అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం


అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం

అగ్రవర్ణ

అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం ఎన్నో హక్కులు దేశ ప్రజలకు అందించింది. అందులో గత కొన్ని శతాబ్దాలుగా సామాజికంగా వెనుకబాటుతనానికి గురైన దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది ముఖ్యమైంది. అయితే ఈ స్పూర్తికి తూట్లు పొడుస్తూ మోడీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రిజర్వేషన్ల బిల్లు ప్రతిపాదించి ఆమోదింప చేసుకుంది. దీనికి సంబంధించి అనేక వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదే విషయంపై విరసం తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ పూర్తి పాఠం మీ కోసం..

----------------------------------------------------------------------------------------

బీజేపీ ప్రభుత్వం అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తేవడం రాజ్యాంగ వ్యతిరేకం. రిజర్వేషన్ల వెనుక ఉన్న సామాజిక న్యాయభావనను ఈ నిర్ణయం అపహాస్యం చేస్తోంది. ప్రగతి, సామాజిక సమానత్వం అనే కీలకమైన విలువలపట్ల గౌరవం ఉన్న వాళ్లందరూ ఈ పది శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించాలి. మన సమాజ ప్రజాస్వామికీకరణను కోరుకునేవాళ్లందరూ ఈ విషయంపై ఉద్యమించాలి.

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు రిజర్వేషన్లనే పేరుతో ప్రభుత్వం ఇన్నేళ్ల రిజర్వేషన్ల విధానంలోకి కొత్త ఒరవడిని తీసుకొని వచ్చింది. రిజర్వేషన్లకు ఆర్థిక వెనుకబాటుతనం, పేదరికం ప్రాతిపదిక కాదు. అంటరానితనం, సామాజిక వివక్ష మాత్రమే రిజర్వేషన్ల కల్పనకు పునాది. సామాజిక అంతరాలు, వైరుధ్యాలు పరిష్కారం కాకుండా ప్రతి మనిషికి ఓటు హక్కు ఇచ్చినంత మాత్రాన సమానత్వం సాధ్యం కాదనే ఎరుకతో రాజ్యాంగ నిర్మాతలు ఈ స్ఫూర్తిని ప్రదర్శించారు.

ఇంకోపక్క ఆస్తిపర వర్గాలకే సమాజం మీద, రాజ్యాంగ యంత్రం మీద పెత్తనం కట్టబెట్టే రాచమార్గాన్ని రాజ్యాంగమే కల్పించింది. మన దేశంలో సంపద మీద అధికారానికి కులవ్యవస్థకు దగ్గరి సంబంధం ఉంది. కులంతో సంబంధం లేకుండా పేదరికం లేదు. వెనుకబాటుతనం లేదు. ఒకవేళ ఆర్థిక సమానత్వం సాధించినా సామాజిక న్యాయం అమలు కాదు. అంటరానితనం, కుల వివక్ష పోనంత వరకు సామాజిక సమానత్వానికి చోటే లేదు. దీన్ని సాధించేందుకు సామాజిక ప్రాతిపదిక పునాది కావాలి. అర్థికం కాదు. తరతరాలుగా కొన్ని సామాజిక సమూహాలకు పనిగట్టుకొని అన్ని అవకాశాలను దూరం చేసిన అమానవీయ కులవ్యవస్థ మన దేశంలో బలంగా వేళ్లూనుకొని ఉంది. అన్ని రంగాల్లోనూ దళితుల, వెనకబడిన కులాల ప్రాతినిథ్యం పెంచకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సామాజిక బాధ్యత నిర్వర్తించి, ప్రజలకు సేవ చేసే స్థానాలు కనకనే వాటిల్లో అన్ని సమూహాల ప్రాతినిధ్యం ఉండాలి. ప్రజలకు సేవ చేసే స్థానాల్లో ఆధిపత్య కులాలు, పురుషులు మాత్రమే ఉంటే అక్కడికి పీడిత కులాలు, స్త్రీలు చేరుకోవడమే దుర్లభం. కనుక రిజర్వేషన్లు కల్పించడం ప్రజాస్వామ్య బాధ్యత. అందుకోవడం ఆయా వర్గాల హక్కు. ఇది అయ్యే పాపం అని అందించే సహాయం కాదు. వేల ఏళ్లుగా వ్యవస్థ చేసిన తప్పును సరిదిద్దుకోవడం. వందల వేల ఏళ్లుగా సామాజిక వివక్షకు గురైతున్న వాళ్లకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక రాజ్యాంగం స్థూలంగా ఈ స్ఫూర్తిని ప్రదర్శించింది.

