కలత నిద్దురలోనూ దండకారణ్యమే


కలత నిద్దురలోనూ దండకారణ్యమే

కలత

అనగనగా అడవిలో (హిడ్మే మరికొందరు)..

క్రాంతి రాసిన పుస్తకానికి విరసం కార్యదర్శి పాణి రాసిన ముందుమాట..

ఈ వ్యాసాలు రాయాలంటే నొప్పిపడాలి. క్రాంతి దాన్ని అనుభవించాడు. హిడ్మేను, అలాంటి మరి కొందరిని తెలుసుకోవడమే కష్టం. వీళ్లు విప్లవానుకూల శిబిరంలో కూడా అందరికీ తెలుసని చెప్పలేం. అది తెలియని వాళ్ల తప్పు కూడా కాదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వందలాది మంది హిడ్మేలు. మైదాన ప్రాంత ʹనాగరికులʹకు భౌగోళికంగానే కాదు, ఇంకా అనేక రకాలుగా దూరమైన మానవులు. పైగా నిత్యం ఒకేలా ఘటనలాంటిది జరుగుతూ ఉంటుంది. నిజానికి ఒకలాంటి ఘటన కాదు. ఒక తీరు కాదు. రొటీన్‌ అనిపిస్తుంది. అలా అనిపించేలా చేసిందంటే చాలు.. రాజ్యం బరబరా విజయం దిశగా చాలా మెట్లెక్కిపోయినట్లే. యుద్ధాలన్నిట్లో మొదట సాధించే విజయం ఇదే. దండకారణాన్ని బైటి సమాజంతో ఈ సంబంధంలోకి తేవాలని రాజ్యం నానా ప్రయత్నాలు చేస్తోంది. అలాంటప్పుడు సహజంగానే ఎప్పటికప్పుడు దండకారణ్యంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడం అంత సులభం కాదు.

పైగా అది కేవల సమాచారం కాదు కదా. మనుషులు అలవికాని హింసకు గురికావడం. విధ్వంసాన్ని చవిచూడటం. మృత్యువుతో సహ జీవనం చేయడం. అలాంటి మనుషుల గురించి తెలుసుకోవడం చాలా పెయిన్‌. క్రాంతి దానికి సిద్ధపడి ఈ వ్యాసాలు రాశాడు. నొప్పిపడ్డాడని అన్నది అందుకే.

అయితే దండకారణ్యం గురించి తెలుసుకోడానికి ఒక ముఖ్యమైన మాధ్యమం మనల్ని నిత్యం ప్రేరేపిస్తుంది. అది ఉత్తేజపూరితం కూడా. మామూలుగా క్రైం ఆడిట్‌ రొటీన్‌ పని. ఉద్యమాల పరిణామాలను రాజ్యం అక్కడికి తెచ్చి వదిలేస్తుంది. ఒక సంకుల సమరం నడుస్తూ ఉంటుంది. ఈ లక్షణం కూడా దండకారణ్యంలో కొంత ఉంది. దాంతోపాటే అద్భుతమైన నిర్మాణాత్మక ప్రక్రియలు ఎన్నో సాగుతున్నాయి. అందువల్ల దండకారణ్యాన్ని ఎప్పటికప్పుడు ఫాలో కావడంలో ఒక ఉద్వేగానుభూతి ఉంటుంది. లోతుగా ఆలోచించే వాళ్లకయితే అదొక చారిత్రక గతి శీలతకు సంబంధించిన అధ్యయన క్రమం.

ఇది ఈ వ్యాసాల్లో నేరుగా లేకపోవచ్చు. క్రాంతి ఈ రచనలు చేయడం వెనుక ఈ స్ఫూర్తి ఉన్నది. అందువల్లే ఈ వ్యాసాలు రాయగలిగాడు. దిన పత్రిలకు, అడపాదడపా టీవీలకు దండకారణ్యం గురించి వార్త ఒక్కటంటే ఒక్కటే ఉంటుంది. అదే ఎన్‌కౌంటర్‌. మన మీడియా ఎంత దుర్మార్గమైందంటే.. చనిపోయింది ఆదివాసులైతే వాళ్ల పేర్లు, ఊర్లు చెప్పనవసరం లేదనే విధాన నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసింది.

