సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు


సాయిబాబా లాంటి వాళ్ల కష్టాల ముందు నాదెంత : వరవరరావు

సాయిబాబా

బీమా కోరేగావ్ కుట్ర కేసు ఆపాదించి వరవరరావు సహా హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసి ప్రస్తుతం పూణే యెరవాడ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ప్రతీ వారం ఆ కేసుకు సంబంధించిన విచారణ పూణే కోర్టులో కొనసాగుతోంది. ప్రతీ సారి అక్కడకు వెళ్తున్న సీనియర్ జర్నలిస్టు ఎన్. వేణుగోపాల్ తన అనుభవాలను మిత్రులతో పంచుకుంటున్నారు. నిన్న జనవరి4న కూడా ఆయన అక్కడకు వెళ్లారు. పోలీసు నిర్బంధాల మధ్య దొరికిన కొద్ది సమయంలో వీవీతో సంభాషించారు. అక్కడ ఏం జరిగిందో వేణుగోపాల్ మాటల్లో యధాతథంగా..
---------------------------------------------------------------------------------------------------

మిత్రులారా, దేశవ్యాప్తంగా ప్రజాపక్ష మేధావులను, హక్కుల కార్యకర్తలను దుర్మార్గంగా ఇరికించి తయారుచేసిన అబద్ధపు కేసు (భీమా కోరేగాం కేసు) ఎలా నడుస్తున్నదో, ఆ కేసులో నిందితులుగా ప్రస్తుతం పుణెలోని యరవాడ జైలులో మన మిత్రులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని మీరు ఆందోళనగా, అసక్తితో ఉన్నారని తెలుసు గనుక నేను వెళ్లివచ్చిన ప్రతిసారీ ఒక నివేదిక రాస్తున్నాను. గతంలో 2018 నవంబర్ 27న, డిసెంబర్ 18న ఇక్కడే రాశాను.

డిసెంబర్ 18 వాయిదా తర్వాత డిసెంబర్ 20కి మరొక వాయిదా పడింది గాని నేను ఆరోజు వెళ్లలేకపోయాను. డిసెంబర్ 20 నుంచి జనవరి 4, శుక్రవారానికి మళ్లీ వాయిదా పడింది. ఈసారి వాయిదాకు హైదరాబాద్ నుంచి అక్కయ్య, నేను వెళ్లాం. సాధారణంగా మధ్యాహ్నం పన్నెండుకల్లా మిత్రులందరినీ జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తారు. అందుకని మేం పదకొండున్నరకల్లా కోర్టుకు చేరాం. కేసు మధ్యాహ్నానికే పిలుస్తారని, కనుక మిత్రులందరినీ మధ్యాహ్నం తర్వాతనే తీసుకు వస్తారేమోనని లాయర్లు కూడ అన్నారు. చేసేదేమీ లేక మేం అలా కోర్టులోనే మూడో అంతస్తు వరండాలో ఎదురుచూస్తూ కూచున్నాం.

హఠాత్తుగా పన్నెండున్నరకు లిఫ్ట్ లోనుంచి చుట్టూ పోలీసులమధ్య వర్నన్, అరుణ్, వివి బైటికి వచ్చారు. మరొక లిఫ్ట్ లో నుంచి సురేంద్ర, సుధీర్, రోనా, మహేశ్ వచ్చారు. ఈసారి సుధనూ షోమానూ కూడ తీసుకురాలేదు. ఇంకో రెండు గంటలయినా ఎదురుచూడవలసి ఉంటుందని అనుకున్నప్పుడు హఠాత్తుగా వాళ్లు కనబడిన ఆనందం. ఒక్క ఉదుటున పరుగెత్తుకెళ్లి ఆ ఏడుగురినీ ఒక్కొక్కరినీ కౌగలించుకున్నాను. అలా కౌగిలించుకుంటున్నప్పుడు అది నా ఒక్కడి కౌగిలి మాత్రమే కాదు, ఇది చదువుతున్న, వాళ్ల గురించి ఆందోళన పడుతున్న విప్లవాభిమానులందరి, పౌరసమాజంలోని ఆలోచనాపరులందరి తరఫున నా కౌగిలి. వారి ఉత్సాహం, స్ఫూర్తి, క్షేమంగా ఉన్నామనే భరోసా బదిలీ అయినది నా ఒక్కడికి మాత్రమే కాదు, అది మీ అందరికీ కూడ.

