ఆర్టికల్497, శబరిమల తీర్పులు.. ప్రగతిశీలమైనవేనా ?

ఆర్టికల్497,

భారత దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ మధ్య వెలువరుస్తున్న తీర్పులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోనికి మహిళల ప్రవేశం, స్వలింగ సంపర్కుల హక్కులపై ఇచ్చిన తీర్పులు దేశ ప్రజానికంలో చర్చనీయాంశాలుగా మారాయి. మీడియాలో.. సోషల్ మీడియాలో అత్యంత అధికంగా చర్చించబడిన ఈ రెండు తీర్పుల్లో శబరిమల తీర్పు ఉద్రిక్తలకు కూడా దారి తీసింది. అయితే ఈ రెండు తీర్పులపై ఉన్న వాదనలు.. విరుద్దవాదనలపై ఇఫ్టూ ప్రసాద్ రాసిన ఒక ఆర్టికల్ ఆలోచింపజేసేలా ఉంది. అది యధాతథంగా ʹఅవనిʹ ప్రచురిస్తోంది.

ప్రియమైన మిత్రులారా,
సాంప్రదాయ భారతీయ సామాజిక జీవితంతో ముడిపడ్డ విభిన్న సనాతన సాంఘిక అంశాలపై సుప్రీం కోర్టు ఈమధ్య కొన్ని సంచలన తీర్పులిచ్చింది. నేనెరిగిన మరియు చదివిన మేరకు గత డెబ్భై ఏళ్ల న్యాయ చరిత్రలో భారతీయ సాంఘిక వ్యవస్థని ఇలా ప్రభావితం చేసిన వరుస తీర్పుల నేపధ్యం లేదు. స్వలింగ సంపర్కం, శబరిమలై గుడిలో అన్ని వయస్సుల స్త్రీల ప్రవేశం, ఆర్టికల్497 కొట్టివేత వంటి తీర్పులు వచ్చాయి. అవి అనేక సనాతన సామాజిక, ధార్మిక విశ్వాసాలని దెబ్బ తీసే "రాడికల్ తీర్పులు"గా పేరొందాయి. ఆ సందర్బంగా అది ఇచ్చిన "రాడికల్ నిర్వచనాలు" సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ వెన్ను విరిచాయి. నేటి సాంఘిక వ్యవస్థని కుదిపేస్తున్నాయి. ఈ దోపిడీ సామాజిక వ్యవస్థ మౌలిక మార్పునకు పోరాడే విప్లవశక్తుల రాజకీయ పరిభాషని నేడు బూర్జువా కోర్టులు వాడుతున్నాయి. తరతరాల ఫ్యూడల్ బానిస సంకెళ్ళపై "స్త్రీవిమోచన" కోసం న్యాయవ్యవస్థ యుద్ధభేరి మోగించిందన్న మధురానుభూతిని కొన్ని ప్రగతిశీలశక్తుల్లో కూడా ఒక క్షణం భ్రమని కలిగిస్తుంది. వాటిని ప్రగతిశీల శక్తులు బలపరచడం సహజమే. దాన్ని తప్పు పట్టడంలేదు. ప్రగతిశీలశక్తుల స్వీయ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వాటి పట్ల తమ వైఖరిని ప్రకటించక తప్పదు. అనివార్యంగా తెలుపుని తెలుపుగా, నలుపుని నలుపుగా ప్రగతిశీల సంస్థలు చెప్పక తప్పదు. కానీ అదే సమయంలో ఆ ఉపరితల "తెలుపు" వెనక అంతర్గత "నలుపు" ఉన్నదీలేనిది విశ్లేషించాలి. దాన్ని బట్టి ఆ తీర్పుల లక్ష్యాన్ని చెప్పగలం. ఈ దృష్టితో ఇవి ప్రగతిశీల స్వభావం గల తీర్పులుగా భావించలేక పోతున్నా. నా భావమిత్రులతో నేను షేర్ చేసుకోలేక పోతున్నా. అందుకు నన్ను మన్నించాలి.

పై తరహా సంచలన తీర్పులు కేవలం సాంఘిక, నైతిక రంగాలకే పరిమితం కాదు.
అయోధ్య వివాదంపై తీర్పు.. కోర్టుల విచారణని పారదర్శకతతో వెల్లడికి అనుమతించే తీర్పు.
ఆధార్ చట్టానికి సమర్ధనగా తీర్పు.
యాకుబ్ మెమెన్ కేసులో అర్ధ రాత్రి విచారణ చేపట్టడం,వరవర రావు గారు సహ ఐదుగురి అరెస్ట్‌పై స్పందించి ప్రెషర్ కుక్కర్‌ని పేలకుండా ఇచ్చిన గృహ నిర్బంధ తక్షణ ఉపశమన ఉత్తర్వు వంటి సంచలన తీర్పులు.. ఆదేశాలు ప్రగతిశీలశక్తుల ఆదరణని కూడా కొంత వరకు పొందే నేపధ్యం ఉంది.
ఈ న్యాయవ్యవస్థ క్రియాశీలత (judicial activism) ప్రపంచీకరణ ప్రక్రియలో భాగమే! జేమ్స్ పెట్రాస్, నోమ్ చోమ్స్క్ వంటి మేధావుల రచనల వెలుగులో తాజా తీర్పులని చూడక తప్పలేదు. దాని ఫలితమే నా భావమిత్రులతో విభేదించే ఈ పోస్టింగ్!

