ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1


ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1

ఎన్నికలపై

ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని.. ప్రజాస్వామ్యం అంటే ఓట్లు - సీట్లు పంచుకునే ఎన్నికలుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో ఆయన రెండు లేఖల ద్వారా తన ఇంటర్వ్యూను మీడియాకు అందించారు. ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ఇంతకు మునుపే ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎందుకు బహిష్కరించాని పిలుపునిచ్చారని అడుగగా.. ఎన్నికల్లో ప్రజలు ఎవరూ స్వచ్చందంగా ఓట్లు వేయడం లేదని.. డబ్బులు కుమ్మరించి, ప్రలోభాలు పెట్టి, ప్రజలకు మోసపుచ్చే వాగ్దానాలు చేస్తున్న ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో లాబీయింగ్ రాజకీయాలు నడిపిన కేసీఆర్.. ఆ తర్వాత కుటుంబ పాలన నడిపాడు. తన కుటుంబ పాలనను మరో ఐదేళ్లు పొడిగించుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ఆయన విమర్శించారు. ఈ ముందస్తు ఎన్నికలను, ఆపద్దర్మ ప్రభుత్వాన్ని మావోయిస్టు పార్టీ అసలు సమర్థించడం లేదన్నారు.

రైతు బంధు ద్వారా కేవలం 20% భూస్వామ్య ధనిక రైతాంగానికి, పై మధ్యతరగతికి, భూములు ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వ ఖజానా నుండి ప్రజల డబ్బు దోచిపెట్టారు. ఇది రైతుబంధు కాదు. కేసీఆర్‌ వర్గబంధు పథకమని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశం లేకే పొత్తులు కుదుర్చుకుందన్నారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చినా ప్రజలకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో టీడీపీ పట్ల వ్యతిరేకత ఉంది అది ఇప్పటికీ ఏమీ తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా గాయకుడు గద్దర్‌ విప్లవ బాటను వీడి స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్లమెంటరీ పంథాలోకి మారాడు. ఆ భ్రమల లోకంలోకి తటస్థంగా ఉన్న శక్తుల్ని తరలించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. విప్లవ బాటను వదిలి బ్యాలెట్‌ బాట పట్టిన గద్దర్‌ కైనా, ఇంకెవ్వరికైనా ఓటు వెయ్యవద్దని, ఎన్నికలను బహిష్కరించమని చెపుతామని ఆయన స్పష్టం చేశారు.

పూర్తి ఇంటర్వ్యూ పార్ట్ 1

1. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల గురించి మీరేమనుకుంటున్నారు. ఎన్నికలను బహిష్కరించాలా? టీఆర్‌ఎస్‌ను ఓడించాలా?

తెలంగాణ రాష్ట్రంలో వేగంగా మారుతున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలను, బలపడుతున్న ప్రతిపక్షాన్ని చూసి భయపడిన కేసీఆర్‌ పడవ పూర్తిగా మునగక ముందే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నినాదాలనే ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసాడు. ప్రజల మౌలిక సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాడు. కుల ప్రాతిపదికన ఏవో కొన్ని పథకాలు చేపట్టి ఓట్లు సంపాదించడానికి కొన్ని జిమ్మిక్కులు నడిపాడు. అవినీతి, అక్రమాలు, దురహంకారంతో ప్రజావ్యతిరేకంగా, నియంతృత్వ ధోరణితో నాలుగున్నర సం||రాలు పరిపాలించిన కేసీఆర్‌పై మధ్యతరగతి ప్రజలకు కూడా భ్రమలు తొలగిపోయాయి. ప్రజాగ్రహం మరింతగా సంఘటితం కాక ముందే ఇల్లు చక్కబెట్టుకోవాలని, మరో ఐదేళ్ళ కుటుంబ పాలనను గెలుచుకోవలని తాపత్రయంతో, కుటిల ప్రయత్నంలో భాగంగా మోదీ ఆశీస్సులతో ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డాడు.

ఈ ఎన్నికలే బూటకమని, ఈ వ్యవస్థను మార్చేందుకు ఈ ఎన్నికల విధానం సరిపోదని, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారంకోసం ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాము. ఒక్క టీఆర్‌ఎస్‌నే కాదు అన్ని పార్లమెంటరీ పార్టీలను వ్యతిరేకించమని, ఓడించమని, విప్లవ మార్గం చేపట్టమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

2. రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు పేదలకు మంచివేనా?

