నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!


నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!

నన్నో

ఆ రోజు మీడియా వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌లు ఆశ్చ‌ర్యాన్ని గొలిపాయి. "మీరు ప్ర‌ధాని మోదీని చంపేందుకు కుట్ర ప‌న్నార‌ట క‌దా? అందుకోసం వ‌ర‌వ‌ర‌రావుతో క‌లిసి డ‌బ్బులు స‌మ‌కూర్చుతున్నార‌ట క‌దా?" అంటూ ప్ర‌శ్న‌లు కురిపించారు. దాదాపు ద‌శాబ్ధ‌కాలంగా న‌న్ను పాత్రికేయుడిగా చూస్తున్న‌వాళ్లు.. ఆఫీసులో నాతో క‌లిసి ప‌నిచేస్తున్న వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌వి.

నేనింకా నిద్ర‌లేవ‌క ముందే ఇంటి మీద ప‌డ్డ పోలీసు మంద న‌న్ను నేర‌స్థుడిగా చిత్రీక‌రించింది. ఒక అల‌జ‌డి సృష్టించింది. రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్ని దాటి మా యింటి మీదికొచ్చిన ఖాకీలు ఇల్లంతా జ‌ల్ల‌డ‌బ‌ట్టారు. ఎందుకొచ్చారు? ఏ హక్కుతో వ‌చ్చారు? స‌మాధాన‌ముండ‌దు.

తెల్ల‌వారుజామున ఏ క‌ల‌ల ప్ర‌పంచంలోనో తారాడుతున్న న‌న్ను నిర్ధ‌య‌గా ప‌ట్టి లేపారు. నా ఆలోచ‌న‌ల‌కు అక్ష‌రాల‌ను కూర్చే నా కంప్యూట‌ర్‌ను, నా మాట‌ల‌ను మిత్రుల‌కు చేర్చే నా మొబైల్‌ను లాక్కున్నారు. నా ఉనికిని, నా వృత్తిని ప్ర‌శ్నిస్తూ ఆధారాలు చూప‌మ‌న్నారు. అన్నిటినీ త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.

దశాబ్ధ‌కాలంగా పాత్రికేయుడిగా వేరు వేరు రంగాల ప్ర‌జ‌ల‌తో నాకున్న ప‌రిచ‌యాల‌ను ఒక‌టికి వంద‌సార్లు ప‌రికించారు. ఒక్క‌రా ఇద్ద‌రా ఏకంగా ఎన‌బై మందికిపైగా మ‌ఫ్టీ పోలీసులు ఇంటిని చుట్టిముట్టి క‌ల‌క‌లం సృష్టించారు.

ఇన్నేళ్లుగా నేను పోగుచేసుకున్న సాహిత్యాన్ని జ‌ల్లెడ‌బ‌ట్టారు. వ‌ర‌వ‌ర‌రావు క‌వితా సంక‌నాలు నా లైబ్ర‌రీలో ఉండ‌డం వాళ్ల‌కు నేరంగా క‌నిపించింది. క‌విత్వం, ద‌ళిత సాహిత్యం, కోకు ర‌చ‌న‌లు, మావో సంక‌ల‌నాలు, జ‌నం పాట‌ల సీడీలు, రెడ్ యాంట్ డ్రీమ్ డాక్యుమెంట‌రీ ఇలా ప్ర‌తిదీ వాళ్ల‌కు నిషిద్ధ సాహిత్యంగానే గోచ‌రించింది. విద్యార్థి నాయ‌కుడిగా, విర‌సం కార్య‌క‌ర్త‌గా నిర్వ‌హించిన‌, పాల్గొన్న వంద‌ల కార్య‌క్ర‌మాల చాయాచిత్రాలు వాళ్లు దేశ‌ద్రోహ చ‌ర్య‌లకు న‌మూనాలుగా అగుపించాయి. కాఫీ క‌ప్పులు, పెన్ జార్‌లు ఏవీ వ‌ద‌ల కుండా వెతుకుతూనే ఉన్నారు. త‌మ‌కు కావ‌ల్సిన వాటిని పోగు చేసుకుంటూనే ఉన్నారు. హార్డ్ డిస్క్‌, పుస్త‌కాలు, క‌ర‌ప‌త్రాలు ఇలా ఒక్కొక్క‌టి.

