కవితామయ జీవితం - శిల్ప ప్రయోగ విప్లవం


కవితామయ జీవితం - శిల్ప ప్రయోగ విప్లవం

కవితామయ

తెలుగు కవితావరణంలో వివికి రాజకీయ కవి అనే గుర్తింపు ఉన్నది. కవిత్వం రాస్తూ, ప్రసంగాలు చేస్తూ, నక్సలైట్లతో జతగట్టి, వాళ్ల విప్లవం జయించాలని కార్యకర్తృత్వం నెరపుతూ పదే పదే జెయిలుకు వెళ్లి వచ్చే కవి గురించి ఇలా అనుకోవడం ఉచితమే. నిత్యం జనం మధ్యలో బతికే వివికి ఒంటరితనం గురించి వలపోస్తూ కవిత్వం రాసే అవకాశమే రాలేదు. మాటలకు, పోరాటానికి, మౌనానికి, ధ్యానానికి కూడా మానవ సంబంధాల్లోంచి నిరంతరం అర్థ వ్యాఖ్యానాన్ని నిర్మించే కవి కాబట్టి అర్థ విచ్ఛేద కవిత్వం రాసే సందర్భమే ఎదురవ్వలేదు. గెలుస్తూ ఓడుతూ కోటి గొంతులతో ఆశావహ గర్జనలు చేసే అట్టడుగు జనం నోరు తిరిగే కవితా నిర్మాణాలను ఎంచుకుంటున్న సృజనకారుడు కాబట్టి నిర్వేదం, నిరాశ, నిరామయ దు:ఖం ఆయన కవితా వస్తువులు కాలేకపోయాయి. ఒక గొప్ప భవిష్యత్‌ను మానవాచరణలోంచి ఊహా కెరటాలుగా తన కవిత్వంలోకి ఒంపే కవి కాబట్టి విశ్వాసాల గాలిపటాలకు దారాలు తెగిపోయాయనే వగపు నీడలను తన అక్షరాల మీద ప్రసరించనివ్వలేదు.

ఇన్ని కలవడం వల్ల సహజంగానే ఆయన్ను రాజకీయ కవి అని తెలుగు సాహిత్యలోకం సకారణంగానే గుర్తించింది. రాజకీయ కవి కాబట్టి రాజకీయాలేగాని కవిత్వం ఉండదని, రాజకీయాల కోసం రాసిన కవిత్వమే కాని జీవితంలోంచి రాసిన కవిత్వం కాదనే వాళ్లూ ఉంటారు. ఇలా నేరుగా అనకపోయినా రాజకీయ కవి అనే మాటలో ఈ అంతరార్థాలూ వినిస్తుంటాయి.

బహుశా 1974లో త్రిపురనేని మధుసూదనరావు మినహా మరెవ్వరూ ఇప్పటికీ వివి కవిత్వాన్ని అంచనా వేయాలనే ప్రయత్నం చేయలేదు. ఆయన ఊరేగింపు కవితా సంపుటిని సృజనలో సమీక్షిస్తూ- మార్క్సిస్టులు కవిత్వాన్ని థింకింగ్‌ ఇన్‌ ఇమేజెస్‌గా నిర్వచిస్తారు. వివి కవిత్వం ప్రధానంగా ఈ కోవకు చెందింది అన్నారు. ఆలోచనాత్మక ఇమేజరీలతో చారిత్రక విహితత్వం వైపు ఆలోచనలను సుముఖం చేసే లక్షణం వివి కవిత్వంలో ఉంటుందని చెప్పారు.

*** *** ***

ప్రధానమంత్రి హత్యకు కుట్రపన్నాడనే అభియోగం మీద వివి ఇప్పుడు మరోసారి జెయిలుకు వెళ్లారు. అర్బన్‌ మావోయిస్టులంటే ఇదుగో ఇలా ఉంటారని సంఘ్‌ ప్రభుత్వం ఆయన వైపు చూపిస్తోంది. మోదీని హత్య చేయడానికి ఆయన ఎక్కడెక్కడి నుంచి ఆయుధాలు సమకూర్చాడో, ఎన్నెన్ని నిధులు పోగేశాడో న్యాయస్థానం ముందున్న సాక్షాలనుబట్టి తెలుసుకోవచ్చు. కానీ తన అరవై ఏళ్ల కవితామయ జీవితంలో ఆయన తెలుగు కవిత్వానికి సమకూర్చిన వైవిధ్యభరిత వస్తువులను, దృక్పథ నిబద్ధతలను, శిల్ప ప్రయోగాలను ఇప్పటికైనా పరిశీలించాలి. కవిగా ఆయనను తెలుసుకోవాలి.

వివి కవిత్వంలో ఏముందో ఇప్పటికీ విమర్శకులు పెద్దగా విశ్లేషించకపోవడానికి ఒక కారణం ఉంది. మొదట దాన్ని గుర్తించాలి. మామూలుగా ఇప్పుడు విమర్శరంగంలో ఉన్న పరికరాలతో, పరికల్పనలతో వివి కవిత్వాన్ని వివరించడం కష్టం. ఇది ఎందుకో తేల్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో వివి కవిత్వం కొంత అర్థం కావచ్చు.

కవిని-కవిత్వాన్ని వేరు చేయడానికి ఎంత అవకాశం ఉంటే అంతగా ఆ కవిత్వ విశ్లేషణలో సౌకర్యం ఉంటుంది. వాచక విశ్లేషణకు ఇదొక ప్రమాణం. నిజానికి కవి ఎవరో పక్కన పెట్టి వాచకం తనంతతాను ఏం ప్రకటిస్తుందో వెతికి, విశ్లేషించి, అంచనా కట్టడం వాచక విశ్లేషణలోని బలం. అందుకే కవి ఎవరో తెలియకుండా, తెలుసుకోనవసరం లేకుండా చాలా రకాల కవిత్వాన్ని వివరిస్తుంటాం. ఇలాంటి కవిత్వం గొప్పది కాదని ఎవ్వరూ అనలేరు. కవి నుంచి, స్థల కాలాల నుంచి వేరు చేసి కూడా పరిశీలించే వెసులుబాటు ఆ కవిత్వంలో ఉంటుంది.

