కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||


కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||

కవి

ప్రొఫెసర్ సాయిబాబ గత కొన్నాళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఒంటరిగా అండా సెల్‌లో ఉంటున్న సాయిబాబ తన మనసులోని మాటలను కవిత్వంగా మలిచారు. అది ఇటీవలే పుస్తకంగా బయటకు వచ్చింది. విరసం ప్రచురించిన ఈ పుస్తకానికి పాణి రాసిన ముందు మాట ఇది

ప్రొ. సాయిబాబ ఇంతక ముందు కవిత్వం రాశాడో లేదో తెలియదు. కవిత్వమైతే ఆయన వ్యాపకం కాదు. ప్రధాన వ్యక్తీకరణ కాదు. ఇప్పుడీ అండాసెల్‌ కవిత్వం చదువుకుందాం. సాయిలోని కవి మనల్ని అబ్బురపరుస్తాడు. చాలా మందికి ఆయనొక ప్రముఖ అధ్యాపకుడు. ఉద్యమకారుడు. భారత ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. ఆ అర్థంలో సార్థక బుద్ధిజీవి. హేతువు మీద, తార్కిక చింతన మీద, కఠినమైన ప్రజా ఆచరణ మీద ఆధారపడిన వ్యక్తిగా సాయిని ఎరిగినవాళ్లు ఈ కవిత్వంలో ఆయన కాల్పనిక ప్రపంచపు వైశాల్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు.

ఇదెలా సాధ్యమైంది? ఒంటరి జైలు గదిలో ఈ కవిత్వం ఎలా నిర్మాణమైంది? ఈ కవిత్వంలో ఆయనదే అయిన ప్రత్యేకత ఏమిటి? అదెలా తనలో సంతరించుకున్నది? విప్లవ కవిత్వపు ఈ దశ వెల్లువలోకి సాయిబాబ ఎలా భాగమయ్యారు? అనే ఆశ్చర్యకర ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయి.

సారాంశంలో కవి ఎలా రూపొందాడనే మౌలిక ప్రశ్న దగ్గరికి ఇవి మనల్ని తీసికెళతాయి. జైలు గోడల మధ్య అత్యంత సహజమైన భిన్న మానవోద్రేకాలతో, వాస్తవ-కాల్పనిక జగత్తుల మధ్య సంచరిస్తూ తనలోని మనిషిని కవిగా ఆయన తీర్చిదిద్దుకున్నారు. దానికి మనం సమాధానం వెతుక్కునే క్రమంలోనే సాయిబాబ కవిత్వాన్ని అనుభవించగలం. అంచనా వేయగలం.

------------------------------------------------

సొంత ఆస్తి దానికదే నేరమయ వ్యవస్థ. అది ఉన్నంత కాలం మనుషులు దొంగలుగా, నేరస్థులుగా జైలుకు వెళ్లాల్సిందే. నేరం మీద ఆధారపడిన రాజ్యానికి ఈ నేరమయ వ్యవస్థను కాపాడేందుకు జైళ్లు కావాల్సిందే. నేరం ఆపాదించి మానవ సంబంధాలకు మనిషిని దూరం చేయడమే జైలు ఉద్దేశం. సమాజానికి దూరంగా ఎత్తయిన జైలు గోడల మధ్య ఒంటరి గదిలో బంధించి ఒంటరివాళ్లను చేయడమే జైలు లక్ష్యం. కాబట్టి జైలంటే ఒంటరితనం. మనిషి సాగించే సకల సృజనాత్మక, ఉత్పత్తిదాయక కార్యకలాపాలన్నీ మానవ సంబంధాల ఫలితమే.

అలాంటి మానవ సంబంధాలకు మనిషిని దూరం చేయడానికి రాజ్యం నేరాన్ని సాకుగా ఎంచుకుంటుంది. జైలంటే కేవలం రాజకీయ నిర్బంధం, కుటుంబానికి దూరం చేయడం, కనీస సౌకర్యాలు లేని చీకటి కొట్లో తోసేయడం మాత్రమే కాదు. నేరం ఉద్దేశం మనిషిలోని సృజనాత్మకతకు మూలమైన సమాజం నుంచి వ్యక్తులను వేరు చేయడం. మనుషుల్లోని సృజనాత్మక జీవిని నిర్మూలించడం.

