నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము


నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము

నేల

ʹనువ్వు భూమి సమస్యతో వచ్చావు, కాని నా దగ్గర భూమిని విముక్తి చేసే సాహిత్యం మాత్రమే వుంది. ఇంటెరెస్ట్ వుంటె చదువుʹ అని ఆ పది పుస్తకాలు నా చేతికిచ్చిండు.

ʹఎంత మంది వుండి ఏం లాభం. పైసలు పోసి కొన్న జాగను వాడు వచ్చి దర్జాగ కబ్జా పెట్టుకొనె. చుట్టుపక్కల వాడిని ఎదిరించే మొగోడే లేకపాయె. ఆడదాన్ని నేనేం చేస్త. ముందే వాడు పెద్ద గుండాగాడు. ముగ్గురు ఆడ పిల్లల పెట్టుకోని వాడితోని ఎట్ల కొట్లాడుత. వాడెట్ల నాశనమవుతడో …ʹ

నేను అపార్ట్ మెంట్లోకి అడుగు పెట్టగానే అక్క నా మీద అరుస్తున్నట్లు తాను మారుతీనగర్ లో కొన్న ప్లాట్ ను అక్కడ లోకల్ గా వుండె ఒక గుండా కబ్జా పెట్టిన సంగతి చెప్పుతావుంది. (అక్క అంటే రక్త సంబంధం ఏమి లేదు. వాళ్ళది, మాది ఒకటే ఊరు. చిన్నప్పటి నుండి బాగా తెలుసు. ఊర్లో ఉన్నప్పుడు అక్క కూతురు, నేను ఒకటే క్లాస్. పట్నం వచ్చినంక ఆ కుటుంబంతో ఆత్మీయ సంబంధం ఏర్పడింది)

అక్క చెప్పే విషయం అర్థమయ్యింది కాని, నీనేమి చెయ్యగలనో తెల్వలేదు. ఇరవై ఏండ్ల వయస్సు. అప్పుడప్పుడే కొత్తగా హైదరాబాద్ కు వచ్చిన. పోతే నేను చదువుతున్న నిజాం కాలేజ్, లేకపోతే అక్క ఇంటికి దగ్గర్లోనే తీసుకున్న మా రూం లో వుండేటోన్ని. ఈ రెండూ కాకపోతె, అక్క ఇంటికి వచ్చి కాసేపు కాలక్షేపం చేస్తోని. ఈ మూడు జాగలు తప్ప సిటీలో పెద్దగా ఎక్కడ తిరుగలేదు. కొన్ని బస్ రూట్లు తప్పితే సిటీ కూడ ఎక్కువగా తెల్వదు.

నిజాం కాలేజ్ లో అన్ని రకాల స్టూడెంట్స్ వుంటరు. కాని స్నేహం మాత్రం బుద్ధిగా చదువుకునే ఒక పది మందితోనే. ఈ పరిస్థితులల్లో ఏ విధంగ చూసినా ఆ గుండాను నేను ఏమి చేయలేను. ఆ విషయం అక్కకు కూడ తెలుసు. అయినా ఆమెకు వేరే దిక్కులేక నేను కనబడగానే నాతో చెప్తుంది. బాధ పడడం తప్ప నేనేం చేయగలను! కాని అక్క బాధ చూస్తుంటె, ఏదైనా చేసే మార్గం వుంటే బాగుండు అనిపించింది.

నిజాం కాలేజ్ లో కొందరు లోకల్ విద్యార్థులు చిన్న చిన్న గ్యాంగులుగా ఏర్పడి ఎప్పుడు చెట్లకింద కూర్చొని వుండెటోళ్ళు. అప్పుడప్పుడు కొట్లాటలు పెట్టుకుంటోళ్ళు. దాడులు కూడ చేసుకుంటోళ్ళు. ఆ గొడవలు ఎక్కువగా అమ్మాయిల గురించే అయ్యేవి. అవి తప్పుడు పనులనే భావన ఉంది కాబట్టి వాళ్ళతో ఎప్పుడు కలిసేవాణ్ణి కాదు. కాకపోతె అందులో కొందరు పాతబస్తీ పైల్మాన్ల తమ్ముళ్ళు, రాజకీయనాయకుల, పెద్ద పెద్ద అధికారుల కొడుకులు ఉన్నరని తెలిసి వాళ్ళతోటి ఎట్లైనా దోస్తాను చెయ్యాలనుకున్న. నా ఉద్దేశం ఒక్కటే, వాళ్ళలో ఎవరి ద్వారనైనా అక్క భూమిని కబ్జా నుండి తీయించాలి.