రైతుబంధు పథకం అమలు జరిగిన తీరు చూస్తే కేసీఆర్‌ ఏ వర్గ ప్రయోజనాలు నెరవేర్చాలనుకుంటున్నాడో స్పష్టం అయ్యింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న 75% రైతాంగం భూమికి పట్టాలు లేని వారే. ఉన్నా అరా కొరా భూములున్నవారే. కౌలు రైతులకు, పోడుచేసుకునే వారికి ఉపయోగపడలేదు. కేవలం 20% భూస్వామ్య ధనిక రైతాంగానికి, పై మధ్యతరగతికి, భూములు ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వ ఖజానా నుండి ప్రజల డబ్బు దోచిపెట్టారు. ఇది రైతుబంధు కాదు. కేసీఆర్‌ వర్గబంధు పథకమని తేటతెల్లమయింది. ఆసరా పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులకన్నా ఇంకా అందాల్సినవాళ్ళే అనేక రెట్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అండదండలుండి ప్రభుత్వ ప్రాపకం సంపాధించిన వారికే ఇవి లభించాయన్నది సత్యం. లెక్కల గొప్పలే తప్ప ఆసరా అందింది తక్కువే. ఆసరా లేని వారికి ఈ ప్రభుత్వం నమ్మకం కల్పించలేదు. కళ్యాణ లక్ష్మి, షాధీ ముబారక్‌ల కోసం ఖర్చుచేసిందాని కన్నా ఈ పథకాల ప్రచార ఆర్భాటాలకు వెచ్చించిందే అత్యధికం.

తెలంగాణలో పేదరికం రూపుమాపేందుకు, పేదలకు సహకారాన్ని అందించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసామని కేసీఆర్‌ చెపుతున్నాడు. ఆంగ్ల దినపత్రిక ʹఎకనమిక్‌ టైమ్స్‌ʹ బ్యూరో ప్రతినిధి సీఆర్‌ సుకుమార్‌కు కేసీఆర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో వంద శాతం ఎన్నికల ప్రణాళికను అమలుచేసామని, మ్యానిఫెస్టోలో లేని 76 పథకాలను అందించామని కల్లబొల్లి కథలు చెప్పాడు. సంస్కరణలు అంటేనే అసలు సమస్యలు పరిష్కరించలేక పక్కదారి చూపే ఒక సౌలభ్యం అని అందరికీ తెలుసు. సంస్కరణలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత పెద్ద ఎత్తున పేదరికం, అసమానతలు ఉన్నాయని చెప్పకనే చెప్పడం. మరో మాటలో పేదరికాన్ని శాశ్వతం చేసి సంస్కర్తగా ఫోజ్‌ కొట్టడం. ఇదే పార్లమెంటరీ రాజకీయాల్లో అందరూ అనుసరిస్తున్నది. ప్రజల సంపదను దోపిడీ పాలకవర్గాలు పంచుకు తింటూ, పీడిత ప్రజలు ఉద్యమించకుండా జోకొట్టేవే ఈ పథకాలన్నీ. కనీసం వాటిని అమలుచేసే దానిలో వీరికి చిత్తశుద్ధి లేదు. ఈ పేరుతో ప్రజల మధ్య పోటీ పెంచి క్రింది స్థాయిలో తమ పార్టీ బలాన్ని పెంచుకుంటున్నారు.

3. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పేరుతో వస్తున్న మహాకూటమి పట్ల మీ అభిప్రాయం ఏంటి?

కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది. అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు, సామ్రాజ్యవాద అనుకూల విధానాలు కారణంగా దేశాన్ని, రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసి, ప్రజల అసహ్యానికి గురయ్యింది. ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రులకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగానే పరిపాలించింది. చంద్రబాబునాయుడు ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా, అవినీతికి మారుపేరుగా వర్థిల్లిన విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ సాయుధ పోరాటానికి ద్రోహం చేసిన సీపీఐ నాయకత్వం పార్లమెంటరీ ఎన్నికల మార్గాన ఏదో ఒక దోపిడీవర్గ పార్టీకి మద్దతు నిస్తూ, అవకాశవాద రాజకీయాలను నడుపుతున్నది. కొత్తగా ఆవిర్భవించిన కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఉద్యమ కాలంలో, ఆ తర్వాత ప్రజల సమస్యల పట్ల నిజాయితీగా ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల భ్రమలు కారణంగా నిన్న టీఆర్‌ఎస్‌ను, ఇవ్వాల కాంగ్రెస్‌ను అధికారంలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి, ప్రజాస్వామ్య తెలంగాణ సాధనకు పోరాడుతున్న ఉద్యమ శక్తుల నుంచి కోదండరాం దూరమయిపోయాడు. ఇటువంటి శక్తులతో కూడిన మహాకూటమి టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కావచ్చు. కానీ ప్రజలకు ఈ కూటమి వలన మరో దుష్టపాలనే తప్ప ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్‌, టీడీపీల గత చరిత్ర అంతా సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య అనుకూల విధానాలే తప్ప మరొకటి కాదు.

4. కేంద్ర నాయకత్వ మార్పు నిజమేనా? రాష్ట్ర నాయకత్వంలో కూడా మార్పులు జరిగాయా?

మా పార్టీ కేంద్ర నాయకత్వంలో మార్పులు జరగడం నిజమే. రాష్ట్ర నాయకత్వాల్లో కూడా మార్పులు జరిగాయి. జరుగుతాయి. ప్రజల మధ్య ప్రజాస్వామికంగా పనిచేసే రాజకీయ పార్టీ ముఖ్యంగా కార్మికవర్గ రాజకీయాలతో ఉన్న కమ్యూనిస్టు పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగడం, నూతన నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలానే సీపీఐ మావోయిస్టులో కూడా అటువంటి ఎన్నిక, మార్పు జరగడం సహజం. అయితే ఏ మార్పునైనా ఆ కమిటీలో ఎంతవరకు బహిర్గతం చేయాలో ఆ మేరకే ప్రకటించడం జరుగుతుంది. రహస్య పార్టీ అందునా నిషేధిత పార్టీ తన నాయకత్వ శక్తుల్ని బహిర్గతం చేసుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడదు. పార్టీ నిబంధనావళి అంగీకరించదు.

5. విశాఖలో ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమెల్యే హత్యలను సమర్థించుకుంటున్నారా?

మా పార్టీ ఏఓబీ ఎస్‌జెడ్‌సీ నవంబరు 2న విడుదల చేసిన ప్రకటనలో ʹʹబహుళజాతి సంస్థలకు ఏజెంట్లుగా మారి, కోట్లాది రూపాయల ఆదివాసీల సహజ సంపదను కొల్లగొడుతున్నందునే ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమెల్యే సివేరి సోమను హతమార్చామనిʹʹ వివరించింది. క్వారీ యజమానులుగా, అరకు, అనంతగిరి, పాడేరు, విశాఖలో ఆస్తుల్ని, భూముల్ని అక్రమంగా గడించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు సాగిస్తూ, బాక్సైట్‌ వెలికితీత కోసం జిందాల్‌, రస్‌అల్‌ఖైమా, అన్‌రాక్‌లకు ఏజెంట్లుగా వ్యవహరించి అక్రమంగా డబ్బు వెనకేసుకున్నారు. సివేరి సోమ ఎమెల్మేగా కొనసాగిన కాలంలో డుంబ్రిగుడ మండలం కండ్రుం గ్రామాల ప్రజలంతా ఏకమై వెంటబడి తరిమారు. సర్వేశ్వరరావు క్వారీని మూసెయ్యాలనే డిమాండ్‌తో హుకుంపేట మండలం గూడ గ్రామ ప్రజలు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికార అండతో ఏ మాత్రం ఖాతరు చెయ్యలేదు. వీరిద్దరు మెజారిటీ ప్రజల ఆగ్రహానికి గురైన కారణంగా ప్రజావ్యతిరేకుల్ని, ద్రోహులను అంతం చెయ్యాలనే ప్రజల నిర్ణయాన్నే పీఎల్‌జీఏ అమలు చేసింది.

6. తెలంగాణలో ప్రజాకర్షక పథకాల ప్రచారం తప్ప, సమస్యలు అలాగే ఉన్నాయని అంటున్నారు. పార్టీ కార్యకలాపాలు తెలంగాణలో ఎలా ఉన్నాయి?