కానీ వివి కవిత్వం అలా కాదు. ఆయన నుంచి, ఆయన నిర్దేశించుకున్న, లేదా చరిత్ర ఆయనకు నిర్దేశించిన స్థల కాల కంఠస్వరాల నుంచి వేరు చేసి వివి కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో చాలా చిక్కులు ఉన్నాయి. అర్థం చేసుకోలేకపోవడం అనే సమస్య వివి కవిత్వానికి వర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఎదురు కావచ్చు. నిజమే. ఆయన నుంచి వేరు చేస్తే ఆయన కవిత్వాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవడం ఒక గంభీరమైన ప్రత్యేకత.

స్థలకాల రహితంగా ఊహిద్దామని, జీవిద్దామని ఎవరైనా అనుకుంటారేమో. కానీ అలాంటి ప్రయత్నంలోంచే స్థలకాలాలు ప్రతిబింబిస్తుంటాయి. అంతగా మనిషి ఆలోచన, సృజన మాత్రమే గాక ఉనికే స్థల కాలబద్ధమై ఉంటుంది. అందువల్లే లోతట్టు మానవ అనుభవాలు, వాటి కళాత్మక వ్యాఖ్యలు సాధారణీకరణ పొందుతాయి.

వివి కవిత్వంలో స్థల కాల ప్రమేయం లేని ఒక్క ఊహ కూడా ఉండదు. ఆయన తన కవిత్వ ప్రపంచాన్నంతా అంతగా స్థల కాలబద్ధం చేశారు. ఈ కారణం వల్లే సాధారణీకరణకు తగిన పద్ధతిలో వేర్వేరు సమయ సందర్భాలకు అన్వయమయ్యే మూడ్‌ ఆయన కవిత్వంలో కొనసాగుతూ ఉంటుంది. అది ఆ కవిత రాసిన స్థల కాలాల్లోని ఆయన వైయుక్తిక మూడ్‌ కాదు. భవిష్యత్‌లోని అనేక స్థలకాలాలతో కనెక్ట్‌ అయ్యే మూడ్‌. ఆ రకంగా అది సాధారణీకరణ పొందుతుంది.

అయితే ఇదంతా ఆయన వ్యక్తిత్వం నుంచి కవిత్వానికి సంక్రమించిందే. ఏ రచయితకైనా ఇది వర్తించేదే కదా ? అనిపించవచ్చు. ఆయన నుంచి ఆయన కవిత్వాన్ని వేరు చేయలేం అనే మాటకు చాలా విస్తృతమైన అర్థం ఉంది. తరచి చూస్తే అది వివిలో ఎంత గాఢంగా ఉంటుందో ఇట్టే చెప్పవచ్చు. చాలా సరళంగా, ఎవరికైనా వర్తించే ఈ వాస్తవం వివి విషయంలో అనేక స్థాయిల్లోని సామాజిక, వ్యక్తిగత స్థాయి ప్రక్రియల వల్ల చాలా సంక్లిష్టంగా ఉంటుంది.

వివి నుంచి ఆయన కవిత్వాన్ని వేరు చూడలేకపోవడానికి పునాది విప్లవోద్యమం నుంచి ఆయన్ను వేరు చేయలేకపోవడంలో ఉంది. విప్లవ కవులందరూ ఉద్యమంలో భాగమే. కానీ విప్లవోద్యమంతో వివి సంబంధం అభేదమైనది. దీన్నుంచే ఆయన కవితా సృజనకు, విప్లవోద్యమానికి మధ్య ఆర్గానిక్‌ రిలేషన్‌ ఏర్పడింది. దీన్ని ఆయన చైతన్యయుతంగా నిర్మించుకున్నారు. మెకానికల్‌గా చూసేవాళ్లకు మావోయిస్టు ఉద్యమం మాటే వివి మాట అని అర్థమయ్యే ప్రమాదం ఉంది. రాజకీయ విషయాల్లో ఇది నిజమే. అయితే కవిగా ఆయన ఫంక్షనింగ్‌లో ఈ సంబంధం ఎలా ఉంటుంది? అనేది చాలా ఆసక్తికరం.

పైన చెప్పిన ఆర్గానిక్‌ రిలేషన్‌ ఆయన కవి వ్యక్తిత్వంలోని కోర్‌. ఇది ఎలా పని చేస్తుందో అర్థం కాకపోతే వివి కవిత్వాన్ని అంచనా వేయడం కష్టం. ఈ ఆర్గానిక్‌ రిలేషన్‌ వల్ల ఆయన విప్లవోద్యమ చరిత్ర గతిలో ఆయన కవి సంస్పందనలు వినిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఆయన కవిత్వం సామాజిక చరిత్రకు కవితా రూపం. సామాజిక చరిత్ర ఛాయలు ఏ మంచి సాహిత్యం మీద అయినా ఉంటాయి. కొన్ని రచనల్లో సామాజిక చరిత్ర కంఠస్వరం కొట్టవచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. సామాజిక చరిత్రలోని సంకీర్ణత, బహు ముఖీనత, విభిన్న తలాల వ్యక్తీరణ వివి కవిత్వంలో పలుకుతూ ఉంటుంది.