ఆ వరండాలోనే బెంచీల మీద వారందరినీ కూచోబెట్టి పోలీసులు అడ్డుగా నిలబడి ఉన్నా మేం చుట్టూ నిలబడీ, దగ్గరికి వెళ్తూ వస్తూ పది నిమిషాలో పావు గంటో మాట్లాడుకోగలిగాం. అక్కయ్యయితే ఆ కాసేపు మామయ్య పక్కనే బెంచీ మీద కూచోగలిగింది. అక్కడ అలా ఒక సభ జరుగుతున్నదని గుర్తించినందువల్లనో ఏమో ఒక మఫ్టీ దుస్తుల పోలీసు అధికారి వచ్చి వాళ్లను జడ్జి పిలవకుండానే ఎందుకు తీసుకొచ్చారని కోప్పడ్డాడు. అక్కడి నుంచి తీసుకుపొమ్మని ఆదేశించాడు. ఇక అందరినీ వెనక్కి, కోర్టు ఆవరణలోని పోలీసు కేంద్రంలోకి తీసుకువెళ్లారు. వాళ్ల పక్కన నడుస్తూ మరొక ఆరేడు నిమిషాలు మాట్లాడగలిగాం. అక్కడ పోలీసు కాంపౌండ్ లో మాట్లాడడానికి అనుమతిస్తారేమోనని అక్కడే తచ్చాడాం. కాని అక్కడ దాదాపు రెండు గంటలు నిలబడ్డా మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.

ఈలోగా వాళ్లను కలిసి వచ్చిన ఒక న్యాయవాది వాళ్లు ఆకలిగా ఉన్నారని, తినడానికి ఏమన్నా తెచ్చిపెట్టమని అడుగుతున్నారని అన్నాడు. కోర్టు ఆవరణలో ఉన్న కాంటీన్ వేపు పరుగులు. వండిన పదార్థాలు వద్దు అంటారు గదా, బిస్కట్ల వంటి ప్యాక్డ్ ఫుడ్సే కావాలని ఒక మాట. ఆకలి మీద ఉన్నారు, పావ్ బాజీ వంటివి తెమ్మన్నారు అని మరొక వాదన. చాయలు తప్పనిసరిగా తెమ్మన్నారట. అవన్నీ తీసుకుని పోలీసు ఆవరణ గేటు దగ్గరికి వెళ్లేసరికి అందరినీ అప్పుడే బైటికి తీసుకొస్తున్నారు. జడ్జి పిలిచాడట, అంతకన్నా ముఖ్యం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి నిలబడి ఉందట, అందువల్ల తినడానికి కూడ సమయం ఇవ్వకుండా కోర్టులోకి తీసుకురమ్మన్నారని ఆదేశం. మళ్లీ వాళ్ల పక్కనే మరొక ఆరేడు నిమిషాల మాటల నడక.

కోర్టు హాల్లోకి ఆ ఏడుగురినీ తీసుకువెళ్లి నిందితుల బోనులో నిలబెట్టారు. కోర్టులో ఉండగలిగినంతమంది కంటె రెట్టింపు మంది ఉన్నారు. గోల గోల. ఆ గోలలో లాయర్లు ఏం మాట్లాడుతున్నారో, జడ్జి ఏమంటున్నాడో ఏమీ వినబడలేదు. చివరికి తెలిసిందేమంటే, మామూలుగా బెయిల్ పిటిషన్ల మీద వాదనలు జరగవలసింది గాని, అవి పక్కనపెట్టి, ఈ లోగా నిందితులు జైలు వసతుల మీద, ఆంక్షల మీద వేసిన వేరు వేరు పిటిషన్ల మీద వాదనలు విన్నాడట. ఇది ఒకపక్క సాగుతుండగానే మన లాయర్లు, కొందరు మిత్రులం నిందితుల బోను దగ్గరికి చేరి మనవాళ్లతో మాట్లాడుతున్నాం. ఆ గోల మధ్య నుంచే ఇటువైపు చూసిన జడ్జి లాయర్లు కూడ నిందితులతో మాట్లాడడానికి వీలులేదని ఆజ్ఞ జారీ చేశాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం పోలీసులు నిరస తెలుపుతున్న లాయర్లను కూడ అక్కడి నుంచి దూరం జరిపారు. మిస్సిలేనియస్ పిటిషన్ల మీద రేపో ఎల్లుండో ఉత్తర్వులు ఇస్తానని, బెయిల్ వాదనలు మాత్రం జనవరి 22న వింటానని జడ్జి వాయిదా కూడ వేసేశాడు.

