వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి


వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి

వెనుజులా

డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ లాటిన్‌ అమెరికాలోని వెనిజులాలో జోక్యం చేసుకోనుందా? మరోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన మదురోను కూల దోసేందుకు ప్రత్యక్షంగా తన సైన్యాన్ని పంపుతుందా? పశ్చిమాసియా, ఆఫ్ఘనిస్తాన్‌ ఇతర ప్రాంతాల్లో తగిలిన ఎదురు దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని తన విధానం మార్చుకోనుందా? లేక తాను ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరిసర దేశాల మిలిటరీతో తన లక్ష్యాన్ని నెరవేరుస్తుందా? లేక వెనిజులా మిలిటరీని ప్రభావితం చేసి తిరుగుబాటు చేయిస్తుందా? ప్రస్తుతం వెనిజులాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తలెత్తుతున్న ప్రశ్నలివి. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వెనిజులాలో మిలిటరీ జోక్యం ఆ ఒక్క దేశానికే పరిమితం అవుతుందా? ప్రపంచ వ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుందా! అన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది.

వెనిజులాపై అమెరికా, పాశ్చాత్య దేశాల కడుపు మంట ఈనాటిది కాదు. అక్కడ అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలున్నాయి. అక్కడి భూగర్భంలో అపారమైన పసిడి నిల్వలు ఉన్నాయి. అపురూపమైన వజ్రాలకు అది పెట్టింది పేరు. ఇంత సంపద ఉన్నప్పుడు ఏ సామ్రాజ్యవాద దేశానికైనా కన్నుకుట్టడం సహజం. పైగా ఆ దేశంలో వరసగా వచ్చిన ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకుని, అక్కడి సంపదను కొల్లగొట్టడం అలవాటు చేసుకున్న సామ్రాజ్యవాద దేశాలకు 1999లో మొదటిసారి హ్యూగో చావెజ్‌ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఆ దేశంలో రెండు ప్రధాన పార్టీలు ఎప్పుడూ సహజ వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెడుతున్న తరుణంలో చావెజ్‌ ఆ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాడు. 1999 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. 2013లో కేన్సర్‌ వ్యాధితో అంతిమ దశలో ఉండగా తన వారసుడిగా మదురోను ప్రకటించారు.

సంక్షోభాలు రాజేయడం, సంఘర్షణలు సష్టించడం ద్వారా తన అధిపత్యాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దాలన్నదే అమెరికా కుటిలనీతి. లాటిన్‌ అమెరికా దేశమైన వెనిజులా ప్రస్తుత సోషలిస్టు అధ్యక్షుడు నికోలస్‌ మదురోను కూలదోయడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా వెనిజులాలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. బొలివేరియన్‌ విప్లవానికి కీలకమైన వెనిజులాను దెబ్బతీయడానికి అమెరికా అనేక ఏళ్లగా విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. లాటిన్‌ అమెరికాలో వామపక్షం అధికారంలో ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. హ్యూగో ఛావెజ్‌ హయాంలోనూ ఆయనను గద్దె దించేందుకు అమెరికా నానా కుట్రలు, కుయుక్తులు పన్నింది. అమెరికన్‌ అయిల్‌ కంపెనీలను జాతీయం చేయడంలో, అమెరికా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఏనాడూ వెనుకాడింది లేదు. క్యూబాకు అండగానూ నిలిచారు. క్యూబా కష్టకాలంలో ఉన్నప్పుడు పంచదారను దిగుమతి చేసుకొని చమురు సరఫరా చేసి ఆదుకున్నారు. కాస్ట్రోతో చేయి కలిపి యావత్‌ లాటిన్‌ అమెరికాను ఉత్తేజపరిచారు. హ్యూగో ఛావెజ్‌ 2013లో కేన్సర్‌ వ్యాధితో మరణించడంతో ఆయన స్థానంలో మదురో అధికారం చేపట్టారు.

