వరవరరావుతో పూణేలో మరో రోజు..


వరవరరావుతో పూణేలో మరో రోజు..

వరవరరావుతో

బీమా కోరేగావ్ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా పూణేలోని ఎరవాడ జైలులో వరవరరావు ఉన్నారు. సోమవారం రోజు పూణే స్పెషల్ జడ్డి వద్ద కేసు విచారణ జరిగింది. ఆ రోజు ఆయనతో పాటు ఇతర నిందితులను కలవడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ వెళ్లారు. అక్కడ జరిగిన సంభాషణ, ఇతర విషయాల గురించి వేణుగోపాల్ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకున్నారు. ఆ సంభాషణ యధాతథంగా.
----------------------------------------------------------------------

మిత్రులారా, పుణె స్పెషల్ జడ్జి కోర్టులో సోమవారం నాడు భీమా కోరేగాం కేసు వాయిదా ఉండింది. వరవరరావు గారిని కలవడానికి సహజ, అనల, పవన, నేను వెళ్లాం.

పన్నెండింటి నుంచి కోర్టులో ఎదురుచూస్తూ ఉండగా, వరవరరావుగారిని, మిగిలిన వారందరినీ జైలు నుంచి కోర్టు ప్రాంగణంలోకి తీసుకువచ్చారని రెండున్నరకు తెలిసింది. కోర్టు ప్రాంగణంలో పోలీసు లాకప్ ఉందని, కోర్టు హాల్లోకి పిలిచేవరకూ అక్కడ ఉంచుతారని తెలిసి అక్కడ చూడ్డమైనా వీలవుతుందని అక్కడికి వెళ్లాం. మామూలుగా హైదరాబాదులో గాని, ఇతర చోట్ల గాని జైలు నుంచి వచ్చే పోలీసు వాన్లు కోర్టు ప్రాంగణంలో బహిరంగ ప్రదేశంలో నిలిచి ఉంటాయి. ఆ వ్యాన్లకు జాలీలు ఉన్నప్పటికీ, కొద్ది దూరంలో నిలబడి లోపలి మనవాళ్లతో మాట కలపడానికో, చూసుకోవడానికో, సైగల భాషలో సందేశాలు పంపడానికో వీలవుతుంది. 1973 నుంచి వరవరరావు గారితో మేం అలా ఎన్నోసార్లు మాట్లాడాం. కాని పుణె కోర్టు ఆవరణ లోపలే ఒక గేటుతో మరొక చిన్న ఆవరణ, దాంట్లో పోలీసు కార్యాలయం ఉంది. ఆ గేటు ముందు బందోబస్తు. జైలు నుంచి వచ్చిన వాన్లు ఆ చిన్న ఆవరణలోకి వెళ్తాయి. సుధా భరద్వాజ్ కు న్యాయవాదిగా ఉన్న రాగిణి అహుజా తో కలిసి మేం ఆ వాన్ల దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడి పోలీసులు మమ్మల్ని ఆపేశారు. న్యాయవాదిని కూడ వెళ్లనివ్వలేదు. దూరం నుంచి వ్యాన్లలో ఉన్నవారి ముఖాలు కనబడలేదు గాని వారు పలకరింపుగా చేతులు ఊపడం కనబడింది.

చివరికి పావు తక్కువ మూడుకు వాళ్లందరినీ కోర్టు భవనంలోకి తీసుకువచ్చారు. ఒక వాన్ లో తీసుకువచ్చిన వర్నన్ గోంజాల్వెజ్, అరుణ్ ఫరేరా, వరవరరావులను ముందు, మరొక వ్యాన్ లో తీసుకువచ్చిన సుధా భరద్వాజ్ ను ఆ తర్వాత, ఇంకొక వ్యాన్ లో తీసుకువచ్చిన సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్ లను ఆ తర్వాత తీసుకువచ్చారు. వీళ్లలో ఒక్క మహేశ్ తోనే నాకు ముఖ పరిచయం లేదు. అందరినీ ఒక్కచోట చూడడం సంతోషం. అందరూ ఉత్సాహంగా ఉన్నారని చూడడం మరొక సంతోషం. పోలీసుల అదిలింపులకు ముందు కొద్ది సెకన్ల కోసమైనా ఒక్కొక్కరినీ కావలించుకోగలగడం మరొక సంతోషం. ఆ సమయానికి కోర్టు హాల్లో మరొక కేసు నడుస్తున్నందువల్ల మొదట కారిడార్ లో ఒక బెంచి మీద అందరినీ కూచోబెట్టారు. వాళ్లను కలవడానికి హైదరాబాదు నుంచి వెళ్లిన మాతోపాటు ముంబై, పుణె, బెంగళూరుల నుంచి వచ్చిన వాళ్లం దాదాపు పదిహేను మందిమి ఉన్నాం.

