వెర్రితలలు వేస్తున్న విద్వేషం..!


వెర్రితలలు వేస్తున్న విద్వేషం..!

వెర్రితలలు

దేశంలో మతోన్మాదం అనేది రోజు రోజుకూ వెర్రితలలు వేస్తోంది. బీజేపీ హయాంలో ఇది మరింతగా పెరిగిపోయిందనేది వాస్తవం. దీనికి బీజేపీ ప్రధాని నుంచి కార్యకర్త వరకు అందరూ మద్దతు ఇస్తున్నారనేది కూడా వాస్తవమే. కాని ఇదే మతోన్మాదం తిరిగి బీజేపీ మంత్రికే ఎదురు తిరిగింది. మతోన్మాద మత్తు ఎలా ఉంటుంది స్వయంగా సుష్మా స్వరాజ్ చవిచూసింది. దీనికి ఆమె పార్టీ కార్యకర్తలే కారణం కావడం యాదృశ్చికమేమీ కాదు. అసలు జరిగిన వాస్తవం ఏమిటి..? దీనికి మతోన్మాద బీజేపీ ʹట్రోల్ సైన్యంʹ ఆమెను ఎలా టార్గెచ్ చేసిందని Wahed Abd తన ఫేస్‌బుక్ వాల్‌పై ఒక పోస్టు రాశారు. అదేమిటో కింద చదవండి ..
------------------------------------------------------------------

మేరీ షెల్లి అనే రచయిత్రి రాసిన నవల ʹఫ్రాంకెస్టయిన్ʹ చాలా ప్రసిద్ధ నవల. 1823లో ప్రచురించబడింది. విక్టర్ ఫ్రాంకెస్టయిన్ అనే వ్యక్తి సృష్టించిన రాక్షసుడు చివరకు అతన్నే చంపేస్తాడు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌పై ʹట్రోల్ ఆర్మీʹ దాడుల వార్తలు చదివిన తర్వాత ఈ కథ చాలా గుర్తొచ్చింది. దాదాపు 30 వేల మంది బిజేపికి మద్దతిచ్చే ʹట్రోల్ సైనికులుʹ ఆన్‌లైన్‌లో సుష్మా స్వరాజ్ ఫేస్‌బుక్ పేజ్ డౌన్‌గ్రేడ్ అయ్యేలా చేశారు. స్వంత పార్టీలోని వీరభక్తులే ఇలా చేయడం భలే విచిత్రం. ఎందుకిలా చేశారంటే.. ఇటీవల లక్నోలో ఒక జంట పాస్‌పోర్ట్ కోసం వచ్చింది. వారిది మతాంతర వివాహం. అక్కడ పాస్‌పోర్ట్ అధికారి వికాస్ మిశ్రా అత్యంత అనుచితంగా ఆ జంటను అవమానించాడు. ముస్లింను పెళ్ళి చేసుకున్నావు నీకు పాస్‌పోర్టు దొరకదని అన్నాడు. తనకు జరిగిన అవమానాన్ని తన్వీ సేఠ్ ట్వీట్ ఛేసింది. సుష్మా స్వరాజ్ స్వయంగా కల్పించుకుని ఆ జంటకు పాస్‌పోర్టు లభించేలా చూశారు. తప్పు చేసిన అధికారిని బదిలీ చేశారు. ఇది మతోన్మాద ʹట్రోల్ʹ సైన్యానికి నచ్చలేదు.

