అమృతకు క్షమాపణలతో..
నిజమే, తండ్రులకు కూతుళ్ళ మీద ఎంత ప్రేమో! అది ఈనాటిది కాదు. పాలబుగ్గల పసివయసులోనే ఒక అయ్యా చేతిలో పెట్టి ప్రేమగా కన్యాశుల్కం తీసుకునే యుగం నుండీ జాలువారుతూనే ఉంది. నిజానికి అంతకు ముందు ఎన్నో యుగాల నుండే... ఎప్పటి నుండో సరిగ్గా చెప్పలేం గాని భర్త చితిలోకి ప్రేమగా సాగనంపిన యుగం నాటి నుండీ అయితే చూస్తూనే ఉన్నాం. ʹఆడʹపిల్లగా సాక్కునే మురిపెమూ, గుండెల మీది కుంపటిగా భరించే ప్రేమా తెలుసు. ఆస్తివలె కాపాడుకున్న ఆరాటమూ తెలుసు. పదేళ్ళ వయసు నుండే సారించిన నిఘా కళ్ళూ తెలుసు. తండ్రి నీడ నుండి నుండి భర్త నీడలోకి జాగ్రత్తగా జారవిడిచే బాధ్యతా తెలుసు. ఆస్తి కొడుక్కు, పరువు కూతురుకు పంచే ఔన్నత్యం తెలుసు. మార్కెట్లో తూకం వేసి కులంలో కట్నంతో చేసే కన్యాదానాల సాక్షిగా వంటింట్లో కిరసనాయిలు డబ్బాకు, గ్యాస్ సిలిండర్లకూ చేసిన ఆహుతులూ తెలుసు.
కులభూషనుడికీ, యోగ్యుడికీ ʹభద్రంగాʹ ఇచ్చి పంపుతారు కదా! ముక్కూ మొహం తెలీదు. మనిషీ, మనసూ తెలీదు. పక్కవీధికి కూడా పుట్టింటి మగవాళ్ళ రక్షణ లేకుండా పోని పిల్ల, తండ్రి మీద నమ్మకంతోనే జీవితం అర్పించడానికి పోతుంది. తండ్రి పరువు కోసమే మొగుడు ఎట్లాంటి వాడైనా భరిస్తుంది. వాడి తాగుళ్ళూ, తిరుగుళ్ళూ, వాడు పెట్టే హింసలు ఎప్పుడన్నా చెప్పుకుంటే, దుఃఖం దించుకోను కన్నవాళ్ళింటికి పొతే, ఇప్పుడు నీ ఇల్లు ఇది కాదమ్మా అని ప్రేమగా చెప్తారు కదా పాపం. పుట్టినింటి, మెట్టినింటి పరువు కాపాడమని ప్రేమగా చెప్తారు కదా. నీ ఖర్మ నువ్వు భరించాలని ʹధైర్యంʹ చెప్తారు కదా ప్రేమగా. మనసుకో, శరీరానికో అంటిన పచ్చి గాయాలు మానక ముందే కులపెద్దల సాక్షిగా ప్రేమగా రాజీ కుదురుస్తారు. తర్వాతెప్పుడో ఫ్యానుకు వేలాడే కూతురి శవాన్ని ప్రేమగా దించుకోను వస్తారు. హత్యో, ఆత్మహననమో ఏదైతేనేం, చావుకు కారణమైన వాణ్ని కసిగా ఏ తండ్రి ప్రేమా వేట కొడవలితో వెంటాడదు. న్యాయవ్యవస్థ ముందు పరువుగా రాజీపడిపోతుంది. ఈ దేశపు తండ్రుల ప్రేమ ఎంత గొప్పది! కడుపులో పిండంగా ఉండగానే, భూమ్మీదికి రాకుండా మోక్షం ప్రసాదించేంత! పసిదేహాలను గొంతు నులిమేసేంత! ఆడపిల్లల సంఖ్య తగ్గించి మార్కెట్లో డిమాండ్ పెరిగేలా చేసేంత!
(వీటికి విరుద్ధమైన తండ్రులూ ఉన్నారు. బహుస్వల్పం. వాళ్లకు సలాం.)
ప్రేమ ఆడపిల్లల మీదనేనా? మగపిల్లలూ మనుషులే. వాళ్ళకూ బంధాలు, బాధ్యతలు, మనసు, మానవత్వం, పరువూ, మర్యాదా నేర్పగలరా కాస్త? వాళ్ళు ఏడో తరగతిలోనే వ్యసనాలు నేర్చుకుంటున్నారు. కాలేజీకి పంపిస్తే ఆడపిల్లల్ని వెంటబడుతున్నారు. గొంతులు కోస్తామని బెదిరిస్తున్నారు. యాసిడ్లు పోస్తామంటున్నారు. అలా చేస్తున్నారు కూడా. చిన్న చిన్న పిల్లపై అత్యాచారాలు చేస్తున్నారు. ఆడపిల్లల మీద చూపించే ʹప్రేమʹ కాస్తైనా మగపిల్లల మీద చూపించగలరా? హింసోన్మాదానికి, కామక్రోధమద మాత్సర్యాలకు లోను కాకుండా రక్షణ కల్పించగలరా? ఇల్లు దాటితే ఎక్కడికి పోతున్నారోనని నిఘా పెట్టగలరా? ఏం అఘాయిత్యం చేస్తారోనని ముందు జాగ్రత్త పడగలరా? ఆంక్షలు పెట్టగలరా?
