కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |


కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |

కనకాభిషిక్తులు

పుట్టి బుద్ధెరిగాక కథలు చదవడం ఒక అభిరుచిగా కాక వ్యసనమైన రోజుల్లో కొలకలూరి ఇనాక్‌గారి కథ ఒకటి చదివాను. అదీ తరగతి పుస్తకంలో. ఏ తరగతో ఇప్పుడు గుర్తు లేదు. ఇప్పుడు చెప్పబోయేదానికి ఆ వివరం అక్కర్లేదు. తల లేనోడు.. అనే కథ అది. కథ కాబట్టి ఎన్ని సార్లు చదివి అందులోని అంతరార్ధాలేమిటో మోజుపడి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ఊరబావి కూడా అలాగే చదివాను. అత్యద్భుతం. అప్పటికే జీవితంలో తెలిసినవీ, విన్నవీ, ఊహించినవీ ఎన్నో సామాజిక దౌష్టాలు, వాటి వికృత వేషాలు, వ్యక్తీకరణలు, వాటిపట్ల నిరసనలూ అన్నీ కలగలసి ఆ కథ పాఠాంతరం నాలో రూపొందింది.

అప్పట్లోనే ఇనాక్‌గారంటే దళిత కవి, కథకులు అని తెలిసింది. అపారమైన గౌరవం పెరిగింది. మా తరం సాహిత్యంలోకి, రాజకీయాల్లోకి వచ్చేనాటికే దళిత వాదం సిద్ధంగా ఉంది. దీన్ని ఎలా తీసుకుంటావనేదే ఏ జీవన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకయినా గీటురాయి. ఇంకో పక్క 1990ల ఆరంభంలో కశ్మీర్‌ సహా నార్త్‌ ఈస్ట్‌ జాతి పోరాటాల ప్రజ్వలనపట్ల ఏ వైఖరి తీసుకుంటాం అనేదే ప్రగతిశీల వాదమా? లేక సంఘపరివార్‌ మార్గమా? అనేదానికి అతి ముఖ్య గీటురాయి.

విప్లవ శిబిరంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్నా కశ్మీర్‌ గురించి ఆనాటి నా వైఖరిని ఇప్పుడు తిరిగి చూసుకుంటే అంత సరైంది కాదని చెప్పగలను. కానీ 1992లో విరసంలో చేరాక, ఆ సభల్లో వివి కవిత్వ సంపుటం నిషేధిత భవిష్యత్‌ చిత్రపటం అపురూపంగా కొని నమిలేశాను. అందులో బ్రహ్మపుత్ర గురించి అస్సాం- తూర్పు వాకిట వెలుగు అనే కవిత ఉంది. అది చదివాక ఏ ప్రశ్నా, సందేహమూ లేకుండా జాతి విముక్తి పోరాటాలపట్ల ఏకీభావం లాంటిది ఏదో కలిగింది. కశ్మీర్‌తో సహా.

ఇప్పుడు చెప్పబోయేదానికీ ఇది కూడా అవసరం లేదు.

కాకపోతే కవిత్వం, కథ ఏదైనా ఎంత ప్రభావశీలంగా మనిషి అంతరాంతరాల్లోకి ప్రసరించి వ్యక్తిత్వాన్ని, ఆలోచనా సంస్కారాన్ని పునర్నిర్మిస్తుందో చెప్పడానికి ఇనాక్‌ గారి కథలాగే ఇది మరో ఉదాహరణ. రచన చేసే మనిషి జీవిస్తున్న జీవితం కలిగించే ప్రేరణలోంచి ఆ రచనకు ఆ శక్తి వస్తుందని నాకు అప్పుడు బొత్తిగా తెలియదు.

ఆ తర్వాత కొంచెం కుదురుగా, సొంతంగా, తార్కికంగా అభిప్రాయాలు ఏర్పరుచుకునే నా ఆలోచనా క్రమం మీద ఇనాక్‌గారి ప్రభావం ఏమీ లేదు. బహుశా అంతగా ఆయన రచనల్నీ పట్టించుకోలేదోమో. ఇంకో పక్క నుంచి రంగనాయకమ్మగారి విషయంలోలాగే. దళిత జీవిత ఆర్తిని, మార్క్సిస్టు ఆలోచనా రీతిని అర్థం చేసుకోడానికి, సొంతం చేసుకోడానికి ఓ ఏడాదిలోనే నాదైన అన్వేషణ, ఆచరణ మార్గం నాకు విప్లవోద్యమ సంపర్కం వల్ల కలిగాయి.