పై సంచలన తీర్పులన్నీ ఒకఎత్తు! వాటి రెండు తీర్పులు మరో ఎత్తు! అవే "భర్త యొక్క ఆస్తిగా భార్య" ని భావించే సెక్షన్ 497ని కొట్టి వేసిన తీర్పు! అన్ని వయస్సుల స్త్రీలకు శబరిమలై ఆలయ ప్రవేశహక్కుని కల్పిస్తూ ఇచ్చిన తీర్పు! ఈ రెండు తీర్పులు ప్రగతిశీల శక్తుల ఆదరణ కూడా పొందాయి. నా ప్రతిస్పందన భిన్నంగా ఉందని మిత్రులకి చెప్పాల్సి వస్తున్నందుకుచింతిస్తున్నా.

తొలి రోజుల్లో అవి ప్రగతిశీల తీర్పులుగా నేనూ కొంత వరకు భావించా. ఐతే మొదటి నుండి నాలో కొన్ని సందేహాలు వెంటాడుతూ వచ్చాయి. రోజులు గడిచే కొద్దీ నాలోని గతితార్కిక చింతన కొత్త ప్రశ్నలని వేస్తూవచ్చింది. కొత్త కోణాలని అన్వేషించాలని నన్ను కోరుతూ వచ్చింది. ఈ అన్వేషణ కారణంగానే నేనింత వరకు పై తీర్పుల మీద స్పందించలేకపోయా.

దీనిపై చాలా మంది నా భావ మిత్రులు వ్యాసాలు, వ్యాఖ్యలని కోరుతూ వచ్చారు. కొందరు ఎందుకు రాయడం లేదని చనువుతో ప్రశ్నలుకూడా సంధించారు. ఐనా స్పందించలేదు. ఐతే అది మౌనం కాదు. ఈ 40 రోజుల్లో దీనిపై విశ్లేషణకై.. జర్మన్ నాజీ పార్టీ పరిణామ చరిత్రని మరో సారి చదివా. గతితార్కిక చారిత్రిక భౌతిక దృష్టితో మార్క్ రచించి, నేటికీ దేశ చరిత్రల అధ్యయనం, విశ్లేషణలకి సదా ప్రామాణిక గ్రంధాలుగా నిలిచే "ఫ్రాన్స్‌లో వర్గ పోరాటాలు" మరియు "లూయూ బోనపార్టీ-18వ బ్రూమైర్" పుస్తకాలని మళ్లీ తిరగేసా. దేశ స్వాతంత్య్ర పోరాట కాలంలో ఒక వైపు రాజకీయ రంగంలో తీవ్ర అణచివేత విధానాన్ని అవలంబిస్తూనే, మరోవైపు సామాజిక రంగంలో తీవ్ర ప్రగతిశీల ముసుగుని ధరించి, ప్రజలని చీల్చిన బ్రిటిష్ నీతిని వెల్లడించే అంశాలని మళ్లీ తిరగేసా. వాటి వెలుగులో సుప్రీంకోర్టు తాజా తీర్పులని సాపేక్షిక అధ్యయనం చేశా. చివరకి ఈ వ్యాసం రాసి మిత్రులకి పంపిస్తున్నా. ఇందులోని నా అభిప్రాయాలే అంతిమ సత్యమని చెప్పడం లేదు. మిత్రుల మధ్య ఒక చర్చ అవసరమని భావిస్తున్నా. "నూరుపూలు వికసించనీ- వెయ్యు ఆలోచనల్ని సంఘర్షించనీ"అనే సూత్రం ప్రకారం విభిన్న ఆలోచనల, విరుద్ధ భావాల మధ్య స్వేచ్ఛగా చర్చ సాగడం అవసరమని భావిస్తున్నా. అందుకే దీనిని మిత్రులతో పంచుకుంటున్నాను.

పై రెండు తీర్పులు పౌర సమాజంలో సాంఘిక సునామీని సృష్టించాయి. పై ప్రగతిశీల శక్తుల వాదనలు విడిగాచూస్తే, ముమ్మాటికీ ప్రగతిశీలమైనవే. అలా వాదిస్తున్న సర్వులతో నేనూ ఏకీభవిస్తాను. ఐతే వాటిని స్థలకాలాదులతో (space&time)సంబంధం లేని నిరపేక్ష సంఘటనలు (Isolated events) గా చూసినపుడు మాత్రమే అవి ప్రగతిశీల తీర్పులుగా కనిపిస్తాయి. అలాకాకుండా, నేటి ప్రాపంచిక పరిస్థితుల అద్దంలో నుండి చూస్తే వాటి అస్తిత్వం భిన్నమైన చోట కనిపిస్తుంది.స్థల కాలాదులని బట్టి పరిశీలిస్తే పై తీర్పుల స్థానం మారుతుంది. వాటిని వర్తమాన భారతదేశ భౌతిక రాజకీయ, సామాజిక స్తితి గతుల దృష్టితో చూస్తే అవి స్థానభ్రంశం చెందుతాయి. రేపటి చరిత్ర గమన దిశని పరిశీలిస్తూ పై తీర్పులని సాపేక్షిక సంఘటనలు (relative events) గా భావించి సాపేక్షిక దృష్టి (comparitive outlook) తో విశ్లేషణ చేస్టే అప్పుడొక చేదు నిజం కనిపిస్తుంది. నాకైతే అలా కనిపించింది. దాని ఫలితమే ఈ వ్యాసం!