దళిత స్పృహ కలిగిన మేధావుల్లారా, అంగం కొలతల దగ్గరే ఆగిపోక ఆడపిల్లల మనసు చూడగలరా? చూడగలిగితే ప్రేమ కవిత్వం మళ్ళీ ప్రబంధ కాలంలోకి దిగజారి బూతు కవిత్వం కాకుండా చూడండి. అమ్మాయిల ఇంటినీ, రక్షణ గోడల్నీ, తండ్రి ʹప్రేమʹను, ఆంక్షల్ని దాటుకొని ప్రేమ మీద ప్రేమతో, నమ్మకంతో, తనకు తెలియని ప్రపంచంలోకి, దూకేసే సాహసం చూడగలరా? ప్రేమే అనండి, ఆకర్షణే అనండి, ఎన్ని గోడలు బద్దలు కొట్టారు వాళ్ళు. కులస్వామ్యపు కంచెల్నేనా, పితృస్వామ్యపు కత్తులనేనా, ఎటు వంటి శక్తులకు ఎదురొడ్డారు! ఆ పిల్లా, ఆ పిల్లవాడూ మార్క్స్ ను చదువుకోలేదు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయలేదు. ఉద్యమాల ఉగ్గుపాలు తాగలేదు. ప్రకృతంత సహజంగా ఆకర్షింపబడ్డారు. చదువు, కెరీర్, జీవన భద్రత ఏమీ ఆలోచించని వెర్రివాళ్ళు. మేం బతగ్గలమనే నమ్మకం చూడండి. రెండు చేతులూ, రెండు కాళ్ళూ, మెదడూ ఉన్న మనుషులు కదా, ఎదో ఒకటి చేసుకొని బతుకుతారు. అందరికీ అన్నీ ఉన్నాయా ఈ వ్యవస్థలో? వీళ్ళకు కనీసం జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అవకాశం దొరికింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంతా బాగుంటుందని కాదు. జీవితపు కాఠిన్యం మెల్లగా తెలిసి రావొచ్చు. ఆ పిల్లల్లోనే పితృస్వామ్యమూ, కులమూ పైకెగసి బుసలు కొట్టొచ్చు. ఇదైతే ఉండనిదెక్కడ చెప్పండి. ఇక్కడైతే బాంధవ్యం కలవడానికి కట్నాలు, డబ్బు సంచుల అల్పత్వం ఉండదు కనీసం. మనుషుల మధ్య ప్రేమలు, బంధాలు అట్లాగే కదా ఉండాల్సింది.
అన్నట్టు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రెండున్నర లక్షల రివార్డును ప్రకటించిందట కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో. కులం లోపల వివాహాలు నిషేధిస్తే ఎంత బాగుండు. జెనెటిక్స్ పరంగా ఇండియాలో మనుషులు కాస్త ఎదుగుతారు. శతాబ్దాల ʹశాపంʹ నుండి బైట పడతారు. శరీరమూ, మెదడూ, ఆరోగ్యం, ఆలోచనా మెరుగవుతాయి. అయినా ఇది చట్టాల వల్ల అయ్యేదా? కట్నాలు కూడా నిషేధించారు కదా! ఎవరికైనా తెలుసా కనీసం.
ఎంత మోసపూరితమైనదీ వ్యవస్థ. ఎంత దుర్మార్గమైనది. కులం, పితృస్వామిక కుటుంబం మానవత్వాన్ని, ప్రేమను ఎట్లా బలితీసుకుంటోంది. మనిషిని ఒక్కసారి కాదు, పదేపదే చంపుతుంది. మనిషి చచ్చిపోయినా ప్రేమను బతికించుకోవాలనే ఆరాటం చూసి ఎంతటి ద్వేషాన్ని వాంతి చేసుకుంటోంది! కనీసం ఆ పిల్లను కాస్త ప్రశాంతంగా ఏడవనివ్వండి. బతికుండగానే పోస్టుమార్టం చేయకండి. వీలైతే కన్నీళ్లు తుడవండి. నిలబెట్టండి, కులవ్యవస్థపై ఎక్కుపెట్టిన ఆయుధంలా. కులాంతర జంటలను, దగ్ధమైన అంటరాని ప్రేమలను ఒక్కదగ్గరికి చేర్చి నిప్పు రాజెయ్యగలమేమో చూద్దాం. లేదా కనీసం కులాంతర ప్రేమలను అక్కున చేర్చుకుందాం. లేకపోతే ఎందుకీ సోషల్ మీడియా ప్రేలాపనలు.
-పి.వరలక్ష్మి
Keywords : అమృత, కులాంతర వివాహం, కూతుర్లు, ప్రణయ్, మిర్యాలగూడ, amrutha, miryalaguda, pranay
(2024-03-19 00:23:24)
No. of visitors : 3834
Suggested Posts
0 results