దీని రాజకీయ, న్యాయ వ్యాఖ్యానం ఏమైనా కావచ్చు. రాజ్యాంగయంత్రంపై పెత్తనం చేసే వర్గం తక్షణంగా ఏ ప్రయోజనమైనా పొందవచ్చు. కానీ ఆలోచనా జీవి అయిన మనిషిని ఒంటరితనంలోకి తోసేయడమే జైలు ఉద్దేశం. కానీ చైతన్యవంతమైన ఖైదీలు ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకుంటారు. ఆ ఏకాంతంలోంచి విశాల మానవ ప్రపంచంలోకి విస్తరిస్తారు. తమకు దూరమైన ప్రపంచంతో అనుసంధానానికి కాల్పనిక, ఊహాత్మక మాధ్యమాన్ని నిర్మించుకుంటారు.

నిజానికి వ్యక్తులను ఒంటరితనానికి గురి చేసే జైలు కూడా సమాజమనే మొత్తంలో భాగం. కాబట్టి ఆ జైలే సమాజంతో అనుసంధానానికి ఖైదీల అంత:ప్రపంచపు కిటికీలను తెరిచి చూపుతుంది. జీవితపు యథాలాప స్థితికి భిన్నంగా తమ అనుభవాన్ని, పరిసరాలను, ఆలోచనల పొరలను, జ్ఞానపు లోతును తరచి చూసుకునే క్రమంలో బైటి ప్రపంచంతో కనెక్ట్‌ అవుతారు. తనకు అత్యంత సన్నిహితంగా తెలిసిన ప్రపంచాన్నే ఒకింత విరామంలోంచి పునర్దర్శించే వెసులుబాటు కలుగుతుంది. అప్పుడది సరికొత్తగా కనిపిస్తుంది. అలా చూడటమే కొత్త అనుభవం. ఎంతగానంటే- ఖైదీలు తమకు తామే కొత్తగా కనిపిస్తారు. సరిగ్గా ఈ పునరాన్వేషణే కవిత్వానికి మూలం. కవిత్వం రాయక తప్పని స్థితి ఇది. జైలుకు, కవిత్వానికి ఉన్న సంబంధమే అలాంటిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒంటరి గదిలోంచి మనిషి బైటి ప్రపంచానికి వినిమయమయ్యే మాధ్యమమే కవిత్వం.

ఈ దృష్టిలోంచే ఖైదు కవిత్వం నిర్మాణమవుతుంది. లేకుంటే దానికి అవకాశమే లేదు. ప్రత్యేకతా ఉండదు. జైలు కవిత్వం తన అనుభవాలకు, సాటి ఖైదీలకు పరిమితం కాదు. ఎందుకంటే అదొక అస్తిత్వం కాదు. అదే అయితే బహుశా ఏ ఖైదీకీ కవిత్వమే అవసరం ఉండకపోవచ్చు. అవసరపడ్డా అందులో తన గురించి, జైలు గురించే ఉండేది. కానీ ఖైదీ ఉనికి అంత మాత్రమే కాదు. బందీ తన వాస్తవ ఉనికిని పునర్నిర్మించుకోకుంటే జైలు జీవితం దుర్భరమవుతుంది. ఈ కారణం వల్లే అనంత వైవిధ్యాన్ని జైలు కవిత్వం సంతరించుకుంటుంది. మానవ సమాజానికి దూరంగా జీవితానికి ఉనికే ఉండదు. బైట ఉన్నప్పటి కంటే భిన్నంగా కనిపించే ఆవలి ప్రపంచాన్ని చుట్టేసి రావడానికి, దానితో సమతుల్యత సాధించడానికి, సంభాషించడానికే కవిత్వం కావాలి. అందువల్ల సహజంగానే ఖైదు కవిత్వం వేర్వేరు జీవన తలాల మీది నుంచి వ్యక్తమవుతుంది. విప్లవకారుడికి, విప్లవ కవికి మాత్రమే ఎదురయ్యే రచనానుభవం ఇది.

