తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?


తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

తెలంగాణ

(వీక్షణం స‍ంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసం వీక్షణం జూన్, 2018 సంచికలో ప్రచురించబడినది)

తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉద్యమంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచింది. తర్వాత సాగిన నాలుగు సంవత్సరాల పాలన తెలంగాణ ప్రజల ఆకాంక్షలనూ, ఉద్యమంలో వ్యక్తమైన ఆకాంక్షలనూ నెరవేర్చే దిశగా ప్రయాణించడం లేదనే అభిప్రాయం క్రమక్రమంగా బలపడుతూ వస్తున్నది. ఈ అసంతృప్తిని విభిన్న ప్రజా సమూహాలు ఎన్నో సందర్భాలలో వ్యక్తం చేస్తున్నాయి. మరొకపక్క, ఉద్యమంలో పాల్గొని ప్రస్తుతం అధికారం నెరపుతున్న శక్తులు, ఉద్యమంలో పాల్గొనకుండానే, ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి కూడ ప్రస్తుతం అధికారంలోకి దూరిన శక్తులు తెలంగాణ పాలన సజావుగా ఉన్నదని, బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్నదని భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ఉద్యమ ఫలితంగా ఏర్పడింది గనుక, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ ఆ ఉద్యమంలో ప్రధానస్థానం వహించింది గనుక ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమేనంటున్నారు.

ఈ రెండు చివరల అభిప్రాయాల మధ్య ʹకొంత బాగుంది, కొంత బాగులేదుʹ, ʹదశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని రాత్రికి రాత్రి సరిచేయ గలమాʹ, ʹతప్పులు జరుగుతున్నాయి గాని అందుకు కారణం ఉమ్మడిరాష్ట్ర పాలకుల చరిత్రేʹ, ʹఇప్పుడే పుట్టిన శిశువు మీద అభాండాలా, ఇంకా వేచిచూద్దాంʹ లాంటి అనేక మధ్యంతర అభిప్రాయాలు కూడ ఉన్నాయి.

ఈ భిన్నాభిప్రాయాల వైవిధ్యం సాధారణ ప్రజానీకంలో మాత్రమే కాక ఆలోచనాపరులలో, బుద్ధిజీవులలో కూడ వినబడుతున్నది. పైగా ఆ ఆలోచనాపరులలో, బుద్ధిజీవులలో చాలమంది అంతకుముందు ఉద్యమకాలంలో విప్లవకారులుగా, విప్లవోద్యమ సానుభూతిపరులుగా, ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దగల మేధావులుగా, కవులుగా, కళాకారులుగా ఉన్నవారే. బుద్ధిజీవులు ఎప్పుడూ ప్రభుత్వపక్షాన ఉండగూడదని, ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మాత్రమే ఉండాలని అన్నవారే. కాని, వారే ఇప్పుడు కొత్త సిద్ధాంతాలు తయారుచేస్తూ, ఈ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వమని, అందువల్ల ప్రజాపక్షం వహించడానికీ ప్రభుత్వపక్షం వహించడానికీ తేడా లేదని అంటున్నారు.

ఈ స్పష్టమైన ప్రభుత్వానుకూల అభిప్రాయాలు, తటస్థత పేరుతో చలామణీ అవుతున్న ప్రభుత్వానుకూల అభిప్రాయాలు ఎక్కువ ప్రాచుర్యాన్నే పొందుతున్నాయి. ప్రచారసాధనాలన్నీ కూడ ప్రయోజనాల కోసమో, నయానో భయానో ప్రభుత్వానుకూలంగా ఉన్నాయి గనుక ప్రభుత్వానుకూల అభిప్రాయాలే విస్తృతంగా ఉన్నాయేమోననే అభిప్రాయం కూడ బలపడుతున్నది. సమాజంలో పాలకవర్గ భావాలే ప్రబలమైన భావాలుగా చలామణీ అవుతుంటాయని మార్క్స్‌ అన్నమాట మరొకసారి రుజువవుతున్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనవచ్చునా లేదా తెలుసుకోవడానికి, అసలు ప్రభుత్వం అంటే ఏమిటి, ప్రజలంటే ఎవరు, ఒక ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వమని అనడానికి అవసరమైన ఆధారాలేమిటి, వర్తమాన భారత రాజకీయాలలో ఒకానొక రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అయ్యే అవకాశం ఉందా వంటి మౌలిక విషయాల్ని చర్చించవలసి ఉంది. కొందరు బుద్ధిజీవులు తమ తాత్కాలిక, శాశ్వత ప్రయోజనాల కోసమో, తప్పుడు చైతన్యం వల్లనో, భ్రమల వల్లనో, అపోహల వల్లనో ప్రచారం చేస్తున్న అభిప్రాయాల వెనుక సారాంశాన్ని అర్థం చేసుకోవలసి ఉంది.

