కొమురం భీం వర్ధంతి ఎన్నడు ? అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ?

కొమురం

(కొమురం భీం చనిపోయింది ఏ రోజు అనే అంశంపై వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ తన ఫేస్ బుక్ టైంలైన్ పై రాసిన వ్యాసం యదాతథంగా మీ కోసం)

మిత్రులారా, నిన్న కొమురం భీం ʹవర్ధంతి సందర్భంగాʹ (ఒక పత్రిక అయితే ʹజయంతిʹ అని కూడ రాసింది!) రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన సభలు, సమావేశాలు, శ్రద్ధాంజలి ప్రకటనల వార్తలు చూస్తుంటే మనం మన పొరపాట్లను సవరించుకోవడానికి సిద్ధంగా లేమని తెలిసివచ్చి జాలీ నవ్వూ వచ్చాయి.

కొమురం భీంను నిజాం పోలీసులు కాల్చి చంపింది 1940 సెప్టెంబర్ 10న. ఆ విషయంమీద సమకాలీన ఆధారాలను ఉటంకిస్తూ నేను గత ఐదారు సంవత్సరాలలో నాలుగైదు వ్యాసాలు రాశాను. చాలచోట్ల మాట్లాడాను. కొమురం భీం మీద పరిశోధన చేసిన మిత్రులు ప్రొఫెసర్ భంగ్యా భూక్యా కూడ కొమురం భీంను కాల్చి చంపిన తేదీ సెప్టెంబర్ 10 అని ప్రభుత్వ పత్రాల ఆధారంతో ఎన్నోచోట్ల రాశారు, మాట్లాడారు. పోనీ, తెలుగు తిథి ప్రకారం, ఆశ్వయుజ పౌర్ణిమ అనుకుని నిన్న జరిపారా అనుకుంటే, కొమురం భీంను కాల్చిచంపిన 1940 సెప్టెంబర్ 10 ఆశ్వయుజ పౌర్ణిమ కూడ కాదు.

ఎక్కడో ఎవరి జ్ఞాపకంలోనో, తలపోతలోనో జరిగిన ఆ పొరపాటు ప్రతి సంవత్సరం మళ్లీ మళ్లీ బలపడుతున్నది. ఎన్ని ఆధారాలు దొరికినా మేం నమ్మదలఛుకున్నదే నమ్ముతాం, వాస్తవం కన్న మా నమ్మకమే ఎక్కువ విలువైనది అనే మన సామాజిక విలువల ఫలితం ఇది!

ఈ సందర్భంగా 2014 నవంబర్ లో సారంగలో కొమురం భీం మీద నేను రాసిన వ్యాసం నుంచి సంబంధిత భాగం మీతో పంచుకుంటున్నాను.

**

1980ల తొలిరోజుల నుంచీ ఆదిలాబాద్ అరణ్య ప్రాంతంలో విప్లవోద్యమ కార్యకర్తగా పనిచేస్తుండిన సాహు, అప్పటి విప్లవోద్యమ నాయకత్వం ఆ మౌఖిక చరిత్ర శకలాలను జాగ్రత్తగా సేకరించి, అల్లం రాజయ్యతో పంచుకున్నారు. ఇద్దరు రచయితలూ ఆ విషయం మీద అభినివేశం ఉన్న అనేకమంది మిత్రులతో కలిసి లోతైన పరిశోధన సాగించారు. కొమురం భీంను చంపి, ఆ పోరాటాన్ని అణచివేసిన తర్వాత నిజాం ప్రభుత్వం ప్రఖ్యాత మానుషశాస్త్రవేత్త క్రిస్టొఫ్ వాన్ ఫ్యూరర్ హేమెండార్ఫ్ తో చేయించిన పరిశోధనా నివేదికతో సహా లభ్యమవుతున్న లిఖిత ఆధారాలను సేకరించుకున్నారు. అలా ఎంతో కాలం శ్రమించి 1983లో ʹకొమురం భీంʹ అనే అద్భుతమైన చారిత్రక నవల రాశారు. ఆ నవలే కొమురం భీంను తెలుగు సమాజంలోకి మళ్లీ సజీవంగా తీసుకొచ్చింది.

ఇవాళ్టికీ అరకొర వనరులే దొరుకుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు పెట్టుకుంటే, ముప్పై మూడు సంవత్సరాల కింద దొరికిన వనరుల మీద ఆధారపడి, కొంత విశ్వసనీయ కాల్పనికతకు కూడ అవకాశం ఇచ్చి సాహు, అల్లం రాజయ్య చేసిన ఆ కృషి మహాద్భుత ప్రయత్నమనే చెప్పాలి. వారు అప్పటికి సంప్రదించిన పదకొండు అధికారిక పత్రాల జాబితా కూడ ముందుమాటలో ఇచ్చారు. అప్పటికి ఇంకా భీంతో పాటు కలిసి పనిచేసినవారు, పోరాటంలో పాల్గొన్నవారు, భీంను చూసినవారు, భీం కుటుంబసభ్యులు కొందరైనా సజీవంగా ఉన్నారు గనుక రచయితలు వారందరినీ కలిసి మౌఖిక చరిత్ర వివరాలు సేకరించారు. అందువల్ల భీం రూపం గురించి, భావోద్వేగాల గురించి, పరిశీలనా శక్తి గురించి, నాయకత్వ లక్షణాల గురించి, వేలాది గోండులను ఆకర్షించిన సమ్మోహక శక్తి గురించి నవలలో చిత్రించిన విషయాలు చాలవరకు నిజమే అయి ఉండాలి.

