అక్రమాల యుద్ధ విమానాల రెక్కల చప్పుడు - ఎన్. వేణుగోపాల్


అక్రమాల యుద్ధ విమానాల రెక్కల చప్పుడు - ఎన్. వేణుగోపాల్

అక్రమాల

(వీక్ష‌ణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసం అక్టోబర్ వీక్షణం సంచికలో ప్రచురించబడినది)

తమది విలువలకు, వ్యక్తిగత నైతికతకు ప్రాధాన్యత ఇచ్చే సాంస్కృతిక సంస్థ అనీ, తమను మించిన దేశభక్తులెవరూ లేరని, ఉండరని సంఘపరివార్‌ ప్రచారకులు ముక్కుపచ్చలారని చిన్నారి పిల్లలను పోగుచేసి ఇచ్చే శిక్షణలలో, శాఖలలో స్వోత్కర్షలు చేసుకుంటూ, అబద్ధపు అతిశయాన్ని ప్రేరేపిస్తుంటారు. అప్పటి అధికారపక్షం కుంభకోణాలకూ అవినీతికీ నిలయమని, తమను ఎన్నుకుంటే అత్యంత నీతివంతమైన పాలన అందిస్తామని సంఘ్‌ పరివార్‌ నాయకులందరూ 2014 ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తాము ప్రధానిగా ప్రకటిస్తున్న వ్యక్తికి భార్యాబిడ్డలూ కుటుంబమూ లేరని, అందువల్ల కుటుంబపాలనకు, అవినీతికి ఆస్కారం ఉండవని చెప్పుకున్నారు. నాలుగు సంవత్సరాల పాలనలో ఈ ప్రగల్భాలన్నీ ఒకటొకటిగా విస్ఫోటనం అవుతున్నాయి. అంత మహత్తరమైన విలువల సంస్థలో జీవితమంతా పనిచేసిన వ్యక్తి ఎట్లా మూడువేలమంది ఊచకోతలకు అగ్రాసనాధిపత్యం వహించి, ఆ రక్తసిక్త సోపానాల మీద దేశ ప్రధాని అయ్యాడో ఇప్పటికే రుజువై పోయింది. ఆ దేశభక్తుల సంస్థ నాయకుడు దేశాన్ని ఎట్లా సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు తాకట్టు పెట్టడానికి కాలికి బలపం కట్టుకుని దేశదేశాలూ తిరుగుతున్నాడో ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ఎందరెందరో బందిపోటు దొంగలను స్వేచ్ఛగా దేశ సరిహద్దులు దాటిపోనివ్వడం మాత్రమే కాదు, దేశ చరిత్రలో అత్యంత భారీ కుంభకోణాల్లో ఒకటి స్వయంగా ఈ ఏలిక కాలంలోనే జరిగిందని ఇప్పుడు రాఫేల్‌ కుంభకోణం బైటపెడుతున్నది.

మామూలుగానే ఈ దేశంలో రక్షణ వ్యవహారాలు ప్రశ్నించడానికి వీలులేని, వివరాలు బైటికి చెప్పడానికి వీలులేని పవిత్రమైన అంశాలుగా చూడడం అలవాటు. ప్రజాప్రతినిధులు అనబడేవారికి కూడ తెలియకుండా, బడ్జెట్‌లో కూడ పొందుపరచకుండా, దేశ రక్షణ రహస్యాల పేరుతో ఆయుధాల, సైనిక సామగ్రి కొనుగోళ్లు, లావాదేవీలు ప్రజలకు అందుబాటులో లేకుండా జరపడం దశాబ్దాలుగా సాగుతున్న తతంగమే. టెండర్‌ ప్రక్రియ, అతి తక్కువ ఖరీదు, అతి ఎక్కువ సాంకేతిక ప్రమాణాలు ఉన్న సామగ్రిని కొనడం అనే పద్ధతులు నామమాత్రంగా ఉన్నప్పటికీ, అసలు ఆ కంపెనీలు అమ్మజూపే ధరే మామూలు మార్కెట్‌ ఖరీదు కన్న ఎక్కువ ఉండడం, నాణ్యత ఎంత నాసిరకంగా ఉన్నా సైనిక సలహాదార్లు, నిపుణులు దాన్ని ఆమోదించడం, ఆ నిపుణుల దగ్గరి నుంచి రక్షణ శాఖ అధికారులు, మంత్రులు, ప్రధానమంత్రుల దాకా భాగస్వాములందరికీ ముడుపులు అందడం ఆనవాయితీ అయి పోయాయి. బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు కుంభకోణంలో ఈ తప్పుడు పద్ధతులన్నీ జరిగాయని స్పష్టంగానే బైటపడింది. బోఫోర్స్‌ కుంభకోణం కొన్ని డజన్ల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినది కాగా, ఇప్పుడు ముప్పై ఏళ్ల తర్వాత వేల కోట్ల రూపాయల అవినీతికి నిలయమైన రాఫేల్‌ కుంభకోణపు వివరాలు ఒక్కొక్కటే బైట పడుతున్నాయి.