ప్రభుత్వం అనేది రాజ్యాంగయంత్రంలోని అసంఖ్యాక సాధనాలలో ఒకానొకటి మాత్రమే. పాలన నెరపే ప్రత్యక్ష సాధనంగా ప్రభుత్వం ఎక్కువ కనబడుతుంది. ప్రభుత్వంలో కూడ ఇతర విభాగాల కన్న పోలీసు విభాగం ఎక్కువ కనబడుతుంది. పోలీసులు మాత్రమే ప్రభుత్వం అనిపిస్తుంది. అందుకే బ్రిటిష్‌ పాలన పోయి కాంగ్రెస్‌ పాలన వస్తుందంటే హెడ్‌ కనిష్టీబు బదిలీ అవుతాడా అని జట్కావాలా అడుగుతాడని కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు రాశారు! అలా ప్రత్యేకంగా పోలీసులకు, మొత్తంగా ప్రభుత్వానికి ఎక్కువ దృశ్యనీయత, ప్రచారం, ప్రభావం ఉంటాయి గాని, మొత్తంగా రాజ్యాంగ యంత్రంలో చట్టాలు, న్యాయవ్యవస్థ, నియంత్రణా వ్యవస్థలు, చెరసాలలు, సంస్కృతీ సాధనాలు వంటి ఎన్నో అంశాలు ఉంటాయి. వర్గ సమాజంలో రాజ్యాంగయంత్రపు ఏకైక లక్ష్యం ఆస్తి పరిరక్షణే. అంటే పాలకవర్గాల ప్రయోజనాల రక్షణే రాజ్యాంగయంత్రం పని. ప్రభుత్వం పని కూడ అదే. ఈ రాజ్యాంగ యంత్రంలో మిగిలిన సాధనాలన్నీ యథాతథంగా ఉండి, గతంలో పరిరక్షించిన ఆస్తి ప్రయోజనాలనే పరిరక్షిస్తూ, కేవలం ప్రభుత్వ నిర్వాహకులు మారినంత మాత్రాన పాలనలో, సమాజ నిర్వహణలో ఏ మార్పులూ రావు. అందువల్ల రాజ్యం గురించి మాట్లాడకుండా ప్రభుత్వంలో మార్పు గురించి మాట్లాడితే ఏ ప్రయోజనమూ లేదు.

ప్రభుత్వం రాజ్యం చేతిలోని, స్పష్టంగా చెప్పాలంటే పాలకవర్గాల చేతుల్లోని ఒకానొక సాధనం మాత్రమే గనుక అసలు రాజ్యం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవాలి. ఆధునిక రాజ్యపు ఒకానొక సాధనంగా ప్రభుత్వం ఎలా ఆవిర్భవించి, కొంత స్వతంత్ర ప్రతిపత్తిని ప్రదర్శిస్తూ, దాన్ని చేపడితే సమస్తమూ మార్చవచ్చుననే భ్రమలను ఎలా కల్పిస్తున్నదో చూడాలి.

ప్రభుత్వం రాజ్యంలో భాగమేనని గుర్తించకపోవడం, ప్రభుత్వం గురించి అనవసరమైన భ్రమలు సాధారణ ప్రజల్లో మాత్రమేకాక, విద్యావంతుల్లో, బుద్ధిజీవుల్లో, చివరికి తమను తాము మార్క్సిస్టులుగా భావించుకునే వారిలో కూడ ఉన్నాయి గనుక ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. కేవలం ప్రభుత్వాన్ని మార్చగలిగే ఎన్నికల ద్వారా రాజ్యాన్ని మార్చగలమనే తప్పుడు నమ్మకాన్ని కలిగిస్తున్న పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఉన్న భారత సమాజంలో ఈ చర్చ ఇంకా ఎక్కువ అవసరం. వ్యవస్థ మారకుండానే ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా ప్రజల జీవితాలను, భవిష్యత్తును మార్చగలమని, ప్రభుత్వాన్ని మార్చడానికి ఎన్నికలు ఒక మార్గమని ప్రచారం చేస్తున్నవారు అమాయకులైనా కావాలి, లేదా ఉద్దేశపూర్వకంగా తమ ప్రయోజనాల కోసం అబద్ధాలైనా చెపుతూ ఉండాలి.

