తెలంగాణ వ‌స్తే ఏమొచ్చింది? - చింత‌కింది కాశీం


తెలంగాణ వ‌స్తే ఏమొచ్చింది? - చింత‌కింది కాశీం

తెలంగాణ

మేము డిగ్రీ చదువుతుండిన రోజులలో(1995-98) ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ ఎజెండా మీదికి వచ్చింది. భిన్న రాజకీయ సిద్ధాంతాలు, ఆచరణ కలిగిన విద్యార్థులు, సివిల్స్‌ లక్ష్యంగా చదివే ʹబ్రిలియంట్‌ʹ స్టూడెంట్స్‌ నిజాం కళాశాలలో ఉండేవారు (ఇప్పటికీ కొన్ని మార్పులతో ఉన్నారు). కనుక సమాజంలో చర్చనీయాంశంగా ఉండే విషయాలపై విపరీత ఆసక్తి, మేధో చర్చలు కొనసాగేవి. అప్పటి యూనివర్సిటీ టీచర్స్‌ కూడా వాటిని ప్రోత్సహించేవారు. అట్లా ఒకరోజు తెలంగాణ అంశం మీద చర్చ జరిగింది. బూర్జువా పార్టీల దృక్పథం కంటే వామపక్ష, విప్లవ పార్టీలు తెలంగాణ గురించి ఏమనుకుంటున్నాయనే దానిపై చర్చ కేంద్రీకృతమైంది. సీపీఐ, సీపీఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల నేపథ్యం నుంచే తెలంగాణ ఆకాంక్షను చూసాయి. కార్మికవర్గ విభజన వర్గ పోరాటానికి నష్టం చేస్తుందనే అవగాహన దీనికి పునాదిగా ఉన్నట్లు ఆనాటి వారి మాటలను బట్టి అర్థమైంది. ఇక చర్చ ప్రధానంగా పీపుల్స్‌వార్‌ పార్టీ(ఇప్పుడు మావోయిస్టు పార్టీ) ఏమనుకుంటుందనే వైపు మళ్లింది. ఆనాడు రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం గణనీయంగా ఉండింది. కాబట్టి తెలంగాణపై ఆ పార్టీ అవగాహన కూడా చాలా ముఖ్యం. ʹప్రత్యేక తెలంగాణ ఉద్యమం - తెలంగాణ అభివృద్ధి - విప్లవోద్యమ కార్యక్రమంʹ పేరుతో ఒక డాక్యుమెంట్‌ (1 జూన్‌, 1997)ను పీపుల్స్‌వార్‌ పార్టీ విడుదల చేసింది. ʹʹనేడు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌పై దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమాలు తలెత్తుతున్నాయి. వీటిలో కొన్ని జాతి ఆధారంగా కాగా, మరికొన్ని ప్రాంతీయ అసమానతల మూలంగా తలెత్తుతున్నాయి. ఇందులో భాగమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంʹʹ అంటూ ఆ డాక్యుమెంట్‌ మొదలైంది. చాలా స్పష్టంగా, నిర్ధిష్టంగా తెలంగాణ డిమాండ్‌కు మద్దతునిస్తూ నిర్ణయం తీసుకొని, ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై ఉద్యమించే శక్తులను కలుపుకొని, ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఆ పార్టీ అనుకున్నది.

ఒక విప్లవపార్టీ ఇలా ప్రాంతీయ ఉద్యమానికి మద్దతు నివ్వటమేమిటని మా మధ్య చాలా జర్చలు జరిగాయి. ఆ పార్టీ నాయకత్వంలో ఎక్కువగా తెలంగాణ వాళ్లు ఉండటం వలన జరిగిన నిర్ణయమని కూడా కొందరన్నారు. ఆలోచనలు పరిపక్వమవుతున్న దశలో ఉన్న మాకు ఊగిసలాట ఉండేది. అప్పుడు 1973లో సృజనలో అచ్చయిన ʹరాష్ట్ర విభజనోద్యమం - మార్క్సిజంʹ అనే వ్యాసాన్ని ఒక మిత్రుడి ద్వారా పొంది చదవటం జరిగింది.