పాపం.. అమ్మ‌. ఎప్పుడూ ఇలాంటి వాతావ‌ర‌ణం ఊహించి ఉండ‌దు. ఇంద‌రు పోలీసులు వ‌చ్చారు.. నా బిడ్డ‌ను ఏం చేస్తారో అని ఆందోళ‌న చెందుతోంది. బోరున రోధిస్తోంది. ఆ చిన్న పాటి ఇంటిని ఇర‌వై మంది పోలీసులు ఆక్ర‌మించారు. ఇంట్లోకి వెళ్ల‌డానికి ఉన్న స‌న్న‌ని దారిలో మ‌రో ఐదారుగురు త‌చ్చాడుతున్నారు. చివ‌ర‌కు అమ్మ‌ను కూడా ఇంటి బ‌య‌ట‌కు నెట్టేశారు. తీవ్ర ఆందోళ‌న‌తో గుండెనొప్పి వ‌చ్చి... ఇబ్బంది ప‌డుతున్నా న‌న్ను త‌న ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌నీయ‌కుండా బంధించారు. క‌నీసం ఇంట్లో ఓ మూల‌న విశ్రాంతి తీసుకోవ‌డానికి కూడా అమ్మ‌కు అవ‌కాశం లేకుండా చేశారు. ప్రాణం పోతుందంటే .. పోతే భూమికి భారం త‌గ్గుతుందంటూ హేళ‌న చేశారు. ఇదీ ఫ్రెండ్లీ పోలీసుల వ్య‌వ‌హారం. న‌న్నొక గ‌దిలో ఉంచి చుట్టూ న‌లుగురు తెలంగాణ పోలీసులు కాప‌లా. చివ‌ర‌కు టాయిలెట్‌కి కూడా వీలు లేదు.

ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇన్ని పుస్త‌కాలు ఎందుకు నీకు? ఎలా సేక‌రించావు? ఇంకా ఏమి ఉన్నాయి? అంటూ తెలంగాణ పోలీసులు. మ‌రో వైపు పూణే పోలీసులు మ‌రాఠీలో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎలాంటి కుట్ర జ‌రుగుతుందో అర్థం కాదు. ఏ కేసు విష‌యంలో సోదాలు జ‌రుపుతున్నారో చెప్ప‌మంటే చెప్ప‌రు.

అంతేనా.. ఒక ఫొటోగ్రాఫ‌ర్‌గా నేను గ‌త నాలుగైదేళ్ల‌లో తీసిన వేలాది ఫొటోల‌ను, ర‌చ‌యిత‌గా నేను రాసుకున్న ర‌చ‌న‌ల‌ను, ఒక ఆర్టిస్ట్‌గా నేను రూపొందించిన వంద‌లాది డిజైన్స్‌ను అన్నిటినీ సీజ్ చేసి తీసుకెళ్లారు. అస‌లేం జ‌రుగుతోంది? నేను చేసిన నేరం ఏంటి? ఎందుకిదంతా? స‌మాధానం లేదు? చివ‌ర‌కు వెళ్తూ వెళ్తూ నాకు అర్థం కాని మ‌రాఠి భాష‌లో నాలుగు పేజీలు పంచ‌నామా రాసి నాతో బ‌ల‌వంతంగా సంత‌కం చేయించుకున్నారు. నా మొయిల్ ఐడీ, ఫేస్‌బుక్ అకౌంట్ వివ‌రాలు, పాస్‌వ‌ర్డ్‌లు సైతం తీసుకున్నారు.

దాదాపు ఆరు గంట‌ల పాటు నేను మాత్ర‌మే కాదు.. మా చుట్టుప‌క్క‌ల కుటుంబాలు సైతం ఒక బీతావాహ వాతావ‌రణంలో గ‌డ‌పాల్సి వ‌చ్చింది. నాపై ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదంటూనే విద్యార్థి ఉద్య‌మ నాయ‌కుడిగా, క‌విగా, పాత్రికేయుడిగా నేను నిర్మించుకున్న నా అస్థిత్వాన్ని దేశ‌ద్రోహిగా మ‌లిచేందుకు య‌త్నించారు పోలీసులు.

ఎందుకిదంతా అంటే? నేను వ‌ర‌వ‌ర‌రావు విద్యార్థిని అని, అత‌డికి నేను స‌హ‌క‌రిస్తుంటాన‌ని అందుకే... మా ఇంటిపై సోదాలు జ‌రిపామ‌ని పంచ‌నామాలో పేర్కొన్నారు. విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడైన వ‌ర‌వ‌ర‌రావుతో విర‌సం స‌భ్యుడిగా నేను సంబంధాలు క‌లిగి ఉండ‌డ‌మే నేర‌మెలా అవుతుందో పోలీసులే చెప్పాలి.