అత్యంత అనుచితంగా, ఒక మహిళ అన్న గౌరవం కూడా లేకుండా సుష్మా స్వరాజ్‌పై విరుచుకుపడ్డారు. ఇలా సుష్మా స్వరాజ్‌పై దాడి చేసిన ʹట్రోల్ʹ సైనికుల్లో కొందరిని మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఎంతో అభిమానంగా ఫాలో అవుతున్నారు. అలాంటి వారిలో కెప్టెన్ సరభ్‌జిత్ ధిల్లన్ ఒకడు. ʹʹఆమె దాదాపు చచ్చిన మనిషితో సమానం. ఒకే కిడ్నీతో బతుకుతోంది. అదెప్పుడైనా పని చేయడం ఆపేయవచ్చుʹʹ అని రాశాడు. ఇంత నీచంగా ఒక మహిళను అవమానించడం కేవలం బిజేపి ʹభక్త ట్రోల్ʹ సైన్యానికి మాత్రమే సాధ్యం. ఇంద్రా బాజ్‌పేయ్ అనే మరో వీరభక్తురాలు..ʹʹసిగ్గుండాలి, మీ ఇస్లామిక్ కిడ్నీ ప్రభావమేమో ఇదంతాʹʹ అని రాసింది. సుష్మా స్వరాజ్‌కి కిడ్నీ దానం చేసింది ఒక ముస్లిమ్. కాబట్టి ఈ వ్యాఖ్య. వీటన్నింటికి మించి ʹభారత్ 1ʹ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన వ్యాఖ్య.. సుష్మా స్వరాజ్ గుండెల్లో పాకిస్తాన్ ఉన్నట్లు ఒక బొమ్మలో చూపిస్తూ.. ఆమె ఎప్పుడు కనబడినా చంపేయాలని వ్యాఖ్యానించారు. ఈ ట్వీటుపై గగ్గోలు చెలరేగినా ట్వీటు చేసిన వ్యక్తి తొలగించలేదు. అంటే కచ్చితంగా బిజేపి పెద్దల ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యం కాదు. అంతే కాదు ఈ ʹభారత్ 1ʹ మరికాస్త ముందుకు వెళ్ళి ఆమె ʹఅక్రమసంతానంʹ అని కూడా వ్యాఖ్యానించాడు. ఇంత నీచమైన వ్యాఖ్యలతో దాడి చేయగలిగిన సంస్కారం కేవలం ఈ ʹవీరభక్తʹ ట్రోల్ సైన్యానికి మాత్రమే ఉంటుంది. మరొక వీరభక్తుడు రిషి బాగ్రీ తన ట్వీటులో వికాస్ మిశ్రాను సమర్ధిస్తూ.. సిగ్గుండాలి అని వ్యాఖ్యనించాడు. ఇతడిని ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా ఇంకా చాలా మంది పెద్దలు ఫాలో అవుతుంటారు. సుష్మా స్వరాజ్‌కు మద్దతుగా వినిపిస్తున్న స్వరాలన్నీ ప్రతిపక్షాలు, ఇతర పక్షాలవే తప్ప బిజేపి నుంచి కాదు.

మాజీ దౌత్యవేత్త కే.సి.సింగ్ ఈ విషయమై రాస్తూ.. ʹʹఇదో విషాదం, లలిత్ మోడీ విషయంలో ఆమె వ్యవహారశైలిని విమర్శించినందుకు నాలాంటి వారిని ఆమె బ్లాక్ చేశారు. ఇప్పుడు ఒక పాస్‌పోర్టు వ్యవహారంలో సముచితంగా వ్యవహరించినందుకు వీరభక్తుల దాడికి గురవుతున్నారు. ఇప్పుడు మాలాంటి వారే ఆమెకు మద్దతిస్తున్నాంʹʹ అన్నారు. కొందరు విశ్లేషకుల ప్రకారం ఇదంతా బిజేపి అధిష్టానం ఆశీస్సులతోనే జరుగుతుందని, రానున్న సాధారణ ఎన్నికల్లో కేవలం హిందూత్వ ప్రధాన నినాదంగా బిజేపి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటోందని.. అందుకే కాశ్మీరులో ప్రభుత్వాన్ని పడగొట్టి కశ్మీరు సమస్యను కూడా ఎన్నికల ప్రధాన సమస్యగా మారుస్తారని అంటున్నారు.