జస్టిస్ చలమేశ్వర్, మరో నలుగురు సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు భారత దేశ న్యాయచరిత్ర లో మొట్ట మొదటిసారి 12-1-2018న ఒక ప్రధాన న్యాయ మూర్తి పై పత్రికల కెక్కడం తెలిసిందే! అమిత్ షా ని కాపాడేందుకు ఒక పధకం ప్రకారం CBI జడ్జి లోయ హత్యకేసు విచారణ లో ఆయన అక్రమజోక్యం పై వారు తీవ్ర ఆరోపణ చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర్యత ని ఆయన భ్రష్టు పట్టిస్తున్నట్లు కూడా ఆరోపించారు. ఆయన రిటైర్ అయ్యేలోపు మోడీ ప్రభుత్వ కర్తవ్యాలు కొన్ని పరిపూర్తి చేయనున్నారని బహిరంగంగానే ఆనాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. వారు ఆరోపించినట్లే లోయ హత్య కేసు నీరుగారింది. అమిత్ షా కాపాడబడ్డాడు. మరికొన్ని విచారణచర్యల నుండి కూడా మోడీసర్కార్ విజయవంతంగా బయట పడింది.అంతేకాకుండా ఇదే కాలంలో ఆర్ధిక రంగంలో విదేశీ నల్లధనం వివరాలు సీల్డ్ కవర్లో అందాయి. ఐనా సుప్రీంకోర్టు "గొప్పమౌనం" పాటించింది. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మాల్యాలతో పాటు పలు కుంభకోణాలపై "మౌనదీక్ష" వహించింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పట్ల దేశ ప్రజల నిరసనపై "మూగనోము" పట్టింది. పారుబాకీలపేరిట లక్షల కోట్ల ప్రజాధనం బ్యాంకుల కి ఎగవేస్తున్న కార్పొరేట్ల ఆగడాలపట్ల "మూగది"గా; రైతుల ఆత్మ హత్యల పట్ల "చెవిటిది"గా; "నాసిక్ నుండి ముంబై" రైతుయాత్ర లో ఫుళ్లుపడ్డ స్త్రీపాదాలని చూడలేని "గుడ్డిది"గా అది ఘనత కెక్కింది. అడవుల నుండి ఆదివాసులని తరిమేసి, అటవీ ఖనిజ సంపదని కార్పొరేట్ల కు కట్టబెట్టే గ్రీన్ హంట్ కుట్ర పట్ల అంతులేని నిగ్రహం పాటించింది. బూటకపు ఎదురు కాల్పులతో అడవి ని జల్లెడ బట్టే ఫాసిస్టు నిర్బంధ విధానం పట్ల; కోస్టల్ కారిడార్లు, సెజ్ ల పేరిట లక్షల ఎకరాల భూ కబ్జాల పట్ల; సుప్రీంకోర్టు మౌనంతెలిసిందే! వీటి కంటే కోర్టులవర్గ స్వభావం ఈ ప్రధానన్యాయమూర్తి హయాంలో బట్టబయలైన మరో సంఘటనని చెప్పాలి. అదే 20-3-2018న SC, ST అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరు గార్చే తీర్పు! దళితులు, ఆది వాసీలు రక్త తర్పణలతో సాధించుకున్న ఈ చట్టాన్ని నీరుగార్చింది. దానిపై బంద్ లో డజను మంది కాల్పుల్లో మరణిస్తే న్యాయ పరంగా స్పందించ లేదు. దేశప్రజల ప్రాధమిక సమస్యల పట్ల;హక్కుల పట్ల "దీర్ఘ, గాఢమౌనం" వహించడంలో సుప్రీంకోర్టు నిజానికి "ఘనవిజయం" సాధించింది. అది ఇప్పుడు ఆకస్మికంగా స్త్రీల పట్ల "ప్రగతిశీలురాలి" గా ఎలా మారి పోయింది? ఇదో రాజకీయ ప్రశ్న! సైద్ధాంతిక, తాత్విక దృష్టితో జవాబు వేదకాల్సిన ప్రశ్న!
ఒకవైపు దేశ ఆర్ధిక, రాజకీయ, సైనిక రంగాల తిరోగమనంపట్ల అనుకూల పాత్రని పోషిస్తూ; మరోవైపు "స్త్రీవిమోచన" కి సాంఘిక రంగంలో అనుకూలపాత్ర ని న్యాయ వ్యవస్థ పోషించ గలదా? ఈ ద్వంద్వవైఖరి కోర్టులకు సాధ్యమేనా? ఇదో మౌలిక ప్రశ్న! అవును అది వాటికి సాధ్యమే! ఐతే అట్టి ద్వంద్వ వైఖరి వెనక ద్వంద్వ లక్ష్యాలు ఉండవు. రెండు పరస్పర విరుద్ధమైన వర్గాల భిన్న ప్రయోజనాలు ఈ ద్వంద్వ వైఖరి వెనక ఉండబోవు. వాటివెనక ఒకే వర్గ ప్రయోజనాలుంటాయి. ఒకవైపు RSS అనుబంధ మోడీ ప్రభుత్వం అనే విష వృక్షం వేర్లు,కాండాలని కాపాడుతూనే; మరోవైపు ఆ విష వృక్ష కొమ్మలపై గాలి కి ఊగే రెమ్మలపై కొన్ని సార్లు కొన్ని పరిమితులకి లోబడి న్యాయ వ్యవస్థ నాటకీయ ఫక్కీలో "న్యాయ పోరు" చేయగలదు. దాన్ని ఘనమైన "ధర్మ పోరు" గా మీడియా చిత్రించ గలదు. అదే ఇప్పుడు జరిగిందని భావిస్తున్నా.
అక్టోబర్ 2వ తేదీ ప్రధానన్యాయ మూర్తి రిటైర్ అయ్యారు. దానికి వారం ముందు అనేక సంచలన తీర్పులిచ్చిన బెంచీలలో ఆయన పాత్ర కీలకమైనది. ఆ బెంచీల ఎంపికలోనూ కీలకపాత్ర ఆయనదే. (చలమేశ్వర్& నలుగురు ఆరోపణల్లో అదీ ఒకటి) సెప్టెంబర్ చివరి వారం ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలోనే వరసగా "సంచలన తీర్పులు" వెలువడ్డాయి. రాజకీయ రంగంలో 2 ప్రమాదకర తీర్పులు (రామమందిర వివాదం& ఆధార్ చట్టానికి సమర్ధన)కూడా ఉన్నాయి. ప్రధానంగా రామ జన్మ భూమి-బాబిరీ మసీదు కేస్ లో ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ఇద్దరు జడ్జీల మెజారిటీ బెంచ్ సెప్టెంబర్ 27న ఇచ్చిన తీర్పు చాలా ప్రమాదకరమైనది. అది రేపటి భారతదేశ గర్భం లో పాతిన భారీ మతోన్మాద అణుబాంబు! రామమందిర నిర్మాణ నినాదంతో RSS నేతృత్వంలో యోగిసర్కార్ అప్పుడే కత్తులు నూరడం తెలిసిందే. 2019 జనరల్ ఎన్నికల నాటికి అయోధ్య లో రామ మందిర నిర్మాణ సమస్యపై భావోద్వేగం రెచ్చగొట్టే కుట్రకుఈ తీర్పు పునాది వేసింది.అదే రేపటి BJP ఎన్నికల అజెండా! అట్టి ఫాసిస్టు కుట్రకు పై తీర్పు సహకరిస్తుంది. జస్టిస్ నజీర్(మైనారిటీ బెంచ్) తనతీర్పులో కానిస్టిట్యూషనల్ బెంచ్ (ఫుల్ బెంచ్)కై చేసిన అభ్యర్ధనని మెజారిటీ బెంచ్ తిరస్కరించడం గమనార్హం. అదో మత అణుబాంబు! ఎన్నికల నాటికి రణరక్త ప్రవాహాన్ని సృష్టించే లక్ష్యం దానికి ఉందనే ఆరోపణలు వింటున్నదే. మోడీసర్కార్ ని తిరిగి గెలిపించుకునే బడా కార్పొరేట్ శక్తుల ఫాసిస్టు కుట్రలో భాగమది. దాన్ని కప్పిపెట్టుకొనుటకూ, దేశ ప్రజల కళ్ళు కప్పుటకూ అందమైన ముసుగు కూడా వాళ్ళకి అవసరమే! ప్రజల తో ఫాసిస్టు విష గుళికలని మింగించే లక్ష్యంకోసం వాటి పై పంచదార పూత కూడా అవసరమవుతుంది. స్త్రీల పట్ల "మహా ఔదార్యం" తో ఇచ్చిన తాజా తీర్పులని ఈ వెలుగులో చూస్తున్నా.

