కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం


కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం

కలాల్లో

(తన దేశాన్ని.. అంటే ప్రభుత్వాన్ని ఫేస్‌బుక్ వాల్ మీద విమర్శించాడనే నేరారోపణతో జైలు నిర్బంధానికి గురై.. వంద రోజులు కెరనిగంజ్‌లోని ఢాకా కేంద్ర కారాగారంలో గడిపి ఇటీవలనే (2018 నవంబర్ 20న) బెయిల్‌పై విడుదలైన బంగ్లాదేశ్ ఫొటోగ్రాఫర్, సామాజిక కార్యకర్త షహీదుల్ ఆలమ్.. అరుంధతీ రాయ్‌కు రాసిన ఉత్తరం. తాను జైలులో ఉండగా అరుంధతి రాసిన ఉత్తరానికి విడుదలయ్యాక రాసిన జవాబు. బ్రిటన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక దీన్ని నిన్న - శనివారం ప్రచురించగా, భారత ప్రజా ఉద్యమాల వార్తల సైట్ క్రాక్టివిస్ట్ ఇవాళ పునర్ముద్రించింది.)

ప్రియాతిప్రియమైన అరుంధతీ,

నా కళ్ల ముందర కనబడడానికి చాల ముందే నేను ఎన్నోసార్లు చదువుకున్న, మళ్లీ మళ్లీ చదువుకున్న ఉత్తరం నీది. ఎన్నెన్నో వరుసల లోహపు కటకటాల అవతలినుంచి నా భార్య రహనుమా చెపుతున్న మాటలు వినడానికి నా చెవులు రిక్కించుకున్నాను. తమ మాట అవతలికి వినిపించాలనీ, అవతలి వైపు మాట తమకు వినిపించాలనీ ఇవతలివైపు నుంచి పెద్ద పెద్దగా అరుస్తున్న ఖైదీలతో ఆ దృశ్యం కిక్కిరిసిన క్రీడామైదానం లాగనో, మంటలు ఆర్పడానికి హడావుడిగా వెళ్తున్న అగ్నిమాపక యంత్రం లాగో ఉండింది. తాను తన మాటలను పదే పదే చెప్పింది, కాని నాకు తాను చెప్పే వాక్యాలేవీ వినిపించలేదు. అరుంధతి. ఉత్తరం. ఆ రెండు మాటలు తప్ప నేనేమీ వినలేకపోయాను. అప్పటికి నేను నిర్బంధ జీవితంలో ప్రవేశించి వందరోజులు దాటింది. నేను నా సొంత పడక మీద పడుకుని వంద రోజులు. నా చేపలకు తిండి తినిపించి వందరోజులు. ఢాకా వీథుల్లో నా సైకిలు మీద తిరిగి వందరోజులు. పారిపోతున్న వెలుగును వెతుకుతూ నా కెమెరా కన్ను తెరిచి వందరోజులు.

ఆ రెండు మాటలే నాకు కావలసిన ఊరటనిచ్చాయి. నువ్వది నీ చేత్తో రాసి ఉంటావా? ఎటువంటి కాగితం మీద రాసి ఉంటావు? బహుశా నువ్వు కీ బోర్డ్ వాడి టైప్ చేసి ఉంటావేమో. అలా అయితే ఏ ఫాంట్ వాడి ఉంటావు? ఏ పాయింట్ సైజ్ వాడి ఉంటావు? ఏ పదాలు.... నేనూహించుకున్న పదాల్లో నేను మురిసిపోయాను. నా పడకనూ, నా చేపలనూ, రహనుమా స్పర్శనూ ఎంత కోల్పోయానో నీ పదాలనూ అంతగా కోల్పోయాను. నాకు జైలులో ఏం కావాలని వాళ్లు అడిగినప్పుడు, నేను అన్నిటికన్న మిన్నగా కోరుకున్నవి పుస్తకాలే. మొదటి విడత పుస్తకాలొచ్చాయి. ముజిబ్ జైలు డైరీలు, షెండెల్ రాసిన బంగ్లాదేశ్ చరిత్ర. వాటితో పాటు మనం చివరిసారి కలిసినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ కొత్త పుస్తకం ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హాప్పినెస్. ఢిల్లీలో నీకు వీడ్కోలు చెప్పినప్పటినుంచీ ఆ పుస్తకం చదవాలని అనుకుంటున్నాను. కాని మన పోరాటాల తక్షణత్వంలో మన జీవితాలు మన చేతుల్లో లేవు గదా. ఇప్పుడిక నాకు చదవడానికి వ్యవధి దొరికింది.

