కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం


కలలకు సంకెళ్లు వేసిన రాజ్యం

కలలకు

గాయ‌ప‌డిన హృద‌యాల‌ను ఓదార్చడం... మూగబోయిన‌ గొంతుల‌కు మాట‌లివ్వడం నేరమిక్కడ. ప‌ట్టెడు మెతుకుల కోసం... పిడికెడు ఆత్మగౌర‌వం కోసం తాపత్రయప‌డ‌డం నేరమిక్కడ. బంధ‌నాలు చేధించ‌డం... క‌ట్టుబాట్లు కూల‌దోయ‌డం నేరమిక్కడ. స్త్రీ విముక్తిని కాంక్షించ‌డం... మాన‌వీయ స‌మాజాన్ని క‌ల‌గ‌న‌డం నేరమిక్కడ. అవును.. మ‌నువు రాసిన శాస‌నాల‌ను ఉల్లంఘించడం రాజ‌ద్రోహ‌మే ఇక్కడ. అందుకే... భూస్వామ్య బంధ‌నాల్లో చిక్కుకున్న స‌మాజాన్ని నిద్దుర‌లేపేందుకు ఎవ‌రు య‌త్నించినా... వాళ్లు దేశ ద్రోహుల‌వుతారు. ప్రశ్నను పాతాళంలో పూడ్చిపెట్టేందుకు... క్రూర చ‌ట్టాలు కోరలు చాస్తాయి.

హ‌క్కుల‌డిగిన వాళ్లు ఉగ్రవాదులో... తీవ్రవాదులో అవుతారు. ఆలోచించే ప్రతి ఒక్కరూ అర్బన్‌ నక్సలైట్‌ అవుతారు. ఇప్పుడు... కళ్లముందు కదలాడుతున్న వాస్తవమిది. వేయి పడగల హైందవం వెదజల్లుతున్న విషపు ప్రచారం ఇది. అసమానతలు, అవమానాలు, ఆత్మహత్యలూ లేని సమాజాన్ని కలగన్న నేరానికి వేలాది మంది ఇప్పుడు అర్బన్‌ నక్సల్స్‌గా మారిపోతున్నారు. దేశ వ్యాప్తంగా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలు... ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిఒక్కరినీ అర్బన్‌ మావోయిస్టుల పేరుతో జైళ్లలో నిర్బంధిస్తోంది రాజ్యం.

అర్థ‌రాత్రి... హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఓ ఇంట్లోకి చొర‌బ‌డి, ముగ్గురు అమ్మాయిల‌ను తీసుకెళ్లిన పోలీసులు... మూడు రోజుల త‌రువాత మ‌హిళా మావోయిస్టులు అరెస్టు అంటూ మీడియాకు వెల్ల‌డించారు. ఏ కార‌ణాలు లేకున్నా... ఎలాంటి కేసులు లేకున్నా... ఎప్పుడైనా, ఎవ‌రినైనా అరెస్టు చేయ‌గ‌ల‌మ‌ని మ‌రోమారు నిరూపించుకున్నారు. హైద‌రాబాద్ మౌలాలిలో నివాస‌ముండే అమ‌రుల బంధుమిత్రుల సంఘం స‌హాయ కార్య‌ద‌ర్శి భ‌వాని, చైత‌న్య మ‌హిళా సంఘం స‌భ్యులు అన్న‌పూర్ణ‌, అనూష‌ల‌ను డిసెంబ‌ర్ 22 రాత్రి మ‌ఫ్టీలో వ‌చ్చిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా సంఘాల కార్య‌క‌ర్త‌లు భ‌వాని, అన్న‌పూర్ణ‌, అనూషల అక్ర‌మ అరెస్టుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేట్టిన త‌రువాత‌, పాడేరు డీఎస్‌పీ వీరి అరెస్టును దృవీక‌రించాడు. భ‌వాని, అన్న‌పూర్ణ‌, అనూషలు మావోయిస్టు పార్టీ స‌భ్యుల‌నీ, వారు మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత‌ల‌ను ప‌లుమార్లు క‌లిశార‌ని మీడియాకు వెల్ల‌డించాడు. వీరు పార్టీలో మిల‌ట‌రీ శిక్ష‌ణ పొందార‌ని, ప‌లు దాడుల్లో సైతం పాల్గొన్నార‌ని ప్ర‌క‌టించాడు. ఇలాంటి ఆరోప‌ణ‌ల‌తో భ‌వాని, అన్న‌పూర్ణ‌, అనూషలపై యూఏపీఏ కింద అక్ర‌మ కేసులు బ‌నాయించారు. వీరితో పాటు విశాఖ జిల్లాలో అరెస్టు చేసిన‌ కొర్రా కామేశ్వరరావుపై సైతం అక్ర‌మ కేసులు మోపి జైలుకు పంపారు.