వర్గసమాజంలో, అంటే సమాజానికి అత్యవసరమైన ఉత్పత్తి సాధనా లకు యజమానులైన వర్గమూ, ఆ ఉత్పత్తి సాధనాలను ఉపయోగించి సమాజానికి ఉపయోగకరమైన శ్రమ చేస్తూ, కనీస శ్రమ ఫలితం కూడ దక్కని వర్గమూ ప్రధానంగా ఉన్న సమాజంలో, భిన్న వర్గాల ప్రయోజనాల మధ్య సహజంగానే ఘర్షణ ఉంటుంది. మధ్యంతర వర్గాలు కూడ భౌతికం గానో, భావజాలపరంగానో అటో ఇటో చేరిపోవలసి వస్తుంది. ఈ భిన్నవర్గాల మధ్య తమ తమ ప్రయోజనాల కోసం నిరంతరం సాగే ఘర్షణను అదుపులో ఉంచడానికి, యథాస్థితిని, అంటే పాలకవర్గాల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి రాజ్యం పుట్టుకువచ్చింది. యథాస్థితిలో తమ ప్రయోజనాలు దక్కడం లేదని గుర్తించిన పాలితవర్గాలు తిరుగుబాటు కు దిగితే హింస ద్వారా అణచివేయడానికి, హింసా వినియోగపు గుత్తాధిపత్యాన్ని రాజ్యం తనకు తాను ఇచ్చుకుంది.

ʹʹగతంలో ఎంతో చులకనగా చూసిన సొంత ఆస్తిని పవిత్రమైనదిగా స్థిరపరచడం మాత్రమే కాదు, ఆ పవిత్రతను కాపాడడమే మానవ సమాజ ప్రధాన గమ్యంగా ప్రకటించాలి. అంతేకాదు, ఆస్తులను సంపాదిం చేందుకు అవసరమైన నూతన పద్ధతులకూ, సంపదల నిరంతరాభివృద్ధికీ సామాజిక ఆమోదాన్ని కల్పించాలి. సమాజంలో కొత్తగా తలెత్తుతున్న వర్గ విభజననే కాకుండా, ఆస్తిపరుల వర్గం ఆస్తిలేని వర్గాలను దోచుకుని, పాలించే హక్కును కూడ శాశ్వతంగా కొనసాగించే వ్యవస్థ కావాలి. ఆ రకమైన సంస్థగానే రాజ్యం ఉనికిలోకి వచ్చిందిʹʹ అని ఎంగెల్స్‌ ʹకుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగయంత్రాల పుట్టుకʹలో రాజ్య ఆవిర్భావాన్ని అద్భుతంగా వివరించాడు.

అలా క్రీ.పూ. ఆరో శతాబ్ది ప్రాంతంలో గ్రీకు నగరం ఏథెన్స్‌ లో ఆవిర్భవించిన రాజ్యం కాలక్రమంలో ఎన్నెన్నో సాధనాలను పోగు చేసుకుంది. బానిస సమాజంలో పుట్టిన రాజ్యం, భూస్వామ్య దశలో నిరంకుశాధిపత్యంగా బలపడి, పెట్టుబడిదారీ దశలో ఆధునికంగా మారి జనాకర్షక విధానాలను తనలో కలుపుకుంది. సార్వత్రిక వోటు హక్కు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, అధికారాల విభజన, భావప్రకటనా స్వేచ్చ అనే అలంకారాలు దిద్దుకుని తనను తాను తటస్థమైనదానిగా, మధ్యవర్తిగా, ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే సంక్షేమ రాజ్యంగా చూపుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ʹʹకార్మికుల మద్దతు కూడగట్టుకోక తప్పని స్థితివైపు పాలకవర్గాలను సార్వత్రిక వోటు హక్కు నెడుతుందిʹʹ అని ఎంగెల్స్‌ అన్నమాట రాజ్యం కొనసాగింపుకూ సార్వత్రిక వోటు హక్కు వంటి నాటకాలకూ మధ్య సంబంధాన్ని చూపుతుంది.