జాతుల, ప్రాంతీయ ఉద్యమాలలో శ్రామిక వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నప్పుడు విప్లవకారులు ఆ ఉద్యమాలను విస్మరించలేరు. సారాంశంలో అవి బూర్జువా ఉద్యమాలే అయినప్పటికీ కార్మికవర్గ ప్రయోజనాలు అందులో ఉన్నప్పుడు ఆ ఉద్యమాలను కార్మిక వర్గ నాయకత్వంలోకి తీసుకరావాలి. కొంతలో కొంతైన ఆ వర్గ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే అవగాహన ఆ రోజుల్లో మాలాంటి యువతను ఆకర్షించింది. గ్లోబలైజేషన్‌ ప్రభావంలో డీజనరేట్‌ అవుతుండిన తరానికి మలిదశ తెలంగాణ ఉద్యమం విలువల్ని ప్రోది చేసుకునే సాధనమైంది. రాబోయేది భౌగోళిక తెలంగాణే అయినప్పటికి.. ప్రజాస్వామిక ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఉండాలని, అలా జరగాలంటే ప్రజా సమూహపు ఒత్తిడి ఉండాలని అర్థమైంది. కనుక పాపులర్‌ నినాదాల వెంట కాకుండా నిలకడైన నినాదాలను రూపొందించుకోవల్సిన అవసరం ఏర్పడింది.

బూర్జువా నిర్మాణాలకు సమాంతరంగా ప్రత్యామ్నాయం ఉండాలనే నిర్మాణాత్మక కృషి జరిగింది. రెండు పాయలుగా తెలంగాణ ఉద్యమం జరిగిన తీరు దీనికి అద్దం పడుతుంది. పార్లమెంటరీ పార్టీల నాయకత్వం ప్రజల చైతన్యస్థాయిని అందుకోలేనప్పుడల్లా మాస్‌ ఫ్రంట్స్‌ ఆ లోటును భర్తీ చేసాయి. కింది సామాజిక శ్రేణుల నుంచి వ్యక్తమైన ప్రజాస్వామిక ఆకాంక్షలన్నీ ఉద్యమ సందర్భంలో ఎజెండాగా మారాయి.

తెలంగాణ ఉద్యమం జరుగుతుండినంత కాలం తెలంగాణేతరుల నుంచి మేము చాలా ప్రశ్నలను ఎదుర్కోవల్సి వచ్చింది. ఇది ప్రజా ఉద్యమమా? బూర్జువా ఉద్యమమా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాన్య ప్రజలకు ఏమొస్తుంది? విప్లవ శక్తులు ఈ ప్రాంతీయ ఉద్యమం కోసం తమ శక్తినంతా వృధా చేయటం లేదా? మొదలైన ప్రశ్నలు వచ్చాయి. ప్రగతిశీల శక్తులు కూడా ఈ సందేహాలతోనే ఉదాసీనంగా ఉండిపోయాయి. కోస్తాంధ్రలో పెట్టుబడిదారులు ఎగదోస్తుండిన ప్రతిఘాతుక ఉద్యమాలలో ప్రజలు సమీకరించబడకుండా చేయడంలో ఉద్యమ శక్తులు చురుకుగా వ్యవహరించకపోవటానికి సైద్ధాంతిక అవగాహనలో ఉండిన పరిమితిగానే అర్థమవుతుంది.

ఇట్లాంటి అనేక ప్రశ్నల మధ్య 2014 జూన్‌ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రజాస్వామిక ఆకాంక్షలు మాత్రం మిగిలే ఉన్నాయి. అయితే బూర్జువా చట్రంలో కొన్ని ఆకాంక్షలు నెరవేరాయి. అవి అనివార్యంగా జరిగేవే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం పెరిగింది. కనీస ప్రజాస్వామిక విలువలను కూడా నిరాకరించే స్వభావాన్ని ప్రభుత్వం సంతరించుకున్నది. ప్రజలు పెనుగులాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో వారి ఆకాంక్షలను నెరవేర్చే యంత్రాంగం ఉండాలనే కోరికలు తప్పక ఉంటాయి. కొన్నిసార్లు ఆ అంచనా పాలకుల స్వభావంతో సంబంధం లేకుండా కూడా ఉండవచ్చు. అయితే ఉద్యమాల ద్వారా సాధించుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వారికి ఉద్యమాల శక్తి, ప్రజల చైతన్యస్థాయి మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందుకే సామాజిక చలనాలకు అవకాశం లేకుండా చూడాలనే నిర్ణయానికి వచ్చారు. అవసరం ఉన్నా లేకపోయినా రక్షణ యంత్రాంగాన్ని ప్రయోగించటం, వారికి అవసరానికి మించిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించి ప్రజల మీదికి ఎగదోసే ఆలోచనవైపే మొగ్గు చూపారు. నిజానికి అభద్రత లోంచే ఇలాంటి ఎత్తుగడలను పాలకులు అమలు చేస్తారని చరిత్రలో రుజువైంది. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మౌలిక సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు తిరిగి పోరాడటానికే సిద్ధ పడుతారని ఏలికకు తెలుసు. కనుక నిరసన తెలిపే హక్కునే లేకుండా చేయాలని అనుకున్నారు.

ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాన్ని ఇష్టంలేని వాళ్లు, కొందరు తెలంగాణేతరులు, చూసారా? ʹమీరందరు కలిసి రాష్ట్రాన్ని తెచ్చి వాళ్లను గద్దెనెక్కించారు. మీ మీదే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు. అందుకే మేము ఆనాడే చెప్పాం తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని, చిన్న రాష్ట్రం ఏర్పడితే నిర్బంధం పెరుగుతుందని, దొరలు అధికారంలోకి వస్తారనిʹ ఇలాంటి అపవాదులు ఈ మధ్య చాలా వింటున్నాం. ఇక తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడిన శక్తులు కూడా ʹతెలంగాణ వస్తే ఏమొచ్చిందని మమ్ములనే అడుగుతున్నారుʹ ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పకపోతే విప్లవ, ప్రగతిశీల శక్తులు తెలంగాణకు మద్దతివ్వటంలో దానికోసం పోరాడటంలో సైద్ధాంతిక తప్పిదమేదో చేసారనే భావం కలగవచ్చును.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం బూర్జువా స్వభావం కలది. కాని ఆ డిమాండ్‌ను ప్రతీసారి ఎజెండా మీదికి తెచ్చింది మాత్రం కార్మికవర్గ ప్రజలు, మధ్యతరగతి వర్గం. సారాంశంలో అది కేవలం బూర్జువా ఉద్యమంగా నడవలేదు, లక్షలాది ప్రజల భాగస్వామ్యంతో నడిచింది. నాయకత్వం బూర్జువావర్గం చేతిలోనే లేదు. ఆ మాటకొస్తే అసలు తెలంగాణలో బూర్జువా వర్గమే రూపొందలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది తెలంగాణ జనసభ లాంటి కార్మికవర్గ స్వభావమున్న నాయకత్వం. దానిని ప్రచారం చేసి నిలబెట్టింది కింది కులాల కళాకారులు, విద్యార్థులు. మధ్యలో బూర్జువావర్గ స్వభావమున్న నాయకత్వం ప్రవేశించినా, ఉద్యమాన్నంతా తన చేతిలోనే ఉంచు కోలేకపోయింది. ఇన్ని ప్రత్యేక లక్షణాల వలన తెలంగాణ ఉద్యమంలో విప్లవ, ప్రగతిశీల శక్తులు పాల్గొనటం, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించడం సైద్ధాంతిక తప్పేమికాదు. విప్లవోద్యమం మీద నిర్బంధం వస్తుందనే జంకుతో మెజార్టీ ప్రజల పోరాటంలో ఉండే ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం పోరాడకుండా, త్యాగం చేయకుండా విప్లవోద్యమం ఏనాడు ఉదాసీనంగా ఉండలేదు. అలా చేయటం విప్లవంలో భాగం కూడా.