అందుకే విప్లవోద్యమం పట్ల అనురక్తి ఉన్నవాళ్లకు కూడా హిడ్మే ఎవరో తెలియకపోవచ్చు. డానియల్‌ ఏమయ్యాడో తెలుసుకునే అవకాశం ఎన్నటికీ కలగకపోవచ్చు. హేమ్ల, భీమా, అర్జున్‌.. ఇలా ఎందరో ఈ వ్యాసాల్లో ఉన్నారు. వాళ్లెంత మందికి తెలుసు? దండకారణ్యంలో ఒక ఎన్‌కౌంటర్‌ జరిగితే లేదా ఇంకోదో ఘటన జరిగితే వివరాలు చప్పున తెలుసుకోవడం కష్టం. దండకారణ్యం గురించి తెలుసుకునే ప్రాసెస్‌లో ఉంటేనే సాధ్యం.

క్రాంతి అలా ఉన్నందు వల్లే ఈ వ్యాసాలు రాయగలిగాడు. అలా తెలుసుకోవడంమంటే ఒకానొక బాధామయ స్థితికి సిద్ధం కావడమే. ఉదాహరణకు హిడ్మే సంగతే తీసుకోండి. పని ఒత్తిడితోనో, మరెందు చేతనో క్రాంతి ఆ వ్యాసంలో ఆమె గురించి తనకు తెలిసీ రాయని విషయాలే ఎక్కువే. మహిళగా పోలీసు బలగాల చేతిలో ఆమె అనుభవించిన హింస, అవమానం మనం తెలుసుకోవడమే ఒక పెద్ద హింస. పోరాట ప్రాంతాలను రాజ్యం ఒక పథకం ప్రకారం ఇక్కడికి తీసుకొని వస్తాయి.

అయినా అక్కడి వాళ్లకు పోరాటం తప్పదు. ఆ పోరాటాల న్యాయబద్ధత, చారిత్రకత తెలిసిన అక్షరాస్యులు ఇలాంటి అద్భుత మానవుల గురించి రాయాల్సిందే. క్రాంతి దీనికి సిద్ధపడ్డాడు.

*** *** ***

విప్లవ రచయితల సంఘం అధికార అంతర్జాల పక్ష పత్రిక విరసం. ఆర్గ్ (virasam.org) ప్రారంభించినప్పుడు ʹదండకారణ్య సమయంʹ అనే కాలమ్‌ ఉండాలని అనుకున్నాం. పత్రికకు ఒక స్వభావాన్ని ఇవ్వడంలో, పాఠకులను తయారు చేయడంలో ఈ కాలమ్‌ పాత్ర గణనీయమైనది. ఈ మొత్తంలో క్రాంతి రాసిన ఈ వ్యాసాల ప్రభావం కూడా ఉంది.

నిజానికి ఈ వ్యాసాలన్నీ నేరుగా దండకారణ్యానికి సంబంధించినవే కాదు. ఇటు ఏవోబీ సమయంగా కూడా ఈ శీర్షిక నడిచింది

ఇంద్రావతి మారణకాండ మీదనే నాలుగు వ్యాసాలు ఉన్నాయి. రాంగుడా ఎన్‌కౌంటర్‌ దగ్గరి నుంచి ఇంద్రావతి దాకా చూసి రాసిన వ్యాసాలివి. భౌగోళికంగా ఏ ప్రాంతమైనా కావచ్చు. దండకారణ్యం ఇవాళ విప్లవానికి సంకేతం. అది రచయితగా క్రాంతి చైతన్యంలో భాగం. ఈ వ్యాసాల పుట్టువడి అక్కడ ఉంది.

