయాల్ని దాచుకోరు. ప్రపంచ దేశాల్లోని ప్రజావ్యతిరేక ప్రభుత్వాల ʹʹసమస్త వర్తమాన సాంఘిక పరిస్థితులనూ బలవంతంగా కూలదోయడం ద్వారానే తమ లక్ష్యాలు సిద్ధించగలవని వాళ్ళు బహిరంగంగానే ప్రకటిస్తారు.
కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలనూ, ఆశయాలనూ కప్పిపుచ్చు కోరు. ప్రస్తుత సామాజిక వ్యవస్థను నాశనం చేస్తేగాని తమ ఆశయాలు సిద్ధించవని ప్రకటిస్తారు. విప్లవమంటే పాలకవర్గాలు గజగజ వణుకుతాయి. కమ్యూనిస్టు విప్లవమంటే కార్మికులు పోగొట్టుకునేది ఏమీ లేదు. తమ శృంఖలాలు తప్ప. వాళ్ళు పొందవలసింది ఎంతైనా ఉంది. ఇతర పార్టీల పట్ల ఉద్యమాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి మీద ప్రణాళికలో చెప్పినది ఈనాటికి అన్వయిస్తుంది. ʹయూరప్‌ను ఒక భూతం అవహించింది. కమ్యూనిజం అనే భూతంʹ అనే వాక్యంతో ప్రారంభమైన ప్రణాళిక ʹసకల దేశాల కార్మికులారా ఏకం కండిʹ కమ్యూనిస్టు సమాజాన్ని స్థాపించండి అనే పిలుపుతో పూర్తి చేయబడింది. చారిత్రకంగా ఈ ప్రణాళిక దేశదేశాల కమ్యూనిస్టులకు మార్గదర్శకంగా ఈ నాటికీ ఉపయోగపడుతోంది. కానీ ఇది కేవలం ఒకదేశంలోని ఒక సమయంలోని కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక కాదు. అన్ని దేశాల కమ్యూనిస్టు పార్టీలకు రాజకీయ, ఆర్థిక, తాత్విక ఆదర్శ పత్రం.
(మిగతా భాగం కోసం కింద చూడండి)

Keywords : karl marx, Friedrich Engels, marxism, communist manifesto
(2024-03-30 11:28:44)



No. of visitors : 2628

Suggested Posts


మార్క్స్‌ దాస్‌కాపిటల్‌లోని ఒక్క పేజీకి మూడున్నర కోట్లు !

వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను బైటపెట్టి, అదనపు విలువ సిద్దాంతంతో దోపిడీ గుట్టువిప్పిన కారల్‌ మార్క్స్‌ ద్విశతాబ్ది జయంతుత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన రాసిన దాస్‌ కాపిటల్‌ రాతప్రతి ఒకే ఒక్క పేజీ 5,23, 000 డాలర్లకు వేలంలో అమ్ముడంతో వార్తల్లోకెక్కింది. ఈ నెల 3న బీజింగ్‌లో మార్క్స్‌ రాసిన దాస్‌ కాపిటల్‌లోని ఒక పేజీ రాతప్రతిని వేలం వేయగా మూడున్నర కోట్ల

చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (రెండవ భాగం) - ఎ.నర్సింహరెడ్డి

దోపిడీని తీవ్రతరం చేయడం ద్వారా తృతీయ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకై రూపొందించిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పేరుతో సామ్రాజ్యవాదం సాగిస్తున్న కొత్తదాడులు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అన్యాయపూరిత, అమానుష స్వభావాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వర్ధమాన ప్రపంచంలోని కోట్లాది మందిని చుట్టుముట్టిన ఆకలి, కడగండ్లు, రోగాలు, నిరక్షరాస్యతలతో కూడిన భయానక

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చారిత్రాత్మక