ఇనాక్‌గారు సీనియర్‌ రచయితగా, అకడమిక్‌ రంగంలో ప్రముఖుడిగా ఆయన ఎప్పటికప్పుడు చేస్తున్న కొత్త రచనలు, అందుకుంటున్న కొత్త అవార్డులు, పురస్కారాల గురించి పట్టించుకోలేదు. కాకపోతే ఆయన ʹపెద్దʹ ప్రపంచంలో ఇలాంటివన్నీ ఉండేవే కదా అనుకుంటుండేవాణ్ని.

మూడు రోజుల కింద గుంటూరులో ఆయనకు కనకాభిషేకం చేశారని పేపర్‌లో వార్త చదివాను. పొట్ట కూటి కోసం పత్రికల్లో పని చేస్తున్నా.. న్యూస్‌ పేపర్లో వచ్చే ఏ వార్తనయినా శంకిస్తూ చదవడం నాకు అలవాటు. తరచి చూసుకుంటే ఇనాక్‌గాని కనకాభిషేకం వార్త నిజమే అనేగాక, ఆ రోజు సభలో ఒక బ్రాహ్మణ దంపతుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రముఖుల మధ్య ఈ సన్మానం జరిగిందని పూర్తిగా నమ్మవలసి వచ్చింది.

ఇనాక్‌గారు కానీ, అలాంటి వాళ్లు కానీ రాజ్యాన్ని వ్యతిరేకిస్తే బాగుండు కదా అనే పేరాశతో నేనేనాడూ ఆలోచించను. ఎవరుబడితే వాళ్లు రాజ్యాన్ని వ్యతిరేకించడం అయ్యేపని కాదు. దేన్నయినా ఆచరణ కేంద్రంగానే ఆలోచించాలనే మూర్ఖ వైఖరి నాకుంటుంది. కాబట్టి అంత పెద్ద అంచనాలేమీ లేవు. అంత మాత్రాన అవతలి వాళ్లను ఎలా తక్కువ చేస్తాం? రాజ్యాన్ని వ్యతిరేకించాల్సిన అగత్యం ఉన్న వాళ్లు ఆ పని చేస్తారు. అందరికీ ఏం పని? అనే హేతుబుద్ధిని ప్రదర్శించడం నాకు అలవాటు.

అయితే ఇనాక్‌గారు దళిత కవిగా, రచయితగా బ్రాహ్మణుల వేద మత్రోక్తంగా, కనకాభిషేకం చేయించుకోవడం, అందునా ఏ అసౌకర్యం లేకుండా మందస్మిత సుఖానుభూతి పొందడం పత్రికల ఫొటోల్లో కనిపించింది. ఏదో దుప్పటి కప్పించుకోవడం అయితే అర్థం చేసుకోగలం కానీ, మరీ బ్రాహ్మణుడు వేద మంత్రాలు చదువుతోంటే బంగారు అభిషేకం చేయించుకోవడం! పైగా ఆ సభలో పాల్గొన్న ఎవరో ʹమనం శ్రీనాథుడి కనకాభిషేకం చూడలేకపోయాం, ఇంకా పలానా వాళ్ల కనకాభిషేకం చూడలేకపోయాం, కానీ ఇనాక్‌గారి కనకాభిషేకం చూసి తరించగలుతున్నాం..అని స్తోత్ర పాఠాలు చదివినట్లు కూడా పత్రికల్లో వచ్చింది. ఇవన్నీ చదివాక ఆ విధంగా దళిత రచయితలందరికీ ఇనాక్‌గారు ఒక ఐకాన్‌గా నిలబడిపోయారా? అనిపించింది.

కాకపోతే దళిత సాహిత్యోద్యమానికి ఫలానా ప్రాతినిధ్యమని చెప్పడానికి ఏమీ లేని విషాద వాతావరణం కాబట్టి ఇనాక్‌గారిని మిగతా దళిత రచయితల్లో ఎవరైనా ఎందుకు ఆదర్శంగా తీసుకుంటార్లే అనే కించిత్‌ వ్యథార్త ఆశ ఒక్కటే ఆ క్షణానికి ఊరట అనిపించింది.

Keywords : paani, virasam, kanakabhishekam, dalith, sahityam
(2019-08-25 01:19:24)No. of visitors : 228

Suggested Posts


0 results

Search Engine

.జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్
పోలీసుల దుర్మార్గం - వింటేనే ఒళ్లు జ‌ల‌ద‌రించే చిత్ర‌హింస‌లు
కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
more..


కనకాభిషిక్తులు