దండకారణ్యమనగానే అటూ ఇటూ కాల్పులనే ఇమేజ్‌ స్థిరపడిపోయింది. దీన్ని బద్దలు కొట్లే వ్యాసాలు ఇవి. ఇవి ప్రధానంగా నిర్బంధ కోణంలోనే ఉండవచ్చు. కానీ అంత మాత్రమే కాదు. దోపిడీ పాలనకు, దండకారణ్య ప్రజా ప్రత్యామ్నాయ పాలనకు మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది. ఈ మౌలిక విషయాన్ని కేంద్రం చేసుకొని ఈ వ్యాసాలు రాశాడు. అంటే దండకారణ్యంలో జరుగుతున్న వర్గపోరాటాన్ని ప్రాతిపదిక చేసుకున్న వ్యాసాలివి. ఈ ఉద్దేశాన్ని గుర్తించకపోతే ఇవి కేవలం పోలీసుల అణచివేత గురించి, హక్కుల ఉల్లంఘన గురించి రాసిన వ్యాసాలైపోతాయి. అలాంటి వాటి ప్రాధాన్యత తక్కువ చేయనవసరం లేదు గాని, ఈ వ్యాసాలు అందించే చూపును తప్పక గుర్తించాలి. ఇంత అణచివేత మధ్య కూడా విప్లవోద్యమం అక్కడ కొనసాగడానికి కారణాలు వర్గపోరాట పునాదిలో చూడాలి.

వర్గపోరాటమంటేనే అత్యంత నిర్మాణాత్మకంగా సాగే రాజకీయార్ధిక సాంస్కృతిక సామాజిక పరిణామ ప్రక్రియ. దండకారణ్య ఆదివాసులు ఇందులో భాగం. ఈ వ్యాసాల్లో కనిపించే హింస, అణచివేత అంతా దానికి వ్యతిరేకంగా సాగుతున్నదే. నిజానికి ఇది ఆదివాసుల మీదే కాదు. దండకారణ్యంలో వనరుల దోపిడీని వ్యతిరేకించిన వాళ్ల మీద, ఆదివాసుల పోరాట న్యాయబద్ధతను బలపరిస్తున్న వాళ్లందరి మీద ఈ హింస సాగుతోంది. ఈ విషయాన్ని కూడా క్రాంతి ప్రస్తావించాడు. ఆదివాసుల తరపున మాట్లాడే ఒక తరం ఇవాళ ముందుకు వచ్చింది. వీళ్లలో చాలా మంది మహిళా మేధావులు. నందిని సుందర్‌, సోనిసోరి, మాలినీ సుబ్రహ్మణ్యం, బేలాబాటియాలాంటి వాళ్లు దండకారణ్య సరిహద్దు ప్రాంతాలకు వెళ్లలేని, ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీని కొనసాగింపే ఇవాళ అర్బన్‌ మావోయిస్టులనే రాజకీయ వ్యూహాన్ని రాజ్యం తీసుకొని వచ్చింది. ఇది కేవలం అణచివేత అభియాన్‌ అనుకుంటే పొరబాటే. అణచివేత కూడా రాజకీయమే. అనుమానం లేదు. కానీ అర్బన్‌ నక్సల్స్‌ అనే వ్యూహం పూర్తి స్థాయిలో విప్లవోద్యమాన్ని ఎదుర్కోడానికి తీసుకొచ్చారు. ముఖ్యంగా విప్లవోద్యమంలో బుద్ధిజీవుల పాత్రను దెబ్బతీయడానికి, వాళ్ల మద్దతు లేకుండా చేయడానికి, సారాంశంలో మావోయిస్టు మేధో బలగాన్ని దెబ్బతీయడానికి దీన్ని తీసుకొచ్చారు. నిజాయితీగల మేధావులను ఆలోచింపజేయగలిగేది ఒక్క మావోయిస్టు ఉద్యమమే అని, దానికే ప్రజల మిలిటెన్సీ పెంచగల శక్తి ఉన్నదని, ముఖ్యంగా నిర్మాణాత్మకంగా ప్రజలను నడిపించగల నాయకత్వ శక్తి కూడా మావోయిస్టు ఉద్యమమే అని రాజ్యం తేల్చేసుకున్నది. దాన్ని ఉద్యమ ప్రాంతంలో దెబ్బతీయడానికి ఆపరేషన్‌ సమాధాన్‌, పట్టణ ప్రాంతాల్లో ఆర్బన్‌ నక్సల్స్‌ అనే వ్యూహాలతో అది ముందుకు పోతోంది.

