పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ


పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ

పుణె

బీమా-కోరేగావ్ కేసులో అసత్య ఆరోపణలు ఎదుర్కుంటూ పూణే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వరవరరావును కోర్టు విచారణకు వచ్చిన ప్రతీసారి ఎన్. వేణుగోపాల్(వీక్షణం ఎడిటర్) కలుస్తున్నారు. గత మంగళవారం కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణను ఆయన ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ఆ వివరాలు యధాతథంగా..

------------------------------

మిత్రులారా, నిన్న జనవరి 22 మంగళవారం బీమా-కోరేగాం కేసు నిందితులలో అరెస్టయి జైలులో ఉన్నవారందరినీ (షోమా సేన్‌ను మినహా) పుణె కోర్టుకు తీసుకువచ్చారు. మళ్లీ ఒకసారి ఆ ఎనిమిది మందినీ (సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవర రావు) మీ అందరి తరఫునా పలకరించాను, మాట్లాడాను, ఆలింగనం చేసుకున్నాను. ఆరోగ్యపరంగా అందరూ కాస్త నలిగినట్టు కనిపించారు. వీవీ అయితే గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ సన్నబడ్డారు. చలి వల్ల కావచ్చు నల్లబడ్డారు, పెదాలు పగిలి, నల్లబడి ఉన్నాయి. కాని అందరికందరూ మానసికంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి స్ఫూర్తితో ఉన్నారు.

పోయినసారి లాగే ఈసారి కూడ మన మిత్రులను మధ్యాహ్నం భోజనానంతర సెషన్‌కే తీసుకువస్తారని అనుకున్నాం గాని పన్నెండున్నరకే తీసుకువచ్చారు. వీవీ కూతురు సహజ, మనుమరాలు డా. ఉదయ, వీవీని కలవడానికే (కాదు చూడడానికే) పెద్దపల్లి నుంచి వచ్చిన బాలసాని రాజయ్య, పూణే మిత్రుడు మూర్తిగారు, నేను లిఫ్టులకు ఎదురుగా వరండాలో ఎదురుచూస్తూ కూచున్నాం. హఠాత్తుగా లిఫ్టు తెరుచుకుని బైటికి వస్తున్న వర్నన్ కనబడ్డాడు. ఆ వెనుకే వీవీ. మూడు గంతుల్లో మేం అక్కడికి చేరేసరికే మిగిలిన ఆరుగురూ... సుధను మరొకవైపు నుంచి తీసుకువచ్చి అప్పటికే కోర్టు హాలు ఎదురుగా కూచోబెట్టారు.

వాళ్లలో ముగ్గురిని కోర్టు హాలు ముందు వరండాలో బెంచి మీద కూచోబెట్టి చుట్టూ పోలీసులు నిలబడ్డారు. బెంచీ మీద చోటు లేక సురేంద్ర, మహేశ్, సుధీర్ నిలబడ్డారు. అక్కడ ఒక పది నిమిషాల పాటు పోలీసులు మమ్మల్ని దూరం జరుపుతూ, అదిలిస్తూ ఉన్నప్పటికీ వెనక్కీ ముందుకీ కదులుతూ దోబూచులాటలాడినట్టు ఒక్కో మాట మాట్లాడుతూ వచ్చాం. ఈలోగా సహజ వీవీ పక్కకు చేరి విరసం సభల కరపత్రం, మహబూబ్‌నగర్ ʹవివి కవిత్వంతో ఒకరోజుʹ కరపత్రం, జనవరి సంచిక అరుణతార చూపింది. తెలుగు అచ్చయిన కాగితాలు జైలు లోపలికి తీసుకువెళ్లడానికి వీలులేదు గనుక వీవీ అక్కడే గబగబా చూసి ఇచ్చేశారు. ఆ క్షణం పాటు చూడడానికి కూడ పోలీసుల అభ్యంతరాలు. అసలు మేం తెలుగులో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నామోనని పోలీసుల అదిలింపులు.

ఆ ఆరుగురితో న్యాయవాదులు మాట్లాడడం, వీవీ కోసం వెళ్లిన మేం నలుగురం.. గాడ్లింగ్ కోసం వచ్చిన ఒక క్లైంట్.. ఆయన కూతురు.. మహేశ్ కోసం వచ్చిన ఇద్దరు స్నేహితులు.. అందరి కోసం పూణే నుంచి వచ్చిన మరొక ముగ్గురు నలుగురు స్నేహితులు – ఆ చిన్న నాలుగైదు అడుగుల కారిడార్ నిండిపోయి సభ జరుగుతున్నట్టనిపించింది.

