ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ

ʹక్రాంతి

ఈ దేశ ముఖచిత్రం మీద ఒక బక్కపల్చటి మనిషి ప్రయాణిస్తూ ఉంటాడు. గాలిలో తేలియాడుతున్నట్లు, గాలినే తిని జీవిస్తున్నట్లు. భూమి మీద అడుగు గట్టిగా వేస్తే నేల బాధపడుతుందేమోనని అతని సందేహం. కలియ తిరుగుతుంటాడు. గాలిని తాగి జంటనగరాలను తాకుతూ, ధనవంతుల నివాసం జూబ్లీహిల్స్‌కు చేరుకుంటాడు. అక్కడి నుంచి ఏ అర్థరాత్రో ఉద్యోగ బాధ్యతలను ముగించుకొని చుక్కల్ని లెక్కిస్తూ వెన్నెల మీద ప్రయాణిస్తాడు. అతని కోసం ఒంటరి తల్లి ఎదురుచూస్తూ ఉంటుంది. ఏ అర్థరాత్రో, అపరాత్రో వచ్చే కొడుకు కోసం తల్లి కళ్లలో ఒత్తులేసుకొని చూస్తుంటుంది. కలిగినదేదో బిడ్డకింత పెట్టి, మిగిలింది తాను తిని పడు కుంటుంది.

అతడు ఆగస్టు 28న రోజూలాగే ఇంటికి చేరి తన నవలోకపు ఊహలను ల్యాప్‌టాప్‌లో చిత్రించుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఒకవైపు ల్యాప్‌టాప్‌, మరోవైపు సెల్‌ఫోన్‌ మధ్యలో నిద్రిస్తున్న మనిషి. ఉదయం ఎనిమిది గంటలకు ఉన్నట్టుండి ఎవరో దాడిచేసారు. ఎవరంటే, గుర్తు తెలియని మనుషులు కాదు. గుర్తించే పోలీసులే. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు కలిసి చేసిన దాడి. ఆ బక్కపల్చటి మనిషిని పట్టడానికి అంతమంది వాలిపోయారు. రెండు గదుల తన ఇంటిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రెక్కలను విరిచిపట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు... తెలిసిన ప్రశ్నలకైతే సమాధానం చెప్పగలం. తెలియని వాటి కోసం ఏమిటి ఈ చిత్రహింస.

ఎక్కడి కోరేగావ్‌, ఎక్కడి హస్తినా హైదరాబాద్‌లో జర్నలిస్టు ఉద్యోగం చేసుకొనే ఈ మనిషికి ఏమిటి సంబంధం...? రాజ్యం తలుచుకుంటే ఏ సంబంధాన్నైనా అంటకట్టగలదు. రెండు గదుల ఆ ఇంట్లో కొన్ని గిన్నెలు, కొన్ని బట్టలు, ఇంకొన్ని వస్తువులు తప్ప ఇంకేమీ లేవు. కానీ ఖాకీ కన్ను అంగుళం అంగుళం సోదాచేసింది. ఇళ్లును కుప్ప పోసినంత పనిచేసారు. బియ్యంలో ఏముంటాయని బతిమి లాడినా వదలలేదు. అవునులే బియ్యం గింజ మీద కూడా రైతు మౌనంగా రాసిన మృత్యుసందేశమేదో దొరుకుతుందను కున్నారు.

ఒంటరి తల్లి బిడ్డకోసం తహతహలాడింది. ఏం జరుగుతుందో ఆ తల్లికి తెలియదు. బిడ్డను కన్నది కానీ అతని విశ్వాసాలను, రాజకీయాలను, నవలోపు ఊహలను కనలేదు కదా! యాతన పడింది. ఆవేశపడింది. ధర్మాగ్రహాన్ని ప్రకటించింది. ఇంత పెద్ద రాజ్యం ముందు ఆమె గుండె తట్టుకోలేకపోయింది. గుండె అలసిపోయి స్పృహతప్పి పడిపోయింది. తల్లికి పుట్టిన మనుషులైతే ఆ తల్లి బాధను అర్థం చేసుకొనేవాళ్లు. రాజ్యానికి పుట్టారు కదా!(వాళ్లను కన్నతల్లులకు క్షమాపణలు) చేసే ఉద్యోగం కన్న అధికంగా ప్రవర్తించే రాజ్య స్వభావానికి వీళ్లు దాఖలా. స్పృహ తప్పి పడిపోయిన ఆ తల్లిని కనీసం హాస్పటల్‌లో కూడా చేర్చలేదు. ఆమె విశ్రాంతి తీసుకోవడానికి వంట గదిలోకి కూడా రానివ్వలేదు. మనుషులు రాళ్ల కంటే కఠినంగా ఉంటారని వీళ్లను చూస్తే సరి.... సాయంత్రం నాలుగు గంటల వరకు ఇళ్లునంతా విధ్వంసం చేసి చేతికి ఏది దొరికితే దానిని పట్టుకెళ్లారు. అపురూపంగా దాచుకున్న పుస్తకాలు, రాసిపెట్టుకున్న కవితలు, గీసుకున్న ముఖచిత్రాలు ఒకటేమిటి... పదేళ్లుగా ఆసక్తి కొద్దీ కెమెరాలో అతడు తీసిన ఫొటోలు అన్నీపోయాయి. ప్రకృతి విలయంలో నిప్పు, నీరు ఇంట్లో పడితే ఏం జరుగుతుందో అదే చేసారు. అంతకంటే ఎక్కువగా చేసారు. రాజ్యం, దాని అంగాలు మనిషి జీవితంలో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలవో, సున్నితమైన జ్ఞాపకాలను, భావాలను ఎలా ధ్వంసం చేయగలవో ఇదొక ఉదాహరణ.