***

వాళ్ళతో పరిచయం చేసుకోవడం నాకు పెద్ద సమస్యేమి కాలేదు. ఎందుకంటె అందులో ఒకడు నా క్లాస్ లోనే వుండెటోడు. కాని క్లాస్ కు ఎప్పుడు అటెండ్ అయ్యేవాడు కాదు. ఎందుకంటె వాడి ప్రాణమంతా చెట్ల కిందనే వుండేది. సెమిస్టర్ పరీక్షలు రాగానే ఎవరి దగ్గరైనా నోట్స్ తీసుకొని చదివి పాస్ అయ్యెటోడు.

సరిగ్గా సెమిస్టర్ ఎగ్జాంస్ దగ్గర్లో అతనితో పరిచయం కావడంతో అతనికి నా క్లాస్ నోట్స్, ఇతర మటీరియల్ ఇస్తానని ఆశ కల్గించిన. దానితో మా మద్య దోస్తాన్ కాస్త ఎక్కువయ్యింది. ఒకరిని ఒకరం ʹఅరేయ్, ఒరేయ్ʹ అనుకునేవరకు పెరిగింది. అందులో నా అజెండ నాకుంది. ఎందుకంటె, వాడి అన్న పాతబస్తీలో పెద్ద పైల్మాన్.

ఒక రోజు వీలు చూసుకొని అతనికి భూమి కబ్జా విషయం చెప్పిన. దానికి అతను ʹఅరే గిదెంత పనిరా. అన్నకు చెప్తె చిటికల సాల్వ్ చేస్తడు. భూమి పేపర్లుంటె పట్టుకురా. అన్నతోని మాట్లాడిస్తʹ అన్నడు. అతని మాటలు నమ్మకంగానే అనిపించినవి. మస్తు ఖుషీ అయ్యింది. ఏదో గొప్ప పని చేస్తున్నట్లు ఫీలింగ్ కలిగింది. ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికి పోయి ఈ విషయం చెప్పాలా అని అనిపించింది.

ఇంకా రెండు క్లాసులు ఉన్నా వదులుకోని అక్క ఇంటికి పోయి మొత్తం సంగతంత చెప్పిన. అక్క కూడ సంతోషంగ ఫీలయ్యింది. ʹకబ్జా పోతె నీకేదయిన ఇప్పిస్తలేʹ అంది.

ʹగవన్ని నాకెందుకక్క. ముందు జాగ కాగితాలు ఇవ్వుʹ అని తొందర పెట్టిన.

వెంటనే అక్క బీర్వాల షాపింగ్ బ్యాగుల పెట్టిన కాగితాలు తీసి ʹఅన్ని ఒరిజినలే వున్నయి, పోయి ఒక కాపీ జీరాక్స్ తీసుకురాపోʹ అని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాగితాలు ఇచ్చింది. వెంటనే పోయి జీరాక్స్ తీసుకొని వచ్చి, ఒరిజినల్స్ అక్కకు ఇచ్చి మళ్ళీ కాలేజ్ కు బయల్దేరుతుంటె ʹఅయ్యో తినకుంట ఎట్ల పోతవ్ రా, తినిపోʹ అని అంటూ అన్నం పెట్టుకుకొచ్చి ఇస్తె తిని వెంటనే బయల్దేరి కాలేజ్ కు పోయిన.

నా ఫ్రెండ్ ఇంకా అక్కడె చెట్టు కింద గ్యాంగ్ తో వున్నడు. కొంచం పక్కకు పిలిచి పేపర్లు ఇచ్చి కబ్జా పెట్టినోడి వివరాలు మల్లోసారి గుర్తుచేసిన. ʹఇక నేను చూసుకుంటలేʹ అని వాడు అనడంతో చాలా రిలీఫ్ అనిపించింది.

ఇక ఆ మరుసటి రోజునుండి వాడు ఏదైనా మంచి కబురు చెప్తడేమోనని వాడి పక్కనే గంటల కొద్ది నిలబడి టైం పాస్ (నిజానికి అది నాకు టైం వేస్ట్ కాని, అక్కడ అవసరం నాది కదా!) చేసిన. చూస్తుండగానే వారం గడిచిపోయింది. వాడు ఇంకా ఏమి చెప్తలేడు. ఇక ఆగలేక నేనే అడిగిన ʹఏమయిందిరా, ప్లాట్ సంగతి?ʹ అని.

ʹఅన్నతోని మాట్లాడినర. అంత ఈజీ కేస్ కాదన్నడు. కబ్జా పెట్టినోడు మామూలోడు కాదు. సిటీలనే పెద్ద రౌడి. ఇప్పటికే రెండు మూడు మడ్డర్ కేసులు వున్నయ్. వానితోని ఎందుకు పెట్టుకుంటర్రా. సప్పుడు గాకుండ వదిలిపెట్టుకోండ్రి. దోస్తువు కాబట్టి చెప్తున్న. ఇంకేదున్న ఉంటే చెప్పు చిటికల చేపిస్తʹ అని వాడు ఏదో పెద్ద సాయం చేసినట్లు చెప్పిండు.