ఒక మఫ్టీ పోలీసు అధికారి.. యూనిఫాం కానిస్టేబుళ్లను మందలిస్తూ, మమ్మల్ని పక్కకు జరపమని ఆదేశిస్తూ, ఆగ్రహంతో ముక్కు నుంచీ నోటి నుంచీ పొగలు కక్కుతూ కాలుకాలిన పిల్లిలా తిరిగాడు. కోర్టు హాల్లోకి వెళ్లి వచ్చి.. ʹజడ్జిగారు మూడున్నరకు తీసుకు రమ్మంటున్నారు, కస్టడీ బ్లాక్ కు తీసుకువెళ్లండిʹ అని ఆదేశించాడు.

మళ్లీ పొలోమని ఊరేగింపు. వెంట ఎస్కార్ట్ ఉన్న కానిస్టేబుళ్లలో ఒక హెడ్‌కానిస్టేబులో, ఎస్సైనో కావచ్చు, చాల కోపంగా, దురుసుగా ఉన్నాడు. అంతకు పావుగంట ముందు నుంచీ మమ్మల్ని మాటిమాటికీ అదిలిస్తున్నాడు. రాజయ్య వీవీ పక్కకు వెళ్లి ఏదో మాట్లాడుతుండగా చూపు వేలుతో బెదిరిస్తూ మరాఠీలో ఏదో అరిచాడు. నిన్ను కూడ లోపలేస్తాం అన్న ధ్వని వినబడింది. అలా కోర్టు ప్రాంగణంలోని పోలీసు కస్టడీ ఆవరణ (న్యాయాధీన్ బందీ కోఠడీ) దాకా మళ్లీ ఒక ఐదారు నిమిషాల నడక-మాటలు. ఆ ఆవరణ ముందు మూడుంబావు దాకా రెండు గంటల పడిగాపులు.

మూడుంబావుకు మళ్లీ కోర్టు భవనంలోకి ఊరేగింపు. మళ్లీ ఐదారు నిమిషాల నడక-మాటలు.

ఈ మూడు విడతల మాటల్లోనే సుధీర్‌కు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. తన పుట్టినరోజునాడు ఫేస్‌బుక్ మీద రాశానని చెప్పాను. సహ నిందితులకు కూడ అప్పుడే తెలిసి అందరూ శుభాకాంక్షలు చెప్పారు. సుధీర్ కు ఆరోజుతో యాబై నిండాయట.

తాను అరెస్టయి వెళ్లేటప్పుడు తీసుకుపోయిన గుల్జార్ కవితల ఇంగ్లిష్ అనువాదాల తాజా సంపుటం ʹసస్పెక్టెడ్ పొయెమ్స్ʹ మొత్తం పుస్తకం తెలుగు చేశానని వీవీ చెప్పారు. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న తన సహ నిందితులైన ముస్లింల సహాయం తీసుకుని ఉర్దూ పదాలూ, గుల్జార్ సాబ్ ఉర్దూలోనే రాసి, దేవనాగరిలో అచ్చువేసిన ముందుమాట కూడ తెలుగు చేశానన్నారు. నేను పోయినసారి కలిసినప్పటికీ ఇప్పటికీ ఏ సభలు జరిగాయని, ఎవరు ఏమి రాశారనీ, ఏం జరుగుతున్నదనీ అడిగి తెలుసుకున్నారు.

ʹసన్నబడ్డారుʹ అంటే ʹఅసలు జైలులో అందరూ లావవుతారు. లావు కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను కూడ రోజంతా నడుస్తూనే ఉన్నాను. బ్రేక్ ఫాస్ట్ తర్వాత నడక, మధ్యాహ్న భోజనం తర్వాత నడక, సాయంత్రం నడక, రాత్రి భోజనం తర్వాత నడకʹ అన్నారు. బ్రేక్ ఫాస్ట్‌గా పోహా (అటుకుల ఉప్మా) గాని, ఉప్మా గాని, సిరా (స్వీట్) గాని ఉంటాయట. అన్నం మెతుకులు చల్లారిపోతే తినడం కష్టమయ్యేలా ఉంటాయి గనుక రొట్టె తింటున్నారట. ʹచదువూ రాతా సాగుతున్నాయి. తెలుగు మాట్లాడేవాళ్లు లేకపోవడం, తెలుగు వినిపించకపోవడం, తెలుగు చదివే అవకాశం లేకపోవడం బాధʹ అన్నారు. ʹఇతర సమస్యలేమీ లేవు. ఆరోగ్యంగా ఉన్నానుʹ అన్నారు.