ఇక తెలంగాణ ఏర్పాటు వలన ప్రజలకేమి ప్రయోజనం జరగలేదా? అనే ప్రశ్నకు జవాబు చ్పెటమంటే ప్రభుత్వం గొప్పతనం చెప్పటం కాదు. ఎవరి పాలనలోనైనా రాజ్యాంగ యంత్రాంగం పరిధిలో జరగవల్సినది జరిగిపోతుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరిగిన నష్ట నివారణ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. కృష్ణా, గోదావరి జలాలలో తెలంగాణ వాటా ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు దక్కలేదు. పాలమూరు జిల్లా కరువులోనే ఉండిపోయింది. 293 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణవేణి పాలమూరు బీడు భూములను తడప లేకపోయింది. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వలసలకు నిలయమైన కొల్లాపూర్‌, అచ్చంపేట తాలూకాలకు నీళ్లు వచ్చాయి. చెరువులు నిండాయి. కొద్ది కాలానికైనా కాలువల్లో నీళ్లు పారాయి. కోస్తా జిల్లాల్లో మాత్రమే ప్రవహించే కాలువలు, కొల్లాపూర్‌ తాలూకాలో ప్రవహించటం మాలాంటి వారికి మరిచిపోలేని అనుభూతి. నీళ్ల కోసం చెలిమెల వెంట పరిగెత్తిన బాల్యం గుర్తులు ఒకప్పటివి, పొలాలల్లో పాక్షికంగానైనా పారుతున్న నీటి గుర్తులు ఇప్పటివి. నీళ్లు వస్తే భూమి లేని నిరుపేదలకు కనీసం కూలైన దొరుకుతుంది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఇరిగేషన్‌ శాఖ ఏఈల కోసం నిర్వహించిన మొదటి పరీక్షలో అంబట్‌పల్లి గ్రామ పంచాయితీలోని కొత్తచెరువు తాండకు చెందిన యాదయ్య (ఉప్పరి కులం) రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించాడు. వలసపోయి జీవించే కుటుంబంలో ఇంజనీర్‌ తయారయ్యాడు. ఆయననే కాదు, మరో పదహారు వందల మంది తెలంగాణ కుటుంబాలలో ఇంజనీయర్లు వచ్చారు. వీళ్లందరూ ఉద్యోగాలు పొందటం వలన ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈ 1600 వందల మందికి ఉపాధి దొరికేది కాదు.

ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల వరకు తెలంగాణ విద్యార్థులకు సీట్లు లభించేవి కావు. కోరుకున్న విద్యాసంస్థలలో సీట్లు పొందలేక చాలా మంది విద్యార్థులు అర్థాంతరంగా చదువులను మానేసేవాళ్లు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడినవారే స్థానికులుగా అక్రమ సర్టిఫికెట్స్‌ పొంది ఉన్నత విద్యా సంస్థలలో సీట్లు సంపాదించేవారు. తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన వారికి నిజాం కళాశాల, కోటి ఉమెన్స్‌ లాంటి ప్రసిద్ధ సంస్థలలో అవకాశాలు దక్కేవి కావు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రి, ఫిజిక్స్‌, మాథ్స్‌, ఎకనమిక్స్‌, జర్నలిజం, సైకాలజీ లాంటి సబ్జెక్ట్‌లలో సీట్లు రావటం కష్టంగా ఉండేది. హైదరాబాద్‌లోని ఆంధ్ర విద్యార్థులే ఆ సీట్లలో భర్తీ అయ్యేవారు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందకు వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించబడ్డాయి. విద్యారంగం మీద కేటాయించే బడ్జెట్‌లో అధిక మొత్తం ఆంధ్ర ప్రాంత విద్యాసంస్థలకు తరలించిన విధానం ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. కాని తెలంగాణ రాష్ట్రంలో దానికి బ్రేక్‌పడింది.

సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రమ సంస్కృతితో ముడిపడి ఉన్న ఉత్పత్తి సంబంధాలలో భాగమైన బతుకమ్మ, బోనాల పండుగలకు ప్రాధాన్యత ఏర్పడింది. కోస్తా పాలనలో మరుగునపడిన తెలంగాణ కవులు-వారి సాహిత్యం పఠనీయ అంశాలుగా మారాయి. విద్యార్థులకు కొత్త సాహిత్యం పరిచయమైంది. పోరాటాలతో నిర్మాణమైన ఇక్కడి చరిత్ర పాఠ్య పుస్తకాలలో భాగమైంది. నిర్లక్ష్యం, వివక్షకు గురైన తెలంగాణ భాషకు గుర్తింపు వచ్చింది. చరిత్ర, సాహిత్యం, సంస్కృతి విభాగాలలో పరిశోధనలు నిర్ధిష్టంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి పర్యాటక కేంద్రాలకు ప్రచారం రావటం వలన ఆ ప్రాంతాలలో ఉండిన పేద నిరుద్యోగులకు ఉపాధి దొరికింది.

