తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్


తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

తెలంగాణొస్తే

(వీక్షణం సంపాదకులు ఎన్.వేణు గోపాల్ రాసిన ఈ వ్యాసం వీక్షణం ఆగస్టు సంచికలో ప్రచురించబడినది)

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శన వస్తువులు, ఫొటోలు దొరుకుతాయి. అడాల్ఫ్‌ హిట్లర్‌, మీర్‌ ఉస్మానలీ ఖాన్‌, ఇందిరా గాంధీల పాలనల దాకా కూడ పోనక్కరలేదు. దోపిడీకి, అన్యాయానికి, హామీల ఉల్లంఘనకు చిహ్నంగా చూసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడ, తెలంగాణ ప్రాంతం నుంచి కూడ ఇటువంటి ప్రదర్శన వస్తువులు, ఫొటోలు దొరుకుతాయి. ఇటీవలి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి పాలనా కాలాల్లోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచార బ్రోచర్లు, కరపత్రాలు, ప్రకటనలు చూసినా అవి కనబడతాయి. కనుక అటువంటి ప్రదర్శన వస్తువులతో, ఫొటోలతో తేల్చదగిన సమస్య కాదిది.

ఆంధ్రప్రదేశ్‌లో అమలయిన పాలక విధానాల వల్ల తెలంగాణ సమాజం నష్టపోయిందని, తెలంగాణ సమాజానికి న్యాయబద్ధంగా దక్కవలసిన హక్కులేవీ దక్కకుండా పోయాయనీ, కనీసం పెద్దమనుషుల ఒప్పందంలో లిఖిత పూర్వకంగా చేసిన వాగ్దానాలు కూడ నెరవేరలేదనీ, తమ భాషా సంస్కృతులు అవమానానికి గురయ్యాయనీ, అందువల్ల న్యాయబద్ధ పాలన, బాధ్యతాయుత ప్రభుత్వం, స్వాభిమానం వంటి విలువలు నిలబడాలంటే స్వపరిపాలన కావాలనీ, ప్రత్యేక రాష్ట్రం కావాలనీ తెలంగాణ ప్రజలు కోరుకున్నారు, ఉద్యమించారు. ఇది విస్తృత ప్రజా ఉద్యమంగా మారుతున్నదని గుర్తించాక అనేక పాలకవర్గ పార్టీలూ సంస్థలూ కూడ ఈ ఉద్యమంలో భాగం పంచుకున్నాయి. చివరికి వివిధ పాలకవర్గ ముఠాల బేరసారాలలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ఆమోదం కుదిరింది. ప్రజలు ఏ ఆకాంక్షలతో పోరాడారో ఆ తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ కాక ఒక పాలకవర్గ ముఠా అధికారంలో తెలంగాణ వచ్చింది. అందువల్ల ఆ పాలకవర్గ ముఠా తనకు తాను పెట్టుకున్న ఎజెండా మాత్రమే అమలవుతున్నది గాని, ఉద్యమ క్రమంలో ప్రజలు కోరుకున్న ఎజెండా కాదు. అంతవరకూ తెలంగాణకు అన్యాయం చేసిన, మోసగించిన, అవమానించిన పాలకవర్గ ముఠాల ప్రయోజనాలకు ఎటువంటి దెబ్బ తగలకుండానే తెలంగాణ పాలన నాలుగు సంవత్సరాలు ముగించుకున్నది. తెలంగాణ ప్రజలు ఉద్యమకాలంలో వ్యక్తీకరించిన ఆకాంక్షలు తీరకపోవడం మాత్రమే కాదు, కొన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ పాలన కన్న, అంతకు ముందరి సైనిక పాలన కన్న, నిజాం పాలన కన్న దిగజారిన పాలన సాగుతున్నది.

