మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2


మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2

మావోయిస్టు

1. ఈ ప్రజాస్వామ్యం-ఎన్నికలు బూటకం అంటున్నారు కదా! ఎందుకు?

భారత రాజ్యాంగంలో ప్రజాలందరికి స్వేచ్ఛ, జీవనాధారాలు, పౌర ప్రజాతంత్ర హక్కుల కల్పన, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం సాధించడంతో పాటు దేశానికి సార్వభౌమత్వం, స్వావలంబన ప్రధానమని చెప్పబడింది. 72 సం||ల ʹస్వతంత్ర భారతంʹలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరిట జరిగిన ఎన్నికలు, అధికారం నడిపిన రాజకీయ పార్టీలు ఎటువంటి మార్పును తీసుకురాలేదు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అసమానతలు పెరిగాయి. మన చట్టాలు, పాలనా విధానాలతో దోపిడీ, అణచివేతలు పెరిగాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసురంగం పూర్తిగా సామ్రాజ్యవాదుల చెప్పు చేతల్లో నడుస్తున్నాయి. సార్వభౌమత్వం, స్వావలంబన కనుమరుగైపోతున్నాయి.

ప్రజల మౌలిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందుబాటులో లేవు. భూమి, ఉపాధి లాంటి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కరించబడలేదు. ప్రజల ప్రాథమిక హక్కులతో పాటు పౌరహక్కులయిన వాక్‌సభా స్వాతంత్య్రాలు కూడా హరించబడుతున్నాయి. దేశంలో ఫాసిజం, అప్రకటిత ఎమర్జెన్సీ అమలు జరుగుతున్నాయి. రాజకీయ అసహనం పెరిగిపోయింది. ఈ దేశంలో పీడితుల పక్షాన నిలబడి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు దానికి భిన్నంగా కొద్దిమంది దోపిడీదారుల ప్రయోనాల కోసం పరిపాలిస్తున్నాయి.

ప్రజా ప్రభుత్వాల పేరుతో కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ దోపిడీ వర్గ పార్టీలు అధికారంలోకి వస్తూనే ఉన్నాయి. కానీ మెజారిటీ ప్రజల మౌలిక సమస్యలేవీ ఇప్పటికీ పరిష్కారం కానేలేదు. ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం, తాగునీటి, సాగునీటి లేమి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడం పేరుతో ప్రభుత్వాలు ముందుకు తెస్తున్న కార్పొరేటు అనుకూల ఆర్థిక విధానాలు ప్రజలకు మరింత ప్రాణాంతకంగా మారాయి. వాళ్ల జీవన ప్రమాణాలను మరింతగా దిగజార్చుతున్నాయి.

ప్రజారాశులను సామాజిక సమీకరణలుగా, ఓటు బ్యాంకులుగా చూస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓట్లు-సీట్లు పంచుకునే ఎన్నికలుగా చూస్తున్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేయడం లేదు.

ఎన్నికల ముందు విచ్చలవిడిగా కుమ్మరించే డబ్బు సంచులు, ప్రజలను మోసపుచ్చే రాజకీయ నాయకుల వాగ్దానాలు, హంగూ ఆర్భాటంతో కూడిన ప్రచారం, కుల, మత, ప్రాంతీయ సమీకరణాలు, లక్షల సాయుధ బలగాల మోహరింపు, ఎన్నికల బూత్‌ల ఆక్రమణలు, రిగ్గింగ్‌, హింస, భౌతిక దాడులు, హత్యలు, డబ్బులు పంచడం ఇవన్నీ ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా, ప్రజాస్వామికంగా జరుగుతున్నాయో పట్టిచూపుతున్నాయి. ఇంత అప్రజాస్వామికంగా ఉన్నాయి కనుకనే ఈ ఎన్నికలను బహిష్కరించాలి. వర్గ సమాజంలో ప్రజాస్వామ్యం వర్గ ప్రజాస్వామ్యమే. ఇప్పుడు అమలు జరుగుతున్నది దోపిడీ వర్గాల ప్రజాస్వామ్యమే. దోపిడీ వ్యవస్థను నాశనం చేయకుండా ప్రజల ప్రజాస్వామ్యం అమలుకాదు.

2. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు-ఆపద్ధర్మ ప్రభుత్వంలను మీరు సమర్దిస్తున్నారా?