కాని ఎంత మారినా, ఎన్ని రంగులు అద్దుకున్నా, మౌలికంగా రాజ్యపు సాధనాలన్నిటి లక్ష్యం సొంత ఆస్తిని, వర్గ సమాజాన్ని, ఆధిపత్యవర్గాల పాలనను రక్షించడమే. రాజ్యాలన్నీ కూడ ఈ మౌలిక సూత్రం మీద పనిచేస్తున్నవే. అందుకే మార్క్స్‌ ఆధునిక రాజ్యపు కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వాన్ని ʹʹసమస్త బూర్జువా వర్గపు ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే బృందం తప్ప మరేమీ కాదుʹʹ అన్నాడు.

ఈ నేపథ్యంలో చూసినప్పుడు వర్గ రహిత సమాజంలో తప్ప రాజ్యమూ, రాజ్యాన్ని అంటిపెట్టుకుని ఉండే దుర్మార్గమూ రద్దయిపోవు. ఆ వర్గ రహిత సమాజాన్ని చేరడానికి ముందు, ఇప్పటిదాకా పాలిత వర్గంగా ఉండిన శ్రామికవర్గం తన శక్తి తెలుసుకుని ఆధిపత్య వర్గాల నుంచి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవలసి ఉంటుంది. ఆధిపత్య వర్గాలు తిరిగి తలెత్తకుండా, కుట్రలకూ కుహకాలకూ పాల్పడకుండా శ్రామిక వర్గ నియంతృత్వ రాజ్యాన్ని అమలు చేయవలసి ఉంటుంది. వందల సంవత్సరాలో, వేల సంవత్సరాలో పట్టే ఈ చారిత్రక క్రమం మన ఇష్టాయిష్టాల ప్రకారం హఠాత్తుగా జరిగిపోదు. అందుకు అనుకూలమైన భౌతిక పరిస్థితులు, అంటే ఉత్పత్తి సాధనాల, ఉత్పత్తి శక్తుల పరిణతి ఏర్పడవలసి ఉంటుంది. అనుకూలమైన స్వీయ మానసిక శక్తుల సంసిద్ధత, పోరాటం అవసరమవుతాయి. తమ సంపదను, అధికారాన్ని నిలిపి ఉంచుకోవడానికి పాలకవర్గాలు హింసా దౌర్జన్యాలు ఉపయోగిస్తాయి గనుక ఈ పోరాటం ప్రతిహింసా పోరాటం కాకతప్పదు. పాలకవర్గాలు వందల సంవత్సరాలుగా ప్రజల మెదళ్లలో నింపిన భావజాలం దోపిడీ పీడనల యథాస్థితి సహజమైనదనీ, శాశ్వతమైనదనీ, మారదనీ అనుకునే తప్పుడు చైతన్యాన్ని కలిగించి ఉంటుంది గనుక ప్రజలలో చైతన్యం నింపే సుదీర్ఘ ప్రయత్నం, పోరాటం అవసరమవు తాయి. ఇవేమీ లేకుండా అల్లావుద్దీన్‌ అద్భుత దీపం లాగ రాత్రికిరాత్రి ప్రజాప్రభుత్వం, ప్రజారాజ్యం ఏర్పడవు. ఇంత సుదీర్ఘ ప్రయత్నం, పోరాటం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కూడ ప్రజాప్రభుత్వంగా, ప్రజా రాజ్యంగా మారాలంటే, కొనసాగాలంటే ప్రజల నిరంతర జాగరూకత, చైతన్యం అవసరమవుతాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పాలకవర్గ రాజ్యాధికారాన్ని యథాతథంగా కొనసాగించడానికి వేసుకున్న ఒకానొక ఎత్తుగడ మాత్రమే. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎన్నికల ద్వారానే ప్రభుత్వాల మార్పు జరుగుతుంది. ప్రభుత్వాల మార్పు అంటే పాలకవర్గాల ముఠాలలోనే ఒక ముఠా నుంచి మరొక ముఠాకు అధికారం మారడమే తప్ప, ప్రజలకు అధికారం రావడం కాదు, రాజ్యం మారడం కాదు.