బెంచీల మీద కూచోబెట్టిన వాళ్లకు అడ్డంగా నిలబడిన పోలీసుల భుజాల మీంచీ పక్కల నుంచీ అలా ఓ పది నిమిషాలో పావు గంటో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈలోగా వివి గొంతు తడి ఆరిపోతున్నదంటే మా దగ్గరి నీళ్ల సీసా ఇచ్చాం. ఆయన ఒక గుటక వేయగానే పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఖైదీలు బైటి ఆహార పానీయాలు తీసుకోగూడదని నియమం! కూతురు ఇచ్చిన నీళ్ల సీసాకు అభ్యంతరం చెప్తారా అని గొడవ చేస్తే, సీలు విప్పని సీసా తెమ్మన్నారు! నేను నీళ్ల సీసాల కోసం పరుగెత్తుకుని వెళ్లి ఐదు నిమిషాల్లో వెనక్కి వచ్చేసరికి, ఆ కారిడార్ లో ఇరుకు అవుతున్నదని చెప్పి, మెట్లు, లిఫ్ట్ ఉన్న విశాలమైన వసారాలోకి తెచ్చి కూచోబెట్టారు. అక్కడ మరొక పది నిమిషాలో, పావుగంటో మాట్లాడగలిగాం.

ఆ తర్వాత వాళ్లను కోర్టు హాల్లోకి తీసుకువెళ్లారు. కోర్టు హాల్లో దాదాపు గంటన్నర పాటు మూడు అంశాల మీద వాదనలు జరిగాయి. మొదట సురేంద్ర గాడ్లింగ్ తన బెయిల్ పిటిషన్ మీద నేను గతంలో రాసినట్టే అద్భుతంగా వాదనలు కొనసాగించాడు. ఈసారి వాదనల్లో అత్యధిక భాగం మరాఠీలో జరిగాయి గనుక ప్రతి వాక్యమూ నేను గ్రహించలేకపోయాను గాని సురేంద్ర కనీసం మూడు సార్లు కోర్టు హాలంతా గొల్లుమని నవ్వేట్టు చేశాడు. మామూలుగా ఏ భావమూ కనిపించకుండా (పోలీసులకు అనుకూల భావం మాత్రమే కనిపించేట్టు) ఉండే జడ్జి కూడ నవ్వక తప్పని పరిహాసాలు అవి. తర్వాత మిత్రులను అడిగితే నిందితులు చేతికి గ్లవ్స్ వేసుకురావడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెపుతున్నారని, ఇక నుంచి సాక్స్ వేసుకు రావడానికి కూడ అభ్యంతరం చెపుతారేమోనని అన్నాడట. ఒక ప్రశ్న అడిగితే అడగని మరొక ప్రశ్నకు ప్రాసిక్యూటర్ జవాబు చెపుతున్నారని, ఇది ఎడమ కంటికి శస్త్రచికిత్స కోసం వెళ్తే కుడి కంటికి శస్త్ర చికిత్స చేసినట్టుగా ఉందని అన్నాడట. మధ్యలో ఇంగ్లిష్ లో వాదిస్తూ ʹపబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గాలిలో వాదనలు చేస్తున్నారు. నా వాదనలు చట్టం మీద ఆధారపడి ఉన్నాయిʹ అన్నాడు.

తర్వాత మహేశ్ రౌత్ తదితరుల బెయిల్ పిటిషన్ల గురించి, ఆ వాదనలు చేయడానికి అవసరమైన పత్రాలు ప్రాసిక్యూషన్ తమకు ఇవ్వకపోవడం గురించి వాదనలు జరిగాయి. ʹఒకవైపు సుప్రీంకోర్టుకు ఇచ్చిన పత్రాలలో వారి దగ్గర జప్తు చేసిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల పరిశోధన పూర్తి కాలేదని అన్నారు, మరొకవైపు ఇక్కడ ఆ ఉపకరణాల్లో ఏమేమి ఉన్నదో చెప్పి అందువల్ల బెయిల్ ఇవ్వగూడదని కోరుతున్నారు. అది వాస్తవమా, ఇది వాస్తవమాʹ అని నిలదీస్తే జడ్జి ఉలుకూ పలుకూ లేదు!