కేసీఆర్‌ 9 నెలల ముందుగానే అంసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడు. కేసీఆరే సర్వం కాబట్టి ఆయన పథకాలకు, ప్రణాళికలకు, వ్యూహాలకు ఎదురు చెప్పేవాళ్లు ఉండరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో లాబీయింగ్‌ రాజకీయాలు నడిపి, అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, తన కుటుంబ పాలనను మరో ఐదుఏళ్లు కొనసాగించడానికి తహతహలాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో వేగంగా మారుతున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలను, బలపడుతున్న ప్రతిపక్షాన్ని చూసి భయపడిన కేసీఆర్‌ పడవ పూర్తిగా మునగక ముందే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డాడు. ఉద్యమ నినాదాలనే 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన కేసీఆర్‌ వాటిని వేటినీ అమలు చేయలేదు. ప్రజల మౌలిక సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించాడు. కేసీఆర్‌ మీద మధ్యతరగతి ప్రజలకు కూడా నమ్మకం పోయింది. కుల ప్రాతిపదికన ఇచ్చిన పథకాలన్నీ ప్రజలను చీల్చడం, తాత్కాలికంగా చిన్న చిన్న ప్రయోజనాలను నెరవేర్చడం ద్వారా, కొద్ది మందిని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఆకట్టుకోవడమే దాని వెనుక ఉన్న కుట్ర అని అందరికీ అర్థమైంది. అవినీతి, అక్రమాలు, దురహంకారంలతో ప్రజాద్రోహిగా, నియంతగా నాలుగున్నర సం||రాలు పాలించిన కేసీఆర్‌ పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. అది మరింత సంఘటితం కాకముందే జిమిక్కులతో మరోసారి గెలవాలని తొందరపడుతున్నాడు. మోదీతో పార్లమెంటరీ ఎన్నికల్లో సహకరిస్తాననే చీకటి ఒప్పదంతో అసెంబ్లీ రద్దును, ముందుస్తు ఎన్నికలను సానుకూలం చేసుకున్నాడు. ఇది ప్రజలను, ప్రతిపక్షాన్ని, సొంత పార్టీని ఆఖరికి మంత్రి వర్గాన్ని సంప్రదించి చేసిన నిర్ణయం కాదు. మోదీ సూచన మేరకే గవర్నర్‌ అసెంబ్లీని రద్దు చేసాడు. ఎన్నికల కమీషన్‌ ముందస్తు ఎన్నికలకు అనుకూలంగా నిర్ణయం చేసింది. తాత్కాలిక ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమే అయినప్పటికీ మోదీ, కేసీఆర్‌ల ప్రయోజనాల కోసం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. వాటిని మేం సమర్దించడం లేదు.

3. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కూటముల మధ్య పోటీని ఎలా అర్థం చేసుకోవాలి?

ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు, ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి ఒక కూటమిగా ఏర్పడి సీట్లు సర్దుబాటు చేసుకొని మహాకూటమి ఒక బలమైన శక్తిగానే ముందుకు వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఈ పార్టీలు ఐక్యమయ్యాయి. ఇదికాక సీపీఎం నీల్‌లాల్‌ ఐక్యత పేరుతో వివిధ సంస్థలను కలుపుకుని బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పోటీ పడుతున్నది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకత్వంలోని మహాకూటమి, బీఎల్‌ఎఫ్‌ల గురించి, బీజేపీ గురించి వివరంగా తెలుసుకుందాం.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే బూర్జువాల ప్రజాస్వామ్యమే. అది ప్రజల పేరుతో ప్రజల్ని మోసగించి ప్రజలను దోపిడీ చేసి అణచివేసే బూర్జువా నియంతృత్వమే. ఈ ఎన్నికల్లో ఏర్పడే కూటములు అవకాశవాద కూటములే. నిన్న పరస్పరం ద్వేషించుకుని, దూషించుక్ను వారే మహాకూటమిలో ఉన్నారు. ఈ ఎన్నికల రాజకీయపొత్తులలో నీతి, నిజాయితి, చిత్తశుద్ధి, జవాబుదారీతనం, కనీస నైతికత, ప్రజాస్వామిక దృక్పథం, విలువలు లేవు. ఏ రోజు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చెప్పలేం.

4. టీఆర్‌ఎస్‌ పార్టీ గురించి వివరంగా చెప్పండి?