అందువల్ల తెలంగాణొస్తే ఏమొచ్చింది అని బేరీజు వేయడానికి కావలసింది ఎంపిక చేసిన ఆకర్షణీయమైన ఫొటోలు, ప్రభుత్వ ప్రచార ప్రకటనలు, భజన పరుల యాత్రాకథనాలు కావు. ఆ బేరీజు సక్రమంగా ఉండాలంటే, నాలుగైదు వస్తుగత ప్రమాణాలున్నాయి. 1. అట్టడుగు ప్రజా జీవన ప్రమాణాలలో గత పాలనా సమయాలలో కన్న ఏ మార్పులు వచ్చాయి, అవి ఎంత ప్రగతిశీలమైనవి? 2. ఐక్య రాజ్య సమితి, ప్రణాళికా సంఘంతో సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రతిపాదించిన మానవాభివృద్ధి సూచికలలో తెలంగాణ ఏర్పడక ముందు ఎక్కడ ఉండేది, ప్రస్తుతం ఎన్ని మెట్లు ఎక్కింది, అసలు మెట్లు ఎక్కే దిశలో ఉందా, కిందికి దిగిపోయే దిశలో ఉందా? 3. ప్రత్యేక తెలంగాణ కావాలని ప్రజలు కోరుకోవడంలో, పోరాడడంలో తెలంగాణ వస్తే ఏమి వస్తుందని, జరుగుతుందని ఆశించారు? 4. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన విభిన్న శక్తులు తెలంగాణ వస్తే ఏమి వస్తుందని ప్రజలకు వాగ్దానాలు చేశాయి? ప్రత్యేకించి ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఏ వాగ్దానాలు చేసింది? నాలుగేళ్ల పాలనలో అవి అమలు చేసిందా లేదా? తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనే చర్చ ఈ ప్రమాణాల ఆధారంగా జరిగినప్పుడే ఆ చర్చ అర్థవంతంగా ఉంటుంది. ఆ చర్చకు విశ్వసనీయత ఉంటుంది. అటువంటి చర్చ ఎన్నెన్నో ప్రజా జీవన అంశాలను స్పృశించవలసి ఉంటుంది గనుక విస్తృతంగా, సుదీర్ఘంగా సాగక తప్పదు. కాని ఒక పత్రికా వ్యాసపు స్థల పరిమితుల దృష్ట్యా ఇక్కడ ప్రధానమైన అంశాలను స్థూలంగా మాత్రమే చర్చిద్దాం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రజా ఉద్యమానికి కీలకమైన భూమిక నీళ్లు, నిధులు, నియామకాలు అని జయశంకర్‌ సూత్రీకరించారు. ఈ మూడు అంశాల్లోనూ ఉమ్మడి రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యానైనా, జనాభా రీత్యానైనా తెలంగాణకు దక్కవలసిన వాటా దక్కలేదని, మరీ ముఖ్యంగా నదీజలాలలో పరీవాహక ప్రాంతం డెబ్బై, ఎనబై శాతం ఉన్నప్పటికీ ఇరవై శాతం కన్న తక్కువ వాటా మాత్రమే దొరికిందని, నిధుల్లో, నియామకాల్లో కూడ తీవ్రమైన అన్యాయాలు జరిగాయని తెలంగాణ ఉద్యమంలో అగ్ర నాయకుల నుంచి అట్టడుగు కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ గణాంకాలు వల్లించేవారు. మొత్తం తెలంగాణ సమాజానికే ఆ అంకెలు పట్టుబడ్డాయి. అంటే తెలంగాణ రాగానే ఈ మూడు అంశాలలో పాత అన్యాయాలను సరిదిద్దే పని, కొత్తగా న్యాయం చేసే పని ముమ్మరంగా జరుగుతుందని తెలంగాణ ప్రజలు ఆశించారు.