మన దగ్గర వచ్చిన ఖైదు కవిత్వంలో అపారమైన వైవిధ్యం ఉంది. సాయిబాబ అండాసెల్‌ వ్యక్తీకరణ ఖైదు కవిత్వాన్ని శిఖర సదృశం చేసింది. మొత్తంగానే ఆధునిక తెలుగు కవిత్వపు స్థాయిని సాయి చాలా పైకి తీసికెళ్లారు. ఈ మాట లాంఛనంగా అంటున్నది కాదు. కవి ప్రతిభ మీద ఆధారపడి అంటున్నది కూడా కాదు. విమర్శకుల ప్రతిభతో తేల్చే కవిత్వం కూడా కాదిది. నిజానికి ఇది కవిత్వం మాత్రమే కాదు. అంతకంటే కూడా. మానవ అనుభవంలోంచి, మనిషి అంతస్సారంలోంచి, చారిత్రక సమయ సందర్భాల్లోంచి కవిత్వంగా మారగల దాన్నంతా సాయి కవితామయం చేశారు.

అత్యంత దుర్భరమైన జైలు జీవితానుభవాల తాకిడిని ఒడిసిపట్టుకొని, తన జీవన దృక్పథపు తెరచాపతో దృఢంగా నిలబడేందుకు చేస్తున్న సాహస ప్రక్రియే ఈ కవిత్వం. వాస్తవికమైన ఉద్వేగాల, విశ్వాసాల, ఆగ్రహావేశాల, కన్నీటి దు:ఖాల కాల్పనిక ప్రపంచమంతా చుట్టి వచ్చి తిరిగి జైలు గది నేల మీది నుంచి కవిత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టే ప్రక్రియ ఇది. కాల్పనిక రూపం ధరించే మానవ విశ్వాసానికి ఎంత శక్తి వస్తుందో ఈ కవిత్వంలో చూడవచ్చు. కవిత్వమంటే సరిగ్గా ఇదే. అలవిగాని ఒంటరితనాన్ని అనంత మానవ సంబంధాల్లోకి, అతి సున్నితమైన, ఆర్దృమైన అనుభూతుల్లోకి, మానవులకు మాత్రమే సాధ్యమయ్యే అనుభవాల్లోకి, అంతకుమించి భవిష్యదాశలోకి మళ్లించడంకంటే కవిత్వానికి అర్థం ఏముంటుంది? సాయి కవిత్వం నిండా ఇదే ఉంది.

--------------------------------------

సాయిబాబ ఆంగ్ల సాహిత్య విద్యార్థి. విశ్వవిద్యాలయంలో అదే బోధిస్తున్నారు. ఆలోచనాపరుడిగా ఆయన మార్క్సిస్టు లెనినిస్టు. మానవ సమాజ పరిణామం గురించి దృఢమైన అభిప్రాయాలు, అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో ఆయన రాజకీయ ఆచరణ అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదికతో ఆరంభమైంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంస్థ అది. ఆ కాలంలోనే ఆయన విప్లవ రచయితల సంఘంలో చేరారు. ఏఐపిఆర్‌ఎఫ్‌ తర్వాత రెవల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ నాయకుడయ్యారు.

ఆయన్ను మొదటిసారి మే 9, 2014లో అరెస్టు చేశారు. నిజానికి ఆ ఏడాది జనవరి 8న ఢిల్లీలో ఆయన ఇంటి మీద దాడి చేశారు. అనేక అక్రమ ఆరోపణలతో జైలుపాలు చేశారు. ఏప్రిల్‌ 4, 2016న బెయిల్‌ వచ్చింది. ఏడో తేదీ విడుదలయ్యారు. ఈ కేసుపై అత్యంత దుర్మార్గంగా విచారణ జరిపి మార్చి 7, 2017న యావజ్జీవ శిక్ష విధించారు. ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో బుద్ధిజీవులు, ఉద్యమకారులు సాయిబాబ పక్షాన దృఢంగా నిలబడ్డారు. ఆయన విడుదల కోసం, తక్షణం వైద్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. చేస్తున్నారు. కానీ ఫాసిస్టు న్యాయస్థానాలు ఆయనను బయటికి వదలకూడదనే ఒక విధాన నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడాయన నాగపూర్‌ కారాగారంలో ఉన్నారు.