రాష్ట్రంలో నీళ్లు, నిధులు నియామకాలు, భూమి, అధికార వికేంద్రీకరణ, స్వావలంబన, సామాజిక న్యాయం లాంటి ఉద్యమ కాలంనాటి డిమాండ్లలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. రైతాంగం ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతు రుణమాఫీ వాగ్ధానాన్ని అటకెక్కించింది. రైతుబంధు పథకంతో భూస్వాములు, ధనిక రైతులకు అధిక మొత్తంలో ప్రభుత్వ ఖజానా నుండి ప్రజల డబ్బును వేల కోట్ల రూపాయలు అందించి గ్రామీణ సంపన్న వర్గాన్ని, సంపన్నం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమానతలు మరింత పెంచింది. చెరువుల పూడికలలో, నీటిపారుదల ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని పంచుకు తినడమేకాకుండా ఉద్యమ కాలంలో ఏ కాంట్రాక్టర్లను విమర్శించారో వారికే అనుకూలంగా కాంట్రాక్టులను అప్పజెప్పారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ʹబంగారు తెలంగాణʹ సాధన తన లక్ష్యం అని ప్రకటించి సామ్రాజ్యవాద ఎజెండాను దూకుడుగా అమలుచేస్తున్నారు. పారిశ్రామికీకరణలో ʹటీ-పాస్‌ʹ పేరిట హైటెక్‌ పరిశ్రమలకు, ప్రైవేటు పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారు. వారికి లక్షల ఎకరాల భూములు, నీళ్ళు, విద్యుత్‌ లాంటి ఉచిత సదుపాయాలతో పాటు అనేక రాయితీలు ఇచ్చారు. ఉపాధి కల్పించడం, నిరుద్యోగ సమస్య పరిష్కరించడం చేయకపోగా, అందుబాటులో ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీచేయ లేదు. పోలీసు వ్యవస్థను మాత్రం బలోపేతం చేసుకొని తమ దుష్టపాలనకు రక్షణ కల్పించుకున్నారు.

వారిచ్చిన వాగ్దానాలు, హామీలు నెరవేర్చలేదు. వాటికి భిన్నంగానే పరిపాలించారు. ఓపెన్‌ కాస్టులు ఉండవని చెప్పి కొత్తగా 16 ఓపెన్‌ కాస్టు గనులను ప్రారంభించారు. తెలంగాణ బొందల గడ్డగా మారి పర్యావరణ సమస్య పెరిగింది. ఆదివాసుల హక్కుల రక్షణకు ఉన్న 5వ షెడ్యూల్డ్‌, 1/70 చట్టం, 2006 అడవీ హక్కుల చట్టం, పెసా చట్టం అమలు చేయకుండా కేసీఆర్‌ ప్రభుత్వం హరిత హారం పేరుతో ఆదివాసీల భూములను గుంజుకుంటుంది. ఆదివాసీలను చిత్రహింసలకు గురిచేసి జైలుపాలు చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు పేరుతో 3 లక్షల మంది ఆదివాసీల బ్రతుకులు (అన్ని పాలక పార్టీలు కలిసి) చిన్నాభిన్నం చేసారు. దళితులపై దాడులు పెరిగాయి. దళితులకు భూమి సమస్య పరిష్కారం కాలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారిమళ్లించారు. బడుగు వర్గాల పాఠశాలలను రద్దు చేసి, వేల సంఖ్యలో పిల్లలను విద్య నుంచి దూరం చేసారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నియామకాలు అమలుచేయకుండా నిధులు తగ్గించి, మందులు లేకుండా చేసి, ప్రైవేటు ఆసుపత్రలకు బలం చేకూరేలా కార్పొరేట్‌ వైద్యానికి పెద్దపీఠవేసి ప్రభుత్వ ధనాన్ని తరలించారు. కార్పొరేటు సంస్థలకు వేల ఎకరాల భూములు ఇవ్వడమే కాకుండా టీఆర్‌ఎస్‌ నాయకత్వం వారితో కుమ్మక్కై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని వృద్ధి చేసి కోట్ల కొలది ఆస్తులు కూడగట్టుకున్నారు.

వాక్‌సభా స్వాతంత్య్రాలను హరించివేసి, ప్రజాఉద్యమాలను అణచివేయడంతో పాటు విప్లవకారులని బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్యలు చేస్తుంది. ఏక పక్షంగా ధర్నాచౌక్‌ను రద్దు చేసి, ప్రజల నిరసన గళాన్ని తొక్కిపెట్టారు. (ఇటీవలనే హైకోర్టు ప్రభుత్వ చర్యను తప్పుబట్టింది. ధర్నాచౌక్‌ను 6 వారాల పాటు పునరుద్దరించింది)

మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రం ఒక లక్షా 80 వేల కోట్ల రూ||ల రుణగ్రస్త రాష్ట్రంగా మారింది. మల్లన్న సాగర్‌, హరితహారం, నేరుట్ల లాంటి అనేక సమస్యల్లోను, అలాగే ప్రైవేటు విద్యా సంస్థలకు వ్యతిరేకంగా విద్యార్ధులు చేపట్టిన ఉద్యమాలపట్ల పోలీసులు పరమ కిరాతకంగా దాడులు చేసి, వేలాది మందిని అరెస్టు చేసారు. సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించి దాడులు నిర్వహించారు. ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై విచక్షణా రహితంగా దాడిచేసి 20వేల మందిని అరెస్టు చేసారు. రైతాంగ ఆత్మహత్యలు, దళితులపై దాడులు, పరువు హత్యలు పెరిగిపోయాయి. గిట్టుబాటు ధరను అడిగినందుకు రైతులకు బేడీలు వేసిన ఘనత కూడా వీరిదే.