పథకాల కోసం విడుదలైన డబ్బుల్లో ఒక ప్రధానమైన భాగాన్ని వాటి ప్రచారం కోసం, ప్రజలను మాయ చేయడం కోసం వినియోగిస్తున్నారన్నది నిజం. అలాగే పథకాలు అమలులో అవినీతి, అవకతవకలు కారణంగా లబ్ధిదారులకు చేరుతున్నవి అతి తక్కువేనని తెలిసిందే. ఆ పథకాల పేరుతో క్రింది స్థాయిలో పార్టీని బలపరుచుకోవడం, తమ అనుకూలమైన వారికి, క్రింది శ్రేణి నాయకత్వానికి ఈ అవినీతిలో వాటాలిచ్చి వారు ఆర్థికంగా బలపడడం చేస్తున్నారు. పెద్ద మొత్తాలు ప్రధాన నాయకత్వమే పంచుకు తింటున్నారు. ఆ విధంగా పథకాలు పేరు చెప్పి లాభపడుతున్నది టీఆర్‌ఎస్‌ నాయకత్వమేనన్నది స్పష్టమే.

మా పార్టీ నాయకత్వంలో బూటకపు సంస్కరణలు, రాజకీయ పథకాల, కుతంత్రాన్ని, ఆర్థిక అవినీతికి వ్యతిరేకంగా వివిధ రూపాలలో రాజకీయంగా బహిర్గతం చేయడంతో పాటు, ప్రజలను మౌలిక సమస్యలకోసం (భూమి, ఉపాధి లాంటి) పోరాటడేలా, ఉద్యమించేలా చైతన్యపరుస్తున్నాం. వివిధ సెక్షన్ల ప్రజలు సంఘటితమై ఈ పథకాల అమలులో ఉన్న అవినీతిని బహిర్గతం చేస్తున్నారు.

7. తెలంగాణలో కదలికలు కష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. పోలీస్‌ శాఖ నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉందనే ప్రచారం నిజమేనా?

తెలంగాణ ప్రాంతంలో మా పార్టీ నాలుగు దశాబ్దాల కాలం పునాదివర్గాల్లో పనిచేసి విప్లవోద్యమ వెల్లువను సృష్టించింది. వరంగల్‌లో 1990లో జరిగిన రైతుకూలీ సంఘం మహాసభలకు 15 లక్షల జనాన్ని సమీకరించిన విషయం అందరికీ తెలుసు. (అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం, డబ్బు ఉపయోగించి ఎంత ప్రయాసపడినా అంతటి సమీకరణ చేయలేకపోయింది) భూస్వాముల భూములను ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా పంచాయితీలు నిర్వహించడం, దళితుల, ఆదివాసీల, సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేపట్టడం. ర్యాడికల్‌ విద్యార్థి, యుజనోద్యమాలు బలంగా నడిచాయి, సింగరేణి కార్మికుల వీరోచిత పోరాటాలు, మహిళల, మైనారిటీల హక్కుల ఉద్యమాలు, రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలనే ప్రభావితం చేసేంతగా వర్గ పోరాటాన్ని ఇక్కడ నడపగలిగాము.

ఇప్పుడు ఉద్యమం బలహీనపడి కదలికలు కష్టంగా ఉన్న మాట నిజం. నిర్బంధం తీవ్రతరమైన మాట నిజం. మాపై ఒత్తిడి అధికంగానే కొనసాగుతుంది. రాష్ట్రంలో పౌరహక్కులకు, ప్రజాస్వామిక విధానాలకు అవకాశం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక విప్లవ కార్యకలాపాలు రహస్యంగా, చాపకింద నీరులా నడుస్తున్నాయి. మా ఉద్యమం నివురుగప్పిన నిప్పు. అది అనుకూలతలో ప్రజ్వరిల్లి, ప్రజా ప్రకంపనాలను సృష్టిస్తుంది.

8. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎందుకు హెచ్చరించలేక పోతున్నారు?

దోపిడీ వర్గ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడం, అవినీతి విధానాలకు, నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, ఐక్య ఉద్యమాలు నిర్మిచడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజలల్ని చైతన్యవంతం చేసి, విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం మా విధానం. అంతే తప్ప హెచ్చరికలు చేయడం ద్వారా, ఎవరినో కొందరిని లోబర్చుకోవడం ద్వారా మా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లాలని మేము అనుకోవడం లేదు. ప్రజా పంథాలో పోరాటాలు నిర్వహించడం మేము అనుసరించే విధానం. ప్రజా శత్రువులుగా, ద్రోహులుగా, దోపిడీ దారులుగా ఉన్న వర్గ శత్రవుల విషయంలో ప్రజల నిర్ణయం మేరకు ప్రజా పంచాయితీల్లో హెచ్చరించడం, శిక్షించడం ఉంటుందే తప్ప ప్రజల నుంచి ఒంటరయ్యే చర్యలను మేము చేపట్టం.

9. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక మళ్లీ దొరలు తెలంగాణ గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. వారి పట్ల మీ వైఖరి ఏంటి?

తెలంగాణలో మళ్లీ దొరల గడీ పాలన వస్తున్న మాట నిజమే. కొంత మందికి కొమ్ములు, కోరలు పెరుగుతున్న మాట నిజమే. ప్రజా ఉద్యమం బలపడే క్రమంలో ఆ కొమ్ములు, కోరలు ప్రజలే కత్తిరిస్తారు. దొరల గడీల పాలనకు అంతం పాడుతారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం, పీపుల్స్‌వార్‌ నాయకత్వంలో నడిచిన ఉద్యమాలు, వర్గపోరాటం ప్రజలకు విలువైన అనుభవాన్నే అందించాయి. ఆ చైతన్యం, ఆ వారసత్వం ప్రజల్లో ఉన్నాయి. స్థల, కాల సందర్భాన్ని బట్టి ప్రజలు తమ సమస్యల్ని విప్లవ పార్టీ నాయకత్వంలో పురోగామి చరిత్రలో భాగంగా పరిష్కరించుకుంటారు. ఎక్కడ సమస్య ఉంటుందో పరిష్కారాలు కూడా అక్కడే ఉంటాయి.

10. తెలంగాణ వచ్చాక ప్రజా సంఘాలు, పౌరహక్కుల మీద మరింత నిర్బంధం పెరిగింది. ప్రభుత్వంలో ఉన్న వారిని మీరు ఎందుకు హెచ్చరించలేక పోతున్నారు?

నిర్బంధ పెరిగింది. ప్రజలు ఉద్యమిస్తే అణచివేస్తున్నారు, వాక్‌సభా స్వాతంత్య్రాలకు గండికొట్టారు. ధర్నాచౌక్‌ లేకుండా చేసారు. (ఇప్పుడు హైకోర్టు 6 వారాలు అవకాశం కల్పించింది) విద్యార్థి, యువజన, మహిళా, ఆదివాసీ, దళిత, మైనారిటీ, రైతు, కార్మిక ఒక్కరేమిటి అన్ని సెక్షన్ల ప్రజలు హక్కులు డిమాండ్‌ చేసినందుకు లాఠీచార్జ్‌, అరెస్టు, జైలు నిర్బంధం, ఎన్‌కౌంటర్‌ హత్యలు, మాయం చేయడం లాంటి ఎన్నో రకాల నిర్బంధ విధానాలను అమలు చేసారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్బంధాన్ని చవిచూడని సెక్షన్‌ ప్రజలు లేరంటే ఆశ్చర్యమేమి లేదు. నిర్బంధ విధానాలను బహిర్గతం చేసి ప్రతిఘటించడం మా విధానం. హెచ్చరించడం, వ్యక్తుల్ని హత్యచేయడం వలన నిర్బంధం తగ్గదు అని మా పార్టీ భావిస్తుంది.

11. క్యాబినెట్‌లోని మంత్రులతో సహా ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయింది. అదే పరిస్థితి మీకు కూడా ఎదురవుతోందా?

బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థలోనే స్వేచ్ఛా, స్వతంత్రం, ప్రజాస్వామ్యం, వర్గ అధిపత్య భావాజాలానికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ కేసీఆర్‌ నియంత. క్యాబినెట్‌లోని వ్యక్తులు అవకాశ వాదంతో ఆయన నియంతృత్వాన్ని అంగీకరిస్తారు. సామ్రాజ్యవాద ప్రపంచ బ్యాంకు కూడా ప్రధాని, ముఖ్యమంత్రి మాత్రమే పాలసీల విషయంలో, పాలనా సంబంధమైన వ్యవహారాలలో, ఆర్థిక పథకాల విషయంలో మాట్లాడాలి తప్ప మరెవ్వరూ మాట్లాడకూడదని శాసిస్తున్నది. కాబట్టి వ్యక్తి పాలనే, వ్యక్తి నియంతృత్వమే అమలవుతుంది. కేసీఆర్‌ పుట్టిపెరిగి కొనసాగించిన దొరస్వామ్యం (గడీ పాలన)లో (నేతి బీరలో నెయ్యి ఎంత ఉంటుందో) ప్రజాస్వామ్యం కూడా అంతే ఉంటుంది.