తమ ఎలక్ట్రానిక్ డివైసెస్ లో దొరికిందని ప్రాసిక్యూషన్ అంటున్న సమాచారాన్ని ఎక్కువ సాధికారికమైన హాష్ వాల్యూల రూపంలో ఇవ్వాలని, కాని తక్కువ సాధికారికమైన, మార్పులూ చేర్పులూ చేయడానికి అవకాశం ఉన్న క్లోన్ రూపంలో ఇచ్చారని సురేంద్ర జడ్జి దృష్టికి తీసుకొచ్చాడు. వాటిని ఫారెన్సిక్ నిపుణుడు సర్టిఫై చేశాడని జడ్జి జవాబిచ్చాడు. ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉండే ఫారెన్సిక్ నిపుణుడి జవాబుదారీతనం ఏమిటని సురేంద్ర ప్రశ్నించాడు. ఇక జడ్జి ఆ వాదనను కొనసాగించలేదు. ఈ రెండు మూడు మాటలు కూడ వాదనల రూపంలో జరిగినవి కావు. నిందితుల బోను లోపలే ఉన్న సురేంద్రకూ జడ్జికీ జరిగిన సంవాదం. అది అయిపోగానే వారిని తీసుకుపోవడానికి పోలీసులు పిలవడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత ʹమా కుటుంబాలు వచ్చాయి, మాట్లాడుకోవడానికి అనుమతించాలʹని వివి, అరుణ్ కోరగా జడ్జి మొదట అనంగీకారంగా ఒకటి రెండు గొణుగులు గొణిగి, ఐదు నిమిషాలు అన్నాడు. ఇక్కడి నుంచి వ్యాన్ దగ్గరికి వెళ్లేవరకూ నడుస్తూ మాట్లాడుకోవచ్చుగదా, మీకింకా ఒకటి రెండు నిమిషాలు ఎక్కువే దొరుకుతాయి అని పోలీసులు బయల్దేరదీశారు. అలా మళ్లీ ఆరేడు నిమిషాల మాటల నడక. పోలీసు కాంపౌండు దగ్గర మమ్మల్ని ఆపేసి వాళ్లను లోపలికి తీసుకుపోతున్నప్పుడు వివిని గట్టిగా కౌగలించుకుని వీడ్కోలు చెపుతుంటే నాకు దుఃఖం ఆగలేదు. ఆయనకూ, మా కుటుంబానికీ అరెస్టులూ, జైలు జీవితమూ, నిర్బంధమూ కొత్తకాదు. అవన్నీ ఉద్యమంలో భాగంగా ఉత్సాహంగా, ఆందోళన లేకుండా స్వీకరించినవే. కాని ఆ వయసంతా అయిపోయింది. ఈ 78 ఏళ్ల వయసులో, యరవాడ జైలులో ఒంటరి సెల్ లో నేల మీద గొంగడి మీద ఆ పాడు చలిలో ముడుచుకు పడుకున్న ఆయనను తలచుకుంటేనే నాకు దుఃఖం ఆగ లేదు. పుణెలో చలి ఎక్కువ. హైదరాబాదు కన్న ఆరేడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అంతకంటె ఘోరం మధ్యాహ్నం 32-33 డిగ్రీల దాకా పెరిగి కరకరమనే ఎండ కొట్టి, రాత్రికి మాత్రం 10-11 డిగ్రీల వణికించే చలికి చేరి శరీరాన్ని ఇటుకొసనుంచి అటుకొసకు ఊగిస్తుంది. వివికి అందుకే పెదాలు పూర్తిగా పగిలిపోయి, నల్లబడ్డాయి. ఏదైనా లిప్ బామ్ తెచ్చివ్వమా, రాసుకుంటారా అంటే, ʹనాకు అలవాటు లేదు గదా, అయినా ఇస్తారో ఇవ్వరోʹ అన్నారు. గడ్డం బాగా మాసిపోయి ఉంది. గతంలో రెండు సార్లూ సోమవారాలు కలిశాను గనుక గడ్డం పెరిగి లేదు. జైలులో ఆదివారం నాడు మాత్రమే గడ్డం చేసేవాళ్లు వస్తారు. మిగిలిన వారంరోజులూ అలాగే ఉండాలి. ఈసారి కలిసినది శుక్రవారం గనుక ఐదురోజుల గడ్డం పెరిగి ఉంది. జుడిషియల్ కస్టడీలో ఉన్న ఖైదీలు ఆరోగ్యంగా, ప్రాణాలతో ఉండేలా చూసుకునే బాధ్యత రాజ్యానిదే గనుక, వారి దగ్గర ఆత్మహత్యకు ఉపకరించే సాధనాలేవీ ఉండగూడదని బ్రిటిష్ వాళ్లు తయారు చేసిన జైలు నిబంధనలు అలాగే ఉన్నాయి. కనుక ఖైదీలు తమ దగ్గర రేజర్ ఉంచుకోవడానికి వీలులేదు.

