బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ


బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ

బీమా

బీమా కోరేగావ్ అక్రమ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వరవరరావును వీలున్నప్పుడు కలసి వస్తున్న సీనియర్ జర్నలిస్టు ఎన్. వేణుగోపాల్ తన అనుభవాలను, వీవీ సందేశాన్ని మనకు సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నారు. నిన్న కూడా పూణే కోర్టులో కలుసుకున్న ఆయన అక్కడ ఏం జరిగిందో రాశారు. అది యధాతథంగా..
---------------------------------------------------------------------------------------------------
మిత్రులారా, భీమా కోరేగాం కేసులో జనవరి 22 వాయిదా రోజున ఏం జరిగిందో మీతో పంచుకున్నాను. ఆ తర్వాత మళ్లీ నిన్న (ఫిబ్రవరి 15, శుక్రవారం) పుణె కోర్టులో జరిగిన విషయాలు మీతో పంచుకోవాలి.

జనవరి 29 వాయిదాకు నేను వెళ్లలేకపోయాను. ఆ తర్వాత ఫిబ్రవరి 8 వాయిదా ఉండింది గాని ఈ మధ్యలో వివిని, సురేంద్ర గడ్లింగ్ ను గడ్చిరోలి జిల్లాలో మూడు సంవత్సరాల కిందటి కేసులో కొత్తగా ఇరికించి జనవరి 30న హఠాత్తుగా యరవాడ జైలు నుంచి అహెరికి తీసుకుపోయారు. అక్కడ అహెరి కోర్టులో పద్నాలుగు రోజులు పోలీసు కస్టడీకి అడగగా, జడ్జి పన్నెండు రోజులు పోలీసు కస్టడీ ఇచ్చాడు. అలా ఫిబ్రవరి 12 దాకా అక్కడ పోలీసు కస్టడీలో ఉంచి, వారిద్దరినీ వెనక్కి తీసుకు వచ్చారు. వెళ్లేటప్పుడు విమానంలో తీసుకువెళ్లారట గాని వచ్చేప్పుడు రోడ్డు మార్గంలో, పోలీసు వాహనంలో తీసుకురావడంతో, మధ్యలో భోజనాలకు, చాయలకు ఆగుతూ రావడంతో, ఆ తొమ్మిది వందల యాబై కిమీ ప్రయాణానికి 21 గంటలు పట్టిందట. అంతసేపు కూచుని ఉండడంతో వివి ఫిషర్ సమస్య మళ్లీ తిరగబెట్టిందట.

ఇప్పటికి ఈ కేసులో అరెస్టయి ఉన్న మొత్తం తొమ్మిది మంది నిందితులనూ నిన్నటి వాయిదాకు తీసుకువచ్చారు. అందరికందరూ ఆరోగ్యంగా, అంతకన్న ముఖ్యం ఉత్సాహంగా ఉన్నారు. షోమా సేన్ కు వేరే తేదీల్లో వాయిదాలు ఉండడం వల్ల గత నాలుగు సార్లూ కలవలేక పోయాను గాని నిన్న తనను కలవగలిగాను. కాకపోతే సుధా భరద్వాజ్, షోమా సేన్ లతో ఉన్న మహిళా ఎస్కార్ట్ పోలీసులు కఠినంగా ఉన్నారు గనుక ఆ ఇద్దరితో ఎక్కువగా మాట్లాడడం కుదరలేదు. ముప్పై సంవత్సరాలకు పైగా పరిచితురాలైన షోమాను భుజం మీద చెయ్యివేసి దగ్గరకు తీసుకోబోతుండగానే మహిళా పోలీసులు దూరం జరిపేశారు. సుధను పలకరించి, చెయ్యి కలపడంతోనే సంతృప్తి పడవలసి వచ్చింది. సుధను కలవడానికి చత్తీస్ గడ్ మహిళా ముక్తి మోర్చా కార్యకర్తలు, కార్మిక సంఘం నడిపే పాఠశాల ఉపాధ్యాయులు నలుగురైదుగురు, సుధ మిత్రులు ఇద్దరు ముగ్గురు రాయపూర్, బిలాస్ పూర్, ఢిల్లీల నుంచి వచ్చారు.

ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి కె డి వడనె నిన్న సెలవు మీద ఉండడం వల్ల మరొక న్యాయమూర్తి ఎస్ ఎస్ గోసావి ముందుకు వీరిని తీసుకువచ్చారు.
ఈసారి వాయిదాకు పవన, నేను వెళ్లాం. రైలు దిగి నేరుగా జైలుకు వెళ్లి ములాఖాత్ కోసం అడిగితే పవనను మాత్రమే అనుమతించారు. అక్కడ ఒక గంట నిరీక్షణ తర్వాత పది నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. అది కూడ గాజు తెర అవతల తండ్రి, ఇవతల కూతురు. అవతల ఒక ఫోను, ఇవతల ఒక ఫోను. సరిగ్గా పది నిమిషాలకు ఫోను మీద కత్తెర. అక్షరమక్షరం రికార్డయ్యే ఫోను సంభాషణ. తండ్రీకూతుళ్లు ఒకరినొకరు ఆత్మీయంగా స్పృశించుకోవడానికి వీల్లేదు. లోహతంత్రి మీద పరిమితంగా ప్రవహించే ఉద్వేగాలు తప్ప హృదయపూర్వక సంభాషణకు వీల్లేదు. గాజుతెర అవతలి నుంచి కనబడే అస్పష్టరూపం తప్ప తండ్రీ కూతుళ్లు ఒకరినొకరు తేరిపార చూసుకునే అవకాశం లేదు.

ఆ జైలు ములాఖాత్ అయిపోయి, తెలిసినవారింట్లో స్నానం చేసి హడావిడిగా కోర్టుకు వచ్చేటప్పటికి ఐదు నిమిషాల కిందనే అందరినీ తీసుకొచ్చి ఉన్నారు. జడ్జి రాకపోవడంతో ఆ కోర్టు హాలు ముందు కారిడార్ లో నిలబడి లాయర్లతో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరినీ కావలించుకుని, పలకరించి, వివితో ఓ పది నిమిషాలు మాట్లాడడానికి అవకాశం దొరికింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన అక్కయ్య ఇంటర్వ్యూ, అరుణతార, మహిళామార్గం, ʹసహచరులుʹ, ʹభీమా కోరేగాం12 – వివిʹ అన్నీ చూడడానికి ఇచ్చాం. మామూలుగానైతే తెలుగులో అచ్చయినవి ఇవ్వనివ్వరు. జైలుకైతే తీసుకుపోవడానికే వీలులేదు. కాని ఇక్కడ చూడనైనా చూస్తారు గదా అని ఇచ్చాం. గత నాలుగుసార్ల లాగ ఈసారి ఎస్కార్ట్ పోలీసుల అదిలింపులు లేవు. రెగ్యులర్ జడ్జి లేకపోవడం వల్ల, మరొక జడ్జి దగ్గరికి వెళ్లి మరొక వాయిదా పొందాలనే తతంగం పూర్తి చేసి, ఆ జడ్జి దగ్గరికి మళ్లీ మూడున్నరకు తీసుకురావాలనే ఆదేశంతో అందరినీ మళ్లీ కోర్టు ఆవరణలోని న్యాయాధీన్ బందీ కోఠడీ కి తీసుకువెళ్లారు. ఇదివరకు చెప్పినట్టే అలా కోర్టు నుంచి అక్కడి దాకా ఐదారు నిమిషాల నడకలో పంచుకోగలగిన విషయాలు పంచుకుంటూ కలిసి నడిచాం.