ఇక తన కుటుంబ సభ్యులకు రాసిన ఒక ఉత్తరాన్ని పంపడానికి జైలు అధికారులు నిరాకరించారని, ఆ ఉత్తరంలో పంపడానికి నిరాకరించేంత అభ్యంతరకర విషయం ఏమిటో తేల్చాలని సుధీర్ ధావ్లే వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ ఉత్తరం ప్రతి తనకు ఇస్తే జవాబు చెపుతానని ప్రాసిక్యూటర్ అన్నారు. వెంటనే ఆ ప్రతి ఇస్తే, ఆమె అది పైనుంచి కిందికి రెండుసార్లు చదివి ఏమీ చెప్పలేక వాయిదా కావాలని కోరారు. జడ్జి వాయిదాకు అంగీకరించాడు. డిసెంబర్ 20 మరుసటి వాయిదా అన్నారు. ఈలోగా జైలులో ఏ పుస్తకం ఇవ్వాలన్నా కోర్టులో పిటిషన్ వేసుకోవలసిందే గనుక వరవరరావు గారు అడిగిన పుస్తకాల కోసం ఒక పిటిషన్ వేశాం. ఇంగ్లిష్ – ఇంగ్లిష్ డిక్షనరీ, ఇంగ్లిష్ - తెలుగు డిక్షనరీ, కవిత్వం, కథ, నవలల పుస్తకాలు అవి. ఆ పిటిషన్ మరుసటి వాయిదాలో పరిశీలిస్తామని అన్నారు.

ʹహైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులు వచ్చారు, వారిని కలవనివ్వడానికి అనుమతి ఇవ్వాలʹని కోరితే, ʹరక్తబంధువులకు మాత్రమేʹ అని జడ్జి, ʹపోలీసుల సమక్షంలోʹ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతు కలిపారు. ఐదు నిమిషాలు గడిచిందో లేదో, వర్నన్, అరుణ్ లను కూడ వెంట తీసుకొచ్చిన పోలీసులు ʹఇక బయల్దేరమని ఒత్తిడి మొదలుపెట్టారు. ʹవాన్ దాకా పక్కన నడుస్తూ మాట్లాడుకోండిʹ అన్నారు. ఆ నడక మరొక ఐదు నిమిషాలు. ఆ నడక కూడ పూర్తి కాకముందే ʹఇంకేం, కడుపు నిండలేదాʹ అని ఎస్కార్ట్ జమేదార్ అదిలింపులు. ʹమీకు మీ కుటుంబసభ్యులతో రెండు నిమిషాలు మాట్లాడితే కడుపు నిండుతుందాʹ అని అరిచాను గాని అప్పటికే పోలీసు ఆవరణలోకి ప్రవేశిస్తూ మమ్మల్ని ఆపేశారు. మమ్మల్ని వదిలి వరవరరావుగారు ఆ ఆవరణలో ప్రవేశిస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు.

ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో, మామూలుగానే చలికి తట్టుకోలేని ఆయన, హైదరాబాదు కన్న ఐదారు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఆ ఎరవాడ చలి జైలులో నేల మీదనే పడుకోవలసి వచ్చినా, ఎటువంటి ఫిర్యాదూ లేకుండా, ధైర్యంగా, ఉత్సాహంగా, ఎప్పటిలాగే ఉత్తేజకరంగా మాట్లాడుతున్నారు. రాత్రి పూట ఎవరికి వారు ఒంటరి సెల్ లో పడుకోవలసి ఉన్నప్పటికీ రోజంతా వర్నన్, తాను ఒకే ఆవరణలో, ఉరిశిక్ష పడిన ముస్లిం ఖైదీలతో కలిసి ఉన్నామని, ఆ ముస్లిం ఖైదీలు చాల స్నేహంగా, తనకు చాల సహకారంగా ఉన్నారని చెప్పారు. భూమయ్య కిష్టాగౌడ్ లతో పరిచయం, ఉరితీసే ముందు జైలులో మొదటి, చివరి కలయిక గురించి పెద్ద రచన చేశానని, తెలుగు తెలిసిన సెన్సార్ అధికారులు లేరనే పేరుతో దాన్ని బైటికి పంపడానికి అనుమతించరని అన్నారు.

మిత్రులందరి గురించి పేరు పేరునా అడిగారు. బైట జరుగుతున్న రాజకీయ, సామాజిక సందర్భాల గురించి అడిగారు.

- ఎన్. వేణుగోపాల్,
ఎడిటర్, వీక్షణం.

Keywords : varavararao, pune,bhima koregaon, case, police, వరవరరావు, బీమా కోరేగావ్, పోలీసులు, కేసు, వాయిదా
(2019-03-16 04:11:41)No. of visitors : 519

Suggested Posts


0 results

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


వరవరరావుతో