మళ్లీ వీళ్లను కోర్టు హాల్లోకి తీసుకుపోయేటప్పటికే, ఈ కేసులోనే ఆనంద్ తేల్తుంబ్డే ముందస్తు బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్నాయి. తన మీద ఆరోపణలు ఎత్తివేయాలని ఆనంద్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పది రోజుల కింద కొట్టివేసిన సంగతి, అలా కొట్టివేస్తూనే, నాలుగు వారాల పాటు అరెస్టు చేయవద్దని, ఈ లోగా ముందస్తు బెయిల్ దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పిన సంగతి మీకు తెలుసు. ఆమేరకు ఆనంద్ బెయిల్ దరఖాస్తు విచారణకు వచ్చింది. ఆ దరఖాస్తు మీద తమ వాదన తయారు చేసుకోవడానికి వ్యవధి కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఆనంద్ కు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌లో గాని, ఇప్పటివరకూ బైటపెట్టిన సమాచారంలో గాని ఎక్కడా ఒక్క ఆరోపణ కూడ లేదని, అయినా ఈ విషయమై ఇప్పటికే ముంబై హైకోర్టులోను, సుప్రీం కోర్టులోను ప్రాసిక్యూషన్ చెప్పవలసిందంతా చెప్పిందని, కనుక వ్యవధి ఇవ్వకుండానే విచారణ చేపట్టవచ్చునని ఆనంద్ తరఫు న్యాయవాది అన్నారు. కాని జడ్జి చివరికి ప్రాసిక్యూషన్ కు వారం రోజుల వ్యవధి ఇచ్చారు.

తమపై చార్జిషీట్‌లో, తమకు ఇవ్వవలసిన సమాచారంలో, తమ బెయిల్ దరఖాస్తులలో ప్రాసిక్యూషన్ ఏ ఒక్క పద్ధతినీ పాటించడం లేదని సురేంద్ర గాడ్లింగ్ జడ్జి దృష్టికి తీసుకువచ్చాడు. ఇవన్నీ విచారణ సమయంలో వాదించుకోవచ్చు అని ప్రాసిక్యూటర్ వాయిదా వేయడానికి ప్రయత్నించారు. జడ్జి కూడ ప్రాసిక్యూటర్ తరఫునే గాడ్లింగ్ తో వాదనకు దిగారు.

జైలులో కనీస సౌకర్యాల విషయంలో స్వయంగా ఈ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కూడ జైలు అధికారులు పాటించడం లేదని వీవీ తరఫు న్యాయవాదులు జడ్జి దృష్టికి తెచ్చారు. అసలు ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటి అని చర్చ జరిగి, ఆ ఉత్తర్వు కాపీ కోసం వెతికారు. పది నిమిషాల తర్వాత ఆ కాపీ దొరకబట్టి, జైలు అధికారులకు సమన్లు పంపండి అని మరొక కొత్త ఉత్తర్వు వెలువడింది!

గత మూడు సార్లూ బోనులోనుంచే ʹనా కుటుంబ సభ్యులు వచ్చారు, కలవడానికి అనుమతించండిʹ అని వీవీ అడగడం, అయిష్టంగానే జడ్జి ఓ ఐదు నిమిషాల అనుమతి ప్రసాదించడం జరుగుతున్నది. ఈసారి ఎందుకో వీవీ ʹనేను అడగడం కంటె నువ్వు ఒక అప్లికేషన్ రాసి ఇవ్వుʹ అని సహజకు చెప్పారు. సహజ మా నలుగురికీ అనుమతి ఇమ్మని అప్లికేషన్ రాసి ఇచ్చింది. జడ్జి అది చూసి, ʹభార్యకు తప్ప మరెవరికీ లేదుʹ అని మరాఠీలో వినీ వినబడకుండా గొణిగాడు. కూతురు, మనవరాలు, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు అని న్యాయవాది చెప్పారు. ఆ అప్లికేషన్ మీద లిఖిత ఆదేశం ఏదీ ఇవ్వకుండా, కూతురి ఐడి ప్రూఫ్ ఉందా అని జడ్జి అడిగారు. సహజ తన ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్తే, ʹకూతురు ఒక్కదానికే అనుమతిʹ అన్నారు. సహజ వెనుక ఉదయ, నేను నిలబడి ఉండగా అక్కడ కాపలాగా నిలబడిన ఆ దురుసు హెడ్ కానిస్టేబుల్ మా ఇద్దరినీ వెనక్కి నెట్టాడు.