సామాన్య రైతుల భూములను, దళితుల అసైన్డ్‌ భూములను ప్రభుత్వమే బలవంతంగా గుంజుకున్నది. 2013 భూసేకరణ చట్టం సవరించి తనకు అనుకూలంగా మార్చుకున్నది. కార్పొరేట్‌ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ నికర సాగు విస్తీర్ణాన్ని తగ్గించి వేసింది. కరువు ప్రాంతాలకు, వెనకబడిన ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే సమగ్ర పథకం లేదు. వలసలు పెరిగాయి. వ్యవసాయ పంట ధరలు పడిపోయాయి. గిట్టుబాటు కాని వ్యవసాయం రైతాంగ ఆత్మహత్యలకు ప్రధాన కారణం. ఉపాధి హామీ పథకం సరిగా అమలుకాలేదు. అవినీతి కారణంగా రాజకీయ నాయకులు, అధికారులు లాభపడ్డారు. చేతివృత్తులు దెబ్బతిన్నాయి. చేనేతరంగం దెబ్బతింది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. బడుగు వర్గాల ప్రజలకు ఇండ్లస్థలాలు లేవు. ఇండ్లు కట్టిస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకాలేదు. పరిశ్రమలు మూసివేయడం, ఆధునిక యంత్రాలు తెచ్చి కార్మికుల్ని తొలగించడంతో ఉపాధి దెబ్బతిన్నది.

5. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తే మార్పు ఉంటుందా?

కాంగ్రెస్‌ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. అదంతా సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసిన చరిత్ర. బడా భూస్వాములు, పెట్టుబడుదారులతో కూడిన కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అనేక సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజా వ్యతిరేకంగా పాలించింది. అనేక అవినీతి కుంభకోణాలలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని స్వాహాచేయడం, ప్రజా ఉద్యమాలను, జాతుల ఉద్యమాలను అణచివేయడం, అభివృద్ధి నిరోధకంగా వ్యవహరించడంతో ప్రజలు అధికారం నుంచి తొలగించారు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలవడానికి చూస్తుంది. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెబుతుంది. ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని, ఏర్పాటుచేయగలిగిన పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీకి లేదు. అందుకే మహాకూటమిని ఏర్పాటుచేసింది. ఉద్యమ కాలం నాటి డిమాండ్ల పట్ల ఏనాడు కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్దితో వ్యవహరించలేదు. ఈ కూటమి అధికారంలోకి వచ్చినా కొత్తగా ప్రజలకు ఒరిగేదేమీలేదు.

6. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తాం అంటున్నారు. వాళ్ళకాపరిస్థితి ఉందా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ నాలుగున్నర సం|||రాల కాలంలో బ్రాహ్మణీయ హిందూమతోన్మాద పరిపాలనను, ఫాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పింది. రాజకీయ అసహనానికి, కుల మత వైషమ్యాలకి కారణ భూతమైన మోదీ నియంతృత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ తన పట్టు పెంచుకొని అధికారంలోకి రావడానికి అబద్ధపు ప్రచారంతో, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సామ్రాజ్యవాదుల ఎజెండాను దూకుడుగా అమలుచేస్తుంది. అందులో భాగంగానే నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి నిర్ణయాలతో సామాన్య ప్రజల బతుకులతో చెలగాటమాడింది. పేద మధ్యతరగతి ప్రజల బతుకులను చిద్రం చేసింది. నిరుద్యోగం, అధిక ధరలు, రైతాంగ ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు, ఆదివాసీ, దళిత మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. డాలర్‌తో రూపాయి మారకపు విలువ పడిపోయింది. మోదీ గ్రాప్‌ కూడా క్రమంగా ప్రజల్లో పడిపోతూ వచ్చింది. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఉన్న సీట్లు నిలబెట్టుకోవడమే కష్టం కావచ్చు.