దళితుల్లో సంపన్నులు దాదాపు లేనట్లే. మొత్తంగా సంపన్నులు చాలావరకు అగ్రకులాల వాళ్లే ఉంటారు. అయితే అగ్రకులాల్లో కూడా సంపన్నుల కన్నా సామాన్యులే మెజారిటీ. దీనిని చూపించి మరి అగ్రకులాల్లో పేదలకు అవకాశాలు అక్కర్లేదా అని వాదన చేస్తూ ఉంటారు. మరో అడుగుముందుకేసి అసలు రిజర్వేషన్ల వల్లే అగ్రకులాల్లో పేదలకు అవకాశాలు లేకుండా పోతున్నాయని అంటారు. రిజర్వేషన్ల అర్థం తెలీని చాలా అసంబద్ధమైన వాదన ఇది. ఇందులో కులస్వభావం తొంగిచూస్తూ ఉంటుంది. ఉద్యోగం రాకపోవడం మొత్తంగా నిరుద్యోగ సమస్యలో భాగం. లక్షల్లో అభ్యర్థులు, వందల్లో కూడా లేని ఉద్యోగాలు ఇప్పుడున్న స్థితి. నిరుద్యోగ సమస్య మీద ప్రజలకు ప్రభుత్వం మీద ఆగ్రహం కలగాలి. కానీ మన దేశంలో కింది కులాల మీద అసూయ, ద్వేషం కలుగుతుంది.

ఇటువంటి భావజాలానికి సంఘపరివార్‌ మద్దతు ఉంటుంది. మద్దతు మాత్రమే కాదు దీన్ని రెచ్చగొడుతుంది కూడా. ఎట్టైతే ముస్లింలకు వ్యతిరేకంగా మతం పేర జనాన్ని రెచ్చగొడుతుందో, అలా దళితుల మీద ఆక్రోశంగా రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరిని పలు సందర్భాల్లో అది వ్యక్తం చేసింది. మన దేశంలో ఫాసిజం కత్తికి మతం ఒక అంచు అయితే కులం మరో అంచు. రిజర్వేషన్‌ వ్యతిరేకత కూడా సంఘపరివార్‌ ఫాసిజంలో భాగం. మెరిట్‌ చర్చ కూడా ఇందులో భాగంగానే వచ్చింది. మెరిట్‌ లేకపోయినా డబ్బున్న వాడు సీటు కొనుక్కొని డాక్టర్‌ అయితే వాడి వల్ల సమాజం ఏమైపోతుంది అనే చర్చ రాదు. దళితుల విషయంలోనే ఈ చర్చ వస్తుంది. సామాజిక న్యాయభావనకు సంఘపరివార్‌ వ్యతిరేకం కనకనే అది రిజర్వేషన్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ అసంబద్ధమైన చర్చను తీసుకొస్తుంది. అందుకు రిజర్వేషన్‌ను పేదరికానికి ముడిపెడుతుంది.

ఇప్పుడు పార్లమెంటులో తిరుగులేని అధికారంలో ఉన్న సంఘపరివార్‌ అగ్రకుల పేదలకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడిక రిజర్వేషన్లను పేదరిక నిర్మూలనా కార్యక్రమంగా మార్చేసారు. పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం నానాటికీ పెరిగిపోవడానికి పాలకుల విధానాలే కారణం. దోపిడీతో సంబంధం లేకుండా పేదరికాన్ని పరిశీలించడానికి లేదు. శ్రమ దోపిడీ రద్దు కాకుండా పేదరిక నిర్మూలనా కార్యక్రమాల వల్ల వరిగేదేమీ లేదు. ఆ మాటకొస్తే సామాజిక సమానత్వ సాధనకు రిజర్వేషన్లే ఏకైక మార్గం అని ఎవరు అనుకున్నా అది నిజం కాదు. ఇప్పుడున్న రాజ్యయంత్రాంగంలో తరతరాలుగా దుర్భర స్థితిలో ఉన్న పీడిత కులాలకు రిజర్వేషన్లు ఉపశమనం మాత్రమే. రిజర్వేషన్ల ఫలాలను, వాటి ప్రభావాలను ఏ మాత్రం తక్కువ చేయకుండానే ఎక్కువ చేయడానికి కూడా లేదు. అలాగే పేదరికానికి కారణమైన దోపిడీ రాజకీయార్థిక వ్యవస్థ పరిధిలోనే పేదలకు కనీస ఆసరాగా అయినా సరే ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలి. వాటి అవసరాన్ని గుర్తించి పోరాడాల్సిందే.