ఈ మూడు అంశాలలో నీళ్ల విషయంలో ఆ సెంటిమెంటును వాడుకుని ఏదో జరుగుతున్నట్టు హడావుడి చేస్తూ వాస్తవంగా కాంట్రాక్టర్ల కోసం, రాజకీయ ముడుపుల కోసం పనులు జరుగుతున్నాయి గాని అక్కడ కూడ నిజంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్న జాడ తక్కువ. తెలంగాణ నైసర్గిక పరిస్థితికి అనువైన చెరువుల పునరుద్ధరణ ప్రారంభించారు. కాని, అది ఎక్కడికక్కడ స్థానికంగా జరిగేదీ, బడా కాంట్రాక్టర్లకు కాక, స్థానిక, చిన్న కాంట్రాక్టర్లకు మాత్రమే అవకాశం ఇచ్చేదీ కనుక కావచ్చు దాన్ని మధ్యలోనే ఆపివేశారు, లేదా మందకొడిగా నడుపుతున్నారు. ఇక అంతకుముందే రూపకల్పన జరిగి, ఉమ్మడి రాష్ట్రంలో నత్తనడక నడిచిన భారీ ప్రాజెక్టులను రిడిజైన్‌ పేరుతో మళ్లీ చేపట్టారు, త్వరితగతినే పనులు నడుపుతున్నారు. కాని రిడిజైన్‌ లో భాగంగా పాత ప్రాజెక్టులకు పది, ఇరవై శాతం మార్పులు చేసి వ్యయం మాత్రం వందశాతం పెంచారు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఈ ప్రభుత్వం రాకముందు రు. 38,000 కోట్ల వ్యయంతో రూపొందిన ప్రాజెక్టును, ఎక్కువలో ఎక్కువ 20 శాతం రిడిజైన్‌ చేసి, వ్యయం మాత్రం రెట్టింపు కన్న ఎక్కువ రు. 81,000 కోట్లు చేశారు. అంటే జలయజ్ఞం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ధనయజ్ఞపు రెండో రాకడ ప్రస్తుతం కొనసాగుతున్నది. లార్సెన్‌ అండ్‌ టూబ్రో, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్స్‌, నవయుగ ఇంజనీరింగ్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌ వంటి ఉద్యమ క్రమంలో ఆంధ్రా కాంట్రాక్టర్ల కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీలే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించి, తెలంగాణ వనరులను కొల్లగొట్టిన కంపెనీలే ప్రస్తుత పనులు కూడ చేస్తున్నాయి. రెట్టింపుగా పెంచిన ప్రాజెక్టు వ్యయాలలో కొంత ఈ కాంట్రాక్టర్లకు పంచడానికి, కొంత ముడుపులుగా వెనక్కు రాబట్టడానికి అధికారపక్షం చేసిన ప్రయత్నమే తప్ప ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం తెలంగాణ ఉద్యమపు కోరిక అయిన న్యాయంగా దక్కవలసిన నీళ్లు రాబట్టడం కాదు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఎంతో కొంత నీళ్లు వస్తాయేమో గాని, ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం మాత్రం కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమే. ఉద్యమ కాలమంతా ఆంధ్ర, రాయలసీమ కాంట్రాక్టర్ల అక్రమాలను ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, తెరాసను సమర్థించే మేధావులు ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అ కాంట్రాక్టర్లు నాణ్యంగా సమర్థంగా పని చేస్తారని, దేశమంతా వారే పనులు చేస్తున్నారని, వారికి కాంట్రాక్టులు ఇవ్వడం తప్ప గత్యంతరం లేదని అంటున్నారు! అంటే, తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే నిన్న దోపిడీదారు అయిన కాంట్రాక్టర్‌ ఇవాళ నమ్మకమైన మిత్రుడు అయ్యాడన్న మాట.

