కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి


కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి

కాగితం

(విప్లవరచయితల సంఘం సబ్యుడు కాశీం రాసిన ఈ వ్యాసం 14 జనవరి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడినది)

వరవరరావు కవిగా ప్రజల పక్షం, అధ్యాపకుడిగా విద్యార్థుల పక్షం, చర్చల ప్రతినిధిగా విప్లవకారుల వైపు, రచయితగా పోరాడే ప్రజల వైపు, వక్తగా ప్రజల గొంతును విన్పించే ఉపన్యాసకుడు. ఏలికకు ఇది నచ్చలేదు. ʹనా వైపు నీవు లేవంటే
నా శత్రువుʹ అని ప్రకటించారు.

వరవరరావు కవిత్వాన్ని అంచనా వేయాలంటే ఐదు దశాబ్దాల చరిత్ర, రాజకీయార్థిక పరిణామాలు, సాంస్కృతిక మార్పులు తెలిసి ఉండాలి. అంతమాత్రమే కాదు, వాటి పట్ల అవగాహన ఉండాలి. ప్రతీ మార్పుకు కార్యకారణ సంబంధమేమిటో
తెలియాలి. అప్పుడే ఆయన కవిత్వాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతాం.

ఇది కాలం వెంట వెలుగులు విరజిమ్ముతూ పరుగిడిన అక్షరాల సంగతి. నీలి ఆకాశంలో ఉదయించిన సోషలిస్టు చంద్రుడిని పరిచయం చేసి, ఆకాశం అంచు మీద వికసితమైన పుడమి తల్లి ప్రస్తావన. రాలిపోయిన చుక్కల నెత్తురు తాగి చీకట్లను కురుస్తున్న రాత్రిని తుదముట్టించిన చలినెగళ్ల చరిత్ర. జెయిలు గోడ ముళ్ల తీగ మీద కూర్చొని పక్షులు పాడుతున్న స్వేచ్ఛా గీతం.

వరవరరావు (వివి) యాబై ఏళ్లకుపైగా కవిత్వం రాస్తున్నారు. ఒక రకంగా యాబై ఏళ్ల తెలుగు సామాజిక చరిత్రకు ఆయన కవిత్వం దాఖలా. బహుశా సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక అంశాలు ఇతివృత్తంగా స్వీకరించి ఇంత విస్తృతంగా రాసిన మరో తెలుగు కవి లేడు. తిరగబడు కవిగా ప్రస్థానం మొదలుపెట్టి, విప్లవ కవిగా రూపొందాక ఆయన కాగితం మీద అక్షరానికి కమిటై ఉన్నారు. విరసం వ్యవస్థాపక సభ్యునిగా కీలకంగా వ్యవహరించారు. నిషేధాలు, నిర్బంధాలు ఆయన అక్షరానికి పరిమితులు విధించలేకపోయాయి. పైగా అక్షరం మరింత పదునెక్కింది. కృష్ణశాస్త్రి ప్రభావంలో నుంచి బయటపడిన శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి బాటలు వేసారు. వి.వి నేరుగా శ్రీశ్రీ ప్రభావంలోకి వెళ్లారు. పెండ్యాల కిషన్‌రావు వి.వికి కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని పరిచయం చేసారు. వి.వి మాటల్లోనే చెప్పాలంటే ʹʹమాకు కిషన్‌రావు గారు సాహిత్యంలోకి కిటికీలే కాదు ద్వారాలు తెరిచాడుʹʹ. కాళోజీ, పొట్లపల్లి రామారావు, శ్రీశ్రీ గేయాలను పాడుతూ కంది చేలల్లో తిరిగిన బాల్యం వి.విని కవిత్వం వైపు మళ్లించింది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో (3 జనవరి, 1940) భూమి మీద పడ్డ వి.వి కళ్లు తెరిచి సాహిత్యంలోకి అడుగుపెట్టే నాటికి అధికార మార్పిడి జరిగిపోయి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ధాత కరువు, యుద్ధ సంక్షోభం, గ్రంథాలయ ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైన సంక్షుభిత ప్రభావాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వి.వి మీద పడ్డాయి. దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణ ʹప్రజల మనిషిʹ, ʹగంగుʹ నవలల అధ్యయనం ఆయనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అస్తిత్వమే చైతన్యాన్ని నిర్ణయిస్తుందని మార్క్స్‌ చెప్పినట్లు-తన చుట్టూ ఉండిన చరిత్రే కవిగా వి.వి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. అందుకే ఈనాటికీ ఆయన కలానికి అంతటి నిబద్ధత ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే శ్రీపతి (పి.చలపతిరావు) వి.వికి పాణిగ్రాహిని పరిచయం చేసాడు. పాణిగ్రాహి పాటల ద్వారా వి.వికి నక్సల్బరీ, శ్రీకాకుళ రాజకీయాలు పరిచయమయ్యాయి. 1965 నాటికే ʹసృజనʹ ఏర్పాటు, రచనా వ్యాపకంపై నక్సల్బరీ రాజకీయాల ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌ జిల్లా రచయితల సభలలో (1968) ʹస్వచ్ఛంద కవిత్వం-సామాజిక నిబద్ధతʹ అనే అంశంపై మాట్లాడుతూ ʹʹకాగితం మీద అక్షరానికి కమిట్‌ కావడమే కవి బాధ్యతʹʹ అని వి.వి చెప్పారు. ఆయనే చెప్పిన మాటకు ఐదు దశాబ్దాలుగా ఆయన నిబద్ధుడై ఉన్నారు.