ఇవేవీ తెలియపోతే వివి కవిత్వానికి రాజకీయ కవిత్వమనే లేబుల్‌ తగిలించి చేతులు దులిపేసుకుంటారు. రాజకీయ కవిత్వం అంటే తక్కువ స్థాయిదనే నిందను అంగీకరిస్తూ, ఆ కోవకు వివి కవిత్వం చెందని వాదించడం కోసం ఈ మాట అనడం లేదు. అసలు రాజకీయ కవిత్వం అనే సూత్రీకరణ చేసినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దానిలోకి ఇప్పుడు వెళ్లడం లేదు. వివి కవిత్వం ప్రత్యేకత, విస్తృతి, లోతు, ఆయన చేసిన ప్రయోగాలు విమర్శకులు పట్టుకోలేకపోవడానికి కారణాలున్నాయని చెప్పడమే ఉద్దేశం.

ఈ సమస్యను పరిష్కరించడానికి వివి కవిత్వ పరిణామాన్ని విప్లవోద్యమ వికాస క్రమం, తెలుగు కవిత్వంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, కవిగా ప్రయోగాల వల్ల ఆయన ఎప్పటికప్పుడు సాధిస్తున్న ఎక్స్‌టెన్షన్‌ అనే మూడు ముఖ్యమైన ప్రాతిపదికలను ఎంచుకోవచ్చు.

చివరి రెండు అందరికీ వర్తించేవే. కానీ మొదటిది వివి కవిత్వ వికాసానికి ఇంజన్‌. ఉద్యమం, రాజ్యం, ఈ రెండూ భాగమైన సమాజంలోని నిరంతరాయ మార్పులు ఈ మొదటి అంశంలోకి వస్తాయి. ఇంకా బాగా చెప్పాలంటే నిరంతరాయంగా పురోగమించే ప్రజల సృజనాత్మకమైన ఉత్పత్తిదాయక ఆచరణ దీనికి పునాది. మార్క్సిస్టు పరిభాషలో చెప్పాంటే వర్గపోరాట ఆచరణ. దాని చుట్టూ, లోపల ఉండే సంక్లిష్ట ప్రభావాలు, చైతన్యక్రమాలు, సంఘర్షణలు అన్నీ వివి కవిత్వాన్ని తీర్చిదిద్దుతూ వచ్చాయి. ఈ ప్రక్రియ అనేక తలాల్లో చాలా సహజంగా జరిగిపోయింది. అది ఎంత సహజమంటే ఆయన చాలా ఉద్దేశపూర్వకంగా చేసిన కవితా ప్రయోగాలు కూడా చప్పున గుర్తించలేనంతగా. వర్గపోరాట మమేకతలో వ్యక్తిగా ఆయన సాధించిన హైట్స్‌ ముందు సృజనకారుడిగా ప్రత్యేకతలేవీ మనకు స్పురించవు. నిజానికి ఇదే ఆయనలోని ఒక ప్రత్యేకత. దీన్ని వివరించడానికి ప్రత్యేకమైన పరికరాలు కావాలి.

ఈ మొత్తంతో నిమిత్తం లేకుండా మామూలుగా మన ముందుండే విమర్శ పరికరాలతో వివి కవిత్వాన్ని వివరించబోతే ఏ నిర్ధారణకూ రాలేం. అంటే ఒక రచనను విశ్లేషించడానికిగాని, లేదా రచయితతో కలిపి రచనను వివరించడానికి గాని ఇప్పటికి మన ముందు ఉన్న పరికరాలు వివి కవిత్వ విశ్లేషణకు సరిపోవు.. ఒక మేరకు ఉపయోగపడవచ్చు. అంతే.

విప్లవ పోరాటాల్లో, ప్రపంచ యుద్ధాల్లో, ప్రజా సంచలనాల్లో నేరుగా సైన్యంతో కలిసి నడిచిన రచయితలను మన దేశ, విదేశాల్లో చూస్తాం. వివి అలాంటి ఆచరణను ఎంచుకోకపోవచ్చు. కానీ సుదీర్ఘకాలంపాటు విప్లవోద్యమ మమేకతలోంచే సృజనాత్మక ప్రేరణ పొందుతున్న కవి ఆయన. ఆయన చేసిన ప్రయోగాలను కూడా ఈ సంబంధంలో గమనించాల్సిందే. తెలుగు విమర్శకుల్లో చాలా మందికి ఇంత సంకీర్ణమైన సంబంధాల పొరలను పరిగణలోకి తీసుకొని అక్కడి నుంచి వ్యక్తమయ్యే కవితా రూపాలను వివరించే అవగాహన లేదు.

ఈ ప్రత్యేకత జననాట్యమండలి పాటలకు, అల్లం రాజయ్య కథలకు, దండకరణ్య కాల్పనిక సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఈ కళా సాహిత్యాల మీద విప్లవ విమర్శకులే కొంత చెప్పారుగాని మిగతా అక్కడక్కడా పలవరింతలు, ప్రశంసలు, నిందలే కనిపిస్తాయి. అనుకూలంగానూ, ప్రతికూలంగానూ కూడా వివిని రాజకీయ కవి అనేది ఇందులో భాగమే. అనుకూల అర్థంలో అయినా రాజకీయాల వల్లనే వివి కవిత్వానికి వచ్చిన శక్తి, వైవిధ్యం, వస్తు విస్తృతి, పాఠకులపై ప్రభావం మొదలైన వాటిని చాలా లోతుగా చర్చించాలి. నిజానికి అది చాలా పెద్ద పని. వివి కవిత్వం కోసం ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే అది తప్పనిసరిగా విప్లవ సాహిత్యంలోని అన్ని పాయలను అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుంది.

