రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?


రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?

రాజ్యహింసను

దేశంలో, రాష్ట్రంలో ఎప్పుడు సాధారణ ఎన్నికలొచ్చినా.. ప్రజల్లో సానుభూతి పవనాలు తగ్గినట్లు అనిపించినా.. పాలకులపై హత్యాయత్నం కుట్రలు బయటకొస్తుంటాయి. నిఘా వర్గాలు చెమటోర్చి కుట్రను పసిగట్టి ʹఅత్యవసరంʹగా బయట పెడుతూనే ఉంటాయి. ఇది రాజ్యం అల్లిన విషవలయం. ఆధిపత్య అస్తిత్వాల పాలనలో ఈ వృత్తం పునరావృతమవుతూనే ఉంటుంది. రాజ్యాధికారం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ʹరాజ్యంʹ లో వివిధ రూపాల్లో హింస రచన జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగమే ఇలాంటి కుట్రకోణాలు. వరవరరావుతోపాటు హక్కుల ఉద్యమకారులపై మోపిన రాజద్రోహం ఎన్నికల అంకగణితంలో ఓట్ల లెక్కను సాధించే ఓ అధ్యాయం మాత్రమే.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను హత్య చేసేందుకు పాకిస్తాన్‌ సహాయంతో కుట్ర పన్నుతున్నారని గుండెలు బాదుకుంటూ మొత్తుకుని ఓట్లు, సీట్లు సంపాదించిన మోడీ.. వేగంగా పడిపోతున్న తన పొలిటికల్‌ గ్రాఫ్‌ను నిలబెట్టుకోవటానికి మరో హత్యాయత్నంను తెరమీదకు తెచ్చారు. ప్రధానిని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారని పుణే పోలీసులు ఆరోపించటం, హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్‌ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్‌ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్‌ గోంజాల్వెస్, అరుణ్‌ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి, నెలల తరబడి వాళ్లను జైల్లో బంధించి ప్రజల్లో ఓ మిధ్యా సానుభూతి వలయాన్ని పరిచి రాజ్యాధికారం సుస్థిరపరుచుకునే ప్రయత్నమే.

రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూడదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. అట్లానే కాళ్లు చేతులు చచ్చుబడి పోయి, 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబ, దాదాపు వృద్ధాప్యం అంచుల్లో ఉన్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్‌ ఫరేరా, అంబేడ్కర్‌ మనవడు ఆనంద్‌ తేల్‌తుంబ్డేలు రాజద్రోహులు అయ్యారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ. రాజ్యహింసకు అంగీకార ముద్రవేసే ధోరణి బలపడుతోంది.

బ్యాంకులను లూటీ చేసి కోట్లకు కోట్ల రూపాయలు కొల్లగొట్టి దేశంలో కృత్రిమ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించే ఆర్థిక నేరగాళ్లు మాత్రం దేశ ద్రోహులు కాదు. దేశీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల డబ్బును దర్జాగా విదేశాలకు పట్టుకుని పోతుంటే ఏ చట్టం కూడా వాళ్లకు అడ్డు రాదు. బడుగు బలహీన, మధ్య తరగతి వర్గాలు తమ చెమట, రక్తమాంసా లను రూపాయిగా మలిచి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వైట్‌ కాలర్‌ దొంగలు ఎత్తుకుపోతుంటే రాజ్యం కళ్లు మూసుకుంటోంది.

నీరవ్‌ మోడీ అనే వ్యాపారి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి 11,360 కోట్ల రూపాయలు, నీలేష్‌ ఫరేఖ్‌ 2,500 కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు వెళ్లిపోయేంతవరకు రాజ్యానికి తెలియదు. విజయ్‌ మాల్యా బ్యాంకులకు 9,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయాక కానీ మనకు ఆ విషయం తెలియదు. రైతులు పంట రుణాలు తీసుకుని తిరిగి కట్టలేకపోతే రెవెన్యూ రికవరి(ఆర్‌ఆర్‌ యాక్ట్‌) కింద ఆస్తులు జప్తు చేస్తారు. ఆస్తులు జప్తు చేయటాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వేలమంది ఉన్నారు. కానీ వీళ్ల మెడలు వంచి పొరుగు దేశాల నుంచి పట్టుకొని వచ్చి తిన్నది కక్కేయటానికి మన రాజ్యాంగంలో చట్టాలు, ఐపీసీ సెక్షన్లు ఏమీ ఉండవు.

దేశంలో కుట్ర కేసులు కొత్తేమీ కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారని 1974లో ʹసికింద్రాబాద్‌ కుట్ర కేసుʹ పెట్టారు. 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ కుట్ర కేసు నమోదు చేశారు. 46 మందిపై కుట్ర, రాజద్రోహ నేరం అభియోగాలు మోపారు. నాటి నక్సలైట్‌ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్‌ కోర్టు సికింద్రాబాద్‌ కుట్ర కేసులో అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్‌ కుట్ర కేసు పెట్టారు. కొండపల్లి సీతారామయ్య వంటి నక్సల్స్‌ నేతలు, వరవరరావు తదితర విప్లవ రచయితలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో కేఎస్‌పై కేసు ఉపసంహరించుకున్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్‌లో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది.

2005లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మావోయిస్టు, విప్లవ రచయితలు కుట్ర పన్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005లో మే 30న నిజామాబాదులో అరెస్ట్‌ చేశారు. ఆయుధాలు సేకరించారు, ప్రభుత్వంపై యుద్ధ ఏర్పాట్లు చేశారన్న పోలీసుల వాదనతో విభేదిస్తూ.. 2010 ఆగస్ట్‌ 2న నిజామాబాద్‌ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఆ కేసును కొట్టేశారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం కృత్రిమ లేఖలతో నా మీద కూడా టాడా కేసు పెట్టింది. అభియోగం తప్పు అని కోర్టులు అంతిమ తీర్పులు ఇచ్చాయి. నిజమే..! కానీ కృత్రిమ లేఖలతో, ఊహాత్మక అభియోగాలతో అక్రమంగా చార్జిషీట్‌ మోపిన పాలకులు, పోలీసుల మీద చర్యలు ఏవి? రాజ్యాంగంలో అటువంటి చట్ట సవరణ ఎందుకు తీసుకురావటం లేదు? కనీసం ఆత్మవిమర్శ అయినా చేసుకోవాలి. పరిపాలన చివరి దశలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని హక్కుల ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి.

వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే.

సాక్షి దినపత్రిక సౌజన్యంతో

Keywords : maoists, pune police, varavararao, bima koregaon, బీమా కోరేగావ్, వరవరరావు, పూణే పోలీసులు, కుట్ర కేసు
(2019-08-23 18:46:03)No. of visitors : 638

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


రాజ్యహింసను