భక్త సైన్యం ఇప్పుడు బిజేపి పార్టీ నేతలనైనా వదలడం లేదు. వాట్సప్, సోషల్ మీడియాల ద్వారా రెచ్చిపోతున్నారు. ఈ మనస్తత్వం ఎలాంటిది? ఎలాంటి విషాన్ని మస్తిష్కాల్లో ఎక్కించారన్న ప్రశ్నలు ఆలోచించవలసినవి. ప్రముఖ షెఫ్, అంతర్జాతీయంగా పేరున్న పెద్దమనిషి అతుల్ కోచార్ సంఘటన చూద్దాం. అమెరికా టీవీ ప్రోగ్రామ్ క్వాంటికోలో ప్రియాంక చోప్రా నటించింది. ఆ కార్యక్రమంలో ఒక ఎపిసోడ్‌లో కొందరు హిందువులను కూడా టెర్రరిస్టులుగా చూపించారు. దానిపై చాలా మంది అభ్యంతరాలు చెప్పారు. ప్రియాంక చోప్రా దానిపై తన విచారం కూడా వ్యక్తం చేసింది. దీనిపై అతుల్ కోచార్ ట్వీట్ చేస్తూ, ప్రియాంక చోప్రాను తప్పుపడుతూ ʹʹగత 2000 సంవత్సరాలుగా హిందువులను టెర్రరైజ్ చేస్తున్నది ఇస్లామ్. ఈ విషయంలో హిందువుల మనోభావాలను గుర్తించకపోవడం చాలా శోచనీయంʹʹ అని ట్వీట్ చేశాడు. ఇస్లామ్ 2000 సంవత్సరాలుగా ఉందా? దుబాయ్‌లో ఈయనకు హోటల్ కాంట్రాక్టులున్నాయి. ఈ ట్వీటు తర్వాత కాంట్రాక్టులున్న జెడబ్ల్యు మారియట్ ఈ షెఫ్ తో కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అతుల్ కోచార్ విద్యావంతుడు, సమాజంలో తనదైన స్థానం ఉన్నవాడు. అలాంటి వ్యక్తి కూడా 2000 సంవత్సరాల ఇస్లామ్ అంటూ చేసిన వ్యాఖ్య చారిత్రకంగా ఎంత తప్పో అందులో ఉన్న సారం కూడా అంతే తప్పు. కాని వాట్సప్ మెస్సేజిలు, ఫేస్‌బుక్ పోస్టులు ఇలాంటివి చాలా వస్తున్నాయి. విషాన్ని నరనరాల్లో ఎక్కిస్తోంది. ఈ విషమే ఇప్పుడు ఈ విషప్రచారాన్ని మరింత విస్తరించేలా చేస్తోంది. అతుల్ కోచార్ కూడా ఒక ఫేక్ వార్తను ప్రచారం చేసే యంత్రంలా మారిపోయాడు తప్ప చదువుకున్న బాధ్యత తెలిసిన వ్యక్తిగా మిగల్లేదు. అతుల్ కోచార్ తర్వాత తన ట్వీటులో 2000 సంవత్సరాలు అంటూ చారిత్రకంగా తప్పు సమాచారానికి క్షమాపణలు చెప్పాడే కాని హిందువులను టెర్రరైజ్ చేస్తున్న ఇస్లామ్ అనే విషప్రచారం విషయంలో ఏమీ మాట్లాడలేదు.