*** *** ***

ఈ సందర్భంలో ఈ పుస్తకానికి చాలా ప్రాధాన్యత ఉంది. తన పాత్రికేయ వృత్తి వల్ల కూడా ఈ వ్యాసాలను క్రాంతి అక్కడక్కడా కథనాత్మకంగా నడుపుతూ విశ్లేషణాత్మకంగా ముగించాడు. కొన్ని బాగా చదివించే లక్షణమున్న నివేదికల్లా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు చాలా రావాల్సి ఉంది. దండకారణ్య పరిణామాలతో కనెక్టివిటీ పెంచుకొని అనేక మంది ఇలాంటి వ్యాసాలు రాయాలి.

చివరగా ఈ పుస్తకంలో ఒక వ్యాసం గురించి తప్పక చెప్పుకోవాలి. ఇంద్రావతి మారణకాండ మీద మూడు వ్యాసాలు రాశాక కూడా క్రాంతి వెలితిగా ఫీలైనట్టుంది. ఇంద్రావతి తీరం పొడువునా మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ మధ్యలో, గడ్చిరోలీ ప్రాంతంలో సాగుతున్న విప్లవోద్యమం గురించి రాశాడు. ఆ ప్రాంతంలో ఉన్న అపార ఇనుప ఖనిజంపై 1993 నుంచి లోయ్డ్స్‌ మెటల్‌ అండ్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కంపెనీ వంటి కన్నేయడం గురించి రాశాడు. కంపెనీలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాల గురించీ రాశాడు. ఈ ప్రతిఘటనా తత్వం ఆ ప్రాంత ఆదివాసులకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మావోయిస్టుల నేతృత్వంలో సాగుతున్న ఈ పోరాటానికి మూలాలు చరిత్రలో చూసే ప్రయత్నం చేశాడు. అలా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను సాయుధంగా ఎదిరించి 1858లో ఉరికంబం ఎక్కిన బాబూరావు శెడమాకె దాకా వెళ్లాడు. ఆయన పోరాట వారసత్వం ఆదివాసీలో జీవన సంస్కృతిలో, గాలిలో, నేలలో, నీటిలో కలగలసి ఇప్పుడు మావోయిస్టు విప్లవోద్యమంగా ఎలా పర్యవసించిందో వివరిస్తూ వ్యాసం రాశాడు.

గత ఏడాది కలతనిద్దురలో అని కవితా సంపుటి తెచ్చిన క్రాంతి ఇప్పుడీ వ్యాస సంపుటి తెస్తున్నాడు. ఆయన కలతకు, చైతన్యానికి, శతృ నిర్బంధం మధ్య గుండె నిబ్బరానికి కూడా దండకారణ్యమే ఆలంబన. ఈ పుస్తకం చదివితే దండకారణ్యంపై అమలవుతున్న నిర్బంధం తెలియడమే కాక, దండకారణ్యం అందించే వెలుగు రేకలు కూడా మన మీద ప్రసరిస్తాయి. అప్పుడు మనకు ఒక కొత్త ఉత్తేజం తప్పక వస్తుంది. అందు కోసం కూడా ఈ పుస్తకం తప్పక చదవాలి.

(నల్లగొండ విరసం సాహిత్య పాఠశాలలో... ఆవిష్కరించిన ʹఅనగనగా అడవిలో (హిడ్మే... మరికొందరు)ʹ పుస్తకం ముందుమాట)

Keywords : క్రాంతి, పాణి, విరసం, కలత నిద్దురలో, kranti, virasam
(2019-03-20 02:33:36)No. of visitors : 344

Suggested Posts


0 results

Search Engine

ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


కలత