*** *** ***

తొలి దశలో నెహ్రూ సోషలిజం పట్ల ఆదర్శ భావం, భాషలో కొంచెం సంప్రదాయ ధోరణి వివి కవిత్వంలో కనిపిస్తుంది. కుటుంబ, చారిత్రక స్థలకాలాలకు సంబంధించిన పరిమితి ఇది. దాన్ని అధిగమించే అనుకూలాంశాలు కూడా అందులోనే ఉన్నాయి. వాటిని గుర్తించినందు వల్లే ఆయన తన తొలి కవిత్వ దశను అధిగమించారు. వ్యక్తి పాత్ర ఇలాంటి చోటే ఉంటుంది. ఆ తర్వాత తిరుగబడు కవిగా, విప్లవ కవిగా పరిణామం చెందారు. చలినెగళ్లు, జీవనాడి, ఊరేగింపు సంకలనాలు జాగ్రత్తగా చదివితే ఈ ఫార్మేషన్‌ వెనుక ఏం జరిగిందో గమనించవచ్చు. పైగా అది ఆయన ఒక్కడి పరిణామమే కాదు. అప్పటి దాకా ఉన్న అనేక పోకడలను తెలుగు కవిత్వం విసర్జించి విప్లవం కోసం సిద్ధమవుతున్న కాలం అది.

ఇందులో శ్రీశ్రీ సహా తెలుగు కవిత్వంలో అప్పటికే సుప్రసిద్ధులందరూ భాగం. వీరంతా కవిత్వ స్వభావం, జీవితంలో కవిత్వం పాత్ర గుర్తెరిగిన వాళ్లు. మౌలికంగా కవిత్వం అంటే ఏమిటో తెలిసిన వాళ్లు. అలాంటి వాళ్ల ఆధ్వర్యంలో ఒక చారిత్రక యుగానికి తెరతీసిన పోరాటశక్తులే నేరుగా కవిత్వపు కంఠస్వరాన్ని తీర్చిదిద్దాయి. మిడిమిడి జ్ఞానంతో, దురుద్దేశాలతో 1970ల విప్లవ కవిత్వమంటే కొట్టు, నరుకు, చంపు అని ఒక పక్క, ఆ దశకం కవిత్వం విరసానిదే అని ఇంకో పక్క మన విమర్శకులు పూర్తి హేతురహిత వాదనలు వినిపించిన రోజులవి. సరిగ్గా ఆరోజుల్లోనే వివి తనను తాను సెట్‌ చేసుకున్నారు. ఇది జీవనాడిలో కనిపిస్తుంది. చాలా గొప్పగా ఊరేగింపులో కనిపిస్తుంది.

తొలినాళ్లలో విప్లవ కవిత్వం తనను తాను తీర్చిదిద్దుకొనే ప్రయత్నం ఒక సంరంభంగా సాగించింది. ఈ మొత్తం ప్రయత్నంలో జీవనాడి నుంచి ఊరేగింపు దాకా వివి కవిత్వం భాగం. ఈ క్రమాన్ని 1974 మే నుంచి 1977 మార్చి దాకా జెయిల్లో ఉంటూ రాసిన స్వేచ్ఛ కవితా సంపుటి చాలా పైకి తీసికెళ్లింది.

ఇదంతా గుర్తు చేయడం ఎందుకంటే వివి కవిత్వ శిల్పాన్ని ఉద్యమం, జెయిలు, ప్రవాసం నిరంతరం ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఈ ప్రయోగాలు ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినవే కావచ్చు. కానీ వాటిని ప్రేరేపించిన శక్తులు వేరే ఉన్నాయి. వాటి గురించి, ఆ ప్రభావాల బహుముఖీనత గురించి తెలియకపోతే వివి కవిత్వ ప్రయోగాలను వివరించడం కష్టం.

ఆయన జెయిల్లో ఉంటూ రాసిన స్వేచ్ఛ, సహచరులు (ఇది కవిత్వం కాకపోయినా జైలు కవి మనస్థితి నుంచి వచ్చిన కవితాత్మక రచనే), ముక్తకంఠం (1986-89), అంతస్సూత్రంలోని (2006) జెయిలు కవితలు చదివితే తన ఖైదు జీవితమే కాదు, ఆ కాలంలో బైటి సామాజిక, పోరాట వాతావరణం కూడా ఆయన కవిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని అర్థమవుతుంది.

మామూలుగా ఎవరి రచననైనా సొంత జీవిత మూలాలు, పరిశీలన, అధ్యయనం వల్ల సొంతమయ్యే విషయాలు, వాటన్నిటిపై వెలుగు ప్రసరించే దృష్టి కోణం, వ్యక్తిగత ప్రతిభ.. ఇందులో భాగంగా నిరంతరం ఎక్స్‌టెన్షన్‌ కోసం ప్రయత్నించడం, దానికి దోహదపడే ప్రయోగ దృష్టి వగైరా నిర్దేశిస్తాయి.

కానీ విప్లవ కవికి వీటన్నిటితోపాటు ఇంకా చాలా విస్తృత ప్రపంచం ఉంటుంది. దాంతో క్రియాశీలమైన సంపర్కం ఉంటుంది. ప్రపంచంలోని ఏదో ఒక భాగంతో సంపర్కం లేని మనుషులు ఎవ్వరూ ఉండరు. కవులు తనదైన పద్ధతిలో ఏదో ఒక విధంగా ప్రపంచంతో సంపర్కంలో ఉంటారు. ఒక్కోసారి ఇది పాసివ్‌ ఇన్‌టరాక్షన్‌ కావచ్చు. తెలుగు కవుల్లో ఇది చాలా ఎక్కువే. విప్లవ కవులకు తమ పరిసరాలతో యాక్టివ్‌ ఇన్‌టరాక్షన్‌ ఉంటుంది. రాజకీయాల్లో, సామాజిక సంబంధాల్లో, భావజాల సంఘర్షణలో క్రియాశీలంగా ఉంటారు. స్థలకాలాలను బట్టి వివిధ ఆచరణ రూపాలను ఎంచుకోవచ్చు. నేరుగా విప్లవోద్యమానికి సంబంధించిన ఏదో ఒక రంగంలో ఆచరణ కొనసాగిస్తూ ఉండవచ్చు.