అయితే భీం చివరి పోరాటం ఎప్పుడు జరిగిందనే దాని మీద, భీంను నిజాం పోలీసులు కాల్చి చంపిన తేదీ మీద వాళ్లు కొంత పొరపాటు పడ్డట్టున్నారు. ʹడర్ నా మత్ సత్తార్ సాబ్.... తారీఖ్ భూల్ గయా! ఆజ్ పెహలీ హై... సెప్టెంబర్.... బుధవారం ... సంవత్సరం కూడా చెప్పనా 1940ʹ అన్నాడు కెప్టెన్ – అనే సంభాషణ ద్వారా భీంను కాల్చి చంపిన తేదీ 1940 సెప్టెంబర్ 1 అని వాళ్లు రాశారు. భీం ఒరిగిపోయిన చోట స్మారకచిహ్నంగా అప్పుడే గోండులు పాతుకున్న ఒక రాయి మీద 1.9.1940 అని చెక్కి ఉన్నట్టు కనబడడం దీనికి కారణం కావచ్చు.

అయితే కొమురం భీం నవల మీద సృజనలో వివరమైన సమీక్షా వ్యాసం రాసిన సి వి సుబ్బారావు, 1940 సెప్టెంబర్ 1 నవలలో రాసినట్టుగా బుధవారం కాదనీ, ఆదివారం అనీ సవరించారు. (1983లో వచ్చిన పిబిసి ప్రచురణ, ఆ తర్వాత వచ్చిన విరసం ప్రచురణ - 1993, ఆదివాసి ప్రచురణలు – 2004, 2010 కూడ ఈ బుధవారం అనే మాటను అలాగే కొనసాగించాయి. పర్ స్పెక్టివ్స్ ప్రచురణ 2013లో సంభాషణలోనే బుధవారం బదులు ఆదివారం అని మార్చారు).

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమక్రమంలోనూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతా కొమురం భీం ఒక విగ్రహంగా, ప్రతీకగా కూడ మారిపోయాడు. ఆయన పేరు తలవని వాళ్లు దాదాపు లేరు. ఆయన భావాలతో, ఆయన పోరాటంతో ఎంతమాత్రమూ సంబంధం లేనివారి నుంచి, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్ల దాకా అందరూ ఆయనను ఏదో ఒక సందర్భంలో తలచుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ వీర యోధులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందనే వాదనకు చిహ్నంగా కొమురం భీం ముందుకొచ్చాడు. పాఠ్యపుస్తకాలలో, హుసేన్ సాగర్ టాంక్ బండ్ మీద విగ్రహాలలో కొమురం భీం ఎందుకు లేడనే ప్రశ్న వచ్చింది. పాఠ్యపుస్తకాలలో ఏదో ఒకస్థాయిలో భీం పాఠంగా కూడ మారాడు. విశాలమైన ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలనే ఆకాంక్షకు, తూర్పు జిల్లాకు కొమురం భీం పేరు పెట్టాలనే కోరిక తోడయింది. చివరికి 2014 అక్టోబర్ 8న కొమురం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరిపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోడెన్ ఘాట్ వెళ్లి అక్కడ కొమురం భీం స్మారక ఉద్యానవనానికి శంకుస్థాపన చేసివచ్చారు.

కొమురం భీం నవల తవ్వితీసిన సెప్టెంబర్ 1 స్థానంలో ఈ అక్టోబర్ 8 ఎక్కడినుంచి వచ్చినట్టు? వాస్తవంగా కొమురం భీం వర్ధంతి అక్టోబర్ 8 కాదు. బాబేఝరీలో స్మారక శిల మీద 1.9.1940 అని రాసి ఉందని ఇదివరకే చూశాం. ఆ రోజు ఆశ్వయుజ పౌర్ణమి అని భీం సమకాలికుల జ్ఞాపకం ఆధారంగా, జానపద గాథల ఆధారంగా ఆదివాసులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజున భీం వర్ధంతి జరుపుకునేవారు. 2014లో ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబర్ 8న వచ్చింది గనుక రాష్ట్ర ప్రభుత్వం ఆరోజునే వర్ధంతి జరిపింది.