తీవ్రమైన అనారోగ్యంతో, ఎప్పటికి విడుదలయ్యేదీ తెలియని జైలు జీవితంలోంచి ఆయన ఈ కవిత్వం వినిపిస్తున్నారు. మానవ అనుభవంగా మారే గుణం ఎంత ఉంటే అది అంత మంచి సాహిత్యమవుతుంది. సాయి కవిత్వం కవిత్వంలో మల్టీ మూడ్స్‌ ఉంటాయి. అవి అనేక తలాల్లోంచి వ్యక్తమవుతుంటాయి. పాఠకులకు వాటికి అతలాకుతలమైపోతారు. వాటిని తాను అనుభవిస్తూ, మనతో పంచుకోడానికే కవిత్వం రాశారు. ఈ సంపుటిలో ఆయన తన సహచరికి, కూతురికి, తల్లికి, మిత్రులకు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. నిజానికి అవి ఉత్తరాలు కాదు. కవిత్వం. ఉత్తరాల రూపంలో సాగిన కవిత్వం. ప్రతిదాంట్లో అప్పుడు తానున్న మన:స్థితి మనకు అర్థమవుతుంది. దాని అట్టడుగున తన దృఢమైన వ్యక్తిత్వం మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఫీల్‌ కవిత్వం కావడమంటే జైలులోంచి ఇతరులకు తాను వ్యక్తం కావడమే.

అట్లని అది కేవలం తనలో ఏముందో, తన వేదన ఏమిటో చెప్పుకోవడం మాత్రమే కాదు. మామూలుగా చెప్పాలంటే గుండె బరువు దించుకోవడం కాదు. వ్యక్తం కావడమంటేనే తనను తాను దృఢపరుచుకోవడం. అనేక రకాల మూడ్స్‌లోంచి కఠినమైన జైలు జీవితానికి తగినట్లు తనను తాను నిరంతరం సిద్ధం చేసుకోవడం.

ఈ సంపుటిలోని చాలా కవితలు తన అంతర్గత శక్తినంతా వెలికి తీసే ప్రక్రియే. అలా వెలికితీసి మళ్లీ తనను తాను పునర్నిర్మించుకోవడం. శక్తివంతంగా, అపారమైన చారిత్రక, కాల్పనిక పునాదులపై తీర్చిదిద్దుకోవడం. దుర్భరమైన స్థితిలో ఉండి కూడా వైకల్యమనే మాటనే అంగీకరించలేని, సానుభూతిని స్వీకరించలేని వ్యక్తిత్వాన్ని ఇంకా ఇంకా గట్టిపరుచుకోవడమే ఈ కవిత్వం. అందుకే ఆయన నేను చావడానికి నిరాకరిస్తున్నాననే ఆశావహ ప్రకటన చేశారు. మరణం లేని నా మందహాసం చూసి మండిపోయి వాళ్లు నన్ను మళ్లీ బంధించారు..అంటూనే ఇంకో చోట ఇప్పుడు నేను మృత్యువు గురించి యోచిస్తున్నాను. అంటే జీవితం గురించి ఆలోచిస్తున్నాను అంటారు.

జీవితం, మృత్యువు గురించిన ఈ తాత్వికత సాయి కవిత్వమంతా అంతర్లీనంగా ఉంది. ఇంకోపక్క మానవ చరిత్ర పట్ల, దాని ఆనవాళ్లను సహితం తుడిచేసే దుర్మార్గం పట్ల తీవ్రమైన ఆగ్రహం ప్రకటిస్తారు. ఉరుములు, మెరుపులు, తుపానుల వంటి ప్రకృతి విపత్తులోంచి మానవాళి మీద చరిత్ర పొడవునా సాగుతున్న ఆధిపత్య వ్యవస్థల దాడిని పోల్చుకుంటారు. ఒంటరి విచారం, ఏకాంతంలో తనలోకి సాగే అంతర్యానం, ఆగ్రహం.. ఇలా అనేక మూడ్స్‌లోంచి ఈ కవిత్వం రాశారు.

ఆయన తన మూడ్స్‌లో దేన్నీ సెన్సార్‌ చేసుకోలేదు. జీవితంపట్ల, అనుభవం పట్ల విప్లవ కవి దృక్పథానికి ఇది ఒక ప్రమాణం. మన:స్థితిపై తార్కికమైన ఎరుక, అదుపు ఉన్నప్పుడే ఇంత నిర్మాణాత్మకంగా కవిత్వం రాయడం సాధ్యమవుతుంది. దీన్ని ఆయన సాధించిన తీరు అద్భుతమనిపిస్తుంది. ఇది సాయిబాబ కవిత్వంలో తనదే అయిన ప్రత్యేకతల్లో ఒకటి.