వెనిజులాలో రాజకీయ విభేదాలు కొత్తేమికావు. ఆ దేశంలో దీర్ఘకాలంగా జాతి, సామాజిక, బహుళజాతి సంస్థల మధ్య ఆర్థికపరమైన విభేదాలు, పెట్టుబడిదారీ సంక్షోభం, సామ్రాజ్యవాద కుట్రలు, సోషల్‌ డెమోక్రసీలో ఉన్న రాజకీయ లోపాలు, విప్లవోద్యమం బలహీనతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు తగ్గి వెనిజులా ఆర్థిక ఇబ్బందులకు గురైంది. వెనిజులాపై అమెరికా అనేక ఆంక్షలు విధించింది. దేశంలోని బహుళజాతి సంస్థలు కూడా అస్థిరతకు తమ వంతు పాత్ర పోషించాయి. ఎగుమతులు దెబ్బతినడంతో, ఆహారం, మందుల కొరత తలెత్తింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇదే అదునుగా దేశంలో అశాంతి సష్టించడానికి అమెరికా ప్రతిపక్షాలను రెచ్చగొట్టింది. 2015 పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో మదురో పార్టీ కాకుండా విపక్షాలే అత్యధిక స్థానాలు చేజిక్కించుకున్నాయి. పార్లమెంట్‌లో మెజార్టీ రాగానే మదురోను తొలగించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. 2017లో సుప్రీం ట్రిబ్యునల్‌ పార్లమెంట్‌ అదికారాలను రద్దు చేసింది. నూతన రాజ్యాంగ రచనకు, రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.

అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్‌ అమెరికాలో ముఖ్యంగా వెనిజులా, నికరాగ్వాల్లో పన్నుతున్న కుట్రలకు అమెరికా దేశాల కూటమి (ఒఎఎస్‌), లాటిన్‌ అమెరికాలో స్పానిష్‌, పోర్చుగీస్‌ భాష మాట్లాడే దేశాల కూటమి (లిమా గ్రూపు) వంత పాడుతున్నాయి. తద్వారా ఈ ప్రాంతంలో అమెరికాకు అవి బంటులుగా వ్యవహరిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన ఒఎఎస్‌ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. వెనిజులాలో ట్రంప్‌ ప్రభుత్వం నగ్నంగా జోక్యం చేసుకుంటుంటే దానిని ఖండించాల్సింది పోయి అమెరికానే వెంటేసుకొచ్చేలా ఒఎఎస్‌ సెక్రటరీ జనరల్‌ లూయిన్‌ అల్యాగ్రో మాట్లాడుతున్నారు.

వెనిజులాలో మదురో ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతూ, ప్రత్యర్థుల మానవ హక్కుల ఉల్లంఘన, విద్యార్థులు, రాజకీయ నాయకులు, పౌరుల హక్కులను హరిస్తున్నదని అమెరికన్‌ మీడియాతో కలసి లిమా గ్రూపు అసత్య ప్రచారం సాగిస్తోంది. చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్‌, కొలంబియాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, సామాజికవేత్తలు, దేశీయ తెగలకు చెందిన వారిపై యథేచ్ఛగా హత్యాకాండ సాగుతుంటే వాటి గురించి లూయిస్‌ అల్మాగ్రో మాట్లాడరు. పైగా ఆ దేశాల్లో ప్రభుత్వాలను వెనకేసుకొస్తారు.

2018 మేలో వెనిజులా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఓడిపోతామనే భయంతో ప్రతిపక్షాలు ఆ ఎన్నికలను బహిష్కరించాయి. అయితే ఎన్నికలు సక్రమంగా జరగలేదంటూ అమెరికా, యూరప్‌ దేశాలు ఆరోపించాయి. 2015 పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజంగా అక్రమాలకు మదురో పాల్పడి ఉంటే విపక్షాలకు గెలుపు సాధ్యమయ్యేదికాదు. జిమ్మీ కార్టర్‌ మాత్రం వెనిజులా ఎన్నికల ప్రక్రియ చక్కగా ఉందని మెచ్చుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, జరిగాయని వివిధ దేశాల నుంచి పరిశీలకులుగా వచ్చిన 150 మంది సంతప్తి వ్యక్తం చేశారు. అందులో 8 దేశాలకు చెందిన 14 మంది ఎన్నికల అధికారులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. వెనిజులా ఎన్నికల ప్రక్రియ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఎన్నికల ముందు, ఎన్నికలు కొనసాగుతుండగా, ఎన్నికల తరువాత ఇలా మూడుసార్లు ఈవీయంలను మూడు దఫాలుగా తనిఖీ చేస్తారు.