జరిగిన ఈ మార్పులో, దక్కిన అవకాశాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సృష్టించిన అద్భుతం వలన కాకుండా భౌగోళికంగా రెండు రాష్ట్రాలు ఏర్పాడటం వలన సహజంగా జరిగిన ప్రక్రియగా అర్థం చేసుకోవాలి. ఇలా కాకుండా పాలకులు మరోలా చేయడానికి కూడా వీలులేదు. ప్రజల పోరాటం వలన, అస్తిత్వం వలన జరిగిన మార్పుగానే దీనిని అర్థం చేసుకోవాలి. మొత్తంగా తెలంగాణ ప్రజలలో ఉండిన ఆత్మన్యూనత భావం తొలగిపోవటమనేది ఉద్యమం సాధించిన విజయంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండిన పాలకులు కాకుండా మరెవ్వరు అధికారంలో ఉండిన ఈ మార్పులు సహజంగానే జరుగుతాయి. పాలకుల పూనిక కంటే రాజ్యాంగ యంత్రాంగ నియమ నిబంధనలలో భాగంగా ఈ కాస్త మార్పు జరిగింది.

నిజాయితీగా పాలకులు కొత్త రాష్ట్రంలో కొత్త విజన్‌తో పనిచేయాలనుకుంటే ఈ సమస్యలను పరిష్కరించవల్సి ఉండే. 1. నిరుద్యోగం, 2. నిరాశ్రయం, 3. వ్యవసాయరంగ సంక్షోభం 4. పారిశ్రామిక రంగ సంక్షోభం, 5. విద్యా-వైద్య రంగ సంక్షోభం, 6. సామాజిక అంతరాలు, 7. నిర్బంధ వాతావరణం. తెలంగాణ ఉద్యమం జరుగుతుండిన రోజులలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పాటు పైన పేర్కొన్న విషయాలన్నీ చర్చనీయంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమమంటే కోస్తాంధ్ర వ్యతిరేకతనే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, ఆధిపత్యానికి వ్యతిరేకతగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ధ్వంసమైన జీవన రంగాలను పునర్నిర్మాణం చేసుకోవాలనే ఆకాంక్ష ప్రజల నుంచి తీవ్రంగా వ్యక్తమైంది. కాని పాలకులు మాత్రం ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను పట్టించుకోకుండా ఈ కాలమంతా ప్రవర్తించారు.

ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మనుషుల ఒప్పందం, జీవో 610 అమలుకు నోచుకొనకపోవటం వలన తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి లభించలేదు. నియామకాలలో జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేపథ్యంగా ఉండింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయని నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ ప్రసంగాలు నడిచాయి. వందలాది వ్యాసాలు కూడా రాసారు. కనుక లక్షలాది నిరుద్యోగులు కొత్త రాష్ట్రంలో ఉపాధి లభిస్తుందని ఆశపడ్డారు. కాని వాస్తవంలో దీనికి భిన్నంగా జరిగింది. రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాలు 4,41,995. భర్తీ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులు 3,33,781. ఖాళీగా ఉన్నవి 1,08,214. కాగా 2018 జూలై నాటికి తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 12,671 మాత్రమే. 20 వేలకు పైగా టీచర్‌ పోస్టులు 1500 పైగా విశ్వవిద్యాలయ అధ్యాపకుల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. విద్యావ్యవస్థలో బోధన సిబ్బంది లేకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యం? 35 వేలకుపైగా ఉండాల్సిన బోధనేతర సిబ్బందిని నియమించటాన్ని ప్రభుత్వాలు 30 ఏళ్ల కిందనే మర్చిపోయాయి. ఇంకా అనేక ప్రభుత్వ రంగాలలో వేలాది ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది. నిజానికి ఖాళీ పోస్టులను నింపటానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం లేదు.