వేరే ఉత్తరాలు నా ఊహలోకి వచ్చాయి. రాజద్రోహం నేరం కింద వినాయక్ సేన్ కు శిక్ష వేసినప్పుడు శివ్ విశ్వనాథన్ రాసిన ఉత్తరం. నన్ను విడుదల చేయమని కోరుతూ రఘు రాయ్ రాసిన ఉత్తరం. కాని ఇది వాటిలాగ ప్రధానమంత్రిని ఉద్దేశించినది కాదు. ఇది నాకోసం రాసినది. నాకు రాసినది. ఉత్తరాలు తేవడానికి ఈ కెరనిగంజ్ లో పావురాలు లేవు. పిచుకలున్నాయి గాని పాపం అవి ఉత్తరాలు మోసుకురాలేవు. నేను నా కిటికీలోంచి ఆ పిచుకలకు గింజలు తినిపిస్తున్నప్పుడు, ఒక పిచుక తన కాలికి జాగ్రత్తగా కట్టుకుని తెచ్చిన చిన్న కాగితాల కట్టను ఊహించుకున్నాను. నేను జాగ్రత్తగా ఆ కాగితం మడతలు విప్పాను. ముడతలు సవరించాను. బహుశా ఆ ఉత్తరం రాయకముందే నేను చదివేసినది కావచ్చు.

నేనా ఉత్తరం ఎలా చదవగలిగానంటావా, నీ ఇంట్లో వంటగదిలో చెక్క బల్ల మీద నీ ఎదురుగా కూచున్నానని గుర్తు తెచ్చుకున్నందువల్ల కాదు. తనను మనం మరిచిపోతున్నామని అలకతో నీ కుక్క మాటి కె లాల్ మన మాటల్ని అడ్డుకున్నప్పుడు నువ్వు దాని ముక్కు మీద నిమిరావని గుర్తు తెచ్చుకున్నందువల్ల కాదు. సంజయ్ రాసిన కశ్మీర్ పుస్తకాన్ని మనిద్దరం కలిసి తెరిచామని గుర్తు చేసుకున్నందువల్ల కాదు. నేను నీ ఉత్తరం చూడకముందే ఎలా చదవగలిగానంటే మనం కలిసి అనుభవించిన చరిత్రల వల్ల, మన ఉమ్మడి దుఃఖాల వల్ల, మన ఇద్దరి నేలల మీదా సాగుతున్న నియంతల పాలనల్లో మనం పాల్గొంటున్న పోరాటాల వల్ల. మీకు మీ కశ్మీర్ ఉంది. మాకు మా చిట్టగాంగ్ పర్వత ప్రాంతాలున్నాయి. మీకు మీ ʹఎన్ కౌంటర్లుʹన్నాయి, మాదగ్గర వాటిని ʹఎదురుకాల్పులుʹ అంటారు. మనుషులను మాయం చేయడం ʹగూమ్ʹ మీదగ్గరా మాదగ్గరా ఒకటే. మనిద్దరమూ ప్రజాస్వామ్యం అని పేరు చెప్పుకునే దేశాల్లోనే ఉన్నాం, కాని నోరు విప్పే హక్కు లేదని మనకు తెలుసు.
నీ పుస్తకం సంక్లిష్ట పాత్రలను, భారతదేశం నిండా నిండిన వక్రతలనూ సౌందర్యాన్నీ చిత్రీకరించింది. అది గందరగోళం మధ్య ప్రశాంతతను ఆవిష్కరించింది. బృహత్తర అన్యాయం మధ్యనే ఉన్న క్షణకాలపు దాక్షిణ్యాన్ని ప్రదర్శించింది. నేనిక్కడ జైలులో నా చుట్టూ చూసి సూర్యముఖి భవనంలో అత్యున్నత భద్రతా కొట్లలో ఉన్న హిజ్రాలను గుర్తించాను. అప్పుడప్పుడూ వాళ్లు అటూ ఇటూ తిరుగుతారు. వేరే ఖైదీల నిస్సారపు దుస్తుల మధ్య వాళ్ల చీరల రంగులు మెరిసిపోతుంటాయి. వాళ్లను చూస్తే నాకు నీ నవలా పాత్ర అంజుమ్ గుర్తొస్తుంది. యమున, మేఘన, కొరొతొవ, పద్మ అని ప్రగల్భపూర్వకంగా నదుల పేర్లు పెట్టుకున్న జైలు భవనాల మధ్య తిండి పోగొట్టుకున్న పిల్లులను వెతుకుతూ తిండి తినిపించే కౌతుక్ దా ను చూసినప్పుడు నాకు నీ పాత్ర సద్దాం గుర్తుకొస్తాడు. తప్పుడు ఆరోపణల మీద జైలు పాలై, తమను మరిచిపోయే న్యాయవ్యవస్థ చేతుల్లో మగ్గిపోయే ఖైదీలతో మాట్లాడుతున్నప్పుడు, జైలులో కూడ న్యాయం జరగాలని మెరిసే కళ్లతో వాదించే షర్బహారా టిపు బిశ్వాస్ తో మాట్లాడుతున్నప్పుడు, నాకు నీ పాత్ర మూసా, ఎన్ని కష్టాలెదురైనా ధిక్కారంతో నిలిచే మూసా గుర్తుకొస్తాడు.