2019 జనవరి పదో తేదీన మదురో రెండోసారి అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పార్లమెంట్‌ ఆ మరుసటిరోజు ఒక తీర్మానం చేసి పార్లమెంట్‌ స్పీకర్‌గా ఉన్న గ్వాయిడోను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వెనిజులా ఆస్తులు, బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ 46 దేశాలకు పార్లమెంట్‌ లేఖలు రాసింది. పార్లమెంట్‌ నిర్ణయాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పార్లమెంట్‌ తీర్మానాన్ని అమెరికా, కెనడా, బ్రెజిల్‌లు అభినందించడం ద్వారా గ్వాయిడోను గుర్తించినట్లయింది. ఆయన నియమించే రాయబారులను గుర్తిస్తామని కూడా వెల్లడించాయి. అంటే వెనిజులాలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపేందుకు అమెరికా వ్యూహ రచన చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ఆశీస్సులతో విపక్ష నేత యువాన్‌ గ్వాయిడో తానే అధ్యక్షుడినని ప్రకటించుకోవడం, ప్రజలు ఎన్నుకున్న మదురోను కాక, ఇతడినే దేశాధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించాడు. వెనిజులా వ్యవహారాలను చక్కదిద్దే విషయంలో ఎంతకైనా తెగిస్తానంటున్న ట్రంప్‌ను రష్యా, చైనాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అమెరికా ప్రకటన తరువాత మదురో అమెరికన్‌ దౌత్య సిబ్బందిని బహిష్కరించి, 48 గంటలలోగా కార్యాలయాలు కట్టేసుకొని పొమ్మన్నారు. అక్కడినుంచి కదలవద్దనీ, మదురో ఏం చేయగలడో చూస్తానని ట్రంప్‌ అంటున్నారు. జనవరి 26న నిర్వహించిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గ్వాయిడోను గుర్తించాలని అభ్యర్థించడం గమనార్హం.

తిరుగుబాటు ద్వారా మదురోను బర్తరఫ్‌ చేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో ఒక ప్రకటనలో వెనిజులా సైన్యానికి విజ్ఞప్తి చేశారు. అధిపత్యాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దాలన్నదే అమెరికా కుటిలనీతి. లాటిన్‌ అమెరికా ఖండంలో కీలక దేశమైన వెనిజులాలో అమెరికా అంటించిన మంటలు సెగలు గక్కుతున్నాయి. అమెరికా, దాని మిత్రదేశాల మద్దతుతో దేశాధ్యక్షుడితో ఘర్షణకు దిగుతున్న ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్థిక సంక్షోభం పెరిగి తీవ్రమైన రాజకీయ, సామాజిక సంక్షోభానికి దారితీసింది. అమెరికా వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుతో చెలరేగిన తిరుగుబాటుదారులు హింసను తీవ్రతరం చేశారు. దీంతో దేశంలో మతుల సంఖ్య 26కి పెరిగింది.

వెనిజులాలో విపక్షాన్ని ప్రోత్సహించి ఉద్యమాలతో ఆ దేశంలో సామ్రాజ్యవాద దేశాలు అశాంతి సష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెనిజులా నిరసనలతో, సమ్మెలతో అట్టుడుకుతోంది. ప్రస్తుత దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఎలాగైనా గద్దె దించాలన్నది అమెరికా లక్ష్యం. దీనికి యూరప్‌ యూనియన్‌ (ఈయూ)లోని ప్రధాన దేశాలైన బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లు వత్తాసు పలుకుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జువాన్‌ గ్వాయిడో తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకోగా, ఆయన్ను గుర్తిస్తున్నట్టు ట్రంప్‌ ఆదరాబాదరాగా ప్రకటించారు. పైగా సైనిక దాడులకు దిగుతామని బెదిరిస్తున్నారు. అయితే ఈయూ దేశాలు మాత్రం ఎనిమిది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మదురోకు షరతు విధించాయి. అందుకు సిద్ధపడకపోతే గ్వాయిడోను తాము కూడా గుర్తిస్తామని హెచ్చరించాయి.

మరోవైపు వెనిజులాపై ఒత్తిడి తెచ్చేందుకు లిమా గ్రూప్‌లోని కొన్ని దేశాలతో ట్రంప్‌ స్వయంగా చర్చించాడు. లిమా గ్రూప్‌లో ఈక్వెడార్‌, పెరూ, కోస్టారికా, పరాగ్వే, వంటి దేశాలున్నాయి. ఈ లాటిన్‌ అమెరికా దేశాలతోపాటు కెనడా, ఇతర ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌ (ఒఎఎస్‌) దేశాలను కూడా డోనాల్డ్‌ ట్రంప్‌ రంగంలోకి దించారు. దీంతో ఈ దేశాలన్నీ వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు వ్యతిరేకంగా, తిరుగుబాటుకు అనుకూలంగా తమ ప్రకటనలు జారీ చేశారు. అసలు వేరే దేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పడానికి వీరెవరు? వెనిజులా ప్రజలు తమను ఎవరు పాలించాలో తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అక్కడ నియంతత్వం రాజ్యమేలుతోందా? అంటే అదేమీ లేదు.