దేశ జనాభాలో సగానికి పైగా దారిద్య్రరేఖ దిగువున జీవిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకు క్షీణిస్తుంది. మోదీ అధికారం చేపట్టేక దళితులు, మైనారిటీ మతస్తులపై దాడులు రోజు రోజుకు పెరగడమే కాకుండా క్రూరమైన రూపం సంతరించుకుంటున్నాయి. అవమానాలు, వివక్షతలు, వెలివేతలు, సొంత భూమి నుండి, ఇండ్ల నుండి గెంటివేయడం. దారుణ హత్యలు మరింతగా పెరిగాయి. దేశ రక్షణ, అవినీతి రహిత భారతం, ప్రజా సంక్షేమం గాలికి ఎగిరిపోయాయి. గో రక్షణ, భారతీయ సంస్కృతి అంటూ మత ఘర్షణలు రెచ్చగొట్టడం నిత్యకృత్యమైంది. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అవినీతి కుంభకోణంలో మోదీకి, అంబానీకి అలాగే ఆధానీకి మధ్య ఉండే (కార్పొరేటు శక్తులతో) అనుబంధాలు బహిర్గతమవుతున్నాయి. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లకి రక్షణ కల్పించడం, అండగా నిలబడడం చేస్తున్నారు. పేద, ధనిక తారతమ్యాలు మన దేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజలతో ఎన్నుకోబడ్డామన్న సమర్దనతో పాలకులు వారి ఆశ్రితులు కొన్ని తరాలు తిన్నా తరగని సంపదలను పోగేసుకున్నారు.

ఖనిజాలు, నీరు, భూమి, అడవులు లాంటి సహజ వనరుల్ని కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టి, ప్రజల్ని ముఖ్యంగా ఆదివాసులను నిర్వాసితుల్ని కావిస్తున్నారు. విద్య, వైద్య రంగాలలో సంక్షేమం లేదు. పూర్తిగా కార్పొరేట్లకు ఇచ్చి ఆయా రంగాలను ప్రైవేటీకరించారు. దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, మైనారిటీల హత్యలు సర్వసాధారణ మయ్యాయి. ఆదివాసులపై మావోయిస్టు ముద్రవేసి కాల్చి చంపుతున్నారు. అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో మేధావులను, ఉద్యమ కారులను రాజద్రోహులుగా కుట్రకేసులు పెడుతున్నారు. ప్రజల హక్కులు హరించి వేసి నిషేధాజ్ఞలు పెట్టి ప్రదర్శన, నిరసన నేరంగా మార్చారు. సరళీకరణ విధానాలు అమలు చేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టుపెట్టారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోదక చట్టానికి తూట్లు పొడిచి నీరుగారుస్తున్నారు. హిందూ మతోన్మాదం పెరిగిపోయి అసహనంతో కుల, మత దురహంకారంతో కాల్చి చంపడం, మూక హత్యలకు పాల్పడడం చేస్తున్నారు. విప్లవోద్యమ ప్రాంతాలలో పోలీసు బలగాలను పెంచుతున్నారు. పోలీసు క్యాంపులను కార్పెట్‌ సెక్యూరిటీని ఏర్పరుస్తున్నారు. బూటకపు ఎదురుకాల్పులు జరుపుతున్నారు. అన్ని సెక్షన్ల ప్రజలకు భద్రత కరువయ్యింది. ఆదివాసులు, దళితులు, మత మైనారిటీలు, మహిళలు, మేధావులు అన్ని సెక్షన్లపైన నిరంతరం హిందూమతోన్మాద దాడులు జరుగుతున్నాయి. వీరి రక్షణకు ప్రత్యేక చర్యలు లేవు. ఆధునిక విజ్ఞానాన్ని ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు వినియోగించడం లేదు. పర్యావరణ పరిరక్షణకు కనీస ప్రాధాన్యత నివ్వడం లేదు. ప్రకృతి విధ్వంసానికి పాలకులు పాల్పడుతున్నారు. అన్ని రంగాల అవినీతి, కుట్ర పద్ధతులు పెంచి పోషిస్తూ దోపిడీ విధానాలను, అణచివేత పద్ధతులను అమలు చేస్తున్నారు.

7. తెలుగుదేశం పార్టీని తెలంగాణా ప్రజలు ఆమోదిస్తారా?

చంద్రబాబునాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలిచింది. ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దూరమైంది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పట్ల ఉన్న వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును గెలుచుకుని కొన్ని సీట్లు సంపాదించుకోవడానికే మొదటి నుంచి శత్రు పక్షమయిన కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిలో చేరింది. టీడీపీ నాయకుడు చంద్రబాబు అవినీతికి పెట్టింది పేరు. ప్రజా ఉద్యమాలను, విప్లవోద్యమాలను అణచడంలో ముందుండేవాడు. ఇప్పుడు కూడా రాంగూడా లాంటి భారీ స్థాయి పోలీసు హత్యాకాండను జరిపించిన చరిత్ర ఉంది. అవకాశవాద రాజకీయాలకు నెలవుగా టీడీపీ పార్టీ మారింది. అధికారం తప్ప మరో ఎజెండా లేని పాలకవర్గ పార్టీల్లో ఇది ఒకటి. తెలంగాణ ప్రజలకు టీడీపీ పట్ల వ్యతిరేకత తగ్గలేదు.