పోలీసులు మాత్ర‌మే కాదు.. మీడియా సైతం ఆశ్చ‌ర్యం గొలిపే క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది. భ‌వాని, అన్న‌పూర్ణ‌, అనూష‌లు అర్బ‌న్ మావోయిస్టుల‌ని, హైద‌రాబాద్‌లో దాడులు జ‌రిపేందుకు రెక్కీ నిర్వ‌హించార‌ని, గ‌తంలోనూ ప‌లు దాడుల్లో పాల్గొన్నార‌ని పుక్కిటి క‌థ‌ల‌ను వినిపించారు. అలిపిరి నుంచి తాజా ఘ‌ట‌న‌ల వ‌ర‌కు.. మావోయిస్టు పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప‌లు దాడుల్లోనూ ఈ ముగ్గురి ప్ర‌మేయాన్ని జోడించే ప్ర‌య‌త్నం చేశారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. పోలీసుల నేరారోప‌ణ‌ల‌కంటే.. ముందే మీడియా తీర్పులు చెప్పేసింది. ఇంత‌టి అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించిన మీడియాకు.. ఈ ముగ్గురూ ప్ర‌జా సంఘాల్లో ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌నే విష‌యం బోధ‌ప‌డ‌లేదు. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా సంఘాలు నిర్వ‌హించిన ఆందోళ‌న‌లూ క‌న‌బ‌డ‌లేదు. భ‌వాని, అన్న‌పూర్ణ‌, అనూషల త‌ల్లిదండ్రుల ఆవేద‌నా క‌నిపించ‌లేదు. స‌రిహ‌ద్దులు దాటి రాజ్యం చేస్తున్న దాడుల‌ను ప్ర‌శ్నించే సాహ‌సం కూడా మీడియా చేయ‌లేక‌పోయింది.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధానిలో నివ‌సిస్తున్న వీరిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ జిల్లా పాడేరు పోలీసులు ఎలా అరెస్టు చేస్తార‌నే ఒక్క ప్ర‌శ్న వేయ‌లేక‌పోయింది. కానీ... పోలీసుల గొంతుతో గొంతుక‌లిపి.. న‌గరంలో మావోయిస్టుల క‌ల‌క‌లం అంటూ క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి టెలివిజ‌న్ ఛాన‌ళ్లు.

ఇంత‌కూ.. ఎవ‌రు వీళ్లు? ఎందుకు రాజ్యం వీళ్ల‌పై క‌క్ష గ‌ట్టింది? స్త్రీ, పురుష స‌మాన‌త్వాన్ని కాంక్షించిన‌వాళ్లు. అవ‌మానాలు, అస‌మాన‌త‌లు, అణ‌చివేత‌లు, ఆక‌లి చావులు, ఆత్మ‌హ‌త్య‌లు లేని స‌మాజాన్ని క‌ల‌గ‌న్న‌వాళ్లు. అలాంటి స‌మాజ నిర్మాణం కోసం త‌మ జీవితాల్ని అంకిత‌మిచ్చిన వాళ్లు. ఎక్క‌డ స్త్రీ అవ‌మానానికి గురైనా... అక్క‌డ నిల‌బ‌డేవాళ్లు. ఎక్క‌డ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రిగినా.. అక్క‌డ ప్ర‌శ్న‌లా ఉద‌యించేవాళ్లు ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు. ఈ తెగువ‌ను ఉగ్గుపాల‌తో నేర్చుకున్నారు కాబోలు వాళ్లు. ప్ర‌జ‌ల కోసం జీవించ‌డాన్ని నాన్న వేలుప‌ట్టుకు న‌డిచే నాడే.. అల‌వ‌ర్చుకున్నారు. కానీ... ఇప్పుడు, జ‌నం కోసం ఆలోచించ‌డ‌మే నేర‌మైంది. స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డం రాజ‌ద్రోహ‌మంటోంది రాజ్యం. అందుకే... ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇప్పుడు నేర‌స్థుల‌య్యారు. బంధీఖానాకు నేస్తుల‌య్యారు.