ఆ మనిషి ఈ రాజ్యానికి ఎందుకంత టార్గెట్‌ అయ్యాడు...? నకిరేకల్‌ పట్టణంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన పురుషోత్తంరెడ్డి, క్రాంతిగా పరిణామం చెందడానికి చాలా పరిణామం జరిగింది. కాలం ఎంత వేగంగా ప్రయాణిస్తుందో కొందరు మనుషులు కూడా అంతే వేగంగా పురోగమిస్తారు. చరిత్ర గమనంలో భాగమవుతారు. క్రాంతి అంతే. తండ్రి లేని లోటును గుర్తుచేసుకుంటూ కుమిలి పోకుండా వెలుగుదారుల వెంట నడిచి క్రాంతిగా మారాడు. ఐటిఐ విద్యనభ్యసిస్తున్న రోజుల్లో ప్రగతిశీల విద్యార్థులు పరిచయమయ్యారు. ఏ కొత్త విషయమైనా క్రాంతి వెంటనే నేర్చుకోగలడు. పట్టుకోగలడు. సమాజం మారాలని, అందరూ సమానంగా జీవించాలని, కుల, ఆర్థిక, స్త్రీ-పురుష, జాతి అసమానతలు ఉండకూడని సమాజం కోసం తపించాడు. ఆ నవలోకపు కలలను నిజం చేసు కోవడానికి పీడీఎస్‌యు కార్యదర్శి అయ్యాడు. విద్యార్థి పత్రికను నడిపాడు. విమోచనను ముద్రించాడు. అధ్యయనం, ఆచరణ, ముద్రణ, సంపాదకత్వం అనే ఇష్టమైన పనుల ఆచరణలోకి వచ్చాడు. అనేక సంక్షోభాలను ఎదుర్కొని నిలబడ్డాడు. మిత్రులు, సహచరులు తనను, తన రాజకీయ విశ్వాలను వదిలి వెళ్లిపోయినా.... నమ్ముకున్న రాజకీయాల కోసం నిబద్ధతతో నిలబడ్డాడు. విప్లవ రచయితగా మారాడు. వృత్తి జర్నలిజం. ప్రవృత్తి రచన. క్రాంతి సృజనశీలి. ఆ మాటకొస్తే ప్రతి విప్లవ రచయిత అంతే. అతడు పుస్తకాలకు అద్భుతమైన ముఖచిత్రాలు వేస్తాడు. సభల కోసం సందర్భోచిత బ్యానర్స్‌ డిజైన్‌ చేస్తాడు. వాటి కోసం రాత్రులు, పగళ్లు ఎన్నో ఖర్చు అవుతాయి. అయినా లెక్కపెట్టడు. పనిలో నాణ్యత కోసం పరిణతి కోసం చూస్తాడు. గౌరీలంకేశ్‌ను దుండగులు చంపేస్తే తీవ్రంగా స్పందించాడు. ఆమె లాంటి ఎవరైనా సరే. భావప్రకటన కోసం -దానిని రక్షించుకోవడానికి తపన పడుతాడు.

ఏదైనా అతని ఆచరణ అందరికీ తెలిసిందే. రహస్యమేమీ లేదు. కన్హయకుమార్‌, ఉమర్‌ ఖలీద్‌ లాంటి యువకుల భావప్రకటన స్వేచ్ఛ కోసం తాను చేయగలిగినది చేసాడు. మౌజ్‌ మీద ఆడే అతని చేతులు రాజ్యానికి కుట్రలాగే కన్పించాయి. ఇప్పుడు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, మౌజ్‌లు, పెన్‌డ్రైవ్‌లు కూడా విప్లవాలు తెస్తాయి కాబోలు...! రాజ్యానికి అవన్నీ ద్రోహపూరిత వస్తువులయ్యాయి. అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఎంత హాస్యం చూడండి. ఇంతగా భయపడే రాజ్యం కాగితపు పులే కదా! పౌరుణ్ణి చూసి భయపడటం. కవిని, చిత్రకారుణ్ణి, భావకుడిని చూసి వణికిపోవడం. అంతే ఇక ఎంత మాత్రం ఈ రాజ్యం నిలబడదే అన్పిస్తుంది. పతనం అంచులకు చేరిందనిపిస్తుంది. అతడు నడస్తున్న తెలంగాణ పత్రికకు సంపాదకవర్గ సభ్యుడు. పరిణతి చెందిన రచయిత.