ఒకవైపు ఇది జరుగుతుండగానే వర్నన్‌ను తమ కొడుకు సాగర్ కలవడానికి న్యాయవాది కూడ అయిన సూసన్ ఎబ్రహాం అనుమతి తీసుకుంది. బోనులో వీవీ పక్కనే నిలబడి ఉన్న వర్నన్ దగ్గరికి సాగర్ వెళ్లాడు. సాగర్‌ను ఎప్పుడో చిన్న పిల్లాడిగా చూసిన వీవీ ఎంత పెద్దగయ్యావు అంటూ చెయ్యి కలిపారు. జడ్జి ఎదురుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సహాయం చేస్తూ నిలబడి ఉన్న ఎసిపి శివాజీ పవార్ ఒక్క గంతులో బోను దగ్గరికి వచ్చి సాగర్‌ను పక్కకు లాగి, ఎవరు నువ్వు, వీవీని ఎందుకు కలుస్తున్నావు అని అడిగాడు. ʹజడ్జి అనుమతి ఇచ్చాడు, అసలు ఈ ముగ్గురూ మీకు తెలుసు గదాʹ అని వీవీ మా గురించి అన్నారు. ʹడాక్టర్ ఉదయ నాకు తెలుసు, తను ఉండవచ్చుʹ అని జవాబిచ్చి సాగర్ వైపు చూపిడితే, ʹవర్నన్ – సుసాన్ ల కొడుకుʹ అని చెప్పగానే, అప్పుడే తెలిసినట్టుగా ʹఅలాగా, సరేʹ అన్నాడు. పక్కనే ఉన్న సనోబర్ ʹపవార్ – డు యు హావ్ చిల్డ్రన్?ʹ అని అడిగింది. ఇంత మహత్తర కేసు తయారు చేసిన ఆ పోలీసు అధికారి ఖంగు తిన్నాడు. చిరచిరలాడుతూ, ʹయు కెనాట్ ఆస్క్ మి, ఆస్క్ ది జడ్జిʹ అని వెళ్లి, నన్ను వీవీని కలవకుండా చేశానన్న విజయగర్వంతో నావైపు చూస్తూ మళ్లీ పీపీ వెనక నిలబడ్డాడు. (వీవీని తీసుకుపోవడానికి నవంబర్ 17న వచ్చినది ఆ అధికారే. ఆరోజు మా ఇద్దరికీ వాదన జరిగింది).

అప్పటికే జడ్జి ఇచ్చే ఉత్తర్వులు అయిపోయాయి కాబట్టి మళ్లీ వెనక్కి వ్యాన్ల దగ్గరికి మరొక ఐదారు నిమిషాల నడక – మాటలు. ఒక బిగి కౌగిలి. ఒక కన్నీటి వీడ్కోలు.

మహారాష్ట్రలో, ప్రత్యేకించి పూణేలో ఈ నాలుగు పర్యటనల్లో వివరంగా పరిశీలించకపోయినా, మెతుకు పట్టి చూసినట్టు చూసినా ఎంతగా హిందుత్వ బ్రాహ్మణీయ భావజాలం, మతోన్మాదం విస్తరించాయో చూసి నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. మహాత్మా జోతిబా ఫూలే – సావిత్రీ బాయి, బాబా సాహెబ్ అంబేడ్కర్ లు పుట్టిన నేల, వలస వ్యతిరేక ఉద్యమం నుంచి దళిత్ పాంథర్స్ దాకా ఎన్నో ఉద్యమాల పుట్టినిల్లు, నాటక, సాహిత్య రంగాలలో ఎందరో ప్రజాస్వామిక సాహిత్యకారుల భావాలు ప్రచారమైన నేల అని గర్వంగా చెప్పుకునే ఆ నేల ఇప్పుడు భయానకమైన ప్రగతి వ్యతిరేక భావనలకు స్థావరంగా ఉన్నట్టున్నది. మచ్చుకు ఒక్క సంగతి చూడండి: కోర్టు హాలులో ఏర్పాట్లు వాస్తు ప్రకారం చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ లేని విధంగా నాలుగు వైపుల గోడలకూ పూర్వ్. పశ్చిమ్, ఉత్తర్, దక్షిణ్ అని దిక్కులు సూచించే బోర్డులున్నాయి. వాస్తు ప్రకారం న్యాయమూర్తి దక్షిణ దిశలో కూచున్నాడు. ఆయనకు ఎదురుగా అంటే ఉత్తర దిశలో గోడ మీద ʹఆరోపీ బసన్యాచి జాగాʹ అని రాసి ఉంది గాని, బహుశా వాస్తు ప్రకారం నిందితులు దక్షిణాన కూచోగూడదేమో, వారి బోనును తూర్పు దిశకు మార్చి, అక్కడ అదే వాక్యాన్ని ఒక ప్రింటవుట్ తీసి అతికేశారు!

Keywords : వరవరరావు, పూణే కోర్టు, బీమా కోరేగావ్, మావోయిస్టు, varavararao, bima koregaon, case , maoist,
(2019-04-17 12:26:00)No. of visitors : 411

Suggested Posts


0 results

Search Engine

ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
Release of Hemalataʹs Open Letter to Chief Justice of India
The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
more..


పుణె