మరి ప్రజలకు అధికారం అంటే ఏమిటి? అసలు ప్రజలు అనే మాటను వర్గసమాజంలో ఎలా అర్థం చేసుకోవాలి?ఆ మాటను సర్వ సాధారణంగా వాడుతూ దాని అసలు అర్థం మరిచిపోయిన స్థితిలో ఉన్నాం. గ్రీకు, రోమన్‌ బానిస సామ్రాజ్యాల నాటి నుంచి ఆధునిక కాలం దాకా పాలకవర్గాలు ఎప్పుడూ ʹప్రజలుʹ అనే మాటను తమ వర్గానికీ, తమ ఆశ్రితులకూ మాత్రమే వర్తించేట్టుగా వాడాయి. బానిస సమాజంలో బానిసలు ప్రజలు కారు, భూస్వామ్య సమాజంలో భూమిలేని అసంఖ్యాక నిరుపేద రైతుకూలీలు ప్రజలు కారు. పెట్టుబడిదారీ సమాజం సార్వత్రిక వోటింగ్‌ హక్కు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే మాటలు చెప్పి జనాభా అంతటినీ ప్రజలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది గాని వాస్తవానికి సరుకు కొనుగోలుశక్తే ప్రజలు అనే నిర్వచనంలో చేరడానికి అనుమతి పత్రంగా ఉంది. దాన్నిబట్టి తేలేదేమంటే, చరిత్ర పొడవునా మానవ సమూహాన్నంతా ప్రజలుగా గుర్తించడం జరగలేదు. మరో మాటల్లో చెప్పాలంటే బానిస సమాజం తనలో కొంత భాగాన్ని మనుషులు గానే చూడలేదు, జంతువులుగా చూసింది. భూస్వామ్య సమాజం తనలో కొంత భాగాన్ని కేవలం వెట్టి శ్రామికులుగా చూసింది. పెట్టుబడిదారీ సమాజం పౌరులుగా, సమానంగా చూస్తానని వాగ్దానం చేసింది గాని వినియోగదారులుగా చూడడంతో ఆగిపోయింది. కనుక ఈ సమాజాలు వేటిలోనూ పాలకుల వ్యక్తిగత మంచి చెడులతో, ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు.

ఎవరి శ్రమ వల్ల సమాజ చలనానికి వీలు కలుగుతుందో, సమాజ సంపద పోగుపడడానికి అవకాశం వస్తుందో వారే ప్రజలు. ఇతరుల శ్రమ ఫలితాన్ని అనుభవించేవారు ప్రజలు కాజాలరు. శ్రామికులకు వోటు హక్కు ఇచ్చినప్పటికీ వారి నిజమైన ప్రతినిధులు అధికారానికి వచ్చే అవకాశం లేనందువల్ల అలా ఏర్పడేవి ప్రజా ప్రభుత్వాలు కాజాలవు. ʹʹప్రజలలోʹʹ కొందరి వోట్లతోనే అధికారానికి వచ్చినప్పటికీ మౌలికమైన పునాది మారనంతవరకూ అవి ప్రజా ప్రభుత్వాలు కాజాలవు.

ఈ స్థూలమైన తాత్విక, చారిత్రక, రాజకీయార్థిక అవగాహన ఉంచుకుంటూనే, ఆధునిక ప్రభుత్వాలు అప్పుడప్పుడు చూపే ʹʹప్రజానుకూలʹʹ విధానాలను, చర్యలను ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నకు జవాబు చెప్పవలసి ఉంటుంది. వర్గ సమాజంలో ప్రభుత్వాలు పాలకవర్గాలకు అనుకూలంగానే తప్ప ప్రజలకు అనుకూలంగా పనిచేయవనే అవగాహన నిజమే అయినా, కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ఏదో ఒక ప్రజానుకూల విధానాన్ని ప్రకటించడమో, ప్రజానుకూల చర్య అమలు చేయడమో, చేసినట్టు నటించడమో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి విధానాలూ చర్యలూ మనలో కొంత గందరగోళాన్ని కలిగిస్తున్న మాట కూడ నిజమే.