కాని ఇక్కడ మరొక చిక్కు ఉంది. 1940లో, విక్రమ సంవత్సర ఆశ్వయుజ పౌర్ణమి సెప్టెంబర్ 1న కాదు, అక్టోబర్ 16న వచ్చింది. పోనీ ముందరి నెలలో, భాద్రపద పౌర్ణమి అనుకుందామా అంటే అది సెప్టెంబర్ 16న వచ్చింది. అలా ఇప్పటికి ఉన్న రెండు తేదీలు – స్మారకశిల మీద ఉన్న సెప్టెంబర్ 1 అనే ఇంగ్లిష్ తేదీ, గోండుల జ్ఞాపకంలో ఉన్న ఆశ్వయుజ పౌర్ణమి అనే తెలుగు తిథి – ఒకదానికొకటి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో నిజాం పోలీసులతో పోరులో కొమురం భీం ఒరిగిపోయిన తేదీ గురించి సమకాలీన ఆధారాలు దొరుకుతాయా అని గోలకొండ పత్రిక, ఆంధ్రపత్రిక పాత సంచికల అన్వేషణ ప్రారంభించాను. ఆ అన్వేషణలో కొమురం భీంను కాల్చిచంపిన తేదీ సెప్టెంబర్ 10 అని కచ్చితంగా తెలియడంతో పాటు, మరికొన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలు కూడ బైటపడ్డాయి.

ఆంధ్రపత్రిక 1940 సెప్టెంబర్ 16 న ʹపోలీసులనెదిరించిన 500 గోడుల మూకపై తుపాకి కాల్పులుʹ అనే శీర్షికతో, ʹహైదరాబాదులో 10 చంపబడిరి 13 గాయపడిరిʹ, ʹనేరస్థుల అరెస్టును నిరోధించినందుకు పర్యవసానముʹ అనే ఉపశీర్షికలతో ఒక వార్త వచ్చింది. ʹహైదరాబాదు (దక్కను), సెప్టెంబర్ 15ʹ అనే డేట్ లైన్ తో వచ్చిన ఈ వార్తలో, ʹఆసిఫాబాద్ సమీపమున సెప్టెంబర్ 10వ తేదీన బాభ్జారి ప్రాంతమున 500 మంది గోండులమూక తుపాకులు యితర ఆయుధములతో పోలీసులను ఎదిరించినందుకు పోలీసువారా మూకపై తుపాకులు ప్రేల్చవలసి వచ్చెననియు కాల్పులవల్ల 10 మంది గోండులు చంపబడి మరి 13గురు గాయపడిరనియు యిక్కడ అందిన వార్తలు దెలుపుచున్నవి....ʹ అనే మొదటి పేరాతో నాలుగు పేరాల వార్త ప్రకటించింది. ʹ(అ.ప్రె.)ʹ (బహుశా అసోసియేటెడ్ ప్రెస్) అని చివరన ఉన్న ఈ వార్త మూడో పేరాలో కూడ పోలీసులు అడవిలోకి వెళ్లిన తేదీ సెప్టెంబర్ 10 అని మరొకసారి రాశారు.

- ఎన్.వేణుగోపాల్

Keywords : kumram bheem, adilabad, nizam, allam narayana, sahu
(2024-04-24 18:58:16)



No. of visitors : 1850

Suggested Posts


మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టేʹ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్ లాగ ʹదీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టేʹ అని బ్

దొర మాటలు, చేతలు – అబ్బ ఎంత ఉల్టా పల్టా? -ఎన్ వేణు గోపాల్

రైతుల భూములు గుంజుకోని కంపెనీలకు కట్టబెట్టుటానికి, రైతులు ఏమి పండిచ్చాల్నో, ఏమి పండిచ్చొద్దో కంపెనీలు చెప్పుటానికి, తిండిగింజలు గుమ్ముల్ల దాసుకొని కరువు పుట్టిచ్చి పిరంగ అమ్ముకోవటానికి కంపెనీలకు సౌలత్ జెయ్యటానికి ఢిల్లి సర్కారు ఖానూన్లు జేసింది.

ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ

మనమిప్పుడు దేశంలో పెద్దఎత్తున సాగుతున్న విద్వేష విధ్వంసానికి సాక్షులుగా ఉన్నాం. ఇక్కడ బలి పీఠం మీద ఉన్నది కేవలం ముస్లింలో, ఇతర మైనారిటీ మత సమూహాలకు చెందినవారో మాత్రమే కాదు, మన రాజ్యాంగమే బలి పీఠం మీద ఉన్నది.

సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్

భారత సమాజపు విభిన్న సంస్కృతుల బహుళత్వాన్ని తొక్కేస్తూ ఒకే జాతి, ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆచారవ్యవహారాలు అనే ఏకశిలాధిపత్యాన్ని స్థాపించడానికి ʹసాంస్కృతిక జాతీయవాదంʹ అనే సిద్ధాంతాన్ని ప్రవచించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కొమురం