ఈ దాడి ఇవాళ మొద‌లైందేమీ కాదు.. చైత‌న్య మ‌హిళా సంఘం, బంధుమిత్రుల సంఘం లాంటి ప్ర‌జా సంఘాల కార్య‌క‌ర్త‌ల‌పై రాజ్యం చాలాకాలంగా దుష్ర్ప‌చారం చేస్తూనే ఉంది. మావోయిస్టు ముసుగు సంఘాలంటూ.. గ‌తంలో చైత‌న్య మ‌హిళా సంఘం, విర‌సం, బంధుమిత్రుల సంఘం కార్య‌క‌ర్త‌ల ఫొటోల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా పోస్ట‌ర్లు అంటించారు. రాజ్యం ప్ర‌జ‌ల‌పై అణ‌చివేత‌ను ప్ర‌శ్నించినందుకు, హ‌క్కుల కోసం ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డినందుకు, ప్ర‌భుత్వానికి నిర‌స‌న‌ను తెలియ‌జేసినందుకు... ప్ర‌జా సంఘాల కార్య‌క‌ర్త‌ల‌పై మావోయిస్టుల‌నే ముద్ర‌వేసి.. దుష్ర్ప‌చారం చేశారు. ప్ర‌జా ఉద్య‌మాల‌కు పోటీగా... పోలీసులే అడ్ర‌స్ లేని సంఘాల‌ను సృష్టించి, వాటి పేరుతో ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. ప్ర‌తిఘాతుక ఆందోళ‌న‌ల‌కు తెర‌తీశారు. ఇప్పుడు... నేరుగా ముసుగులు చించుకొని... రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. మావోయిస్టుల ముద్ర‌వేసి... అక్ర‌మ కేసుల్లో నిర్బంధిస్తున్నారు.

ఒక్క‌రా ఇద్ద‌రా... ఇలా నిత్యం ఎంద‌రో చెర‌సాల‌ల‌కు త‌ర‌లివెళ్తున్నారు. స‌రిగ్గా భ‌వాని, అన్న‌పూర్ణ‌, అనూష‌ల అరెస్టుకు ఒక రోజు ముందు జ‌రిగిన న‌క్కా వెంక‌ట్రావు అరెస్టే అందుకు నిద‌ర్శ‌నం. నేష‌న‌ల్ జియోఫిజిక‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్ ఐ)లో ప‌నిచేసే వెంక‌ట్రావ్‌ను నాగ్‌పూర్‌లో అరెస్టు చేసి చ‌త్తీస్‌ఘడ్‌లో మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉన్న వెంక‌ట్రావ్‌ను మావోయిస్టు పార్టీ నేష‌న‌ల్ అర్బ‌న్ కో- ఆర్డినేట‌ర్‌గా పేర్కొన్న పోలీసులు, అత‌డికి కేంద్ర క‌మిటీ నాయ‌కుల‌తో సంబంధాలున్నాయ‌ని, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో యువ‌త‌ను మావోయిస్టు రాజ‌కీయాలవైపు ఆక‌ర్షించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఇక్క‌డ కూడా.. నాగ్‌పూర్‌లో ఉన్న వ్య‌క్తిని చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు అరెస్టు చేసి.. అక్ర‌మ కేసులు మోపారు. మొత్తంగా.. అధికారంలో ఎవ‌రు ఉన్నా స‌రే, ప్ర‌జ‌ల ప‌ట్ల వాటి వైఖ‌రి చాలా స్ప‌ష్టం. అది... ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌ల్ని అణ‌చివేయ‌డం. అందుకే... పూణే పోలీసులు ఢిల్లీలో సామాజిక కార్య‌క‌ర్త‌ల్ని అరెస్టు చేస్తారు, విశాఖ పోలీసులు హైద‌రాబాద్‌లో మ‌హిళా కార్య‌క‌ర్త‌ల్ని అరెస్టు చేస్తారు, చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు నాగ్‌పూర్‌లో అరెస్టు చేస్తారు. ఈ బ‌రితెగింపు రానున్న రోజుల్లో మ‌రింత ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరే అవ‌కాశం లేక‌పోలేదు.