వివికి మొదటి నుంచి ఆ ప్రపంచం చాలా విస్తారం. పరిసరాలతో ఆయన క్రియాశీల జోక్యం ఎక్కువ. ఏదో విపత్తు వచ్చిపడ్డప్పుడు కవులు రోడ్డు మీదికి వచ్చి వెళిపోతుంటారు. అంటే నేరుగా బహిరంగ జీవితాన్ని స్పృశించిపోతారు. వివికి సమాజంతో, దాన్ని మార్చే మానవ ఆచరణతో భిన్న తలాల్లో గాఢమైన సంపర్కం ఉంటూ వచ్చింది. చాలా సంక్లిష్ట ప్రభావాల, వొత్తిళ్ల మధ్యలో కొనసాగుతుంటారు. ఇదంతా ఆయన కార్యకర్తృత్వానికి సంబంధించిందే కాదు. వాస్తవానికి ఆయక కవిత్వానికి ఇదే నిత్య ప్రేరణ. వ్యవస్థతో పొసగనితనమే కవిత్వానికి ఆలంబన. ఇది విప్లవ కవికి కేవలం భావనే కాదు. ఎక్కడో ఒక చోట భౌతిక కార్యాచరణలో భాగం. అందువల్ల పొసగనితనం తీవ్రమైన ఘర్షణకు దారితీస్తుంది. ఇక్కడి నుంచి కొత్త వ్యవస్థ గురించిన గాఢమైన కలలు వెంటాడుతుంటాయి. వర్తమాన వ్యవస్థ తీరు మీద విమర్శా దృష్టి ఏర్పడుతుంది. ఒక భౌతిక ప్రపంచం నుంచి కవిత్వ ప్రపంచంలోకి ఒక బలమైన ఆధారం మీద విప్లవ కవులు విస్తరిస్తారు.

విప్లవ కవులకు, విప్లవ కవిత్వానికి ఈ ఒరవడి అందివ్వడంలో వివి పాత్ర గణనీయం. ఇంకోలా చెప్పాలంటే ఆయన అభేద సంబంధంలో ఉండే విప్లవోద్యమం పాత్ర ఇక్కడే ఉన్నది. వివి కవిత్వ వస్తు విస్తృతి, శిల్ప ప్రయోగాలు వగైరా ఏది చర్చించాలన్నా పైన చెప్పిన వాటిపట్ల ఎరుక ఉండాలి. కవి నుంచి కవిత్వాన్ని వేరు చేసి విశ్లేషించలేమని అన్నది ఈ దృష్టితోనే.

ఉదాహరణకు ముక్తకంఠంలోని వివి కవితా శైలిని గుర్తు చేసుకోండి. మామూలుగా ఆయనది ఉద్వేగపూరిత వ్యక్తిత్వం. ఆయన పనిలో, ప్రసంగ శైలిలో ఇది కనిపిస్తుంది. కానీ ముక్తకంఠంలో సాధించిన కవితా శైలిని దీనితో పోల్చి పరిశీలించవచ్చు. కవిగా ఆయన చాలా హైట్స్‌కు ముక్తకంఠంలో చేరుకున్నారు. జెయిల్లోంచే రాసిన స్వేచ్ఛతో పోల్చితే కూడా ఇది అర్థమవుతుంది. ముక్తకంఠంలో వివి సహజమైన ఉద్వేగం ఉండదు (స్వేచ్ఛలో కూడా ఇది చాలా తక్కువే). తన ఒంటరి జైలు జీవితం లోతట్టు పొరల్లోకి తొలుచుకుంటూ వెళ్లి తనను, తన చుట్టూ ఉండే పరిసరాలను సరికొత్తగా చూసుకునే దర్శనశైలి కనిపిస్తుంది. అక్కడి నుంచి సమూహాన్ని, ప్రజా జీవితాన్ని, పోరాటాన్ని చూస్తారు. వాటితో కనెక్ట్‌ అవుతారు. సరిగ్గా కవి చేసే ప్రయాణం ఇది.

ఇది జెయిలు వల్ల సాధ్యమైంది. మామూలుగా నిర్బంధానికి ఒక భావజాల కోణం కూడా ఉంటుంది. వ్యవస్థ మీద తిరగబడ్డ వాళ్ల భావజాలాన్ని బలహీనపరిచే కుట్ర అందులో ఉంటుంది. ఒంటరిగా అయినా, ఒక సామూహిక రాజకీయ శక్తిగానైనా ధిక్కారం ప్రకటించిన వాళ్ల భావజాలాలను కరెప్ట్‌ చేద్దామని జెయిలు ప్రయత్నిస్తుంది. కానీ చాలా సార్లు అది రాజ్యానికి కౌంటర్‌ ప్రొడక్ట్‌ అవుతుంది. ఎలాగంటే.. వ్యక్తిగత స్థాయిలో తిరగబడ్డవాళ్లయినా, రాజకీయ కార్యకర్తలయినా జెయిలుకు వెళ్లి మేధావులుగా, సృజనాత్మక రచయితలుగా తయారై బైటికి వస్తుంటారు.