వరవరరావు కవి, పరిశోధకుడు, విమర్శకుడిగా కంటే వ్యాస రచయితగా ఎక్కువగా తెలుసు. ఐదు దశాబ్దాలుగా కళ్ల ముందరి కాలాన్ని వ్యాఖ్యానిస్తూ వస్తున్నాడు. విప్లవం, యుద్ధం, నిర్బంధం, దళితులు, ఆదివాసులు, ముస్లింలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ప్రాంతీయ, జాతుల ఉద్యమాలు, విద్యారంగం, గ్లోబలైజేషన్‌, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇట్లా అనేక విషయాల మీద వందల కొద్ది వ్యాసాలు రాసాడు. ఒక సమస్య మీద శాస్త్రీయమైన అవగాహనను ఏర్పరచుకోవడానికి వి.వి వ్యాసాల కోసం ఎదురు చూసే మేధావి వర్గం ఇప్పటికీ ఉందంటే తెలుగు సమాజంపై ఆయన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కవిత్వం కంటే తక్షణ స్పందనగా ఆయన వ్యాస ప్రక్రియనే ఎంపిక చేసుకుంటారు. చెప్పదల్చుకున్న విషయం ఎక్కువమంది పాఠకులకు చేరాలంటే వ్యాస ప్రక్రియ తప్ప మరొకటి ఆ ప్రయోజనాన్ని నెరవేర్చదని భావిస్తారు.

వి.వి ఉత్తమ పరిశోధకుడనే విషయం కొందరికే తెలుసు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సాహిత్యాన్ని చదువుకున్నారు. ʹఏʹ హాస్టల్‌ నుంచి అటు ఎన్‌సీసీ, ఇటు తార్నాక వరకు క్యాంపస్‌ దారులవెంట రాలిన బొడ్డుమల్లెలు వెదజల్లిన సువాసన వలె ఆయన కవిత్వం వికసించింది. సృజనాత్మక ప్రక్రియ వద్దనే ఆగిపోకుండా ఆయనలోని పరిశోధకుడిని తట్టిలేపారు. ఫలితంగా ʹతెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవలలుʹ విశ్లేషణ గ్రంథం వచ్చింది. నవలలో ప్రతిఫలించిన సమాజాన్ని గతితార్కిక పద్ధతి ద్వారా వివరించే పరిశోధన లక్షణాన్ని వి.వి ప్రవేశపెట్టాడు. ʹʹసాహిత్యం సామాజిక చైతన్యరూపం కాబట్టి ఈ సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఉత్పత్తి సంబంధాల మార్పు దృష్టితోనే పరిశీలించాలి. సామాజిక అస్తిత్వంతో అన్వయించకుండా సాహిత్యాన్ని పరిశీలించకూడదుʹʹ (సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనం; 2013, పుట.3) అని వి.వి తన పరిశోధన ద్వారా ఆనాడే ప్రతిపాదించారు.