మధ్యంతర శ్రేణిలో బహుళార్థసాధకంగా పనిచేసే యుద్ధవిమానాల అవసరం ఉందని భారత వాయుసేన 2007లో మొదటిసారి తన అవసరాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అసలు ఈ అవసరం నిజమైనదేనా, అది కూడ ఆ విమానాల అమ్మకందార్లు, వాయుసేన అధికారులతో కుమ్మక్కై రుద్దిన అవసరమా అనుమానించవలసి ఉంది. అది అలా ఉంచినా, ప్రభుత్వం 126 యుద్ధ విమానాలు కొనడానికి ప్రక్రియ ప్రారంభించింది. ఫ్రాన్స్‌ కు చెందిన డసో, రష్యాకు చెందిన మిగ్‌, స్వీడన్‌ కు చెందిన సాబ్‌, అమెరికాకు చెందిన లాక్‌ హీడ్‌ మార్టిన్స్‌, బోయింగ్‌ వంటి విమాన తయారీ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఈ ప్రక్రియ 2012 నాటికి కొంత ముందుకు సాగి, డసోతో కొనుగోలు ఒప్పందం కుదిరింది. డసో 18 విమానాలను స్వయంగా తయారుచేసి పంపాలనీ, మిగిలిన 108 విమానాలను భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (ఎచ్‌ ఎ ఎల్‌) లో తయారు చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలనీ ఒప్పందం కుదిరింది. అప్పుడు ఒక్కొక్క విమానానికి భారత ప్రభుత్వం అంగీకరించిన ఖరీదు రు. 526 కోట్లు. 2014 ఎన్నికలకు రెండునెలల ముందు డసో కూ, ఎచ్‌ ఎ ఎల్‌ కూ మధ్య సాంకేతిక సహకార ఒప్పందం కూడ కుదిరింది. కాని ఎన్నికలు జరిగి మోడీ ప్రధాని అయిన తర్వాత ఏడాదికి జరిపిన ఫ్రాన్స్‌ పర్యటనలో 36 రాఫేల్‌ యుద్ధవిమానాలు కొంటున్నట్టు పారిస్‌ లో ప్రకటించారు. మరొక నెలన్నర తర్వాత పాత 126 విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. మోడీ ఫ్రాన్స్‌ పర్యటనకు పది రోజుల ముందు అనిల్‌ అంబానీ రిలయన్స్‌ డిఫెన్స్‌ అనే సంస్థ ప్రారంభించాడు. 2016 సెప్టెంబర్‌ లో ఒక్కొక్కటి రు. 1670 కోట్ల చొప్పున రు. 60,000 కోట్లతో 36 రాఫేల్‌ విమానాలు కొనేందుకు భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ కొనుగోలులో స్థానిక భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ ఉంటుందని డసో ప్రకటించింది. 2017 డిసెంబర్‌ లో కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలతో ఈ వ్యవహారంలో లోపాయకారీ అనుమానాస్పద అంశాలు బైటికి రావడం ప్రారంభమైంది. కాగా, ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయి హోలన్‌ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రిలయన్స్‌ డిఫెన్స్‌ ను స్థానిక భాగస్వామిగా చేర్చుకొమ్మని భారత ప్రభుత్వమే డసో కు చెప్పిందని అనడంతో మరిన్ని రహస్యాలు బైటపడ్డాయి. ఇంకా ఈ మూసిపెట్టిన పేటికలో ఎన్ని కంకాళాలున్నాయో చూడాలి.