తక్షణమే అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావాలని దొంకతిరుగుడు ప్రకటనలు చేశారు. నిజానికి మదురో ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే. ప్రశాంతంగా ఉన్న వెనిజులాపై చమురు రాజకీయాలను విస్తతం చేసింది అమెరికానే. అమెరికా ఆంక్షల కారణంగానే వెనిజులాలో పరిస్థితులు దారితప్పాయని స్వయంగా ʹ2018 నవంబర్‌ కాంగ్రెసనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ రిపోర్ట్‌ʹ వెల్లడించింది. అయితే అమెరికా ఎన్ని కుతంత్రాలు పన్నినప్పటికీ తాజా సంక్షోభంతో రష్యా, చైనా, క్యూబా, బోలీవియా, మెక్సికో, గుయానా, శాంటాలూసియా, టర్కీ తదితర దేశాలు మాత్రం వెనిజులాకు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఇండియా వంటి దేశాలు తటస్థ వైఖరిని అనుసరిస్తూ, వెనిజులాలో రాజకీయ సంక్షోభం ఆగాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పడాలంటున్నారు. అమెరికా చర్యలను ఖండించడానికి భారత్‌ ముందుకు రాకపోవడం గమనార్హం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో జరిగినట్టుగా ప్రపంచమంతా రెండు శిబిరాలుగా చీలినట్టయింది. మదురో ప్రభుత్వాన్ని కూలదోయాలని పిలుపు ఇచ్చిన అమెరికా వెనిజులాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ, దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నది. అవసరమైతే సైనిక జోక్యం కూడా చేసుకుంటామని ట్రంప్‌ ప్రకటించాడు. సైనిక జోక్యం చేసుకుంటే, మరింత సంక్షోభం తప్పదని రష్యా హెచ్చరించింది.

కొత్తగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందని యూరోపియన్‌ యూనియన్‌ కోరింది. ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షులు నికొలస్‌ మదురోను తొలగించడానికి వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, ఆ దేశంలో కల్లోలం సష్టిస్తున్నారు. వెనిజులా దేశ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని ధిక్కరిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నికొలస్‌ మదురో ప్రభుత్వాన్ని తొలగించి తన నియంత్రణలో వుండే ప్రభుత్వం ఏర్పాటుకు గడిచిన కొన్ని సంవత్సరాలుగా అమెరికా కుట్రలు సాగిస్తున్న విషయం తెల్సిందే. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ వెనిజులాలో తిరుగుబాటుదారులకు అండగావుంటామని హామీయిస్తూ బహిరంగ ప్రకటన చేసిన మరు క్షణమే అక్కడి తిరుగుబాటు నేత యువాన్‌ గ్వాయిడో నేతత్వంలోని కూటమి మదురో ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించింది.

2018 మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మదురో మరోమారు 60 శాతానికిపైగా ఓట్లతో ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీచేయని విపక్షం ఆయన విజయం అక్రమమని ప్రకటించింది. 2015 పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ప్రతిపక్షం మదురోను దించేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. మరొకపక్క అధ్యక్షుడికి, పార్లమెంట్‌కూ మధ్య తలెత్తిన వివాదంలో సుప్రీంకోర్టు పార్లమెంట్‌ అధికారాలన్నీ రద్దు చేసింది. అధికారాలు లేని ఈ పార్లమెంట్‌ మదురో ఎన్నికను గుర్తించబోనని జనవరి 11న తీర్మానం చేసి, యువాన్‌ గ్వాయిడోను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమని కొట్టిపారేసింది. మదురోకు వ్యతిరేకంగా జనవరి 23 నుంచి ప్రజలు ఉద్యమాలు చేయాలనీ, సైన్యం తిరుగుబాటు చేయాలనీ విపక్షాలు ప్రకటించడంతో దేశం ఇప్పుడు రాజుకుంది. ఈ పరిణామాలన్నింటి వెనుకా అమెరికా ఉన్నది.

అమెరికా ప్రాంతీయ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, దాని కార్పొరేట్‌ సంస్థలకు వీసమెత్తు చోటివ్వకుండా, చమురు క్షేత్రాలను జాతీయం చేసిన మదురోను దింపేయడానికి అమెరికా సంక్షోభాన్ని మరింత రాజేస్తున్నది. మదురో ప్రభుత్వం స్థానంలో ప్రతిపక్షాలు వస్తే అమెరికా పెత్తనం, దోపిడీ పెరగడం తప్ప తమకు ఒరిగేది లేదని వెనిజులా ప్రజలకు తెలియకపోదు.మదురో ప్రమాణస్వీకారం రోజున సైన్యాన్ని తిరుగుబాటు చేయవలసిందిగా బహిరంగంగానే అమెరికా పిలుపు నిచ్చింది. చమురు ఎగుమతులపై ఆధారపడిన వెనిజులాను పలు ఆంక్షలతో పీల్చిపిప్పిచేస్తున్న అమెరికా మదురో స్థానంలో ఎవరు వచ్చినా భారీ విరాళాలు, రుణాలు సమకూరుస్తానని ఆశచూపుతున్నది. దశాబ్దాం క్రితం నాటి ఆర్థిక సంక్షోభం వెనిజులాను మరింత తీవ్రంగా వెంటాడుతున్నది. వినిమయ వస్తువుల ధరలు పదిపన్నెండు రెట్లు పెరిగిపోయాయి. నిరుద్యోగం, ఆకలి, ఆకలిచావులు, భారీ వలసలతో జనజీవనం అస్తవ్యస్తమై మదురోపై ప్రజల్లో తీవ్ర అసంతప్తి ఏర్పడింది.