వరవరరావు విమర్శకుడు కూడా. వందల పుస్తకాలకు పీఠికలు రాసాడు. ముందు మాటలలో కేవలం వాచక విశ్లేషణ కాకుండా నేపథ్య వివరణ, between the linesలో ఉండే భావం, రచనకు రచయితకు మధ్య ఉండే గతితార్కిక సంబంధం, కావ్య ఇతివృత్తానికి శిల్ప సౌందర్యానికి మధ్య ఉండే సామాజిక-సాహిత్య సంబంధాల విశ్లేషణ ఆయన పీఠికలలో ఉంటుంది. ఏ రచనకైనా దానికదిగా ప్రత్యేక అస్తిత్వం ఏమీలేదని, సామాజిక అంతర్‌ ఘర్షణ ప్రతిబింబమే సాహిత్య వ్యక్తీకరణ అని వి.వి దృక్పథం. ఆయన విమర్శనా శక్తిని పట్టుకోవాలంటే శుద్ధ సాహిత్య జ్ఞానం సరిపోదు. చరిత్ర, రాజకీయార్థిక అధ్యయన సంస్కారం ఉండి తీరాల్సిందే. ʹభూమితో మాట్లాడు: కల్పనా సాహిత్యం-వస్తు వివేచనʹ అని 2005లో ఒక పుస్తకం వచ్చింది. ʹప్రజల మనిషిʹ, ʹగంగుʹ, ʹఅంపశయ్యʹ, ʹకొమురంభీంʹ, ʹకొలిమంటుకున్నదిʹ మొదలైన నవలలు, కొన్ని కథల మీద వి.వి రాసిన 23 వ్యాసాలతో ఈ పుస్తకం వచ్చింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే వక్తగా వరవరరావు ప్రభావం ఈ సమాజం మీద అద్భుతమైనది. ఆ తరంలో ప్రభావశీలమైన వక్తల పేర్లు చెప్పవల్సివస్తే కాశీపతి, జ్వాలాముఖి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, కత్తిపద్మారావు. వక్తృత్వాన్ని ఒక కళగా వి.వి అభివృద్ధి చేసాడు. డెబ్భై ఎనిమిది ఏళ్లలోకూడా ఆయన కంచు కంఠంలోని రాజకీయ స్పష్టత తగ్గలేదు. కాగితంమీద అక్షరానికి కమిటైనట్లే సభలోని మాటల ఒరవడికి కూడా ఆయన నిబద్ధుడై ఉన్నాడు. ʹగాత్రమంతా గాత్రమైʹ అని సంస్కృతంలో ఒక మాట ఉంది, అంటే శరీరమంతా పాటై అని అర్థం. సరిగ్గా వక్తృత్వం ద్వారా ఈ పనిని చేస్తున్నాడు వి.వి.

వరవరరావు యాబైఏళ్ల కవిత్వాన్ని ఒకే పుస్తకంగా 2008లో ప్రచురించారు. ఒక వెయ్యీ ముప్పై పేజీల రచన అది. కాని తెలుగు సాహిత్య ప్రపంచం దానిని విశ్లేషించే, అంచనా కట్టే పని చేయలేదు. ఐదు దశాబ్దాలుగా కవిత్వ సృజన చేసిన, కవిగా గణనీయమైన గుర్తింపు ఉన్న వి.వి కవిత్వాన్ని తూచే విమర్శకులు లేకపోవటమా? సీరియస్‌ శాస్త్రీయ విమర్శ లేని లోపం వలననే ఈ సమస్య ఉందని నాకు అన్పిస్తుంది. ఇప్పుడు తెలుగు సాహిత్యం విమర్శ లేమిని ఎదుర్కొంటున్నది. వరవరరావు కవిత్వాన్ని అంచనా వేయాలంటే ఐదు దశాబ్దాల చరిత్ర, రాజకీయార్థిక పరిణామాలు, సాంస్కృతిక మార్పులు తెలిసి ఉండాలి. అప్పుడే ఆయన కవిత్వాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతాం.

రచయితలను పాలకులు ఎప్పుడూ ప్రతిపక్షంగానే చూస్తారు. ప్రతిపక్షాలు శూన్యమైన సందర్భంలో రచయితలు, కవుల పాత్ర మరింతగా పెరుగుతుంది. ఆ పాత్రనే వరవరరావు నిర్వహిస్తున్నారు. దేశంలో అమలవుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడుతున్నారు. వరవరరావు కవిగా ప్రజల పక్షం, అధ్యాపకుడిగా విద్యార్థుల పక్షం, చర్చల ప్రతినిధిగా విప్లవకారుల వైపు, రచయితగా పోరాడే ప్రజలవైపు, వక్తగా ప్రజల గొంతును విన్పించే ఉపన్యాసకుడు. ఏలికకు ఇది నచ్చలేదు. ʹనా వైపు నీవు లేవంటే నా శత్రువుʹ అని ప్రకటించారు.

అసమ్మతిని ఒప్పుకోలేని కాలంలో జీవిస్తున్నాం. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో ఉన్నాం. దళితులు, ముస్లింలు, ఆదివాసులు, మహిళలు, విప్లవకారులు, హేతువాదులు, ప్రజాస్వామికవాదుల మీద నాలుగు పడగల హైందవ నాగరాజు పడగ విప్పి బుస కొడుతున్నాడు. ఈ సందర్భంలో బుద్ధిజీవుల పాత్ర విస్మరించలేనిది. భావప్రకటన స్వేచ్ఛకోసం సామూహిక స్వరం వినిపించకపోతే చరిత్రలో నేరస్థులమయ్యే స్థితి వస్తుందేమో. వరవరరావే రాసినట్లు:- నేరమే అధికారమై ప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడేʹʹ
(కవిగా వరవరరావు యాభై ఏళ్లు
పూర్తి చేసుకున్న సందర్భంగా)
చింతకింది కాశీం

Keywords : varavararao, virasam, poet, writer, maoists, arrest
(2019-08-24 12:15:50)No. of visitors : 415

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


కాగితం