విప్లవ పార్టీ, విప్లవ ప్రజలు ఎప్పుడూ దోపిడీ వర్గాలకు శత్రు వర్గం గానే, ప్రతిఘటనా శక్తులుగానే ఉంటాయి. కాబట్టి మా పట్ల శత్రువర్గాని కంతటికీ ముఖ్యంగా నియంతలందరికి శత్రు వైఖరే ఉంటుంది. ప్రజలు చరిత్ర నిర్మాతలు. హిట్లర్‌, ముస్సోలినీలకు చరిత్ర ఏ తీర్పుచెప్పిందో ఇప్పటి నియంతలకు కూడా అదే పాఠంగా ఉంటుంది.

12. ఇటీవల లొంగుబాట్లు పెరిగాయి. ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?

విప్లవోద్యమంలో అనేక కష్టాలు, నష్టాలు ఉంటాయి. నిర్బంధ పరిస్థితులకు ఎదురీది పనిచేసే క్రమంలో ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఈ కఠినమైన విప్లవ జీవితంలో ఆటుపోట్లుకు తట్టుకుని చివరిదాక నిలబడిన వారే విప్లవకారులుగా, ఆదర్శ కమ్యూనిస్టులుగా చరిత్రలో నిలబడతారు. విప్లవ పార్టీలో కూడా విప్లవాదర్శాలకు దూరమై, సొంత ప్రయోజనాలకు, వ్యక్తిగత ప్రలోభాలకు లోనై, కష్టాలను ఎదుర్కొనే సంసిద్ధత కొరవడి వెనక్కివెళ్లేవాళ్ళు ఉన్నారు. విప్లవ పార్టీ సైద్ధాంతిక, రాజకీయ, నిబద్దతతో పనిచేసే క్యాడర్‌తో కూడుకున్నది. నిబద్దత కొరవడినప్పుడు జంపన్న లాగా దిగజారిపోనూ వచ్చు. అన్యవర్గ ధోరణులు పెరిగి, విప్లవ చైతన్యాన్ని కోల్పోవచ్చు. అటువంటి వాళ్లు లొంగిపోతారు. ఉద్యమ బలాబలాల్లో తాత్కాలికంగా మార్పులు వస్తాయి. దానిని శాస్త్రీయంగా అర్థంచేసుకోలేక కొంత మంది ఉద్యమం నుండి వెనక్కి వెళ్తారు. ఐతే ఇది చాలా పరిమితంగానే ఉంటుంది. ఇంత కన్నా ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు. పోలీసులు ప్రచారం చేస్తున్నట్లు పదుల సంఖ్యలో లొంగుబాట్లు లేవు. వాళ్ళు చూపిస్తున్న లెక్కలు, రివార్డుల కోసం, అవార్డుల కోసం, ఆ సొమ్ములు కాజేయడం కోసం తప్ప వాస్తవంలో జరుగుతున్నవి తక్కువే. సంతల మీద దాడులు చేసి, సాధారణ ప్రజలను అరెస్టులు చేసి, అందరూ నక్సలైట్లేనని, ఆయుధాలున్నాయని, రివార్డులున్నాయని, స్వచ్ఛందంగా లొంగిపోయారు అని ప్రకటిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా బర్మారులు స్వాధీనం చేసుకొని, ఆ కుటుంబ సభ్యులనే నిలబెట్టి రైఫిల్స్‌తో లొంగిపోయినట్లు పెద్దఎత్తున ప్రచారం చేసుకుని, నక్సలైట్‌ ఉద్యమం బలహీన పడిపోయిందని గొప్పలు చెప్పుతున్నారు. ఇందులో నిజంలేదు.

13. గద్దర్‌ తన కుమారుడి కోసం రాహుల్‌ గాంధీని కలిసారు. మంది పిల్లలు ఉద్యమంలో, ఆయన పిల్లలు కాంగ్రెస్‌లో అని సోషల్‌ మీడియా అంటోంది. మీరేమంటారు?