ఇదే సుప్రీం కోర్టు కోట్లాది మంది మహిళా కార్మికులకు "సమాన పనికి సమాన వేతనం" అమలు కోసం ఒక్కరోజు కూడా స్పందించిన పాపాన పోలేదు. ప్రభుత్వాలని ఆదేశిస్తూ ఒక్క ఉత్తర్వు కూడా ఇచ్చింది లేదు. అంగన్వాడీ, ఆశా,హెల్త్త్ గైడ్స్, మిడ్ డే మీల్స్, నర్సింగ్ సిబ్బంది, షాప్ ఎంప్లాయిస్ మిలియన్ల సంఖ్య లో ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు అమలు కోసం ఒక్కరోజు కూడా ఆదేశాలు ఇచ్చింది లేదు. సగం మంది మహిళా కార్మిక భాగస్వామ్యం ఉన్న BOC బోర్డులో వేలకోట్ల నిధులు మురుగుతున్నా స్త్రీల సంక్షేమం కోసం ఒక్క రాడికల్ సంస్కరణకి కూడా పూనుకోలేదు.ఓవైపుప్రాణం ఉన్న సజీవ మహిళా శ్రమ శక్తి నిరంతర శ్రమదోపిడీకి గురవుతుంటే అది పట్టించు కోదు. అదే మరోవైపు 150 ఏళ్ల నాటి సెక్షన్ 497 ని కొట్టి వేసింది. అది నిజానికి కొన ఊపిరితో ఉన్న చట్టం. వాస్తవానికి 497కింద వివాదాల సంఖ్య నేడు తక్కువే! బ్రిటిష్ వలస చట్టాల పట్ల అంత నిరసన ఉంటే, వలస పాలన నాటి అనిక క్రూర ఘోర నిర్బంధ చట్టాలని ఎందుకు కొట్టి వేయదు?అందుకే ఇది స్త్రీల పై ప్రేమతో ఇచ్చిన తీర్పు కాదని భావిస్తున్నా.
శబరిమలై ఆలయ ప్రవేశ హక్కుని స్త్రీలకు కల్పించిన తీర్పు కూడా విడిగాచూస్తే స్వాగతించ దగిందే. ఐతే అంత కంటే రాజకీయ ప్రాధాన్యత గల సజీవ సమస్యలు స్త్రీలకు నేడు చాలా ఉన్నాయి. అది వాటిని పట్టించుకున్నది లేదు. ప్రగతిశీలతీర్పులుగా అవి కనిపించవచ్చు. చాలా మంది భ్రమ పడవచ్చు.కానీ వాటి వెనక కుట్రలున్నాయి. హిందూ ధర్మానికి ముప్పు ఏర్పడిందంటూ హిందుత్వ శక్తులు దేశవ్యాపితఅస్థిరత ని సృష్టించే దీర్ఘకాలిక కుట్ర ఉంది. మరోవైపు కేరళ సర్కార్ ని ఆస్థిరపరిచే తక్షణకుట్ర ఉంది.ఈ రెండు కుట్రల గురించి మిత్రులు అందరూ ఆమోదించేదే. ఐతే నాకు ఓ మౌలిక బేధం ఉంది. సానుకూల తీర్పుల ని హిందుత్వ శక్తులు దుర్వినియోగం చేస్తున్నట్లు మిత్రులు భావిస్తున్నారు. తీర్పులిచ్చిన సదుద్దేశ్యాల కీ, ఆచరణలో తీర్పుల చెడు ఫలితాలకీ మధ్య వైరుధ్యాన్ని మిత్రులు చూస్తున్నారు. అది నిజం కాదని నేను భావిస్తున్నా. తీర్పులిచ్చిన లక్ష్యాలకి అనుగుణ్యంగానే వాటి దుష్ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నా.