8. సీపీఐ గురించి వివరించండి?

సీపీఐ రివిజనిస్టు రాజకీయాల్లో తలపండింది. పార్లమెంటరీ రాజకీయాల నిండా మునిగి ఉంది. ప్రజల మౌలిక సమస్యల సాధనకు పోరాటమే మార్గమన్న విషయాన్ని కూడా మర్చిపోయింది. కాంగ్రెస్‌కు తోకగా మిగిలిన బూర్జవా పార్టీలకు అండగా ఉంటూ ప్రజల్ని ఉద్యమ బాటనుండి తప్పించే సాధనంగా మారిపోయింది. కొన్ని సీట్లు, కొన్ని ఓట్లుతో సరిబెట్టుకుంటూ ఎర్రజెండాపై ప్రజలకున్న విశ్వాసాన్ని సంస్కరణవాద రాజకీయాలకు బలిచేస్తుంది.

9. సీపీఎం ఏర్పరచిన బీఎల్‌ఎఫ్‌కు ఎక్కువ సీట్లు వస్తాయంటారా?

ఇది కూడా సీపీఐ లాగానే అవకాశవాద రాజకీయాలతో పార్లమెంటరీ పంథాకు కట్టుబడిపోయింది. ఈ నడుమ దళిత ఉద్దరణ పేరుతో పాదయాత్రలు చేస్తూ పెటీబూర్జువా సెక్షన్స్‌ను ఆకట్టుకునే ఎత్తుగడతో బీఎల్‌ఎఫ్‌ పేరుతో ముందుకు వచ్చి లాల్‌నీల్‌ రాజకీయాలను నడిపిస్తుంది. ఆ శక్తులలోని పెటీబూర్జువా నాయకత్వంతో బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటుచేసి ఒక ప్రత్యామ్నాయంగా కావాలని ముందుకు వచ్చింది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి భూమి సమస్య కేంద్రంగా వ్యవసాయక విప్లవ కార్యక్రమాన్ని చేపట్టడానికి రాజకీయంగా సిద్ధంగా లేదు. మధ్యేవాద రాజకీయాలతో, రాజీ ధోరణులతో ఉండే వారందరినీ కూడగట్టి ప్రజలను విప్లవం వైపు వెళ్ళకుండా చేస్తుంది.

10. తెలంగాణ జన సమితి గురించి, కోదండరాం గురించి మీరేమంటారు?

భౌగోళిక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ శక్తులలో కోదండరాం టీఆర్‌ఎస్‌లో చేరలేదు. ఇప్పుడు తెలంగాణ జన సమితిని ఏర్పాటుచేసి కాంగ్రెస్‌ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాడు. ఆ నాటి ఉద్యశక్తులలో కొందరిని పార్లమెంటరీ బ్రమల్లో పరిష్కారాలను వెతికే దిశలో నడిపిస్తున్నాడు. ఉద్యమ ప్రతిష్టను కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలతో కలవడం ద్వారా దెబ్బతీస్తున్నాడు. తాను ప్రకటించుకున్న లక్ష్యాన్ని, పోరాటాన్ని స్థిరంగా అంటిపెట్టుకుని ఉండడం ద్వారా విజయం సాధించుతాననే నమ్మకాన్ని కోల్పోయాడు. అవకాశవాదానికి, రాజీవాదానికి గురై అవినీతి పాలనకు, ప్రజావ్యతిరేక దుష్ట పాలనకు పేరుపొందిన వారితో కలిసి జతకట్టి కేసీఆర్‌ నియంతృత్వాన్ని ఓడిస్తానని ప్రకటించడం తనను తాను మోసం చేసుకోవడమే కాకుండా ప్రజలను కూడా మోసం చేయడానికి సిద్ధపడడమే. సామాజిక విప్లవ నినాదాన్ని ముందుపెట్టి మహాకూటమికి ఓట్లు అడుగుతున్నాడు.

11. గద్దర్‌ గురించి మీరేమనుకుంటున్నారు?

ప్రజా గాయకుడు గద్దర్‌ విప్లవ బాటను వీడి స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్లమెంటరీ పంథాలోకి మారాడు. ఆ భ్రమల లోకంలోకి తటస్థంగా ఉన్న శక్తుల్ని తరలించడానికి ప్రయత్నిస్తున్నాడు. పార్లమెంటరీ రాజకీయాల అసలు స్వభావాన్ని, దోపిడీ వర్గ ప్రయోజనాలను తెలియనంత అమాయకంగా, నాటకీయంగా వ్యవహరిస్తున్నాడు. దోపిడీ వర్గ పార్టీల నేతల ఆశీస్సులు పొందడానికి తన రాజకీయ జీవితం, విప్లవాదర్శం, ప్రజల్లో ఉన్న గౌరవం ఏవీ ఆయనకు ఆటంకం కాకుండా పోయాయి. ఈ ఎన్నికల్లో పోటీకి నిలబడడం లేదని ప్రకటించాడు. భవిష్యత్‌లో ఏం చేస్తాడో చూద్దాం.