వెనిజులా ఒడిదుడుకుల్లో ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ ఒడిదుడుకులన్నీ అమెరికా ప్రాపకంతో సాగుతున్న దిగ్బంధం పర్యవసానంగా, చమురు ధరల కుంగుబాటు కారణంగా ఏర్పడ్డాయి. ఒబామా హయాంలో మొదలైన ఆంక్షలు ట్రంప్‌ వచ్చాక మరింత పెరిగాయి. వీటి విలువ దాదాపు 600 కోట్ల డాలర్లు. ఇవిగాక వెనిజులాకు దక్కాల్సిన చమురు సంస్థ లాభాలు 100 కోట్లను బదిలీ కాకుండా అమెరికా అడ్డగించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో వెనిజులాకు ఉన్న 120 కోట్ల డాలర్ల బంగారం నిల్వలు స్తంభింపజేసింది. దేశంలో నిత్యావసరాల కొరత, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం సరేసరి. అమెరికానే సష్టించి, పెంచుతున్న వెనిజులా సంక్షోభానికి మదురోను బాధ్యుడిగా చేసి, ఆయన తప్పుకోవాలనటం అమెరికా వక్రబుద్ధికి తార్కాణం. ప్రజామోదంతో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుణ్ణి బెదరించడం, సైనికచర్యకు దిగుతాననడం దురహంకారం తప్ప మరేం కాదు.

వెనిజులా ఆర్థిక సంక్షోభం తీవ్రమైన రాజకీయ, సామాజిక సంక్షోభానికి దారితీసింది. మహామాంద్యంలో (1929) ఉన్నప్పుడు అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలినప్పుడు (1990) రష్యా కూడా ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొలేదు. వెనిజులాలో దాదాపు ముప్ఫై లక్షల మంది తినడానికి తిండి లేక దేశం విడిచి వలసపోయారని అంచనా. దేశవ్యాప్తంగా భారీగా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. అయితే ప్రభుత్వ వైఫల్యం పట్ల ప్రజలు అసంతప్తిగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల మీద ప్రజలకు ఏమాత్రం సానుభూతి లేదు. ప్రతిపక్షాలన్ని కలిసి కూడా తగిన ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోతున్నాయి. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో, లాటిన్‌ అమెరికాలో భూమి పుత్రులు, వామపక్షశక్తులు అధికారాన్ని చేజిక్కించుకోవడం, అమెరికా ఆ ప్రాంత ప్రభుత్వాలను కూలదోయడం కథలుగా విన్నాం. ఇప్పటికీ అమెరికా ఇంకా అహంకారపూరిత వైఖరిని వదులుకోలేదు. లాటిన్‌ అమెరికా దేశాలను అస్థిరత్వం పాలు చేసి అక్కడి ప్రజలు బతకలేక వలసపోయే దుస్థితిని అనేక రూపాల్లో అమెరికా సష్టిస్తున్నది. వెనిజులా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలు పన్నుతున్నది. అమెరికా దురహంకారానికి ఇప్పటికే పలు దేశాలు బలయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ వ్యవస్థ దెబ్బతింటుంది. వెనిజులాలో నెత్తురు పారకుండా, అరాచకం తాండవించకుండా, అస్థిరత దాన్ని చుట్టుముట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ పౌరులందరిదీ. అంతర్జాతీయ సమాజం చొరవ చూపి చట్టబద్ధమైన పాలనలు సాగేవిధంగా, ఏ దేశంలోనూ బయటిశక్తులు జోక్యం చేసుకోకుండా కట్టడి చేసేలా ప్రయత్నాలు సాగించాలి.

- ఎ.నర్సింహ్మారెడ్డి, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు

Keywords : venezuela, trump, Nicolás Maduro
(2019-08-24 21:55:45)No. of visitors : 458

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


వెనుజులా