ఆగ‌స్టు 28న ఏక‌కాలంలో హైద‌రాబాద్, ముంబై, రాంచీ, ఢిల్లీ, ఫ‌రీదాబాద్, గోవా న‌గ‌రాల్లో దాదాపు 10 మంది హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, పాత్రికేయులు, ర‌చ‌యిత‌ల ఇండ్ల‌పై దాడి చేసిన పూణే పోలీసులు వ‌ర‌వ‌ర‌రావు, అరుణ్‌పెరెరా, వెర్న‌న్‌, గౌత‌మ్ న‌వ‌లాఖ‌ల‌ను అరెస్టు చేశారు. సుధా భ‌ర‌ద్వాజ్‌, స్టాన్‌స్వామీ, ఆనంద్ తేల్‌తుంబ్డే, కూర్మ‌నాథ్‌, స‌త్య‌నారాయ‌ణ ఇండ్ల‌పై సోదాలు నిర్వ‌హించి ఎల‌క్రానిక్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టులు మోదీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌ని, ఆ కేసులో వీరంద‌రికీ సంబంధాలున్నాయ‌ని, అందుకోస‌మే వారి ఇండ్లలో సోదాలు నిర్వ‌హించామ‌ని పూణే పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు. నిజానికి హ‌త్యా రాజ‌కీయాలు న‌డుపుతున్న‌ది రాజ్యం. దోంగే దొంగ అన్న‌ట్లు ఓ వైపు మూక దాడులు జ‌రుపుతూ... ద‌ళితులు, ముస్లింల‌ను కిరాత‌కంగా హ‌త్య చేస్తున్న హిందుత్వ శ‌క్తులు అదే ద‌ళిత‌, ఆదివాసీ స‌మూహాలు, వారిప‌క్షాన మాట్లాడుతున్న సామాజిక కార్య‌క‌ర్త‌ల‌పైన నేరారోప‌ణ చేస్తుండ‌డం హాస్యాస్ప‌దం.

నిజానికి మోదీ హ‌త్య‌కు కుట్ర అనే అంశం తెర‌మీదికి రావ‌డానికి ముందు బీమా కోరేగావ్ అల్ల‌ర్ల కేసులో నిందితులుగా పేర్కొంటు ప‌లువురు హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేసిన మ‌హారాష్ట్ర పోలీసులు వారికి మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌ను ముందుకు తెచ్చారు. త‌రువాత వారు ప్ర‌ధాని హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ.. అందుకు ఆధారంగా న‌కిలీ లేఖ‌ల‌ను సృష్టించారు. ఇప్పుడు ఆ పేరుతో.. దేశ వ్యాప్తంగా గ‌ల ప్ర‌జాస్వామిక‌, హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుపుతున్నారు.

నిజానికి జ‌న‌వ‌రి 1న‌ బీమాకోరేగావ్‌లో ద‌ళితుల‌పై దాడి చేసింది హిందుత్వ శ‌క్తులు. ఆ దాడిలో ముగ్గురు ద‌ళితులు మృతి చెందారు. ఆ దాడుల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన శంబాజీ భీడే, మిళింద్ ఎక్బోటేపై ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు న‌మోదైంది. కానీ వారిని ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు అరెస్టు చేయ‌లేదు. నింధితుల‌ను కాపాడేందుకు అల్ల‌ర్ల వెన‌క మావోయిస్టులున్నార‌నే కొత్త వాద‌న‌ను ముందుకు తెచ్చారు పోలీసులు.

ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌తో ప్ర‌జ‌ల్లో ర‌గులుకుంటున్న అసంతృప్తిని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు మావోయిస్టు బూచిని ముందుకు తెచ్చింది. మోదీ హ‌త్య‌కు కుట్ర పేరుతో.. సానుభూతిని పోగు చేసుకోవాల‌నుకుంటున్న బీజేపీ.. ఆ పేరుతో ప్ర‌శ్నించే గొంతుల్ని నొక్కేయాల‌నుకుంటోంది.

బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగున్న‌రేండ్ల‌లో దేశ ప్ర‌జ‌లు మునుపెన్న‌డూ లేనంత హింస‌ను అనుభ‌వించారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌ని బీజేపీ హ‌యాంలో ద‌ళితులు, ఆదివాసీలు, ముస్లింల‌పై దాడులు తీవ్ర‌త‌ర‌మ‌య్యాయి. రాజ్యాంగం స్థానంలో మ‌నుస్మృతిని అమ‌లు చేయాల‌నుకుంటున్న ఆర్ ఎస్ ఎస్ ఈ దాడులకు వ్యూహ‌క‌ర్త‌. గో ర‌క్ష‌ణ‌, ల‌వ్ జిహాద్ పేరుతో జ‌రిగిన దాడుల‌కు, ద‌బోల్క‌ర్‌, గౌరీ లంకేష్ లాంటి మేధావుల హ‌త్య‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేని స‌ర్కారు ప్ర‌శ్నించే ప‌త్రి ఒక్క‌రినీ దేశ ద్రోహిగా చిత్రించేందుకు సిద్ధ‌మైంది.