ప్ర‌జ‌ల ప‌క్షాన మాట్లాడినందుకు... ఒక విద్యార్థిని, ఒక ఉపాధ్యాయుడిని, ఒక ర‌చ‌యిత‌ను, ఒక న్యాయ‌వాదిని, ఒక హ‌క్కుల కార్య‌క‌ర్త‌నూ నేర‌స్థుల్ని చేసిందీ రాజ్యం. కానీ... సంఘ్ ప‌రివార్‌, దాని అనుబంధ సంస్థ‌లు గో ర‌క్ష‌క్ ద‌ళ్ పేరుతో ఎంత‌టి హింస‌కు పాల్ప‌డినా ఎలాంటి శిక్ష‌లూ ఉండ‌వు. వంటింట్లోకి చొర‌బ‌డి, ప‌ట్ట‌ప‌గ‌లు ఒక అఖ్ల‌క్‌ని చంపేసినా.. అది నేరం కాదు. ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని కాజేసినా... అది నేరం కాదు. ప్ర‌శ్నించే వాళ్లే దేశ‌ద్రోహుల‌వుతారు. నిన్న‌టి దాకా ముస్లింల‌పై టెర్ర‌రిస్టుల ముద్ర‌వేసిన రాజ్యం ఇప్పుడు.. ప్ర‌శ్నించే ప్ర‌తి ఒక్క‌రినీ అర్బ‌న్ మావోయిస్టు అంటోంది. చివ‌ర‌కు.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్లిన మ‌హిళ‌లు కూడా మావోయిస్టులేన‌ట‌. ఈ పేరుతో వంద‌లు.. వేలు... ల‌క్ష‌ల మందిని జైళ్ల‌లో నిర్భందించ‌వ‌చ్చేమో. కానీ... ప్ర‌శ్న‌ను అణ‌చివేయ‌లేర‌నేదే శాశ్వ‌త స‌త్యం.

- క్రాంతి
(విర‌సం ఆన్‌లైన్ మ్యాగ‌జైన్ - 1 జ‌న‌వ‌రి 2019 సంచిక సంపాద‌కీయం)

Keywords : మావోయిస్టు, అరెస్టులు, యూఏపీఏ, అనూష, భవాని, మహిళా సంఘాలు, Maoists, Arrests, UAPA, Anusha, Bhavani,
(2019-01-16 01:00:38)No. of visitors : 201

Suggested Posts


0 results

Search Engine

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
గెలిచినమంటే చేసిందంతా మంచిదని కాదు!
దాడిచేస్తున్నా.. ఎత్తిన కెమెరా దించలేదు..
ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌
సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు
మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
మానవ హక్కుల హననానికి పాల్పడిన అధికారికే ప్రమోషన్.. చత్తీస్‌గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం
రామ మందిరం గురించి రాసిన రచయితకు హిందుత్వ సంస్థల బెదిరింపులు
మావోయిస్టు అంటూ ఎన్‌జీఆర్ఐ అధికారి వెంకట్రావు అరెస్టు.. వెనుక ఎన్నో అనుమానాలు..!
more..


కలలకు