హిందువులను రెచ్చగొట్టేలా వాట్సప్, ఫేస్‌బుక్ వేదికలుగా ఎంతో విష ప్రచారం జరుగుతోంది. అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేయడం నిరాఘాటంగా కొనసాగుతోంది. ఇలాంటి విష ప్రచారమే ఇప్పుడు గోగుండాల రూపంలో హత్యలకు దారితీస్తోంది. ఉత్తరప్రదేశ్ హాఫుడ్ జిల్లాలోని ఫిల్‌ఖువా గ్రామంలో ఖాసింపై గోహత్య చేశాడన్న అనుమానంతో గుంపు దాడి చేసి చంపేసింది. అమానుషంగా, మానవత్వం మరిచి గుంపు వీరంగాలు వేయడానికి కారణమేమిటి? ఇంత రాక్షసత్వం వారిలో ఎక్కడి నుంచి వచ్చింది. ఇంతకు ముందు దాద్రీలో అక్లాక్ హత్య జరిగింది కూడా ఇలాగే. దాద్రీకి ఫీల్‌ఖువా కేవలం ముప్పయి కిలోమీటర్ల దూరంలో ఉంది. దాద్రీలో హత్యకు గురైన అక్లాక్‌పైనే కేసులు నమోదయ్యాయి. నేరానికి పాల్పడిన వారిలో ఒకరు తర్వాత మరణిస్తే దేశభక్తుడి తరహాలో బిజేపి నాయకులు వ్యాఖ్యానించారు. మరో సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆవులను అపహరిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు ముస్లిములపై దాడి చేసి విపరీతంగా కొట్టడంతో సిరాజ్ మరణించాడు. మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. మోటారు సైకిలుపై ఆవును ఎలా దొంగిలిస్తారో దాడి చేసినవారు ఆలోచించలేదు. ఇవన్నీ అనుమానంతో జరిగిన హత్యలన్నది కూడా గుర్తించాలి. సిరాజ్‌పై దాడి కేసులో అరెస్టయిన వారిలో ఆరెస్సెస్ ప్రచారక్ కూడా ఉన్నాడు. సహజంగానే బిజేపి నేతలు ఈ విషయమై నోరు విప్పరు. ఒకవేళ ఎవరైనా విప్పినా వెంటనే నోరు మూయించడానికి బిజేపి భక్తజన ట్రోల్ సైన్యం ఉంది.

కథువా కేసులోను బిజేపి నాయకులు నిందితులకు మద్దతుగా ముందుకు వచ్చారే కాని న్యాయం కోసం నిలబడలేదు. ఈ ధోరణి ఎటు తీసుకుపోతోంది. ప్రతి రోజు ఏదో ఒక గుంపు హత్య వార్త, ఏదో ఒక దాడి వార్త, వాట్సప్, ఫేస్‌బుక్కుల ద్వారా విద్వేష ప్రచారం. గౌరీ లంకేష్‌ను హత్యచేసిన వాడు ఎందుకు చేశాడు. తన మతాన్ని కాపాడ్డానికి చేశానని చెప్పాడు. మతాన్ని కాపాడ్డం కోసం మానవత్వాన్ని చంపేయడానికి సిద్ధపడే యంత్రాలను ఈ పుకార్ల వంటి ఫేక్ న్యూస్ ప్రచారాలు ఉపయోగపడుతున్నాయి. అందుకే గౌరీ లంకేష్ గురించి మాట్లాడుతూ రామ్ సేన నాయకుడు కుక్క మరణిస్తే ప్రధాని ప్రతిస్పందించాలా అంటూ అత్యంత నీచంగా వ్యాఖ్యానించాడు. మహిళలను అత్యంత అవమానించే రీతిలో చేసే ఈ వ్యాఖ్యలు వీరభక్తులకు ఆనందాన్నిస్తున్నాయి. ఇదెక్కడి సంస్కారం అని ఆలోచించే శక్తిని చంపేశాయి. ఎందుకంటే మానవత్వాన్ని చంపేసి మతాన్ని కాపాడాలన్నదే లక్ష్యంగా మారిపోయింది. ఈ విషం ఎంతగా విస్తరించిందంటే, ఎయిర్‌టెల్ కస్టమర్ సర్వీసుకు పంపించే వ్యక్తి ముస్లిం వద్దు హిందువే కావాలని అడిగే పూజా సింగులు పుట్టుకొస్తే, ఆమె కోరిక విషయంలో సానుకూలంగా స్పందించి తర్వాత మాకు మతవివక్ష లేదంటూ వివరణలు ఇచ్చే ఎయిర్‌టెల్లులు వచ్చాయి. ముస్లిములు డ్రయివరుగా ఉండే క్యాబులు వద్దు, టాక్సీలు వద్దు, ముస్లిములను ఉద్యోగాల నుంచి తొలగించండి. ఈ విద్వేష ప్రచారానికి అంతు లేదు. ఇదంతా మతాన్ని కాపాడ్డానికి జరిగే మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో ప్రతి ట్రోల్ సైనికుడు తన పాత్రను పోషిస్తున్నాడు. అతుల్ కోచార్ పోషించింది అలాంటి పాత్రే. సుష్మాస్వరాజ్‌పై విరుచుకుపడిన ʹభారత్ 1ʹ పోషించింది అలాంటి పాత్రే. వీరిద్దరి మధ్య తేడా లేదు. ఈ మనస్తత్వాన్ని సృష్టించింది ఎవరన్నది ఆలోచించవలసిన ప్రశ్న.