SC, ST చట్టం సజీవత కలిగినది. దాన్ని నిర్జీవ చట్టంగా మార్చడం లో న్యాయ వ్యవస్థ అధిక క్రియాశీలతని(judicial activism) ప్రదర్శించింది. అదేవిధంగా నిత్యం శ్రమ దోపిడీ, అమ్మాయుల విక్రయం (flesh trade), లై0గీక హింస, వేధింపులు, (sexual violence and harrasment), వరకట్న హత్యలు(Dowry deaths) విష సంస్కృతి, అందాలపోటీలు, మరీ ముఖ్య0గా శ్రామిక స్త్రీల సమానపనికి సమాన వేతనం వంటి స్త్రీల ప్రాధమిక సమస్యలపై "మౌనకుట్ర" ఉంది. దాన్ని కప్పిపెట్టుకునే ఎత్తుగడలో భాగంగా స్త్రీల సామాజిక సమస్యలపై అది ఇలాంటి క్రియాశీలతకి దిగిందని నేను అభిప్రాపడుతున్నా.

ఒకవైపు భారతదేశ గర్భంలో మతోన్మాద అణు బాంబుని సుప్రీంకోర్టు దట్టించింది. ఆధార్ చట్టాన్ని సమర్ధించి వ్యక్తిగత గోప్యతని రాజ్యం చేతుల్లో పెట్టింది. ఇలాంటి అనేక ఘనసేవలు మోడీ సర్కార్ కి "న్యాయపీఠాధి వ్యవస్థ" చేసి పెట్టింది. రేపటి ఫాసిస్టు కుట్రలకి అవసరమయ్యే లీగల్ లిటీగషన్ ముడి సరుకుని అందించింది. అట్టి "న్యాయ" పీఠం స్త్రీల పట్ల ఇలాంటి "రాడికల్ తీర్పులు" ఇస్తున్నదంటే అది ద్వంద్వ వైఖరి కూడా కాదు. ఉపరితల "ద్వంద్వ వైఖరి" వెనక అంతర్గత "ఏక వైఖరి" ఉందని నేను భావిస్తున్నా.

శబరిమలై లో స్త్రీలకి ఆలయ ప్రవేశ హక్కుని కల్పించే తీర్పు స్వాగతించ దగినదే! ఐతే లక్షలాది మంది పురుష అయ్యప్ప భక్తులు నేడు ఆ దేవుడి ద్వారా సుఖమయ జీవితం పొందిందీ లేదు. (ఏ దేవుడి ద్వారా పొందేది లేదు) రేపుస్త్రీలు శబరిమలై వెళ్తే అదనంగా ఒరిగేది కూడా లేదు. ఎంత ఎక్కువ మంది ప్రజలని భక్తులుగా మార్చితే, దోపిడీ వ్యవస్థకు అంత ఎక్కువ లాభం. అదనపు భక్తకోటిని మరో దేవుడి ద్వారా మూఢత్వ ఊబిలోకి మరింత దింప వచ్చు. స్త్రీలు కూడా కొత్తగా లక్షల సంఖ్యలో శబరిమలై కి వెళ్లడంవల్ల రవాణా రంగ లాభాలు పెరుగుతాయి. సరుకుల అమ్మకాలు పెరుగుతాయి. ముఖ్యంగా "కొత్త భక్తుల" వల్ల సమాజం లో అదనపు మౌఢ్యం పెరుగుతుంది. ఫలితంగా దోపిడీ వర్గాలు మరింత కాలం ప్రజల(భక్తుల) కళ్ళు కప్పవచ్చు. నిజానికి దీర్ఘ కాల దృష్టితో చూస్తే స్త్రీల ఆలయ ప్రవేశం శ్రమ దోపిడీ వ్యవసస్థకే ఎక్కువ లాభం. ఐనా శ్రమ దోపిడీ వ్యవస్థకి ప్రాతినిద్యం వహించే వివిధ పాలకపార్టీలు కోర్టుతీర్పు ని వ్యతిరేకించడం గమనార్హం. అందుకు భిన్నంగా "మతం మత్తు మందు" అని నమ్మి, దేవుడు ఓ భ్రమగా భావించే సామ్యవాద, హేతువాద, భౌతిక, లౌకిక శక్తులు కోర్టు తీర్పుని స్వాగతించడం గమనార్హం. స్త్రీలకి ఆలయ ప్రవేశం దోపిడీ వ్యవస్థ కి రాజకీయంగా లాభం. ఐనా వాళ్ళు దానికి వ్యతిరేకంగా అల్లరి చేస్తున్నారు.ఆ అండ తో హిందుత్వ ఉన్మాదాన్ని రెచ్చ గొడుతున్నారు. పై 2 తీర్పుల ఆధారంగా పౌర సమాజాన్ని హిందుత్వ శక్తులు మరింత మూఢత్వ పరిధిలోకి నెడుతున్నాయి. ఈ కారణంగా పై తీర్పులు ఫాసిస్టుచేతుల్లో సాధనంగా మారుతున్న వాస్తవ స్తితి కళ్లెదుట కనిపిస్తుంది. ఐతే శాసనవ్యవస్థకూ, న్యాయ వ్యవస్థకూ వైరుధ్యాన్ని మిత్రులు చూస్తున్నారు. రాజ్య విభాగాలన్నింటి మధ్య అప్రకటిత పరస్పర సమన్వయం, సహకారాల తో ఫాసిస్టికరణ ప్రక్రియ సాగుతున్నదాని నేను భావిస్తున్నా.