అవసరమైన విమానాల సంఖ్య మూడో వంతు తగ్గిందంటే అసలు అవసరం నిజమేనా, హేతుబద్ధంగా రూపొందించినదా, అలవోకగా చెప్పినదా అనే అనుమానం కలుగుతున్నది. యుద్ధ విమానాల ఖరీదు మూడు రెట్లు పెరిగిందంటే, ఈ ఖరీదును అంచనా వేయడానికి ఏదైనా శాస్త్రీయ ప్రమాణం ఉన్నదా, అది గుడ్డెద్దు చేనులో పడిన బేరమేనా అని అనుమానించవలసి ఉంది. అన్నిటికన్న ముఖ్యం పదిరోజుల ముందు ఏర్పడిన సంస్థ ఒక కీలకమైన వేల కోట్ల రూపాయల లావాదేవీలో భాగస్వామి కావడానికి ఏ అరతలు, ఏ ప్రమాణాలు పని చేశాయి అని అడగవలసి ఉంది. ఆ సంస్థే ఆ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడి భార్య తీసిన సినిమాకు పెట్టుబడి పెట్టిందని, అందువల్లనే ఆ కాంట్రాక్టు దక్కించు కుందనీ వివరాలు బైటపడుతున్నాయి. అంటే ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం జరిగిందని స్పష్టమవుతున్నది. ఇది దేశమా, అంబానీ రాజ్యమా అనీ, ఇది దేశ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వమా, అంబానీల మేలు చూసే దళారీనా అనీ అడగవలసి ఉన్నది. రాఫేల్‌ యుద్ధవిమానం ఎంత సమర్థమైనదో తెలియదుగాని, దాని రెక్కల చప్పుడు లో మోడీ సంఘపరివార్‌ దేవతావస్త్రాలు జారిపోతున్నాయి.
- ఎన్. వేణుగోపాల్

Keywords : Rafale, flight, army, France narendra modi, anil ambhani
(2019-02-16 07:06:34)No. of visitors : 501

Suggested Posts


అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్. వేణు గోపాల్ (Part-1)

వాళ్లు గదిలోకి వస్తూనే, మేం ఎవరమో, ఏం చేస్తున్నామో కూడ కనుక్కోకుండానే మామీద పడ్డారు. కళ్లకు గంతలు కట్టారు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. మేం జర్నలిస్టులమనీ, రచయితలమనీ చెపుతున్నా పట్టించుకోకుండా పోలీసు మార్కు ప్రవర్తన రుచి చూపించి ఒకటి రెండు దెబ్బలు వేశారు. జీపుల్లోకి తోశారు. ఔరంగాబాద్ లోనే ఉన్న వాళ్ల రహస్య స్థావరానికి తీసుకుపోయారు....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ.

నిజాం రాజు గొప్పవాడా... దుర్మార్గుడా... ఒక పరిశీలన - ఎన్ వేణు గోపాల్

అసలు ఒక పాలన గురింది మాట్లాడేటప్పుడు ఆ పాలకుడి మంచిచెడులు, ఇస్తాయిష్టాలు, అభిరుచులు ప్రధానంగా చర్చ జరిగితే ఇంత దురదృష్టకరంగానే ఉండక తప్పదు. ఎందుకంటే ప్రతిపాలకుడిలోనూ మంచీచెడూ ఉంటాయి. మంచి ప‌నుల ఉదాహరణలు ఎన్ని ఇవ్వవచ్చునో చెడ్డపనుల ఉదాహరణలు అంతకు కొన్నిరెట్ల చూపించవచ్చు...

ఎవరివీ ప్రపంచ తెలుగు మహాసభలు - ఎన్. వేణు గోపాల్

తెలంగాణ వాదులలో అధికార పీఠాలు ఎక్కినవారు ఇప్పుడు మాట మారుస్తుండవచ్చు గాని అప్పుడు మాత్రం తెరాస నాయకులతో సహా ఎందరో తెలంగాణ వాదులు ఆ తిరుపతి తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిరసన ప్రదర్శనలు జరిపారు. తెలంగాణ జాగృతి సంస్థతో పాటు తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ ధూం ధాం వంటి ఎన్నో సంస్థలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.....

తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్

ʹతెలంగాణొస్తే ఏమొచ్చిందా, చూడండిʹ అని తెలంగాణ ప్రభుత్వ సమర్థకులు సోషల్‌ మీడియాలో మాటిమాటికీ కాలు దువ్వుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఊదర కొడుతున్నారు. నిండిన చెరువులు, మత్తడి దూకుతున్న చెరువులు, కనుచూపు మేర విస్తరించిన పంట పొలాలు, చిరునవ్వుల ముఖాలు ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంత కర్కోటక పాలనలోనైనా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇటువంటి ప్రదర్శ

ప్రపంచ తెలుగు మహాసభలు ఏం సాధించాయి ? - ‍ ఎన్. వేణు గోపాల్

తెలుగు భాష మీద , తెలుగు సాహిత్యం మీద, తెలుగు చరిత్ర మీద, తెలుగు సంస్కృతి మీద ఎటువంటి గౌరమూ, శ్రద్ద లేకుండా కేవలం తమ ప్రాపకం పెంచుకోవడానికి తమకీర్తిని చాటుకోవడానికి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి అందులో ముడుపులు కైంకర్యం చేయడానికి ఈ సభలు జరిగాయి...

అబ‌ద్ధాల కేసులో అన్యాయ‌మైన తీర్పు - ఎన్.వేణుగోపాల్

ఆ వాదనలన్నీ విన్నతర్వాత కూడ న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ అబద్దపు వాదనలనే ఆమోదిస్తూ, చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షను ఎట్లా విధించారో అర్థమవుతుంది. వర్గ సమాజంలో న్యాయస్థానం అనేది పాలకవర్గపు చేతిలో పనిముట్టగా, వ్యవస్థ పరిరక్షణకు సాధనంగా పని చేస్తుందనే అవగాహన అందరికీ తెలిసిన నిజమే గాని, ఈ తీర్పు చదివితే ఆ అవగాహన ఎట్లా నూటికి నూటయాభై పాళ్ల వాస్తవమైనదో.....

అక్రమ నిర్బంధానికి పదేళ్ళు! - ఎన్.వేణుగోపాల్ (Part-2)

మాట్లాడుకోవడం మానవ సహజం. అది నేరం కాదు. తప్పు కాదు. మనిషిని మాట్లాడకుండా ఆపగల అధికార శక్తి ఏదీ లేదు. మాట్లాడడాన్ని నేరంగా ప్రాసిక్యూషన్ చిత్రించినా దాన్ని నేను అంగీకరించను. మనిషిగా తోటి మనుషులతో మాట్లాడకుండా ఉండబోను. మనిషిని మనిషిగా గౌరవించే మానవీయ వ్యవస్థ కోసం నా శక్తిమేరకు కృషి చేయకుండా ఉండబోను....

ʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹ వివాదం - ఎన్. వేణుగోపాల్

అణచివేతకు గురైన కులాల మీద, శూద్ర కులాల మీద, దళిత కులాల మీద ఇంకా దుర్మార్గమైన, నీచమైన, నిందార్థపు వ్యాఖ్యలు, సామెతలూ ఎన్నో ఉన్నాయి. అవి హిందూ పవిత్ర గ్రంథాలనబడేవాటికి కూడ ఎక్కాయి. మత ఆమోదాన్ని కూడ పొందాయి. వాటిని ఎవరూ ఎప్పుడూ ఖండించి, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, భాషను సంస్కరించుకోవడానికి ఉద్యమం జరపలేదు. ఇవాళ ఒక మాట తమను అవమానించిందని వీథికెక్కుతున్న....

అదానీ కోపం..ఈపీడబ్ల్యూ సంపాదకుడి రాజీనామా - ఎన్.వేణు గోపాల్

అదానీ గ్రూపు కంపెనీలకు రు. 500 కోట్ల ప్రయోజనం కలిగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఇపిడబ్ల్యు వెబ్‌ సైట్‌ మీద అంతకు కొద్ది రోజుల ముందు...

Search Engine

రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
more..


అక్రమాల