ఆ ఆవరణ ముందు రెండు గంటల పడిగాపుల తర్వాత, మళ్లీ ఒకసారి కొత్త జడ్జి ముందుకు నిందితులందరినీ నడిపిస్తున్నప్పుడు మరొక నాలుగైదు నిమిషాల కలిసి నడక. మేం ఇచ్చిన పత్రికలు, పుస్తకాలు అన్నీ వివి ఆ రెండు గంటల్లోనే చదివేశారు. మహిళామార్గంలో పవన వ్యాసం చాల బాగుందని మెచ్చుకున్నారు. ʹఒక్క విప్లవోద్యమం మాత్రమే కాదు, దళిత ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం మూడూ కలిసి మన చైతన్యంలో, అవగాహనల్లో ఏ మార్పులు తెచ్చాయో నీ వ్యాసం చూపిందిʹ అని మెచ్చుకున్నారు. అక్కయ్య ఇంటర్వ్యూ బాగుందంటున్నప్పుడు ఆయన కళ్లలో సన్నని నీటిపొర, కాని ముఖంలో, చిరునవ్వులో గర్వం తొణికిసలాడాయి. ʹసహచరులుʹ ప్రస్తత సందర్భంలో మళ్లీ ప్రచురించినందుకు సంతోషించారు. ʹకాని ఇంగ్లిష్ లో వేసినప్పుడు గుగి రాసిన ముందుమాట కూడ అనువాదం చేసి వేసి ఉండాల్సిందిʹ అన్నారు. ʹభీమా కోరేగాం 12-వివిʹ పుస్తకం బాగా వచ్చిందన్నారు.

కోర్టు హాల్లోకి వీళ్లను తీసుకెళ్లగానే, ఆ కిక్కిరిసిన చిన్న హాలులో జడ్జి ఒక్కొక్కరి పేరు పిలవడం, ఇరవై రెండో ఫిబ్రవరి అని ఆ ఫైల్ మీద సంతకం పెట్టడం నాలుగైదు నిమిషాల్లో ముగిసింది. నిందితుల తరఫు న్యాయవాదులు ఒకటి రెండు పిటిషన్లు ఇవ్వబోతే, ʹవిచారణ జరుపుతున్న జడ్జి చూస్తాడు గదా, మళ్లీ నేనెందుకుʹ అన్నారాయన. తన దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాల్లో దొరికాయని చెపుతున్న ఆధారాల క్లోన్ కాపీలు తనకు ఇవ్వాలని సురేంద్ర గడ్లింగ్ గతంలో ఇచ్చిన పిటిషన్ మీద ప్రాసిక్యూషన్ తన వాదన చెప్పలేదని నిందితుల న్యాయవాది సిద్ధార్థ పాటిల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదో వంక చెప్పబోయారు గాని, ప్రాసిక్యూషన్ తన వాదన లిఖితపూర్వకంగా ఇవ్వవలసిందే అని జడ్జి అన్నారు. త్వరలో ఇస్తాం అని ప్రాసిక్యూటర్ అప్పటికి తప్పించుకున్నారు.

ఇక నిందితులను వెనక్కి తీసుకుపోతుండగా, కొందరు నిందితుల బంధువులు వచ్చారని, నిందితులతో న్యాయవాదులు కూడ మాట్లాడవలసి ఉన్నదని, అందుకు అనుమతించమని న్యాయవాదులు కోరారు. సహజంగానే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పారు గాని జడ్జి అనుమతించారు. అలా మళ్లీ ఒక పావు గంట, ఇరవై నిమిషాలు పక్కన కూచొని మాట్లాడుకోవడానికి అవకాశం దొరికింది.

అహెరి కోర్టులో ఫిబ్రవరి 11న మళ్లీ మరొక వారం రోజులు పోలీసు కస్టడీ కావాలని పోలీసులు అడిగారని, కాని సురేంద్ర, తాను అది అనుమతించవద్దని వాదించామని వివి చెప్పారు. అప్పటికి తాను భగత్ సింగ్ కోర్టు విచారణ పుస్తకం చదువుతున్నారట. అందులో నుంచి ఏడెనిమిది పేజీలు ఫొటోకాపీ తీయించి జడ్జికి ఇచ్చారట. ʹమేమైతే ఈ న్యాయస్థానాలు కూడ రాజ్యంలో భాగమేనని అనుకుంటాం. భగత్ సింగ్ అలాగే అనుకున్నాడు. కాని ఈ న్యాయస్థానాలు, చట్టబద్ధ పాలన అనే విలువ కూడ తరతరాల పోరాట ఫలితంగా వచ్చాయని, కనుక న్యాయమూర్తులకు, న్యాయస్థానాల అధికారులకు, సిబ్బందికి, న్యాయవాదులకు ఆ పోరాటాల గురించి చెప్పి అవగాహన కల్పించాలి, ఎడ్యుకేట్ చేయాలి అని మా న్యాయవాది కన్నబిరాన్ గారు అనేవారు. అందుకే మీ అవగాహన కోసం న్యాయస్థానాల గురించి భగత్ సింగ్ ఏమన్నాడో చూడండిʹ అని ఆ కాగితాలు జడ్జికి ఇచ్చారట. మొత్తానికి ఈ వాదనల వల్లనో, మరెందువల్లనో గాని ఆ జడ్జి పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చాడు.