ఇది ఎలా జరుగుతుందో గమనించాలి. జెయిలు మన దృష్టి కోణాన్ని మార్చేస్తుంది. కొత్త చూపును ఇస్తుంది. అది సునిశితంగా ఉంటుంది. ఎంతగానంటే తానే ఖైదీ తనకు సరికొత్తగా కనిపించవచ్చు. జెయిలు నిర్బంధం వల్ల తాను నేరుగా భాగం కాలేకపోతున్న సామాజిక చరిత్ర నిర్మాణ క్రమాన్ని కొంత డిస్టెన్స్‌లో చూసే అనివార్యత ఏర్పడుతుంది. నేరుగా భాగం కాలేకపోవడం భౌతికమైన ఎడమే కాదు. ఇంకా చాలా రకాల ఎడం అంది. దాన్ని మళ్లీ మొదటి నుంచి విమర్శనాత్మకంగా చూసుకుంటూ పునర్నిర్మించుకునే అద్భుత ప్రక్రియ జెయిల్లో సాగుతుంది. అప్పటి దాకా కనిపించనివి ఎన్నో మొదటిసారి కనిపిస్తాయి. కొన్ని కొత్తగా కనిపిస్తాయి. చివరికి తనకూ, తన వాళ్లకూ ఉన్న సంబంధాలను తీరికగా, నింపాదిగా పరిశీలించుకొనే దృష్టి ఏర్పడుతుంది. ఇంటి ముందుకు పోలీసువాడు ఎప్పుడు వస్తాడో తెలియని సందిగ్థం, కించిత్‌ ఆందోళన కలగలసిన మనస్థితి విప్లవ కవులు తరచూ అనుభవిస్తుంటారు. తన నమ్మకాలు బలీయమైనవా? రాజ్యం బలీయమైనదా? తన భవిష్యదాశ శక్తివంతమైనదా? లేక వర్తమాన దుర్భర వాస్తవం శక్తివంతమైనదా? జెయిలు ఇలాంటి ఎన్నో ప్రశ్నలను అంతక ముందటి కంటే బలంగా ప్రేరేపిస్తుంది. వాటి అసలైన సమాధానం కోంస అన్వేషణకు పురికొల్పుతుంది.

బహుశా ఇదొక అద్భుత సృజనతలం. ఇదే ఒక గొప్ప కవిత్వ అనుభవం. భయం, బాధ, దు:ఖం, ఎడబాటు వంటి మానవీయ సంస్పందనలే కవిత్వ ప్రపంచంలో ఎన్నో విశ్వాసాలను, ఊహలను, ధిక్కారాలను ఎగరేసేందుకు ప్రేరేపిస్తాయి. ఖైదు అనుభవం ఉన్న కవులందరి ఊహాశక్తిని జెయిలు ఇలా ప్రభావితం చేస్తుంది.

కవిగా వివి ముక్తకంఠంలో ఇలాంటి ఒక సునిశితమైన అనుభవాన్ని కవిత్వం చేశారు. ఆయన అరవై ఏళ్ల కవిత్వ ప్రయాణంలో ముక్తకంఠం చాలా ప్రత్యేకమైన సంపుటం. ఆ తర్వాత ఆయన చేసిన శిల్ప ప్రయోగాలకు, సాధించిన విస్తృతికి ముక్తకంఠంలో మూలాలు కనిపిస్తాయి.

ఆ కాలంలో బైట పోటెత్తుతున్న ప్రజా పోరాటాలు, వాటికి దూరంగా ఒంటరి నిర్బంధం.. ఈ స్థితి దానికదే ప్రయోగ సన్నివేశం. మనకు ప్రయోగమని కనిపించదుకాని నిరావేశ, నిరలంకార కవితా శైలిని పూర్తి స్థాయిలో వివి ముక్తకంఠంలో అందుకున్నారు. చాలా సరళంగా తోచే వచనంలో కవిత సాగుతూ ఒక అంతర్‌దృష్టిలోంచి పరిశీలనగా, అనుభవ ప్రకటనగా, వ్యాఖ్యగా ముగిసిపోతుంది. జీవితానుభవం, దృక్పథం వల్ల సంతరించుకున్న సున్నితత్వం ఇది. ఇదే కవితపై ఒక కొత్త వెలుగును ప్రసరిస్తుంది. అదే ఆ కవితలో ఫోకస్‌ పాయింట్‌ అనిపిస్తుంది.

ఈ కవితా శైలి ఆ తర్వాత వచ్చిన ఉన్నదేదో ఉన్నట్లులో జంట నగరాల్లో సైబర్‌ తుఫాను, ఏడుగురి అక్కచెల్లెళ్ల కథ కవితల్లో మరింత విస్తృతమైంది. దగ్ధమౌతున్న బాగ్దాదు నెలవంక, మౌనం ఒక యుద్ధనేరం కవితలతో వివి కవిత్వం పూర్తిగా మారిపోయింది. సమాచారం, వాదన, ఖండన, కథనం, చరిత్ర రచన మొదలైన రూపాలు ఆయన కవిత్వంలోకి వచ్చేశాయి.

దగ్ధమౌతున్న బాగ్దాదు నెలవంకలో బోలెడు సమాచారం ఉంటుంది. దాని మీద ఆధారపడి వాద పద్ధతిలో కవిత్వం నిర్మాణమైంది. తేదీలు, ఘటనలు, వ్యక్తుల పేర్లు, ఊళ్ల పేర్లు ప్రస్తావిస్తూ కూడా కవిత్వానికి ఉండే అతి ముఖ్యమైన ఫీల్‌ను ఎక్కడా కోల్పోకుండా రాశారు. కవిగా ఇది సాహసం. కవిత్వ దినుసు ఏమిటో తెలియకపోతే కవిత్వాన్ని ఇలా ఎత్తుకోవడం, నడపడం ఎవ్వరి వల్లా కాదు. పైకి చాలా అలవోక శైలి అనిపిస్తూనే మళ్లీ మళ్లీ చదివే కొద్ది కొత్త లోతులు కనిపించే భావనలు, అంతరార్థాలు పలికించారు. ఒక్కోసారి వివి కవిత ప్రకటించే సున్నితత్వం చప్పున అందకపోవచ్చు. మళ్లీ ఎప్పుడో ఒక సామాజిక సందర్భంలో దానితో పాఠకులు కనెక్ట్‌ అవుతారు. ఆ సున్నితత్వపు అనుభవం గొప్ప ఎరుకగా మారుతుంది. సరిగ్గా కవిత్వం చేయవలసిన పని ఇదే. వివి పాఠకులకు తరచూ ఇలాంటి కవిత్వ పఠనానుభవం కలుగుతుంది.