ఈ కెరనిగంజ్ జైలులోనే నేను బాదల్ ఫరాజిని కలిశాను. ఆయన మీద భారతదేశపు కోర్టులు అన్యాయమైన నేరారోపణలు చేశాయి. చివరికి బంగ్లాదేశ్ కు పంపించాయి. ఆయన ఆ నేరం చేసి ఉండడని కోర్టులకు తెలిసినప్పటికీ ఆయన ఇప్పటికే పది సంవత్సరాలు జైలులో ఉన్నాడు. భారతదేశంలో జరిగిన ఈ అన్యాయం గురించి మాట్లాడడానికి మా ప్రభుత్వానికి భయం. పెద్దన్నకు ఎక్కడ కోపం వస్తుందో అని సందేహం. అలాగే తీవ్రవాది తోఫేల్ అహ్మద్ జోసెఫ్ కూడ ఈ కెరనిగంజ్ లోనే ఉండేవాడు. అధ్యక్షుడి క్షమాభిక్షతో విడుదల కాగానే రాత్రికి రాత్రి ఆయనను అపహరించి విదేశాలకు పంపించేశారు.

ఇక నా విషయానికి వస్తే, నా బెయిల్ కోసం ఆరు సార్లు ప్రయత్నించవలసి వచ్చింది. నాకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. నన్ను పడక మీద పడుకోకుండా అడ్డుకున్నారు. నన్ను వైద్యుడు చూడకుండా అడ్డుకున్నారు. చివరికి నాకు బెయిల్ వచ్చిన తర్వాత విడుదల కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చిట్టచివరికి మేం విజయం సాధించాం. నేను జైలు గేటు దాటి బైట అడుగుపెట్టేసరికి నా చుట్టూ జనం. ఒకరి చేతులు ఒకరం పట్టుకుని పాటలు పాడుతూ ముందుకు నడిచాం. కాని ఆ కేసు కత్తి ఇంకా నా మెడ మీద వేలాడుతున్నది. నా గళాన్నీ, నా కలాన్నీ, నా కెమెరానూ నిశ్శబ్దం చేయగలమనే దురాశతో నా బెయిల్ ఎప్పుడు ఉపసంహరిస్తారోననే ప్రమాదం అలాగే ఉన్నది. కాని మన కలాల్లో సిరా ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. మన కీ బోర్డులు ఇంకా టకటకలాడుతూనే ఉన్నాయి.