***

వాడు చెయ్యలేదనే బాధ ఒకటయితె, అక్కకు ఏమని చెప్పాలన్నది మరొకటి. ఇదే విషయాన్ని ఆలోచిస్తూ నిజాం కాలేజ్ హాస్టల్ కు పోయిన. అక్కడ నా మిత్రునికి, నాకు కలిపి ఒక రూం ఇచ్చారు. కాని నేను ఎప్పుడు అక్కడ వుండేవాణ్ణి కాదు. కాకపోతే హాస్టల్లో లంచ్ చేసి కాసేపు ఆ రూం లో కూర్చొని మిత్రులతో మాట్లాడుకునేది. ఆ రోజు నా చేతిలో వున్న పేపర్స్ చూసి మరో మిత్రుడు ʹఏంటివో పేపర్లు పట్టుకొని తిరుగుతున్నవు?ʹ అని అడగగానే మొత్తం కథంతా చెప్పిన.

అతను వెంటనే ʹఇదేమి దౌర్జన్యం. పోలీస్ కేస్ ఏదైనా పెట్టిండ్రాʹ అని అడిగితే ʹపెట్టలేదు, పెట్టినా వాడ్ని ఏమి చేయలేరనిʹ చెప్పిన.

అతను వెంటనే ʹఅదేంది. ఏమి చేయకపోవడం ఏంటిʹ అని ʹమన మిత్రులతో మాట్లాడుదాంలేʹ అన్నడు.

ఈసారి నాకు అంత ఉత్సహం అనిపించలేదు. ఎందుకంటె అప్పుడే మా పాతబస్తీ దోస్తు చెప్పింది ఇంకా మైండ్ ల ప్రెష్ గా వుంది. ʹఅయినా వాడితోనే కాలేదు, వీళ్ళతోని ఏమయితదిలేʹ అనుకున్న. అందులోనూ నాకు చెప్పిన మిత్రుడు నాలుగు అడుగుల ఎత్తు, బక్క పల్చని రూపం. ఏదో గంభీరం కోసం పెంచిన గడ్డం. కాకపోతే మాటలో మాత్రం ఎదో బలమైన విశ్వాసం వినిపిస్తుంది. సరే ఏ పుట్టల ఏ పాము వుంటదో ఎవరికేం తెలుసులే అనుకున్న.

ఇక అక్కకు విషయం చెప్పక తప్పలేదు. కాకపోతె ʹమరో ప్రయత్నం చేస్తున్న. అది జరిగితె, పని పూర్తయినట్లేʹ అని ఏదో రహస్యం వున్నట్లు లేని పెద్దరికాన్ని తెచ్చుకోని చెప్పిన.

ʹఎప్పుడు తీరుతదో ఈ బాధ. శని ఎప్పుడు వదుల్తదో ʹ అని నా మీద కొంత అపనమ్మకం ప్రకటించినట్లే అన్నది అక్క. అయినా నేను ఏంచెయ్యగలను. నా ప్రయత్నం నేను చేస్తున్న.

వారం రోజుల తర్వాత నా హాస్టల్ మిత్రుడు కనిపించిండు. అతనే వచ్చి ʹఏమైన ముందుకు పోయిందా కేసుʹ అని అడిగిండు.

ʹఏమి లేదు, అట్లనే వుందిʹ అని చెప్పిన. తాను వెంటనే ʹసరే అయితే, మనమే పోయి వాడితోని మాట్లాడుదాంʹ అన్నడు.

ʹమనం మాట్లాడితె అయ్యే పనేనా ఇదిʹ అని మాట ఆపుకోలేక అనేసిన.

ʹఅట్లెందుకు అనుకుంటవు సోదరా. ఎవడి భయాలు వాడికుంటయి. స్టూడెంట్స్ అంటే భయపడుతడోమో. మనకేం తెలుసు. పోగానే సంపడు కదా! ఎందుకట్ల భయపడుతున్నవ్ʹ అన్నడు.

ఆ రౌడీ గాడి గురుంచి విన్న కధలతో నిజంగానే భయంగానే వుంది. న్యాయం అడుగుతున్నామనే ఒక్క విషయం తప్ప. వాడిని ఎదిరించి నిలబడే ధైర్యమైతే నాకు లేదు. కాని ఎట్లైతే అట్లయ్యింది అనుకోని ʹసరే పొదాంʹ అని చెప్పిన.

ʹసరే, ఈ రోజు ఇక్కడె హాస్టళ్ళ పడుకో, పొద్దున్నే ఇద్దరం కలిసి పోదాంʹ అన్నడు.

పడుకోని పోదామనుకున్నాం కాని పడుకొనే అవాకాశమే రాలేదు. ఎడతెగని ముచ్చట్లు. కులం, వర్గం, రాజ్యం, హింస… అన్నింటిని ఒక్క రాత్రిలోనే తేల్చేయాలనంత కసిగా మాటలు. చూస్తుండగానే తెల్లారిపోయింది. మొఖం మీద నీళ్ళు చల్లుకొని బయటపడ్డం.