ఇక్కడొక విచిత్ర పరిస్థితిని ఉదహరించాలి. స్త్రీలు కొత్తగా శబరిమలై గుడికి వెళ్లడం వల్ల దోపిడీ వర్గాలకి అధికలాభం ఉంటుందని పైన చెప్పా. ఐతే వాళ్లరాజకీయసంస్థలు స్త్రీలు శబరిమలై వెళ్ళొద్దని అల్లరి చేస్తున్నాయి. మరో వైపు గుడికి వెళ్తే పలితం లేదని నమ్మే కమ్యూనిస్టు, సోషలిస్ట్, హేతువాద, హక్కుల సంస్థలు గుడిలోకి వెళ్లే స్త్రీలకి అండగా నిలిచాయి. నిజానికి నేడు ప్రగతి వ్యతిరేక రాజకీయ శక్తుల (ముఖ్యంగా దోపిడీ వర్గాలకి కొమ్ము కాసేవి) వాస్తవ లక్ష్యం స్త్రీలని గుడికి కడు దూరంగా సనాతన స్తితిలో ఉంచడం కాదు. అందుకు భిన్నంగా మరింత మూఢ భక్తిపరులు గా మార్చడం లక్ష్యం. శ్రమ శక్తిని మరింత ఎక్కువగా దోపిడీ చేయడానికి మరింత "మత మత్తు మందు" ని ఎక్కించడం వాళ్ళ వాస్తవ లక్ష్యం! ప్రగతి శీలశక్తుల నిజలక్ష్యం స్త్రీలని కొత్తగా భక్తిపరులు గా మార్చడం కాదు. భిన్నంగా మత మౌఢ్యం నుండి చైతన్య పరచడం!తెరవెనుక ద్రవ్య పెట్టుబడిదార్లు పన్నే వ్యూహం ప్రకారం ఫాసిస్టు శక్తులు తెలివిగా పావులు కదిలిస్తున్నవి. పై రహస్య రాజకీయ ఎజెండా ఆయా రాజకీయవర్గాల కదలికల ని పరోక్షంగా శాసిస్తుంది. దేవుడి పట్ల నమ్మకం లేని శక్తులు ఆచరణలో గుడి అనుకూల విధులలోకి దిగాల్సిన అనివార్య స్తితిని కల్పించింది. దీనికి భిన్నంగా స్త్రీలని మూఢ భక్తిలోకి దింపడం ద్వారా దీర్ఘకాలం లో లాభం పొందే దోపిడీవర్గ రాజకీయశక్తులకి మరో పరిస్థితిని కల్పించింది. స్త్రీలని గుడిలో ప్రవేశించ కుండా అడ్డుకునే విధుల్లోకి వారిని నెట్టింది. పరస్పర విరుద్ధమైన రెండు వర్గాల రాజకీయశక్తులు తమతమ మనస్సులలోని నిజలక్ష్యాల కి భిన్నమైన ఆచరణని చేపట్టే స్థితి ఏర్పడింది. కొన్నిసార్లు చరిత్ర ఇలా అయిష్టమైన పనుల్ని ఆయా వర్గాలతో చేయిస్తుంది.నాజీలు విసిరే వలలో కొన్నిసార్లు నాజీ వ్యతిరేక రాజకీయ వర్గాలు చిక్కుకొని, దానినుండి బయటపడటానికి చాలా నష్టాలు పొందక తప్పలేదు. అది జర్మన్ గత అనుభవం. ఆ చరిత్రఅద్దంలో వర్తమాన భారత్ చరిత్ర అధ్యయనం చేద్దాం. తాజా ప్రగతిశీల ముసుగు కింద దాగిన వాస్తవ స్తితిని వీక్షిద్దాం.

చరిత్ర కొన్నిసార్లు ఎంత విచిత్రమైనదో కదా! "ఓ మహిళల్లారా, మీరు గుడికి రండి, పుణ్యం పొంది మౌఢ్యంలో మునగండి"అని గుడికి రప్పించుకోవడం దోపిడీ వర్గ రాజకీయశక్తుల వాస్తవ విధి. కానీ ఆచరణ లో "దయచేసి మీరు గుడికి రాకండి,వస్తేపాపం" అంటూ స్త్రీ భక్తురాళ్ళని తరిమేసే పనికిదిగాయి.ఇక పోతే "బడికి వెళ్తే విజ్ఞానం, పనికివెళ్తే తిండి లభిస్తాయి, గుడికి వెళ్తే ఏదీ వుండదు" అని విధానపరంగా స్త్రీలకి బోదించాల్సిన విధి నాస్తిక, హేతువాద, సామ్యవాద, హక్కుల సంస్థలది. కానీ ఆచరణలో "స్త్రీభక్తులారా, భయం లేకుండా గుడిలో అడుగు పెట్టండి, ఎవరు అడ్డుకున్నా వెనకడుగు వేయకండి,మేమున్నాం" అంటూ వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సి వస్తున్నది. ఇవి కాకతాళీయ ఘటనలు కాదు. వీటిని నడిపించే కారణాలు(Reasons) & కారకాలు(Factors) లోకి ఇప్పుడు వెళ్లడం లేదు. అవి వర్తమాన సమాజ గర్భంలో నిక్షిప్త రూపంలో ఉంటాయి. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణలో సాగే చరిత్ర గమనాన్ని సరిగ్గా విశ్లేషిస్తే ఈ తీర్పుల వెనక ఏ వర్గ ప్రయోజనాలు దాగిందీ తెలుస్తుంది. తాజా తీర్పుల వర్గ స్వభావం స్పష్టంగా ప్రజలతో పాటు స్త్రీ జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని దృఢంగా అభిప్రాయ పడుతున్నా.