తపష్, హైమంతిల కూతురు రిద్ధికి అన్నప్రాశన (ముఖెభాత్) సందర్భంగా నిన్న మేం ఢాకేశ్వరీ మందిరానికి వెళ్లాం. వాళ్లు ప్రమిదలు వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే, ఈ గుడి కింద భూగర్భంలో ఒకప్పుడు మసీదు ఉందనే కారణంతో ఈ గుడిని కూడ కూల్చేస్తారా అని నాకు సందేహం కలిగింది. సౌదీ డబ్బుల సహాయంతో నిర్మిస్తానని మా ప్రధానమంత్రి వాగ్దానం చేసిన ఐదు వందల మసీదుల జాబితాలో ఇది కూడ చేరుతుందేమో.

నిన్ననే కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ʹచట్టప్రకారం నాకు సంక్రమించిన అధికారబాధ్యతలను విధేయంగా నిర్వహిస్తాను. బంగ్లాదేశ్ పట్ల నిజమైన విధేయతను, విశ్వాసాన్ని ప్రకటిస్తాను. పార్లమెంట్ సభ్యుడిగా నా విధుల నిర్వహణలో వ్యక్తిగత ప్రయోజనాలకూ, ప్రభావాలకూ లొంగకుండా పని చేస్తానుʹ అని వాళ్లు ప్రకటిస్తున్నారు. వాళ్లు ఆ స్థానంలో ఉండడానికి కారణమే ప్రతి చట్టాన్నీ నిబంధననూ ఉల్లంఘించిన ఎన్నికల ప్రక్రియ అయినప్పుడు, వారి వ్యక్తిగత ప్రయోజనాలను పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, ఈ ప్రమాణస్వీకారం ఎంత వక్రీకరణ! వాళ్లు కూచున్న పన్నులు చెల్లించని కార్ల మీద జెండాలు ఎగురుతుంటాయి. దేశంలోకెల్లా అతి పెద్ద చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న వీళ్లే బ్యాంకుల, విద్యాసంస్థల నిర్ణయాధికార స్థానాల్లో కూచుంటారు. వీళ్లే కొత్త చట్టాలు ప్రవేశపెడతారు. సరిగ్గా వీళ్లు ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి వీళ్ల పార్టీకి కాకుండా మరొక పార్టీకి వోటేసిందనే కారణంతో సామూహిక అత్యాచారానికి గురి అయిన ఒక స్త్రీ, నలుగురు పిల్లల తల్లి, ఆస్పత్రిలో మరణానికి చేరువలో ఉన్నది.

కాని, అరుంధతీ, నాకు నమ్మకమే. ఈ పరిస్థితి మారిపోతుంది. పేరులేని, ముఖంలేని ప్రజలు లేచి నిలుస్తారు. వాళ్లు మొత్తం రాజ్యాంగ యంత్రానికి వ్యతిరేకంగా లేచి నిలుస్తారు. వాళ్లు 1971లో లేచి నిలిచినట్టుగా లేచి నిలుస్తారు. ఎన్నడూ స్వాతంత్ర్య సమరయోధుల గౌరవాలను కోరనివాళ్లు, తమ పిల్లలకేవో లాభాలు చేకూరాలని కోరనివాళ్లు, ఎన్నడూ బహిరంగంగా ముజిబ్ కోట్లు వేసుకోనివాళ్లు, వాళ్లు లేచి నిలుస్తారు. వాళ్లు, వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లల పిల్లలు ఏ మౌలిక విలువల కోసం పోరాడారో ఆ విలువలను పునఃస్థాపించడానికి లేచి నిలుస్తారు. మనకప్పుడు లౌకికవాదం వెల్లివిరుస్తుంది. మనకప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మనమప్పుడు సామాజిక న్యాయాన్ని అనుభవిస్తాం. మనం మళ్లీ ఈ దేశాన్ని గెలుచుకుంటాం.

మనం మళ్లీ ఢాకాలో కలుసుకుందాం. నీ కోసం ఒక మహత్తర గాఢాలింగనం ఎదురుచూస్తున్నది.

ప్రేమతో
షహీదుల్

(తెలుగు: ఎన్ వేణుగోపాల్, ఎడిటర్ - వీక్షణం)

Keywords : అరుంధతీ రాయ్, వహీదుల్, ఫొటోగ్రాఫర్, బంగ్లాదేశ్, arundhati rai, vahidul, photographer, letter
(2019-02-18 06:07:52)No. of visitors : 262

Suggested Posts


0 results

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


కలాల్లో