***

రెండు బస్సులు మారి చివరికి మారుతీనగర్ చేరినం. ఆ గుండాగాడి ఇల్లు నాకు తెలుసు. బయటి నుండి చాలాసార్లు చూసిన. అందుకే బస్సు దిగగానే రెండు నిమిషాల లోపే వాడి ఇంటికి చేరుకున్నం. అప్పటికే వాడి ఇంటి ముందు బైకులు, కార్లు ఆగి వున్నవి. అక్కడికి పోగానే ʹముందు నీవు ఒక్కడివే వెళ్ళి మాట్లాడిరా. అవసరం అయితే నేను లోపలికి వస్తʹ అని నాతో వచ్చిన మిత్రుడు అనే సరికి నాకు ఇంకా భయం ఎక్కువయ్యింది.

ʹఒక్కడినే ఎందుకు. ఇద్దరం పోదాం రాʹ అని బ్రతిమిలాడినట్లే అడిగిన.

ʹనీకు తెల్వదు సోదరా. నువ్వైతే పొయిరా. నీకు అన్నీ తర్వాత చెప్తగానిʹ అని ఎదో పెద్ద ప్లాన్ వున్నట్లు చెప్పిండు.

ʹఇక్కడిదాక వచ్చి తర్వాత చెప్త అనుడేందిʹ అని మనసులోనె అనుకున్న. ʹఅయినా సమస్య మావాళ్ళది కాబట్టి నేనే పోత. ఏమన్నగానిʹ అనుకోని వాడి ఇంటి మైన్ డోర్ దగ్గరికి పోయిన.

పెద్ద హాల్ లో గోడలకు ఆనిచ్చి వేసిన కుర్చీలల్ల ఒక పది మంది కూర్చొని వున్నరు. ఒకవైపుకు పెద్ద కుర్చీ, టేబుల్ వేసుకొని ఒక పెద్ద ఆకారం అయ్యప్ప మాల వేసుకుని కూర్చొని వుంది. ʹబహుశా వీడేనేమో ఆ రౌడి. మంచిదయ్యింది మాల వేసుకొని వున్నడు. ఇప్పుడయితె తిట్టడు, కొట్టడులేʹ అని మనసుల అనుకోని లోపలికి పోయి ఒక చివరన ఖళీగా వున్న ఒక కుర్చీలో కూర్చున్న. అక్కడ అందరు సీరియల్ నంబర్ తీసుకున్నట్లు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతుండ్రు. కొందరేమో వాడి భాదితులు; ఇంకొందరేమో వాడి సాయం కోసం వచ్చినోళ్ళు. అయినా అందరి టోన్ ధీనంగ అడుకున్నట్లే వున్నయి. ఆ సీన్ చూస్తుంటె అప్పటికే సిన్మాలల్ల చూసిన దృశ్యాలు గుర్తుకొస్తున్నయి.

నా వంతు రావడానికి ఇంకా కొంత టైం పట్టేట్లుగా వుంది. వాడితో ఏమి మాట్లాడాలో లోపల లోపల ప్రాక్టీస్ చేసుకుంటున్న. వాడు మిగితా వాళ్ళతో మాట్లాడుతూనే మద్యమద్యలో నావైపు ʹవీడెవడొ కొత్తోడు వచ్చిండుʹ అన్నట్లు చూస్తుండు. నీను కూడ అమాయకంగా, ధీనంగా చూపులు కలుపుతున్న.

చివరికి అందరి వంతు అయిపోయి వెల్లిపోయిండ్రు. వాడితో ఎప్పుడు వుండె ఒక ముగ్గురు తప్ప.

ʹచెప్పు…ఎవరు నువ్వు. దేనికొచ్చినవ్?ʹ అని గద్దాయించి అడిగిండు.

ʹఅన్నా, మావోళ్ళ జాగను మీ మనుషులు కబ్జా పెట్టిండ్రు. అది మాట్లాడనీక వచ్చినʹ అని తడబడుతూనే చెప్పిన.

ʹమావోళ్లు ఎందుకు కబ్జా పెడ్తరు. అట్లాంటి పని చేస్తోళ్ళు నా దగ్గర ఎవ్వరు వుండరు. అయినా ఏ జాగనో చెప్పుʹ అనగానే వెంటనే ఆ ప్లాట్ వివరాలన్నీ చెప్పిన.

ʹఅది నాదే. కబ్జా ఎందుకు అంటున్నవ్ʹ అని కొంచం స్వరం పెంచిండు.