మళ్లీ ఇదంతా మామూలు వచన ప్రకటనగా తేలిపోలేదు. అనుభవపు ఏమారు మూలల నుంచి, లోతుల నుంచి వ్యక్తమైతే కవిత్వమవుతుందో సాయికి బాగా తెలుసు. ఈ కాల్పనికశక్తి వల్ల పాఠకులను ఈ కవిత్వం పట్టి కుదిపేస్తుంది. లేకపోతే ఇది ఒట్టి ఒలపోత కవిత్వమయ్యేది. అనుక్షణం మనుషుల మధ్యే ఉంటూ ఒంటరితనమనే ఒగచే కవిత్వ ధోరణిని సాయి తన దరిదాపులకు రానియ్యలేదు. జైలు గోడల మధ్య నిట్టూర్పుకు అలవాటుపడితే శతృవు జయించినట్లే. జైలుపట్ల ఖైదీలకు ఉండాల్సిన దృక్పథమని వాడు ఏదనుకుంటున్నాడో దాన్ని తీసేసుకున్నట్లే. సాయి దాన్ని ఎంతగా మౌలికంగా ఎదుర్కొన్నాడంటే నేను చావడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పేశారు.

కఠినమైన జైలు అనుభవం నుంచి ఆయన రాసిన కవితలు ఎంత సున్నితంగా ఉంటాయంటే.. జైలు గదిలో ఆయనెప్పుడో రాసినప్పటి అక్షరాల తడి ఇప్పటికీ మనల్ని సుతిమెత్తగా మార్చేస్తాయి. సరిగ్గా కవిత్వం చేయవలసిన పని ఇదే. విప్లవమనే చారిత్రక ప్రయాణంలో మనిషికి తోడుగా ఉండాల్సిన కవిత్వం ఇది. అందుకే కొన్ని కవితలు ఏకాంతంలోంచి సమూహంలోకి చేసే ప్రయాణంలా ఉంటాయి. దానికి ఆయనను ప్రేరేపించిన సందర్భాలను గమనించాలి. అప్పుడు ఆయన ప్రపంచంతో, చరిత్ర గతితో కనెక్ట్‌ అయిన తీరును అర్థం చేసుకోవాలంటే సాయిలోని కవినీ, ఆలోచనాపరుడ్ని కూడా కలిపి చూడాల్సిందే. విశ్వాంతరాళపు సూక్ష్మ దర్శనం చేస్తూ మనిషిని అనంత మానవ విశ్వాసానికి సంక్షిప్త రూపమని అనగల అవగాహన ఆయనది.

ఈ కవిత్వంలో మరో ప్రత్యేకత ఏమంటే.. చాలా చోట్ల సాయి మనకు థింకర్‌గా కనిపిస్తాడు. ఇలా అయితే కవిత్వం దెబ్బతింటుందనో, అసలు కవిత్వం కాదనో, లేక జటిలంగా మారుతుందనో అభిప్రాయం కూడా ఉంటుంది. కానీ సాయి తన ఆలోచనాపరత్వాన్ని కవిత్వ రచనలో వదులుకోలేదు. పైగా దాన్ని సృజనాత్మకతలం మీదికి తీసికెళ్లి మెలకువగా వ్యవహరించారు. దీని వల్ల కవిత్వం సమకాలీన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో వ్యాఖ్యాన లక్షణం కూడా సంతరించుకుంది. వర్ణనాత్మక ప్రక్రియ అయిన కవిత్వానికి నిర్బంధంలో ఉన్న సాయిలోని ఆలోచనాపరుడు, కార్యకర్త ఈ వ్యాఖ్యానశైలిని అందించారు. ఇది ఆయన కవితా శిల్పాన్ని మరింత తీర్చిదిద్దింది.

ఈ క్రమంలో కొన్ని కవితలు తీవ్ర ఆగ్రహ ప్రకటనలయ్యాయి. బండగా చెప్పాల్సిన వాటిని అలాగే చెప్పడానికి సాయి వెనుకాడలేదు. ఈ సంపుటంలో అత్యంత తాత్విక శిఖరానికి చేరుకున్న కవితలతో పాటు ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. వీటిని ఇలాగే రాయాలని ఎంచుకొని మరీ రాశారా? అనిపిస్తుంది. బైట ఉన్న మనం తన కోసం ఆందోళనపడుతోంటే ఆయన జైలు నుంచి మనకు భరోసా ఇస్తూ రాసిన కవితలు కూడా ఇందులో ఉన్నాయి.