ఈ ప్రశ్న గురించి ఎంతమంది ఆలోచిస్తున్నాం? కథువా రేప్ జరిగితే రెచ్చిపోతారా? ముజఫర్‌పూర్ లోను జరిగింది కదా దాని గురించి మాట్లాడరేమిటి అని ప్రశ్నించే ట్రోల్ సైన్యం ప్రశ్నలు చాలా మంది అవును కదా నిజమే కదా అని తలూపుతుంటారు. ప్రశ్నించేది కేవలం రేప్ అనే నేరాన్ని మాత్రమే కాదు, ఆ నేరాన్ని సమర్ధించే మనస్తత్వం విషయంలో మరింత తీవ్రంగా ఆలోచించాలి... ప్రశ్నించాలి. ముజఫర్‌పూర్ రేప్ సంఘటనలో రేప్‌ను ఖండించడం జరిగింది. అక్కడ రేప్‌ను ఎవరు సమర్ధించలేదు. కాని కథువాలో రేప్‌ను సమర్ధించేలా వ్యవహరించిన శక్తులను తీవ్రంగా ఖండించడం అవసరం. ఈ వాస్తవాన్ని దేశప్రజలు గుర్తిస్తున్నారా?

సుష్మా స్వరాజ్‌పై ʹట్రోల్ సైన్యంʹ దాడి చాలా వాస్తవాలను ఇప్పుడు మన ముందు స్పష్టం చేసింది. మతాన్ని కాపాడాలన్న ప్రచారం మానవత్వాన్ని పూర్తిగా చంపేస్తోంది. మహిళలైనా, పసిపిల్లలైనా ఎవర్నయినా వదిలేది లేదన్న ఉన్మాదానికి తీసుకుపోయింది. అతుల్ కోచార్ వంటి అంతర్జాతీయ పేరుప్రతిష్ఠలున్న షెఫ్ కానీ, లేదా గల్లీల్లో ర్యాలీల్లో పాల్గొనే మామూలు కార్యకర్త కాని అందరి మనస్తత్వం ఒక్కటే అయ్యింది. ఎవరికీ వాస్తవాలు అక్కర్లేదు. నిజాలు అక్కర్లేదు. అబద్దాలు, అసత్యాలను ఇల్లెక్కి చాటింపేయడమే ముఖ్యం. విద్వేషాన్ని పెంచడమే ముఖ్యం. ఎందుకంటే మతాన్ని కాపాడుకోవాలి. మతాన్ని కాపాడుకునే వీరంగాల్లో బారతీయ విలువలు, సంస్కారాలు, ప్రమాణాలు, మానవత్వం, సామరస్యం అన్నింటినీ చంపేస్తుంటే చివరకు దేశంలో మిగిలేదేమిటి?

ఒరిజినల్ పోస్టు : https://www.facebook.com/wahed.one/posts/10156565765824884

Keywords : సుష్మా స్వరాజ్, పాస్‌పోర్టు, లక్నో జంట, ముస్లిం, బీజేపీ, ట్రోల్, sushma swaraj, passport, lucknow, muslim, couple
(2019-02-15 23:53:51)No. of visitors : 388

Suggested Posts


0 results

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


వెర్రితలలు