ʹఅన్నా, మా దగ్గర అన్ని పేపర్లు వున్నవి. కావాలంటె తెచ్చి చూపిస్తన్నʹ అని చెప్పిన

ʹనా పేపర్లు నా దగ్గర వుండగా, నీ పేపర్లు నాకెందుకు. ఇక పో. నీకు దిక్కున్న కాడ చెప్పుకోపోʹ అని లేసి పోబోతుంటె

ʹపౌర హక్కుల సంఘపోళ్ళకి పొయ్యి చెప్పుకుంటʹ అని సడన్ గా అనేసిన. బహుశా ఆ రాత్రి మాట్లాడిన మాటల ప్రభావం కావచ్చు. ఆ సంఘం పని, పరిధి అవేవి ఆలోచించలేదప్పుడు. నోటికొచ్చింది అనేసిన.

ఆ మాట వినగానే ʹచెప్పుకోపో. నాకు బాలగోపాల్ తెలుసు. హరగోపాల్ తెలుసు. వరవరరావ్ తెలుసు. ఎవ్వరికైనా చెప్పుకోపోʹ అని చాలా ధీమాగా చెప్పిండు.

నా మాట మిస్ ఫైర్ అయ్యిందన్న సంగతి అర్థమయ్యింది నాకు. ʹసరే అన్నా… వస్తా మరిʹ అని చెప్పి లేసి వస్తుంటె వాడు మాల వేసుకోని కూడ గుర్రున చూస్తుంటె నిజంగనే భయమయ్యింది. ఒక్క గంతున వాడి ఇంటి గేటు దాటిన.

***

నాకోసం బయట ఎదురు చూస్తున్న మిత్రుడు ఎదురొచ్చి ʹఏమన్నడు?ʹ అని ఆతృతగా అడుగుతుంటె ʹచెప్త ఆగుʹ అంటూ వాడి ఇంటికి దూరంగా నడుచుకుంటూ ముందుకు పోయిన. కొద్ది దూరం పోయినంక జరిగిందంతా చెప్పిన.

ʹసరే ఏమి ఫికర్ చెయ్యకు. ఎట్లన్న ఏదో ఒకటి చేద్దాంʹ అన్నడు.

ʹఅయినా చెయ్యడానికి ఇంకేముందిలేʹ అని అనుకుంటున్నప్పుడె, అతనే అడిగాడు ʹవాడేమన్నడు వరవరరావ్ సార్ తెలుసన్నడా?ʹ

ʹఅవును. అయితే?ʹ అని బదులిచ్చిన

ʹఏమిలేదు సార్ దగ్గరికి పోయి మాట్లాడితె ఎట్లుంటదని …ʹ ఎదో ఆలోచిస్తున్నట్లు చెప్పిండు.

సార్ ను మా నిజాం కాలేజ్ ఎదురుగా వున్న ప్రెస్ క్లబ్ లో చాలాసార్లు మీటింగుల్లో చూసిన. కాని ఎలాంటి పరిచయం లేకుండ ఎట్లా అడుగుతాం అని ఆలోచిస్తుండగానే, ఆ మిత్రుడే ʹసార్ తో పరిచయం వున్న కొందరు మిత్రులు వున్నరు. వాళ్ళతో ట్రై చేద్దాంలేʹ అని అన్నడు.

ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్లే అనిపించింది నాకు. కాని బయటకు అనలేదు.

ʹఒకవేళ ఆ మిత్రులు సార్ దగ్గరికి తీసుకొని పోతే కనీసం సారును కలిసినట్లైనా వుంటదిʹ అని అనుకోని ʹసరే సారును కలిశే వీలయితదేమో తెలుసుకోʹ అని చెప్పిన. ఇక అక్కడి నుండి నేను మా రూం కి పోయిన, ఆ మిత్రుడు హాస్టల్ కు పోయిండు.

***

అతను ఎవరితో మాట్లాడిండో తెలియదు కాని, ఒక వారం రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటు నీను హాస్టల్ మెస్ లో వున్నప్పుడు వచ్చి ʹమన మిత్రుడు సార్ ను కలిసి విషయం చెప్పాడట. నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళి కలువు. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాబట్టి పొద్దున్నే ఆరు వరకు సారు ఇంటి దగ్గర వుండేటట్లు ప్లాన్ చేసుకోʹ అని చెప్పిండు.

అతను ʹపరిస్థితులుʹ అనే సరికి అప్పుడప్పుడె గద్దర్ మీద గ్రీన్ టైగర్స్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేసిన దాడి, హక్కుల సంఘాల నాయకులకు, కార్యకర్తలకు చంపేస్తామని వస్తున్న బెదిరింపులు రోజూ పేపర్లలో చదువుతున్నవి గుర్తుకొచ్చినయి.

కాని అతను సార్ ను కలవమని చెప్పినప్పటి నుండి ఎప్పుడు చీకటయి, ఎప్పుడు తెల్లవారుతదా అని ఆతృత మొదలయ్యింది. ఆ రోజు హాస్టల్ లోనే వుండి అక్కడి నుండే పోవాలని అనుకోని అక్కడే వుండిపోయిన.