12. బీజేపీ-టీఆర్‌ఎస్‌లు విడివిడిగా ఎందుకు పోటీ చేస్తున్నాయి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి ఎందుకు పోటీ చేయడం లేదు అంటే రెండు పార్టీలకు ఒకరిపట్ల ఒకరికి గెలుపు విషయంలో అపనమ్మకం ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉంటుందని ఇద్దరికీ తెలుసు కాబట్టి బీజేపీ-మోదీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో పడకుండా టీఆర్‌ఎస్‌ జాగ్రత్త పడినట్లే, కేసీఆర్‌ వ్యతిరేక ప్రభావం బీజేపీ మీద పడకుండా ఉండడానికి విడి విడిగా పోటీ చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య ఇది కూడా ఒక అంగీకారమే. రేపు జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో పరిస్థితులను బట్టి కలిసి పోటీ చేయవచ్చు లేదా విడిగా పోటీచేసి సంకీర్ణంలో భాగం కావచ్చు. ఇది కూడా పరస్పర అంగీకారంలో భాగమే తప్ప వేరుకాదు. ప్రజా వ్యతిరేక పాలన కారణంగా సీట్లు తగ్గి అధికారంలోకి రావడం కష్టమవుతుందన్న భయాలు ఇరు పార్టీల్లోను బలంగానే ఉన్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో పరస్పరము సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.

13. ఏ పార్టీ గెలుపు ప్రజలకు ఉపయోగకరం?

72 సం||రాల ʹʹస్వతంత్ర భారతంలోʹ, ʹʹఅతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోʹʹ ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల మౌలిక సమస్యలను ముఖ్యంగా మోజారిటీ ప్రజల ఉపాధికి ఆధారమైన భూమి సమస్యను ఏ పార్టీ కూడా పరిష్కరించలేదు. భూమి సమస్య కేంద్రంగా వ్యవసాయక విప్లవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న సీపీఐ మావోయిస్టు మాత్రమే ప్రజల మౌలిక సమస్యలకు పోరాట మార్గాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. పార్లమెంటరీ పార్టీలకు, రివిజనిస్టులకు, సామాజిక విప్లవం ముందు అంటున్న వారికి నిర్ధిష్టమైన లక్ష్యంగాని, ప్రజా కార్యక్రమం గాని లేవన్నది స్పష్టం కాబట్టి దోపిడీ పాలక వర్గ పార్టీలు అధికారాన్ని మార్చుకుంటాయి. ప్రజలను పీడించడానికి వాటాలువేసుకుని పంచుకుతినడానికి పోటీలు పడుతున్నాయి. నిజాయితీతో, చిత్తశుద్ధితో ప్రజలకోసం పాటుపడడం లేదు. వీరందరి చరిత్ర ప్రజలకు స్పష్టమే. ఈ వ్యవస్థ ఇలాగే ఉన్నంత వరకు ఎవరినో ఒకరిని ఎన్నుకునే పరిస్థితులే కొనసాగినంత వరకు దుష్ట రాజకీయాలు, బూటకపు ఎన్నికలు కొనసాగుతూనే ఉంటాయి. దానికి పావులుగా ఓటర్లను బలిచేస్తూనే ఉంటారు.

14. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌, చంద్రబాబు సెక్యులర్‌ ఫ్రంట్‌ రేపు పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగేవేనా?

దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలే దేశవ్యాపిత నిర్మాణాలు కలిగి బలంగా ఉన్న జాతీయపార్టీలు. రాజకీయాల్లో ప్రస్తుత దశలో ఈ రెండే కీలక భూమికను నిర్వహించనున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఈ రెండింటినీ సవాల్‌ చేయగలిగిన పరిస్థితులు కనబడడంలేదు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌), ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ (బీజేడీ), ఢిల్లీలో కేజ్రీవాల్‌ (ఏఏపీ), బీహార్‌లో నిశీత్‌ కుమార్‌ (యునైటెడ్‌ జనతాదళ్‌), తమిళనాడులో స్టాలిన్‌ (డీఎమ్‌కే), కర్నాటకాలో కుమారస్వామి (సెక్యులర్‌ జనతాదళ్‌), ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు (టీడీపీ) వీరంతా ప్రాంతీయ పార్టీలను నడుపుతున్నారు. ఒక స్టాలిన్‌ తప్ప మిగిలిన వారంతా ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. వీరికి బీజేపీ వ్యతిరేక ఐక్య కూటమి అవసరం ఉంది. సీపీఐ, సీపీఎంలకు కూడా ఆ అవసరం ఉంది. కానీ వీరి మధ్య ఐక్యతలేదు. కాంగ్రెస్‌ మీద నమ్మకం కుదరడం లేదు. దీన్ని బట్టి ప్రాంతీయ పార్టీల్లో చీలికలను ఈ రెండు పార్టీలు వినియోగించుకుని రెండు కూటములుగా కొనసాగవచ్చు. అందులో భాగంగానే కేసీఆర్‌ బీజేపీకి అనుకూలంగా ఒక లోపాయికారి ఒప్పదంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదంతో కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి కసరత్తు మొదలుపెట్టాడు. కేంద్రం అనుసరించిన అనేక విషయాలలో మద్దతు ప్రకటించడంలో, ప్రత్యేక హోదా విషయంలో ప్రవేశ పెట్టిన మోదీపై అవిశ్వాస తీర్మాణాన్ని ఓడించి మోదీకి మద్దతు ఇవ్వడం లాంటి అనేక విషయాల్లో కేసీఆర్‌ రంగు బయట పడడంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయం తెరమరుగయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ వ్యతిరేక సెక్యులర్‌ ఫ్రంట్‌ కూడా ఇటువంటి అవకాశవాదంతో కూడినదే కనుక వీళ్ల నైజాలు, మోసకారితనం అందరికీ తెలుసు కాబట్టి సెక్యులర్‌ ఫ్రంట్‌ కూడా బలం పుంజుకోవడం కష్టమే.

15. సామ్రాజ్యవాద అనుకూల పాలకవర్గ పార్టీల ఆర్థిక, రాజకీయ విధానాలు ఎలా ఉన్నాయి.

పాలకవర్గ పార్టీలన్నీ తమమధ్య తరతమ భేధాలున్నా దేశంలో దోపిడి, అణచివేతలకు అనుకూలమే. సామ్రాజ్యవాద అనుకూల ఉదారవాద ప్రపంచీకరణ విధానాలను కొనసాగించేవారే. ప్రైవేటీకరణను అనుమతించిన వాళ్ళే. అసమానతలను పెంచినవాళ్ళే. కార్మికుల హక్కులను కాలరాసినవాళ్ళే. నిరుద్యోగాన్ని పెంచిన వాళ్ళే. వ్యవసాయరంగంలో సంక్షోభాన్ని తెచ్చినవాళ్ళే. ప్రజల సంక్షేమాన్ని అటకెక్కించిన వాళ్ళే. రుణమాఫీ, ఉపాధికల్పన, గిట్టుబాటు ధరలు అన్ని గాలికొదిలేసారు. అవినీతికి, దురాక్రమణలకు, కులవివక్ష, మతచాందసం, పితృస్వామిక దాడులు, స్త్రీలపై అత్యాచారాలు, పరువు హత్యలు రోజు రోజుకు పెరిగిపోయాయి. విస్థాపన సమస్య దేశవ్యాపిత సమస్యగా మారింది. విప్లవోద్యమాన్ని, జాతుల ఉద్యమాన్ని అణచివేయడానికి సాయుధ బలగాలతో హత్యా కాండకు పాల్పడడం కొనసాగుతుంది. బ్యాంకుల కుంభకోణాలు. రాఫెల్‌ ఒప్పందాల వంటి కుంభకోణాలు సర్వసాధారణ మయ్యాయి. లక్షల కోట్ల రూ|| మొండి బకాయిలు రద్దుచేయడం, లక్షల కోట్ల రూ|| తిరిగి బ్యాంకులు వారికే రుణాలివ్వడం. అన్నీ చూస్తే దోపిడీ వర్గాల సేవకే అంకితమయినట్లు అర్థమవుతుంది.

Keywords : జగన్, మావోయిస్టు పార్టీ, ఇంటర్వూ
(2019-02-13 20:58:33)No. of visitors : 192

Suggested Posts


ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1

ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో లాబీయింగ్ రాజకీయాలు నడిపిన కేసీఆర్.. ఆ తర్వాత కుటుంబ పాలన నడిపాడు. తన కుటుంబ పాలనను మరో ఐదేళ్లు పొడిగించుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని ఆయన విమర్శించారు.

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3

యావత్తు విప్లవ కాలంలోనూ ప్రజలను ప్రజా సైన్యంలో చేరడానికి ప్రత్యేకంగా ఉత్సాహవంతులను చేస్తూ ప్రోత్సహిస్తుంది. ప్రజా సైన్యానికి అవసరమైన వనరుల పట్ల ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


మావోయిస్టు