మేము ప్రత్యేకంగా అనేదేముంది. గద్దరు లాంటి ఐదు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన నిలబడినవాడు తమ పిల్లల కోసం స్వార్థంగా ఆలోచించడం, విలువలని పక్కనబెట్టడం సరైంది కాదు. తమ కుమారుడి కోసం ప్రయత్నించలేదని, అలా మాట్లాడలేదని గద్దరే అంటున్నాడు. సోషల్‌ మీడియాలో వచ్చింది నిజమా కాదా అంటే దానికి ఆధారాలు ఉండాలి కదా దీనిలో ప్రత్యేకించి మేము చెప్పేదేముంది. గద్దర్‌ లాంటి వాళ్ళు కొడుకు కోసం, కుటుంబం కోసం పరిమితం కాకూడదనే ఆశిద్దాం.

14. గద్దర్‌ బ్యాలెట్‌ బాట పట్టడాన్ని సమర్థిస్తారా? ఆయనకు ఓటేయ్యాలా?

పార్లమెంటరీ ఎన్నికల మార్గమే వ్యవస్థ మార్పుకు పనికిరాదని అనుకుంటున్నప్పుడు వర్గపోరాటమే, నూతన ప్రజాస్వామిక విప్లవమే పరిష్కారంగా నమ్ముతున్నప్పుడు, ఆచరిస్తున్నప్పుడు బ్యాలెట్‌ బాటను సమర్థించే ప్రశ్నేలేదు. విప్లవ బాటను వదిలి బ్యాలెట్‌ బాట పట్టిన గద్దర్‌ కైనా, ఇంకెవ్వరికైనా ఓటు వెయ్యవద్దని, ఎన్నికలను బహిష్కరించమని చెపుతాము. ఇప్పుడైతే పోటీచేయనంటున్నాడు మంచిదే.

15. రాష్ట్రంలో స్వాములు బీజేపీలో చేరి ఆ పార్టీని అధికారంలోకి తెస్తామంటున్నారు. మీకేమనిపిస్తోంది?

చౌటుప్పల్‌ ర్యాలీ సందర్భంగా పరిపూర్ణానందస్వామి నిజస్వరూపాన్ని ఆయన సొంత టీవీ ఛానల్‌ ʹభారత్‌ టుడేʹ చెప్పకనే చెప్పింది. సోషల్‌ మీడియా అంతా చక్కర్లు కొట్టింది. ఆ స్వామికి ప్రజలపట్ల, ఈ ప్రజాస్వామ్యం పట్ల ఎంత నమ్మకం, గౌరవం ఉందో స్పష్టమే. నిజానికి ఈ స్వాములను నడిపించే సంఘ్‌పరివార్‌ అధినాయకులే కేంద్రంలో అధికారాన్ని కొనసాగిస్తున్నారు. వీరు అధికారంలోకి వస్తే కొత్తగా చెడగొట్టేదేమీ లేదు. ఇప్పుడు బ్రాహ్మణీయ హిందూ మతోన్మాద శక్తుల పాలనలో జరుగుతున్నదే మరింత రంగులద్ది వీరు కొనసాగిస్తారు తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. మన రాష్ట్రాన్ని కూడా ఆ దుస్థితికి పోకుండా చూద్దాం.

Keywords : జగన్ , సీపీఐ మావోయిస్టు పార్టీ, అధికార ప్రతినిధి, ఇంటర్వ్యూ, తెలంగాణ, ఎన్నికలు, బహిష్కరణ, కేసీఆర్, మహాకూటమి
(2019-02-19 11:17:07)No. of visitors : 1170

Suggested Posts


మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3

యావత్తు విప్లవ కాలంలోనూ ప్రజలను ప్రజా సైన్యంలో చేరడానికి ప్రత్యేకంగా ఉత్సాహవంతులను చేస్తూ ప్రోత్సహిస్తుంది. ప్రజా సైన్యానికి అవసరమైన వనరుల పట్ల ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2

ముందస్తు ఎన్నికలను బహిష్కరించండి. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయండి. సర్వసంపదలు సృష్టించే ప్రజలే చరిత్ర నిర్మాతలు. తెలంగాణ ప్రజలు నూతన చరిత్ర సృష్టించాలి.

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


ఎన్నికలపై