కోస్తాంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలు అనేకరకాలుగా నిరాశ్రయులయ్యారు. సెజ్‌ల పేరు మీద భూమికి దూర మయ్యారు. మందుల కంపెనీల ఏర్పాటు వలన పోలేపల్లి లాంటి గ్రామాలు పోయాయి. భారీ ప్రాజెక్టుల వలన వందలాది గ్రామాలు ముంపునకు గురయ్యారు. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ వలన జీవన విధ్వంసం అనేక రెట్లు పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వలన లక్షలాది మంది ఆదివాసులు, జంతువులు ముంపునకు గురయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో డిస్‌ప్లేస్‌మెంట్‌ ప్రధాన చర్చనీయాంశంగా ఉండింది. ఆ సమయంలో ఇవాల్టి పాలకులు కూడా ప్రజల ఆకాంక్షలకు తలొగ్గి మాట్లాడారు. కాని అధికారంలోకి వచ్చాక ఏ మార్పు జరగపోగా నిరాశ్రయత్వం మరింత పెరిగింది. వనరుల దోపిడి కూడా రెట్టింపయ్యింది. మల్లన్నసాగర్‌లో పదుల సంఖ్యలో గ్రామాలు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఓపెన్‌కాస్ట్‌ మరింత పెరిగింది. పోలవరం సవతి బిడ్డ అయిపోయింది. ఫార్మా సిటీల పేరుతో గ్రామాలన్నీ బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేయబడ్డాయి.

తెలంగాణలో వ్యవసాయమంటే మిన్ను కురువాలి, మన్ను పండాలి. ఇది వాణిజ్య పంటలకు ప్రయోగశాల కాదు. కేవలం ఆహారపు పంటలు పండించి స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థకు దాఖలా తెలంగాణ. కాని విజన్‌ 2020 పాలకులు ఈ ప్రాంత వ్యవసాయ రంగాన్ని బహుళజాతి కంపెని మాన్‌శాంటో విత్తనాలకు ప్రయోగశాలగా మార్చారు. ఆహారపు పంటలకు రైతులను దూరం చేసి వాణిజ్య పంటల వైపు మళ్లించారు. పత్తి పంట కోసం అప్పులు చేసిన రైతులు, దిగుబడి రాక రుణభారం పెరిగి ఆత్మహత్యల వైపు మళ్లారు. తెలంగాణ వస్తే రైతుల ఆత్మహత్యలు ఉండవనే నినాదం ఉద్యమ సందర్భంలో బాగానే ప్రచారంలో ఉండేది. రైతులు కూడా నమ్మారు. ఉద్యమంలో భాగమయ్యారు. కాని తెలంగాణ వచ్చాక సమగ్ర భూ సర్వే పేరుతో కౌలు రైతులు(40%) విస్మరణకు గురయ్యారు. దొరల పట్టాలకు భద్రత దొరికింది. రైతు బంధు పథకంతో వ్యవసాయ బంధం భూస్వాములకే పెరిగింది.

కోస్తా పాలకులు తెలంగాణ జిల్లాల్లో, హైదరాబాద్‌ నగరంలో వేలాది కంపెనీలను మూసివేసారు. ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే. హెచ్‌ఎంటి, బిడీఎల్‌, హెచ్‌ఏఎల్‌, ఐడిపిఎల్‌, డీబీఆర్‌ మిల్స్‌, ఆల్విన్‌, బోదన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, ఖాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్‌, అజంజాహి మొదలైన కంపెనీలు మూతపడటం వలన లక్షలాది కార్మికులు వీధినపడ్డారు. సింగరేణిలో, ఆర్టీసీలో మిషన్స్‌ ప్రవేశం వలన ఉద్యోగుల అవసరం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూసివేసిన కంపెనీలన్నీ తెరుచుకుంటాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎంతో ఆశతో నిరుద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు. కాని రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం మినహాయించి ఈ రాష్ట్రానికొక ప్రజానుకూల పారిశ్రామిక విధానం లేకుండాపోయింది.