ఇక నిధుల విషయంలో పాత అభివృద్ధి నమూనానే కొనసాగుతున్నది గనుక లక్ష కోట్ల, లక్షన్నర కోట్ల బడ్జెట్‌ అని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తమ నిధులలో వాటాను ఎలా కోల్పోయారో ఇప్పుడూ అదే రకంగా కోల్పోక తప్పడం లేదు. ఇన్ని లక్షల కోట్లు వ్యయం చేస్తున్నట్టు చూపినా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే, ఉద్యోగకల్పన చేసే ఒక్క పరిశ్రమ రాలేదు. పాత ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ గాని, కొత్త ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు గాని జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు ప్రగల్భాలలాగనే ఐటి రంగం పెరుగుతున్నదని ప్రగల్భాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కోసమే అనే బుకాయింపులతో ప్రకటిస్తున్న పథకాలకు విపరీతంగా అప్పులు తెస్తూ ఆ అప్పులు, వడ్డీలు చెల్లించే భారమంతా ప్రజల మీద వేస్తున్నారు. రు. 60,000 కోట్ల అప్పుతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగో సంవత్సరం తిరిగేసరికల్లా దాదాపు రెండు లక్షల కోట్ల రుణ భారం ఉన్న రాష్ట్రంగా మార్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదే. ప్రజాధనంతో వోట్లు రాబట్టుకునే అతి తెలివి ఎత్తుగడలతో సంక్షేమ పథకాలు ప్రకటించడం, వాటి మీద దుబారా వ్యయం చేయడం తప్ప, సంక్షేమ నిధులు అవసరం లేని విధంగా, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి వ్యూహం అసలు తెలంగాణ పాలకుల ఊహలోనే లేదు. ఇటువంటి పాత అభివృద్ధి నమూనా యథాతథంగా కొనసాగుతుండగా, తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే మితిమీరిన అప్పు మాత్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో ఒకటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలను అనుసరించిన చంద్రబాబు పాలనా విధానాల మీద తీవ్రమైన వ్యతిరేకత. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలలో గతంలో కన్న ఎక్కువగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మీద, అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక సంస్థల ఆదేశాల మీద, బహుళ జాతి సంస్థల ఆదేశాల మీద నడుస్తున్నది. నడవడం మాత్రమే కాదు, అదే గొప్పగా చెప్పుకుంటున్నది.

నియామకాలలో తెలంగాణొస్తే ఏమొచ్చిందో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పన్నెండు లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారని, అందులో విస్తీర్ణం దృష్ట్యానైనా, జనాభా దృష్ట్యానైనా తెలంగాణ బిడ్డలు కనీసం ఐదు లక్షల మంది ఉండవలసిందని, కాని రెండున్నర లక్షలకు మించి లేరని జయశంకర్‌ దగ్గర ప్రారంభించి ఇవాళ అధికారంలో ఉన్నవారి దాకా ప్రతి ఒక్కరూ ఉద్యమ కాలమంతా అన్న మాట. అంటే రాష్ట్రం విడిపోతే తెలంగాణ బిడ్డలకు రెండున్నర లక్షల మందికి ప్రభుత్వోద్యోగాలు వస్తాయని ఆశ ఉండేది. ఈ అంకెను మూడు లక్షల దాకా కూడ పెంచిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు. మరి తెలంగాణ వస్తే ఏమొచ్చింది? తెలంగాణ వచ్చాక ఐదు నెలలకు శాసనసభా వేదిక మీదనే ముఖ్యమంత్రి ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలున్నాయని, అవి రెండు సంవత్సరాల్లో భర్తీ చేస్తామని అన్నారు. నాలుగు సంవత్సరాలయింది ఆ అంకెలో మూడో వంతు భర్తీ చేయడం కూడ ఇంకా జరగలేదు. ఈ నాలుగు సంవత్సరాల్లో పదవీ విరమణ పొందిన వారి సంఖ్యకు సరిపోయినంత మంది కూడ భర్తీ కాలేదు. ఈ మధ్యలో కొత్తగా జిల్లాల విభజన వల్ల తలెత్తిన కొత్త ఉద్యోగాల సంఖ్యకు సరిపోయినంత మంది కూడ భర్తీ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ శాఖ, కార్యాలయం తీసుకున్నా ఉండవలసిన, అవసరమైన ఉద్యోగుల సంఖ్యలో సగమో, ముప్పావో కన్న ఎక్కువ లేరు. బహుశా పోలీసు శాఖ ఒక్కటే దీనికి మినహాయింపు కావచ్చు. అసంతృప్తి పెరుగుతున్న ప్రజల్ని అదుపులో పెట్టడానికి పోలీసు బలగాలు కావాలి గనుక ఆ శాఖ ఒక్కటి మినహా మిగిలిన ఏ రంగంలోనూ నియామకాల్లో ఆశాజనకమైన స్థితి లేదు. అంటే మొత్తం మీద తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే పాత నిరుద్యోగం తగ్గలేదు, కొత్త నిరుద్యోగం వచ్చింది.