ఈసారి కూడ వివి ఎంతో మంది మిత్రుల గురించి, రచనల గురించి, పుస్తకాల గురించి, సభల గురించి అడిగారు. తాను చెప్పిన అనేక విషయాల్లో మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఉంది.

ఒకటి, 2015 మే లో పుణెలో అరెస్టయి మూడున్నర సంవత్సరాలుగా ఇదే జైలులో ఉంటున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మేధావి కె మురళీధరన్ గురించి. ఎమర్జెన్సీలో పోలీసులు హత్య చేసిన కాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి రాజన్ కు సహాధ్యాయి అయిన మురళీధరన్ అప్పుడే ఇంజనీరింగ్ విద్య వదిలి విప్లవోద్యమంతో అజ్ఞాతవాసంలో ఉన్నారు. అరెస్టయ్యే నాటికి మలయాళంలో, ఇంగ్లిష్ లో చాల ప్రావీణ్యంతో ఎన్నో రచనలు చేసిన ఆయన జైలులో ఈ మూడు సంవత్సరాలలో మరాఠీ, హిందీ కూడ నేర్చుకుని రచనలు చేస్తున్నారట. ప్రస్తుతం ఉర్దూ నేర్చుకుంటున్నారట.

రెండు, భీమా కోరేగాం నిందితులందరిలో చిన్నవాడైన మహేశ్ రౌత్ కు జైలుకు వెళ్లేవరకూ సాహిత్యంతో సంబంధం లేదు. వివి దగ్గర గుల్జార్ సస్పెక్టెడ్ పొయెమ్స్ పుస్తకం తీసుకుని చదివి, ప్రభావితుడై, వెంటనే మరాఠీలోకి అనువదించాడట.

మూడు, బైట జరుగుతున్న విషయాలను వివి ఎంత సునిశితంగా పరిశీలిస్తున్నారంటే, ఐసిఐసిఐ బ్యాంక్ కుంభకోణంలో సాగుతున్న దర్యాప్తు దురుద్దేశాలతో, ʹసాహసిక పరిశోధనʹ లాగ సాగుతున్నదని, చట్టబద్ధ, సాధారణ పరిశోధన లాగ సాగడం లేదని అరుణ్ జైట్లీ ఫేస్ బుక్ మీద చేసిన వ్యాఖ్య వివాదాస్పదమై, పత్రికల్లో వస్తే, అది చదివి ఆ మాటలనే భీమా కోరేగాం కేసు దర్యాప్తుకు అన్వయించి రాశారట. ʹఔను, ఐసిఐసిఐ కేసు ఏమో గాని, భీమా కోరేగాం కేసు మాత్రం సాధారణంగా దర్యాప్తు జరిగి ఉంటే జనవరి 2 ఎఫ్ ఐ ఆర్ మీద జరిగి ఉండేది. అది దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతున్నది గనుకనే జనవరి 8 ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా జరుగుతున్నదిʹ అని. ʹనువ్వు రాయలేదా, రాస్తావనుకున్నానుʹ అన్నారు.

- ఎన్. వేణుగోపాల్,
ఎడిటర్, వీక్షణం.

Keywords : bima koregoan, varavara rao, pune jail, maoists, police, బీమా కోరేగావ్, వరవరరావు, పూణే జైలు, మావోయిస్టు
(2019-08-23 15:57:49)No. of visitors : 482

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


బీమా