ఆయన కవిత్వంలో ఏకకాలంలో అనేక నిర్దిష్టతలు కనిపించే ధోరణి కూడా ఉంది. వివి కవితా ప్రయాణంలో భిన్నమైన వ్యక్తీకరణ సముద్రం దీర్ఘ కవిత. దీనికి ఎంతో విశ్లేషణ అవసరం. ఏకకాలంలో అనేక అనేక అర్థాలు, అంతరార్థాలు పలికే కవిత ఇది. సముద్రమనే ప్రతీక చాలా రకాలుగా ఈ కవితలో వాడుతారు. త్రిపురనేని మధుసూదనరావు అన్నట్లు సముద్రం ఆలోచనాత్మక ఇమేజరీలుగా విస్తరించి చారిత్రక, తాత్విక స్థాయికి కవిత చేరుకుంటుంది. బహుశా వివి మొత్తం కవిత్వంలో ఇది చాలా ప్రత్యేకం.

*** *** ***

2005లో వివికి మళ్లీ జెయిలు జీవితం. అంతస్సూత్రం సంపుటిలో మా ఊరి సూర్యచంద్రులు, మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌, అంతస్సూత్రం, ఇసుక తుఫానులో సూఫీ ఆలాపన ఇలా ఎన్నో కవితలు వివిని చాలా హైట్స్‌కి తీసికెళ్లాయి. లైట్‌గా తాత్వికత వినిపిస్తూ ఏక కాలంలో నిర్దిష్టతలోకి, సాధారణీకరణలోకి మగ్గంపై కండె అటూ ఇటూ తిరిగినట్లు గత, వర్తమానాల్లోకి విస్తరిస్తూ కవిత్వపు అల్లిక సాగుతుంది.

1990ల తర్వాత కవిగా వివి చాలా ఓపెన్‌ స్టైల్‌లోకి వచ్చేశారు. బహుశా కవిత్వ ప్రయోజనం, దృక్పథ వైశాల్యం అనే వాటిలో జీవిత, రాజకీయ అనుభవం వల్ల అంతులేని స్పష్టత వచ్చేసింది. ఏది కవిత్వమవుతుందో తెలియడం కూడా దీనికి కారణమే. అందువల్లే కవితను ఎక్కడ ఎలా మొదలు పెట్టి ఎలాగైనా నడపడం ఆయనకు సాధ్యమైంది. దీంతోపాటు ఆయనకు తన పాఠకులు ఎవరో నూరు శాతం తెలుసు. మామూలుగా తమ ప్రయోగాలను విమర్శకులు ఎలా గుర్తిస్తారు? ఏం చెబుతారు? అనే ఆసక్తి రచయితలకు ఉంటుంది. వివి చేసిన ప్రయోగాలు పాఠక కేంద్రకమైనవి. వాళ్లకు కూడా ప్రత్యేకంగా కనిపించనంతగా కవిత్వ అనుభూతిలో వైవిధ్యానికి దారి తీస్తాయి.

కవిగా వివిని ఆయన కవిత్వం నుంచి వేరు చేయలేనట్లే రాజకీయ జీవిగా వివి ఆలోచనా ప్రపంచాన్ని, కవిగా సృజనాత్మక ప్రపంచాన్ని వేరు చేసి చూడటం కూడా అసాధ్యమే. అయితే ఆ రెంటికీ మధ్య ఉన్న ఆర్గానిక్‌ రిలేషన్‌లో ఈ పక్కన ఉన్నది సృజనాత్మక ప్రపంచం. ఇది లింక్‌ కాదు, రిలేషన్‌. అందువల్లే ఈ రెంటికీ మధ్య ఉండే సహజమైన చిన్న తేడా వివిలో ఇప్పటికీ ఉన్నది. ఈ ఆర్గానిక్‌ రిలేషన్‌ ఆయన వ్యక్తిత్యం నుంచి ఏర్పడింది కాబట్టే ఈ తేడా అనే ప్రత్యేకత సాధ్యమైంది. కవిత్వంలో అనేక ప్రయోగాలకు, అనేక దశలను దాటుకుంటూ విస్తరించడం వెనుక ఉద్యమ మమేకతతోపాటు ఈ తేడా కూడా పని చేస్తుంది. అది ఎలా ఫంక్షన్‌ అవుతుందో మనం వివరించలేకపోవచ్చు. అయితే ఇదే లేకుంటే ఆయన ఎంచుకున్న ఆచరణ ఆయనలోని కవికి అవరోధమయ్యేదేమో. అలాగే ఆయన మౌలికంగా కవి కాకపోయినా ఇన్ని పనులు చేయగలిగేవాడు కాదు. అప్పుడు ప్రధాని హత్యకు ఆయన ʹకుట్ర పన్నగలడʹనే ఊహ కూడా రాజ్యం చేయగలిగేదే కాదు.

రాజకీయాల్లోకంటే కవితా రచనలో వివి ఓపెన్‌ ఎండెడ్‌గా ఉంటారు. రాజకీయాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు.. అందునా ఆయన నిర్వహించే పాత్రకు వీలు కాకపోవచ్చు. వివి రాసిన చాలా కవితలు ఓపెన్‌ ఎండెడ్‌ నిర్మాణంలో ఉంటాయి. కవిత్వ స్వభావమే కాదు, రాజకీయాల స్వభావం కూడా తెలిసిన పరిణతి వల్ల ఇది సాధ్యమైంది. ఒక ఫీల్‌ లేదా ఎరుకతో ముగిసి ఆయన కోరుకున్న రాజకీయ ప్రభావాన్ని గ్యారెంటీ చేసే శిల్ప పద్ధతులు వివి పాటిస్తుంటారు.