ఇక ప్రభుత్వ పాలన గురించి తెలంగాణొస్తే ఏమొచ్చిందో చెప్పుకోవలసిన విచిత్రమైన సంగతులెన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ పాలన అనే మాటను వర్గ దృక్పథం నుంచి కూడ అర్థం చేసుకోనక్కర లేదు. ప్రజాస్వామిక రాజ్యాంగం అమలయ్యే చోట, ముఖ్యంగా భారతదేశంలో దశాబ్దాల తరబడి సాగిన సాధారణ పాలనా సూత్రాలు, పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడ ఆ పద్ధతుల్లో కొన్ని ఉల్లంఘనకు గురవుతున్నాయనీ, అవి తప్పనిసరిగా పాటించవలసిన రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ, ప్రజాస్వామిక పద్ధతులనీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కోరుకున్నాం. కాని ఈ నాలుగు సంవత్సరాలలో అవేవీ పాటించకపోవడమే తెలంగాణొస్తే ఏమొచ్చింది అన్న ప్రశ్నకు జవాబు. ఒక పార్టీ టికెట్‌ మీద గెలిచి శాసనసభ్యులుగా ఉంటూ, ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే అధికార పక్షంలో చేరి, మంత్రులు కూడ అయిన అనైతిక ప్రవర్తనకు తెలంగాణ నాంది పలికింది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని కూడ తుంగలో తొక్కిన ఈ వ్యవహారం మీద చర్య తీసుకోకుండా మూడు నాలుగేళ్లు నానబెట్టిన చట్టబద్ధ పాలన అమలవుతున్న రాష్టమిది.

రాష్ట్ర పాలన ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గ ఆధ్వర్యంలో జరగడం, జరిగిన అన్ని నిర్ణయాల మీద, అమలవుతున్న అన్ని విధానాల మీద ఆ మంత్రి వర్గానికి ఉమ్మడి బాధ్యత ఉండడం దేశంలో ఏడు దశాబ్దాలుగా అమలవుతున్న రాజ్యాంగబద్ధ పద్ధతి. కాని తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే, ఉమ్మడి బాధ్యత ఉన్న మంత్రివర్గమనేది లేని, మంత్రుల స్వరమే వినిపించని, ముఖ్యమంత్రే అన్నీ నడిపే, ముఖ్యమంత్రి కొడుకే అన్ని శాఖలకూ మంత్రిగా ఉండే పద్ధతి అమలవుతున్నది. మంత్రివర్గ శాఖల మార్పులు మంత్రివర్గంలో చర్చించి, గవర్నర్‌ కు తెలియజేసి అప్పుడు బహిరంగంగా ప్రకటించడం పాత పద్ధతి. ఇప్పుడు రాజుగారు తలచుకున్న వెంటనే, మిగిలిన పద్ధతులేమీ లేకుండా బహిరంగ సభలో ప్రకటించడం తెలంగాణొస్తే వచ్చిన మార్పు. ఒక మంత్రికి సంబంధించిన శాఖ పనితీరు మీద ఆ మంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశాలు జరగడం పాత పద్ధతి. ఒక కీలకమైన శాఖ సమీక్షా సమావేశాన్ని ఆ మంత్రిని లోపలికి రానివ్వకుండా ముఖ్యమంత్రే నిర్వహించిన కొత్త పద్ధతి తెలంగాణొస్తే వచ్చిన మార్పు. ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలనీ, ప్రతి ప్రభుత్వ ఉత్తర్వును అచ్చు వేసి గాని, ఇటీవలి కాలంలో అయితే వెబ్‌ సైట్‌ మీద పెట్టి గాని ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది పాత పద్ధతి. ఇష్టం వచ్చిన జివోలను మాత్రమే బహిరంగంగా పెడతాం, మిగిలినవి దాచి పెడతాం, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించే ప్రాజెక్టుల నివేదికలు కూడ బహిరంగ పరచం, రాజు మనసులో ఏది తోస్తే అదే శాసనం, అది ప్రజలకు తెలియజెప్పనక్కర లేదు, మా ఇష్టారాజ్యంగా పాలిస్తాం అనేది తెలంగాణొచ్చినాక రూపొందిన పద్ధతి. చెప్పిన మాటకు కట్టుబడడమో, కట్టుబడకపోవడమో పాత పద్ధతి, ఒక మాట చెప్పి మరొక పని చేయడం తెలంగాణొచ్చినాక వచ్చిన పద్ధతి. నిజాలు దాచడం, అర్ధసత్యాలు చెప్పడం పాత పద్ధతి, ధైర్యంగా, దూకుడుగా అబద్ధాలు చెప్పడం కొత్త పద్ధతి.