బైట ఉంటే తను ఎంత పెద్ద ప్రపంచంతో సంపర్కంలో ఉంటారో అందులో దేన్నీ ఆయన జైలు వల్ల కోల్పోలేదు. ఆ రకంగా జైలు నిర్బంధాన్ని ఆయన తుత్తినియలు చేశారు. అందువల్ల ఈ కవితల్లో అంతర్లీనంగా ఉండే జైలు అనుభవం ఆయన సొంత గొడవగా మారిపోలేదు. సాధారణంగా జైలు కవిత్వం తనను నిర్బంధించిన శతృవుతో, అనేక నిర్బంధాల్లో ఉన్న సమాజంతో సాగే అనంత సంభాషణగా మారుతుంది. ఖైదీలు ఇలాంటి సంబంధాల్లోనే ఉంటారు. సాయి ఈ సంబంధాలను చాలా పై స్థాయిలో అర్థం చేసుకున్నారని చెప్పగల కవితలు ఇందులో ఉన్నాయి. అందువల్ల ఏ అనుభూతి కూడా సొంత గొడవ కాలేదు. ʹనేనుʹను సాయి కవిత్వం చాలా జాగ్రత్తగా ఎత్తిపట్టింది. ఏ కొంచెం దృక్పథపరమైనా తేడా వచ్చినా కవిత్వం స్వీయాత్మకమయ్యేదే. అంతకంటే ముఖ్యమైన ఇంకో సమస్య ముందుకు వచ్చేది. అదేమంటే - కవిత్వమంతా ఒకే మూడ్‌లోకి జారిపోయేది.

ఈ సమస్య సాయి కవిత్వంలో లేనే లేదు. దీనికి కారణం సాయి జైలును అర్థం చేసుకున్న తీరులో ఉంది. నిజానికి ఆయన కవిత్వం రాయడానికి అదే ప్రేరణ.

ఉదాహరణకు అనేక వైపుల నుంచి, అనేక రూపాల్లో మోహరించిన యుద్ధ వాతావరణాన్ని జైలు నుంచి ఆయన పోల్చుకుంటూ కవిత్వం చేశారు. తరచి చూస్తే అందులో అదొక్కటే ఉండదు. జైల్లోని తన అసౌకర్యాల మీద, ఇబ్బందుల మీద పోరాడి తనను తాను నిలబెట్టుకునే యుద్ధంలా కూడా కనిపిస్తుంది. ఒక అనుభవంపట్ల, అనుభూతిపట్ల కవిగా, ఆలోచనాపరుడిగా కూడా ఉండే అవగాహన నుంచి కవిత్వం మల్టీ లేయర్స్‌లో నిర్మాణమైంది. ఒకే కవిత మల్టీ మూడ్స్‌ పలుకుతూ ఉన్నందు వల్ల చాలా గాఢంగా తయారైంది. దీనికి ఆయన కవిత్వంలోంచి ఎన్నో ఉదాహరణలు తీసి చూపవచ్చు.

దీని వల్లనే ఆయన కవిత్వంలో అపారమైన వైవిధ్యం సాధ్యమైంది. మామూలుగా ఇటీవల పేరుమోసిన కవులు సంపుటాల్లో కూడా చాలా కవితలు ఒకేలా ఉన్నట్లనిపిస్తాయి. ఒకేలా నడుస్తున్నట్లనిపిస్తాయి. దాదాపుగా చివరంటా ఒకే మూడ్‌ ఉంటుంది. సాయి కవిత్వం దీనికి పూర్తి భిన్నమైనది. ఏ నాలుగు కవితలు ఎంపిక చేసుకున్నా దేనికదే ప్రత్యేకం.