వరవరరావు. సన్నిహితులు వీవీగా పిలుచుకునే మనిషి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు, ఆ సంస్థకు కార్యదర్శిగా పనిచేసినవాడు. కవి, రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, వక్త, నాయకుడు, శాంతిదూత ఒకటేమిటి ఒక మనిషి ఎన్ని రూపాలలో ప్రజల కోసం పని చేయగలడో అన్ని పద్ధతులలో చేసినవాడు, చేస్తున్నాడు. యాభై ఏళ్లకు పైగా ఎత్తిన కలాన్ని దించకుండా రాస్తున్నాడు. ప్రతీ అక్షరము ప్రజలకోసమే. తెలుగునేలలో ఇంత సుదీర్ఘకాలం నమ్ముకున్న విలువల మీద, విశ్వాసాల మీద నిలబడిన మనిషి మరొకరు లేరని చెప్పవచ్చును. ప్రజల పక్షం నిలబడి మాట్లాడినందుకు, రాస్తున్నందుకు వివిధ సందర్భాలలో ప్రభుత్వాలు మోపిన అక్రమ కుట్ర కేసుల నేపథ్యంలో పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపాడు. ఇంత సుదీర్ఘంగా జైలు జీవితం గడిపిన కవి తెలుగు నేలలో మరొకరు లేరు. 2002లో నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి, పీపుల్స్‌వార్‌ పార్టీకి, 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి మధ్య జరిగిన చర్చలలో ప్రతినిధిగా పాల్గొని తెలుగునేలలో శాంతి నెలకొనడానికి వీవీ కృషిచేసారు.

ప్రజల కోసం ఇంతటి బహుముఖ కృషి చేసిన కవి మీద రాజ్యం కక్షకట్టింది. హిందుత్వ ఫాసిజం గురించి, ఆదివాసుల హత్యల గురించి, ముస్లీంల హక్కుల గురించి, దళితుల మీద జరిగే దాడుల గురించి, ఈ దేశం గురించి, దేశ సంపద గురించి మాట్లాడుతున్నందుకు, రాస్తున్నందుకు, పోరాడుతున్నందుకు ʹప్రధాని హత్యʹ కుట్రను రచించిన రాజ్యం అతని ఇంటి మీద దాడి చేసింది. యాభై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇళ్లను సోదా చేసారు. కుటుంబాన్ని, బంధువులను, చుట్టుపక్కలవారిని భయందోళనకు గురిచేసారు. తన పక్కనే ఉంటున్న అల్లుడు జర్నలిస్టు, విరసం సభ్యుడు కూర్మనాథ్‌ ఇంటి మీద దాడిచేసారు. ఇఫ్లూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్న అల్లుడు సత్యనారాయణ ఇంటి మీద దాడి చేసి అనేక ప్రశ్నలతో అవమానించారు.

ఇది కేవలం నలుగురు ఇళ్ల మీద దాడికాదు. భావప్రకటన స్వేచ్ఛ మీద దాడి. ప్రజల వైపున నిలబడి మాట్లాడే మధ్యతరగతి బుద్ధిజీవుల మీద దాడి. ఇంకెవ్వరు మాట్లాడకుండా బయపెట్టే ముందస్తు ఫాసిజం. తనను కాదన్న వారినందర్నీ మూకుమ్మడిగా హత్యలు చేసిన హిట్లర్‌ వారసత్వం ఇవ్వాళ దేశంలో అమలవుతున్నది. అసమ్మతికి అవకాశం లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొనసాగుతున్నది. దబోల్కర్‌, గౌరీ లంకేశ్‌ హత్యలు, వరవరరావు అరెస్టు ఫాసిజానికి సంకేతం.

రాజకీయ విశ్వాసాల గురించి కాదు. మనిషి- మానవత్వం-మంచితనం లాంటి గుణాల గురించే భయం. రాజ్యానికి ఇవి పడని పదార్థాలు. మనిషిని కూడా రక్షించుకోలేని సంక్షోభంలో సమాజం పడిపోతుందనే భయం వెంటాడుతున్నది. ఆనాడు ఫాసిజాన్ని కళ్లతో చూసిన వ్యక్తులు కొందరున్నారు. కానీ ఈనాడు భయము, విధ్వంసము, హత్యలు, దాడులు, తిండి, కట్టు, బొట్టుపై ఆంక్షలు, భిన్నత్వాన్ని సహించలేని అహంకారం చూస్తే ఇండియాలో దాగున్నా ఫాసిజం అనుభవంలోకి వస్తుంది. బుద్ధిజీవులారా ఇది క్రాంతి, వరవరరావు, కూర్మనాథ్‌, సత్యనారాయణ దగ్గరే ఆగిపోదు.
- కాశీం

ʹనడుస్తున్న తెలంగాణʹ పత్రిక సౌజన్యంతో

Keywords : kranti tekula, pune police, virasam, varavararao, క్రాంతి టేకుల, జర్నలిస్టు, వరవరరావు, పూణే పోలీసు, కుట్ర కేసు
(2024-03-14 18:38:06)



No. of visitors : 1037

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹక్రాంతి