చరిత్ర చోదక శక్తుల గమన సూత్రాల పట్ల, ప్రతీఘాతుక శక్తుల కుట్రల పట్ల స్పష్టత, దార్శనికతలు ప్రగతిశీల శక్తుల్లో ఉండాలి. అందుకు ఉపయోగపడే చర్చ సాగించుదాం.

ఈ సైద్ధాంతిక కోణాన్ని విస్మరించి, 497 కొట్టివేత, శబరిమలై ఆలయ ప్రవేశ అనుమతి వరకే పరిమితమై ఉపరితల దృష్టితో పరిశీలిస్తే, తాజా తీర్పులు బయటకి "విప్లవాత్మకం"గా కనిపిస్తాయి.దానివల్ల రేపటి ఫాసిస్టుప్రమాదాన్ని ఓడించే ప్రగతిశీల శక్తుల ప్రాధమిక & ప్రధాన రాజకీయలక్ష్యం బలహీన పడుతుంది. గాన దీనికి స్థూలదృష్టి సరిపోదు, సూక్ష్మ దృష్టి కూడా కావాలి. సమాజఉపరితల పరిశీలన సరిపోదు.సమాజ గర్భకోశ పరిశోధన కూడా చేయాలి. ఈ కొత్తకోణంలో తాజా తీర్పులపై స్నేహపూర్వకం గా చర్చిద్దాం.

న్యాయస్థానాలు కొన్ని సార్లు "తక్షణస్పందన" లేదా "ప్రాప్త కాలజ్ఞత" దృష్టి తో "పాజిటివ్ తీర్పులు" ఇచ్చే అవకాశం కూడా ఉంది. కొందరు న్యాయ మూర్తులు కొన్నిసార్లు చిత్తశుద్దితో ప్రజానుకూల తీర్పులు ఇస్తారు.ఐతే అవి పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి స్థూలంగా లోబడి ఉంటాయన్న వాస్తవాన్ని మరవరాదు. కొన్నిఅరుదైన ఇలాంటి విశిష్ట తీర్పులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక పరివర్తన కై పోరాడే విప్లవశక్తుల రాజకీయ అవసరాన్ని కూడా నెరవేరుస్తాయి. అట్టి చిత్తశుద్ధి,సామాజిక స్పృహ లతో ఇచ్చేతీర్పుల కోవలోకి తాజాతీర్పులు రావు. స్థల కాలాలని బట్టి తీర్పుల వర్గ స్వభావాన్ని అంచనా వేసు కోవాలి. అప్పుడే సరైన నిర్ధారణకి రాగలం. ఆయా చారిత్రక దశలలో నిర్దిష్ట విశ్లేషణ ద్వారా ప్రగతి అనుకూల & వ్యతిరేక పాత్రలపై అంచనాకి రాగలం. ఉపరితలంలో కనిపించే "ప్రగతిశీల చర్యల"ని బట్టి తుది నిర్ధారణకు రాలేము. ఈ కోణంలో కూడా తాజా తీర్పులని విశ్లేషిద్దాం.

పై కోణంలో పరిశీలించాలన్న నా ఆసక్తికి దోహదపడ్డ ఆరు ప్రశ్నలని దిగువన ఉదహరిస్తున్నా.

1: దేశ గర్భంలో మతోన్మాద అణుబాంబుని పాతిన తీర్పు, దేశ ప్రజల గోప్యత ని రాజ్యం గుప్పెట్లో పెట్టిన తీర్పు పార్లమెంటరీవ్యవస్థ మనుగడకే ప్రమాదకరం. ఐనా వాటిపై చర్చ లేదు. ఒక్క రోజు పత్రికలు చదివి వదిలేశారు.అంతటి ఘోర నిరంకుశ తీర్పులు ఇచ్చిన న్యాయవ్యవస్థపై నల్లమచ్చ పడలేదు. కనీసం వాటి మరక కూడా అంటలేదు. కానీ అప్రధాన, అప్రస్తుత సున్నిత అంశాల పై ఇచ్చిన తీర్పులపై ఎందుకింత ప్రాముఖ్యత, ప్రాచుర్యత లభించాయి? ప్రమాదకర తీర్పులు జమ్మిచెట్టుపైకి ఎక్కించడానికీ; అప్రధాన తీర్పులు కేరళ నుండి కశ్మీర్ వరకి నిరంతర మంటలై మండతానికీ మధ్య ఏ సంబంధం ఉంది?

2: స్త్రీలకు నేటి ముఖ్య ఆవశ్యకత నిర్భయ చట్టం యొక్క ఆచరణాత్మక అమలు, అందాల పోటీల నియంత్రణ, స్త్రీల అంగాంగ ప్రదర్శనల మీద నిషేధం, సమానపనికి సమాన జీతం అమలు, ఇంకా ఎన్నెన్నో సజీవ సమస్యలున్నాయి. అట్టి రగిలే సమస్యల్ని (Burning problems) వదిలేసి, తక్షణావశ్యక0 కాని సున్నిత సామాజిక సమస్యల తేనె తుట్టెని కదిపి, హిందుత్వ శక్తులకి ప్రచార ఆయుధాన్ని అది అందజేసింది. దానితో పుణ్యంరాని గుడిచుట్టూ దేశప్రజల దృష్టి మళ్లింది. స్త్రీల సజీవసమస్యల పై గల చట్టాలఅమలు లేదా కొత్త చట్టాలు చేయడం పై స్పందించకుండా; నిర్జీవ చట్టాలపై లేదా కాలం చెల్లిన కొనఊపిరి చట్టాలపై ఇలా "రణభేరి" మోగించడంలో ఆంతర్యం ఏమిటి?