***

పొద్దున్నే ఐదు గంటలకే లేసి సార్ వుండే మలక్ పేట కు బయలుదేరిన. పొద్దున్నే ట్రాఫిక్ అంతగా లేకపోవడంతో ఐదున్నర వరకే మలక్ పేటలో దిగిన. సార్ వుండే లక్ష్మీఅపార్ట్ మెంట్ బస్ స్టాండ్ కి దగ్గరే కాబట్టి వెంటనే అక్కడికి పోయిన.

అది చంద్రబాబు రాజ్యం నెత్తుటి ఏరులు పారిస్తున్న కాలం కాబట్టి ఎక్కడకి పోవాలన్నా, ఎవరిని కలవాలన్నా భయపడే పరిస్థితి. సారు ఇంటి చుట్టు నిఘా ఉంటదని ఎవరో చెప్పగా విన్న కాబట్టి అక్కడికి పోగానే ఏదో వణుకు మొదలయ్యింది. ఎందుకైన మంచిదని అక్కడక్కడె ఒక పది నిమిషాలు తిరుగుతూ గడిపిన. పావుతక్కువ ఆరుకి అపార్ట్ మెంట్ లోకి పోయి సారు వుండే ఫ్లాట్ 203 డోర్ కొట్టిన. డోర్ కు ముందు గ్రిల్ పెట్టివుంది. రాజ్య హంతక మూఠా గ్రీన్ టైగర్ల కాలమది. కనీస జాగ్రత్తలు అవసరం కదా అనుకుంటుండగానే డోర్ తీస్తున్న శబ్దం వినిపించంది.

సారే డోర్ ఓపెన్ చేశారు. సారు ఎదో అడగబోతుండగానే నన్ను ఎవరు పంపారో చెప్పాను. ఎందుకంటే ఎవరు ఏ రూపంలో వచ్చేది తెలియని రోజులు అవి. కాబట్టి ముందే డౌట్ క్లియర్ చేస్తే బాగుంటదని చెప్పిన. నేను చెప్పింది విన్న సారు ʹఇంత ఎర్లీగా పొమ్మని చెప్పిండ్రా?ʹ అన్నడు.

ʹఅంటే…పొద్దున్నే పోతే బాగుంటదని చెప్పిండ్రనిʹ కొంత తడబడుతూనే చెప్పిన. కాని సార్ అట్లా అనగానే నాకు మనసు చివుక్కుమంది. నిజమే కదా ఇంత పొద్దున్నే పోకూడదని అసలు తట్టనే లేదు. అన్నింటికి మించి అదేదో రహస్య పని చేస్తున్నం అనే ఒక ఫీలింగ్ నాకు, నన్ను పంపిన మిత్రునికి వుండటం కూడ మా అత్యుత్సాహానికి ఒక కారణం.

ʹసరే, లోపలికి రాʹ అని సారు గ్రిల్ , డోర్ ఓపెన్ చేశాడు.

లోపలికి వెళ్ళి సారు ఎదురుగా కుర్చీలో కూర్చున్న. సారు ʹఏంటి విషయంʹ అన్నట్లు చూస్తున్నట్లు అనిపించి భూమి కబ్జా సంగతి మొత్తం చెప్పిన. నేను చెప్పేది అంతా జాగ్రత్తగ విన్నాడు.

ʹనేను అతనికి తెలుసు అని చెప్పడాంటె, పేపర్లో, టీవీలలో వచ్చే వార్తల ద్వారా తెలిసుండొచ్చు. అంతే కాని అతని గురుంచి నాకయితె పెద్దగా తెలియదుʹ అని సారు అనగానె ʹకాని మీరు ఒక మాట చెప్తే వినొచ్చు సారుʹ అని చెప్పి మరోసారి మా అక్క పరిస్థితి గుర్తుచేసిన.

ʹవాడు పెద్ద గుండా అయినప్పుడు నేను చెప్తే వింటడని ఎట్లనుకుంటున్నవ్?ʹ అని అనే సరికి ʹవింటుండొచ్చు సార్. వాడే మీరు తెలుసు అన్నడుʹ అని ఎట్లయినా సార్ తో మాట్లాడించాలని చెప్పిన.

వెంటనే ʹవ్యక్తిగత భూమి తగాదాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. కాకపోతె అతను నేను తెలుసు అంటుండు కాబట్టి, అందులో ఒక మహిళకు అన్యాం చేస్తుండు కాబట్టి అతను వస్తానంటె ఇక్కడికి తీసుకొచ్చినా లేదా ఫోన్ చేయించినా భూమి దురాక్రమణ చేయడం సరైనదు కాదు అని ఒక మాట చెప్పగలనుʹ అని సార్ అనేసరికి నాకు అంతులేని సంతోషం అయ్యింది.