విశ్వ‌విద్యాల‌యాల స్వ‌యం ప్ర‌తిప‌త్తిని ప్ర‌శ్నార్ధ‌కంగా మార్చి.. వాటిని సంఘ్ ప‌రివార్ స్థావ‌రాలుగా మార్చిన అధికార బీజేపీ, ఉమ‌ర్ ఖ‌లీద్‌, క‌న్హ‌య్య కుమార్ లాంటి విద్యార్థి నాయ‌కుల‌ను దేశ ద్రోహులుగా చిత్రీంచేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నం చేసింది. అది సాధ్యం కాక‌పోవ‌డంతో ఏకంగా వారిని హ‌త్య చేసేందుకూ సిద్ధ‌ప‌డింది. ఉనా ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించిన జిగ్నేష్ మెవానీ, బీమ్ ఆర్మీ నాయ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ రావ‌ణ్ పైనా ఇలాంటి దాడికే సిద్ధ‌మైంది.

నోట్ల ర‌ద్దు, జీఎస్‌టీ లాంటి నిర్ణ‌యాల‌పై తీవ్ర వ్యతిరేక‌త‌ను పోగుచేసుకున్న ప్ర‌భుత్వం, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో, యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన ప్ర‌భుత్వం, వ్య‌వ‌సాయ సంక్షోభాన్ని, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని, నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ను నియంత్రించేల‌ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను దారిత‌ప్పించాల‌నుకుంటోంది. అంతేకాదు.. సమీప భ‌విష్య‌త్తులో ఆదివాసీ స‌మాజంపై పెద్ద ఎత్తున దాడికి పూనుకోనుంది. అందుకు కోసం ల‌క్ష‌లాది పారామిలిట‌రీ బ‌ల‌గాలు ఇప్ప‌టికే అట‌వీ ప్రాంతాల్లో మోహ‌రించాయి. రేపొద్దున జ‌ర‌గ‌బోయే మాన‌వ హ‌నాన్ని గురించి మాట్లాడేవాళ్లు ఉండ‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల గొంతునొక్కేందుకు య‌త్నిస్తున్న‌ది.

అస‌మ్మ‌తిని అణ‌చివేసేందుకు బ్రాహ్మ‌ణీయ ఫాసిజం చేస్తున్న ఈ కుట్ర ఇవాళ దేశ ప్ర‌జ‌ల ముందున్న అది పెద్ద ప్ర‌మాదం. ఓ వైపు దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతూ.. ఆ సంప‌ద మీద హ‌క్కుదారులైన అడ‌విబిడ్డ‌ల‌ను ఎన్‌కౌంట‌ర్ల‌పేర హ‌త్య చేస్తున్న‌ది. ఆత్మ‌గౌర‌వం కోసం, అధికారంలో వాటా కోసం నిన‌దిస్తున్న ద‌ళితుల‌పై రోజురోజుకూ హ‌త్యాకాండ‌లు, నిర్బంధం తీవ్ర‌మ‌వుతున్న‌ది. అల్ప సంఖ్యాకులైన ముస్లిం మైనార్టీల‌ను దేశ ద్రోహుల‌గా చిత్రీక‌రించి మూక దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ది. మొత్తంగా అట్ట‌డుగు ప్ర‌జ‌ల జీవితాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న రాజ్యం.. క‌నీస ప్ర‌జాస్వామ్య హ‌క్కుల‌ను కూడా కాల‌రాస్తున్న‌ది. ఈ బ‌రితెగింపుకు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ప్ర‌జాందోళ‌ల‌ను నిర్మించాల్సిన సంద‌ర్భం ఇది. మ‌న క‌ళాల‌ను, గళాల‌ను ఎక్కుపెట్టాల్సిన సంద‌ర్భం ఇది.

సోర్స్ : అరుణతార

Keywords : క్రాంతి టేకుల, పూణే పోలీసులు, సోదాలు, దేశద్రోహి, వరవరరావు, మావోయిస్టులు, kranti tekula, journalist, pune police, varavararao, maoists
(2019-02-15 05:22:26)No. of visitors : 472

Suggested Posts


0 results

Search Engine

రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
more..


నన్నో