కవిత్వ గుణం సాంతం తెలిసి ఉండటమే దీనికి కారణం. రాజకీయ ఉద్యమానికి కవిత్వం ఒక శక్తివంతమైన పనిముట్టు కావాలన్నా, జీవితంలోంచి ఉద్యమంలోకి కవిత్వ ప్రభావం సాగాలన్నా దాని గుణం తెలిసి ఉండాలి. అది తెలుసుకోడానికి ʹహార్డ్‌కోర్‌ అర్బన్‌ మావోయిస్టుʹగా వివికి తన రాజకీయ ఆచరణ అటంకం కాలేదు. పైగా అదే ఆయనకు జీవితంలో కవిత్వ స్థానం, పాత్ర ఏమిటో తెలుసుకోడానికి దారి చూపింది.

వివి కథలు, నవలలు బాగా చదువుతారు. విస్తారమైన ఆయన ఉద్యమ జీవితానుభవం వచన ప్రక్రియలకు చాలా అనువైనది. ఎందుకో ఆయన ఆ పనిలోకి దిగలేదు. అయితే 1990ల తర్వాత ఇది ఆయన కవిత్వంలోకే ఎక్స్‌టెండ్‌ అయినట్టనిపిస్తోంది. కథనం, చిత్రణ, వాదన, చరిత్ర నిర్మాణం మొదలైనవి ఎన్నో ఆయన కవిత్వంలోకి వచ్చాయి. ఇందుకు తగిన వచనం ఆయన చేతిలో ఇమిడిపోయింది. జీవితం, అనుభవం పండిన ఈ వయసులో వివి ఇప్పుడు మరోసారి జెయిలుకు వెళ్లారు. ఈ అనుభవం ఆయన కవిత్వాన్ని ఏ మలుపు తిప్పబోతోంది? ఆయన కవితా వికాసాన్ని పట్టుకున్న వాళ్లెవరికైనా ఇది చాలా ఆసక్తికరం.

Keywords : virasam, vv, poetry, literature, naxalbari, paani
(2020-05-30 15:22:29)No. of visitors : 568

Suggested Posts


దేశంలో జడ్జ్ లు జస్టిస్ ను వదిలేశారు - హరగోపాల్

దేశంలో జడ్జీలు జస్టిస్ ను వదిలేశారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్థిని కాపాడవల్సిన న్యాయమూర్తులు తమ స్వం విశ్వాసాల ఆధారంగా తీర్పులివ్వడం అన్యాయమని ఆయన అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిబాబా....

ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు

1981 ఏప్రిల్ 20న ఇంద్ర వెల్లిలో ఏం జరిగింది? ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 81 ఏప్రిల్ 20న తలపెట్టింది. జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావుకు సభ జరుపుకోవడానికి పోలీసులు మొదట అనుమతిచ్చారు....

సాయిబాబా కేసుః జడ్జిమెంట్ లా లేదు,పోలీసాఫీసర్ రాసిన చార్జ్ షీట్ లా ఉంది- వరవరరావు

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా బెయిల్ రద్దు చేస్తూ నాగ్ పూర్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పై విప్లవ రచయిత వరవరరావు మండి పడ్డారు. అది జడ్జిమెంట్ లాగా లేదని ఓ పోలీసు ఆఫీసర్ రాసిన చార్జ్ షీట్ లాగా

వెన్నెముకలేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? - వరవర రావు

మనకు వెన్నెముకలేని దేశం కావాలా? సార్వభౌమత్వం లేని దేశం కావాలా? ఆజాదీ కావాలా? ప్రొ. కంచె ఐలయ్య మీద హిందుత్వ వాదులు కేసు పెట్టినపుడు స్పందించిన రచయితలందరూ పాతబస్తీలో పేద ముస్లిం యువకుల కోసం, కశ్మీరులో ఎన్‌కౌంటరవుతున్న యువకుల కోసం స్పందిస్తారని....

ఇది కోర్టు తీర్పుకాదు,రాజ్యం వేసిన శిక్ష - వరవరరావు

ఎంత అసంబద్ధమైన, ఎంత అన్యాయమైన వ్యవస్థలో జీవిస్తున్నామో ఇవ్వాళ్టి నా ఒక్క అనుభవాన్ని వివరిస్తాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎకడమిక్ స్టాఫ్ కాలేజీలో మాడరన్ లిటరేచర్ గురించి ప్రసంగించడానికి వెళ్తున్నాను.....

రైలు ప్రమాదం – కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, మీడియా ʹవిద్రోహʹ ప్రచారాలు

ఛత్తీస్ గడ్ లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు వెళ్లే హీరాఖంండ్ ఎక్స్ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ దగ్గర జనవరి 21 శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మందికి పైగా మరణించారు....

Boycott (World) Social Forum, a Safety Valve for Imperialism !- RDF

Revolutionary Democratic Front calls upon the people and genuine democrats to boycott the (world) Social Forum, being held in Canada in August 2016 and all the related forums and preparatory meetings etc. being conducted in different parts of the country including Hyderabad....

Search Engine

తెలంగాణ మంత్రులకు ప్రొఫెసర్ హరగోపాల్ లేఖ‌ !
వీవీ,సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీల విడుదలకై వారం రోజుల కార్యక్రమాలు -నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు
మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి
నోరు మూసుకో....ట్రంప్ కు పోలీసు చీఫ్ హెచ్చరిక‌
తెలంగాణకోసం పోరాడిన వారు జైళ్ళలో మగ్గుతున్నరు
వరవరరావు బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా !
వరవరరావు విడుదల కోసం ʹమాహాʹ సీఎంకు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ల‌ లేఖ
వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
more..


కవితామయ