ʹసార్ మీ నెంబర్…?ʹ అని అడగానే పక్కనే వున్న ఒక పేపర్ మీద తన నెంబర్ రాసి ఇచ్చాడు.

మీము మాట్లాడుతుండగానే సార్ సహచరి హేమలతక్క చాయ్ తెచ్చి ఇచ్చింది. ʹసార్ తో మాట్లాడడానికి ఇంకొంచం టైం దొరికిందిలేʹ అనుకున్న చాయ్ కప్పు తీసుకుంటు.

సార్ చాయ్ తాగుతు నేనేమి చదువుతున్న విషయాలు అడుగుతూ ʹకవిత్వం కాని, కథలు కాని రాసే, చదివే ఇంటెరెస్ట్ వుందా?ʹ అని అడిగాడు.

ʹరాయడం లేదు కాని చదువుత సార్ʹ అని చెప్పిన. వాస్తవానికి కవిత్వం అనుకోని ఎదో రాసే వాడినే కాని సార్ తో చెప్పుకునే కవిత్వం కాదని రాయనని చెప్పిన.

సార్ చాయ్ తాగడం అయిపోగానే లేసి పక్కనే వున్న రూం లోకి పోయి ఒక్క నిమిషం తర్వాత పది పుస్తకాలు పట్టుకొని వచ్చిండు.

ʹనువ్వు భూమి సమస్యతో వచ్చావు, కాని నా దగ్గర భూమిని విముక్తి చేసే సాహిత్యం మాత్రమే వుంది. ఇంటెరెస్ట్ వుంటె చదువుʹ అని ఆ పది పుస్తకాలు నా చేతికిచ్చిండు. సారు ఇచ్చిన పుస్తకాల పేర్లు అక్కడె టకాటకా చూసిన. అవన్నీ తెలుసు కాని కొని చదివే పరిస్థితి నాకు లేదు. ఆ పుస్తకాలు పట్టుకొని పోవడానికి ఒక కవర్ కూడ సారే తెచ్చి ఇచ్చిండు. ఆ బుక్స్ కవర్లో పెట్టుకొని, సారుకు థాంక్స్ చెప్పి, ʹమల్లొచ్చి కలుస్త సార్ʹ అని చెప్పి బయటకు వచ్చేసిన.

***

అక్కడి నుండి సక్కగ మా రూం కి పోయి సార్ ఇచ్చిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన. మూడు రోజులు ఎక్కడికి పోలే, మరో పని చేయలే. ఒకదాని తర్వాత ఒకటి చదువుతూనే వున్న. వస్తవానికి ఆ మూడు రోజులు భూమి సమస్య గురుంచి కూడా మరిచిపోయిన.

నాలుగో రోజు హాస్టల్ కు పోతే అక్కడ నన్ను సార్ దగ్గరికి పంపిన మిత్రుడు కలిసి ʹఏం సోదర జాడా పత్తా లేవు. ఏమయింది? సారును కల్సినవా? ఏమన్నడు?ʹ అని ప్రశ్నలు అడుగుతూనే వుండు. ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాక జరిగింది అంతా చెప్పిన. మొత్తం విని ఆ మిత్రుడు ʹఅయితె ఇంకేంది. వాడి దగ్గరికి పోయి మాట్లాడు. సారు చెప్పింది చెప్పు. చూద్దాం ఏమంటడోʹ అని చెప్పిండు.

***

ఆ మరుసటి రోజు పొద్దున్నే మారుతినగర్లో వాడి ఇంటికి పోయిన. ఎందుకో ఈసారి భయం లేదు. వాడితో ఏం చెప్పాలో క్లారిటీ వుంది. హాల్లోకి వెల్లగానే వాడెదో దర్బార్ నడిపిస్తుండు. ఒక పది నిమిషాలు అక్కడ జరిగే తంతు అంతా చూస్తూ కూర్చున్న. ఎప్పుడు మొదలయ్యిందో తెల్వదు కాని, తొందరగనే అయిపోయింది. ఎవరినో బెదిరించి పంపిస్తుండు. ʹనన్ను కాదని నకరాలు చేస్తే నూకలు చెల్లిపోతయనిʹ చివరి మాటగా చెప్పి వాళ్ళను పంపించిండు.

వాళ్ళు పోగానే ʹఏం తమ్మి మల్లొచ్చినవ్? చెప్పిన కదా, ఆ జాగ నాదేనని…ʹ అంటూ ఇంకెదో చెప్పబోతుంటె ʹవరవరరావ్ సార్ ను కలిసిన. మీ గురుంచి చెప్పినʹ అని ఒకింత గట్టిగనే చెప్పిన.

ఒక్కసారిగా హాల్ లో ఇంకా వున్న కొందరి వైపు చూసిండు. వాళ్ళు మావైపే చూస్తుండ్రు. సడన్ గా అలర్ట్ అయినట్లు అనిపించింది.