అలా ఎండి, పగిలి, నల్లబడిన పెదాలతో, మాసిన గడ్డంతో ఆయనను చూసి కన్నీళ్లతో నా చెంపలు తడిశాయి గాని ఆయన కళ్లలో మెరుపు తగ్గలేదు, చిరునవ్వులో ఉత్సాహం, ఉద్వేగం తగ్గలేదు. మళ్లీ ఈసారి కూడ మిత్రులందరినీ పేరుపేరునా అడిగారు. ఎన్నెన్నో సామాజిక, రాజకీయ సమస్యలను ప్రస్తావించారు. నిర్బంధం గురించి మాట్లాడారు. నోముల సత్యనారాయణ సారు చనిపోయిన వార్త పత్రికల్లో చదివి వెంటనే ఒక వ్యాసం రాసి నాకు ఉత్తరంగా పంపారట. నాకది ఇంకా అందలేదు. సెన్సార్ నిబంధనల వల్ల ఉత్తరాలు చాల ఆలస్యం కావడం సహజమే.

ʹబాగున్నాను. ముందు సాయిబాబాను గుర్తు చేసుకుని ఆయన కష్టం ముందు ఇదెంత అనుకున్నాను. ఇప్పుడు నన్నూ వర్నన్ నూ ఉంచిన బ్లాక్ ఫాసీ ఘాట్ దగ్గర. దాదాపు పదహారు మంది మరణశిక్ష పడిన ఖైదీలుంటారు. అందులో కొందరు ముస్లింలు. వాళ్ల గాథలూ కష్టాలూ వింటుంటే ఈ అన్యాయవ్యవస్థ మీద రగులుతున్న కోపంలో, వాళ్ల ఇబ్బందుల సహానుభూతిలో నా అసౌకర్యమేమీ కనబడడం లేదుʹ అన్నారు.

Keywords : వీవీ, వరవరరావు, బీమా కోరేగావ్, మావోయిస్టు, maoist, bima koregaon, varavara rao,
(2019-06-23 07:53:02)No. of visitors : 509

Suggested Posts


0 results

Search Engine

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం
ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు
దప్పికగొన్న భూమి - పి.వరలక్ష్మి
కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !
ʹమావోయిస్టు పార్టీ సభ్యుడవడం నేరంకాదని సుప్రీం కోర్టు చెప్పిందిʹ
నాగురించి కాదు జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసుల గురించి మాట్లాడండి - వరవరరావు
వీవీ,సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలి.....23న హైదరాబాద్ లోధర్నా
అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు
ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
more..


సాయిబాబా