ఈ సందర్భంలో ఆ ప్రభుత్వ విధానాలనూ చర్యలనూ నాలుగు స్థాయిలలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. 1. ప్రజలను ఆకర్షించడానికి, ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో, తీవ్రమైన ప్రజావ్యతిరేకత గల పాలకవర్గాలు కూడ ప్రజానుకూల విధానాలను ప్రకటిస్తాయి, చర్యలను అమలు చేస్తాయి. 2. ఆ ప్రజానుకూల విధానాలు, చర్యలు అనబడేవి కూడ పైకి చూడడానికి అలా కనబడతాయి గాని లోతుకు వెళ్లి సారాంశంలో పరిశీలిస్తే ప్రధాన ప్రయోజనం, ఎక్కువ ప్రయోజనం పాలకవర్గాలకే సమకూరేలా ఉంటాయి. ఎంతో కొంత, అతి స్వల్ప ప్రయోజనం ప్రజలకు దక్కితే దక్కవచ్చు. 3. భిన్న వర్గాల సమాజంలో ప్రభుత్వంలో అందరికందరూ పాలకవర్గాలకు చెందినవారే ఉండే అవకాశం లేదు. ఎక్కడో ఒకచోట నిర్ణయాధికార స్థానంలో ఎవరో ఒక ప్రజానుకూల వ్యక్తి ఉండవచ్చు. వారి పరిధి మేరకు ప్రజానుకూల నిర్ణయాలు అమలు చేయవచ్చు. కాని ఆ నిర్ణయాలు మౌలికంగా వ్యవస్థను ప్రశ్నించేవి కానంతవరకు మాత్రమే ఆమోదించబడతాయి. మౌలిక ప్రశ్నలు వేస్తే వారి అధికారమే రద్దవుతుంది. 4. అటువంటి ప్రజానుకూల నిర్ణయం అమలైన సందర్భంలో కూడ అదేదో ఆ ప్రభుత్వ పెద్దలు ప్రజల పట్ల చేసే మెహర్బానీగా చూడడం సరి కాదు. ప్రజల శ్రమ ఫలితాన్ని పన్నుల రూపంలో అనుభవిస్తున్న, ప్రజల వోట్లతో గద్దెనెక్కామని అనుకుంటున్న ప్రభుత్వ నిర్వాహకులు తప్పనిసరిగా ప్రజలకు చెల్లించవలసిన వాటా, ప్రతిఫలం అది. ఆ ప్రయోజనాలు పొందడం ప్రజల హక్కు, ప్రభుత్వాల దయాదాక్షిణ్యం కాదు.

ఈ నాలుగు అంశాలూ ప్రపంచంలో ఎక్కడైనా వర్తించేవి కాగా, భారత సమాజంలో మరొక అంశం కూడ ఉంది. ఇక్కడి రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ జాబితా, రాష్ట్ర ప్రభుత్వ జాబితా, ఉమ్మడి జాబితా ఉన్నాయి గనుక, రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చినవారు తమ పరిధిలో ఉన్న అంశాలలో ప్రగతిశీల, ప్రజానుకూల విధానాలను ప్రవేశపెట్టి, అమలు చేయవచ్చు. అలాగే ఈ సువిశాల దేశంలో సంక్లిష్టమైన, విశాలమైన అధికారవ్యవస్థ ఏర్పడి ఉంది గనుక ఎక్కడో ఒక ప్రభుత్వాధికారి తన పరిధిలో కొన్ని ప్రజానుకూల చర్యలు అమలు చేసే అవకాశం ఉంది. అయితే గత ఏడు దశాబ్దాలలో వామపక్షాలు అనబడేవి రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన చోట్ల కూడ, కనీసం తమ పరిధిలోని అంశాలలోనైనా ప్రజానుకూల విధానాలు అమలు చేయలేదు. అమలు చేయడానికి ప్రయత్నించిన అతి కొద్ది సందర్భాలలో ప్రభుత్వాధికారాన్నే వదులుకోవలసి వచ్చింది. అలాగే అధికారులు ప్రజానుకూలంగా ఉండడం కూడ వారు ప్రదర్శనావస్తువులుగా ఉన్నంతవరకే ఆమోదించడం, వారు అంతకన్న ఎక్కువ మౌలిక ప్రశ్నలు వేస్తే వారిని ఆ స్థానాల నుంచి తొలగించడం ఎన్నో సార్లు జరిగింది. అలా ప్రభుత్వాలైనా, అధికారులైనా మౌలిక ప్రజానుకూల నిర్ణయాలను అమలు చేయలేకపోయారంటేనే ఈ వ్యవస్థలో ప్రజానుకూల ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం లేదనడానికి రుజువు.