జైలు అనుభవం చాలా కవితల్లో అంతర్లీనంగా ఉంటూనే, దాని నుంచి కలిగే ప్రతి ఫీల్‌ సొంత వ్యక్తిత్వంతో, తేడాగా ఉంటుంది. దీనికి కారణం ఏమంటే జైలు అనే స్వీయానుభవంలోంచే ప్రపంచాన్నంతా ఆయన చుట్టేసి వస్తారు. జైలు నిర్బంధం, శారీరక అసౌకర్యం లేదా అనారోగ్యం అనే రెంటిని ఒరుసుకుంటూ ఆలోచనాజీవిగా ఆయన ఈ ప్రయాణం చేస్తారు. ఈ క్రమంలోని పెయిన్‌, దాని మూడ్స్‌ కూడా కవిత్వంలో భాగం. కవిత్వానికి లోపలితనాన్ని నిలబెట్టుకోవడమనే లక్షణం ఉంటుంది. కవిగా అక్కడి నుంచే బయలుదేరి ఒక బుద్ధిజీవిగా, విప్లవాభిమానిగా ప్రపంచంతో అనుసంధానం కావడం అనే వ్యూహం ప్రతి కవితలో కనిపిస్తుంది. అందుకే ఏ కవితా సొంత దు:ఖమని, దాని నుంచి పుట్టిన ఆగ్రహమని మనకు అనిపించదు. సామాజిక విషాదంగా, వ్యాఖ్యానంగా, అనుభవంగా, ఆశావాదంగా ఇప్పటి దాకా వచ్చిన జైలు కవిత్వంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

అద్భుతమైన నిర్మాణంలో ఒదిగిన కవితలు ఇందులో చాలా ఉన్నాయి. వాటిలో కూడా మళ్లీ కొన్నింటిని ఎంపిక చేయదల్చుకుంటే స్థానభ్రంశపు జైలు గదిలో పీడ కల, నా గదిలో ఓ పిచ్చుక, నది ప్రవహిస్తూనే ఉంటుంది, కదిలించే మానవ స్ఫూర్తికి ముత్యు సమాన జైలు గది నుంచి రాసిన స్మృతి గీతం వంటి కవితలు ఈ తరం విప్లవ కవిత్వపు స్థాయిని ఎత్తిపడతాయి.

మళ్లీ వీటన్నిటిలోకీ నీ తలపులలో తుళ్లిపడుతూ అనే కవితనొకసారి చూడండి. బహుశా ఆ కవిత్వ విన్యాసం విప్లవం కోసం జీవితాన్నంతా అంతులేని విశ్వాసంతో జైలు గోడల మధ్య గడిపేందుకు సిద్ధమైన కవికి మాత్రమే సాధ్యం. అచంచల రాజకీయ విశ్వాసాన్ని జీవితంగా మార్చుకొనే శిఖరాగ్రానికి చేరిన సృజనకారులకు తప్ప మరెవరికీ రాయడం సాధ్యం కాని కవిత అది. ఈ కవితను అర్థం చేసుకోడానికి జైలంటే అనే ఇంకో కవిత సాయం చేస్తుంది. కవిగా సాయి కంఠస్వరాన్ని, శిల్ప నైపుణ్యాన్ని, వీటిని సహితం తీర్చి దిద్దిన తన దృక్పథాన్ని కూడా ఈ కవితలో గుర్తించవచ్చు.

విశ్వాసాల కోసం జైలుకు వెళ్లిన కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. వారిలో కూడా జీవితకాలపు బందీగా జైల్లో ఉంటున్న కా. సాయిబాబ మన కాలపు సాహసిక విప్లవ కవి. విశ్వాసాలను, భవిష్యదాశలను కవిత్వంగా మలుచుకోవడమే ఇప్పుడాయనకు విప్లవాచరణ. అక్కడి నుంచి ఆయన ఈ అద్భుత కవిత్వాన్ని మనకు అందిస్తూ విప్లవమే కవిత్వమని కూడా చాటుతున్నారు. ఆయన కవిత్వాన్ని మన అనుభవంగా మార్చుకుందాం. తద్వారా మనమంతా ఆయనతో ఉందాం. జైలు నుంచి ఆయన సాగిస్తున్న ఈ అనంత కవితా సంభాషణలో మనం గొంతు కలుపుదాం. హృదయాన్ని ఇద్దాం. తద్వారా- మన నుంచి దూరంగా నిర్బంధంలో ఉన్న ఆయనను మనలో కలిపేసుకుందాం.

Keywords : సాయిబాబా, అండాసెల్, మావోయిస్టు, విరసం, పాణి, కవిత్వం, ముందుమాట, saibaba, professor, maoist,anda cell, pani, poems, virasam
(2019-08-25 03:30:12)No. of visitors : 504

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


కవి