3: నలుగురు సీనియర్ సుప్రీమ్ న్యాయమూర్తుల చే దేశ చరిత్రలో మొట్ట మొదటిసారి తీవ్ర బహిరంగ అభిశంసనలకి, ఇంకా impeachment motion కి కూడా ప్రధాన న్యాయ మూర్తి గురయ్యారు. అంతే కాకుండా అమిత్ షా రక్షణ తో పాటు దేశప్రజల మధ్య మతచిచ్చుకి వీలైన ఎన్నో విధులు పూర్తిచేశారు. అంత అప్రతిష్ఠకి గురైన ఆయనే 9నెలల్లో "అత్యంత ప్రజాదరణ"పొందడంతో పాటు "ఘనకీర్తి" మూటల తో రిటైర్ అయ్యారు. 260 రోజులలో ఈ పరిణామం ఎలా సాధ్యమైనది?

4 దీనికి ముందు రైతురుణ మాఫీ,గిట్టుబాటు ధరవంటి రైతాంగ సమస్యలు దేశ రాజకీయ ప్రధాన ఎజెండాకి చేరాయి.వాటి స్థానాన్ని ఇప్పుడు శబరిమలై గుడి, సెక్షన్-497 దేశ ఏజెండాకి ఎక్కాయి. ఆత్మహత్యలతో ప్రాణాలు తీసుకునే సజీవ "రైతు" స్థానంలో నిర్జీవ "అయ్యప్ప స్వామి" నేడు కదానాయకుడయ్యాడు. ఎన్నికలు జరిగే రాజస్థాన్, MP ల నుండి దేశ ప్రజల దృష్టి ఎన్నికలు జరగని కేరళ మీదికి మళ్లింది. ఇది ఎలా సాధ్యమైనది?

5: రాజస్థాన్,MP రాష్ట్రాల ఎన్నికల్లో BJP మొదట ప్రజల ఎదుట ప్రచారం చేయలేని ఆత్మరక్షణస్థితి లో పడింది. శబరిమలై, 497లపై తీర్పుల తర్వాత బిజెపి అఫెన్సివ్ స్థితికి చేరింది. నిర్జీవ అయ్యప్ప స్వామికి అపచారం జరుగుతుందనే పేరిట సజీవ రైతుని పక్కకి తోసి ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల బరిలోకి దిగింది. లక్ష మంది స్త్రీలలో ఒకరికి కూడా ఉపయోగపడని కాలం చెల్లిన నిర్జీవ చట్టం రద్దుని బూచిగా చూపించి, కోట్లాది సజీవ స్త్రీలని మనుధర్మ ఆదారిత సనాతన చీకటి వ్యవస్థలోకి నడిపించే సామర్ధ్యం నేడు హిందుత్వ శక్తులకి లభించింది. రెండు "విప్లవాత్మక" తీర్పులతోనే ఇంతటి విప్లవ ప్రతీఘాతక బలం ఎలా లభించింది?

6: ఇంతకుముందు మత విద్వేషం రెచ్చగొట్టడానికి ఉత్తరాన ఒక్క కాశ్మీర్ లోయ పాపాల భైరవిగా ఉండేది. ఈమధ్య తూర్పున అస్సాంలో 40 లక్షలమంది పౌరసత్వం రద్దుచేసి మరో మత బాంబుని దట్టించింది. నేడు దక్షిణాన ద్రావిడనేల కేరళ శబరిమలైలో కూడా మరోమతబాంబు దట్టించి చెలరేగుతున్నది. సెక్షన్497 రద్దుతో మొత్తం హిందూ మత సనాతనధర్మ సౌధం కుప్ప కూలనున్నదంటూ నేడు హిందుత్వ శక్తులు సాగించే ఉధృత ప్రచారం నేడు కోట్లాది వంటగదుల లోకి కూడా చొచ్చుకు పోతోంది. ద్రావిడనేలలో కూడా హిందుత్వశక్తులు ఇంత తేలిగ్గా, త్వరగా, లోతుగా చొరబాటుకి కారణాలేమిటి ?

పై ఆరు ప్రశ్నలకి మీడియాలో జవాబులు దొరకవు. పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ నుండి సమాధానాలు దొరకవు. అవి చరిత్ర గర్భంలో దొరుకుతాయి. ఐతే వాటి అన్వేషణ కోసం టార్చి లైట్ కావాలి. అదే గతి తార్కిక చారిత్రిక భౌతికవాద దృష్టి. దాని వెలుగులో జవాబుల కోసం అన్వేషణ చేశా. ఈ అవగాహనకి వచ్చా. ఐతే ఇది సమగ్రమూ కాదు, సంపూర్ణమూ కాదు. ఒక ప్రయత్నం! ఓ ప్రయోగం! మీరూ చదవండి. ఇప్పటికే మీరు ఏర్పరుచుకున్న ముందస్తు అభిప్రాయాలతో కాకుండా, తెరిచిన మనస్సు (open mind)తో చదివి మదింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా. పరస్పర చర్చ ద్వారా నా అవగాహనలో అవసరమైన మార్పులు, చేర్పులు, కూర్పులని నేను తెరిచిన మనస్సుతో ఆహ్వానిస్తా.

- ఇఫ్టూ ప్రసాద్

Keywords : సుప్రీంకోర్టు, తీర్పులు, శబరిమల, స్వలింగ సంపర్కం, ఆర్టికల్ 497, supreme court, verdicts, article 497, shabarimala,
(2024-03-16 05:23:58)



No. of visitors : 1050

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆర్టికల్497,