పారిస్‌ కమ్యూన్‌ గురించి మార్క్స్‌ చేసిన విశ్లేషణ ʹసివిల్‌ వార్‌ ఇన్‌ ఫ్రాన్స్‌ʹ ను 1891లో పునర్ముద్రిస్తూ ఎంగెల్స్‌ రాసిన ముందుమాటలో ప్రభుత్వం గురించి, ప్రభుత్వోద్యోగుల గురించి ఎప్పటికీ మరచిపోగూడని మాటలన్నాడు: ʹʹసమాజం తన ఉమ్మడి ప్రయోజనాలను పర్యవేక్షించ డానికి తన సొంత సంస్థలను తయారు చేసుకుంది. మొట్టమొదట ఈ ఏర్పాటు ఒక సరళమైన శ్రమ విభజన. కాని ఈ సంస్థలన్నిటికీ పైన రాజ్యాధికారం ఉంది గనుక కాలక్రమంలో ఈ సంస్థలన్నీ తమ సొంత ప్రత్యేక ప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలో పడ్డాయి. అవి తమను తాము సమాజ సేవకుల స్థానం నుంచి సమాజ యజమానుల స్థానానికి మార్చుకున్నాయి. ఈ విషయం వంశపారంపర్య రాచరికంలో మాత్రమే కాదు, ప్రజాస్వామిక గణతంత్రంలో కూడ సమానంగా అమలు కావడం చూడవచ్చు. ఇలా ʹʹరాజకీయవేత్తలుʹʹ అందరికన్న పైన ఒక ప్రత్యేక, శక్తిమంతమైన బృందంగా మారిన దేశాలలో ఉత్తర అమెరికా లాంటిది మరెక్కడా లేదు. అక్కడ రెండు ప్రధాన పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తాయి. రాజకీయాలనే వ్యాపారంగా మార్చుకున్న వారు ఆ పార్టీలను అదుపుచేస్తారు. వారే కేంద్ర శాసనసభలోనూ, వివిధ రాష్ట్రాల శాసనసభలలోనూ ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయో అంచనా కడతారు. పార్టీ విజయం కోసం ఉద్యమాలు సాగించడంలోనే వారి భుక్తి సమకూరుతుంది. చివరికి ఆ పార్టీ విజయం సాధించగానే వారికి పదవుల ప్రతిఫలం దొరుకుతుంది.ʹʹ

ఈ ఉటంకింపులో సమాజసేవకులుగా ప్రారంభమైన రాజకీయ నాయకులు సమాజ యజమానులుగా మారడం అనేది కీలకాంశం. వర్గ సమాజం ఉన్నంతకాలం ఈ మార్పుకు అవకాశం ఉంటుంది. ఈ సూత్రీకరణకు సోషలిస్టు దశ కూడ మినహాయింపు కాదని ఇరవయో శతాబ్ది విప్లవానంతర ప్రభుత్వాలు చూపాయి. అటువంటప్పుడు భారత సమాజంలో, తెలంగాణలో రాజకీయ నాయకులు సమాజ సేవకులుగా ఉంటారని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, ప్రజానుకూల విధానాలు అమలు చేస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.

అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కొన్ని ప్రత్యేకత లున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షల ఉద్యమం గనుక ఆ ప్రాంతంలోని అన్ని వర్గాల, అన్ని దృక్పథాల ప్రజా సమూహాలు ఆ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఆ ఆకాంక్షలలో అన్ని సమూహాలకు చెందిన ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఆకాంక్షలు ఉన్నాయి గనుక, ఆ ఆకాంక్షలకు చారిత్రక స్వభావం ఉంది గనుక అన్ని సమూహాల భాగస్వామ్యం ఎక్కువగానే ఉండింది. అందువల్ల భిన్న భావజాలాల వ్యక్తుల మధ్య ఉద్యమకాలంలో సాన్నిహిత్యం, స్నేహం, మొహమాటాలు బలపడ్డాయి. దానితో ప్రభుత్వాధికారంలో ఉన్నవారితో నిష్కర్షగా, నిర్మొహమాటంగా వ్యవహరించే, వారి ప్రజావ్యతిరేక చర్యలను ఎత్తిచూపి, నిరసన తెలిపే అవకాశం బలహీనపడింది.