ఇక్కడ విద్య అంటే వ్యాపారమే. సద్‌ వివేకాన్ని ఇచ్చే జ్ఞాన కేంద్రం ఏనాడో ధ్వంసమైంది. విద్యా మాఫియా కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు దిగుమతి అయింది. రెండు కార్పోరేట్‌ సంస్థలు మొత్తం విద్యారంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. పాలకుల లాలూచీతనమే దీనికి కారణం. ర్యాంకుల మోజులో, పిల్లల మీద విపరీత భారం పెరిగి రైతుల వలె విద్యార్థుల ఆత్మ హత్యలు పెరిగాయి. తెలంగాణ ప్రజల ఆదాయమంతా కార్పోరేట్‌ విద్యాసంస్థల యజమానుల జేబుల్లోకి పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే కలెక్టర్‌ పిల్లలైన - కూలీ పిల్లలైన ఒకే బడిలో అది కూడా ప్రభుత్వ బడిలో చదువుకుంటారని ఉద్యమ కాలంలో రాజకీయ నాయకత్వం ప్రగల్భాలు పోయింది. కాని తెలంగాణ వచ్చాక కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదం నినాదంగానే ఉండింది. ఇప్పుడు గురుకులాలే సర్వరోగ నివారిణి అని ప్రచారం చేస్తున్నారు. వందేళ్లు నిండిన ఓయు తన ఉద్యోగులకు జీతాలు చెల్లించటమేలా అనే సంశయంలో ఉంది. జిల్లాలో ఉన్న యూనివర్సిటీలు జూనియర్‌ కాలేజీల కంటే కాస్త ఎక్కువ. డిగ్రీ కాలేజీల కంటే కాస్త తక్కువగా నడుస్తున్నాయి. 5000 ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు జీవోలు జారీచేసారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల బిల్లును తీసుకొచ్చి ప్రభుత్వ యూని వర్సిటీలను సంక్షోభంలో పడేస్తున్నారు. నాణ్యమైన విద్యను పేద, దళిత, బీసీ వర్గాలకు దక్కకుండా కుట్ర చేస్తున్నారు.

మనిషి ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ప్రజలలో ఈ బలహీనతను ఆసరా చేసుకున్న కోస్తాంధ్ర కమ్మ కార్పోరేట్‌ హాస్పటల్స్‌ తెలంగాణ ప్రజల డబ్బునంతా దోచుకున్నారు. ప్రభుత్వ దవాఖానాలను పట్టించుకునే విధానాలు తెలంగాణలో కూడా రూపొందలేదు. తెలంగాణ ప్రజల ఆదాయంలో సింహభాగం ఆంధ్ర విద్య - వైద్య రంగాలకే మళ్లింది.

దళితుడు ముఖ్యమంత్రి అనే నినాదం ఉద్యమ సందర్భంలో మారుమోగింది. దళితులకు ఆశ కల్పించారు. అధికారం చేపట్టింది మాత్రం ఒక్క శాతం జనాభా ఉన్న వెలమ కులం. దళితులకు మూడెకరాల భూమి అన్నారు. ఇప్పటికి 4600 మందికి మాత్రమే భూ పంపిణి చేసారు. లక్షలాది దళిత కుటుంబాలకు భూమి అందలేదు. పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల మీద దాడులు పెరిగాయి. హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల హత్య, పాతపల్లి దళితుల వెలివేత(పాలమూరు), ప్రేమించినందుకు మంథని మధుకర్‌ హత్య(కరీంనగర్‌), దొంగతనం పేరు మీద బుడగజంగం వెంకటేష్‌ హత్య(వేములవాడ), మాదిగ మహిళా నాయకురాలు భారతిని పోలీసులే హత్యచేసారు. నేరెళ్ల(సిరిసిల్ల) దళితుల మీద దాడి, అభంగపట్నం దళితుల మీద దాడి(నిజామాబాద్‌), ప్రణయ్‌ హత్య. తెలంగాణ సమాజంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక అంతరాలు పెరిగాయి. దళిత ప్రజలను వివిధ రూపాలలో హత్యలు చేయటం పెరిగింది. దాడులకైతే అంతే లేదు.

ఎన్‌కౌంటర్లు, కేసులు, నిర్బంధం, జైళ్లు, హత్యలు, నయీం ముఠాల చేత హత్యలు తెలంగాణలో నిత్యకృత్యంగా ఉండేవి. ఈ సందర్భంలోనే తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పల్లెల మీద పోలీసుల పదఘట్టనలకు కాస్త ఉపశమనం దొరికింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్‌కౌంటర్లు ఉండవని, పౌర ప్రజాస్వామిక హక్కులు పరిఢవిల్లుతాయని ప్రజలందరు కోరుకున్నారు. కాని హాల్‌మీటింగ్స్‌కు కూడా అనుమతి ఉండదని, ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా చౌక్‌ రద్దవుతుందని, ప్రొఫెసర్ల మీద, మేధావుల మీద రాజద్రోహం కేసులు మోపబడుతాయని, కళాకారుల ఇళ్ల మీద దాడులుంటాయని ఎవరనుకున్నారు. ఇట్లౌవునని ఎవరనుకున్నారని కాళోజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవల్సి వస్తుంది. మంత్రులకు కూడా తమ విధులు నిర్వహించుకునే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ప్రతిపక్షం అనే ప్రజాస్వామ్య సంప్రదాయం కాలగర్భంలో కలిసిపోయింది. అసెంబ్లీ అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అంటే అసెంబ్లీగా మారిపోయింది. చరిత్ర ప్రహసనంగా పునరావృత్తం కావటం పెను విషాదం.

నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించిన పాలకులు తెలంగాణ సమాజంలో అన్నిరకాల ప్రజాస్వామిక సంస్థలను ధ్వంసం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించిన వారికి నిరాశనే మిగిలింది. కొత్త రాష్ట్రంలో కొత్త ఆకాంక్షలు నెరవేరక పోయినా పర్వాలేదు, కాని పాత ప్రభుత్వాలు పాటించిన విధానాల మీద గంభీరమైన విమర్శ పెట్టిన వారే అధికారంలోకి వచ్చాక కనీస విలువలను పాటించని అనైతిక పాలన కొనసాగుతున్నది. రాష్ట్ర అధినేత ప్రతిపక్షాలను, ఉద్యమ నాయకులను, ప్రజాసంఘాల నాయకత్వాన్ని, మేధావులను, అసమ్మతి గొంతులను వినకుండా, కలువకుండా, అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకుండా తన పాలనను కొనసాగించటం ఏ పార్లమెంటరీ విలువల ప్రకారమని సమర్థించుకుంటారు. ఎవరైన తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవచ్చును, ఆత్మగౌరవాన్ని నిలబెట్టు కోవచ్చును. కాని ఇతరుల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపర్చే అధికారం ఉండకూడదు. అహంకారం ముందు నడిచి ఆ తర్వాత మనిషి నడిచే స్థితి రావటమంటే వ్యక్తుల, పార్టీల, సంస్థల పతనానికే దారితీస్తుంది. ప్రజాస్వామ్యం పేరు మీద నియంతృత్వం అమలయ్యే వ్యవస్థలకు మనం ఏ పేరు పెట్టాలి?

ప్రజలు అనేక పోరాటాలు చేసి నిర్మాణం చేసిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కూలగొడుతూ, ప్రజలను డీ జనరేట్‌ చేసే కుట్రలు రచిస్తూ, బ్రాహ్మణీయ సంప్రదాయాలను అమలు చేస్తున్నారు. తిరోగమ భావజాలాన్ని ప్రజలలో నింపటానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనీసం తెలంగాణలో శతాబ్ద కాలంగా ప్రగతిశీల, ప్రజాస్వామ్య భావాలు వికసించాయి. స్థిరపడ్డాయి. కాని నేటి పాలకులు మాత్రం ఆది శంకరాచార్యుల పాదయాత్రను మొదలుపెట్టారు. కనుకనే దళితుల మీద, మహిళల మీద, వివిధ రూపాలలో దాడులు పెరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నిరకాల సమస్యలున్నాయంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వలన ప్రయోజనం లేదని దీనర్థం కాదు. వ్యవస్థ పునాదిలో మార్పు జరగకుండా ఉపరితలంలో జరిగే మార్పుల వలన ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావు. అట్లని తాత్కాలికంగా నెరవేరే ప్రయోజనాల కోసం పోరాడకుండా ఉద్యమ శక్తులు ఉండలేవు. ఈ కోణంలోనే తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఇక్కడి ప్రజలు, ఈ నేలలో ఉండే చైతన్యం వలన ఇక్కడి పాలకులలో ఉండిన, ఉండే మెడబిరుసుతనాన్ని తగ్గిస్తారు. లేదా మార్పును కోరుతారు.

సోర్స్ : నడుస్తున్న తెలంగాణ

Keywords : telangana, administration, revolution, unemployement, తెలంగాణ, ప్రభుత్వం, పాలన, ఉద్యమం, ఆకాంక్షలు
(2019-05-18 04:28:26)No. of visitors : 477

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


తెలంగాణ