ʹనువ్వు నాతో రాʹ అని లేసిండు. ఎక్కడికో అర్థం కాలేదు నాకు. కుర్చీలోంచి లేసిన కాని ఇంకా కదలలేదు.

ʹనడువు, పైకి పోయి మాట్లాడుదాంʹ అని కొంచం కటువుగానే అన్నడు.

అప్పుడు కాస్త భయమయ్యింది. ఎందుకంటె వాడు ఇంట్లో కూడ మర్డర్ చేసిండని అందరు చెప్పుకుంటరు. కాకపోతె నాకు వున్న దైర్యం ఒక్కటే, వాడు మాల వేసుకొని వున్నడు కదా కనీసం దేవునికైనా భయపడడా అని.

నాకు వేరే మార్గం లేదు. వాడితో మూడో అంతస్థుకు పోయిన. అక్కడ వాడి దేవుడి గది ఉంది. అదీ పెద్దగనే వుంది. చుట్టూ గోడలకు పెద్ద పెద్ద దేవుండ్ల పటాలు వున్నవి. ఒక వైపు కృష్ణుడిది పెద్ద విగ్రహం వుంది. అక్కడికి పోయాక ʹఇప్పుడు చెప్పుʹ అన్నడు.

ʹఅదే అన్న, వరవరరావ్ సార్ తెలుసన్నవ్ కదా. సార్ తో మాట్లాడిన. సార్ కు నువ్వు ఎవరో తెల్వదట. కాకపోతె, నువ్వోచ్చినా లేదా ఫోన్ చేసినా మట్లాడుత అన్నడు. సార్ నెంబర్ కూడా రాసి ఇచ్చిండుʹ అని సార్ ఇచ్చిన పేపర్ జోబ్ లో నుండి తీసి వాడి చేతికి ఇవ్వబోయిన.

వాడు వెంటనే నా చేతులు పట్టుకొని ʹతమ్మీ, దేవుని మీద ఒట్టేసి చెప్తున్న. నేను అంత పెద్దోన్ని కాదు. నన్ను వదిలేయిʹ అనే సరికి నాకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

ఎప్పుడు నిప్పులు చిమ్మే వాడి కళ్ళలో భయం కనిపించంది. వాడి కరుకు గొంతులో విధేయత వినిపించింది. ఎక్కడో చదివిన కాగితం పులి కండ్ల ముందు మెదిలింది. ఆ క్షణం తర్వాత కాని నాకు సీన్ మొత్తం అర్థం కాలేదు. ఇక అప్పుడు చూడాలి వాడి ముందు నా స్థాయి. నాకు నేనే వాడి కంటే ఎత్తు, పొడువు అగుపిస్తున్న. ఎంత బలమొచ్చిందో. ఆ అర క్షణం లోనే బక్క పలచటి సారుకా వీడు ఇట్లా వణికిపోతుంది అనుకున్న. బహుశా, అది ఆయన నమ్మిన, ఆచరిస్తున్న రాజకీయాల బలం అనిపించింది.

ʹసరే కాని, మరి జాగ సంగతి?ʹ అని కాస్త గట్టిగనే అడిగిన.

ʹఅది మీదే తమ్మి. మా పోరాగాళ్ళు ఖాళీగా వుందని కబ్జా పెట్టిండ్రు. మీరు రేపటి నుండె బేఫికర్ గ ఇల్లు కట్టుకోండిʹ అని మాట ఇచ్చిండు.

చివరికి ఆ భూమి విముక్తయ్యింది.

****

ఆ భూమి విముక్తి స్వాప్నికుడు ఇప్పుడు అక్రమ బంధీ అయి వున్నాడు. మారుతీనగర్ గుండా మాదిరిగానే గుండా రాజ్యం కూడా బయపడి ఆయనను, ఆయన తోటి సహచరులను బంధీ చేసింది. కాని పాలకుడికి అర్థం కానిదేమంటే ఆయనను అండా సెల్ లో కాదు కదా కొండకు శిలువేసినా ఆయన భూమితో నిరంతరంగా మాట్లాడుతూనే వుంటాడు. ʹ మేధావులారా! బ్రమలు వీడండి. నా కోసం వచ్చినోడు, మీ కోసం రాడని అనుకోకండి. వాడి లక్షం ఒక్కటే: భిన్న స్వరాలు లేని అఖండ భారతం. వాడి కల సాకారం కోసం ఎందరి కలలనైనా రద్దు చేయడానికి సిద్దమయినోడు. ఏక గొంతు నిర్మాణం కోసం ఎన్ని గొంతులయినా నొక్కేయగలడు. వాడు నీ కోసం రాక ముందే స్వరం పెంచు. పిడికిలెత్తుʹ అంటూ నినదిస్తూనే వుంటాడు.

- అశోక్ కుంబము

Keywords : varavararao, virasam, maoists
(2020-07-04 00:47:42)No. of visitors : 1395

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
more..


నేల