తెలంగాణ ఉద్యమకారులను కూడ నరికి చంపిన నరహంతకుడు, మాఫియా సామ్రాజ్యాధిపతి నయీంను హతమార్చినప్పుడు వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు దొరికాయనేది బహిరంగ రహస్యమైనా అవేవీ బహిరంగం కాలేదు. అప్పటికి ఇరవై సంవత్సరాలుగా నయీంతో కలిసి నేర సామ్రాజ్యాన్ని నడిపిన రాజకీయ నాయకులు ఇంకా నిర్ణయాధికారంలో కొనసాగుతూనే ఉన్నారు. మిలాఖత్తయిన రాజకీయ నాయకులు, బడా పోలీసు అధికారులందరి పేర్లే బైటికి రాలేదు, పేర్లు బైటికి వచ్చిన చోటా అధికారులకు ఏడాది తిరగకుండానే పునర్నియామకాలు, పదోన్నతులు కూడ జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణొస్తే ప్రభుత్వ పాలనలో ఏమొచ్చిందంటే, ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన పాతికో పరకో శాతం ప్రజాస్వామిక, చట్టబద్ధ, పద్ధతి ప్రకారం సాగిన పాలన స్థానంలో రాజరికపు ఇష్టారాజ్యపు పాలన వచ్చింది.