పేదలను మనుషులుగానే పరిగణించని రాజకీయార్థిక విధానాలు అమలు చేస్తూ, ఇంకోపక్క సామాజిక అసమానతలు తగ్గించడానికి ఉద్దేశించిన రిజర్వేషన్లను పేదరిక నిర్మూలనా కార్యక్రమంగా మార్చివేయడంలోని కుట్రను అర్థం చేసుకోవాలి. ఈ 10 శాతం రిజర్వేషన్ల విధానాన్ని ఖండించడమంటే అగ్రకుల పేదల సమస్యలను విస్మరించడం కాదు. వారికే కాదు, మొత్తంగా సమాజంలో పేదలందరి కోసం ప్రభుత్వం చాలా చేయాలి. దోపిడీ మీద ఆధారపడిన ఈ పాలకవర్గం వల్ల పేదరికం పెరుగుతోందేకాని, తగ్గదనే మౌలిక అవగాహనపట్ల ఏ గందరగోళం లేకుండానే ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి తేవాలి.

అగ్ర వర్ణ పేదల ఓటు బ్యాంకు కోసమే బీజేపీ ఈ బిల్ల తీసుకొస్తే, నిత్యం అనేక విషయాల్లో అవమానకర స్థాయిలో చట్టసభల్లో, బైటా తగాదాపడే రాజకీయ పార్టీలన్నీ ఈ బిల్లు రిజర్వేషన్‌ స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి, అంతిమంగా రాజ్యాంగానికీ వ్యతిరేకం అని చెప్పకుండా తమ ఐక్యతను గొప్పగా చాటుకున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తే అగ్రకులాల ఓట్లకు తాము ఎక్కడ దూరమవుతామో అనే భయంతో అందరూ చిన్న తేడాలతో మోదీ గొంతుతోనే ఈ బిల్లుకు స్వాగతం పలికారు.

హడావిడిగా ప్రవేశపెట్టారని, తగిన కసరత్తు చేయలేదని, ఆచరణలో ఇబ్బందులుల తలెత్తి అమలు కావడం కష్టమనీ పార్లమెంట్‌ లోపల, బైటా విమర్శ వినిపిస్తోంది. ఏ మినహాయింపులు లేకుండా, అమలుకు సంబంధించిన సాదకబాదకాలతో నిమిత్తం లేకుండా తిరస్కరించవలసిన విధానం ఇది. ʹపేదరికంʹ చాటుకోవడం ఈ దేశంలో నిమిషాల పని. అవసరమైతే అంబానీలు, ఆదానీలు కూడా తాము నిరుపేదలమని కాయితాలు తీసుకొని వస్తారు. ఆర్థిక వెనుకబాటుతనం అనే పేరుతో అగ్రకులాల్లోని పలుకుబడి, పెత్తనం ఉన్న వాళ్ల బొక్కసాలకే ఈ రిజర్వేషన్‌ ఫలాలు చేరుకుంటాయి. దశాబ్దాల తరబడి మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంట్‌లో అతీగతీ లేదు కాని, నరేంద్రమోదీ తన ఎన్నికల వ్యూహానికి మూడు రోజుల్లో ఆమోదం పొందగలిగాడు. దీన్ని అంగీకరించడం ద్వారా తమ ప్రయోజనాలను తామూ తీర్చుకోగలిగామని అన్ని రాజకీయ పార్టీలు సంతోషిస్తున్నాయి. ప్రజాస్వామ్యంపట్ల గౌరవం ఉన్న వారంతా ఈ కుట్రపూరిత విధానాన్ని ఎదుర్కోవాల్సి ఉంది.

--పాణి, కార్యదర్శి, విప్లవ రచయితల సంఘం.

Keywords : బీజేపీ, మోడీ ప్రభుత్వం, అగ్రవర్ణ పేదలు, ఈబీసీ, రిజర్వేషన్లు, విరసం, Virasam, EBC, Reservations, Modi, Government, BJP
(2019-04-22 16:12:50)No. of visitors : 289

Suggested Posts


0 results

Search Engine

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం
పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
అతడు ఓటేయలేదు..!
ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
more..


అగ్రవర్ణ