అన్ని ఉద్యమాలలోలాగనే ఈ ఉద్యమంలో కూడ కొన్ని సమూహాలు అవసరమైనదానికన్న ఎక్కువ త్యాగం చేయడమూ, కొన్ని వర్గాలు ఏ త్యాగమూ చేయకుండానే నాయకత్వం వహించడమూ జరిగింది. ఉద్యమ మౌలిక లక్షణాలలో అది బహుళవర్గ ఆకాంక్ష కావడం, ఉద్యమానికి మిగిలిన అన్ని అస్తిత్వ ఉద్యమాల వలెనే సంకుచిత స్వభావం ఉండడం, ఉద్యమ నాయకత్వం పాలకవర్గాలలో ఒక ముఠా చేతిలో ఉండడం వంటి కారణాల వల్ల అంతిమంగా ప్రభుత్వాధికారం ఆ ముఠాకే దక్కింది. మిగిలిన వర్గాలు తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఎదురుచూడడమో, తమ సొంత ప్రయోజనాలు దక్కితే చాలునని అధికారవర్గంతో కుమ్మక్కు కావడమో తప్ప గత్యంతరం లేకపోయింది. బుద్ధిజీవులలో అత్యధిక సంఖ్యాకులు ఇలా కుమ్మక్కు కావడానికో, మౌనంలోకీ, నిర్లిప్తత లోకీ వెళ్లడానికో సిద్ధపడ్డారు. సమీపగతంలోని ఉద్యమ ఉధృతి వల్ల ఎక్కువ వర్గాలు తక్షణమే అధికార వర్గపు స్వభావాన్ని విప్పి చెప్పి ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడానికి తొలిరోజుల్లో సాహసించలేకపోయాయి. ఈ సంక్లిష్ట చిత్రంలో పాలకవర్గ ప్రయోజనాలు పెద్దఎత్తున నెరవేరుతూ వచ్చాయి. చివరికి ఉద్యమం ఏ పాలకవర్గ ముఠాల ప్రయోజనాలను ప్రశ్నించిందో, నిలదీసిందో ఆ ముఠాల అధికారమూ, ప్రయోజనాలూ కూడ తగ్గలేదు సరిగదా పెరిగాయి. ఎన్ని పరిమితులలోనైనా ప్రజా ఆకాంక్షలు నెరవేరడానికి ఉన్న అవకాశాల మీద పట్టుపట్టడానికి కూడ శక్తిలేనంతగా ప్రజారాశులు బలహీనమైపోయాయి.

నిజానికి భారత చరిత్రను అధ్యయనం చేస్తే ఇదేమీ కొత్త విషయం కాదు. అధికార మార్పిడి తర్వాత, 1947 ఆగస్ట్‌ 15 తర్వాత భారత ప్రభుత్వం సరిగ్గా అంతకు ముందరి బ్రిటిష్‌ ప్రభుత్వం లాగనే పాలన కొనసాగించింది. నిజాం పాలన అంతమైన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇటువంటి పాలననే అనుభవించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడం, ప్రజలకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను కూడ పాలకవర్గాలు నెరవేర్చకపోవడం భారత చరిత్రలో ఎన్నోసార్లు జరిగాయి. 2014 జూన్‌ 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలన కూడ అదే తానులోని ముక్క అని గుర్తించడానికి ఎక్కువ శ్రమ పడనక్కరలేదు. ఈ నాలుగేళ్ల పాలన అంతకు ముందరి పాలనల లాగనే ఉంది. పాలనా విధానాలు, ఆర్థిక విధానాలు, ప్రజా సంక్షేమ విధానాలు, పౌరహక్కులు, అధికార పటాటోపం, అవినీతి వంటి ఏ ఒక్క సూచిక తీసుకున్నా 1956-2014 పాలన కన్న రెండాకులు ఎక్కువ చదివిన ప్రజావ్యతిరేక పాలనే సాగుతున్నది గాని, ప్రజానుకూలమైన, ఉద్యమకాలపు ఆకాంక్షలకు అనుగుణమైన మార్పు ఒక్కటి కూడ రాలేదు. ఏవో కొన్ని సంక్షేమ పథకాలు, వాగాడంబరాలు చూసి మోసపోయినా, మోసపుచ్చ దలచుకున్నా, మౌలిక అంశాలను పరిశీలిస్తే ఏ ఒక్క సూచికలోనూ ఇది భిన్నమైన ప్రభుత్వం కాదని, కొన్ని సూచికలలో ఇంకా దారుణమైన ప్రభుత్వమని కూడ నిర్ధారణ అవుతుంది.

-ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, kcr, trs, movement,
(2019-03-17 03:30:50)No. of visitors : 486

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


తెలంగాణ