తెలంగాణొస్తే ఏమొచ్చింది అనే ప్రశ్నకు పౌరహక్కుల స్థితి గురించి జవాబు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ స్థితి కొనసాగుతున్నదనో, ఇంకా దిగజారిందనో జవాబు చెప్పవలసి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రజానీకం తమ పౌర హక్కులను ఎన్నడూ సంపూర్ణంగా అనుభవించలేదు. 1968-69 నుంచి ఆ స్థితి మరింత దిగజారింది. అందువల్లనే తెలంగాణ ప్రజానీకం మిగిలిన ఏ కారణం కోసం కాకపోయినా పౌరహక్కుల కోసం, ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ కోసం, వాక్సభాస్వాతంత్య్రాల కోసం ఆ పాలన పోవాలనుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంకేమి వచ్చినా రాకపోయినా ప్రాథమిక, పౌర, ప్రజాస్వామిక హక్కులు నిలబడతాయనుకున్నారు. ఆ ఆకాంక్షకు ప్రతిస్పందించిన తెలంగాణ రాష్ట్ర సమితి కూడ ఆ వాగ్దానం ఇచ్చింది. పౌరహక్కుల సంఘం ఏర్పాటు చేసిన ఒక సభలో పాల్గొంటూ, తమ లక్ష్యం ʹఎన్‌ కౌంటర్లు లేని తెలంగాణʹ అనీ, తానే పౌరహక్కుల సంఘం అధ్యక్షుడుగా ఉంటాననీ స్వయంగా కె చంద్రశేఖర రావు అన్నారు. కాని తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రం కన్న ఘోరమైన పోలీసు రాజ్యం వచ్చింది. రాష్ట్రంలో ఎన్‌ కౌంటర్‌ హత్యలు ఆగలేదు సరిగదా, మరింత బూటకమైన, దుర్మార్గమైన ఎన్‌ కౌంటర్‌ హత్యలు జరిగాయి, వ్యానులో చేతులకు గొలుసులు కట్టేసి ఉన్న, కోర్టు విచారణలో ఉన్న ఖైదీలను కాల్చి చంపి వారు తుపాకి గురి పెడితే ఎదురుకాల్పులు జరిపామని చెప్పుకునేంత పచ్చి అబద్ధాలకోరు ప్రభుత్వం వచ్చింది. సరిహద్దు ఇవతల పట్టుకుని అవతలికి తీసుకువెళ్లి చంపిన ఘటనలు, తెలంగాణ పోలీసులే ఇతర రాష్ట్రాల లోకి వెళ్లి చంపిన ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే ధర్నా చౌక్‌ ను రద్దు చేశారు. రాష్ట్రంలో ఎన్నో సభలు, సమావేశాల మీద దాడి చేసి, జరగకుండా చేశారు. హాలు యజమానులను బెదిరించి సమావేశాలకు జరిగిన బుకింగ్‌ ను రద్దు చేయించారు. చివరికి సంస్మరణ సభలను, స్త్రీల మీద అత్యాచారాల వంటి అంశాల మీద సదస్సులను కూడ జరపనివ్వని ఆంక్షల రాజ్యం అమలవుతున్నది. ఏ విధానానికైనా, ప్రభుత్వ కార్యక్రమానికైనా నిరసన తెలపడం ప్రతిపక్షాల, ప్రజల హక్కు కాగా, ఉమ్మడి రాష్ట్రంలో కూడ ఆ హక్కును ప్రకటించుకునే స్థితి ఉండగా, ప్రస్తుతం మాత్రం నిరసన తెలపబోతున్నారని గాలి సోకితే చాలు, చిన్నపాటి ప్రకటన వచ్చినా చాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు, నిరసన స్థలం చుట్టూ బారికేడ్లు జరుగుతున్నాయి. మంత్రులు, శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమ నాయకులుగా ఉండి ప్రస్తుతం అధికారంలో ఉన్నవారితో సహా వందలాది మంది తమ ఫోన్లు, సమాచార వ్యవస్థలు పోలీసు నిఘాలో ఉన్నాయని భయపడుతున్నారంటే, తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే నిరంకుశ రాజ్యం వచ్చిందన్నమాట. ఏడో నిజాం పాలనలో ప్రారంభమైన గష్తీ నిషాన్‌ 53 పాలన ఎనిమిదో నిజాం పాలనలో యథతథంగా కొనసాగుతున్నదన్నమాట.

కెజి టు పిజి అని, దళితులకు ముఖ్యమంత్రిత్వం అని, దళితులకు మూడెకరాల భూమి అని ఊరించి, వాగ్దానం చేసి వాగ్దాన భంగం చేయడం, అక్షరాస్యతా శాతంలో అట్టడుగున ఉన్న తెలంగాణ స్థితిని మెరుగు పరచడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామనే పేరుతో ఐదు శాతం కన్న తక్కువ విద్యార్థులకు ఏదో చేసినట్టు భ్రమలు కల్పిస్తూ, తొంబై ఐదు శాతం విద్యార్థులను గాలికి వదలడం, ఉద్యమ కాలమంతా శ్రీచైతన్య, నారాయణ వంటి కోస్తాంధ్ర, కార్పొరేట్‌ విద్యా వ్యాపార సంస్థలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించి, ఇప్పుడు వారితోనే అంటకాగుతుండడం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల గొంతు నులుముతూ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం తేవడం వంటి అనేక అంశాలలో ఏ అంశంలో చూసినా తెలంగాణొస్తే ఏమొచ్చింది అంటే మరింత నిరాశాజనకమైన జవాబే ఇచ్చే స్థితి కొనసాగుతున్నది. మద్యపానాన్ని ప్రోత్సహించడం, ఆబ్కారి శాఖకు టార్గెట్లు విధించి మరీ తాగబోయించడం, అత్యున్నత నిర్ణయాధికారం ఉన్నవారి దగ్గరి నుంచి అట్టడుగు ప్రభుత్వోద్యోగి దాకా పెరిగిపోయిన భయంకరమైన అవినీతి, దళితులపై అత్యాచారాలు, భూ అక్రమాలు వంటి ఏ రంగం తీసుకున్నా తెలంగాణొస్తే ఏమొచ్చింది అంటే గర్వపడే, సంతోషపడే పరిస్థితి అయితే లేదు.

ఇటువంటి స్థితే, లేదా ఇంతకన్న కాస్త మెరుగైన స్థితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకటి కాకపోతే ఒకటైనా పత్రికలు, ప్రచార సాధనాలు తెలంగాణ ఘోష వినిపించడానికి, తెలంగాణ ఘోషకు చోటు ఇవ్వడానికి ప్రయత్నించేవి. తెలంగాణొస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ ఘోష పెరిగింది గాని దానికి చోటు దొరకని పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఆలోచనలను దారి మళ్లించిన రామోజీ రావు తెలంగాణకు ప్రథమ శత్రువు అని జయశంకర్‌ అనగా, ఇవాళ ఆ రామోజీ రావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయిపోయాడు. అన్ని పత్రికలూ, ప్రచార సాధనాలూ తెలంగాణ ప్రభుత్వానికి, అధికార పక్షానికి భయానికో, ప్రకటనల ప్రలోభానికో భజన చేయక తప్పని స్థితి వచ్చింది. ప్రభుత్వం ఎంతెంత ఘోరమైన అబద్ధాలెన్నిటిని ప్రచారం చేసినా ప్రశ్న లేకుండా కళ్లకద్దుకుని అచ్చువేసే, ప్రచారం చేసే ప్రచార సాధనాలు తయారయ్యాయి. ప్రజలకు నిజాలు తెలియని స్థితి తలెత్తింది. నాలుగు దశాబ్దాల ప్రజా ఆకాంకక్షూ ఉద్యమానికీ పర్యవసానమైన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలలోనే ఇంత దారుణమైన దుస్థితి తలెత్తినప్పుడు, దీన్ని అర్థం చేసుకోవడం, వీలైన అన్ని మార్గాలలో, సాధనాలతో ప్రజలకు వివరించడం, ప్రజా ఆకాంక్షల సాఫల్యం కోసం మరొకసారి ఉద్యమించవలసిన అవసరానికి ప్రజలను సంసిద్ధం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.
‍-ఎన్.వేణు గోపాల్

Keywords : telangana, kcr, trs, social media, ne.venugopal
(2021-01-25 01:23:05)No. of visitors : 2161

Suggested Posts


నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ

ఎవరైనా మావోయిస్టు రాజకీయాలు కలిగి ఉన్నప్పటికీ, మావోయిస్టు పార్టీ సభ్యుడైనప్పటికీ, చివరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ ప్రత్యేకమైన నేరం చేశాడని మీరు రుజువు చేస్తే తప్ప శిక్షించడానికి వీలులేదని స్పష్టం చేసిన బోం

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

మహాజనాద్భుత సాగరహారానికి ఐదేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.....

Search Engine

ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
అదానీపై క‌థ‌నానికి అరెస్టు వారెంట్‌ !
వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు
వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్
సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ?
యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై ‍బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు.
రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర‌
ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్య‌లు
ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ‌ స్ట్రీట్ వెండర్స్
హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
more..


తెలంగాణొస్తే